Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 42

Bhagavat Gita

2.42

రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్ {2.64}

ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి

రాగద్వేష రహితుడై, తనకు వశమైన ఇంద్రియముల చేత విషయములందు ప్రవర్తించు చున్నను యోగయుక్తుడు ప్రశాంతతను పొందుచున్నాడు

ప్రసాదే సర్వ దుఃఖానా౦ హాని రస్యో పజాయతే {2.65}

ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి

మనసు నిర్మలమైనప్పుడు సమస్త దుఃఖములు నశించుచున్నవి. ప్రసన్న చిత్తము గలవారికి బుద్ధి త్వరగ స్థిరపడుచున్నది. ఀ

బాధలను అధిగమించి, పరులకు ఉపయోగపడే జీవనం గడపడానికి దేవుడు, ఎన్ని అవరోధాలున్నా, పరోపకారానికి కావలసిన వనరులు ఇస్తాడనే నమ్మకం ఉంటే, మనం ఇష్టాయిష్టాలను వదులుకోవాలి. మనకి "నాకిది ఇష్టం. నాకది అసహ్యం. నాకు అతను నచ్చాడు. నేను వానిని ద్వేషిస్తాను" అనే ఆలోచనలు రాకూడదు. మన నాడీ వ్యవస్థ మనకు నచ్చిన విషయ౦వైపే ప్రసరిస్తుంది. అలర్జీలు నాడుల ప్రతికూలత వలన కలిగేవి. మనకిష్టంలేని పనులు చేస్తే కడుపులో పుళ్ళు వస్తాయి లేదా వేళ్ళు స్వాధీనంలో ఉండవు. చివరికి మనం అపస్మారకంగా "నన్నెందుకు దూషిస్తారు?" అంటాము. మనం పూర్తిగా ఎదగాలంటే మన కిష్టం లేని ప్రదేశాలకు, మనుష్యుల వద్దకు వెళ్ళాలి. అలా చెయ్యడంలో మనకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం ఇతరులకొరకై -- ఒక తల్లి పిల్లకై, భర్త భార్యకై, భార్య భర్తకై, మిత్రుడు మిత్రుడుకై--చేస్తున్నాము. నాడీ వ్యవస్థను ఇతరుల సేవకై ఉపయోగిస్తూ ఉంటే, మనము ఇష్టాయిష్టాలు లేకుండా అన్నిటినుంచీ ఆనందం పొందుతాము.

తలిదండ్రులు పిల్లల యందు, భార్యాభర్తలు, ఇలాంటి భావనను ప్రదర్శించవచ్చు. మనం ఇతరులను మనకన్నా ముఖ్యులుగా చూడవచ్చు. భార్యాభర్తలు హోటల్ కి వెళ్తే భర్త భార్యకు ఇష్టమైన ఆహారాన్ని, లేదా భార్య భర్తకి ఇష్టమైన వంటకాన్ని తెప్పించుకోవచ్చు. మొదట్లో ఇది కష్ట మనిపించ వచ్చు. కానీ ధ్యానంతో, మంత్ర జపంతో మనము ఇతరుల మంచి గురించి పాటుపడవచ్చు. ఇలాగ మన మన్ని విషయాల్లో -- జుత్తు అలంకరణలో, పుస్తకాలలో, సినిమాలలో, మనోభావనలలో -- పాటించవచ్చు. నన్ను 5000 ఏళ్ల క్రితం నాటి మనిషినని కొందరంటారు. నేను వారితో అంగీకరిస్తాను. ఎందుకంటే నేను మన ఋషులు చెప్పిన విధంగా బ్రతుకుతాను. వారు చెప్పిన విలువలకు కాలంతో సంబంధంలేదు. అవి 5000 ఏళ్ల క్రితం వర్తి౦చేయి. వర్తమాన కాలంలో వర్తిస్తాయి. రాబోయే 5000 ఏళ్ళకు కూడా పనికివస్తాయి. వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని ఐకమత్యంతో నడిపేది ఆధ్యాత్మిక జ్ఞానం. అదే వారికి కలిగిన గాయాలకు ఉపశమనం కలిగించేది.

శ్రీరామకృష్ణ ఇష్టాయిష్టాలకు అతీతుడైన వ్యక్తి ఒక గాలిలో తేలే ఆకులాంటి వాడు అని అన్నారు. అది గాలిలో ఇక్కడకు, అక్కడకు కదిలింపబడి చివరకు నేలన పడుతుంది. చాలా విషయాల్లో మన సిద్ధాంతాలను ఉల్లంఘించకుండా పరిస్థితులకు వంగవచ్చును. కొందరు సాధారణ విషయాల్లో వంగినా, ఒక క్లిష్ట పరిస్థితి వస్తే మాత్రం దృఢ సంకల్పంతో ఉంటారు. కొన్నిసార్లు అది మంచిని కలిగిస్తుంది. మరి కొన్ని సార్లు దానికి చెడు పర్యావసానము ఉంటుంది. ఆ రెండిటివలనా మనము క్రొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. మన వద్ద ఎటువంటి సవాలునైనా ఎదుర్కొన గలిగే వనరులు ఉన్నాయి. దీనివలన మనం సుఖదుఃఖాలలో సమంగా, సంతోషంగా ఉంటాము. 130

Eknath Gita Chapter 2 Section 41

Bhagavat Gita

2.41

ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూస జాయతే {2.62}

సంగా త్స౦జాయతే కామః కామా త్క్రోధో అభిజాయతే

క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహో త్స్మృతి విభ్రమః {2.63}

స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో భుద్ధినాశా త్ప్రణశ్యతి

పురుషుడు శబ్దాది విషయములను చింతించుట చేత వాని యందు అతనికి సంగత్వము కలుగుచున్నది. సంగత్వము వలన కోరిక కలుగుచున్నది. కోరిక వలన క్రోధము పుట్టుచున్నది. క్రోధము వలన మోహము కలుగుచున్నది. మోహము వలన విస్మృతి కలుగు చున్నది. విస్మృతి వలన బుద్ధి నశించు చున్నది. బుద్ధి నశించుట చేత మనుజుడు తానే నశించు చున్నాడు.

తన స్వీయ చరిత్రలో గాంధీ మహాత్ముడు ఈ శ్లోకం గురించి పెద్ద వివరణ ఇచ్చేరు. వాటివలన ఆయన తన ఇంద్రియాలను నిగ్రహించు కోగలిగేరు. నా అనుభవం కూడా అలాటిదే. ఈ శ్లోకాలు మనను నిందించడానికి కావు. వాటి ఉద్దేశ్యము మనలోని ప్రేమ, జ్ఞానము, నిస్వార్థ కర్మ మేల్కొలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవడం.

ధ్యాయతో విషయాన్ పుంస అంటే -- ఇంద్రియ లోలత్వం. ఉదాహరణకు కొందరు శృంగార భరితమైన పుస్తకాలను చదవుతారు. మనలో చాలామందికి ఈ బలహీనత ఉంది. మనం దేహంతో తాదాత్మ్యం చెంది, ఇంద్రియాలకు లొంగి ఉంటే ప్రేమను పొందగలము, ప్రేమను ఇవ్వ గలము, సౌందర్యముతో కూడి ఉండగలము, తృప్తిని పొందగలము అని అనుకొంటాం. నేను సంస్కృత, ఆంగ్ల పుస్తకాలు చదివి తెలిసికొన్నదేమిటంటే శృంగారాన్ని ఒక్క చెడు పదం వాడకుండా వర్ణించవచ్చు. నేనీమధ్య సత్యజిత్ రే దర్శకత్వం చేసిన శృంగార భరిత సినిమాను చూసేను. అందులో నాయకీ నాయకులు వ్యంగ్యంగా ఒకరినొకరు ముద్దు పెట్టుకొని లేదా కౌగలించుకొని నటించ లేదు. ఆ సినిమాలో శృంగారం అతి సున్నితంగా, గంభీరంగా చూపబడినది. మన స్మృతులలో ఉన్న పెద్ద రహస్యం శృంగారాన్ని పరిచయం చేస్తారు గాని దాన్ని అదేపనిగా వర్ణించరు.

మనం ప్రసార మాధ్యమాల విషయంలో మనను మభ్యపెట్టే ఊహలు, సమాచారము పట్టించుకోకూడదు. పత్రికలను విచక్షణతో చదవాలి. వాటిలో ఇతరులపై అపనిందలు చేసి, వారిని మిక్కిలి నిర్దయతో వర్ణిస్తారు.

నా భార్య నేను సినిమాల సమీక్షలను దినపత్రికల్లో చదివి గొప్ప విమర్శకుడునని అనుకొంటుంది. ఒక్కొక్కప్పుడు సమీక్షలు బాగా ఉన్న సినిమాలకు వెళ్ళి తీరా చూస్తే వాటిలో పచ్చి శృంగారాన్ని చూపించేవారు. ఆ సన్నివేశాలు వచ్చినపుడు నేను కళ్ళు మూసుకొని మంత్రం జపించు కొనేవాడిని. మనము ఆధ్యాత్మిక సాధనలో అప్పుడే మొదలపెడితే అటువంటి సినిమాలు ఇంద్రియాలను ఉద్రేక పరిచి సాధనకు అవరోధాలు కలిగిస్తాయి. శృంగార సన్నివేశాలు మన అచేతన మనస్సులో ముద్రింపబడి రాత్రి కలల్లోకి వస్తాయి. ప్రకటన కర్తలకు, సినిమా నిర్మాతలకు ఉద్రేక పరిచే శృంగార సన్నివేశాలు ప్రజలు ఆదరిస్తారని తెలుసు.

సంగస్ తేషూ పజాయతే: మనము దేని గురించై ఎక్కువ చదువుతామో, ఎక్కువ చూస్తామో, ఎక్కువ వింటామో, మనమెంత నియంత్రించినా, మనలో ఒక బీజాన్ని నాటి మొలకెత్తిస్తాయి. సంగాత్ సంజాయతే కామాః --మనకు పై చెప్పిన విషయాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది. అవి అచేతన మనస్సులో ఉండి, మనను అప్రయత్నంగా ప్రభావితం చేస్తాయి.

ఇక్కడ గీత నీతి, మతపరంగా బోధ చెయ్యటం లేదు. పతంజలి కూడా ఇలాగే చెప్తారు. మనకు ఒక వస్తువు లేదా అనుభవానికై కోరిక కలిగితే, దానిని తీర్చుకొంటే, అది క్షణిక సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. గీత ఇరువురి మధ్య ప్రేమను లేదా శృంగారాన్ని వ్యతిరేకరించటం లేదు. వారి అనుబంధంలో కలిగే ఇంద్రియ సుఖాలు వారికి సంతృప్తి నిస్తాయని తప్పుగా భావిస్తారు. కోరిక మన సంబంధాలకు మంచిదే. మన అనుబంధం భౌతిక పరంగా ఉంటే "ఎందుకు ఆరు నెలల క్రితం నేనీ వ్యక్తితో జన్మ జన్మల బంధం కోరేను, ఇప్పుడు ఒక వారం కూడా కలిసి బ్రతకలేకున్నాను?" అనే అనుమానాలు వస్తాయి. మనలోనూ, మనం కోరే వ్యక్తిలోనూ ఎటువంటి లోపం లేదు. మన కోరిక క్రమ క్రమంగా నశించింది. ఇంద్రియాలతో ముడిపడిన కోరిక కొన్నాళ్ళకు క్షీణించి, అంతంఅవుతుంది.

మనలో చాలామందికి కోర్కెలు స్వాధీనంలో ఉండవు. ఉపనిషత్తులు మన కోర్కెలను నియంత్రించగలిగితే, మన విధిని నిర్ణయించవచ్చు అని చెప్తాయి. కఠోపనిషత్తు ఇలా చెప్పింది:

ఆత్మ రథాన్ని అధిష్టించేది , దేహం రథము

విచక్షణ రథ సారథి, మనస్సు కళ్ళెం,

ఇంద్రియాలు గుర్రాలు; కోరికలు వారు పయనించే మార్గాలు.

ఋషులు చెప్పేది: తప్పుగా ఆత్మని దేహము, మనస్సు, ఇంద్రియాలతో పోలిస్తే,

అది సుఖదుఃఖాలను అనుభవిస్తునట్టు ఉంటుంది.

ఒక వ్యక్తికి విచక్షణా జ్ఞానము లేకపోతే, మనస్సు స్వాధీనంలో లేకపోతే, ఇంద్రియాలు

గమ్యంలేని గుర్రాలవలె అటునిటు పరిగెడితే, కళ్ళెంతో వాటిని స్వాధీనంలో పెట్టుకోవచ్చు

కానీ వానికి విచక్షణా జ్ఞానంఉండి, మనస్సుని కేంద్రీకరించగలగాలి.

విచక్షణా జ్ఞానము లేకపోతే, ఆలోచనలు స్వాధీనంలో లేకపోతే, ఆలోచనలు శుద్ధంగా లేకపోతే,

అమృతత్వాన్ని పొందక, ఒక మరణ౦ నుంచి మరొక మరణానికి మారుతూ ఉంటాడు.

కానీ విచక్షణా జ్ఞాన మున్నవాడు, మనస్సు నిశ్చలం చేసికొని

ప్రయాణం చివరకు వస్తాడు, ఎప్పటికీ మృత్యుబారిన పడడు

రథ సారథి అయ్యి, మనస్సును కళ్ళెంతో చాకచక్యంగా నడిపి,

జీవిత లక్ష్యాన్ని చేరుతాడు, పరమాత్మతో ఏకమౌతాడు

ఇంద్రియాలతో ఎంత ఎక్కువ తాదాత్మ్యం చెందితే, వాటివలన అంత తక్కువ ఆనందం పొందగలము. ఆనందం ఎంత తక్కువగా వస్తే, ఇంద్రియాలతో అంత ఎక్కువగా తాదాత్మ్యం చెందుతాము. ఇదే భౌతిక బంధానికే పరిమితమైన ఇద్దరి మధ్య కలహాలు సృష్టిస్తుంది. వారి మధ్య బంధం క్షీణించి, విడిపోయే ప్రయత్నం చేస్తారు. వారి మధ్య ద్వేషం పెరిగి, బంధం చెడుతుంది. గతంలో ఆమె చేసిన ప్రతి క్రియ ఆనందం కలిగిస్తే, ఇప్పుడు అది జుగుప్స కలిగిస్తుంది. ఈ విధంగా భౌతిక పరమైన బంధాలు చెడుతాయి.

ఈ విధమైన ద్వేషం, క్రోధం మన మనస్సులో నాటుకుపోయి, మనను ప్రలోభ పరుస్తాయి. క్రోధాద్ భవతి సమ్మోహః -- క్రోధం నుండి భ్రాంతి కలుగుతుంది. మనము ఇతరులు చెయ్యని తప్పులు వారిపై ఆరోపిస్తాము; వారు చెయ్యని పనులు చేసేరని నిందిస్తాం. సమ్మోహాత్ స్మృతిభ్రమః -- మనము మన తప్పులను విశ్లేషించే జ్ఞానాన్ని కోల్పోతాము. మనందరమూ తప్పులు చేస్తాము. వాటి నుండి పాఠాలు నేర్చుకొంటే మనము అపరాధులమనుకోనక్కరలేదు. క్రోధం వలన విచక్షణా జ్ఞానం పోతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా అరుదుగా వాడబడే పద ప్రయోగం చేస్తాడు: స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి: ఒక వ్యక్తి చేసిన తప్పులనుండి పాఠాలు నేర్చుకోలేకపోతే, విచక్షణా జ్ఞానం కోల్పోతే వాని జీవితం వృధా. అటువంటి వ్యక్తి జీవితంలో దుఃఖితుడై, పరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తాడు. అతడు ఇతరుల బాగుకై ప్రయత్నించక, పరులకు భారమై మరణిస్తాడు.

ఈ శ్లోకాలు మనకు చెప్పేది: ఇంద్రియాలతో మనం "నేను పరిస్థితులు ప్రతికూలిస్తే వాటినుంచి విడివడగలను" అని చాలా కాలం ఆటలు ఆడలేము. ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవడం వలన మనం ఎట్టి ఆనందాన్నీ కోల్పోము. కానీ వాటితో తాదాత్మ్యం చెందితే మనం ఆనందం నష్టపోతాం. అలాగే ఇతరులకు మనకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఆనందం కలుగుతుంది; అలా కాక పోతే విచారం కలుగుతుంది. యుక్త వయస్కులు భౌతిక పరమైన బంధాలను కోరుకుంటారు. వారికి పరస్పర అవగాహన, ప్రేమ, గౌరవం తో కూడిన బంధం కాల క్రమేణా కలగగలదనే వివేకం లేదు. భౌతిక బంధాలు ఎన్నో ప్రమాణాలు చేస్తుంది. కానీ ఆద్యాత్మిక బంధం జీవితాంతం ఆనందాన్ని ఇస్తుంది. 128

Eknath Gita Chapter 2 Section 40

Bhagavat Gita

2.40

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః {2.61}

వ శే హి యస్యే౦ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

యోగయుక్తు డగువాడు ఇంద్రియములను నిగ్రహించి, మత్పరుడై యుండవలెను. ఎవనికి ఇంద్రియములు నిగ్రహింప బడినవో అట్టివాని బుద్ధియే స్థిరమైనది

"నేను ఇంద్రియాలను దేహాన్ని, అదుపులో పెట్టుకోవాలి" అని అనుకుంటూ ఇంద్రియాలను ఎన్నటికీ స్వాధీనంలో ఉంచుకోలేము. నేతి, నేతి ప్రక్రియ ద్వారా తెలిసేది: నేను దేహాన్ని కాను, ఇంద్రియాలను కాను, మనస్సును కాను, బుధ్ధిని కాను, అహంకారాన్ని కాను. గొప్ప యోగులు ఈ విధంగా ఆత్మ జ్ఞానాన్ని పొందేరు. సాధారణ వ్యక్తులకు వారిలాగ హిమాలయాలకు వెళ్ళి తపస్సుచేయడం సాధ్యము కాదు.

ఏది ఏమైనా గీతలో ఒక్క చెడు వాక్యం లేదు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు యుక్త ఆసీత మత్పరః అంటాడు. అంటే దేవుడు నాయందు ఉన్నాడు. నేను అతన్ని అడిగేది "నా ముందు ప్రత్యక్షం అవ్వు. నన్ను నీలో ఐక్యం చేసుకో. నీ పాద పద్మాల మీద ఒక అణువుగా చేసుకో".

ఈవిధంగా దేవుని ప్రార్థిస్తే మనలో మంచి మార్పులు కలిగి, మన తలిదండ్రుల లోనూ, సహధర్మచారిణి లోనూ, పిల్లలలోనూ, మిత్రులలోనూ ఆయనను దర్శిస్తాము. మనం ఇతరులకు ఆనందం కలిగిస్తే, ఇంద్రియాలను జయించినట్టే. 123

Eknath Gita Chapter 2 Section 39

Bhagavat Gita

2.39

యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః {2.60}

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభ౦ మనః

కుంతి కుమారా! వివేకము గల పురుషుడు ప్రయత్నము చేయుచుండినను బలీయములైన ఇంద్రియములు అతని మనస్సును బలవంతముగ హరించు చున్నవి

మన౦ ఒంటరిగా ఉంటేనే ఆధ్యాత్మిక జీవనం గడపగలమని అనుకోనక్కరలేదు. వివాహం చేసికొని, పిల్లలున్నా, మనము ఆధ్యాత్మికంగా ఎదగ వచ్చు. కొందరికి వివాహంవలన శృంగారం మీద మనసు పోదా అనే అనుమానం కలుగుతుంది. నిజానికి వివాహేతర శృంగార౦వలన సహధర్మచారిణితో వేర్పాటు కలుగవచ్చు. కొన్ని జంటలు భౌతికంగా బంధం పెంచుకొ౦టారు గానీ, పరస్పర అవగాహన లేక కలిసి ఉండలేరు. అలాగే విడిపోయిన కొన్నాళ్ల తరువాత వేర్వేరు వ్యక్తులతో శృ౦గారం సాగిస్తారు. మళ్ళీ మునపటిలాగే విడిపోతారు. ఈ చక్రం అలా సాగుతూ ఉంటుంది. వారికి ఇంద్రియాలు బలోపేతమై, మనస్సు చంచలమై, ఆధ్యాత్మిక జీవనం పొందడం గగనమౌతుంది. శృంగారం పవిత్రమైనది. వైవాహిక బంధంలో అది ఇద్దరి మధ్య ఆనందం, అవగాహన కలిగిస్తుంది. వారిని ఏకం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రసార మాధ్యమాల వలన కలిగే ఉద్రిక్తత భౌతికంగా, మానసికంగా, లేదా ఆధ్యాత్మికంగా సహకరించలేవు.

భార్యాభర్తలు ఒకరు మరొకరికి ప్రాముఖ్యత నివ్వాలి. అలా చేయకపోతే వారి మధ్య అసూయ కలుగుతుంది. షేక్స్పియర్ దాన్ని "ఆకుపచ్చని కళ్ళుగల రాకాసి" (green eyed monster) అంటాడు. ఎందుకంటే శృంగారం భౌతిక దేహాలకే పరిమితమయింది కనుక. నా మిత్రుడొకడు తన ప్రేయసిని ఒక పేరుగల హోటల్ కి తీసికి వెళ్ళలేనన్నాడు. ఎందుకంటే అక్కడ మగవాళ్ళు తమను విడదీయడానికై చూస్తారు అన్నాడు. ఒకరోజు వాళ్ళతో నేను కూడా ఏమిటో చూద్దామని వెళ్ళేను. నాకు తెలిసి ఎవరి పనిలో వాళ్ళు ఉండి నా మిత్రుని గాని వాని ప్రేయసిని గాని పట్టించుకోలేదు. నా మిత్రుడు ప్రేయసిమీద భౌతికమైన సంబంధం పెట్టుకున్నాడు గాని మానసికంగా అసూయతో కూడి ఉ౦డి, తన వివేచనా శక్తిని కోల్పోయేడు.

అసూయ మనమొక దానిని స్వంతం చేసుకోవాలంటే కలిగేది. మనము సౌందర్యాన్ని చూసి ఆనందించవచ్చు. కానీ దాన్ని స్వంతం చేసికొని, ఇంటికి తీసుకువెళ్ళి పూజిద్దామంటే అయ్యే పని కాదు. మనము సౌందర్య వంతమైన ఇంటినిగాని, పుష్పాన్ని గాని లేదా ఒక నాట్యగత్తెని గాని చూసి, స్వంతం చేసుకోవడానికై ప్రయత్నించవచ్చు. గీత చెప్పేది అలా చేస్తే వాటినన్నిటినీ కోల్పోతాము. ఇక్కడ రహస్యమేమిటంటే మనమెప్పుడైతే ఒకరిని స్వంతం చేసుకోదలచమో, వారికి మనయందు ప్రేమ కలుగుతుంది. ఒకరిని స్వంతం చేసుకోక, పదే పదే వారినుండి సమాధానం రాబెట్టకుండా ఉంటే, ఆ బంధం గట్టి పడుతుంది. శ్రీకృష్ణుడు సంబంధ బాంధవ్యాలలో -- అనగా తండ్రీ కొడుకుల మధ్య, ఇద్దర మిత్రుల మధ్య, భార్యాభర్తల మధ్య -- నున్న రహస్యం చెప్తున్నాడు. అది మన మటుకు ఏమీ దబాయించి అడగక, వాళ్ళకు మేలు చేస్తూ వెళ్ళడం. ఈ విధంగా ఇతరుల ప్రేమ, గౌరవం పొందగలం. కానీ ఇది నేర్చుకోవడం అంత సులువు కాదు.

మన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతే మన బంధుమిత్రులు మనకన్నా ముఖ్యులని తలంచలేము. ఉదాహరణకు, నాలుక రుచులు మరిగి, మనకి నచ్చిన ఆహారాన్నే మన బంధుమిత్రులు తినాలని వారిపై ఒత్తిడి తేవచ్చు. నాకు తెలిసి తల్లి లేదా భార్య చేసే వంట మనకిష్టం లేకపోయినా తినడం వలన మనం చాలా ఆనందం పొందుతాము. అలా కాకపోతే కనీసం మందహాసం చేసి నాలుకకు శలవు ఇవ్వాలి. మంత్ర జపంతో ఆ మందహాసాన్ని ముఖమంతా వ్యాపింప చేసికోవాలి. మన తలిదండ్రులుకు, సహధర్మచారిణికి, మిత్రులకి ఆనందం కలిగే విధంగా మన ఇంద్రియాలను స్పందింపజేయాలి. 122

Eknath Gita Chapter 2 Section 38

Bhagavat Gita

2.38

విషయా వినివర్త౦తే నిరాహారస్య దేహినః {2.59}

రసవర్జ౦ రసో అప్యస్య పరం దృష్ట్వా నివర్తతే

విషయములను గ్రహించిన వారికి ఆయా విషయములు దూరమగు చున్నవే కాని వానియందలి రాగము పోవుట లేదు. పరమాత్మను దర్శించగనే విషయములతో పాటు రాగము కూడా దూరమగు చున్నది.

పతంజలి చెప్పిన ధారణ అంటే మనస్సును నిశ్చలం చేసికోవడం. దీనికి ముందు మన ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవాలి. అవి సాధారణంగా అల్లకల్లోలంగా ఉండి, ఉదాహరణకు, మనము ఆకలి వేసినప్పుడు, తగినంత మోతాదులో, మంచి ఆహారాన్ని తిన్నా అవి తిరగబడతాయి. మనమెంత సాధారణ౦గా తిన్నా, మనలో రాజ భోజనానికై కోరిక ఉండచ్చు. బాహ్యంగా స్వాధీనంలో ఉన్నా మనస్సులో కోర్కెలు చెలరేగుతూ ఉంటాయి. మనము ఇంద్రియాలను నియంత్రించుకుంటే శ్రీకృష్ణుడు హర్షిస్తాడు. ఒకసారి "నేను ధ్యానం అలవరుచకుండా ఉండవలసింది" అనిపించచ్చు. దేవుడు దానికై మనను శిక్షించడు.

మన సాధన ఇంద్రియాలను అదుపులో పెట్టే దిశలో ఉండాలి. వాటి వలన కలిగే తీవ్ర వాంఛలు సాధనతో కొన్నాళ్ళకు తగ్గుతాయి. కోరికలు మనస్సులో వచ్చినా, ఇంద్రియాలను లోబరచుకోవడం వలన, అవి కూడా కొనాళ్లలో సమసిపోతాయి. ధ్యానం ఇక్కడ చాలా ఉపయోగకరం.

సమాధిలో భగవంతుని దర్శించినపుడు, మనకెటువంటి -- అంటే ఇంద్రియాలతో తాదాత్మ్య౦ చెందిన -- ఆనందం అక్కరలేదు. అతడే ఆనందానికి, సౌందర్యానికి, ప్రేమకి విశ్వ యోని. కాబట్టి మనకితర ప్రేమ కూడా అక్కరలేదు. ఈ విధంగా ఇంద్రియాలను మచ్చిక చేసుకొంటే క్రమంగా ఇంద్రియాలకు, అవి చూపే దృశ్యాలకు మధ్య నున్న సంబంధం అంతమవుతుంది. దానివలన మనకు నచ్చినవి, నచ్చనివి అనే తారతమ్యం లేక స్వతంత్రంగా మనకు కావలిసినది ఎన్నిక చేసికోవచ్చు 120

Eknath Gita Chapter 2 Section 37

Bhagavat Gita

2.37

యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః {2.58}

ఇంద్రియా ణీ౦ద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

తాబేలు తన అవయవములను ముడుచు కొనునట్లు, పురుషుడు ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి నివర్తింప జేయునో అపుడు అతని జ్ఞానము స్థిరముగ నుండును.

నా చిన్నప్పుడు పిల్లలు ఒక తాబేలును చూస్తే దానిని వెదురు కర్రలతో అటూ ఇటూ కదిలించేవారు. అప్పుడు తాబేలు తన చిప్పలోకి కాళ్ళను, ముఖాన్ని లాగుకొని, వాళ్ళ బారినుండి తప్పించుకునేది. అలాగే మన ఇంద్రియాలను అపాయకరమైన పరిస్థితిలో అంతర్గతం చేయగలిగితే మనం స్వతంత్రుల మవుతాము. శ్రీకృష్ణుడు అర్జునుని ఉద్దేశించి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత -- అనగా నిశ్చలంగా ఉండి, తమ ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని, దేవుని యందు మనస్సు నిలపగల్గువారు -- అని అంటాడు

నేటి ప్రసార మాధ్యమాలు మన ఇంద్రియాలను తమ ప్రకటనలతో ప్రేరేపిస్తారు. మనం ధ్యానంలో కొంత పండితే తెలిసేది, అవి మనల్ని ఎలాగ చెరబట్టేయో. "ఇంద్రియాలను సంతృప్తి పరచి, అమితమైన ఆనందాన్ని పొందండి" అనేది వారి నినాదం. ఆల్డస్ హక్స్లీ ప్రకటన కర్తలు, దేవుని దూతలలాగా ఉన్నారు అని చెప్పిరి.

నేడు సినిమాలు, టివి, పత్రికలు శృంగార మయమై ఉన్నాయి. నేటి తరాన్ని దుష్టమైనదని చెప్పడం వృధా. ఎందుకంటే మనం ప్రసార మాధ్యమాల చేతుల్లో కీలు బొమ్మలం. నేటి ప్రకటనలలో శృంగారాన్ని అదే పనిగా వాడుతున్నారు. మనం శృంగారం గురించి తరచు ఆలోచిస్తే అదే కారణం. మనల్ని అవి మభ్యపెట్టకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం: గీత చెప్పినట్లు ఇంద్రియాలను వెనక్కి తీసికోవడం. శృంగారాన్ని అతిగా చూపించే సినిమాలను చూడనక్కరలేదు. వాటివలన గత స్మృతులు వెలుపలికి వచ్చి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అలాగని సినిమాలు చూడడం మానేయమని నేను చెప్పటం లేదు. సినిమాలో ఎవరైనా తమ దుస్తులు తీసేస్తూ ఉంటారో, అప్పుడు నేను కళ్ళు మూసుకొని మంత్ర జపం చేసుకొంటాను. అటువంటి సినిమాలు దుష్టమైనవని చెప్పలేము. అవి దుస్తులు తీసివేస్తే గానీ మన సౌందర్యాన్ని చూపలేమనే వెర్రి ఆలోచనలతో చేయబడినవి.

అలాగే పుస్తకాలు కొనేటప్పుడు కొంత వివేకము ఉపయోగించాలి. లక్షల మంది చదివే పత్రికలు వారిని ఉద్రేక పరచి, విచారాన్ని కలిగిస్తాయి. మనకు జ్ఞానాన్ని, ఆత్మ గౌరవాన్ని వృద్ధి చేసే పుస్తకాలనే కొనాలని నేను భావిస్తాను.

మన ఇంద్రియాలను వెనక్కులాక్కోవాలంటే వాటికి తర్ఫీదు ఇవ్వాలి. కానీ మన౦ సంకోచిస్తే లేదా ఆందోళన చెందుతే అది కష్టం. మనకు ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వగలమనే గట్టి విశ్వాసముండాలి.

మనం బజారకు వెళ్తే మన కళ్ళు అన్ని దిక్కులా పోతాయి. కొందరు ఏమీ కొనే ఉద్దేశం లేకపోయినా బజారుకు వెళ్తారు. మరికొందరు అవసరమున్నా లేకపోయినా అనేక వస్తువులు కొంటారు. వారి ఉద్దేశంలో అవి భద్రత నిస్తాయని. ఒకరికి బహుమానంగా వస్తువులు ఇవ్వడం వలన మన బాంధవ్యం గట్టిపడుతుంది అనుకోవడం వృధా ప్రయాస. మన చెవులు చెడ్డ మాటలను, ముఖ్యంగా వ్యర్థ ప్రసంగం, వినకుండా చేసికోవాలి. అలా చేస్తే కొన్నాళ్ళకు మనం అప్రయత్నంగా మన చెవులను అక్కరలేని సంభాషణలను వినకుండా చేసికోవచ్చు. ఒకవేళ దూషణలు, పనికిరాని ప్రసంగం, ప్రక్కన జరుగుతూ ఉంటే నేను చెప్పేది అక్కడి నుంచి వెళ్లిపొమ్మని. వీలయితే ఎవరినైతే దూషిస్తున్నారో వారి గురించి ఒక మంచి మాట చెప్పవచ్చు.

ఈ శ్లోకం పూర్తిగా అర్థం చేసికోవాలంటే ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందితే మానవాళి ఎలా ప్రభావితమవుతుందో తెలిసికోవాలి. నేను సాధారణంగా నేటి శాస్త్రాలను నమ్ముతాను. సాంకేతిక ప్రగతి వలన మన జీవితాలు సుఖమయమయ్యేయని చెప్పడానికి సంకోచించను. కానీ దాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్పత్తి గురించై వస్తువులను తయారు చేసి, వాటి వలన దైనింద జీవితంలో ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించక ఉండడం వలన, పర్యావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనము ఈ విషయం గూర్చి తీవ్రంగా ఆలోచించాలి.

మనలో చాలామందికి వాహనాల ప్రభావం పర్యావరణం మీద ఎలా ఉంటుందో తెలుసు. మనం కొన్ని సులభమైన పద్దతులను అవలింబించి ఆ సమస్యను పరిష్కరించుకోగలం. ఒకప్పుడు ఇంటి దగ్గర నేను జనసంచారం లేని కొలను చుట్టూ నడిచే వాడిని. వాహనాల సౌలభ్యంతో ఇప్పుడు అనేకమంది పెద్దా చిన్నలు ఆ కొలను దగ్గరికి వస్తున్నారు. ఇక రెండో విషయంకొస్తే మన౦ వాహన౦తో పనికి వెళ్తే, వాహనంలో ఖాళీ ఉంటే, సహ ఉద్యోగులను ఎక్కించుకొని వెళ్ళవచ్చు. దీనినే కార్ పూల్ (car pool) అంటారు. దీనివలన మొదట్లో కొంత ఇబ్బంది కలిగినా --అంటే కొందరు సమయానికి తయారుగా ఉండక--రాను రాను దాని వలన మనకి కాలుష్యాన్ని తగ్గిస్తున్నామన్న సద్భావన కలుగుతుంది. మూడవది, మనకు అక్కరలేని ప్రదేశాలకు ప్రయాణం చెయ్యనక్కరలేదు. ప్రపంచాన్ని చుట్టేస్తేగాని ఆనందం లేదనుకోవడం మూర్ఖత్వం.

మన ఇంట్లో కుర్చీలు, బల్లలు పేర్చుకోవడంలో కూడా మనం చాకచక్యం చూపించాలి. నా చిన్నప్పటి ఊరులో ధనవంతులు కూడా చాలా మితంగా తమ ధనాన్ని కుర్చీలు, బల్లలకై వెచ్చించేవారు. అక్కడ ఎక్కువగా టీకు చెక్క వాడేవారు. ఎందుకంటే అక్కడ టీకు చెట్లు అధికంగా ఉండి, వాటి ధర ఎక్కువ ఉండేది కాదు. ప్రతి గదీ ఆడంబరముగా కాకుండా, అందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మన౦ అనేక విషయాల్లో నిరాడంబరముగా ఉండి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డు వచ్చే వస్తువులను అతి తక్కువగా పోగుచేసికొని జీవితాన్ని సుఖమయం చేసికోవచ్చు.

అలాగే దుస్తులు కూడా. కొందరు అతి తక్కువ దుస్తులను సేకరించి, వాటితో అందంగా మనకి కనిపిస్తారు. కొందరికి ఎక్కి తొక్కి అనేక దుస్తులు ఉన్నా, వాటితో తమ సహజ సౌందర్యాన్ని పాడుచేసికొంటారు. భూమిమీద మనకున్న సహజ వనరులు పరిమితమైనవి. అందువలన వాటిని వివేకంతో వాడుకోవాలి. ఉత్పత్తులు పెంచడం వలన, వినియోగదారులు ఎక్కువ అవ్వడం వలన పర్యావరణ విషయంలో నేడు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. మనము వస్తువులను మితంగా వాడితే, ఉత్పత్తి దారులు ఎక్కువ ఉత్పత్తి చేయరు; చేసినా అమ్ముకోలేరు.

ధ్యానం చేస్తూ, ఆధ్యాత్మిక జీవనం చేస్తూ, మనమీ అత్యవసర పరిస్థితిని పోగొట్టవచ్చు. శ్రీకృష్ణుడు "నేనే మీకందరికీ ఆనందం, ప్రేమ, సౌందర్యం, జ్ఞానం ఇచ్చే వాడిని. మీకు బాహ్య ప్రపంచ వస్తువులు కుటుంబానికి అవసరమైనంత మితంగా ఉంటే చాలు. ఎక్కువ ఉంటే లేనివారికి ఇవ్వండి" అంటున్నాడు. 118

Eknath Gita Chapter 2 Section 36

Bhagavat Gita

2.36

య స్సర్వత్రానభిస్నే హస్తత్త త్ప్రాస్య శుభాశుభమ్ {2.57}

నాభినందతి స ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

ఎవడు సమస్త విషయము లందును అభిమానము లేనివాడై, తత్స౦బంధమైన మంచి చెడులు కలిగినపుడు సుఖ దుఃఖముల నొందక యుండునో అట్టివాని బుద్ధి స్థిరమైనది

యోగులు మన అహంకారం, మనమే ముఖ్యులమనే భావన వలన నిరాశ, నిస్పృహ, విచారము పొందుతామని చెప్తారు. మనం అహంకారంతో ఉన్నంత కాలం స్వంతంత్రులమని తప్పుగా భావిస్తాం. ధ్యానం ద్వారా ప్రతి చిన్న బాంధవ్య౦లోనూ మన అహంకారం అచేతనంగా, అప్రయత్నంగా ప్రభావితం చేస్తున్నాదనే జ్ఞానం పొందుతాము.

మనను 5 ఏళ్ల లోపు పిల్లలను దేవుళ్ళుగా చూడమంటారు. అంటే వాళ్ళకి లొంగి ఉండమని కాదు. వారిని హత్తుకొని, ముద్దులిచ్చి, బుజ్జగించి, లాలించి పెంచమని. ఈ విధంగా చేస్తే వారికి మానసికంగా మరియు భౌతికంగా మనతో బంధం ఏర్పడి, అది పెద్దయ్యేవరకూ కొనసాగుతుంది.

మనము మన పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. ధూమ పానం మొదలగు చెడు అలవాట్లను వీడకపోతే పిల్లలు ఎదిగి అలాగే చేస్తారు. జీసస్ "నీవు మళ్ళీ చిన్న పిల్ల వాడిగా మారకపోతే, స్వర్గాన్ని చేరలేవు" అన్నారు. వర్డ్స్ వర్త్ అనే కవి "స్వర్గం బాల్యం లో గడిపేది" అని అన్నారు.

ఇకపోతే 5 నుంచి 16 ఏళ్ల వరకు పిల్లలను సేవకులుగా చూడాలంటారు. అది కొంచం కఠినమనిపించవచ్చు. కానీ నమ్రత, వినయం వంటి మంచి గుణాలు అలా చేస్తేనే వారిలో వస్తాయి. మానసిక శాస్త్రవేత్తలు పిల్లల మంచికై తలిదండ్రులు నిర్ణయం తీసికోలేకపోతే అది వారిని ఆశ్చర్యపరుస్తుందని చెప్తారు. ఈ వయస్సు పిల్లలు నిరసనతో తలుపులు బాదినా, బుద్ధితో సున్నితంగా హెచ్చరించే తలిదండ్రులను గౌరవిస్తారు. వారు తలిదండ్రులకు విధేయతతో ఉండకపోతే పెద్దయ్యేక ఆత్మకు కూడా విధేయులై ఉండరు. తలిదండ్రులు వారికి ఆత్మల వలె పనిచెయ్యాలి. అందుకే ధ్యానం చేసేవారిలో తలిదండ్రులకు ఎక్కువ విలువ.

పిల్లలు 16 ఏళ్లు దాటితే వాళ్ళని మనతో సమానంగా చూసుకోవాలి. వారిని శిక్షించక, వారికి వివరణ ఇవ్వగలగాలి. వారి బుద్ధిని పెంచే విధంగా ప్రవర్తించాలి. మన దృక్పథాన్ని వారికి వివరించి, వారి మనోభావాలను తెలిసికోవాలి. ఎందుకంటే తలిదండ్రులు, పిల్లలు తమ మనో భావాలతో విడిబడక ఉంటే వారి మధ్య బేధాభిప్రాయాలు కలుగుతాయి.

మనను వ్యతిరేకించే ఇతరుల మనోభావాలను గౌరవంతో ఆలకిస్తే, ఎప్పుడో ఒకప్పుడు మన ప్రత్యర్థిగురించి సదభిప్రాయం కలుగుతుంది. మన తలిదండ్రులను ఖండించకుండా, వారు చెప్పేది ఒప్పని చెప్పగలిగితే మనలోని జంకు, భయం తగ్గుతాయి. తిరిగి వాళ్ళు మనతో ఏకీభవించి మన అభిప్రాయాన్ని లేదా నిర్ణయాన్ని అంగీకరించవచ్చు. దీని వలన తలిదండ్రుల, పిల్లల మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా ఉంటుంది. "నేను తప్పు పడ్డాను" అని చెప్పగలిగే నమ్రత ధ్యానం వలన పొందవచ్చు. "నాకు తెలీదు" అని ధైర్యంగా చెప్పగలిగితే జీవితంలో చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. 114

Viveka Sloka 50-51 Tel Eng

Telugu English All శిష్య ఉవాచ:- ప్రశ్న నిరూపణము కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా । యదుత్తరమహం శ్రుత్వా కృతా...