Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 9

Bhagavat Gita

3.9

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్య౦తే యజ్ఞభావితాః {3.12}

తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః

యజ్ఞములచే తృప్తిచెందిన దేవతలు మీకు ఇష్టములైన భోగములను అనుగ్రహింతురు. వారిచ్చిన భోగములను వారికి సమర్పించక భుజించవాడు చోరుడగును

యజ్ఞ శిష్టాశిన స్స౦తో ముచ్యన్తే సర్వ కిల్బిషైః {3.13}

తే త్వఘం భుంజతే పాపా యే పచ౦ త్యాత్మకారణాత్

యజ్ఞ శేషమును భుజించు సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తి నొందుచున్నారు. ఎవరు తమ కొరకే వండు కొనుచున్నారో వారు పాపమునే భుజించుచున్నారు

శ్రీకృష్ణుడు ఎవరైతే, పరోపకారము చెయ్యకుండా, తమ ఆనందానికై, లాభానికై, లేదా పేరుప్రతిష్ఠలకై ప్రాకులాడుతారో వారిని స్తేన -- అనగా దొంగలు-- అంటున్నాడు. మనం చేసే కర్మలకు అతి గొప్ప కారణ౦: పరులకు చేసే సేవ. అందుకే దేవుడు మనకు జీవితం, సమయం, శక్తినిచ్చేడు.

నాలుక రుచికై తినడం, హోటల్ లలో తరచూ భోజనం చెయ్యడం, కనీవినీ ఎరుగని పదార్థాలు తినడం ఉత్తమం కాదు. సాత్త్వికమైన పోషకాహారము వండి, ప్రేమతో ఇవ్వబడినదైతే మన దేహాన్ని, మనస్సుని బలంగా చేస్తుంది. ఇది సాధనకు చాలా అవసరం.

పోషకాహారాన్ని తినడం తప్పు కాదు. కానీ దాన్ని అదే పనిగా తినక్కరలేదు. ధ్యానంలో మన మనస్సు చిరు తిండ్ల మీదకు పోతే అది విచారకరం. అలాగే తిండిగూర్చి సదా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు. చైనా దేశస్థుడు హుయా౦గ్ పో ఇలా అన్నారు: "భోజనం రెండు రకాలు: ఇంద్రియాలను మెప్పించేది లేదా జ్ఞానాన్ని పెంపొందించేది. దేహానికి ఆకలి కలిగితే, ఆశతో కాక, మితంగా తింటే అది జ్ఞానాన్ని పెంచేది. కానీ అదే పనిగా ఆహారాన్ని తింటూ ఉండడం మంచిది కాదు. కేవలం నాలుక కోరేదాన్ని తినడం ఇంద్రియాలను మెప్పించే తిండి".

మనము ఆహారం ద్వారా పొందే శక్తిని ఎలాగ ఉపయోగిస్తున్నామో కూడా ముఖ్యం. జీసస్ ఫారిసీస్ కు ఇలాగ బోధించేరు: "నోటిలో పెట్టుకునేది మనల్ని అపవిత్రులను చెయ్యదు; నోటి నుంచి బయటకు వచ్చేది మనకు ముప్పు తెస్తుంది." ఎంతో ఖరీదు పెట్టి రసాయనాలతో పండించని ఆహారం తింటూ కూడా, మన౦ హింస చేస్తూ; ద్వేషం, అసూయ వంటి గుణాలతో ఉంటే ఏమి లాభం? అదే మన శక్తితో దీనుల కన్నీళ్ళు తుడిచివేసి, పరోపకారం చేస్తే మన కళ్ళు వికసించి, మన జీవితం కష్టాలతో నిండి ఉన్న ప్రపంచానికి మార్గదర్శక మవుతుంది 164

Eknath Gita Chapter 3 Section 8

Bhagavat Gita

3.8

దేవాన్ భావయతా అనేన తే దేవా భావయంతు వః {3.11}

పరస్పరం భావయంత శ్శ్రేయః పర మవాప్స్యథ

ఈ యజ్ఞములతో మీరు దేవతలను పూజించండి. పూజింపబడిన దేవతలు మిమ్ములను సంతృప్తి పరచెదరు. ఈ విధముగ పరస్పరము వృద్ధి చేసికొనుచు మీరు ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుదురు

శ్రీకృష్ణుడు దేవ అనే పదాన్ని మన ముందు పెట్టేడు. దేవ అనగా దైవీ స్వభావం గలవాడు, లేదా మిక్కిలి కాంతితో కూడి ఉన్నవాడు. కళాకారులు ఒక ఋషి చిత్రం గీసినప్పుడు, తల చుట్టూ కాంతి వలయం గీస్తారు. అలాగే ఒక స్వార్థపరుడి చిత్రం గీస్తే నల్లని మబ్బు వాని తలచుట్టూ గీస్తారు. ఎలాగైతే ఋషి కాంతిని పెంపొందిస్తాడో, స్వార్థపరుడు చీకటిని కలిగిస్తాడు.

సంస్కృత గ్రంథాల్లో ఒక పురుషుడు స్త్రీని దేవి అని సంబోధిస్తాడు. దేవి అనగా పరా శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. మనమెప్పుడైతే ఒక స్త్రీని దేవి అని సంబోధిస్తామో ఆమె కరుణతో, సహనంతో, ఓర్పుతో మన యందు ఉంటుందని భావించవచ్చు.

మనయొక్క దైవత్వాన్ని ప్రతిరోజూ నడవడికతో ప్రదర్శిస్తే మనమందరమూ దేవ లేదా దేవి లమవుతాము. నేను పెరిగిన గ్రామంలో ఆడవారు ఉదయాన్నే లేచి తమ భర్తలకోసం, పిల్లలకోసం వంట వండేవారు. నాకు తెలిసి ఈ రోజుల్లో భార్య పడుకుంటే, భర్త ఆమెకై వంట చేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో భర్త భార్యను ప్రేమతో నిద్ర లేపి ఆమె చేతివంట తినాలని చెప్పాలి. నా ఊరిలో చిన్న బాలికలు తమ నాన్నలకు, తమ్ముళ్లకు, మామలకు, తాతలకు సేవ చేసేవారు. వాళ్ళు మగవాళ్లకు సేవ చేస్తూ తమని తాము మర్చిపోయేవారు. ప్రేమని పొంది, దాన్ని నిలబెట్టుకోవడం ఒక కళ అని చెప్పవచ్చు. కాబట్టి దానికై శ్రమించి, అందరి యందు ప్రేమతో ఉండి, అందరికీ సహాయం చేసి, దేవ లేదా దేవి అనిపించుకోవాలి. 162

Eknath Gita Chapter 3 Section 7

Bhagavat Gita

3.7

సహయజ్ఞాః ప్రజాసృష్ట్యా పురోవాచ ప్రజాపతిః {3.10}

అనేన ప్రసవిష్యధ్వ మేష వో అస్త్విష్ట కామధుక్

సృష్టికాలమున బ్రహ్మదేవుడు యజ్ఞముల తోడ ప్రజలను సృజించి, "ఈ యజ్ఞములచే మీరు వృద్ధి పొందుడు. ఇవి మీ కోర్కెలను నెరవేర్చును" అనెను

శ్రీకృష్ణుడు కామధుక్ --అనగా మన కోర్కెలను తీర్చేది--అంటున్నాడు. అంటే ఏ కోరికైతే మన ఆనందానికి లేదా స్వార్థానికి కాక, ఆధ్యాత్మిక పనుల చేయడానికి, ప్రజల మేలుకై పనికి వచ్చేదో అట్టి కోరిక తీర్చబడుతుంది.

శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పెను: ఒక వ్యక్తి ఎదగాలంటే, నిస్వార్థమైన సంఘ సేవ చెయ్యాలి. దానివలననే శాంతి, ఆనందం, జ్ఞానం పొందగలము. మన జీవితాన్ని ఒక యజ్ఞ మనుకొని పరులకై బ్రతకాలి. మనము యుద్ధము గురించి మాట్లాడితే, ఇంట్లో జరిగే కలహాలను కూడా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనమొక్కరమే ముఖ్యులమని తలుస్తామో అప్పుడు కలహమేర్పడుతుంది. అలాకాక మనం కుటుంబంతో, దేశంతో, ప్రపంచంతో కలిసిమెలిసి ఉంటే ప్రపంచ శాంతి సాధ్య మవుతుంది. గత 2000 సంవత్సరాలలో లెక్కపెట్టలేనన్ని యుద్ధాలు జరిగేయి. శాంతికై చేసికొనే సంధి సగటున రెండు ఏళ్ళకన్నా ఎక్కువ కాలం ఉండలేదు. శాంతికై చేసే ఒడంబడిక శాంతి నెలకొల్పటంలేదు. మన ఇళ్ళల్లో, వీధుల్లో శాంతి లేనిదే ప్రపంచ౦లో శాంతి లేదు. కాబట్టి శ్రీకృష్ణుని బోధ రాజకీయ సంక్షోభానికి, జాత్యాహంకారానికి, ఇంటిలోని కాలహాలకు సమానంగా వర్తిస్తుంది. మనందరికీ స్వార్థం ఉండి, దానికై పోరుకెళ్ళే లక్షణం ఉంది. మన గుండెల్లో శాంతి కావాలంటే మనం ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి సాధన చెయ్యాలి. 161

Eknath Gita Chapter 3 Section 6

Bhagavat Gita

3.6

యజ్ఞార్థా త్కర్మణో అన్యత్ర లోకో అయం కర్మబంధనః {3.9}

తదర్థ౦ కర్మ కౌ౦తేయ ముక్తసంగ స్సమాచర

కుంతికుమారా! యజ్ఞార్థమగు కర్మములు తప్ప వేరు కర్మలన్నియు బంధములకు హేతువగు చున్నవి. కనుక ఫలాసక్తి లేనివాడవై యజ్ఞము కొరకు కర్మ నాచరింపుము

శ్రీకృష్ణుడు అయం కర్మ బంధనః --అనగా ప్రపంచమంతా కర్మచేత బంధించబడినది--అని చెప్తున్నాడు. మనం అది నమ్మక పేరుప్రతిష్ఠలకై, ఆనందానికై ప్రాకులాడి మనం స్వతంత్రులమని అనుకొంటాం. మనము అలాగ ఎంత ప్రాకులాడితే అంత ఇతరులకు సేవ చేయలేం. కొందరు స్వార్థ పూరిత, అహంకార పూరిత జీవితాన్ని గడుపుతారు. కొన్నాళ్ళు ధనం, వస్తువులు, సుఖాలు మొదలైనవి అనుభవించిన తరువాత దేవుడు అవి మన లక్ష్యం కాదని గ్రహించమంటాడు.

శ్రీకృష్ణుడు నిస్వార్థ కర్మను యజ్ఞం అంటాడు. మనము ఒకరికై సమయ౦, ధన౦, కౌశల్యం లేదా భూమి ఇచ్చి సహాయం చెయ్యచ్చు. ఒక మంచి కర్మకై స్వార్థ రహితంగా పాటుపడితే అది కూడా యజ్ఞమే. శ్రీకృష్ణుడు ముక్త సంఘ సమాచర అంటాడు -- అనగా మన కర్మలతో తాదాత్మ్యం చెందకుండుట. అలాకాక పోతే మన విచక్షణా జ్ఞానం కోల్పోయి, మన జీవిత లక్ష్యాన్ని మరిచిపోతాం. ఉదాహరణకు కొందరు ఆఫీసులో పనిచేసి, ఇంటికొచ్చి అదే పని చేస్తారు. అది ఉత్తమం కాదు.

మనకు ఇష్టమైన పని చెయ్యడం సులువు. కానీ మనకిష్టం లేని పని చెయ్యడం ఆధ్యాత్మిక జీవనంలో ఒక భాగం. జీవితంలోని ఒక సిద్ధాంతం: ఇష్టంలేని పనిచేస్తే, క్రమక్రమంగా ఇష్టమైన పని వస్తు౦ది; కానీ పని ఇష్టం లేదని వదిలేస్తే, వచ్చే మరో పని దానికన్నా నాశి రకమవుతుంది. గాంధీజీ "రుచి మనస్సులో ఉంది" అనేవారు. నేను చెప్తున్నది పని చేయడంలోని అభిరుచి మనస్సులో ఉందని. ఒకానొక పనిచేస్తే, అన్ని విషయాలలోనూ స్వతంత్రత ఏర్పడి, అది ఇష్టమున్నా లేకపోయినా, హృదయం ఆహ్లాదంగా మారుతుంది. గాంధీజీ ఇచ్చే స్పూర్తి: నిస్వార్థ కర్మ చేస్తే భద్రత, క్షేమము అంతర్గతంగా ఉన్న దైవ స్వరూప౦ వలన కలుగుతుంది. 160

Eknath Gita Chapter 3 Section 5

Bhagavat Gita

3.5

య స్త్వి౦ద్రియాణి మనసా నియ మ్యారభతే అర్జున {3.7}

కర్మే౦ద్రియైః కర్మయోగ మసక్త స్స విశిష్యతే

అర్జునా! జ్ఞానే౦ద్రియములను మనసుతో నియమించి ఫలాశక్తి లేనివాడై, కర్మే౦ద్రియముల ద్వారా కర్మయోగము నాచరించువాడు శ్రేష్ఠుడగుచున్నాడు

నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః {3.8}

శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః

నీవు నియమితకర్మము నాచరింపుము. కర్మ మానుట కన్నా చేయుటయే మేలు కదా! కర్మ చేయని వానికి జీవనయాత్ర కూడా జరుగదు

గాంధీ మహాత్మునికి వేప చెట్టు వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుందని తెలిసి, వేప ఆకుల పచ్చడిని తినేవారట. ఎందుకంటే జీవితంలో మనకు చేదు అనుభవాలు వస్తాయి. అప్పుడు కూడా స్థిరంగా, ఆహ్లాదంగా ఉండగలగాలి. మన బంధుమిత్రులు దూషిస్తే మనమెంతో కలత చెందుతా౦. వారి దూషణ వేప పచ్చడివలె అరిగించుకోవాలి. మొదట్లో అది చేదు అనుభవం ఇవ్వచ్చు. వేప సూక్ష్మ క్రిములను ఎలా నిర్మూలిస్తుందో, మనలోని స్వార్థం, క్రోధం, భయం అలా నిర్మూలించ బడతాయి. నిస్వార్థంతో బ్రతికితే, అది ఎంత కష్టమైనప్పటికీ, మనం సుఖాలనే కాక దుఃఖాలనూ సంతోషంగా స్వీకరిస్తాము.

కర్మ ఎంతో అవసరం. నా అమ్మమ్మ "దేవుడు నీకు నోరు ఇచ్చేడు. అలాగే రెండు చేతులు ఇచ్చి వాటి ద్వారా ఆహారం భుజించమన్నాడు" అనేది. మన చేతులను ఇతరులను మభ్యపెట్టడానికి లేదా హింసించడానికి కాక మనకు, ఇతరులకు మేలు చెయ్యడానికి ఉపయోగించాలి.

పరులను సేవించుటకై ఆహారం, వ్యాయామం, కర్మలు పవిత్రమైనవి. అలాగే ఎక్కువగా తిని, తగినంత వ్యాయామం చేయక ఉన్నవారు నిస్వార్థమైన సేవ గూర్చి తెలిసికోలేరు. ఆధ్యాత్మిక జీవనానికి ఆరోగ్యం ఎంతో అవసరం.

శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మలు చేయకపోవడం కన్నా, కర్మాచారణమే మేలని చెప్పుచున్నాడు. యుగాల క్రిందట మనము బహుశా రాళ్ళలా ఉండేవారమేమో. అప్పుడు కర్మ చెయ్యక పోయినా ఫరవాలేదు. కానీ ఇప్పటి మానవ దృక్పథంలో కర్మ చెయ్యకపోవడం మంచిది కాదు. బైబిల్ మన ఆహారాన్ని చెమటోడ్చి సంపాదించాలని చెప్తుంది. సాధన మొదలులో పరిశ్రమ ఎంతో ఉపయోగకరం. అది మన దేహాభిమానాన్ని తగ్గిస్తుంది. అధిక లాభానికై, పేరు ప్రతిష్ఠలకై కాక పని చేస్తే ఎంతో ఉత్తమం.

మనము కర్మల ద్వారా కుటుంబానికి, సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నామని ప్రశ్నించుకోవాలి. మనకో ఎన్నిక ఉ౦ది: స్వార్థంతో కర్మలు చేసి ఆనందం, లాభం, నిరాశ, అభద్రతలు కావాలా లేదా ఇతరుల మేలుకొరకై పని చేసి ఆరోగ్యం, భద్రత, జ్ఞానం పొందాలా. స్వార్థ పూరిత జీవితం మన దేహం, ఇంద్రియాలు పనిచేస్తున్నంతవరకే. అదే నిస్వార్థంతో చేసే కర్మ, ఎన్నటికీ తరిగి పోదు. అందుకే గాంధీ మహాత్ములవంటివారు ఎన్నటికీ మరణించరు. ఆయన దేహం పడిపోయింది కానీ ఆయన ఆత్మ అహింసావాదు లందరికీ చిరస్మరణీయ మయ్యింది 158

Eknath Gita Chapter 3 Section 4

Bhagavat Gita

3.4

కర్మే౦ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ {3.6}

ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే

కర్మే౦ద్రియములను వశపరచుకొని మనస్సుతో శబ్దాది విషయములను చింతించు అవివేకి కపటవర్తుడని పిలువ బడుచున్నాడు

నేనొకమారు ఆలీ అక్బర్ ఖాన్ సరోద్ కచేరికి వెళ్ళ దలిచాను. దానికై రెండు రోజులు ముందునుంచీ నా మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నా మనస్సు కచేరి వైపు మళ్ళిపోయేది. అతి కష్టంతో నా మనస్సును అదుపులో పెట్టుకున్నాను. అందువలన కచేరీపై పూర్తిగా కేంద్రీకరించి ఆనందించేను.

మనం మనస్సుతో ఇంద్రియాలను నియంత్రించే సాధాన చేయలేదంటే శ్రీకృష్ణుడు మనల్ని మిథ్యాచార -- అనగా కపటి -- అంటాడు. ముఖ్యంగా సాధన మొదట్లో ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యాలి. అది క్రొత్తలో సాధ్యం కాదు. కానీ పట్టువదలకుండా ప్రయత్నిస్తే సాధ్యమవ్వచ్చు.

అటు తరువాత మనం ధ్యానంలో పరిపక్వమౌతే, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఉదాహరణకు మనము ధ్యానము చేసి ఇంద్రియాలు స్వాధీనంలో ఉన్నాయనే సంతృప్తితో బయటకు వస్తే, మళ్ళీ ప్రాపంచిక విషయాలలో మునిగి ఇంద్రియాలపై స్వాధీనం తప్పుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులు మన ధ్యాన పరిపక్వతకు పరీక్ష పెడతాయి. యోగుల జీవిత చరిత్ర చూస్తే మనకు తెలిసేది: మన ఆలోచనలను, మనస్సును ఎంత స్వాధీనంలో ఉంచుకొంటే, పరీక్ష అంత తీవ్రంగా ఉంటుంది. నేను విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఉన్నత విద్యార్థులకు పరీక్ష పెట్టేవాడిని. అప్పుడు వేరొక విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుని నియమించి, వారి చేత బాహ్య విషయాల గూర్చి పరీక్ష పెట్టమనేవాడిని. నేను అంతర్గత విషయాలను పరీక్షించేవాడిని. ఈ విధంగా ధ్యానంలో అనేక పరీక్షలు ఉంటాయి. కాముడు బాహ్య విషయాలపై పరీక్ష పెడితే, మనలో ప్రతిష్ఠితమైన దేవుడు అంతర్గతుడై పరీక్షిస్తాడు. ఈ రెండూ నెగ్గితే మనమెవరమో తెలిసికోవచ్చు. 156

Eknath Gita Chapter 3 Section 3

Bhagavat Gita

3.3

న కర్మణా మనారంభా నైష్కర్మ్య౦ పురుషో అశ్నుతే {3.4}

న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమదిగచ్ఛతి

మనుజుడు కర్మలను చేయకపోవుట చేతనే నైష్కర్మ్యమును పొందజాలాడు. కర్మములను వదిలినంత మాత్రమునను మోక్షమును పొందనేరడు

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్ {3.5}

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై ర్గుణైః

కర్మమును చేయక ఎవడును క్షణకాలమైనను ఉండలేడు. ప్రకృతి వలన పుట్టిన గుణముల చేత ప్రతి వాడును పరవశుడై కర్మల నాచరించుచునే యున్నాడు

ఆధ్యాత్మిక జీవితమంటే కఠోర శ్రమ పడనక్కరలేదని కాదు. మనం ధ్యానం, మంత్ర జపం ఎంత చేసినా, రోజూ కొంత కర్మ చెయ్యనిదే ఆధ్యాత్మిక స్థితి రాదు. మనము అనేక గత జన్మల ఋణాను బంధంతో పుట్టేము. దానిని తీర్చాలంటే ఎంతో పరిశ్రమ చెయ్యాలి. కొంత మందికి పదవీ విరమణ తరువాత ఇక పనికై ఆఫీసుకి వెళ్ళనక్కర లేదు. అయినప్పటికీ వారు ఏదో ఒక కర్మ ఆనందంగా స్వీకరించాలి. అలా కాకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం వెళ్ళలేము.

మనస్సు ఉద్రిక్తతతో, ప్రేరేపణతో ఉంటే మన దృష్టిని కర్మపై కేంద్రీకరించడం ఉత్తమం. అయితే మనకిష్టం లేని పనిమీద దృష్టి కేంద్రీకరించడం కష్టమే. కొందరు కళాకారులు, సృజనాత్మకతతో కూడి ఉన్న పనులే చేస్తామంటారు. నిజానికి వారికి శ్రమ పడడం ఇష్టంలేదు. మనకిష్టంలేని పని చేస్తే మనస్సు పరిపరి విధాల పోతుంది. అది ఎలాగంటే ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ ఒక బొమ్మను౦చి ఉంకో బొమ్మకు మారుతూ ఉంటాడు. ఇక బొమ్మలు లేకపోతే ఏడ్వడం మొదలెడతాడు. నా ఉద్దేశంలో మనకిష్టంలేని పని చెయ్యడానికై కొంత ప్రయత్నం చెయ్యాలి. ఇష్టాయిష్టాలు మనలోనే ఉన్నాయి గానీ; అవి పనియొక్క లక్షణం కాదు. మనము దృష్టి పూర్తిగా కేంద్రీకరించ గలిగితే పని ఇష్టంగా చెయ్యచ్చు. అలా చేయలేకపోతే పని భారమనిపిస్తుంది.

మనం పనిమీద దృష్టి కేంద్రీకరించి చేసినా, అప్పుడప్పుడు మన దృష్టి మారుతూ ఉంటుంది. అప్పుడు "నేను కేంద్రీకరిస్తున్నానా, లేదా?" అనే సందిగ్ద౦లో పడతాం. ఇలా మనం అంతర్ముఖులమై ఉంటే దానివలన పని మీద దృష్టి చెడుతుంది. మనము ప్రయత్నపూర్వకంగా పనిమీద దృష్టి కేంద్రీకరించి, క్రమంగా మన ఆసక్తిని పెంపొందించుకోవాలి. ధ్యానం మాత్రం చేస్తేనే ధ్యానాన్ని లోతుగా అనుభవించలేం. ధ్యానంతో పాటు కొంత వ్యాయామం, క్రమశిక్షణతో పనులు చేయడం, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూడడం, తగినంత విశ్రాంతి అవసరం. ఈ విధంగా రాజ యోగాన్ని-- అనగా ధ్యానం -- కర్మ యోగాన్ని -- అనగా స్వార్థం లేకుండా పనుల చేయడం--కలిపి ఆచరించగలం.

గాంధీ మహాత్ముడు ఆధ్యాత్మిక జీవితమంటే స్తబ్దుగా ఉండడమనే అభిప్రాయాన్ని తుడిచివేశారు. ఆయన జీవితం నిస్వార్థ సేవ చేస్తూ, ఆధ్యాత్మిక సాధన చేయడమనే కౌశల్యం అందరికీ అందుబాటులో ఉందనడానికి తార్కాణం.

నైష్కర్మ్య -- అనగా కర్మ చెయ్యకుండా ఉండడం-- స్థితి శ్రీ రమణ మహర్షి లాంటి వారికే సాధ్యం. ఎవరైనప్పటికీ ఆయన వద్దకు సంశయాలతో వస్తే వారిని సంతృప్తి పరిచేవారు. ఆయనకు ప్రాపంచిక విషయాలతో సంబంధంలేదు. ఆయన ఎన్నడూ ఒక తప్పు పని చెయ్యలేదు. శ్రీ రామకృష్ణ లాగే చిన్న వయస్సులోనే జ్ఞానోదయం పొంది జీవితాంతం పరిశుద్ధుడుగా ఉన్నారు. కొందరు పాశ్చాత్యులు "మీకు ఉత్పాదకమైన జీవితం గడపాలని ఉండదా?" అని అడిగితే ఆయన నవ్వి ఊర్కొనేవారు. అలాగ ఆయన దైవత్వం ఎల్లలు దాటింది.

నైష్కర్మ్య అందరికీ ఇష్టమైనది. కానీ ఏ పనీ చేయక, మానవాళిని ఉద్దరించవచ్చనుకుంటే అది తప్పుడు ఆలోచన. అందుకే శ్రీకృష్ణుడు కర్మలు చేయకుండా ఆ స్థితిని పొందలేమని ఘంటాపథంగా చెప్తున్నాడు.

అర్జునుని సందేహం: "కాషాయం ధరించి, రుద్రాక్ష మాల వేసికొని, ఊరూరూ తిరుగుతూ, కీర్తనలు పాడుతూ, గుడిలో పడుకొని, బిచ్చమెత్తుకొని తిరిగితే అది నైష్కర్మ్య కాదా?"

శ్రీకృష్ణుడు న చ సన్న్యశానా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి అంటాడు. అనగా అన్నీ పరిత్యజిస్తేనే గాని సంపూర్ణత రాదనుకోవడం మిథ్య. మనం హిమాలయాల కెళ్ళి కొన్నేళ్ళు తపస్సు చేసినా నైష్కర్మ్య స్థితి పొందలేము.

కర్మ ఋణ విముక్తులమవ్వడానికి కూడా ఆచరించాలి. ప్రతి అణువులో నిక్షిప్తమైన చిత్రగుప్తుడు మన సత్కర్మలు, దుష్కర్మలు లెక్క పెడుతున్నాడు.

నేను ఒకమారు పరిశ్రమవేత్తలకు ధ్యానం మీద ఉపన్యాస మివ్వడానికి వెళ్ళేను. ఉపన్యాసం తరువాత భోజనాల కార్యక్రమం మొదలయింది. నేను శాఖాహారినని తెలిసి "మీరు పాశ్చాత్య దేశాలన్నీ తిరిగి ఇంకా శాఖాహారమే తింటున్నారా?" అని అడిగేరు. నేను ఒక్కడినే కాదు; నా మిత్రులను కూడా శాఖాహారులను చేసేను అని చెప్పేను. ఒక క్రిస్టియన్ "బహుశా కర్మ సిద్ధాంతం హిందువులకు, భౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. క్రిస్టియన్ లకు వర్తించదేమో" అని అడిగేరు. అలా అయితే నేను హర్షించేవాడిని. కానీ జీసస్ "నువ్వు ఏ విత్తు నాటితే, ఆ పంట పొందుతావు" అని చెప్పెను. ఇతరులకు కష్టనష్టాలు కలిగిస్తే మనకూ అవే కలుగుతాయి. అలా కాక ఆనందం పంచిపెడితే మనమూ సుఖాలనుభవిస్తాము.

సుఖదుఃఖాలు, ఆనందవిషాదాలు మనం చేసికొన్న కర్మలవలననే అని తెలిసికోవడం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మనలో అనేకమంది "నా తలిదండ్రులు నన్నిలా చేసేరు; నా సహధర్మచారిణి, పిల్లలు, సమాజం నన్నిలా చేసేరు" అని అంటారు. అది కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం. మనమే పరిస్థితుల్లో, ఏ దేశంలో బ్రతుకుతున్నా మనకో ఎన్నిక ఉన్నది: నా లాభానికై, ఆహ్లాదానికై పనిచేయాలా లేదా పరుల ఆనందానికై, మేలుకై పాటుపడాలా? 165

Viveka Sloka 50-51 Tel Eng

Telugu English All శిష్య ఉవాచ:- ప్రశ్న నిరూపణము కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా । యదుత్తరమహం శ్రుత్వా కృతా...