Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 9

Bhagavat Gita

4.9

యే యథా మాం ప్రపద్యన్తే తాం స్త థైవ భజామ్యహం {4.11}

మమ వర్త్మాను వర్త౦తే మనుష్యాః పార్థ సర్వశః

అర్జునా! ఎవరు నన్ను ఏ విధముగా సేవింతురో వారిని ఆ విధముగనే నే ననుగ్రహింతును. మనుజులు సర్వ విధముల నా మార్గమునే అనుసరించు చున్నారు

కబీర్ దాస్ గురించి తెలియనివారు ఉండరు. భారత దేశంలో అన్ని మతాల సామరస్యం ప్రవచించిన వారిలో అతడు ప్రధముడు. ఆయన ఒక పద్యంలో ఇలా వ్రాసేరు:

మిత్రుడా, నా గురించి ఎక్కడ వెదకుతున్నావు?

చూడు, నీలోనే ఉన్నాను

గుడిలో కాదు, మాస్క్ లో కాదు

కాబా లోకాదు, కైలాసములో కూడా కాదు

ఇక్కడే నీలోనే ఉన్నాను

మతాలు కాలక్రమేణా స్థాపకుల బోధనను విడిచి దాని స్థానంలో అంత ముఖ్యము కాని ఆచారాలు, సిద్ధాంతాలు, సంప్రదాయాలు స్థాపించేయి. ఈ విధమైన పైపైగా ఉన్న విషయాలతో ఉంటే మతాలు అఖండమైన దేవుని గురించేనన్న అవగాహన తగ్గుతుంది.

కాబట్టి మన మతమేదైనా సరే --క్రిస్టియన్, యూదుడు, భౌద్ధుడు, ముస్లిం-- ఎవరైనాసరే మనం చేరవలసిన గమ్యం ఒక్కటే. ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే మత గ్రంధాలలో దేవుడు ప్రవచించిన బోధను హృదయ పూర్వకంగా, మనసారా, సంపూర్ణ౦గా తెలిసికొని ఆచరిస్తే ఆ దేవునితో ఐక్యమవుతాం. ఈ శ్లోకంలో సర్వ మత సమానత్వాన్ని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు. మన సంస్కృతిని, దేశాన్ని, మతాన్ని, సమాజాన్ని విడిచి లక్ష్యాన్ని చేరడానికి ఎక్కడికో వెళ్ళనక్కరలేదు.

భగవంతుడు కోరే మార్పు మన అహంకారాన్ని, వేర్పాటుని వీడడం. మనము స్వర్గాని కెళితే అక్కడి ద్వార పాలకులు మన మతాన్ని అడగరు. ఏ మతంలో పుట్టేమో, ఏ చర్చికి వెళ్ళేమో, మన పురోహితుడెవరో దేవునికి అనవసరం. ఆయన అడిగేది: అన్ని జీవులలోనున్న నన్ను ప్రేమించేవా? నన్ను అందరికన్నా ముఖ్యునిగా చూసేవా? మనం ఇవ్వవలసిన సమాధానం: మన శక్త్యానుసారం, అహంకారాన్ని వీడి, స్వల్పమైన వ్యక్తిత్వాన్ని మరచి, కుటుంబం, సమాజ౦, ప్రపంచం యొక్క ఆనందానికై ప్రయత్నించే౦. 231

Eknath Gita Chapter 4 Section 8

Bhagavat Gita

4.8

వీత రాగ భయక్రోధాః మన్మయా మా ముపాశ్రితాః {4.10}

బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః

అనురాగము, భయము, క్రోధము తొలగినవారును, నా యందే మనసు గలవారును, నన్నే ఆశ్రయించిన వారును అగు అనేకులు జ్ఞానమనెడి తపస్సుచే పావనులై నా స్వరూపమునే బొందిరి

వీతరాగభయక్రోధ -- అనగా బంధాలతో, భయంతో, క్రోధంతో ఉండవద్దని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా "వాటిని వదిలేయి. అవి నిన్ను జనన-మరణ చక్రంలో ఉంచి విచారము, దుఃఖము కలిగిస్తాయి" అని చెప్పెను. ప్రతిరోజూ మన౦ వ్యక్తులతోనూ, వస్తువులతోనూ, బంధాలను తగ్గించుకోవాలి. భయం, క్రోధం మొదలైన వాటికి లొంగకూడదు. దీనికై ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. గాఢమైన ధ్యానంలో దేహాభిమానమును వదిలి, బంధ విముక్తులమై, డబ్బు, దస్కం, మొదలైన వ్యాపారాలు లేకుండా చేసుకొంటాం.

వైరాగ్యం వలన విచారం కలుగవచ్చు. తలిదండ్రులు మనకు "కాదు, వద్దు" అని చెప్పకపోతే పెద్ద అయ్యేక ఎవరినీ ఖాతరు చేయం. పిల్లలయందు గల ప్రేమ వలన "కాదు, వద్దు" అని చెప్పగలగాలి.

ప్రతి అనుబంధంలోనూ వైరాగ్యం దుఃఖం కలిగిస్తుంది. ఎందుకంటే మన అహంకారానికి, పాతుకుపోయిన మనోభావాలికి, సంతోషానికి ఎదురు తిరగాలి. మన దగ్గిర సంబంధాలలో అప్పుడప్పుడు వారు మనం చెప్పినట్లు చెయ్యాలని అనుకొంటాం. దీనివలన బంధాలు, ముఖ్యంగా తలిదండ్రులు పిల్లలు మధ్య, చెడతాయి.

తలిదండ్రులు తమ పిల్లలు వేరే తరంలో, కాలంలో పెరుగుతున్నారు కాబట్టి వారి యందు కొంత వైరాగ్యం పెంచుకోవాలి. వారు మమకారం తగ్గించుకొని పిల్లలు పూర్ణమైన వ్యక్తులవ్వాలంటే "నువ్వు స్వార్థంతో పని చేయనంత కాలము మేము నిన్ను ఆదరణతో చూస్తాము" అని చెప్పాలి. ఈ విధంగా పిల్లల్ని మనకన్నా ముఖ్యులని తలిస్తే వారు ఆనందంగా స్పందిస్తారు.

మనలోని స్వార్థ౦, కోర్కెలు , పేరుప్రతిష్ఠలకై ప్రయత్నించే స్వభావము, స్వలాభము తీసేస్తే దేవుడు ఖాళీని జ్ఞానం, ప్రేమ, సద్గుణాలతో నింపుతాడు. ఇదే మన్మయ కి అర్థం.

ఒకమారు రాధకి అసూయ కలిగి శ్రీకృష్ణుని "నీ పెదాలెప్పుడూ ఆ వేణువు మీదే ఉంటాయి. నా పెదాల మీద ఎందుకుండవు?"అని ప్రశ్నించింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన వెదురుతో చేసిన మురళిని అటూ ఇటూ ఊపి "చూడు ఇదంతా ఖాళీ. కాబట్టే దీన్ని నా నాదంతో నింపగలుగుతున్నాను" అని సమాధానమిచ్చేడు.

మాం ఉపశ్రితాః -- అనగా నామీదే పూర్తిగా భారం వెయ్యి అని అర్థము. ఆధ్యాత్మిక మార్గంలో మనం చూపవలసినది సంపూర్ణ శరణాగతి. దేవుడు చక్కని రథ సారథి. అలా నమ్మక మనము రథాన్ని మనిష్టమొచ్చినట్లు నడుపుతాం. మనలోని దేవుడు "నన్ను ఎందుకు సారథ్యం చెయ్యనివ్వవు? నువ్వు బుద్ధిగా కూర్చో. నాకు రథమెలాగ నడపాలో చెప్పొద్దు. నన్ను పూర్తిగా నమ్ము" అంటాడు.

అలాగని మనం ముందు జాగ్రత్త లేకుండా ఉండకూడదు. ఉదాహరణకి కారు నడుపుతూ, దేవుడే నడుపుతున్నాడని తలచి ఎర్ర లైట్ దాట కూడదు. మనము శ్రీకృష్ణుని రద్దీగా ఉన్నప్పుడు ఎలాగ నడిపేది అని అడిగితే: రద్దీగా ఉన్న సమయంలో కారు వాడద్దు. అలా వాడవలసి వస్తే ఇతరు వాహనదారులతో కలహాలు పెట్టుకోవద్దు. ఈ విధంగా మనమన్ని ముందు జాగ్రత్తలు తీసికొని "దేవుడా నేను చెయ్యగలిగినంత చేసేను. తక్కిన భారం నీదే" అని ప్రార్థించాలి.

మద్భావం ఆగతాః -- అనగా అతను నన్ను ఆవహిస్తాడు. మనము వస్తువులమీద ప్రేమ వదులుకుంటే, స్వార్థంతో కూడిన బంధాలను త్రె౦పుకుంటే, భయము, క్రోధము నిర్మూలిస్తే దేవుడు: "నిన్ను సర్వ జీవులయందు ప్రేమతో నింపుతాను; ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థపూరితమైన సంతోషం, ప్రతిష్ఠ ఉండదు. ఆ ప్రేమను నిస్వార్థ సేవకై ఉపయోగించగలిగే శక్తిని విడుదల చేస్తాను" అంటాడు 230

Eknath Gita Chapter 4 Section 7

Bhagavat Gita

4.7

జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః {4.9}

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున

అర్జునా! ఎవడు ఈ విధముగా నా దివ్యమైన జన్మమును, కర్మమును వాస్తవముగ తెలిసికొనుచున్నాడో అట్టివాడు ఈ దేహమును విడచిన పిదప తిరిగి జన్మము నొందక నన్నే పొందుచున్నాడు

ఎవరైతే దేవుడు తమ యందు ప్రతిష్ఠితమై ఉన్నాడని, అతను తమను ఒక పనిముట్టుగా వాడుతున్నాడని, తెలుసుకొంటారో వారు ఈ జన్మలో లేదా పరలోకంలో దేహాభిమానము కలిగి ఉండరు.

మన దేహాభిమానము ఒక క్షణంకూడా లేకుండా బ్రతకలేము. అది పోవాలంటే మనము దీర్ఘంగా సాధన చేసి ఉండాలి. ఈరోజు దేవుడు మాయతో మన దేహాభిమానము తీసివేస్తే, కుండలిని శక్తిని హఠాత్తుగా విడుదల చేస్తే మనము దానిని తట్టుకోలేం. కాబట్టి తక్షణంగా వచ్చే సాధనా ఫలితాలను మనం కోరకూడదు. శ్రీరామకృష్ణ "జీవితంలో సమంగా ఉండాలంటే మన తలిదండ్రులు, సహధర్మచారిణి, పిల్లలు మొదలగువారి యందు ప్రేమతో ఉండాలి; కానీ వారి మీద మామకారంతో తాదాత్మ్యం చెందకూడదు" అని చెప్పేరు.

మనము చేతనైనంత వరకూ దేహాభిమానం తగ్గించుకోవాలి. ఎలాగంటే: రుచులు మరిగిన నాలుకను స్వాధీనంలో పెట్టుకోవడం; అంటే అతిగా తినకపోవడం; తగినంత నిద్ర, వ్యాయామం.

మనము సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు మొదలైన కాకమ్మ కథలు విని ఉండవచ్చు. వాటి వలన ఎటువంటి నష్టం లేదు. కానీ దేహాభిమానానికి తీవ్రమైన పర్యావసానాలు ఉన్నాయి. జాతులు, తెగలు, వర్గాలు మొదలైనవి దాని వలననే. దేహాభినం కలవారిలో నిజంగా అభద్రత ఉన్నది.

నేను భౌతిక చేతనమునుండి విముక్తి పొందాలని చెప్పడం వైరాగ్యంగా ఉండమని కాదు. ఎవరికైతే అతి తక్కువ దేహాభిమానం ఉందో వారే తమ బంధుమిత్రులలో మరణం సంభవిస్తే మిక్కిలి బాధ చెందుతారు. ఈ మధ్య నా బాల్య మిత్రుడు పోయేడని నా ఊరునుంచి ఉత్తరం వచ్చింది. అందులో "పురాణాలు ఏమి చెప్పినా, నీతో పెరిగిన, నివసించిన మిత్రుడు పోవడం గొప్ప దురదృష్టం" అని నా మిత్రుడు వ్రాసేడు. కాబట్టి భౌతిక చేతనంకి అతీతంగా వెళ్లాలంటే మన ప్రేమను చంపుకొని దేవుని మీదే సంపూర్ణమైన భక్తిని కలిగించుకోనక్కరలేదు. ఎందుకంటే వారు కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే. 226

Eknath Gita Chapter 4 Section 6

Bhagavat Gita

4.6

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం {4.8}

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

సజ్జనులను రక్షించుటకు, దుర్జనులను శిక్షించుట కొరకు, ధర్మమును నెలకొల్పుట కొరకు నేను ప్రతియుగమునందును అవతరించుచుందును

అవినీతి పెరిగి, అధర్మం రాజ్యం ఏలుతున్నప్పుడు భగవంతుడు పరోపకారము చేసి, ఇతరులకై పాటుపడి, ఎదురీత ఈది హింసాకాండను, స్వార్థాన్ని నిర్మూలంచడానికై కంకణం కట్టు కొని తననాశ్రయించిన వారిని రక్షిస్తాడు. సాధారణంగా భగవంతుని ఆగమనాన్ని అవతారము అంటాము.

గాంధీజీ లాంటి వారలు కూడా అవతార పురుషులే. ఆయన జీసస్, బుద్ధుడు వంటి వారు కాకపోయినా తన అహింసా వాదంతో మానవాళి పరిణామాన్ని మార్చేసిన యోగి.

ఇకపోతే మనలాంటి సామాన్యులు. మనము స్వార్థాన్ని, వేర్పాటుని వదులుకొని బ్రతుకుదామని తలిస్తే, మన చేతన మనస్సులో అవతారం దాల్చినట్లే.

శ్రీరామకృష్ణ లాంటి వారు ఒక పడవ వలె ఉండి కొన్ని వేలమందిని సంసార సాగరం మీద ఆనందంగా పయనించే బోధన చేసేరు. జీసస్, బుద్ధుడు లాంటి వారు కొన్ని కోట్లమందిని ఒక పెద్ద పడవలో సంసార సాగరాన్ని దాటిస్తారు. ఇకపోతే మనలాంటి వారు కొన్ని దుంగలతో తెప్పను చేసి, తద్వారా మన కుటుంబ౦తో ఆ సంసార సాగరంపై పయనిస్తాము.

మనలాంటి సామాన్యులము కూడా మహాత్మలు అవ్వవచ్చు. కానీ మనము దేహంలో బంధీలమై, స్వతంత్రాన్ని వద్దనుకుంటాం. ఎందుకంటే నిరంతరం మన గురించే ఆలోచించుకుంటూ, మనకు రావలసినదానిని ఇతరులు అడ్డుపడుతున్నారా అని ఆందోళన చెందుతూ ఉంటాం. మహాత్ముడు జీవైక్య సమానతను పాటించి "నీవు నేను ఒకటే" అని తలుస్తాడు.

దేవుని కృపవలన మనకు స్వార్థపూరిత కోర్కెలు -- ఆనందము, స్వలాభము-- వచ్చినపుడు, వాటిని ఎదుర్కోగలము. కోర్కెలను తరిమివేయాలనే కోర్కె దేవుని కృపవలననే సాధ్యం. మనలను అతలాకుతలం చేసే కోర్కెను జయిస్తే మిక్కిలి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతాము.

ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కోరిక, కొంచెం అహంకారం మిగిలి ఉంటే అప్పుడు దేవుని కృపకై వేచిచూడాలి. ఆయనొక్కడే మనల్ని రక్షించగలడు. యోగులు ఇలా చెప్తారు: "భగవంతుడా, నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావయ్యా! నాకు ఎన్ని ఎదురు దెబ్బలు కలిగించేవు! నీవు పట్టించుకోపోతే ఒక దెబ్బ పడిన తరువాత, 'నీవు స్వతంత్రుడవు; ఎన్నిక చేసికో' అని చెప్పేవాడివి". ఒక గొప్ప యోగైతే ఇలా ప్రార్థిస్తాడు: "నీ మీదనుంచి నా దృష్టి మళ్ళితే, నన్ను తీవ్రంగా శిక్షించు". అలా మనమూ ఉండగలిగితే, మన క్లేశాలన్నీ తొలగి, మిక్కిలి ఆనందాన్ని పొందగలము. 224

Eknath Gita Chapter 4 Section 5

Bhagavat Gita

4.5

అజో అపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపి సన్ {4.6}

ప్రకృతి౦ స్వా మధిష్ఠాయ సంభవా మ్యాత్మమాయయా

నేను పుట్టుకలేనివాడను, నశింపనివాడను, సర్వభూతములకు నాథుడ నైనను స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను

యదా యదాహి ధర్మస్య గ్లాని ర్భవతి భారత {4.7}

అభ్యుత్థాన మధర్మస్య తదా ఆత్మానాం సృజామ్యహమ్

భారతా! ఎప్పుడు ధర్మమునకు హానియు, అధర్మమునకు వృద్ధియు కలుగుచుండునో అప్పుడు నన్ను నేను సృజించు కొనుచుందును ఀ

దేవుడు అమరుడు, అపరిముతుడు అయినప్పటికే మానవాళి విపత్తులో ఉన్నప్పుడు అవతారం దాలుస్తాడు. ఆయన ప్రతి వొక్కని దేహంలో ప్రతిష్ఠితుడైనప్పటికీ, ఒకానొక వ్యక్తిలో -- ఏ దేశమైనప్పటికీ, ఏ కాలంలోనైనా-- వ్యక్తమై మానవాళిని తిరిగి ఆధ్యాత్మికత మార్గం వైపు త్రిప్పుతాడు.

ధర్మమనగా ఇతరుల కొరకై జీవించి, మనకన్న ఇతరులను ఎక్కువగా ప్రేమించడం. దానిని నిరూపించాలంటే స్వార్థ పరుల జీవితాల్ని చూడవచ్చు. వారు అభద్రతో, ఆందోళనతో కూడి ఉంటారు. మనము పరోపకారం చేసినప్పుడే మిక్కిలి ఆనందంతో, భద్రతతో జీవించగలం. జీసస్ ఇట్లు చెప్పెను: "నిన్ను నిందించినవారిని ఆశీర్వదించు; నిన్ను ద్వేషించిన వారికి మంచిని చెయ్యి". అలా చెయ్యడం వలన వారిని, మనల్ని ఉద్దరించుకుంటాం.

ఏ తగవులోనైనా మితిమీరకూడదు. అలా చేస్తే తగవు హింసాకాండగా మారుతుంది. మానవ చరిత్రలో సమస్యలు పరిష్కరించ బడ్డాయి అంటే దానికి కారణం: సహనం, క్షమా గుణం. తలిదండ్రుల పిల్లలు మధ్య; భార్యాభర్తల మధ్య; మిత్రుల మధ్య మనము ఇతరులను మనకంటే ముఖ్యులని తలంచాలి.

గాంధీజీ పెరుగుతున్నప్పుడు అనేక పొరపాట్లు చేసేరు. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళడానికి బదులు ఆటలు ఆడేవారు. యుక్త వయస్సులో పాశ్చాత్యులను వేషభాషలలో అనుకరించేవారు. వారుచేసే నాట్య విన్యాసాలకి , దుస్తులకు ముగ్దులైపోయేవారు. కానీ అతనిలో దైవ కృప కలిగి ఒక మహత్తర మనిషిగా మారేరు. దానివలన దేశము బానిసత్వం నుంచి విడుదలై, సూర్యుడస్తమించని బ్రిటిష్ రాజ్య౦ కలవర౦ చెందింది. దానికై ఒక్క తూటా కూడా గాంధీజీ, ఆయన అనుచరులు వెచ్చించలేదు.

యోగిగా మారుతానంటే మన బంధుమిత్రులు మొదట్లో నమ్మరు. అది వొకరోజు ఉండి, మరో రోజు పోయే వేషం అంటారు. గాంధీజీని మొదట్లో ఒక మోసగాడు, పిచ్చివాడు, మూర్ఖుడు అని అనేవారు. రమణ మహర్షిని మొదట్లో తప్పుగా అర్థం చేసికొన్నవారు నిర్వికల్ప సామాధి ఆయనకు సాధ్యము కానిదని అనేవారు. ఈ విధంగా నిరశన, సంశయం ఉన్నప్పుడు మనము ఓర్పుతో, నిశ్చలంగా ఉండి, మన భద్రత మనలోనే ఉందని తెలిసికోవాలి.

మనలాంటి సాధారణ వ్యక్తులపై దైవ కృప కలిగిందని మొదట్లో నమ్మలేము. ఎందుకంటే దానికి తగమని నమ్ముతాము. మనము దుర్భలులం, స్వల్పమైన వాళ్ళం, స్వార్థపరులం కాబట్టి మనని దేవుడు కరుణించడు అని అనుకొంటాం. కాలక్రమేణ మనలో భద్రత పెరిగి, ఇతరులకై పాటుపడి, మనము దేవుని కృపను నమ్మి, ఆయన మనల్ని తన కార్య సిద్ధికి ఎన్నుకొన్నాడాని నమ్ముతాము. అది మనని ఆశ్చర్య చకితులను చేసి, జీవితమంతా సాధనకై అంకితం చేస్తాం. కలల్లో శ్రీకృష్ణుడు, లేదా జీసస్ క్రైస్ట్ మనకు దర్శనమిచ్చి వాత్సల్యం చూపుతారు. మనము దాన్ని ఇష్టంగా, వినమ్రతతో స్వీకరిస్తే ఎటువంటి భయం లేకుండా ఉండవచ్చు. ఈ విధమైన మార్పు వస్తే, మనము అల్పుల మైనప్పటికీ, ప్రపంచ శాంతికై ఉద్యమించవచ్చు. మన హృదయాలలో శాంతిని ఏర్పరుచుకొని, మన కుటుంబ, సమాజ ఉద్ధరణకై జీవిస్తే, మనము ప్రపంచాన్ని మార్చ గలిగిన వారలమౌతాము. 222

Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 4 Section 4

Bhagavat Gita

4.4

అర్జున ఉవాచ:

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః {4.4}

కథ మేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి

నీవు సూర్యుని తరువాత పుట్టినావు. సూర్యుని జన్మ అతి ప్రాచీనమైనది. నీవు సూర్యునికి ఉపదేశించితి వను విషయము నేనెట్లు గ్రహించగలను?

శ్రీ భగవానువాచ:

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున {4.5}

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప

అర్జునా! నీకును, నాకును అనేక జన్మలు గడచినవి. పరంతపా! ఆ జన్మములు నన్నిటిని నేనెఱుగుదును. నీ వెరుగవు

అర్జునుడు శ్రీ కృష్ణుని ఇలా ప్రశ్నిస్తున్నాడు: "కృష్ణా! నీవూ, నేనూ సమ వయస్కులం . కానీ నువ్వు పూర్వకాలంలో మునిపు౦గవులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేనని చెప్తున్నావు. ఇది నాకు అర్థం కావటం లేదు. నీవెందుకు మథురలో జన్మించి వేల సంవత్సరాల ముందు జరిగిన విషయాలు చెప్తున్నావు?"

శ్రీకృష్ణుడు మందహాసంతో "నీకూ, నాకూ అనేక జన్మలు ఈ భూమి మీద కలిగినవి. నీవు భూమి మీద మొదటిసారి ఉండి లేవు" అని చెప్పెను.

ఆధ్యాత్మికత అలవరచుకోవడానికి పునర్జన్మ ఉందని నమ్మనక్కరలేదు. మనము పలు జన్మలు ఉంటాయని నమ్మినా ధ్యానం, ఇంద్రియ నిగ్రహం మొదలైనవి ఉపయోగపడతాయి. పునర్జన్మ ఉందని మూఢ౦గా నమ్మితే ఒక ప్రమాదమున్నది. ఒక పని ఈ జన్మలో సాధ్యంకాదని వదిలేసి ఉదాసీనంగా ఉంటాము. తక్షణమే చేయవలసిన పనులను పునర్జన్మ ఉంది కదా అని వాయిదావేయవచ్చు.

విశ్వవిద్యాలయ చదువుని ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సాధారణంగా సంవత్సరానికి రెండు క్లాసులు ఉంటాయి. వాటిని సెమిస్టర్ అంటారు. కొందరు మనమొక సెమిస్టర్ పూర్తి చేసి స్వర్గానికై దరఖాస్తు పెట్టుకోవచ్చు. అప్పుడు శ్రీకృష్ణుడు, జీసస్, లేదా బుద్ధుడు మనల్ని భూమి మీద ఏమి చేసేమని అడగవచ్చు. మనము తలిదండ్రులను, సంతానాన్ని, మిత్రులను, చివరకు శత్రువులను కూడా మనకంటే ముఖ్యులుగా తలంచక పోతే దేవుడు మనల్ని వచ్చే సెమిస్టర్ కి దరఖాస్తు పెట్టుకోమని చెప్తారు. టిబెట్ దేశస్థులు బార్డో అనే త్రిశంకు స్వర్గంలో ఎన్నో ఏళ్లు మనం నిరీక్షించాలని నమ్ముతారు.

మన జీవిత లక్ష్యం, విశ్వవిద్యాలయంలో స్వార్థాన్ని, వేర్పాటుని, వదులుకొని పట్ట భద్రులవ్వడం. మనకు పట్టాలిచ్చేవారు శ్రీకృష్ణుడు, లేదా జీసస్, లేదా బుద్ధుడు. వారు మనల్ని ఉత్తీర్ణులమని చెప్తే గాని మన లక్ష్యం చేరినట్టు కాదు.

శ్రీకృష్ణుడు అర్జునుడు భూమి మీద అనేక జన్మలు ఎత్తేడని చెప్తే నమ్మశక్యం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పేడు: "నీకు పూర్వ జన్మల జ్ఞాపకాలు లేవు. నేనూ ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని. కానీ నాకు ఇప్పటికీ నా గత జన్మలు గుర్తున్నాయి. ఎందుకంటే నేను ఆత్మ జ్ఞానము పొందేను కాబట్టి."

మనము దేహంతో తాదాత్మ్యం చెందినంత సేపూ చేతన మనస్సును అఖండంగా చేసికోలేము. అలా కాక మన నిజ స్వరూపము, దేహము కాదని, ఆత్మ అని తెలుసుకొంటే మన చేతన మనస్సు అఖండమౌతుంది. జలాలుద్దీన్ రూమి ఇలా వ్రాసేరు:

నేనో ఖనిజాన్ని, అలాగ ఎదిగి మొక్క నయ్యేను

మొక్కగా నేను మరణించేను; తర్వాత జంతువుగా పుట్టేను

జంతువుగా మరణించేను; మానవునిగా పుట్టేను

నాకు ఏమి పోగొట్టుకుంటానని చావంటే భయం?

మళ్ళీ నేను మానవుడిగా మరణించి

దేవ దూతల బృందంలో చేరుతాను

కాని నేను వాళ్లకనా ఉన్నత స్థానంలో ఉండాలి

పరమాత్మ తప్ప అందరూ మరణించవలసినవారే

నేను దేవదూతగా మరణిస్తే ఊహాతీతమైన స్థితిని పొందుతాను

నా అహంకారాన్ని వదిలి మరణిస్తే "ఆ దేవుని దగ్గరకే వెళ్తాను"

యోగులు చెప్పే సమాధి స్థితి ఇదే. ధ్యానం వలన దీన్ని పొందవచ్చు. 219

Eknath Gita Chapter 4 Section 3

Bhagavad Gita

4.3

స ఏవాయం మయాతే అద్య యోగః ప్రోక్త స్సనాతనః {4.3}

భక్తో అసి మే శాఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్

పురాతనమైన ఈ యోగమును నాకు భక్తుడవు, సఖుడవునగు, నీకు ఇప్పుడు చెప్పితిని. ఇది గొప్ప రహస్యమైనది

అర్జునుడు కృష్ణుని మిత్రుడు, భక్తుడు. దానిగురుంచి కథాకళిలో ఒక కథ చెప్తారు. శివుడు మారు వేషంలో అర్జునునితో ఇలా సంభాషణ చేస్తాడు:

"నీవు నీ గురించి ఏమనుకుంటున్నావు?"

అర్జునుడు "నేను ప్రాచీనమైన పాండవులనబడే రాజ వంశీయుడను"

"ఎప్పుడూ వినలేదు"

అర్జునుడు తన గురించి, తన కుటుంబం గురించి, తన రాజ్యం గురించి చెప్తాడు. అన్నిటికీ శివుడు "ఎప్పుడూ వినలేదు" అని అంటాడు.

అప్పుడు అర్జునుడు: "నాకో మిత్రుడున్నాడు" అంటాడు.

"ఎవరు?"

"కృష్ణుడు" అని అర్జునుడు అంటాడు.

అప్పుడు శివుడు "వెన్నని దొంగిలించే, వేణువును ఊదే, అవతార పురుషుడననుకునే పశువుల కాపరా నీ మిత్రుడు?" అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు మారు వేషంలోనున్న శివునిపై పడతాడు.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునిపై తనకున్న వాత్సల్యాన్ని ప్రకటించేడు: "అప్పుడప్పుడు ఆధ్యాత్మిక సంస్కృతి అంతమయినట్టు అనిపిస్తుంది. కానీ నేను నీ చెవిలో బోధ చేసి మేల్కొలుపుతాను. ఎందుకంటే నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు". దానినే జీసస్ వేరే విధంగా చెప్పేరు: "నీవు నీ దేవుని హృదయపూర్వకంగా, ఆత్మతో, మనస్సుతో, శక్తితో ప్రేమిస్తావు". మనము ఇతరులకు ప్రాముఖ్యతనిచ్చి, మనసారా ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. 217

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...