Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 32

Bhagavat Gita

2.32

యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి {2.52}

తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ

నీ బుద్ధి ఎప్పుడు మోహ కాలుష్యమును దాటివేయునో అప్పుడు నీవు వినవలసిన దానిని గూర్చియు, వినిన దానిని గూర్చియు వైరాగ్యమును పొందుదువు

శ్రుతివిప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా {2.53}

సమాధావచలా బుద్ధి స్తదా యోగ మవాప్న్యసి

శ్రవణాదులచే విచలితమైన నీ బుద్ధి సమాధియందు ఎప్పుడు స్థిరముగ నుండునో అప్పుడు యోగమును పొందగలవు

ఇక్కడ శ్రీకృష్ణుడు ఇంద్రియాలోలత్వము వలన కలిగే మోహమును దాటితే పొందే సమాధిని గూర్చి చెప్పుచున్నాడు. ఇంద్రియాలు ఎన్నటికీ శాశ్వత సుఖము ఇవ్వలేవు. కేథలిక్ యోగులు దాన్నే "పవిత్రమైన అలక్ష్యం" (holy indifference) అంటారు. అంటే అన్ని స్థితులలోనూ మనస్సుని నిశ్చలంగా ఉంచడం. మనస్సు నిశ్చలంగా ఉంటే సమాధికి చేరువ అవ్వచ్చు. 103

Eknath Gita Chapter 2 Section 31

Bhagavat Gita

2.31

కర్మజ౦ బుద్ధియుక్తా హి ఫలం త్వక్త్వా మనీషిణః {2.51}

జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛ న్త్వనామయమ్

సమత్వ బుద్ధి యుక్తులగు ఉత్తములు కర్మల నాచరించుచున్నను ఫలాపేక్ష లేనివారగుట చేత జన్మబంధము నుండి విడిపడినవారై దుఃఖ రహితమైన మోక్షపదమును పొందుదురు

ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరంచడం కర్మ యోగానికి మూలం. గాంధీకి ముందు ఎందరో స్వాతంత్ర్య యోధులు బరిలోకి దిగేరు. కానీ వారు స్వాతంత్ర్యం అప్పడి పరిస్థితులలో రావడం చాలా కష్టమని తలచేవారు. అంటే వారు ఆదిలోనే అంత్య ఫలానికై అర్రులు చాచేరు. మనం కూడా కొన్ని విషయాలలో చేయగలిగింది ఏమీ లేదని తలచి విధికి వదిలేస్తాం. కర్మయోగ రహస్య మేమిటంటే ఒక తప్పు దిశలో, ఇతరులచేత వాడబడి, మోసగింపబడి, భేద భావంతో చూడబడి ఉంటే దానిని మార్చడానికై చేతనైనంత పరిశ్రమ చెయ్యాలి. ఎందుకంటే అది మనకు, మనలను వాడుకునేవారికి కూడా అవమానకరం. నేను స్వతంత్రం రాక మునుపు క్రొత్తగా దేశానికి రక్షక భటులుగా వచ్చిన బ్రిటిష్ వారిని చూసేను. క్రొత్తలో వాళ్ళు సమంగా ఉండి ప్రజల సేవకై శ్రమించేవారు. రానురాను వాళ్ళు తామే అందరికన్నా ఉత్తములమని, దేశ ప్రజలకు నాగరికత అంటే ఏమిటో నేర్పించగల సామర్థ్య మున్నవారమని అహంకారంతో ప్రవర్తించేవారు. ఇది వ్యక్తిత్వ లోపం. ప్రతి వాడుకునే వాడు ఈ విధంగానే ఉంటాడు. మనకు తెలిసింది ఒక స్వార్థపరుడుకి అడుగు ఇస్తే, వాడు గజం అడుగుతాడు. అలాటప్పుడు వారికి వద్దు, లేదు అని చెప్పగలగాలి. ఇదే అహింస యొక్క మూలం: మనము వ్యక్తులను ప్రేమిస్తాము, గౌరవిస్తాము, కానీ వాడుకోనివ్వం. మనము స్వీయ జీవితంలో, దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా స్వార్థంతో ఎవరైనా వాడుకోబడుతే దానిని నిరసించాలి.

కర్మ యోగంలో ప్రతి వైఫల్యం మనలోని శక్తిని వెలుపకి తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మనమెటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. అంటే అపజయం గురించి భయపడం. అపజయం వలన నిరాశ, నిస్పృహ చెందక, అంతర్గత శక్తితో పరిస్థితులను చక్కబెడతాము. శ్రీకృష్ణుడు "నీకు వచ్చే అపజయాల వలన నిరుత్సాహ పడకు. అలా పదేపదే జరిగితే నీ చేతిలో ప్రతిఘటించడానికి ఆయుధాలు లేకపోతే, నేనే నీ రక్షణకు వస్తాను" అని అభయమిస్తున్నాడు. 102

Eknath Gita Chapter 2 Section 30

Bhagavat Gita

2.30

బుద్ధియుక్తో జహా తీహ ఉభౌ సుకృత దుష్కృతే {2.50}

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్

సమత్వ బుద్ధి కలిగిన పురుషుడు పాపపుణ్యములను రెంటిని ఈ లోకము నందే వదలు చున్నాడు. కనుక అట్టి యోగమునకు సిద్ధపడుము. కర్మల యందలి కుశలత్వమే యోగము

యోగమంటే కర్మలు చేయడంలో చాకచక్యం. మనమెప్పుడైతే కర్మ ఫలంతో విడిపడి, నడుం బిగించి లాభాన్ని, పేరుప్రతిష్ఠలను ఆశించకుండా పనిచేస్తామో, మనలోని అద్బుతమైన శక్తులు వెలుపలకి వస్తాయి. మన మనో దర్పణం నిర్మలంగా ఉండి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోము. స్వార్థం మన లక్ష్యాలను కనుమరుగు చేస్తుంది. ఎందుకంటే మనం ఫలాన్ని ఆపేక్షిస్తూ, కార్యం ఎటువంటి ఫలం ఇస్తుందా అని నిరీక్షిస్తూ, లక్ష్యాన్ని మరచిపోతాం. అలాగే మనకి ప్రతీదీ లక్ష్యాన్ని సాధించడానికి నిరోధకమని తలుస్తాము. చాలామార్లు తప్పులు చేస్తే మనకేమి చెయ్యాలో తోచదు. అలాటప్పుడు మనము అసంతృప్తితో ఉంటాము. మనం చేయగలిగింది ఏమీ లేదని, విధి వ్రాత అని వదిలేస్తాం. కానీ ఎంత క్లిష్టమైన పరిస్థితిలోనూ మనమేదో ఒక మంచి మార్గం ఎన్నిక చేసికోగలం. ఉదాహరణకి సాధారణ వ్యక్తులు ప్రపంచంలోని హింసాకాండను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా తమ నిరసన తెలపవచ్చు. ఈ రోజుల్లో అంతర్జాలంలో ప్రపంచ పరిస్థితిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. మనము మనకు నచ్చిన చర్చలో పాల్గొని, మన మనోభావాలను దక్షతతో ప్రకటించవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునునికి పదేపదే ఇస్తున్న బోధ: "కర్మ ఫలాన్ని ఆశించకు. నేను నీలో ప్రతిష్ఠితమై ఉన్నాను. సమయం ఆసన్నమయినప్పుడు నీక విజయాన్ని తప్పక ఇస్తాను". 101

Eknath Gita Chapter 2 Section 29

Bhagavat Gita

2.29

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ {2.49}

బుద్ధౌ శరణ మన్విచ్చ కృపణాః ఫల హేతవః

ధనంజయా బుద్ధియోగము కంటెను కామ్య కర్మలు నికృష్టములు గదా! కనుక నిష్కామకర్మమునే ఆశ్రయింపుము. ఫలమును గోరువారు దీనులు.

శ్రీకృష్ణుడు కర్మ ఫలము నాశించేవారు దీనులు అంటాడు. వాళ్ళకి మనశ్శాంతి లేక, ఆందోళనతో నిండి ఉంటారు. "నేను విజయం పొందుతానా? లేదా నాకు నిరాశ తప్పదా?" అని సందిగ్దంలో ఉంటారు. కొంత మంది తమ లక్ష్యాలను సాధించుకోడానికి తప్పు ద్రోవలు త్రొక్కుతారు. శ్రీకృష్ణుడు "మీరే కర్మ చేసినా, ఫలితాన్ని ఆశించ వద్దు. అది నా ధర్మం. నీవు మ౦చి మార్గాన్ని అనుసరించి, నిస్వార్థమైన లక్ష్యానికై నడుం బిగిస్తే, నీ కర్మ ఫలాన్ని ఇవ్వడం నా బాధ్యత" అని అర్జునునుద్దేశించి మనకు బోధిస్తున్నాడు.

ఫలాపేక్ష లేకుండా, నిస్వార్థంగా పనిచేస్తూ ఉండడం మిక్కిలి కష్టతరం. నేను నా ధ్యాన మందిరం ఎక్కడ స్థాపించాలా అని ఎంతో వ్యాకులత చెందేవాడిని. అప్రమేయంగా మంచి ఫలితాన్ని ఆశించి తిరిగేవాడిని. అప్పుడు నాకు తెలిసింది కర్మఫలాన్ని త్యజించి, సృష్టిలో ఏదీ నా సొత్తు కాదని ఎరిగి, నా వ్యాకులతను తగ్గించుకోవాలని. నేనీ రోజుల్లో క్రొత్త ధ్యాన మందిరం గురించి వెతుకుతే, అన్ని వసతులూ ఉన్నాయా లేదా అని మధన పడను. దేవుని మీద భారం వేసి నా ప్రయత్నం నేను చేస్తాను. భగవంతునికి మనకి ఏ సమయంలో, ఏ కర్మఫలాన్ని ఇవ్వాలో తెలుసు. ఈ విధంగా నిస్వార్థంగా పని చేస్తూ, ఫలితాలు భగవంతుని ఇచ్ఛ అనుకోవడమే పరిత్యజించడం. 101

Eknath Gita Chapter 2 Section 28

Bhagavat Gita

2.28

యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్త్వా ధనంజయ {2.48}

సిద్ద్య సిద్ద్ధ్యో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే

ధనంజయా బుద్ధియోగము కంటెను కామ్య కర్మలు నికృష్టములు గదా! కనుక నిష్కామకర్మమునే ఆశ్రయింపుము. ఫలమును గోరువారు దీనులు. ఀ

ఇక్కడ శ్రీకృష్ణుడు సమత్వం --అనగా ఎట్టి పరిస్థితులలోనూ దేహే౦ద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని నిశ్చలంగా ఉండడం -- గురించి చెప్తున్నాడు. యోగాభ్యాసం చేసేవారు తమ మిత్రుల యందు, తమను తూలనాడే వారి యందు, వారేమి చేసినా, సమ దృష్టి కలిగి యుంటారు. గాంధీ మహాత్ముడు సమత్వాన్ని పాటించి, తనపై నిందలు వేసినా, తనను అటకాయించినా, లేదా ప్రజలు తనను పొగిడి, అందలం ఎక్కించినా ఎప్పుడూ ఒకేలాగ ఉండేవారు. ఆయనను స్పూర్తిగా తీసికొని మనము ఎప్పటికీ ఆందోళన పడక, ఆత్మ జ్ఞానమును పొంది, పరిస్థితులు ప్రతికూలంగా ఉ౦టే నిరుత్సాహ పడక, లేదా పరిస్థితులు సానుకూలంగా ఉంటే మైమరచి ప్రవర్తించక ఉండాలి. యోగులకు ఒకరి ఆసరా అక్కరలేదు. ఎందుకంటే వారు స్వయంప్రతిపత్తితో బ్రతికేవారు.

శ్రీకృష్ణుడు యోగస్తః కురు కర్మాణి -- అనగా ముందు నాయందు మనస్సు లగ్నము చేసి, పరోపకారానికై నిస్వార్థమైన సేవ చెయ్యి--అని బోధిస్తున్నాడు. జయాపజయాల, లాభనష్టాల, మంచిచెడ్డల వలన ఒత్తిడి చెందకూడదు.

సంగం త్యక్త్వా -- అంటే ఒక కార్యం చేసిన తరువాత దాని ఫలితం గురించి విచారపడకూడదు. అంటే "కార్యం ఎప్పుడు సఫల మౌతుంది? నేను ఆశించిన ఫలితం లభిస్తుందా? లేదా అది రావడం ఆలస్యమవుతుందా?" అనే ప్రశ్నలతో సతమతమవ్వకూడదు. ఎందుకంటే మనకు ఫలితంతో సంబంధము లేదు. ఇదే 20 వ శతాబ్దపు కర్మ యోగి గాంధీజీ యొక్క రహస్యం. గీత వలన ప్రేరితులై, నిస్వార్థమైన కోరికతో, మంచి సాధనాలతో, ఫలితం గురించి ఆందోళన పడకు దేశ భవిష్యత్తుకై ఆయన పాటు పడ్డారు.

అలాగే శ్రీకృష్ణుడు సిద్ధ సిద్ద్యోః -- అనగా జయాపజయాలలో ఒకేలాగ ఉండడం-- అని ప్రవచిస్తున్నాడు. తాత్కాలికంగా మనం గెలిచినా, ఓడినా పొందేది ఏమిట? జయం కలిగినప్పుడు మైమరచి, అహంకారంతో "నేను గెలిచేను. నా శత్రువులను మట్టి కరిపిచ్చేను" అని మెలగవద్దు. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చేడని సంతోషించి నిర్లిప్తంగా ఉండడం ఉత్తమం. అపజయం కలిగినప్పుడు నిరాశ చెందక, అంతక ముందుకన్నా ఎక్కువ కష్టపడి, మంచి సాధనాలతో, ఉన్నతమైన లక్ష్యానికై పాటు పడాలి. సుఖదుఃఖాలలో, జయాపజయాలలో, పొగడ్తవిమర్శలలో సమంగా ఉండడమే యోగం. ఇదే ఆధ్యాత్మిక జీవనమంటే.

గీత మనల్ని నిస్వార్థమైన లక్ష్యాలను పెట్టుకోమని ప్రోద్భలం చేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పే సాధన -- నిత్యం ధ్యానం చెయ్యడం, మంత్రాన్ని జపించడం -- వలన మనము ఆయనయందు ప్రతిష్ఠితులమై, స్వార్థములేని కర్మలు చేస్తూ, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, చివరకి ప్రపంచానికి కూడా సేవ చెయ్యగలం. 99

Eknath Gita Chapter 2 Section 27

Bhagavat Gita

2.27

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన {2.47}

మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సంగో అస్త్వ కర్మణి

నీకు కర్మ చేయుట యందే అధికారము కలదు. కర్మ ఫలమునందు ఆశవద్దు. కర్మఫలమునకు నీవు కారణభూతుడవు గాకుము. అలాగని కర్మలను వదలుట యందు ఆసక్తి జూపకుము

మనకు అధికారము కర్మలు చేయుట యందే ఉన్నదికాని కర్మ ఫలము మీద లేదు అని చెప్పబడే ఈ శ్లోక తాత్పర్యము మనలో చాలామందికి తెలుసు. ఇంకోవిధంగా కర్మలు చేయడం ఇష్టం లేనివారు, పరిస్థితుల ప్రభావం వలన "లాభం ఏమిటి? ప్రతీదీ గంగలో కలిసిపోతోంది" అని అంటారు. శ్రీకృష్ణుడు మనకిలా బోధిస్తున్నాడు: మీ సంపూర్ణ హృదయం, మనస్సు లతో నిస్వార్థ సేవకై, మంచి మార్గంలో, శుద్ధమైన సాధనాలతో పనిచేస్తే నేను దాని బాధ్యత వహిస్తాను. కాబట్టి మన బుద్ధిని ఉపయోగించి, తప్పొప్పుల గురించి ఆలోచించి, తద్వారా ఒక ఉత్తమ లక్ష్యాన్ని ఎన్నుకొని, మన సామర్థ్యం దృష్టిలో పెట్టుకొని, మంచి సాధనాలతో కర్మ చెయ్యాలి. యోగులు చెప్పేది: చెడు సాధనాల వలన మంచి కార్యం జరుగదు; మంచి సాధానాల వలన కార్యం చెడదు. అందుకే గాంధీ "పూర్ణమైన ప్రయత్నం, పూర్ణమైన విజయం తెస్తుంది" అని అన్నారు.

గాంధీ కర్మ యోగం లేదా నిస్వార్థ సేవ, ఫలంతో సంబంధం లేకుండా, అపజయాలతో నిరాశ చెందకుండా, చేసేరు. ఆయన ఆఫ్రికా నుండి 1915 లో తిరిగి వచ్చినపుడు దేశం రెండు శతాబ్దాలు బానిసత్వంతో మగ్గుతోంది. దేవుని దయతో, తుపాకీ చేత బట్టకుండా, అహింసతో స్వాతంత్ర్యం తాను తెస్తాను అని చెప్పినపుడు ఎవరూ నమ్మలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడి వారితో సామరస్యంతో కలసిమెలసి ఉండి, వాళ్ళను నిద్రనుంచి తట్టి లేపి, మూడు దశాబ్దాలలో, దేశ చరిత్రతో పోలిస్తే అతి తక్కువ సమయంలో, దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణభూతులైనారు. ఎందుకంటే గాంధీ గారి అహింసా వాదం ప్రజలకీ, బ్రిటిష్ వారికీ నచ్చి, ఆయన చెప్పుచేతల్లో ఉన్నారు.

కానీ అది అంత సులభంగా రాలేదు. గాంధీ గురించి అనేక చెడు కథనాలు ప్రచారం చేయబడ్డాయి. ఆయన అనుచరులు, దురదృష్టవశాత్తూ, ఆయనపై ఎదురు తిరిగేవారు. ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ప్రజలు అతనిని తొలగి పొమ్మని నినాదాలు చేసేవారు. ఏది ఏమైనా గాంధీ "నేను అహింసా వాదిని. మీకు అది నచ్చక పోతే మీతో నాకు పనిలేదు" అని ఖచ్చితంగా చెప్పేవారు. ఆయన స్వాతంత్ర్య పోరాటం తనంతట తానే చెయ్యడానికి సిద్ధమయ్యేరు. ఆయనకు దేవుడు తనను విజయుడిని చేస్తాడని తెలుసు. ఎందుకంటే ఆయన మంచి సాధనాలు మంచి లక్ష్యానికై వాడుతున్నారు.

అలాగే శ్రీకృష్ణుడు చెప్పేది కర్మలు చేయకండని కాదు. మనము ఆధ్యాత్మిక చింతనలో పడి, ఒక పంజరంలో చిలకలా ఉండి, ప్రపంచంలోని సమస్యలు నిస్వార్థంతో పరిష్కరించడం మన వలన కాదని తలచకూడదు. మనమంతా సమాజానికి ఋణపడి ఉన్నాము. కాబట్టి సమాజాన్ని విడిచి, ప్రపంచ౦లోని సమస్యలను పట్టించుకోకుండా మనం ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లలేము. గీత కర్మ చెయ్యమని ప్రోద్భలం చేస్తుంది. ఆ కర్మ మంచి సాధనాలతో, ఉన్నతమైన లక్ష్యానికై చెయ్యాలి. 98

Eknath Gita Chapter 2 Section 26

Bhagavat Gita

2.26

యావానర్థ ఉ దపానే సర్వత స్స౦ప్లుతోదకే {2.46}

తావాన్ సర్వేషు బ్రాహ్మణస్య విజానతః

అంతటను నిండియున్న నీరు౦డగా జలాశయమునందు నీటి విషయమై ఎంత ప్రయోజనము కలదో బ్రహ్మ జ్ఞాని యగు బ్రాహ్మణునకు వేదములయందు అంతియే ప్రయోజనము కలదు

నైఋత పవనాలు వచ్చేయంటే ఎండాకాలం పోతున్నాదనే సూచన వచ్చినట్లే. వానలు కురిసి బావులు, చెరువులు, నదులు నిండుగా ఉంటాయి. కానీ మళ్ళీ ఎండాకాలం వచ్చి గడ్డు రోజులు తెస్తుంది. నూతుల్లో, చేరువుల్లో, నదులలో నీరు కరవై ప్రజలకు నీటి ఎద్దడి కలుగుతుంది. కొన్ని గ్రామాల్లో బహు దూరం నుంచి బిందెలతో నీరుని ఇంటికి తెచ్చుకుంటారు. ఎక్కడైతే కొళాయిలు వుంటాయో, అక్కడ నీటి సరఫరా రోజుకు ఒక గంటో, రెండు గంటలో ఉంటుంది.

అలాగే ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహము మనలో నిరంతరమూ లేకపోతే, బిందెలతో బయటినుంచి తెచ్చుకోవాలి. ధ్యానం చేసే ముందు బిందెలు ఖాళీగా ఉంటాయి. ధ్యానం అయిన తరువాత అవి నిండుతాయి. మరుసటి రోజు బిందె మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ఈ చక్రం అలా నడుస్తూ ఉంటుంది. కానీ మనలో దేవుడున్నాడనే వెల్లువ కలిగితే ఇక బిందెలతో పనిలేదు. భగవంతుని ప్రేమ సాగరంలో మునిగిపోయి ఉంటే ఇక బావుల, సరస్సుల అవసరం లేదు. అటువంటప్పుడు మన ధ్యానం చెయ్యనక్కరలేదు. స్మృతుల అవసరం లేదు. మన అచేతన మనస్సులో మంత్రం నిరంతరము జపింపబడి, మన చేతన మనస్సుకు పని లేదు. ఇది ఒక ఊహ. దీనిని అనుభవించగలిగితే మనము ధన్యులము. అంతవరకు మనము ధ్యానం చేసి, మంత్ర జపం చేసి, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని, పరోపకారానికై బ్రతుకుదా౦. 96

Viveka Sloka 50-51 Tel Eng

Telugu English All శిష్య ఉవాచ:- ప్రశ్న నిరూపణము కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా । యదుత్తరమహం శ్రుత్వా కృతా...