Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 24

Bhagavat Gita

3.24

యే త్వత దభ్యసూయంతో నానుతిష్ఠ౦తి మే మతం {3.32}

సర్వ జ్ఞాన విమూఢాం స్తాన్ విద్ధి నష్టా నచేతనః

అసూయపరులై నా ఉపదేశమును అనుసరించని వారు మూర్ఖులు, జ్ఞాన హీనులు, భ్రష్ఠులని గ్రహింపుము ఀ

శ్రీకృష్ణుడు మనకో హెచ్చరిక చేస్తున్నాడు: ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పాటించకుండా, తన స్వార్థానికే ఎవడైతే బ్రతుకుతాడో, వాని సామర్థ్యం క్షీణిస్తుంది. అట్టివారి మనస్సు సంకుచితమై, ప్రతి చిన్న దానికీ విసుక్కొ౦టారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని ఇతరులు తలుస్తారు. ఇతరులను సేవించాలా లేదా స్వార్థానికై బ్రతకాలా అని ఒక ఎన్నిక చేసుకోక తప్పదు. అహంకారాన్ని వదులుకోక ఇతరులను సేవించ దలిస్తే దానివలన మనకు లాభం లేదు, ఇతరులకూ లాభం అంతకన్నా లేదు.

అజ్ఞానము, నాస్తిక భావం ఉన్నా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు వర్తిస్తాయి. కొందరు ఇలా అంటారు: "నాకు ఈ సిద్ధాంతాల గురించి ఏమీ తెలియదు. నాకు తెలిసిందల్లా నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే చాలు. అలాగే నా గురించి నేను చాటితే నా వ్యక్తిత్వాన్ని పెంచుకోగలనని అనుకున్నాను. కాబట్టి నాకు తెలియని సిద్ధాంతాలు నాపై వర్తింప జేయకూడదు". శ్రీకృష్ణుడు వారికి చెప్పేది: లోక జ్ఞానం అందరికీ ఎంతో కొంత ఉండాలి. ఆ జ్ఞానంతో ఎవరు క్షేమంగా ఉన్నారో, మనశ్శాంతితో ఉన్నారో, ఇతరులకు మేలు చేస్తున్నారో వారి గురించి తెలిసికోవాలి.

నిస్వార్థంగా బ్రతకడమంటే అనుభవంతో, ఇంగిత జ్ఞానంతో బ్రతకడం. గాంధీజీకి మక్కువైన ఒక గుజరాతీ గీతం: "దేవా నాకు విశ్వాసాన్నివ్వు, భక్తినివ్వు, కానీ ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వకుండా ఉండద్దు". ఆధ్యాత్మిక మార్గంలో చరించేవార్లలో ఇంగిత జ్ఞానం ఎంత తక్కువ వుంటే అంత ఎక్కువ పురోగతి పొందేమనే తప్పుడు భావన ఉంది. ఆధ్యాత్మికత అలవరచు కొన్నవాడు మిక్కిలి అనుభవజ్ఞుడు. ఆధ్యాత్మికత లేనివాడు, ఎంత డబ్బు సంపాదించినా, యాంత్రికంగా జీవితం గడిపి అభద్రతతో సతమతమౌతాడు. 188

Eknath Gita Chapter 3 Section 23

Bhagavat Gita

3.23

యే మే మతమిదం నిత్య మనుతిష్ఠన్తి మానవాః {3.31}

శ్రద్ధావన్తో అనసూయంతో ముచ్యన్తే తే అపి కర్మభిః

శ్రద్దగలవారై, అసూయలేనివారై నా ఈ అభిప్రాయమును సదా అనుసరించు మనుజులు కర్మల నుండి విడిపడు చున్నారు ఀ

దేవుని సిద్ధాంతాలు మన అణువణువునా నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే వాటిని ఉల్లంఘిస్తే ఎంతో దుఃఖం కలుగుతుంది. గీత ఇది చెయ్యి, అది చెయ్యకు అని చెప్పదు. గీత రెండు మార్గాలు ప్రబోధిస్తుంది: ఒక మార్గంలో వెళితే ఆనందం, సుఖం, పరోపకారం చెయ్యగలిగే శక్తిని పొందుతాము; వేరే మార్గంలో వెళితే దుఃఖం, అభద్రత, ఇతరులకు బాధ కలిగించుట మొదలైనవి పొందుతాము. "నీవు అహంకారాన్ని తొలగించుకోలేకపోతే, ఈ లోకానికి శాపమవుతావు. అలా కాక నీ ఆనందాన్ని, స్వలాభాన్ని, పేరుప్రతిష్ఠలను కుటుంబానికై, సమాజానికై, ప్రపంచానికై ఉపయోగిస్తే ఈ ప్రపంచానికి వరమౌతావు" అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు.

మనమే దేశవాసులమైనా, ఎటువంటి పదవి కలిగియున్నా, మన మొకరి గురించి లేదా మన గురించి మనుగడ సాగించవచ్చు. ఆ ఎన్నిక మన చేతిలోనే ఉంది.

ముచ్యన్తే తే అపి కర్మభిః --అనగా వారు కూడా కర్మ బంధాన్ను౦చి విడువబడతారు. మనము పరోపకారానికై బ్రతుకుతే దేవుడు మన కుటుంబ క్షేమం తన బాధ్యతగా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునిని హృదయపూర్వకంగా లోక కళ్యాణార్థం సేవ చేస్తే, తాను స్వయంగా అతని అవసరాలను చూసుకొంటానని అంటున్నాడు.

మనం ధ్యానం అవలంబిస్తే మన అవసరాలు తగ్గుతాయి. ఉదాహరణకు, మితమైన నిద్రతో, ఆహారంతో పర సేవచేయగల శక్తి వస్తుంది. ఈ విధంగా మనం పరోపకార్యార్థం పని చేస్తే దేవుడు మన బుద్ధిని వికసింపచేస్తాడు. మనకి ఇద్దరు, ముగ్గురు సంతానం సరిపోదు. మనకి ఒక ఖండంలోని వారంతా కుటుంబ సభ్యులనే భావన కలుగుతుంది. కస్తూరీబా గాంధీని ఒకరు ఆమెకి ఎంతమంది సంతానం అని అడిగేరు. ఆమె "నాకైతే నలుగురు. కానీ నా భర్తకు కోట్లాను కోట్లు" అని సమాధానమిచ్చేరు. ధ్యానం కొనసాగుతున్న కొద్దీ అహంకారం తగ్గి, మనము ప్రతి ఒక్కరినీ "మన వాళ్ళు" అనుకొంటాం. వాళ్ళకి సమస్యలొస్తే అవి మనవిగా భావిస్తాము. ఈ విధంగా ప్రపంచమంతా మన కుటుంబమనుకుంటే, మనలోని అపరిమితమైన ప్రేమ, జ్ఞానము వ్యక్తమవుతాయి.

మనము శ్రీకృష్ణుని బోధను కుటుంబ క్షేమం పట్టించుకోనక్కరలేదని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనం కుటుంబాన్ని తక్కువగా ప్రేమించం. కానీ ప్రపంచాన్ని కుటుంబం లాగ ప్రేమిస్తాం. కొందరు గాంధీజీ సంఘసంస్కర్తగా మారి, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేరని అంటారు. అది తప్పు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, అది ప్రపంచాన్ని కప్పేస్తుంది. భారత దేశంలోనే కాక, విదేశాల్లో కూడా ఆయన సిద్ధాంతాలను ఆదరించి, గౌరవించి, పాటిస్తున్నారు.

ఇక్కడ అర్జునుడు మనలాంటివాడే. శ్రీకృష్ణుడు మన శక్తి అద్వితీయంగా మారుతుందని చెప్పడం మనలో ఆశను కలిగిస్తుంది. అతను సృజనాత్మక శక్తిని, ప్రేమను పెంచుకోవాలంటున్నాడు. మనలాగే అతనికి అవి అపరిమితంగా పెరగాలనే ఆశ ఉంది. 187

Eknath Gita Chapter 3 Section 22

Bhagavat Gita

3.22

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యా అధ్యాత్మచేతసా {3.30}

నిరాశీ ర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః

సర్వకర్మలను నా యందు ధ్యాన చిత్తముతో సమర్పించి, ఆశను, మమకారమును, సంతాపమును వదిలినవాడవై యుద్ధము చేయుము

శ్రీకృష్ణుడు అర్జునుని అహంకారముని వీడి యుద్ధము చెయ్యమంటున్నాడు. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో తప్పులు చేసేమని విచారంతో ఉండవచ్చు. అలా చేసేకన్నా గతాన్ని మరచి, ముందుకు సాగే ప్రయత్నం చెయ్యడం ఉత్తమం.

శ్రీరామకృష్ణ మనమందరము అహంకార జ్వరముతో బాధపడుతున్నా మని అన్నారు. జ్వరం కొంచెమే వుంటే మనము జీవితంలో అందరితో సఖ్యతతో ఉంటాము. మనల్ని ఇతరులు ప్రేమించి, గౌరవిస్తారు. అదే జ్వర౦ ఎక్కువైతే మనకూ, కుటుంబానికీ, సమాజానికీ హాని చెయ్యగలం. దాని వలన మన తోటి వాళ్ళ అవసరాలను పట్టించుకోక అహంకారపూరిత మౌతాము.

అధ్యాత్మచేతసా అనగా ఆత్మతో తాదాత్మ్యం చెందడం. అది ధ్యానం వలన దైవ కృప ఉంటే సాధ్యం. దానివలన మనం రెండవ అధ్యాయంలోని ఆఖరి 18 శ్లోకాలనూ మనస్సు నిశ్చలంగా ఉంచి, నిద్ర పోకుండా, పదేపదే గుర్తు తెచ్చుకొనగలం. మనమా స్థితి పొందితే, దృష్టి కేంద్రీకరించి ధ్యానము సాగిస్తున్నాము. తద్వారా ఆ శ్లోకాలు మన మనస్సులో నాటుకుపోతాయి. మన నడవడికతో దానిని నిరూపించగలము. బాధ కలిగితే విచారించం. మన దయా గుణం మనని ద్వేషించిన వాని యందు ప్రసరిస్తాము. కోర్కెలు కలిగితే చలించం. అవి నిస్వార్థ మైనవి అయితే మంచిదే; కానీ అవి స్వార్థ పూరితమైతే వాటిని ఆనందంతో నియంత్రిస్తాము. అలాగ మనం స్వార్థానికై ఏర్పరుచుకొన్న బంధాలను వీడి, భయము, క్రోధము లేకుండా ఉంటాము.

నిరాశీ అంటే ఆపేక్ష లేకుండుట. ఒకదానికై ఎదురు చూస్తే నిరాశ, నిస్పృహ కలిగి, అభద్రత వలన ఇతరులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తాం. శ్రీకృష్ణుడు అర్జునునికి నొక్కి చెప్పేది: "నేనే మిచ్చినా కృతజ్ఞతతో తీస్కో: అది ఆనందదాయకమైనా, దుఃఖమైనా ఆనందంగా స్వీకరించు. ఆ విధంగా నువ్వు స్వతంత్రుడవు అవుతావు". మనము ఫలాపేక్ష లేకుండా, అంటే కర్మ ఫలాన్ని ఆశించకుండా, ఉంటే కర్మమీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించి పనులు చేస్తాము. "నీవు నిస్వార్థ సేవ హృదయపూర్వకంగా చెయ్యాలనుకుంటే, మంచి లక్ష్యాన్ని పెట్టుకో, మంచి సాధనాలను వాడు, ఫలితాలు నకు ఒదిలేసేయి" అని శ్రీకృష్ణుడు మనందరికీ బోధిస్తున్నాడు. 185

Eknath Gita Chapter 3 Section 21

Bhagavat Gita

3.21

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః {3.28}

గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే

అర్జునా! గుణముల యొక్కయు, కర్మముల యొక్కయు విభజనను గూర్చిన వాస్తవ జ్ఞానమును తెలిసిన జ్ఞాని ఇంద్రియములు ఇంద్రియ విషయముల యందు ప్రవర్తించుచున్న పని తలచి కర్మల యందు ఆసక్తి లేకుండా యుండును.

ప్రకృతే ర్గుణ సమ్మూఢాః సజ్జ౦తే గుణకర్మసు {3.29}

తానకృత్స్న విదో మన్దాస్కృత్స్న విన్న వినాజయేత్

ప్రకృతి గుణములచే సమ్మోహితులై ఫలాపేక్షచే కర్మలను చేయు మందమతులగు అల్పజ్ఞులను జ్ఞాని చలింపజేయరాదు ఀ

మన౦ కోర్కెలతో తాదాత్మ్యం చెంది ఉన్నాము. అనగా "ఇది నా కోరిక", "నేను కోరుతున్నాను" అని అనుకోవడం. మన నిజ స్వరూపం ఆత్మ. దానికి ఎటువంటి కోర్కెలు లేవు. అది ఎప్పుడూ పూర్ణంగా ఉండేది.

మన కోరికలు నిజంగా మనస్సు, ఇంద్రియాల మధ్యనున్న లావాదేవీల వలన కలిగి మన ఆత్మతో సంబంధం లేక ఉన్నాయి. మన ఇష్టాయిష్టాలు గడియారంకి ఉండే లోలకం (pendulum) లాంటివి. చాలా మంది తాము ద్వేషించేవారి గూర్చి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సహజంగా మనము ప్రేమించేవారిని తలుచుకుంటాం. మనం మన కోర్కెలనుకున్నంత కాలం, ఇష్టాయిష్టాలతో జీవితం సాగిస్తాం. ధ్యానం ద్వారా మనకు ఇష్టాయిష్టాలతో సంబంధం లేదనే జ్ఞానం పొందుతాం. అప్పుడు ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందక, ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉంటాము.

మన కోర్కెలు ఏమైనా కానీ, దేవుని కృపతో వాటిని అధిగమించగలము. మనం ఇష్టాయిష్టాలతో ఉండి, చిన్నచిన్న కోర్కెలకై లొంగితే, ఏదో ఒకనాడు ఒక పెద్ద కోర్కె కలిగి మనకు విచారం కలిగిస్తుంది. నేను ఒక సినిమా హాలుకు వెళ్ళినపుడు, అందరూ ఒక చేత్తో టికెట్, రెండో చేత్తో తినుబండారం పట్టుకొని ఉన్నారు. ఇదేదో ఆనవాయితీ అనుకొని, నేనూ ఒక తినుబండారాన్ని కొని, హాలు లోకి ప్రవేశించాను. కొంత కాలం గడిచిన తరువాత దాహం వేసింది. మళ్ళీ షాప్ కి వెళ్ళి సోడా కొనుక్కొని సినిమా చూడసాగేను. కొంత మందికి ధూమపానం చెయ్యాలనే కోరిక కలిగి బయటకు వెళ్ళేవారు. వారికి కావలసిన సరంజామా అంతా ఆ షాప్ వాడు అందిస్తున్నాడు. ఇది మనమనుభవించే కోర్కెల వలయానికి నిదర్శనం.

శ్రీకృష్ణుడు శ్లోకం రెండవ పాదంలో మనము ఇతరులకు బోధించి, వారికి ఇబ్బంది కలిగించక, మన నడవడికతో చేసి చూపించాలి అని చెప్తున్నాడు. గాంధీజీని ఒక విలేఖరి ప్రజలకొక సందేశం ఇమ్మని కోరేడు. దానికి బదులుగా ఆయన ఒక కాగితంపై "నా జీవితమే నా సందేశం" అని వ్రాసేరు. మనము ప్రతి రోజూ ఇతరులను మన మంచి నడవడికతో ప్రభావితం చేయవచ్చు. ఆధ్యాత్మిక జీవనం అలవరచుకొని, ఇతరులను మనకంటే ముఖ్యులుగా తలచి, మన ప్రత్యర్థులను కూడా మనవైపు త్రిప్పుకోవచ్చు. 183

Eknath Gita Chapter 3 Section 20

Bhagavat Gita

3.20

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః {3.27}

అహంకార విమూఢాత్మా కర్తా అహమితి మన్యతే

ప్రకృతి యొక్క గుణములచేత నానా విధములుగ ఆచరింపబడుతున్న కర్మలకు తానే కర్తయని ఆత్మ జ్ఞానహీనుడు అహంకారము చేత భావించుచున్నాడు ఀ

ప్రకృతి అనగా సదా మారుతూ, ఆశాశ్వతమై, పుట్టుక-మరణం కలిగి యున్నది. భౌతిక ప్రపంచం ప్రకృతి. అలాగే మన దేహం కూడా. అంటే ఒక రోజు పుట్టి మరొక రోజు పోయేది. బుద్ధుడు "ఈ దేహ౦ కూర్ప బడినది. కావున ఏదో ఒక రోజున అది శిథిల మవుతుంది" అన్నాడు.

నేనొక రోజున వెళ్ళే దారిలోని ఇల్లు కూల్చివేత చూసేను. అది చూడడానికి అందంగా ఉండేది. కాబట్టి దాన్ని కూల్చడం చూస్తే బాధ వేసింది. మన కిష్టులైన వారి ఇల్లు కూల్చేస్తే అదే కలుగుతుంది. అలాకాక మనము ఇల్లు కాదని, అందులో నివసించే వారలమని గుర్తుంచుకుంటే, మరణమంటే భయం పోతుంది.

ప్రకృతి త్రిగుణాలతో చేయబడినది. అవి సత్త్వ, రజస్ మరియు తమస్. మనలో ఈ మూడు గుణాలు వేర్వేరు పాళ్ళలో ఉన్నాయి. ఏ ఒక్కరూ సత్త్వ గుణం లేకుండా లేరు. అలాగే సంపూర్ణమైన నిస్వార్థంతో ఉన్నవారు కూడా లేరు.

రజస్ వలన శక్తి, అశాంతి, కోరికలు కలుగుతాయి. ఈ రోజుల్లో రజో గుణం చాలా మందిలో ఉంది. దాన్ని అంతర్గతం చేస్తే ఆధ్యాత్మిక సాధన మెరుగవుతుంది.

తమస్ అనగా బద్దకం. అది ఆధ్యాత్మిక జ్ఞానానికి వ్యతిరేకం. సాధనలో ప్రతి చిన్నదీ అవసరం. ఎందుకంటే చిన్న చిన్నవి పోగై పెద్దవిగా మారుతాయి. మనం అసమర్థులమని అనుకోవచ్చు. కానీ మనందరమూ కలిసి కట్టుగా ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. గాంధీజీ దుష్టత్వానికి స్వయంగా ఉనికి లేదు అంటారు. మనం దానికి ఊత నిస్తేనే దానికి ఉనికి వస్తుంది. ఆయన ఉద్యమాలు చేసేటప్పుడు మనం దుష్టత్వానికి మద్దతు ఇవ్వకపోతే, అది తొలగిపోతుంది అని చెప్పేవారు.

మన ఆత్మ లేదా పురుషుడు, ప్రకృతికి, గుణాలకి అతీతంగా ఉంటుంది. అది ఏనాటికీ శుద్ధమైనది, స్వతంత్రమైనది. కానీ మన అహంకారంతో దాన్ని తెలిసికోలేక మార్పు చెందే మనోదేహాలతో తాదాత్మ్యం చెందేము. మనకు పూర్తిగా అవగాహన లేకపోయినా, మనస్సు మనము కామని గ్రహించాలి. మనస్సే కోపం, భయం, స్వార్థం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే ఆత్మకి అటువంటి లక్షణాలు లేవు.

ఇతరులకు మనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వారిని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తే మన అహంకారం తప్పక నియంత్రింపబడుతుంది. మనము ప్రత్యర్థులను, బంధుమిత్రులతో సమానంగా ప్రేమించగలగాలి. మనకు హాని కలిగించినవారిని కూడా క్షమించ గలగాలి. సెయింట్ ఫ్రాన్సిస్ "క్షమించ లేనివారు, జీవితంలో అత్యంత ఆనందాన్ని పొందలేరు" అని చెప్పిరి. ధ్యానం ద్వారా ఇతరులను క్షమించ గలిగితే, ఏదో ఒక రోజు మన తప్పులను కూడా క్షమించగలుగుతాం. మన ఇతరులను ఎంత క్షమించ గలిగితే, మనలో ప్రతిష్ఠితమైన దేవుడు మనల్ని అంత ఎక్కువగా క్షమిస్తాడు. 181

Eknath Gita Chapter 2 Section 4

Bhagavat Gita

2.4

అర్జున ఉవాచ:

కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన {2.4}

ఇషుభిః ప్రతియోత్ప్యామి పూజార్హా వరిసూదన

ఓ మధుసూదనా! అరిసూదనా! పూజ్యులైన భీష్మ ద్రోణులపై యుద్ధరంగము నందు శరప్రయోగము చేయుచు నేనెట్లు పోరగలను?

గురూ నహత్వా హి మహానుభావాన్ {2.5}

శ్రేయో భోక్తు౦ భాయీక్ష్య మపీహలోకే

హత్వార్థకామాంస్తు గురూ నిహైవ

భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్

మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమున బిచ్చమెత్తి జీవించుట శుభదాయకము. వారిని వధించినచో రక్తసిక్తమైన అర్థకామ భోగములచే ఇచ్చట అనుభవించవలసి యుండును. ఀ

అర్జునుడు తన నిస్సహాయతని, ఇంద్రియలోలత్వమును ప్రకటించగా శ్రీకృష్ణుడు అర్జునుని మందలిస్తున్న నేపథ్యంలో అర్జునుడు మళ్ళీ ఇలా చెప్పేడు: "ఇంద్రియాలు నా మంచి మిత్రులు. వాటిని సాదరంగా ఆహ్వానించి అవి అడిగినవి ఇవ్వాలి. నీ వ్యతిరేక దృక్పథం నాకు ఆశ్చర్యంగా ఉంది."

మన దైనింద జీవితంలో ఇంద్రియాలతో పోరాడక తప్పదు. మన కళ్ళు ఆందోళన చేస్తే, వాటికి హింసాత్మక దృశ్యాలు చూపించాలనిపిస్తుంది. చెవులకు పైశాచిక సంగీతం వినాలనిపిస్తే, వాటిని నిరుపయోగం చేసే, కరకు సంగీతాన్ని వినిపిస్తాము. ఇక రుచులుకోరే నాలుకకు అనారోగ్యమైన మసాలాతోచేసిన, నూనెలో వేచిన పదార్థాలను అందిస్తాము. మన ఆరోగ్యం ఏమైనా మన నాలుకకు రుచిగా ఉంటే చాలు అనుకుంటాం.

ధ్యానం మొదలు పెట్టేటప్పుడు ఇంద్రియాలను జయించ లేనప్పుడు, ఇటువంటి సందిగ్దత ఏర్పడుతుంది. అలాగే మన స్వచ్ఛంద భావాలను వదలక, ఇతరులను మనకన్నా ముఖ్యమైనవారలని తలచం. పైపెచ్చు దేవునితో ఇతరులు మనకన్నా ముఖ్యలుగా చూపి మన సాధనని దుర్లభం ఎందుకు చేసావని కలహిస్తాం. "నా స్వచ్ఛంద భావాలపై ఎందుకు పోరు చెయ్యాలి? అది నాలో అలజడి రేపి, నా ధ్యానాన్ని భంగం చేస్తోంది" అని విలపిస్తాం.

Eknath Gita Chapter 2 Section 3

Bhagavat Gita

2.3

క్లైబ్య౦ మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే {2.3}

క్షుద్రం హృదయదౌర్భల్య౦ త్యక్త్వోత్తిష్ఠ పరంతప

ఓ పార్థా! క్లీబత్వమును పొందకుము. ఇది నీకు తగదు. తుచ్ఛమగు హృదయ వ్యాకులమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము.

శ్రీకృష్ణుడు అర్జునుని తన మనస్సులో ఏర్పడిన సుడిగుండం నుంచి వెలుపలకి రమ్మని ప్రోద్భలం చేస్తున్నాడు. "నీకిది అనుచితం. నీవు రాజువు. ఈ యుద్ధం నీవు చేయలేవని తలచను" అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.

ఇంద్రియాలు మనని నడిపిస్తే వాటిని నియంత్రించలేకపోయేమని చెప్పడం అనుచితం. మనం ఆహారం ఉందికదా అని అదేపనిగా తిననక్కరలేదు. అలాగే ఎంతోమంది ధూమపానం, మద్యం సేవిస్తున్నారని, మనము కూడా వాటిని సేవించనక్కరలేదు. మన పరిస్థితులు ఎంత విషమంగా నున్నా, ఎటువంటి సవాలును ఎదుర్కొన్నా, దేవుని అపరిమితమైన కరుణ, ప్రేమ మనయందు ఉంటాయని నమ్మితే జయం తప్పదు. మన బంధుమిత్రులు మనలను ఉద్రేకింపజేస్తే, వాళ్ళతో కలసి బ్రతకలేమని అనలేము. ఎందుకంటే దేవుడు "నీవు ఎందుకు చేయలేవు? నేను నీలో ఉన్నాను. నా నుండి శక్తిని పొంది ద్వేషాన్ని ప్రేమతో, చెడును మంచితో ఎదుర్కో" అని అంటాడు.

ఇలాగ శ్రీకృష్ణుడు అర్జునుని "మేల్కొని నీ దేహాన్నిపెంచు. నీ తల తారల యందు౦డాలి. సమస్త విశ్వం నీ కిరీటంగా ధరించు" అని ప్రోత్సాహిస్తున్నాడు. అలాగే "అర్జునా, నీలో ఎంతో రాజసం ఉంది. నేను నీలో ఉపస్థితుడినై ఉన్నాను. నీవు చెయ్యవలసిందల్లా నా శక్తిని ఆసరాగా తీసుకొని, శత్రువులను సమూలంగా నాశనం చెయ్యడం" అని బోధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అర్జునుని పరంతప -- అంటే శత్రువును మట్టి కరిపించే వాడు-- అంటున్నాడు. 51

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...