Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 37

Bhagavat Gita

2.37

యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః {2.58}

ఇంద్రియా ణీ౦ద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

తాబేలు తన అవయవములను ముడుచు కొనునట్లు, పురుషుడు ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి నివర్తింప జేయునో అపుడు అతని జ్ఞానము స్థిరముగ నుండును.

నా చిన్నప్పుడు పిల్లలు ఒక తాబేలును చూస్తే దానిని వెదురు కర్రలతో అటూ ఇటూ కదిలించేవారు. అప్పుడు తాబేలు తన చిప్పలోకి కాళ్ళను, ముఖాన్ని లాగుకొని, వాళ్ళ బారినుండి తప్పించుకునేది. అలాగే మన ఇంద్రియాలను అపాయకరమైన పరిస్థితిలో అంతర్గతం చేయగలిగితే మనం స్వతంత్రుల మవుతాము. శ్రీకృష్ణుడు అర్జునుని ఉద్దేశించి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత -- అనగా నిశ్చలంగా ఉండి, తమ ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని, దేవుని యందు మనస్సు నిలపగల్గువారు -- అని అంటాడు

నేటి ప్రసార మాధ్యమాలు మన ఇంద్రియాలను తమ ప్రకటనలతో ప్రేరేపిస్తారు. మనం ధ్యానంలో కొంత పండితే తెలిసేది, అవి మనల్ని ఎలాగ చెరబట్టేయో. "ఇంద్రియాలను సంతృప్తి పరచి, అమితమైన ఆనందాన్ని పొందండి" అనేది వారి నినాదం. ఆల్డస్ హక్స్లీ ప్రకటన కర్తలు, దేవుని దూతలలాగా ఉన్నారు అని చెప్పిరి.

నేడు సినిమాలు, టివి, పత్రికలు శృంగార మయమై ఉన్నాయి. నేటి తరాన్ని దుష్టమైనదని చెప్పడం వృధా. ఎందుకంటే మనం ప్రసార మాధ్యమాల చేతుల్లో కీలు బొమ్మలం. నేటి ప్రకటనలలో శృంగారాన్ని అదే పనిగా వాడుతున్నారు. మనం శృంగారం గురించి తరచు ఆలోచిస్తే అదే కారణం. మనల్ని అవి మభ్యపెట్టకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం: గీత చెప్పినట్లు ఇంద్రియాలను వెనక్కి తీసికోవడం. శృంగారాన్ని అతిగా చూపించే సినిమాలను చూడనక్కరలేదు. వాటివలన గత స్మృతులు వెలుపలికి వచ్చి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అలాగని సినిమాలు చూడడం మానేయమని నేను చెప్పటం లేదు. సినిమాలో ఎవరైనా తమ దుస్తులు తీసేస్తూ ఉంటారో, అప్పుడు నేను కళ్ళు మూసుకొని మంత్ర జపం చేసుకొంటాను. అటువంటి సినిమాలు దుష్టమైనవని చెప్పలేము. అవి దుస్తులు తీసివేస్తే గానీ మన సౌందర్యాన్ని చూపలేమనే వెర్రి ఆలోచనలతో చేయబడినవి.

అలాగే పుస్తకాలు కొనేటప్పుడు కొంత వివేకము ఉపయోగించాలి. లక్షల మంది చదివే పత్రికలు వారిని ఉద్రేక పరచి, విచారాన్ని కలిగిస్తాయి. మనకు జ్ఞానాన్ని, ఆత్మ గౌరవాన్ని వృద్ధి చేసే పుస్తకాలనే కొనాలని నేను భావిస్తాను.

మన ఇంద్రియాలను వెనక్కులాక్కోవాలంటే వాటికి తర్ఫీదు ఇవ్వాలి. కానీ మన౦ సంకోచిస్తే లేదా ఆందోళన చెందుతే అది కష్టం. మనకు ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వగలమనే గట్టి విశ్వాసముండాలి.

మనం బజారకు వెళ్తే మన కళ్ళు అన్ని దిక్కులా పోతాయి. కొందరు ఏమీ కొనే ఉద్దేశం లేకపోయినా బజారుకు వెళ్తారు. మరికొందరు అవసరమున్నా లేకపోయినా అనేక వస్తువులు కొంటారు. వారి ఉద్దేశంలో అవి భద్రత నిస్తాయని. ఒకరికి బహుమానంగా వస్తువులు ఇవ్వడం వలన మన బాంధవ్యం గట్టిపడుతుంది అనుకోవడం వృధా ప్రయాస. మన చెవులు చెడ్డ మాటలను, ముఖ్యంగా వ్యర్థ ప్రసంగం, వినకుండా చేసికోవాలి. అలా చేస్తే కొన్నాళ్ళకు మనం అప్రయత్నంగా మన చెవులను అక్కరలేని సంభాషణలను వినకుండా చేసికోవచ్చు. ఒకవేళ దూషణలు, పనికిరాని ప్రసంగం, ప్రక్కన జరుగుతూ ఉంటే నేను చెప్పేది అక్కడి నుంచి వెళ్లిపొమ్మని. వీలయితే ఎవరినైతే దూషిస్తున్నారో వారి గురించి ఒక మంచి మాట చెప్పవచ్చు.

ఈ శ్లోకం పూర్తిగా అర్థం చేసికోవాలంటే ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందితే మానవాళి ఎలా ప్రభావితమవుతుందో తెలిసికోవాలి. నేను సాధారణంగా నేటి శాస్త్రాలను నమ్ముతాను. సాంకేతిక ప్రగతి వలన మన జీవితాలు సుఖమయమయ్యేయని చెప్పడానికి సంకోచించను. కానీ దాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్పత్తి గురించై వస్తువులను తయారు చేసి, వాటి వలన దైనింద జీవితంలో ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించక ఉండడం వలన, పర్యావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనము ఈ విషయం గూర్చి తీవ్రంగా ఆలోచించాలి.

మనలో చాలామందికి వాహనాల ప్రభావం పర్యావరణం మీద ఎలా ఉంటుందో తెలుసు. మనం కొన్ని సులభమైన పద్దతులను అవలింబించి ఆ సమస్యను పరిష్కరించుకోగలం. ఒకప్పుడు ఇంటి దగ్గర నేను జనసంచారం లేని కొలను చుట్టూ నడిచే వాడిని. వాహనాల సౌలభ్యంతో ఇప్పుడు అనేకమంది పెద్దా చిన్నలు ఆ కొలను దగ్గరికి వస్తున్నారు. ఇక రెండో విషయంకొస్తే మన౦ వాహన౦తో పనికి వెళ్తే, వాహనంలో ఖాళీ ఉంటే, సహ ఉద్యోగులను ఎక్కించుకొని వెళ్ళవచ్చు. దీనినే కార్ పూల్ (car pool) అంటారు. దీనివలన మొదట్లో కొంత ఇబ్బంది కలిగినా --అంటే కొందరు సమయానికి తయారుగా ఉండక--రాను రాను దాని వలన మనకి కాలుష్యాన్ని తగ్గిస్తున్నామన్న సద్భావన కలుగుతుంది. మూడవది, మనకు అక్కరలేని ప్రదేశాలకు ప్రయాణం చెయ్యనక్కరలేదు. ప్రపంచాన్ని చుట్టేస్తేగాని ఆనందం లేదనుకోవడం మూర్ఖత్వం.

మన ఇంట్లో కుర్చీలు, బల్లలు పేర్చుకోవడంలో కూడా మనం చాకచక్యం చూపించాలి. నా చిన్నప్పటి ఊరులో ధనవంతులు కూడా చాలా మితంగా తమ ధనాన్ని కుర్చీలు, బల్లలకై వెచ్చించేవారు. అక్కడ ఎక్కువగా టీకు చెక్క వాడేవారు. ఎందుకంటే అక్కడ టీకు చెట్లు అధికంగా ఉండి, వాటి ధర ఎక్కువ ఉండేది కాదు. ప్రతి గదీ ఆడంబరముగా కాకుండా, అందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మన౦ అనేక విషయాల్లో నిరాడంబరముగా ఉండి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డు వచ్చే వస్తువులను అతి తక్కువగా పోగుచేసికొని జీవితాన్ని సుఖమయం చేసికోవచ్చు.

అలాగే దుస్తులు కూడా. కొందరు అతి తక్కువ దుస్తులను సేకరించి, వాటితో అందంగా మనకి కనిపిస్తారు. కొందరికి ఎక్కి తొక్కి అనేక దుస్తులు ఉన్నా, వాటితో తమ సహజ సౌందర్యాన్ని పాడుచేసికొంటారు. భూమిమీద మనకున్న సహజ వనరులు పరిమితమైనవి. అందువలన వాటిని వివేకంతో వాడుకోవాలి. ఉత్పత్తులు పెంచడం వలన, వినియోగదారులు ఎక్కువ అవ్వడం వలన పర్యావరణ విషయంలో నేడు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. మనము వస్తువులను మితంగా వాడితే, ఉత్పత్తి దారులు ఎక్కువ ఉత్పత్తి చేయరు; చేసినా అమ్ముకోలేరు.

ధ్యానం చేస్తూ, ఆధ్యాత్మిక జీవనం చేస్తూ, మనమీ అత్యవసర పరిస్థితిని పోగొట్టవచ్చు. శ్రీకృష్ణుడు "నేనే మీకందరికీ ఆనందం, ప్రేమ, సౌందర్యం, జ్ఞానం ఇచ్చే వాడిని. మీకు బాహ్య ప్రపంచ వస్తువులు కుటుంబానికి అవసరమైనంత మితంగా ఉంటే చాలు. ఎక్కువ ఉంటే లేనివారికి ఇవ్వండి" అంటున్నాడు. 118

Eknath Gita Chapter 2 Section 36

Bhagavat Gita

2.36

య స్సర్వత్రానభిస్నే హస్తత్త త్ప్రాస్య శుభాశుభమ్ {2.57}

నాభినందతి స ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

ఎవడు సమస్త విషయము లందును అభిమానము లేనివాడై, తత్స౦బంధమైన మంచి చెడులు కలిగినపుడు సుఖ దుఃఖముల నొందక యుండునో అట్టివాని బుద్ధి స్థిరమైనది

యోగులు మన అహంకారం, మనమే ముఖ్యులమనే భావన వలన నిరాశ, నిస్పృహ, విచారము పొందుతామని చెప్తారు. మనం అహంకారంతో ఉన్నంత కాలం స్వంతంత్రులమని తప్పుగా భావిస్తాం. ధ్యానం ద్వారా ప్రతి చిన్న బాంధవ్య౦లోనూ మన అహంకారం అచేతనంగా, అప్రయత్నంగా ప్రభావితం చేస్తున్నాదనే జ్ఞానం పొందుతాము.

మనను 5 ఏళ్ల లోపు పిల్లలను దేవుళ్ళుగా చూడమంటారు. అంటే వాళ్ళకి లొంగి ఉండమని కాదు. వారిని హత్తుకొని, ముద్దులిచ్చి, బుజ్జగించి, లాలించి పెంచమని. ఈ విధంగా చేస్తే వారికి మానసికంగా మరియు భౌతికంగా మనతో బంధం ఏర్పడి, అది పెద్దయ్యేవరకూ కొనసాగుతుంది.

మనము మన పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. ధూమ పానం మొదలగు చెడు అలవాట్లను వీడకపోతే పిల్లలు ఎదిగి అలాగే చేస్తారు. జీసస్ "నీవు మళ్ళీ చిన్న పిల్ల వాడిగా మారకపోతే, స్వర్గాన్ని చేరలేవు" అన్నారు. వర్డ్స్ వర్త్ అనే కవి "స్వర్గం బాల్యం లో గడిపేది" అని అన్నారు.

ఇకపోతే 5 నుంచి 16 ఏళ్ల వరకు పిల్లలను సేవకులుగా చూడాలంటారు. అది కొంచం కఠినమనిపించవచ్చు. కానీ నమ్రత, వినయం వంటి మంచి గుణాలు అలా చేస్తేనే వారిలో వస్తాయి. మానసిక శాస్త్రవేత్తలు పిల్లల మంచికై తలిదండ్రులు నిర్ణయం తీసికోలేకపోతే అది వారిని ఆశ్చర్యపరుస్తుందని చెప్తారు. ఈ వయస్సు పిల్లలు నిరసనతో తలుపులు బాదినా, బుద్ధితో సున్నితంగా హెచ్చరించే తలిదండ్రులను గౌరవిస్తారు. వారు తలిదండ్రులకు విధేయతతో ఉండకపోతే పెద్దయ్యేక ఆత్మకు కూడా విధేయులై ఉండరు. తలిదండ్రులు వారికి ఆత్మల వలె పనిచెయ్యాలి. అందుకే ధ్యానం చేసేవారిలో తలిదండ్రులకు ఎక్కువ విలువ.

పిల్లలు 16 ఏళ్లు దాటితే వాళ్ళని మనతో సమానంగా చూసుకోవాలి. వారిని శిక్షించక, వారికి వివరణ ఇవ్వగలగాలి. వారి బుద్ధిని పెంచే విధంగా ప్రవర్తించాలి. మన దృక్పథాన్ని వారికి వివరించి, వారి మనోభావాలను తెలిసికోవాలి. ఎందుకంటే తలిదండ్రులు, పిల్లలు తమ మనో భావాలతో విడిబడక ఉంటే వారి మధ్య బేధాభిప్రాయాలు కలుగుతాయి.

మనను వ్యతిరేకించే ఇతరుల మనోభావాలను గౌరవంతో ఆలకిస్తే, ఎప్పుడో ఒకప్పుడు మన ప్రత్యర్థిగురించి సదభిప్రాయం కలుగుతుంది. మన తలిదండ్రులను ఖండించకుండా, వారు చెప్పేది ఒప్పని చెప్పగలిగితే మనలోని జంకు, భయం తగ్గుతాయి. తిరిగి వాళ్ళు మనతో ఏకీభవించి మన అభిప్రాయాన్ని లేదా నిర్ణయాన్ని అంగీకరించవచ్చు. దీని వలన తలిదండ్రుల, పిల్లల మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా ఉంటుంది. "నేను తప్పు పడ్డాను" అని చెప్పగలిగే నమ్రత ధ్యానం వలన పొందవచ్చు. "నాకు తెలీదు" అని ధైర్యంగా చెప్పగలిగితే జీవితంలో చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. 114

Eknath Gita Chapter 2 Section 35

Bhagavat Gita

2.35

దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః {2.56}

వీతరాగభయక్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే

దుఃఖముల యందు కలత చెందని వాడును, సుఖముల యందు ఆశలేని వాడును, అనురాగము, భయము, క్రోధములను త్యజించిన వాడును స్థిరమైన జ్ఞానము కలవాడని చెప్పబడును

గీత చెప్పేది జీవితం ద్వంద్వాలతో -- అనగా సుఖ-దుఃఖాలు, జయాపజయాలు, జనన-మరణాలు మొదలైనవి--కూడినది. నేను చిన్నప్పుడు ఎల్లప్పుడూ సుఖపడ వచ్చుననే భావంతో ఉండేవాడిని. పెరిగి పెద్దవ్వుతుంటే తెలిసింది సుఖంతో పాటుగా దుఃఖం కలసి వస్తుందని. మనకి దుఃఖం రాకూడదనుకొంటే, సుఖాలని మర్చిపోవాలి.

పై విధంగా గీత చెప్పే బోధ కొంత నిరాశ కలిగించవచ్చు. మన బుద్ధిని ఉపయోగి౦చి ఇంద్రియాలు ఇచ్చే సుఖ-దుఃఖాలను ఎన్నిక చేసుకోవచ్చునని అనుకోవచ్చు. నిజానికి ఇక్కడ ఎన్నిక లేదు. మనం సుఖ-దుఃఖాలు రెండింటినీ దాటితే శాశ్వతమైన, క్షోభలేని, భద్రమైన, మిక్కిలి ఆహ్లాదకరమైన స్థితిని పొందవచ్చు. దీన్నే గాంధీ రామ రాజ్యం అనే వారు. మనము నిజంగా దానిలో నివసించకూడదు. ఎందుకంటే అక్కడ అన్నీ సుఖాలే.

శ్రీకృష్ణుడు నీవు స్థితధి కాలేవా అని అడుగుతున్నాడు. అనగా జీవితం మననొక ఆట బొమ్మలాగ క్రిందకీ, మీదకీ, దుఃఖానికీ, సుఖానికీ త్రిప్పుతున్నది. అలాగే పరుల మెప్పుకై ఆశపడి, విమర్శలు వస్తాయేమోనని భయపడి, ఇతరులను మభ్య పెడుతూ, దయ చూపిన వారియందు నిర్దాక్షిణ్యంగా ఉండడం కూడా చెయ్యకూడదు.

గీత మనకు బోధించేది -- మనము సుఖంగా ఉండాలంటే ఇతరుల సుఖానికై శ్రమ పడాలి. అలాగే మనం దుఃఖంలో కూరుకుపోవడం ఇతరులను దుఃఖితులను చెయ్యడం వలననే. అంతేకానీ దేవుని, విధి వ్రాతని దూషించకూడదు.

మనము చాలా కాలంగా కోర్కెలు, అవసరాలు, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఓర్పుతో ఇతరులకై మన లాభాన్ని, సంతోషాన్ని పంచి పెట్టాలి. ఇది బుద్ధితో చేసే పనికాదు. పట్టుదలతో కూడినది.

నేను ఎదుగుతున్నవారి యందు, వారు ముక్కుతూ మూలుగుతూ ఉన్నా, ఎక్కువ జాలి చూపను. ఎందుకంటే వారు తమ కాళ్ళ మీద నిలబడితేనే నాకు మిక్కిలి ఆనందం. కన్నీళ్ళు, కష్టాలు ఎదుగుతున్నప్పుడు అందరికీ కలిగేవి. శ్రీకృష్ణుడు దుఃఖం వస్తే దాన్ని ఆసరాగా తీసికొని మనం ఎదగాలి అని బోధిస్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలి. దుఃఖం ఒక నియంత వలె నుండి మనకు కఠినంగా పాఠాలను నేర్పుతుంది. లేకపోతే మనం జీవితంలో ఏమీ నేర్చుకోలేము. మనం బాధలలో ఉన్నప్పుడు: "భగవంతుడు నన్ను ఆధ్యాత్మిక జీవితం గడపమంటే, నేను సదా అతని దయ, కరుణ ఉంటాయనుకొన్నాను. కానీ ఇప్పుడు నాకు దుఃఖం, ఏడుపు కలిగిస్తున్నాడు. ఒక భక్తుని చూచే విధమిది కాదు" అని అనుకోవచ్చు. దేవునికి మన మీద అమితమైన ప్రేమ ఉంది. ఆయనకు కృత్రిమమైన జాలి లేదు. దేవుడు మనల్ని స్వార్థం నుంచి, వేర్పాటునుంచి బయటకు వచ్చి తనతో తాదాత్మ్యము చెందమంటాడు. అందుకై ఆయనకు తెలిసి దుఃఖం ఒక్కటే మనము అర్థం చేసికొనే భాష. 111

Eknath Gita Chapter 2 Section 34

Bhagavat Gita

2.34

శ్రీ భగవానువాచ:

{2.55}
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే

పార్థా! మనస్సులో చెలరేగే కరికల నన్నిటిని త్యజించి ఆత్మయందే ఆత్మచేత సంతృప్తిని పొందుచుండునో వానిని స్థితప్రజ్ఞుడు అందురు

ఎవరు తమ స్వార్థపూరిత కోర్కెలను విడనాడేరో వారిని స్థితప్రజ్ఞులని చెప్పడం జరిగింది. ఇంకా కామాన్ని -- అనగా ఇంద్రియాలు స్వాధీనంలో లేక అవి చెప్పినట్టు నడవడం--జయించేవారని ఇక్కడ చెప్పబడుచున్నది.

జీసస్, బుద్ధ, శ్రీరామకృష్ణ లేదా శ్రీరమణ మహర్షి లాగ కామం లేనివారు మనలో అతి తక్కువమంది. శ్రీ రమణ మహర్షి స్వార్థమనగా అహంకారం అని చెప్తారు. అలాగే స్వార్థ పూరిత ఆలోచనల సముదాయం మనస్సు. సెయింట్ పాల్ "నేను కాదు, నేను కాదు, క్రైస్ట్ నాలో ప్రతిష్ఠుతుడై ఉన్నాడు" అని చెప్పిరి. ఎప్పుడైతే మన అహంకారం తొలగింపబడిందో, మనం పరిశుద్ధుల మౌతాము.

ఎప్పుడు మన లాభం, ఆనందం, ప్రతిష్ఠ ఇతరులకు ఉపయోగపడుతుందో అప్పుడు నేను, నాది అనే భావన తగ్గుతుంది. అదే మన స్వార్థానికై , ముఖ్యంగా సహధర్మచారిణి తో --మన హక్కులను కాపాడుకునే ఉద్దేశంతో కావచ్చు --కలహాలు పెట్టుకుంటే, ఒక గోడ కట్టుకున్నట్టు, మనము వారినుండి వేరుగా బ్రతుకుతాం. ముఖ్యంగా క్రొత్తగా వివాహం చేసికొన్నవారు తమ హక్కులకై లేదా ఇష్టాయిష్టాలకై ఇంకా పెద్దపెద్ద గోడలు కట్టుకుంటారు. వారు తమ హక్కులగురించి కాక బాధ్యతల గురించి ఆలోచిస్తే బంధం గట్టిపడుతుంది.

మిల్టన్ అనే మహా కవి తన అంధత్వం గురించి ఇలా వ్రాసేరు:

దేవుడికి మన కర్మగానీ, బహుమతులు గానీ అక్కరలేదు. ఎవరైతే దేవుడితో అనుసంధానమౌతారో, వారు దేవుని నిజంగా సేవిస్తున్నారు. దేవుని రాజ్యంలో అట్టి వారు రాజులు. అనుచరులు భూమి మీద లేదా సముద్రం మీద ఉన్నా రాజు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తారు. కానీ వీరు ఎవరైతే సహనంతో ఉంటారో వారిని సేవిస్తారు.

పరిస్థితులు స్వాధీనంలో లేనప్పుడు సహజంగా మనకు ఆందోళన కలుగుతుంది. మనం ఎంత మంచికై ప్రయత్నించినప్పటికీ, నిర్దయతో కూడిన వాక్కు లేదా కర్మ మన నుండి ఉత్పన్న మవుతుందనే భయం కలుగవచ్చు. అలాటప్పుడు మనం మిక్కిలి సహనంతో కూడి దృఢంగా ఉండాలి. ఇదే స్థితప్రజ్ఞత. మనల్ని ఎదిరించి, ద్వేషించి, తూలనాడిన వ్యక్తులపై పగ తీర్చుకోవాలనే భావంతో ఉండక నిశ్చలంగా, స్థిరంగా, భద్రతో కూడి ఉండడం కూడా స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞులైనవారు పగవారిని క్షమించి, వారి సమస్యలను పరిష్కరించే మార్గాన్ని వెదకుతారు. దానివలన ఎవరితోనూ ఎడ౦గా ఉండలేరు.

ఒకరికి లొంగి ఉండడం ఓటమి లేదా బలహీనత కాదు. అది మన౦ ఇతరులను దబాయించకుండా, అహంకారంతో హక్కులను సమర్థించుకోకుండా చేస్తుంది. ఇంకా మనల్ని శత్రువులుగా తలచి హేళన లేదా అటకాయించే వారియందు కూడా దయతో ఉండేటట్టు చేస్తుంది. నా దృష్టిలో క్షమాగుణం లేని వారు జీవితాన్ని సుఖమయం చేసుకోలేరు. జీవితం సుఖంగా గడపాలంటే సొమ్ము ఒకటే కాదు; మనలో ద్వేషించే వారిని క్షమించే గుణం కావాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి క్షమా గుణం లేని వారు జీవితంలో ఆనందంగా ఉండే శక్తిని కోల్పోయేరని అన్నారు.

మనం గాఢమైన దైవ భక్తిని గలవారిని గుర్తించగలం. ఎందుకంటే కామంతో ప్రవర్తించే వ్యక్తులతో పోలిక పెడితే వారు నిస్వార్థమైన దైవ చింతనలో ఉంటారు. సంసారమంటే అహంకారం, భౌతికపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడడం. అది నిశ్చలంగా లేక, మనల్ని అతలాకుతలం చేస్తుంది. మనకి పునర్జన్మ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, ఇదే జననమరణ చక్రము.

మనకు తీవ్రమైన కామం ఇంద్రియాలవలన కలిగినప్పుడు, మనస్సు, కోరికలు సహజంగా మార్పు చెందుతాయని గుర్తు పెట్టుకోవాలి. అలాగే కామాన్ని నియంత్రిస్తే మనము స్వతంత్రులమౌతాము. 108

Eknath Gita Chapter 2 Section 33

Bhagavat Gita

2.33

అర్జున ఉవాచ:

{2.54}
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్

కేశవా! సమాధియందున్న స్థితప్రజ్ఞునకు లక్షణమేమి? అతడెట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు సంచరించును?

గాంధీ గీత అంతర్మధనం గురి౦చి చెప్తుందనేవారు. స్వార్థం-నిస్వార్థం, మంచి-చెడు మొదలగు ద్వంద్వాలు మనకనుభవమే. మన మనస్సులో అవి రేపే ధుమారాలు మనను పరిష్కారానికై ప్రేరేపిస్తాయి. అలాగే ఇంద్రియాలు మనల్ని అన్ని దిక్కుల వెళ్ళమంటాయి. ధ్యానంవలన, ఆధ్యాత్మిక చింతన వలన మాత్రమే వాటిని స్వాధీనంలో పెట్టుకోగలం.

అర్జునుడు అడుగుతున్నది: స్థితప్రజ్ఞుడు -- అనగా స్వయంప్రతిపత్తిలో స్థిరంగా ఉన్నవాడు--ఎలాంటి వ్యక్తి? అట్టివాడు సమాధి ఎలా పొందుతాడు, దేవునితో ఎలా ఐక్యం అవుతాడు? అతడు బాహ్య చేష్టలు --కూర్చోవడం, మాట్లాడడం మొదలైనవి-- ఎలా ఉంటాయి?

ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుని వేదాలు లేదా పురాణాలు చదవమని చెప్పవచ్చు. కానీ గీత వాటి సారం అనబడేదిగా ఎందుకు వుందంటే రాబోయే శ్లోకాల్లో శ్రీకృష్ణుడు అర్జునుని సందేహాలు -- అనగా మనికి కూడా కలిగేవి--18 శ్లోకాల్లో నివృత్తి చేస్తాడు. ఇంత నిక్షిప్తంగా మరెవ్వరూ చెప్పలేదు, చెప్పబోరు. 105

Eknath Gita Chapter 2 Section 32

Bhagavat Gita

2.32

యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి {2.52}

తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ

నీ బుద్ధి ఎప్పుడు మోహ కాలుష్యమును దాటివేయునో అప్పుడు నీవు వినవలసిన దానిని గూర్చియు, వినిన దానిని గూర్చియు వైరాగ్యమును పొందుదువు

శ్రుతివిప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా {2.53}

సమాధావచలా బుద్ధి స్తదా యోగ మవాప్న్యసి

శ్రవణాదులచే విచలితమైన నీ బుద్ధి సమాధియందు ఎప్పుడు స్థిరముగ నుండునో అప్పుడు యోగమును పొందగలవు

ఇక్కడ శ్రీకృష్ణుడు ఇంద్రియాలోలత్వము వలన కలిగే మోహమును దాటితే పొందే సమాధిని గూర్చి చెప్పుచున్నాడు. ఇంద్రియాలు ఎన్నటికీ శాశ్వత సుఖము ఇవ్వలేవు. కేథలిక్ యోగులు దాన్నే "పవిత్రమైన అలక్ష్యం" (holy indifference) అంటారు. అంటే అన్ని స్థితులలోనూ మనస్సుని నిశ్చలంగా ఉంచడం. మనస్సు నిశ్చలంగా ఉంటే సమాధికి చేరువ అవ్వచ్చు. 103

Eknath Gita Chapter 2 Section 31

Bhagavat Gita

2.31

కర్మజ౦ బుద్ధియుక్తా హి ఫలం త్వక్త్వా మనీషిణః {2.51}

జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛ న్త్వనామయమ్

సమత్వ బుద్ధి యుక్తులగు ఉత్తములు కర్మల నాచరించుచున్నను ఫలాపేక్ష లేనివారగుట చేత జన్మబంధము నుండి విడిపడినవారై దుఃఖ రహితమైన మోక్షపదమును పొందుదురు

ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరంచడం కర్మ యోగానికి మూలం. గాంధీకి ముందు ఎందరో స్వాతంత్ర్య యోధులు బరిలోకి దిగేరు. కానీ వారు స్వాతంత్ర్యం అప్పడి పరిస్థితులలో రావడం చాలా కష్టమని తలచేవారు. అంటే వారు ఆదిలోనే అంత్య ఫలానికై అర్రులు చాచేరు. మనం కూడా కొన్ని విషయాలలో చేయగలిగింది ఏమీ లేదని తలచి విధికి వదిలేస్తాం. కర్మయోగ రహస్య మేమిటంటే ఒక తప్పు దిశలో, ఇతరులచేత వాడబడి, మోసగింపబడి, భేద భావంతో చూడబడి ఉంటే దానిని మార్చడానికై చేతనైనంత పరిశ్రమ చెయ్యాలి. ఎందుకంటే అది మనకు, మనలను వాడుకునేవారికి కూడా అవమానకరం. నేను స్వతంత్రం రాక మునుపు క్రొత్తగా దేశానికి రక్షక భటులుగా వచ్చిన బ్రిటిష్ వారిని చూసేను. క్రొత్తలో వాళ్ళు సమంగా ఉండి ప్రజల సేవకై శ్రమించేవారు. రానురాను వాళ్ళు తామే అందరికన్నా ఉత్తములమని, దేశ ప్రజలకు నాగరికత అంటే ఏమిటో నేర్పించగల సామర్థ్య మున్నవారమని అహంకారంతో ప్రవర్తించేవారు. ఇది వ్యక్తిత్వ లోపం. ప్రతి వాడుకునే వాడు ఈ విధంగానే ఉంటాడు. మనకు తెలిసింది ఒక స్వార్థపరుడుకి అడుగు ఇస్తే, వాడు గజం అడుగుతాడు. అలాటప్పుడు వారికి వద్దు, లేదు అని చెప్పగలగాలి. ఇదే అహింస యొక్క మూలం: మనము వ్యక్తులను ప్రేమిస్తాము, గౌరవిస్తాము, కానీ వాడుకోనివ్వం. మనము స్వీయ జీవితంలో, దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా స్వార్థంతో ఎవరైనా వాడుకోబడుతే దానిని నిరసించాలి.

కర్మ యోగంలో ప్రతి వైఫల్యం మనలోని శక్తిని వెలుపకి తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మనమెటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. అంటే అపజయం గురించి భయపడం. అపజయం వలన నిరాశ, నిస్పృహ చెందక, అంతర్గత శక్తితో పరిస్థితులను చక్కబెడతాము. శ్రీకృష్ణుడు "నీకు వచ్చే అపజయాల వలన నిరుత్సాహ పడకు. అలా పదేపదే జరిగితే నీ చేతిలో ప్రతిఘటించడానికి ఆయుధాలు లేకపోతే, నేనే నీ రక్షణకు వస్తాను" అని అభయమిస్తున్నాడు. 102

Viveka Sloka 50-51 Tel Eng

Telugu English All శిష్య ఉవాచ:- ప్రశ్న నిరూపణము కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా । యదుత్తరమహం శ్రుత్వా కృతా...