Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 4

Bhagavat Gita

3.4

కర్మే౦ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ {3.6}

ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే

కర్మే౦ద్రియములను వశపరచుకొని మనస్సుతో శబ్దాది విషయములను చింతించు అవివేకి కపటవర్తుడని పిలువ బడుచున్నాడు

నేనొకమారు ఆలీ అక్బర్ ఖాన్ సరోద్ కచేరికి వెళ్ళ దలిచాను. దానికై రెండు రోజులు ముందునుంచీ నా మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నా మనస్సు కచేరి వైపు మళ్ళిపోయేది. అతి కష్టంతో నా మనస్సును అదుపులో పెట్టుకున్నాను. అందువలన కచేరీపై పూర్తిగా కేంద్రీకరించి ఆనందించేను.

మనం మనస్సుతో ఇంద్రియాలను నియంత్రించే సాధాన చేయలేదంటే శ్రీకృష్ణుడు మనల్ని మిథ్యాచార -- అనగా కపటి -- అంటాడు. ముఖ్యంగా సాధన మొదట్లో ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యాలి. అది క్రొత్తలో సాధ్యం కాదు. కానీ పట్టువదలకుండా ప్రయత్నిస్తే సాధ్యమవ్వచ్చు.

అటు తరువాత మనం ధ్యానంలో పరిపక్వమౌతే, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఉదాహరణకు మనము ధ్యానము చేసి ఇంద్రియాలు స్వాధీనంలో ఉన్నాయనే సంతృప్తితో బయటకు వస్తే, మళ్ళీ ప్రాపంచిక విషయాలలో మునిగి ఇంద్రియాలపై స్వాధీనం తప్పుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులు మన ధ్యాన పరిపక్వతకు పరీక్ష పెడతాయి. యోగుల జీవిత చరిత్ర చూస్తే మనకు తెలిసేది: మన ఆలోచనలను, మనస్సును ఎంత స్వాధీనంలో ఉంచుకొంటే, పరీక్ష అంత తీవ్రంగా ఉంటుంది. నేను విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఉన్నత విద్యార్థులకు పరీక్ష పెట్టేవాడిని. అప్పుడు వేరొక విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుని నియమించి, వారి చేత బాహ్య విషయాల గూర్చి పరీక్ష పెట్టమనేవాడిని. నేను అంతర్గత విషయాలను పరీక్షించేవాడిని. ఈ విధంగా ధ్యానంలో అనేక పరీక్షలు ఉంటాయి. కాముడు బాహ్య విషయాలపై పరీక్ష పెడితే, మనలో ప్రతిష్ఠితమైన దేవుడు అంతర్గతుడై పరీక్షిస్తాడు. ఈ రెండూ నెగ్గితే మనమెవరమో తెలిసికోవచ్చు. 156

Eknath Gita Chapter 3 Section 3

Bhagavat Gita

3.3

న కర్మణా మనారంభా నైష్కర్మ్య౦ పురుషో అశ్నుతే {3.4}

న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమదిగచ్ఛతి

మనుజుడు కర్మలను చేయకపోవుట చేతనే నైష్కర్మ్యమును పొందజాలాడు. కర్మములను వదిలినంత మాత్రమునను మోక్షమును పొందనేరడు

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్ {3.5}

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై ర్గుణైః

కర్మమును చేయక ఎవడును క్షణకాలమైనను ఉండలేడు. ప్రకృతి వలన పుట్టిన గుణముల చేత ప్రతి వాడును పరవశుడై కర్మల నాచరించుచునే యున్నాడు

ఆధ్యాత్మిక జీవితమంటే కఠోర శ్రమ పడనక్కరలేదని కాదు. మనం ధ్యానం, మంత్ర జపం ఎంత చేసినా, రోజూ కొంత కర్మ చెయ్యనిదే ఆధ్యాత్మిక స్థితి రాదు. మనము అనేక గత జన్మల ఋణాను బంధంతో పుట్టేము. దానిని తీర్చాలంటే ఎంతో పరిశ్రమ చెయ్యాలి. కొంత మందికి పదవీ విరమణ తరువాత ఇక పనికై ఆఫీసుకి వెళ్ళనక్కర లేదు. అయినప్పటికీ వారు ఏదో ఒక కర్మ ఆనందంగా స్వీకరించాలి. అలా కాకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం వెళ్ళలేము.

మనస్సు ఉద్రిక్తతతో, ప్రేరేపణతో ఉంటే మన దృష్టిని కర్మపై కేంద్రీకరించడం ఉత్తమం. అయితే మనకిష్టం లేని పనిమీద దృష్టి కేంద్రీకరించడం కష్టమే. కొందరు కళాకారులు, సృజనాత్మకతతో కూడి ఉన్న పనులే చేస్తామంటారు. నిజానికి వారికి శ్రమ పడడం ఇష్టంలేదు. మనకిష్టంలేని పని చేస్తే మనస్సు పరిపరి విధాల పోతుంది. అది ఎలాగంటే ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ ఒక బొమ్మను౦చి ఉంకో బొమ్మకు మారుతూ ఉంటాడు. ఇక బొమ్మలు లేకపోతే ఏడ్వడం మొదలెడతాడు. నా ఉద్దేశంలో మనకిష్టంలేని పని చెయ్యడానికై కొంత ప్రయత్నం చెయ్యాలి. ఇష్టాయిష్టాలు మనలోనే ఉన్నాయి గానీ; అవి పనియొక్క లక్షణం కాదు. మనము దృష్టి పూర్తిగా కేంద్రీకరించ గలిగితే పని ఇష్టంగా చెయ్యచ్చు. అలా చేయలేకపోతే పని భారమనిపిస్తుంది.

మనం పనిమీద దృష్టి కేంద్రీకరించి చేసినా, అప్పుడప్పుడు మన దృష్టి మారుతూ ఉంటుంది. అప్పుడు "నేను కేంద్రీకరిస్తున్నానా, లేదా?" అనే సందిగ్ద౦లో పడతాం. ఇలా మనం అంతర్ముఖులమై ఉంటే దానివలన పని మీద దృష్టి చెడుతుంది. మనము ప్రయత్నపూర్వకంగా పనిమీద దృష్టి కేంద్రీకరించి, క్రమంగా మన ఆసక్తిని పెంపొందించుకోవాలి. ధ్యానం మాత్రం చేస్తేనే ధ్యానాన్ని లోతుగా అనుభవించలేం. ధ్యానంతో పాటు కొంత వ్యాయామం, క్రమశిక్షణతో పనులు చేయడం, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూడడం, తగినంత విశ్రాంతి అవసరం. ఈ విధంగా రాజ యోగాన్ని-- అనగా ధ్యానం -- కర్మ యోగాన్ని -- అనగా స్వార్థం లేకుండా పనుల చేయడం--కలిపి ఆచరించగలం.

గాంధీ మహాత్ముడు ఆధ్యాత్మిక జీవితమంటే స్తబ్దుగా ఉండడమనే అభిప్రాయాన్ని తుడిచివేశారు. ఆయన జీవితం నిస్వార్థ సేవ చేస్తూ, ఆధ్యాత్మిక సాధన చేయడమనే కౌశల్యం అందరికీ అందుబాటులో ఉందనడానికి తార్కాణం.

నైష్కర్మ్య -- అనగా కర్మ చెయ్యకుండా ఉండడం-- స్థితి శ్రీ రమణ మహర్షి లాంటి వారికే సాధ్యం. ఎవరైనప్పటికీ ఆయన వద్దకు సంశయాలతో వస్తే వారిని సంతృప్తి పరిచేవారు. ఆయనకు ప్రాపంచిక విషయాలతో సంబంధంలేదు. ఆయన ఎన్నడూ ఒక తప్పు పని చెయ్యలేదు. శ్రీ రామకృష్ణ లాగే చిన్న వయస్సులోనే జ్ఞానోదయం పొంది జీవితాంతం పరిశుద్ధుడుగా ఉన్నారు. కొందరు పాశ్చాత్యులు "మీకు ఉత్పాదకమైన జీవితం గడపాలని ఉండదా?" అని అడిగితే ఆయన నవ్వి ఊర్కొనేవారు. అలాగ ఆయన దైవత్వం ఎల్లలు దాటింది.

నైష్కర్మ్య అందరికీ ఇష్టమైనది. కానీ ఏ పనీ చేయక, మానవాళిని ఉద్దరించవచ్చనుకుంటే అది తప్పుడు ఆలోచన. అందుకే శ్రీకృష్ణుడు కర్మలు చేయకుండా ఆ స్థితిని పొందలేమని ఘంటాపథంగా చెప్తున్నాడు.

అర్జునుని సందేహం: "కాషాయం ధరించి, రుద్రాక్ష మాల వేసికొని, ఊరూరూ తిరుగుతూ, కీర్తనలు పాడుతూ, గుడిలో పడుకొని, బిచ్చమెత్తుకొని తిరిగితే అది నైష్కర్మ్య కాదా?"

శ్రీకృష్ణుడు న చ సన్న్యశానా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి అంటాడు. అనగా అన్నీ పరిత్యజిస్తేనే గాని సంపూర్ణత రాదనుకోవడం మిథ్య. మనం హిమాలయాల కెళ్ళి కొన్నేళ్ళు తపస్సు చేసినా నైష్కర్మ్య స్థితి పొందలేము.

కర్మ ఋణ విముక్తులమవ్వడానికి కూడా ఆచరించాలి. ప్రతి అణువులో నిక్షిప్తమైన చిత్రగుప్తుడు మన సత్కర్మలు, దుష్కర్మలు లెక్క పెడుతున్నాడు.

నేను ఒకమారు పరిశ్రమవేత్తలకు ధ్యానం మీద ఉపన్యాస మివ్వడానికి వెళ్ళేను. ఉపన్యాసం తరువాత భోజనాల కార్యక్రమం మొదలయింది. నేను శాఖాహారినని తెలిసి "మీరు పాశ్చాత్య దేశాలన్నీ తిరిగి ఇంకా శాఖాహారమే తింటున్నారా?" అని అడిగేరు. నేను ఒక్కడినే కాదు; నా మిత్రులను కూడా శాఖాహారులను చేసేను అని చెప్పేను. ఒక క్రిస్టియన్ "బహుశా కర్మ సిద్ధాంతం హిందువులకు, భౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. క్రిస్టియన్ లకు వర్తించదేమో" అని అడిగేరు. అలా అయితే నేను హర్షించేవాడిని. కానీ జీసస్ "నువ్వు ఏ విత్తు నాటితే, ఆ పంట పొందుతావు" అని చెప్పెను. ఇతరులకు కష్టనష్టాలు కలిగిస్తే మనకూ అవే కలుగుతాయి. అలా కాక ఆనందం పంచిపెడితే మనమూ సుఖాలనుభవిస్తాము.

సుఖదుఃఖాలు, ఆనందవిషాదాలు మనం చేసికొన్న కర్మలవలననే అని తెలిసికోవడం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మనలో అనేకమంది "నా తలిదండ్రులు నన్నిలా చేసేరు; నా సహధర్మచారిణి, పిల్లలు, సమాజం నన్నిలా చేసేరు" అని అంటారు. అది కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం. మనమే పరిస్థితుల్లో, ఏ దేశంలో బ్రతుకుతున్నా మనకో ఎన్నిక ఉన్నది: నా లాభానికై, ఆహ్లాదానికై పనిచేయాలా లేదా పరుల ఆనందానికై, మేలుకై పాటుపడాలా? 165

Eknath Gita Chapter 3 Section 2

Bhagavat Gita

3.2

శ్రీ భగవానువాచ:

{3.3}
లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా అనఘ

జ్ఞానయోగేన సా౦ఖ్యానాం కర్మయోగేన యోగినామ్

అర్జునా! ఈ లోకమునందు సా౦ఖ్యులకు జ్ఞాన యోగము, యోగులకు కర్మ యోగము అను రెంటిని మొదట నేనే చెప్పియుంటిని.

పూర్వ కాలంలో పర్యావరణం శుద్ధంగా ఉండి, పోటీ తక్కువగా ఉండి, జీవితం సులభంగా సాగిపోతున్నప్పుడు, దేవుడు ఆత్మ జ్ఞాననికై రెండు మార్గాలు బోధించేడు. ఎవరైతే అందరితో కలిసి మెలిసి, జీవైక్యత నెరిగి, నిజానికి, మిథ్యకి మధ్యనున్న బేధం తెలిసి ఉన్నారో వారికి జ్ఞాన మార్గం సూచించేడు. అర్జునుడు వీరుడు కాబట్టి శ్రీకృష్ణుడు వానికి కర్మ యోగము సూచించెను. నేటి కాలంలో పోటీ ఎక్కువై, ప్రసార మాధ్యమాల వలన ప్రభావితమై, జ్ఞాన యోగం పాటించడం మిక్కిలి కష్టమైంది. శ్రీ రమణ మహర్షి లాంటి వారికి మాత్రమే అది సాధ్యం. కర్మ యోగం కూడా కష్టమే. కానీ మన చుట్టూ కష్టాలతో కూడిన మనుష్యులను చూస్తూ ఉన్నప్పుడు, వారి కష్టాలను గట్టెక్కించడానికి నిస్వార్థ సేవ చెయ్యాలి.

యోగులు చెప్పేది: బహిర్ముఖులు ఎక్కువ ధ్యానం చెయ్యాలి; అంతర్ముఖులు ఎక్కువ కర్మ చెయ్యాలి. కొన్ని రోజులు మనం కర్మ చెయ్యడానికి విముఖతతో ఉంటాము. అలా౦టప్పుడు ధ్యానం చేయాలనుకొంటాం. కొన్ని గంటలు ధ్యానం చేసి తిరిగి కర్మ చెయ్యడమే ఉత్తమం. కఠోర పరిశ్రమ చేస్తే మనస్సు బాహ్యంగా ప్రసరించి మనలను స్వస్థతతో, ఆనందంతో, నిస్వార్థంతో, ఆధ్యాత్మికతతో ఉంచుతుంది. అది ఎక్కువగా యువకులకు పనికివస్తుంది. వారిలో ఒత్తిడి లేకపోతే, డబ్బుకై, ప్రతిష్ఠలకై ఆశ లేకపోతే, వారిలోని ఉద్రిక్తత తగ్గుతుంది.

కొందరు కర్మలు సదా చేస్తూ ఉంటారు. వాళ్ళ పనులన్నీ పూర్తి చేసి, ఇంకా నిద్ర పోవడానికి సమయం ఉంటే అసంతృప్తితో ఉంటారు. అటువంటి కర్మను శ్రీకృష్ణుడు హర్షించడు. ఎవరైతే సదా కర్మలు చేస్తూ ఉంటారో, కర్మలు చేయడానికై నిర్బంధించుకుంటారో, తమ కర్మలని ప్రక్కకు పెట్టలేరో, వారికి ధ్యానమెంతో అవసరం.

ఎప్పుడైతే బద్దకం ఆవహిస్తుందో, అప్పుడు కర్మ చెయ్యడం ఉత్తమం. తమస్ ను రజస్ తోనే ఎదిరించాలి. అదే రజస్ ఎక్కువైతే తమస్ తో కాక, సత్త్వ గుణంతో ఎదుర్కోవాలి. దీనికి కొంత స్వీయజ్ఞానం అవసరం. అలాగే ఇష్టాయిష్టాలనుండి స్వతంత్రంగా ఉండాలి. 150

Eknath Gita Chapter 3 Section 1

Bhagavat Gita

3.1

అర్జున ఉవాచ

జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధి ర్జనార్థన {3.1}

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ

జనార్థనా! కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమని నీ అభిప్రాయ మగునేని, ఓ కేశవా! నన్నీ భయంకరమైన కర్మయందు ఎందులకు నియమించుచున్నావు?

వ్యామిశ్రే ణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే {3.2}

త దేకం వద నిశ్చిత్య యేన శ్రేయో అహ మాప్నుయామ్

మిశ్రమ వాక్యముల చేత నా మదిని కలత పెట్టుచున్నావు. అందుచేత నేను దేనిచేత శ్రేయమును పొందుదునో అట్టి దానిని నాకు నిశ్చయించి చెప్పుము

అర్జునడు శ్రీకృష్ణుని జనార్ధన (అనగా జనులను ఉత్తేజ పరుచువాడు) అని సంబోధించి ఇలా పలికెను: నీవు ఆధ్యాత్మిక జీవనం ఆత్మ జ్ఞానానికి ఉత్తమమైన మార్గమని చెప్పితివి. అయితే నా కోర్కెలును నియంత్రించి, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోమని ఎందుకు చెప్పుచున్నావు? నాకు ఆధ్యాత్మిక జీవన మార్గమును బోధించి ఇంద్రియ విషయాలను ప్రక్కన పెట్టు. ఆత్మ గురించి వివరించు. నేను ఇంద్రియములకే పరిమితము కాదని తెలిసికొన్నాను.

అర్జునడు జ్ఞానం మరియు కర్మ వేర్వేరు మార్గాలని అనుకొంటున్నాడు. సెయింట్ ఫ్రాన్సిస్ మన కర్మ ఎంత లోతో మన జ్ఞానము కూడా అంతే లోతు అని చెప్పెను. జ్ఞానానికి, పట్టుదలకి సంబంధం లేకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మన కర్మలలో విదితమౌతుంది.

అర్జునుడు బుద్ధిని ఉపయోగించి శ్రీకృష్ణుని బోధను అర్థము చేసికొనడానికి ప్రయత్నిస్తున్నాడు. బుద్ధి ప్రతి విషయాన్ని విభజన చేసేది. దాని పని విభజించడం, సంవర్గం చేయడం. అది దానికున్న సహజ లక్షణం. అది ఒక విశేషాన్ని సంపూర్ణంగా చూడక, విడివిడి భాగాలను మాత్రమే చూస్తుంది. దీనివలన ఆధ్యాత్మిక సాధనలో అనేక సమస్యలు వస్తాయి. శ్రీ రామకృష్ణని "దేవుడు వ్యక్తిగతమా, కాదా?" అని ఒకరు అడిగేరు. దానికి ఆయన సమాధానం రెండూ అని. ఆది శంకరుడు మొదట "దేవుడు రెండూ" అని, అటు తర్వాత "రెండూ తప్పే" అనేవారు.

అర్జునుడు ఇలా ఆలోచిస్తున్నాడు: "ఒకరు నాతో శ్రీకృష్ణుని మాటలు స్థిరంగా ఉండవని చెప్తే నేనే నమ్మేవాడిని కాను. కానీ ఇప్పుడు నేను వైరుధ్యం చూస్తున్నాను. ఇది దేవునికి తగని లక్షణము". బుద్ధిం మోహయసీ వ మే: నా బుర్ర తిరిగుతున్నాది. నేను గత 18 శ్లోకాలు విన్నాను. వాటిని వినేముందు నేనెవర్నో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీవెవరో, నేనెవరో తెలియటంలేదు. " నిశ్చిత్య అనగా --" సరిగ్గా ఆలోచించు. ఊహాతీతమైన జ్ఞానంతో మాట్లాడవద్దు. నాకు ఒకే ఒక కర్తవ్యం బోధించు. స్థిరముగా ఉండు." అర్జునుడు స్థిరమైన మార్గదర్శకత్వం కోరుతున్నాడు. లేకపోతే మనలాగే అతడూ దిగ్భ్రమ చెందుతాడు.

ఈ తబ్బిబ్బు ఆధ్యాత్మిక జీవనం మొదట్లో కలుగుతుంది. ధ్యానం చేస్తే అతీతమైన శక్తి కలుగుతుంది. దీన్నే ప్రజ్ఞ అంటారు. అంటే దృఖు, దృశ్యం, ద్రష్ట అనే త్రిపుటి ఉండదు. ధ్యానంతో మనకున్నా సమస్యల్లో చాలామటుకు పరిష్కరించుకోగలం. ధ్యానం వలన మన కష్టాలకి కారణాన్ని విశ్లేషించకుండా, వాటిపై కేంద్రీకరించక, వాటి గురించి మాట్లాడక ఉంటాము. కొన్నేళ్ళు ధ్యానం అలవాటు చేసికొంటే మనల్ని నిద్రలో కలత పరిచే భౌతిక లేదా మానసిక సమస్యలు వీడి పోతాయి. అటు తరువాత అహంకారాన్ని వీడి సమస్త దుఃఖాలను పోగొట్టుకుంటాము. 149

Eknath Gita Chapter 2 Section 48

Bhagavat Gita

2.48

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ నైనా౦ ప్రాప్య విముహ్యతి {2.72}

స్థిత్వా అస్యా మంతకాలే అపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి

అర్జునా! ఇదియే బ్రహ్మీ స్థితి. దీనిని పొందిన వాడు మోహము నొందడు. అంత్యకాలమున కూడ ఈ యోగమునందు నిలిచి బ్రహ్మప్రాప్తిని పొందుచున్నాడు

అహంకారాన్ని జయిస్తే మనము శాశ్వతమైన స్థితిని పొందుతాము. ధ్యానం యొక్క పరాకాష్ఠ సమాధి స్థితి చేరినప్పుడు, మన దేహే౦ద్రియమనోబుద్ధులతో తాదాత్మ్యం చెందక, మనము ఆత్మ స్వరూపులమని తెలిసికొని, మరణాన్ని అతిక్రమించి, అమృతత్వాన్ని పొందుతాము. శ్రీ రామకృష్ణ తన ప్రియ శిష్యులతో మరణం అందరికీ కలుగదు అని చెప్పేరు. శ్రీ రమణ మహర్షి ఆత్మ జ్ఞానం పాఠశాలలో ఉన్నప్పుడే పొందేరు. అప్పుడు ఆయన పేరు వెంకటరామన్ -- మహర్షి కాదు. ఆయనకు ఆంగ్ల వ్యాకరణంలో పరీక్ష జరగబోతోందని తెలిసి, పాఠశాలకు వెళ్ళక ఇంట్లో సాధన చేసేరు. ఆ సాధనతో తన అహంకారాన్ని పోగొట్టుకున్నారు. ఇదే నిర్వాణ మంటే: పరిమితమైన హద్దులతో వేర్పాటు చెంది మన నిజమైన, శాశ్వతమైన ఆత్మ స్వరూపాన్ని దర్శించడం.

ధ్యానం ఎంతో కాలం చేస్తే మన ప్రాణ శక్తిని గతం నుంచి, భవిష్యత్ నుంచి వెనక్కి తెచ్చుకోగలం. సమాధిలో గతం, భవిష్యత్ ఉండవు--ప్రస్తుత కాలంలో ఉంటాము. ఈ విధంగా ఉండగలిగితే అమృతత్వాన్ని ఇక్కడే, ఇప్పుడే పొందగలము. ఇలా సాధన చేసిన యోగులు చెప్పేది: అఖండమైన చేతన మనస్సుతో కాలం నుండి విముక్తులమై, దాని నుండి శాశ్వతమైన స్థితి పొందుతాము.

నా గ్రామంలో ఒక కొలను ఉంది. దాని చరిత్ర ఏమిటంటే--శ్రీ రాముడు, సీతాదేవి అరణ్యవాసం చేస్తున్నప్పుడు, సీతమ్మకి దాహం కలిగి శ్రీ రాముని నీరు తెమ్మ౦ది. అప్పుడు శ్రీ రాముడు ఒక బాణం భూమివైపు సంధించి విడిచి, భూమి నుండి జలాన్ని బయటకు తెచ్చేడు. నా అమ్మమ్మ ఒక అర్థ శతాబ్దం ఆ కొలనులో స్నానం చేసి, అక్కడి శ్రీ రాముని పాదుకలను భక్తితో సేవించేది. నా అమ్మ చెప్పడం, ఆమె భూమి మీద ఆఖరి క్షణాల్లో "నేను రాముని పాదాలు పట్టుకొన్నాను" అన్నదట.

మరణం ఆసన్నమైన అనుభవం గూర్చి అమృతత్వాన్ని పొందిన అనేక యోగులు అనేక విధాలుగా వర్ణించేరు. మన చైతన్యాన్ని అఖండం చేసికోకుండా, కాలానికి బానిసగా ఉండి, వంద లేదా వెయ్యేళ్ళు బ్రతికినా సంతృప్తి ఉండదు. మనకు కావలసినది అమృతత్వం. 146

Eknath Gita Chapter 2 Section 47

Bhagavat Gita

2.47

విహాయ కామాన్ యస్సర్వాన్ పుమా౦ శ్చరతి నిస్పృహః {2.71}

నిర్మమో నిరహంకార స్స శాంతి మధిగచ్ఛతి

సమస్తమైన కోరికలను త్యజించి, వానియందు స్పృహలేనివాడై, మమకార అహంకారములను విడనాడి చరించు పురుషుడు శాంతిని పొందుచున్నాడు

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అన్ని కలహాలు పరిష్కరించే, అన్ని కోరికలను తీర్చే, అన్ని భయాలను దూరం చేసే శాంతిని పొందే మార్గం బోధిస్తున్నాడు. మన చేతన మనస్సులో ఒక చీలిక ఉంది. దాని వలన మనం పూర్తిగా ప్రేమతో లేక విశ్వాసంతో ఉండలేము. స్పర్థలు ప్రేరేపించి, అవిశ్వాసంతో ఇతరులతో వేర్పాటు చేసే విధంగా ప్రవర్తిస్తే ఆ చీలిక మన చేతన మనస్సును రెండు భాగాలుగా చేస్తుంది. ధ్యానం ఆ రెండు భాగాలనూ ఏకం చేసి అఖండంగా చేస్తుంది. ధ్యానం ద్వారా పొందేది: మన హృదయంలోని, మనస్సులోని చీలికలను తొలగించడం; బాహ్యంగా మనల్ని కుటుంబంతోనూ, సమాజంతోనూ, ప్రపంచంతోనూ వేర్పాటు కలిగించే నిరోధాలను తొలగించడం.

మన చేతన మనస్సును ఏకం చెయ్యాలంటే మనమెవరియందూ అవిశ్వాసంతో ఉండకూడదు. ఉదాహరణకు మన తలిదండ్రుల యందు అవిశ్వాసంతో ఉంటే అది మన బంధుమిత్రుల యందు కూడా వ్యాపిస్తుంది. చిన్న వయస్సు నుంచీ ప్రేమను, విశ్వాసాన్ని ఏకం చేసే విధానాన్ని నేర్చు కోవచ్చు. అలాకాకపోతే ఇంటిని వదిలి బయట ప్రపంచంలోని సమస్యలతో లావాదేవీ పెట్టుకుంటే అవిశ్వాసం మన బంధాలను ప్రభావితం చేస్తుంది.

అవిశ్వాసం బుద్ధునుకి అనేక ఇబ్బందులు కలిగించింది. పీటర్ జీసస్ తో "మీయందు ఎప్పుడూ విశ్వాసంతో ఉంటాను" అని చెప్పేవాడు. కానీ జీసస్ "కోడి కూసేముందు నీవు నన్ను మూడు మార్లు ధిక్కరిస్తావు" అనెను. అవిశ్వాసం చీలికలు తెస్తే, విశ్వాసం ఐకమత్యాన్ని కలిగిస్తుంది. ప్రతి బంధంలోనూ పూర్తి విశ్వాసాన్ని కల్పించుకోగలం. నేనిది కుటుంబ నేపధ్యంలో చెప్పడం ప్రతి ఒక్కరూ వివాహం చేసికొని, పిల్లల్ని కనమని కాదు. ఎక్కడ మిత్రులు కలసి ఉంటారో, ఎక్కడ మనం పని చేస్తూ ఉంటామో, అవి కూడా కుటుంబాలే. మనం ఎవరో ఒకరిని ముందు పెట్టవచ్చు; మిత్రుడు లేక పోతే, మనం ఒక శత్రువును ఎన్నుకోవచ్చు. వాని మీద పగ తీర్చుకోకుండా వాని సమస్య యొక్క పరిష్కారం చెయ్యగలిగితే మన మధ్యనున్న చీలిక పోయి, ఐకమత్యాన్ని అనుభవిస్తాం. సెయింట్ ఫ్రాన్సిస్ "ఎవరైతే తమ శత్రువులను క్షమించలేరో వారు ఆనందాన్ని పొందలేరు" అని అన్నారు.

మన వివాహాలు, తద్దినాలు "ఓం శాంతి, శాంతి, శాంతి" అని అంతమవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శాంతిని పొంది తరించాలి. అది మాటలతో వ్యక్తపరచబడలేనిది. ప్రతి రోజూ మనం చేసే ధ్యానం మనల్ని శాంతికై తయారు చేస్తున్నాది. మీరు తక్కువ నిద్రతో, మనస్సు నిగ్రహం లేక, మంత్ర జపం సరిగ్గా చేయకపోయినా మీరు శాంతి వైపు పయనం సాగిస్తున్నారు. భౌద్దులు చెప్పేది నమనస్కం -- అంటే మనకు ఇంద్రియాలతోనూ, బుద్ధితోనూ సంబంధం లేకుండా సమ స్థితిలో ఉండడం. యోగులు ఇటువంటి సహజమైన జ్ఞానం బుద్ధి యొక్క పరిమితులను దాటి ఉంటుందని అంటారు.

శాంతిని పొందడానికి చాలా కాలం పడుతుంది. ఆ అనుభవం కొద్దిగా ఉందంటే మనస్సు కొన్ని క్షణాలు పనిచేయలేదు. ప్రతి చోటా నిశ్చలత్వం, నిశ్శబ్దం ఉండి మనని ఆహ్లాద పరుస్తాయి. అట్టి అనుభవం దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని -- అనగా అహంకారం తప్పించి అన్నిటినీ--ఉపశమనం చేస్తుంది. శాంతి అంటే మనము ప్రేమ స్వరూపము కాగల శుద్ధమైన స్థితి. మన ప్రేమ ఒక వ్యక్తి మీదే కాక, సర్వ జీవ సమైక్యతకై ఉంటుంది.

నిస్పృహ -- అంటే ఇంద్రియ చాపల్యం లేకుండా, బాహ్య ప్రపంచం వలన సంతృప్తి పడాలనే కోర్కె లేక పోవడం. క్రమక్రమంగా ఒక్కొక్క కోరికను వదిలేయాలి. అందుకే ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవడానికి చాలా కాలం పడుతుంది. మనలో చాలా మంది ధనార్జన, లేదా పేరుప్రతిష్ఠల వలన ఆనందం కలుగుతుందని అనుకొంటాము. కానీ పతంజలి ఇలా చెప్పేరు: మనం ఆనందాన్ని ఎందుకు పొందేమంటే ఒక కోరిక తాత్కాలికంగా తీరి, ఉంకో కోరిక రావడానికి తగినంత సమయం లేదు. మనస్సు తాత్కాలికంగా కోరిక లేకుండా ఉంటుంది. మనస్సు నిశ్చలంగా ఉంటేనే ఆనందం కలిగేది. అప్పుడు మనం శాంతిని అనుభవిస్తాం. కొన్నాళ్ల తరువాత ఉంకో కోరిక వస్తుంది. ఈ విధంగా చక్రం సాగుతూ ఉంటుంది. నేను తాత్కాలికమైన ఆనందం ఉపశమనం కలిగించదని అనను. కానీ మనము ఒక కోర్కెకు లొంగితే, తరువాత వచ్చేది మరింత శక్తివంతమైనది. ఇలాగ మన స్వార్థ పూరిత కోర్కెలను తీర్చుకొంటూ ఉంటే, కోర్కెకి, కోర్కెకి మధ్య కాలం తగ్గి మనమనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం.

బాహ్య ప్రపంచ వస్తువులకై ఉన్న ఆకాంక్ష ప్రాణ శక్తిని ప్రభావితం చేస్తుంది. మనము బజారులో ఏమీ కొనకుండా తిరుగుతూ, ఒక వస్తువుని కాంక్షించినా, లేదా ఒక వ్యక్తిపై అసూయ చెందినా మన ప్రాణ శక్తి క్షీణిస్తుంది. నిస్పృహ స్థితిని పొందాలంటే "ఇది నాకు అవసరమా?" అని ప్రశ్నించగలగాలి.

శ్రీకృష్ణుడు నిర్మమో అంటాడు. నేను అనే అహంకారం వలన మిత్రుల్ని దూరం చేసికొంటే, నాది అనుకోవడం కూడా అంతే. రాజకీయాలలో ఇది బాగా వర్తిస్తుంది. నాది అని ఎప్పుడైతే ధృడంగా పాతుకుపోతుందో, దానికై యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. జీసస్ "శాంతి దూతలు భగవంతుని పిల్లలు" అని చెప్పెను. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పేడు. మనము మిత్రులకు, సంఘాలకు, దేశాలకు, శత్రువులకు మన జీవితాన్ని ఆదర్శప్రాయంగా చేసి చూపించి, వారి మధ్య శాంతిని నెలకొల్పవచ్చు.

నిర్మమో అని చెప్పడంలో ఇంకో విశేష మేమిటంటే దేవుడు మనకీ వనరులు, జీవితం ఎందుకు ఇచ్చేడంటే మనల్ని భూమి యొక్క రక్షకులుగా చేయడానికి. శ్రీకృష్ణుడు ధర్మ కర్త, యజమాని. మనము అద్దెకు౦టున్న వారలము. మన అద్దె ఇల్లును సరిగ్గా వాడకపోతే ఇంటి యజమాని మనల్ని తరిమేస్తాడు. కానీ దేవుడు మనం చేసే ఆగడాలను కొంతవరకు క్షమిస్తాడు; మన దగ్గర నుంచి అద్దె తీసికోడు. మన నుండి ఆయన కోరేది పరులకై బ్రతకడం. కానీ మన గురించే బ్రతికి, ఆయనను మన స్వార్థ పూరిత కోర్కెలను తీర్చమని అడుగుతాం. మనం నీరు, గాలి ఎప్పుడూ ఉండి మనకు ఉచితంగా ఇవ్వబడ్డాయని అనుకొంటాం. నేటి కాలంలో ఆ వనరులు పరిమితమైనవని తెలిసికొ౦టున్నాం. అందుకే వాటిని సద్వినియోగం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం. పర్యావరణాన్ని, నీటిని, గాలిని అశుద్ధం చేస్తే, అవే భావి తరాలకు మనమిచ్చే ఆస్తి.

నిరహంకార -- సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి తన అహంకారాన్ని జయించేడు అని చదివేను. జీసస్ తానెవరనే ప్రశ్నకి సమాధానం కావలిస్తే తనను తాను పోగొట్టుకోవాలి (అహంకారాన్ని విడవాలి) అని చెప్పెను. హెరత్ కి చెందిన అన్సారీ అనే సూఫీ ఇలా చెప్పెను: నిన్ను నీవు పోగొట్టుకొంటే -- అంటే అహంకారాన్ని తుడిచి వేస్తే -- నీ ప్రేమికుడ్ని చేరుతావు. దీనికంటే వేరే రహస్యమేమీ లేదు. నా కింతకన్నా ఎక్కువ తెలీదు.

మన అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే నేను అనే భావాన్ని వదులుకోవాలి. అది మనల్ని ముఖ్యమైనవారలుగా, ప్రతి ఒక్కరి దృష్టిలో అపురూపమైనవారలుగా చిత్రీకరిస్తుంది. నేనున్న బెర్క్ లీ ప్రాంతంలో యుక్త వయస్కుల చేష్టలు చూసి నవ్వుకుంటాను. ఒక యువకుడు వాహనం మీద పియానో వాయిస్తూ అందరి ద్రుష్టినీ తనవైపు త్రిప్పుకున్నాడు. అలాగే కొందరు విచిత్రమైన దుస్తులు వేసికొని బయట తిరుగుతారు. అవే చిన్న పిల్లలు చేస్తే ఫరవాలేదు. కానీ పెద్దవాళ్లకు అటువంటి ప్రదర్శన అక్కరలేదు. మనము మనలోని ప్రేమ స్వరూపుడైన భగవంతుని దృష్టిని ఆకర్షించాలి. అది మంత్ర జపంవలన సాధ్యం. అలా చేస్తే మనం భద్రత ఎక్కడినుంచో వచ్చి మన మీద వాలటంలేదని తెలుసుకొంటాము. దేవుడు మనలో ప్రతిష్ఠితమై ఉన్నందువలన మనమంతా ముఖ్యులమే. మనము ఒకరిలాగ, వాళ్ళ ననుకరించి ఉండాలనే పగటి కలలు కననక్కరలేదు. మనము మన సహజ స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలం. అలాగే మనం శాంతి మనలోనే ఉందని తెలుసుకొంటే, ప్రేమ మన౦ ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తుంది. 144

Eknath Gita Chapter 2 Section 46

Bhagavat Gita

2.46

అపూర్యమాణ ప్రవిశంతి మచల ప్రతిష్ఠ౦

సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ {2.70}

తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే

స శాంతి మాప్నోతి న కామకామీ

నీటిచే పూర్ణముగా నిండినదియు, నిశ్చలమైనదియు నగు సాగరమును నదీజలము మొదలగునవి ఎలా ప్రవేశించుచున్నవో అలాగే విషయము లన్నియు ఏ యోగయుక్తుని పొంది తద్రూపమై పోతున్నవో అతడే శాంతిని పొందుచున్నాడు. విషయలోలుడు శాంతిని పొందలేడు

అపూర్యమాణమ్ అనగా సంపూర్ణమైనది. ఇది మన లక్షణం. మనమనుకుంటాం డబ్బు, ఆనందం ఉంటేనే మనము పూర్ణులమని. మనము పుట్టుకతోనే సంపూర్ణులం. దాని నుండి తీసికొన్నా అది పూర్ణమే. మనము అహంకార పూరితులమై బ్రతికినంత కాలం పూర్ణత్వం, భద్రత మనలోనే ఉన్నాయని గ్రహించం. మనలోని అగాధాన్ని ఆత్మ జ్ఞాన మొక్కటే పూరించ గలదు.

బుద్ధుడు అహంకారులు దుఃఖాలను అనుభవిస్తారని చేప్పేడు. దుఃఖానికి (దు: అనగా చెడ్డ; ఖ అనగా రంధ్రం) పర్యాయ పదం అగాథం. మనలోని అగాథాన్ని పూరించడానికి సొమ్మును కట్టలు కట్టలుగా తెచ్చి వేస్తాం. కాని అది పూరింపలేని అగాథం. మన డబ్బు, వస్తువులు, ఆనందం, ప్రతిష్ఠ అంతా అందులో వేసినా అది పూరింప బడదు. మనము దాన్ని పూరించలేమని గ్రహించిన తరువాత సెయింట్ అగస్టీన్ చెప్పిన "భగవంతుడా, నీలో విశ్రాంతి తీసికోవడానికి ప్రయత్నిస్తున్న నేను వేరొక చోట ఎలా విశ్రాంతి పొందగలను?" అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పేది: క్షణిక సుఖాన్నిచ్చే విషయాల గూర్చి జీవితాన్ని ఎందుకు వృధా చేసుకొంటావు? నీకు వాటి అవసరం లేదు. నువ్వు నా కారణాన సంపూర్ణుడవు. నీ అంతర్గతం పరీక్షించుకొంటే నన్నే పొందుతావు.

అచలప్రతిష్ఠమ్ అనగా నిశ్చలంగా ఉండడం. ఇది బ్రహ్మన్ --అనగా సృష్టి కర్త -- యొక్క నిశ్చలత్వం. మనం మార్పులేని, నిశ్చలమైన భగవంతుని ప్రతిష్ఠి౦చుకోవాలంటే మన మనస్సును నిశ్చలం చేసికోవాలి. మనస్సును ఎక్కువగా సముద్రంతో పోలుస్తారు. సముద్రం ఉపరితలంలో అలలు, గాలులు ఉండి అలజడి కలిగించినా, సముద్ర గర్భంలో అలలు, గాలులు లేక ప్రశాంతంగా ఉంటుంది. మన అచేతన మనస్సులోని భగవంతుని తెలుసుకోవాలంటే ధ్యానం ద్వారా మనస్సును నిశ్చలం చేసికోవాలి.

నేను కొన్నేళ్ళ క్రితం మనస్సుని ఎలా నిశ్చలం చేసికోవాలి, ఊహాతీతమైన జ్ఞానం గూర్చి మాట్లాడుతున్నప్పుడు కొందరు ఇలా అడిగేవారు: "మనం తర్కాన్ని ఉపయోగిస్తాం. మనకు విజ్ఞానం, సాంకేతిక శాస్త్రం తెలుసు." మనం వాటికి తగినట్టు ఉంటే మంచిదే. కానీ మనస్సు వాటితో అనుసంధాన మవ్వదు. మనస్సు స్వతహాగా చంచలం. మనలోని ఒత్తిడి, నిరాశ, వైరం, అలసట, పట్టుదల లేకపోవడం మనస్సు నిరంతరం పనిచెయ్యడం వలన. ఎవరైతే క్రమశిక్షణ లేకుండా పనులు చేస్తారో, రాగద్వేషాలతో కూడి ఉంటారో వారి ప్రాణశక్తి వృధా అవుతుంది. మనకి ద్వేషముంటే, కలల్లో కూడా, ప్రాణ శక్తి వృధా అవుతుంది. కొందరు 8 గంటలు పడుకొని, ఉదయాన్నే లేచి "నేను ఎందుకు ఇంకా అలసటతో ఉన్నాను?" అని అనుకొంటారు. ప్రాణ శక్తి వృధా అవుతూ ఉంటే మనకు కలిగేది బలహీనత, నీరసం. అందుకే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

మనమెప్పుడ ధ్యానంలో పూర్ణత్వం, నిశ్చలత పొందుతామో అప్పుడు అమిత సంతృప్తి కరమైన స్థితి కలుగుతుంది. అంటే కొంత కాలం మనస్సు, ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో వ్యాపారం పెట్టుకోవు. దీనినే బుద్ధుడు శూన్యత అంటాడు. అక్కడ రాపిడి, అసఖ్యత, వేర్పాటు ఉండవు. దాన్నే యోగులు పూర్ణత అంటారు.

మనమెంత ఆధ్యాత్మిక సాధన చేసినా అప్పుడప్పుడు మనస్సులో కోర్కెలు కలగవచ్చు. ఎందుకంటే మనము మానవ మాత్రులము కాబట్టి. అలా కోర్కెలు కలిగినప్పుడు వాటిని పట్టించుకోక, వాటి ప్రోద్భలంతో కర్మలు చేయక ఉండాలి. కోర్కెలు, నదులు సముద్రం వైపు ప్రవహిస్తున్నట్లు, వస్తాయి. కానీ సముద్రమెలా నిశ్చలంగా ఉంటుందో మనమూ అలాగే ఉండాలి. మనము ఇతరులకు సేవ చెయ్యక, స్వార్థంతో కూడి ఉంటే, పెద్ద పెద్ద అలలతో కూడిన ఒక కాలువ ఎలాగ గట్టును ధ్వంసం చేస్తుందో అలాగ మనలోని ఆలోచనలు అతలాకుతలం చేస్తాయి. అదే మనము ధ్యానముతో మన చేతన శక్తిని వాడుకొని, జీవైక్య సమానతని పాటిస్తూ ఉంటే మనవైపు గంగా నది వలె పొంగి పొరలే కోరికలు ఉదయించినా, సముద్రమెలాగ ఉంటుందో అలా నిశ్చలంగా ఉంటాం.

కామకామీ -- అనగా కోర్కెలను కోరేవాడు. మనమెంత సాధన చేసినా మనలో కామం అంత సులభంగా పోదు. మనము కామదేవుడు, లేదా మన్మథుడు, కామాన్ని కలిగించేవాడని నమ్ముతాము.

మదనో మన్మథో మారాః ప్రద్యుమ్నో మీనకేతనాః

కందర్పో దర్పకో అన౦గాః కామాః పంచశరాః స్మరాః

మన్మథుని ప్రభావం వలన మనము నిశ్చలంగా కూర్చోలేం, ఊపిరి సరిగ్గా తీసికోలేం, సరిగ్గా ఆలోచించలేం. ఇవన్నీ మనస్సులో కలిగే విషయాలు. మన్మథుని మర -- అనగా దెబ్బ కొట్టే వాడు -- అనికూడా అంటారు. అతడు శ్మర అనగా ఎప్పటికీ మరిచి పోనివ్వని వాడు. ఒక మారు కామానికి లొంగి లైంగిక కార్యాలు చేస్తే, వాటిని ఎన్నటికి మరిచిపోలేం. అవి మనస్సుని దొలిచేస్తాయి. పరమ శివుడు ఒక్కడే మనకు గతి. అతడు శ్మరారి అనగా శ్మర యొక్క శత్రువు. అతడే మనలో లైంగిక కార్యాల గురించి కలిగే ఆలోచనలను నియంత్రించి మన ప్రాణ శక్తిని కాపాడేవాడు. పంచశర అనగా 5 బాణాలు కలవాడు. మన్మథుడు మనమీద ఎప్పుడైతే బాణాలను ప్రయోగిస్తాడో మన౦ వాటిని తప్పించుకోలేం. మంత్ర జపమే మనకు శరణ్యం.

ఒక గాఢమైన కోరిక ఉదయం ధ్యానంలో వస్తే దాన్ని నియంత్రించుకొంటాం. కానీ అక్కడితో అయిపోక, అది రోజంతా మనల్ని వెంటాడవచ్చు. అప్పుడు మనము ధ్యానంలో పొందిన శక్తితో దాన్ని ఎదిరించి తరిమివేయ వచ్చు. ఇలాగ కోర్కెలు మనల్ని వెంటాడితే మనస్సుని నిశ్చలం చేసికొని, మంత్ర జపం చెయ్యడం ఉత్తమం. ఇదే జీవితంలోని పెద్ద సవాలు. మనము కోర్కెలను తరిమి వేస్తుంటే మన పట్టుదల పెరుగుతూ వస్తుంది. క్రమంగా మనకు తెలిసేదేమంటే: సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించిన సృష్టి కర్త మన కోర్కెలను నియంత్రించడానికి అపారమైన శక్తిని, మనోనిగ్రహతను ఇచ్చేడు. లైంగిక కార్యాలు దీనికి వ్యతిరేకం కాదు. అవి కుండలిని శక్తికి సంబంధించినవి. ఆ శక్తికి లోబడక, దానినే స్వాధీనం చేసికొంటే మనలోని సృజనాత్మక శక్తి ఉద్భవించి మనలను సత్కర్మలు చేయుటకు ప్రోత్సాహిస్తుంది. 140

Viveka Sloka 50-51 Tel Eng

Telugu English All శిష్య ఉవాచ:- ప్రశ్న నిరూపణము కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా । యదుత్తరమహం శ్రుత్వా కృతా...