Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 47

Bhagavat Gita

2.47

విహాయ కామాన్ యస్సర్వాన్ పుమా౦ శ్చరతి నిస్పృహః {2.71}

నిర్మమో నిరహంకార స్స శాంతి మధిగచ్ఛతి

సమస్తమైన కోరికలను త్యజించి, వానియందు స్పృహలేనివాడై, మమకార అహంకారములను విడనాడి చరించు పురుషుడు శాంతిని పొందుచున్నాడు

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అన్ని కలహాలు పరిష్కరించే, అన్ని కోరికలను తీర్చే, అన్ని భయాలను దూరం చేసే శాంతిని పొందే మార్గం బోధిస్తున్నాడు. మన చేతన మనస్సులో ఒక చీలిక ఉంది. దాని వలన మనం పూర్తిగా ప్రేమతో లేక విశ్వాసంతో ఉండలేము. స్పర్థలు ప్రేరేపించి, అవిశ్వాసంతో ఇతరులతో వేర్పాటు చేసే విధంగా ప్రవర్తిస్తే ఆ చీలిక మన చేతన మనస్సును రెండు భాగాలుగా చేస్తుంది. ధ్యానం ఆ రెండు భాగాలనూ ఏకం చేసి అఖండంగా చేస్తుంది. ధ్యానం ద్వారా పొందేది: మన హృదయంలోని, మనస్సులోని చీలికలను తొలగించడం; బాహ్యంగా మనల్ని కుటుంబంతోనూ, సమాజంతోనూ, ప్రపంచంతోనూ వేర్పాటు కలిగించే నిరోధాలను తొలగించడం.

మన చేతన మనస్సును ఏకం చెయ్యాలంటే మనమెవరియందూ అవిశ్వాసంతో ఉండకూడదు. ఉదాహరణకు మన తలిదండ్రుల యందు అవిశ్వాసంతో ఉంటే అది మన బంధుమిత్రుల యందు కూడా వ్యాపిస్తుంది. చిన్న వయస్సు నుంచీ ప్రేమను, విశ్వాసాన్ని ఏకం చేసే విధానాన్ని నేర్చు కోవచ్చు. అలాకాకపోతే ఇంటిని వదిలి బయట ప్రపంచంలోని సమస్యలతో లావాదేవీ పెట్టుకుంటే అవిశ్వాసం మన బంధాలను ప్రభావితం చేస్తుంది.

అవిశ్వాసం బుద్ధునుకి అనేక ఇబ్బందులు కలిగించింది. పీటర్ జీసస్ తో "మీయందు ఎప్పుడూ విశ్వాసంతో ఉంటాను" అని చెప్పేవాడు. కానీ జీసస్ "కోడి కూసేముందు నీవు నన్ను మూడు మార్లు ధిక్కరిస్తావు" అనెను. అవిశ్వాసం చీలికలు తెస్తే, విశ్వాసం ఐకమత్యాన్ని కలిగిస్తుంది. ప్రతి బంధంలోనూ పూర్తి విశ్వాసాన్ని కల్పించుకోగలం. నేనిది కుటుంబ నేపధ్యంలో చెప్పడం ప్రతి ఒక్కరూ వివాహం చేసికొని, పిల్లల్ని కనమని కాదు. ఎక్కడ మిత్రులు కలసి ఉంటారో, ఎక్కడ మనం పని చేస్తూ ఉంటామో, అవి కూడా కుటుంబాలే. మనం ఎవరో ఒకరిని ముందు పెట్టవచ్చు; మిత్రుడు లేక పోతే, మనం ఒక శత్రువును ఎన్నుకోవచ్చు. వాని మీద పగ తీర్చుకోకుండా వాని సమస్య యొక్క పరిష్కారం చెయ్యగలిగితే మన మధ్యనున్న చీలిక పోయి, ఐకమత్యాన్ని అనుభవిస్తాం. సెయింట్ ఫ్రాన్సిస్ "ఎవరైతే తమ శత్రువులను క్షమించలేరో వారు ఆనందాన్ని పొందలేరు" అని అన్నారు.

మన వివాహాలు, తద్దినాలు "ఓం శాంతి, శాంతి, శాంతి" అని అంతమవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శాంతిని పొంది తరించాలి. అది మాటలతో వ్యక్తపరచబడలేనిది. ప్రతి రోజూ మనం చేసే ధ్యానం మనల్ని శాంతికై తయారు చేస్తున్నాది. మీరు తక్కువ నిద్రతో, మనస్సు నిగ్రహం లేక, మంత్ర జపం సరిగ్గా చేయకపోయినా మీరు శాంతి వైపు పయనం సాగిస్తున్నారు. భౌద్దులు చెప్పేది నమనస్కం -- అంటే మనకు ఇంద్రియాలతోనూ, బుద్ధితోనూ సంబంధం లేకుండా సమ స్థితిలో ఉండడం. యోగులు ఇటువంటి సహజమైన జ్ఞానం బుద్ధి యొక్క పరిమితులను దాటి ఉంటుందని అంటారు.

శాంతిని పొందడానికి చాలా కాలం పడుతుంది. ఆ అనుభవం కొద్దిగా ఉందంటే మనస్సు కొన్ని క్షణాలు పనిచేయలేదు. ప్రతి చోటా నిశ్చలత్వం, నిశ్శబ్దం ఉండి మనని ఆహ్లాద పరుస్తాయి. అట్టి అనుభవం దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని -- అనగా అహంకారం తప్పించి అన్నిటినీ--ఉపశమనం చేస్తుంది. శాంతి అంటే మనము ప్రేమ స్వరూపము కాగల శుద్ధమైన స్థితి. మన ప్రేమ ఒక వ్యక్తి మీదే కాక, సర్వ జీవ సమైక్యతకై ఉంటుంది.

నిస్పృహ -- అంటే ఇంద్రియ చాపల్యం లేకుండా, బాహ్య ప్రపంచం వలన సంతృప్తి పడాలనే కోర్కె లేక పోవడం. క్రమక్రమంగా ఒక్కొక్క కోరికను వదిలేయాలి. అందుకే ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవడానికి చాలా కాలం పడుతుంది. మనలో చాలా మంది ధనార్జన, లేదా పేరుప్రతిష్ఠల వలన ఆనందం కలుగుతుందని అనుకొంటాము. కానీ పతంజలి ఇలా చెప్పేరు: మనం ఆనందాన్ని ఎందుకు పొందేమంటే ఒక కోరిక తాత్కాలికంగా తీరి, ఉంకో కోరిక రావడానికి తగినంత సమయం లేదు. మనస్సు తాత్కాలికంగా కోరిక లేకుండా ఉంటుంది. మనస్సు నిశ్చలంగా ఉంటేనే ఆనందం కలిగేది. అప్పుడు మనం శాంతిని అనుభవిస్తాం. కొన్నాళ్ల తరువాత ఉంకో కోరిక వస్తుంది. ఈ విధంగా చక్రం సాగుతూ ఉంటుంది. నేను తాత్కాలికమైన ఆనందం ఉపశమనం కలిగించదని అనను. కానీ మనము ఒక కోర్కెకు లొంగితే, తరువాత వచ్చేది మరింత శక్తివంతమైనది. ఇలాగ మన స్వార్థ పూరిత కోర్కెలను తీర్చుకొంటూ ఉంటే, కోర్కెకి, కోర్కెకి మధ్య కాలం తగ్గి మనమనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం.

బాహ్య ప్రపంచ వస్తువులకై ఉన్న ఆకాంక్ష ప్రాణ శక్తిని ప్రభావితం చేస్తుంది. మనము బజారులో ఏమీ కొనకుండా తిరుగుతూ, ఒక వస్తువుని కాంక్షించినా, లేదా ఒక వ్యక్తిపై అసూయ చెందినా మన ప్రాణ శక్తి క్షీణిస్తుంది. నిస్పృహ స్థితిని పొందాలంటే "ఇది నాకు అవసరమా?" అని ప్రశ్నించగలగాలి.

శ్రీకృష్ణుడు నిర్మమో అంటాడు. నేను అనే అహంకారం వలన మిత్రుల్ని దూరం చేసికొంటే, నాది అనుకోవడం కూడా అంతే. రాజకీయాలలో ఇది బాగా వర్తిస్తుంది. నాది అని ఎప్పుడైతే ధృడంగా పాతుకుపోతుందో, దానికై యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. జీసస్ "శాంతి దూతలు భగవంతుని పిల్లలు" అని చెప్పెను. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పేడు. మనము మిత్రులకు, సంఘాలకు, దేశాలకు, శత్రువులకు మన జీవితాన్ని ఆదర్శప్రాయంగా చేసి చూపించి, వారి మధ్య శాంతిని నెలకొల్పవచ్చు.

నిర్మమో అని చెప్పడంలో ఇంకో విశేష మేమిటంటే దేవుడు మనకీ వనరులు, జీవితం ఎందుకు ఇచ్చేడంటే మనల్ని భూమి యొక్క రక్షకులుగా చేయడానికి. శ్రీకృష్ణుడు ధర్మ కర్త, యజమాని. మనము అద్దెకు౦టున్న వారలము. మన అద్దె ఇల్లును సరిగ్గా వాడకపోతే ఇంటి యజమాని మనల్ని తరిమేస్తాడు. కానీ దేవుడు మనం చేసే ఆగడాలను కొంతవరకు క్షమిస్తాడు; మన దగ్గర నుంచి అద్దె తీసికోడు. మన నుండి ఆయన కోరేది పరులకై బ్రతకడం. కానీ మన గురించే బ్రతికి, ఆయనను మన స్వార్థ పూరిత కోర్కెలను తీర్చమని అడుగుతాం. మనం నీరు, గాలి ఎప్పుడూ ఉండి మనకు ఉచితంగా ఇవ్వబడ్డాయని అనుకొంటాం. నేటి కాలంలో ఆ వనరులు పరిమితమైనవని తెలిసికొ౦టున్నాం. అందుకే వాటిని సద్వినియోగం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం. పర్యావరణాన్ని, నీటిని, గాలిని అశుద్ధం చేస్తే, అవే భావి తరాలకు మనమిచ్చే ఆస్తి.

నిరహంకార -- సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి తన అహంకారాన్ని జయించేడు అని చదివేను. జీసస్ తానెవరనే ప్రశ్నకి సమాధానం కావలిస్తే తనను తాను పోగొట్టుకోవాలి (అహంకారాన్ని విడవాలి) అని చెప్పెను. హెరత్ కి చెందిన అన్సారీ అనే సూఫీ ఇలా చెప్పెను: నిన్ను నీవు పోగొట్టుకొంటే -- అంటే అహంకారాన్ని తుడిచి వేస్తే -- నీ ప్రేమికుడ్ని చేరుతావు. దీనికంటే వేరే రహస్యమేమీ లేదు. నా కింతకన్నా ఎక్కువ తెలీదు.

మన అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే నేను అనే భావాన్ని వదులుకోవాలి. అది మనల్ని ముఖ్యమైనవారలుగా, ప్రతి ఒక్కరి దృష్టిలో అపురూపమైనవారలుగా చిత్రీకరిస్తుంది. నేనున్న బెర్క్ లీ ప్రాంతంలో యుక్త వయస్కుల చేష్టలు చూసి నవ్వుకుంటాను. ఒక యువకుడు వాహనం మీద పియానో వాయిస్తూ అందరి ద్రుష్టినీ తనవైపు త్రిప్పుకున్నాడు. అలాగే కొందరు విచిత్రమైన దుస్తులు వేసికొని బయట తిరుగుతారు. అవే చిన్న పిల్లలు చేస్తే ఫరవాలేదు. కానీ పెద్దవాళ్లకు అటువంటి ప్రదర్శన అక్కరలేదు. మనము మనలోని ప్రేమ స్వరూపుడైన భగవంతుని దృష్టిని ఆకర్షించాలి. అది మంత్ర జపంవలన సాధ్యం. అలా చేస్తే మనం భద్రత ఎక్కడినుంచో వచ్చి మన మీద వాలటంలేదని తెలుసుకొంటాము. దేవుడు మనలో ప్రతిష్ఠితమై ఉన్నందువలన మనమంతా ముఖ్యులమే. మనము ఒకరిలాగ, వాళ్ళ ననుకరించి ఉండాలనే పగటి కలలు కననక్కరలేదు. మనము మన సహజ స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలం. అలాగే మనం శాంతి మనలోనే ఉందని తెలుసుకొంటే, ప్రేమ మన౦ ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తుంది. 144

Eknath Gita Chapter 2 Section 46

Bhagavat Gita

2.46

అపూర్యమాణ ప్రవిశంతి మచల ప్రతిష్ఠ౦

సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ {2.70}

తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే

స శాంతి మాప్నోతి న కామకామీ

నీటిచే పూర్ణముగా నిండినదియు, నిశ్చలమైనదియు నగు సాగరమును నదీజలము మొదలగునవి ఎలా ప్రవేశించుచున్నవో అలాగే విషయము లన్నియు ఏ యోగయుక్తుని పొంది తద్రూపమై పోతున్నవో అతడే శాంతిని పొందుచున్నాడు. విషయలోలుడు శాంతిని పొందలేడు

అపూర్యమాణమ్ అనగా సంపూర్ణమైనది. ఇది మన లక్షణం. మనమనుకుంటాం డబ్బు, ఆనందం ఉంటేనే మనము పూర్ణులమని. మనము పుట్టుకతోనే సంపూర్ణులం. దాని నుండి తీసికొన్నా అది పూర్ణమే. మనము అహంకార పూరితులమై బ్రతికినంత కాలం పూర్ణత్వం, భద్రత మనలోనే ఉన్నాయని గ్రహించం. మనలోని అగాధాన్ని ఆత్మ జ్ఞాన మొక్కటే పూరించ గలదు.

బుద్ధుడు అహంకారులు దుఃఖాలను అనుభవిస్తారని చేప్పేడు. దుఃఖానికి (దు: అనగా చెడ్డ; ఖ అనగా రంధ్రం) పర్యాయ పదం అగాథం. మనలోని అగాథాన్ని పూరించడానికి సొమ్మును కట్టలు కట్టలుగా తెచ్చి వేస్తాం. కాని అది పూరింపలేని అగాథం. మన డబ్బు, వస్తువులు, ఆనందం, ప్రతిష్ఠ అంతా అందులో వేసినా అది పూరింప బడదు. మనము దాన్ని పూరించలేమని గ్రహించిన తరువాత సెయింట్ అగస్టీన్ చెప్పిన "భగవంతుడా, నీలో విశ్రాంతి తీసికోవడానికి ప్రయత్నిస్తున్న నేను వేరొక చోట ఎలా విశ్రాంతి పొందగలను?" అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పేది: క్షణిక సుఖాన్నిచ్చే విషయాల గూర్చి జీవితాన్ని ఎందుకు వృధా చేసుకొంటావు? నీకు వాటి అవసరం లేదు. నువ్వు నా కారణాన సంపూర్ణుడవు. నీ అంతర్గతం పరీక్షించుకొంటే నన్నే పొందుతావు.

అచలప్రతిష్ఠమ్ అనగా నిశ్చలంగా ఉండడం. ఇది బ్రహ్మన్ --అనగా సృష్టి కర్త -- యొక్క నిశ్చలత్వం. మనం మార్పులేని, నిశ్చలమైన భగవంతుని ప్రతిష్ఠి౦చుకోవాలంటే మన మనస్సును నిశ్చలం చేసికోవాలి. మనస్సును ఎక్కువగా సముద్రంతో పోలుస్తారు. సముద్రం ఉపరితలంలో అలలు, గాలులు ఉండి అలజడి కలిగించినా, సముద్ర గర్భంలో అలలు, గాలులు లేక ప్రశాంతంగా ఉంటుంది. మన అచేతన మనస్సులోని భగవంతుని తెలుసుకోవాలంటే ధ్యానం ద్వారా మనస్సును నిశ్చలం చేసికోవాలి.

నేను కొన్నేళ్ళ క్రితం మనస్సుని ఎలా నిశ్చలం చేసికోవాలి, ఊహాతీతమైన జ్ఞానం గూర్చి మాట్లాడుతున్నప్పుడు కొందరు ఇలా అడిగేవారు: "మనం తర్కాన్ని ఉపయోగిస్తాం. మనకు విజ్ఞానం, సాంకేతిక శాస్త్రం తెలుసు." మనం వాటికి తగినట్టు ఉంటే మంచిదే. కానీ మనస్సు వాటితో అనుసంధాన మవ్వదు. మనస్సు స్వతహాగా చంచలం. మనలోని ఒత్తిడి, నిరాశ, వైరం, అలసట, పట్టుదల లేకపోవడం మనస్సు నిరంతరం పనిచెయ్యడం వలన. ఎవరైతే క్రమశిక్షణ లేకుండా పనులు చేస్తారో, రాగద్వేషాలతో కూడి ఉంటారో వారి ప్రాణశక్తి వృధా అవుతుంది. మనకి ద్వేషముంటే, కలల్లో కూడా, ప్రాణ శక్తి వృధా అవుతుంది. కొందరు 8 గంటలు పడుకొని, ఉదయాన్నే లేచి "నేను ఎందుకు ఇంకా అలసటతో ఉన్నాను?" అని అనుకొంటారు. ప్రాణ శక్తి వృధా అవుతూ ఉంటే మనకు కలిగేది బలహీనత, నీరసం. అందుకే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

మనమెప్పుడ ధ్యానంలో పూర్ణత్వం, నిశ్చలత పొందుతామో అప్పుడు అమిత సంతృప్తి కరమైన స్థితి కలుగుతుంది. అంటే కొంత కాలం మనస్సు, ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో వ్యాపారం పెట్టుకోవు. దీనినే బుద్ధుడు శూన్యత అంటాడు. అక్కడ రాపిడి, అసఖ్యత, వేర్పాటు ఉండవు. దాన్నే యోగులు పూర్ణత అంటారు.

మనమెంత ఆధ్యాత్మిక సాధన చేసినా అప్పుడప్పుడు మనస్సులో కోర్కెలు కలగవచ్చు. ఎందుకంటే మనము మానవ మాత్రులము కాబట్టి. అలా కోర్కెలు కలిగినప్పుడు వాటిని పట్టించుకోక, వాటి ప్రోద్భలంతో కర్మలు చేయక ఉండాలి. కోర్కెలు, నదులు సముద్రం వైపు ప్రవహిస్తున్నట్లు, వస్తాయి. కానీ సముద్రమెలా నిశ్చలంగా ఉంటుందో మనమూ అలాగే ఉండాలి. మనము ఇతరులకు సేవ చెయ్యక, స్వార్థంతో కూడి ఉంటే, పెద్ద పెద్ద అలలతో కూడిన ఒక కాలువ ఎలాగ గట్టును ధ్వంసం చేస్తుందో అలాగ మనలోని ఆలోచనలు అతలాకుతలం చేస్తాయి. అదే మనము ధ్యానముతో మన చేతన శక్తిని వాడుకొని, జీవైక్య సమానతని పాటిస్తూ ఉంటే మనవైపు గంగా నది వలె పొంగి పొరలే కోరికలు ఉదయించినా, సముద్రమెలాగ ఉంటుందో అలా నిశ్చలంగా ఉంటాం.

కామకామీ -- అనగా కోర్కెలను కోరేవాడు. మనమెంత సాధన చేసినా మనలో కామం అంత సులభంగా పోదు. మనము కామదేవుడు, లేదా మన్మథుడు, కామాన్ని కలిగించేవాడని నమ్ముతాము.

మదనో మన్మథో మారాః ప్రద్యుమ్నో మీనకేతనాః

కందర్పో దర్పకో అన౦గాః కామాః పంచశరాః స్మరాః

మన్మథుని ప్రభావం వలన మనము నిశ్చలంగా కూర్చోలేం, ఊపిరి సరిగ్గా తీసికోలేం, సరిగ్గా ఆలోచించలేం. ఇవన్నీ మనస్సులో కలిగే విషయాలు. మన్మథుని మర -- అనగా దెబ్బ కొట్టే వాడు -- అనికూడా అంటారు. అతడు శ్మర అనగా ఎప్పటికీ మరిచి పోనివ్వని వాడు. ఒక మారు కామానికి లొంగి లైంగిక కార్యాలు చేస్తే, వాటిని ఎన్నటికి మరిచిపోలేం. అవి మనస్సుని దొలిచేస్తాయి. పరమ శివుడు ఒక్కడే మనకు గతి. అతడు శ్మరారి అనగా శ్మర యొక్క శత్రువు. అతడే మనలో లైంగిక కార్యాల గురించి కలిగే ఆలోచనలను నియంత్రించి మన ప్రాణ శక్తిని కాపాడేవాడు. పంచశర అనగా 5 బాణాలు కలవాడు. మన్మథుడు మనమీద ఎప్పుడైతే బాణాలను ప్రయోగిస్తాడో మన౦ వాటిని తప్పించుకోలేం. మంత్ర జపమే మనకు శరణ్యం.

ఒక గాఢమైన కోరిక ఉదయం ధ్యానంలో వస్తే దాన్ని నియంత్రించుకొంటాం. కానీ అక్కడితో అయిపోక, అది రోజంతా మనల్ని వెంటాడవచ్చు. అప్పుడు మనము ధ్యానంలో పొందిన శక్తితో దాన్ని ఎదిరించి తరిమివేయ వచ్చు. ఇలాగ కోర్కెలు మనల్ని వెంటాడితే మనస్సుని నిశ్చలం చేసికొని, మంత్ర జపం చెయ్యడం ఉత్తమం. ఇదే జీవితంలోని పెద్ద సవాలు. మనము కోర్కెలను తరిమి వేస్తుంటే మన పట్టుదల పెరుగుతూ వస్తుంది. క్రమంగా మనకు తెలిసేదేమంటే: సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించిన సృష్టి కర్త మన కోర్కెలను నియంత్రించడానికి అపారమైన శక్తిని, మనోనిగ్రహతను ఇచ్చేడు. లైంగిక కార్యాలు దీనికి వ్యతిరేకం కాదు. అవి కుండలిని శక్తికి సంబంధించినవి. ఆ శక్తికి లోబడక, దానినే స్వాధీనం చేసికొంటే మనలోని సృజనాత్మక శక్తి ఉద్భవించి మనలను సత్కర్మలు చేయుటకు ప్రోత్సాహిస్తుంది. 140

Eknath Gita Chapter 2 Section 45

Bhagavat Gita

2.45

యా విశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ {2.69}

యస్యాం జాగ్రతి భూతాని సా విశా పశ్యతో మునేః

సర్వభూతములకు ఏది రాత్రియో, దాని యందు సంయమి మేలుకొని యుండును. దేనియందు సర్వ భూతములు మేలుకొని యున్నవో అది సంయమికి రాత్రిగా నుండును

మనకు రాత్రి అయితే యోగులకు పగలు; మనకు పగలయితే యోగులకు రాత్రి. ఎందుకంటే మనము ఇంద్రియాలతో తాదాత్మ్యమై, దేహంతో ముడిపడి, సదా మార్పుచెందే సంసారమనే చక్రంలో తిరుగుతున్నాం. ఈ విధంగా ఉన్న మనకు సదా మార్పు కలుగుతూ, చివరకు మరణమనే అంతిమ మార్పు కలుగుతుంది.

మన ధ్యానం పరిపక్వమవుతున్న కొద్దీ, బాహ్య ప్రపంచం మనకు వివర్తమై కనిపిస్తుంది. ప్రస్తుత ప్రపంచం ఒక దశాబ్దం క్రింద ఉన్న ప్రపంచంగా లేదు. ప్రతీదీ మాయతో కూడి మార్పుచెందుతున్నట్టు కనపడుతుంది. కొన్నేళ్ళ నాటి క్రింద మన ప్రత్యర్థి అనుకునే వ్యక్తి, ఇప్పుడు ఒక మంచి మిత్రునిగా కనిపిస్తాడు. అంటే మనం ప్రపంచంలోని జీవైక్యతను అర్థం చేసుకొంటున్నాము.

మనము ప్రాణులను యదాతథంగా చూడక, మన మనోభావాలతో చూస్తాం. ప్రాణుల్ని మన అవసరాలతో, పక్షపాతంతో చూసి, ప్రతీదీ మన చుట్టూ తిరుగుతోందని అని అనుకొంటాం. మనం ప్రాణుల్ని యదాతథంగా చూసి, ప్రపంచం ఒక క్రూరమైనదిగా భావించకూడదు. ఎందుకంటే మనము సంపూర్ణ దృష్టితో ప్రపంచాన్ని చూడటం లేదు కనుక. శ్రీ రమణ మహర్షి లేదా శ్రీ రామకృష్ణ లాంటి వారు మాత్రమే ప్రపంచాన్ని సంపూర్ణ దృష్టితో చూడగలరు. వారు ప్రపంచంలో జరిగే అల్లకల్లోలం, హింస చూస్తారు గానీ, ప్రపంచమనే ఆసుపత్రిలో మనకు చికిత్స చేసి బాగుపరచాలని తలుస్తారు. రమణ మహర్షి దేహం ఒక పెద్ద వ్యాధి అన్నారు. శ్రీ రామకృష్ణ ఆసుపత్రిలో బాగుపరచే వరకు మనల్ని ఇంటికి పంపించకూడదు అని శిష్యులకు బోధించేవారు. బుద్ధుడుకూడా మనమంతా తన్హ అనే వ్యాధితో బాధపడుతున్నామని చత్వారి ఆర్యసత్యాని (Four Fold Path) లో పేర్కొన్నారు. తన్హ అంటే అరికట్టబడని కామం. దానిని తొలగించుకోవడానికై అరియ అష్టాంగిక (Eightfold Path) ని ప్రసాదించేరు.

మనం జీవితంలో చెయ్యవలసిందల్లా మనలోని అహంకారాన్ని క్రమక్రమంగా తొలగించాలి. దానికై మన బంధుమిత్రుల బాగుకొరకై అహంకార౦తో చూసే దృష్టిని విశాలం చేసికోవాలి. ఈ విధంగా జీవైక్య సమానతని పాటించాలి. ఒకరు నన్నడిగేరు "మనకు తెలిసిన కొంతమందికే సేవ చేస్తే, జీవైక్య సమానతను ఎలా పొందగలం?" నేను చెప్పింది ఒక వస్తాదు ప్రపంచంలో అతి గొప్పవానిగా కావడానికి ప్రతి ఒక్కరితోనూ పోటీ పడి జయంచనక్కరలేదు. ఒక ఊరు, రాష్ట్రం లేదా దేశంలో అతి గొప్ప వస్తాదులతో భేటీ పడి, జయిస్తే చాలు. అతి కొద్ది బంధుమిత్రులున్నా వారి శ్రేయస్సుకై ప్రయత్నిస్తే మనకున్న సన్నపాటి దృక్పథం విశాలమై చివరికి సర్వత్రా వ్యాపిస్తుంది. ఇదే నిర్వాణ మంటే. మనకు లాభసాటిగా లేదా ఆహ్లాదంగా ఉండేలాగ కాకుండా, జీవైక్యతను చూడాలి. 136

Eknath Gita Chapter 2 Section 44

Bhagavat Gita

2.44

ఇంద్రియాణా౦ హి చరతా౦ యన్మనో అను విధీయతే {2.67}

త దస్య హరతి ప్రజ్ఞా౦ వాయు ర్నావ మివా౦భసి

నీటియందు గాలి నావను పెడదారి పట్టించునట్లు విషయాసక్తములైన ఇంద్రియముల ననుసరి౦చెడి మనస్సు మనుజుని వివేకమును హరించుచున్నవి

తస్మా ద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః {2.68}

ఇంద్రియా ణీ౦ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

అర్జునా! ఎవడు తన ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరలించునో వాని బుద్ధి స్థిరమై యున్నది

ఈ శ్లోకాలు మానవాళికి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే అయ్యే గతి చెప్తున్నాయి. ఎవరైతే తృప్తి, భద్రత, ఇవ్వలేని ఇంద్రియాలకు దాసులవుతారో వారికి ముప్పు తప్పదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇంద్రియాల ప్రేరణను తగ్గించుకొని వాటిని అదుపులో పెట్టుకోవాలని బోధిస్తున్నాడు.

మన నాలుకకు, మనస్సుకు అవినాభావ సంబంధం ఉన్నది. గాంధీ మహాత్ముడు నాలుకను నియంత్రిస్తే, మనస్సు స్వాధీనంలో పెట్టుకోవచ్చునని చెప్పిరి. ఈ రోజుల్లో ప్రసార మాధ్యమాలు నోరూరించే తిండి మీద అనేకమైన ప్రకటనలు చేస్తున్నాయి. మనలో చాలామంది వాటిచే ప్రభావితులవుతున్నారు. మన నాలుకను వారు ప్రకటించే తిండినుంచి తప్పించి ఆరోగ్యకరమైన, పౌష్ఠికాహారానికి తినేలాగ చెయ్యాలి. అనేక శాస్త్రజ్ఞులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తినాలి అన్న అంశం మీద పరిశోధన చేస్తున్నారు. మొదట్లో నాలుకకు కొన్ని రుచులు సహించవు. కానీ మనము మన అలవాట్లను క్రమంగా సాత్త్వికంగా మార్చుకోవచ్చు. అలాగని నోరును పూర్తిగా కట్టేసుకోమని కాదు. మాంశాహారము నుండి శాఖాహారానికి క్రమంగా మారవచ్చు. మనము పుస్తకాల్లో ఎటువంటి ఆహారం మంచిదో, ఎటువంటి ఆహారం అపాయకరమో వాటిని గూర్చి చదువుతాం. వాటిలో మాంశాహారము విడిచేయవలసినదని ఘంటాపథంగా చెప్తున్నారు. మాంశాహారం వలన అనేక సమస్యలు వస్తాయి, ముఖ్యంగా గుండె జబ్బులు. శాస్త్రజ్ఞులు ప్రతివ్యక్తికి అనేకసార్లు సలహా ఇవ్వకపోయినా, క్రమంగా శాఖాహారమే దేహ, మానసిక స్వస్థతికి మంచిదని చెప్తున్నారు.

శాఖాహారము మన ఆరోగ్యాన్ని స్వస్థతతో ఉంచడమే కాకుండా, ఆధ్యాత్మిక పరంగా జీవైక్య సమానతకు దోహదం చేస్తుంది. మన ఆద్యాత్మికత గట్టి పడుతున్న కొద్దీ, జీవులయందు భూత దయ కలిగి, వాటిని హింసించ కూడదనే అవగాహనికి వస్తాము. శాఖాహారము ఈ విధంగా జీవైక్య సమానతను పెంపొందిస్తుంది. 134

Eknath Gita Chapter 2 Section 43

Bhagavat Gita

2.44

నాస్తి బుద్ధి రయక్తస్య న చాయుక్తస్య భావనా {2.66}

న చా భావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖమ్

యోగయుక్తుడు కానివానికి స్థిరబుద్ధి యుండదు. ఆత్మ భావనయు కలుగదు. ఆత్మ భావన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేని వానికి సుఖము ఎట్లు కలుగును?

నియంత్రణలేని ఇంద్రియాలు ఒక కారు చక్రాలు నలుదిశలా పోతే ఎలాగ కారు నుడుస్తుందో, అలా మన దేహాన్ని, మనస్సును అతలాకుతలం చేస్తాయి. ధ్యానంతో వాటిని సరిచేయవచ్చు.

నాస్తి బుద్ధి రయక్తస్య న చాయుక్తస్య భావనా-- అంతర్గతంగా సఖ్యత లేకపోతే, కోరికలన్నీ ఒకే లక్ష్యం పై ఉన్నా, మనలోని సృజనాత్మక శక్తిని పొందలేము. ఒకడు చిత్రలేఖనం నేర్చుకోవాలంటే శిలలను చెక్కకూడదు. కొందరు "నేను లలిత కళలన్నీ అభ్యసించి చిత్రలేఖనం అప్పుడప్పుడు చేస్తాను" అని అనవచ్చు. శ్రీకృష్ణుడు మీకు చిత్రలేఖనం మీద అభిలాష ఉంటే దాని మీదే దృష్టిని కేంద్రీకరించండి అని చెప్తున్నాడు. న చా భావయత శ్శాంతిర్ -- నీ ఆలోచనలలో పొంతన లేకపోతే నీకు మనశ్శాంతి ఎక్కడిది? మనలో శాంతి లోపించి, ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఆస్తి ఉన్నా అంతర్గతంలో యుద్ధాలు చెలరేగుతూ ఉంటే, భద్రత పొందలేము. అశాంతస్య కుత స్సుఖమ్ -- మనకు మనశ్శాంతి లేక ఆనందం ఎలా కలుగుతుంది? ధ్యానము, ఆధ్యాత్మిక సాధన మనలను ఆనంద సాగరంలో తడపడానికే. మొదట్లో వాటి మీద అనుమానముండడం సహజం. "రోజూ ఉదయాన్నే లేచి, మితంగా భుజించి, ఇతరులను మనకన్నా ముఖ్యులుగా తలంచడ౦లో కలిగే సుఖమేమిటి?" అని అడగవచ్చు. అటువంటి క్రమశిక్షణ రోత కలిగించవచ్చు. కానీ ధ్యానం యొక్క లక్ష్యం సంపూర్ణమైన ఆనందం పొంది, మనలోని శక్తులను మేల్కొలిపి వాటిని సత్కర్మలకై వినియోగించడం.

భక్తి యోగము, అనగా సద్భక్తితో నిస్వార్థ ప్రేమతో కూడి ఉండడం, మనలో చాలా మందికి అంతర్గత సామారస్య౦ కలిగిస్తుంది. ఇదే ధ్యానం యొక్క పరాకాష్ఠ. నన్ను కొందరు "నాలో ఉన్న భక్తి భావాన్ని ఇంకా లోతుగా ఎలా చేసికోగలను?" అని అడుగుతారు. నేను చెప్పేది: మన కోరికలను సమైక్యత చేసి, క్రమశిక్షణతో ధ్యానం చేస్తే, మన౦దరిలోని దేవుడ్ని దర్శించవచ్చు.

ఒకరోజు నేను చూసిన సినిమాలో భక్తులు ఒక తాడుతో చేసిన వంతెనను దాట వలసి వచ్చింది. వారు ఆ వంతెన మీద ఉన్నంత సేపు రామ నామము స్మరించేరు. కానీ ఆవల వొడ్డు చేరగానే కామా, కామా అని జపం చేస్తారేమోనని అనిపించింది. మన జీవితం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మనకు దైవ ప్రార్థన గుర్తుకు వస్తుంది. అదే సుఖ సంతోషాలతో, రాబడితో, మంచి ఆరోగ్యంతో ఉంటే దేవుని మర్చిపోతాం.

ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అవి దేవుడు ఇచ్చే "నన్ను మరచిపోవద్దు" అనే సూచనలు. మనకు ఆహ్లాదం కలిగినప్పుడు దేవునికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మనకి కష్టాలు --భౌతిక సమస్యలు, మానసిక ఒత్తిడి, నష్టం -- కలిగినప్పుడు కూడా దేవునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అవి మన దృష్టిని దేవుని యందు నిలుపుతాయి.

దేవుని పైన ప్రేమ ఎలాగుండాలంటే: ఒక పిసినివాడు తన బంగారాన్ని ఎలా ప్రేమిస్తాడో, ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, ఒక ప్రియుడు తన ప్రేయసిని ఎలా ప్రేమిస్తాడో, వాటినన్నిటినీ కలుపుకొన్నట్టు ఉండాలి అని శ్రీరామకృష్ణ అంటారు. మనలో చాలామందికి అపరిమితమైన ప్రేమ ఉండి, దాన్ని లెక్కలేని విషయాల మీద ప్రసరింప జేస్తాం. అలా కాక దృష్టిని కేంద్రీకరించి, ఇతరుల సౌఖ్యమే మనదిగా భావించి, భక్తిభావంతో ఉంటే మంచి సాధన చేస్తున్నట్టు. నేటి ప్రపంచంలో ఒక అవతార పురుషుడు దేవుని అంశని అంగీకరించరు . అలాగే సంపూర్ణమైన ప్రేమతో, విశ్వాసంతో భక్తిని లేదా బంధాలలో నిస్వార్థమైన ప్రేమను పెంపొందించుకోవచ్చు అని చెప్తే నమ్మరు.

మనలో చాలామందికి ఏ దేవుని అవతారాన్ని పూజించాలో తెలీదు. నేను ఆ అవతారం మిమ్మల్ని ఎన్నిక చేసికోమని చెప్తాను. దేవగణాన్ని అంతా విశ్లేషించేకంటే "నేను మీ పాదాల వద్ద ఉన్నాను. నేను చాలా దుస్థితిలో ఉన్నాను. మీకు భారంగా ఉన్నాను. మీలో ఏ ఒక్కరైనా నా యందు దయచూపి రక్షించరా?" అని ప్రార్థించడం ఉత్తమం. దీన్నే యోగులు సంపూర్ణ శరణాగతి అంటారు.

మంత్ర జపంతో మనను ఉద్దరించుకోలేని దుస్థితిలో ఉంటే దేవుని కాపాడమనే ప్రార్థన చేస్తున్నాము. ఇటువంటి విశ్వాసముంటే చాలు దేవుని దయ మనయందు తప్పక ఉంటుంది. అదే దేవుని కృప. ఆయన ఆగమనం వలన మనలోని దుస్స౦స్కారాలు పలాయన మౌతాయి. దైవానుగ్రహము మనం సంపూర్ణమైన భక్తి కలిగియున్నా, కొన్ని తప్పులు చేస్తూ మన ప్రయత్నం చిత్త శుద్ధితో చేస్తున్నా, కలుగకపోవచ్చు. 132

Eknath Gita Chapter 2 Section 42

Bhagavat Gita

2.42

రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్ {2.64}

ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి

రాగద్వేష రహితుడై, తనకు వశమైన ఇంద్రియముల చేత విషయములందు ప్రవర్తించు చున్నను యోగయుక్తుడు ప్రశాంతతను పొందుచున్నాడు

ప్రసాదే సర్వ దుఃఖానా౦ హాని రస్యో పజాయతే {2.65}

ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి

మనసు నిర్మలమైనప్పుడు సమస్త దుఃఖములు నశించుచున్నవి. ప్రసన్న చిత్తము గలవారికి బుద్ధి త్వరగ స్థిరపడుచున్నది. ఀ

బాధలను అధిగమించి, పరులకు ఉపయోగపడే జీవనం గడపడానికి దేవుడు, ఎన్ని అవరోధాలున్నా, పరోపకారానికి కావలసిన వనరులు ఇస్తాడనే నమ్మకం ఉంటే, మనం ఇష్టాయిష్టాలను వదులుకోవాలి. మనకి "నాకిది ఇష్టం. నాకది అసహ్యం. నాకు అతను నచ్చాడు. నేను వానిని ద్వేషిస్తాను" అనే ఆలోచనలు రాకూడదు. మన నాడీ వ్యవస్థ మనకు నచ్చిన విషయ౦వైపే ప్రసరిస్తుంది. అలర్జీలు నాడుల ప్రతికూలత వలన కలిగేవి. మనకిష్టంలేని పనులు చేస్తే కడుపులో పుళ్ళు వస్తాయి లేదా వేళ్ళు స్వాధీనంలో ఉండవు. చివరికి మనం అపస్మారకంగా "నన్నెందుకు దూషిస్తారు?" అంటాము. మనం పూర్తిగా ఎదగాలంటే మన కిష్టం లేని ప్రదేశాలకు, మనుష్యుల వద్దకు వెళ్ళాలి. అలా చెయ్యడంలో మనకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం ఇతరులకొరకై -- ఒక తల్లి పిల్లకై, భర్త భార్యకై, భార్య భర్తకై, మిత్రుడు మిత్రుడుకై--చేస్తున్నాము. నాడీ వ్యవస్థను ఇతరుల సేవకై ఉపయోగిస్తూ ఉంటే, మనము ఇష్టాయిష్టాలు లేకుండా అన్నిటినుంచీ ఆనందం పొందుతాము.

తలిదండ్రులు పిల్లల యందు, భార్యాభర్తలు, ఇలాంటి భావనను ప్రదర్శించవచ్చు. మనం ఇతరులను మనకన్నా ముఖ్యులుగా చూడవచ్చు. భార్యాభర్తలు హోటల్ కి వెళ్తే భర్త భార్యకు ఇష్టమైన ఆహారాన్ని, లేదా భార్య భర్తకి ఇష్టమైన వంటకాన్ని తెప్పించుకోవచ్చు. మొదట్లో ఇది కష్ట మనిపించ వచ్చు. కానీ ధ్యానంతో, మంత్ర జపంతో మనము ఇతరుల మంచి గురించి పాటుపడవచ్చు. ఇలాగ మన మన్ని విషయాల్లో -- జుత్తు అలంకరణలో, పుస్తకాలలో, సినిమాలలో, మనోభావనలలో -- పాటించవచ్చు. నన్ను 5000 ఏళ్ల క్రితం నాటి మనిషినని కొందరంటారు. నేను వారితో అంగీకరిస్తాను. ఎందుకంటే నేను మన ఋషులు చెప్పిన విధంగా బ్రతుకుతాను. వారు చెప్పిన విలువలకు కాలంతో సంబంధంలేదు. అవి 5000 ఏళ్ల క్రితం వర్తి౦చేయి. వర్తమాన కాలంలో వర్తిస్తాయి. రాబోయే 5000 ఏళ్ళకు కూడా పనికివస్తాయి. వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని ఐకమత్యంతో నడిపేది ఆధ్యాత్మిక జ్ఞానం. అదే వారికి కలిగిన గాయాలకు ఉపశమనం కలిగించేది.

శ్రీరామకృష్ణ ఇష్టాయిష్టాలకు అతీతుడైన వ్యక్తి ఒక గాలిలో తేలే ఆకులాంటి వాడు అని అన్నారు. అది గాలిలో ఇక్కడకు, అక్కడకు కదిలింపబడి చివరకు నేలన పడుతుంది. చాలా విషయాల్లో మన సిద్ధాంతాలను ఉల్లంఘించకుండా పరిస్థితులకు వంగవచ్చును. కొందరు సాధారణ విషయాల్లో వంగినా, ఒక క్లిష్ట పరిస్థితి వస్తే మాత్రం దృఢ సంకల్పంతో ఉంటారు. కొన్నిసార్లు అది మంచిని కలిగిస్తుంది. మరి కొన్ని సార్లు దానికి చెడు పర్యావసానము ఉంటుంది. ఆ రెండిటివలనా మనము క్రొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. మన వద్ద ఎటువంటి సవాలునైనా ఎదుర్కొన గలిగే వనరులు ఉన్నాయి. దీనివలన మనం సుఖదుఃఖాలలో సమంగా, సంతోషంగా ఉంటాము. 130

Eknath Gita Chapter 2 Section 41

Bhagavat Gita

2.41

ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూస జాయతే {2.62}

సంగా త్స౦జాయతే కామః కామా త్క్రోధో అభిజాయతే

క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహో త్స్మృతి విభ్రమః {2.63}

స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో భుద్ధినాశా త్ప్రణశ్యతి

పురుషుడు శబ్దాది విషయములను చింతించుట చేత వాని యందు అతనికి సంగత్వము కలుగుచున్నది. సంగత్వము వలన కోరిక కలుగుచున్నది. కోరిక వలన క్రోధము పుట్టుచున్నది. క్రోధము వలన మోహము కలుగుచున్నది. మోహము వలన విస్మృతి కలుగు చున్నది. విస్మృతి వలన బుద్ధి నశించు చున్నది. బుద్ధి నశించుట చేత మనుజుడు తానే నశించు చున్నాడు.

తన స్వీయ చరిత్రలో గాంధీ మహాత్ముడు ఈ శ్లోకం గురించి పెద్ద వివరణ ఇచ్చేరు. వాటివలన ఆయన తన ఇంద్రియాలను నిగ్రహించు కోగలిగేరు. నా అనుభవం కూడా అలాటిదే. ఈ శ్లోకాలు మనను నిందించడానికి కావు. వాటి ఉద్దేశ్యము మనలోని ప్రేమ, జ్ఞానము, నిస్వార్థ కర్మ మేల్కొలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవడం.

ధ్యాయతో విషయాన్ పుంస అంటే -- ఇంద్రియ లోలత్వం. ఉదాహరణకు కొందరు శృంగార భరితమైన పుస్తకాలను చదవుతారు. మనలో చాలామందికి ఈ బలహీనత ఉంది. మనం దేహంతో తాదాత్మ్యం చెంది, ఇంద్రియాలకు లొంగి ఉంటే ప్రేమను పొందగలము, ప్రేమను ఇవ్వ గలము, సౌందర్యముతో కూడి ఉండగలము, తృప్తిని పొందగలము అని అనుకొంటాం. నేను సంస్కృత, ఆంగ్ల పుస్తకాలు చదివి తెలిసికొన్నదేమిటంటే శృంగారాన్ని ఒక్క చెడు పదం వాడకుండా వర్ణించవచ్చు. నేనీమధ్య సత్యజిత్ రే దర్శకత్వం చేసిన శృంగార భరిత సినిమాను చూసేను. అందులో నాయకీ నాయకులు వ్యంగ్యంగా ఒకరినొకరు ముద్దు పెట్టుకొని లేదా కౌగలించుకొని నటించ లేదు. ఆ సినిమాలో శృంగారం అతి సున్నితంగా, గంభీరంగా చూపబడినది. మన స్మృతులలో ఉన్న పెద్ద రహస్యం శృంగారాన్ని పరిచయం చేస్తారు గాని దాన్ని అదేపనిగా వర్ణించరు.

మనం ప్రసార మాధ్యమాల విషయంలో మనను మభ్యపెట్టే ఊహలు, సమాచారము పట్టించుకోకూడదు. పత్రికలను విచక్షణతో చదవాలి. వాటిలో ఇతరులపై అపనిందలు చేసి, వారిని మిక్కిలి నిర్దయతో వర్ణిస్తారు.

నా భార్య నేను సినిమాల సమీక్షలను దినపత్రికల్లో చదివి గొప్ప విమర్శకుడునని అనుకొంటుంది. ఒక్కొక్కప్పుడు సమీక్షలు బాగా ఉన్న సినిమాలకు వెళ్ళి తీరా చూస్తే వాటిలో పచ్చి శృంగారాన్ని చూపించేవారు. ఆ సన్నివేశాలు వచ్చినపుడు నేను కళ్ళు మూసుకొని మంత్రం జపించు కొనేవాడిని. మనము ఆధ్యాత్మిక సాధనలో అప్పుడే మొదలపెడితే అటువంటి సినిమాలు ఇంద్రియాలను ఉద్రేక పరిచి సాధనకు అవరోధాలు కలిగిస్తాయి. శృంగార సన్నివేశాలు మన అచేతన మనస్సులో ముద్రింపబడి రాత్రి కలల్లోకి వస్తాయి. ప్రకటన కర్తలకు, సినిమా నిర్మాతలకు ఉద్రేక పరిచే శృంగార సన్నివేశాలు ప్రజలు ఆదరిస్తారని తెలుసు.

సంగస్ తేషూ పజాయతే: మనము దేని గురించై ఎక్కువ చదువుతామో, ఎక్కువ చూస్తామో, ఎక్కువ వింటామో, మనమెంత నియంత్రించినా, మనలో ఒక బీజాన్ని నాటి మొలకెత్తిస్తాయి. సంగాత్ సంజాయతే కామాః --మనకు పై చెప్పిన విషయాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది. అవి అచేతన మనస్సులో ఉండి, మనను అప్రయత్నంగా ప్రభావితం చేస్తాయి.

ఇక్కడ గీత నీతి, మతపరంగా బోధ చెయ్యటం లేదు. పతంజలి కూడా ఇలాగే చెప్తారు. మనకు ఒక వస్తువు లేదా అనుభవానికై కోరిక కలిగితే, దానిని తీర్చుకొంటే, అది క్షణిక సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. గీత ఇరువురి మధ్య ప్రేమను లేదా శృంగారాన్ని వ్యతిరేకరించటం లేదు. వారి అనుబంధంలో కలిగే ఇంద్రియ సుఖాలు వారికి సంతృప్తి నిస్తాయని తప్పుగా భావిస్తారు. కోరిక మన సంబంధాలకు మంచిదే. మన అనుబంధం భౌతిక పరంగా ఉంటే "ఎందుకు ఆరు నెలల క్రితం నేనీ వ్యక్తితో జన్మ జన్మల బంధం కోరేను, ఇప్పుడు ఒక వారం కూడా కలిసి బ్రతకలేకున్నాను?" అనే అనుమానాలు వస్తాయి. మనలోనూ, మనం కోరే వ్యక్తిలోనూ ఎటువంటి లోపం లేదు. మన కోరిక క్రమ క్రమంగా నశించింది. ఇంద్రియాలతో ముడిపడిన కోరిక కొన్నాళ్ళకు క్షీణించి, అంతంఅవుతుంది.

మనలో చాలామందికి కోర్కెలు స్వాధీనంలో ఉండవు. ఉపనిషత్తులు మన కోర్కెలను నియంత్రించగలిగితే, మన విధిని నిర్ణయించవచ్చు అని చెప్తాయి. కఠోపనిషత్తు ఇలా చెప్పింది:

ఆత్మ రథాన్ని అధిష్టించేది , దేహం రథము

విచక్షణ రథ సారథి, మనస్సు కళ్ళెం,

ఇంద్రియాలు గుర్రాలు; కోరికలు వారు పయనించే మార్గాలు.

ఋషులు చెప్పేది: తప్పుగా ఆత్మని దేహము, మనస్సు, ఇంద్రియాలతో పోలిస్తే,

అది సుఖదుఃఖాలను అనుభవిస్తునట్టు ఉంటుంది.

ఒక వ్యక్తికి విచక్షణా జ్ఞానము లేకపోతే, మనస్సు స్వాధీనంలో లేకపోతే, ఇంద్రియాలు

గమ్యంలేని గుర్రాలవలె అటునిటు పరిగెడితే, కళ్ళెంతో వాటిని స్వాధీనంలో పెట్టుకోవచ్చు

కానీ వానికి విచక్షణా జ్ఞానంఉండి, మనస్సుని కేంద్రీకరించగలగాలి.

విచక్షణా జ్ఞానము లేకపోతే, ఆలోచనలు స్వాధీనంలో లేకపోతే, ఆలోచనలు శుద్ధంగా లేకపోతే,

అమృతత్వాన్ని పొందక, ఒక మరణ౦ నుంచి మరొక మరణానికి మారుతూ ఉంటాడు.

కానీ విచక్షణా జ్ఞాన మున్నవాడు, మనస్సు నిశ్చలం చేసికొని

ప్రయాణం చివరకు వస్తాడు, ఎప్పటికీ మృత్యుబారిన పడడు

రథ సారథి అయ్యి, మనస్సును కళ్ళెంతో చాకచక్యంగా నడిపి,

జీవిత లక్ష్యాన్ని చేరుతాడు, పరమాత్మతో ఏకమౌతాడు

ఇంద్రియాలతో ఎంత ఎక్కువ తాదాత్మ్యం చెందితే, వాటివలన అంత తక్కువ ఆనందం పొందగలము. ఆనందం ఎంత తక్కువగా వస్తే, ఇంద్రియాలతో అంత ఎక్కువగా తాదాత్మ్యం చెందుతాము. ఇదే భౌతిక బంధానికే పరిమితమైన ఇద్దరి మధ్య కలహాలు సృష్టిస్తుంది. వారి మధ్య బంధం క్షీణించి, విడిపోయే ప్రయత్నం చేస్తారు. వారి మధ్య ద్వేషం పెరిగి, బంధం చెడుతుంది. గతంలో ఆమె చేసిన ప్రతి క్రియ ఆనందం కలిగిస్తే, ఇప్పుడు అది జుగుప్స కలిగిస్తుంది. ఈ విధంగా భౌతిక పరమైన బంధాలు చెడుతాయి.

ఈ విధమైన ద్వేషం, క్రోధం మన మనస్సులో నాటుకుపోయి, మనను ప్రలోభ పరుస్తాయి. క్రోధాద్ భవతి సమ్మోహః -- క్రోధం నుండి భ్రాంతి కలుగుతుంది. మనము ఇతరులు చెయ్యని తప్పులు వారిపై ఆరోపిస్తాము; వారు చెయ్యని పనులు చేసేరని నిందిస్తాం. సమ్మోహాత్ స్మృతిభ్రమః -- మనము మన తప్పులను విశ్లేషించే జ్ఞానాన్ని కోల్పోతాము. మనందరమూ తప్పులు చేస్తాము. వాటి నుండి పాఠాలు నేర్చుకొంటే మనము అపరాధులమనుకోనక్కరలేదు. క్రోధం వలన విచక్షణా జ్ఞానం పోతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా అరుదుగా వాడబడే పద ప్రయోగం చేస్తాడు: స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి: ఒక వ్యక్తి చేసిన తప్పులనుండి పాఠాలు నేర్చుకోలేకపోతే, విచక్షణా జ్ఞానం కోల్పోతే వాని జీవితం వృధా. అటువంటి వ్యక్తి జీవితంలో దుఃఖితుడై, పరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తాడు. అతడు ఇతరుల బాగుకై ప్రయత్నించక, పరులకు భారమై మరణిస్తాడు.

ఈ శ్లోకాలు మనకు చెప్పేది: ఇంద్రియాలతో మనం "నేను పరిస్థితులు ప్రతికూలిస్తే వాటినుంచి విడివడగలను" అని చాలా కాలం ఆటలు ఆడలేము. ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవడం వలన మనం ఎట్టి ఆనందాన్నీ కోల్పోము. కానీ వాటితో తాదాత్మ్యం చెందితే మనం ఆనందం నష్టపోతాం. అలాగే ఇతరులకు మనకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఆనందం కలుగుతుంది; అలా కాక పోతే విచారం కలుగుతుంది. యుక్త వయస్కులు భౌతిక పరమైన బంధాలను కోరుకుంటారు. వారికి పరస్పర అవగాహన, ప్రేమ, గౌరవం తో కూడిన బంధం కాల క్రమేణా కలగగలదనే వివేకం లేదు. భౌతిక బంధాలు ఎన్నో ప్రమాణాలు చేస్తుంది. కానీ ఆద్యాత్మిక బంధం జీవితాంతం ఆనందాన్ని ఇస్తుంది. 128

Viveka Sloka 50-51 Tel Eng

Telugu English All శిష్య ఉవాచ:- ప్రశ్న నిరూపణము కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా । యదుత్తరమహం శ్రుత్వా కృతా...