Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 18

Bhagavat Gita

6.18

ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమం {6.27}

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్

ప్రశాంత చిత్తుడును, రజోగుణము నశించిన వాడును, బ్రహ్మభూతుడును, పాపరహితుడును అగు ఈ యోగి ఉత్తమ సుఖమును పొందుచున్నాడు

ఎవరైతే దేవుడ్ని అన్ని జీవులయందు దర్శిస్తారో వారిలో స్థిరమైన శక్తి ఉంటుంది. ప్రపంచంలోని ఎటువంటి ప్రమాదాలు వానిని ఆందోళన పరచలేవు. వారిలో భద్రత కలిగి, మనస్సు నిశ్చలంగా ఉండి, ఆలోచనలు నియంత్రింపబడి ఉంటాయి.

ఆందోళనతో కూడిన మనస్సును శాంత పరచాలంటే మంత్రాన్ని కొన్ని వందల సార్లు ఒక పుస్తకంలో వ్రాయాలి. అలాగే ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తే మనస్సు ఆందోళన పడదు. చిన్నవారు శ్రమటోడ్చి పనిచేసి, మంత్రాన్ని జపిస్తే వారి మనస్సు శాంతింపబడుతుంది.

స్వార్థపూరితమైన కోర్కెలను పారద్రోలితే మనస్సులో మిగిలేది పరిపూర్ణమైన ఆనందం. ఆనందం కోర్కెలచే చెర పట్టబడి యున్నది.

ఆధ్యాత్మిక ఆనందం ఒక పిల్లవాని వలె, మన చుట్టూ చేతులు వేయడానికి, మనమెంత దూరం వెళ్ళినా, ముందుకు వస్తుంది. మన స్వార్థ పూరిత ఆలోచనలు తమకి ముప్పు తప్పదని తెలిసి ఆ పిల్లవానిని దగ్గిరకు రానీకుండా చేస్తాయి. మనము అజ్ఞానా౦ధకారంలో ఉన్నంత కాలము, స్వార్థ పూరిత కోర్కెలు మన మిత్రులని భావిస్తాము. మనకు దుఃఖం కలిగించే పనులు వాటివలననే మనచే చేయింపబడతాయి. ద్వేషము, పగ మనల్ని అతలాకుతలం చేసినా, వాటిచే ప్రభావితమౌతాము. ధ్యానం ద్వారా స్వార్థాన్ని నియంత్రించి ఆనందాన్ని మనలోకి ఆహ్వానిస్తాము. 370

Eknath Gita Chapter 6 Section 17

Bhagavat Gita

6.17

యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్ {6.26}

తత స్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్

చంచలమైనదియు, నిలకడలేనిదియు నగు మనస్సు ఎచ్ఛటెచ్చట సంచరించునో అచ్చటచ్చట నుండి దానిని మరల్చి ఆత్మయందే నిలుపవలెను

మనస్సు ఒకదాని తరువాత ఇంకొక కోరికను సదా కోరుతూనే ఉంటుంది. దాని వలన పూర్తి ఆనందము పొందలేకున్నాము. అంతర్గత ఆనందాన్ని పొందాలంటే మనస్సును నిశ్చలము చేసికొని స్వార్థపూరిత కోర్కెలు విడనాడాలి. ధ్యానంలో మనస్సు బాహ్యంగా ప్రసరిస్తే దానిని లోపలకు తెచ్చుకోవాలి. క్రమంగా మనస్సు ధ్యానంలో నిలకడగా ఉంటుంది. గాఢమైన ధ్యానంలో మనస్సు మంత్రం మీద కేంద్రీకరించి ఉంటుంది. అప్పుడు మంత్రం మనం వలనించేది కాక, మన చేతన మనస్సులో లీనమైపోతుంది. మనస్సును "ఇతరులను క్షమిస్తే నీవు క్షమింప బడతావు" అనే సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన మాటలమీద కేంద్రీకరించి ధ్యానం చేస్తే, మన తలిదండ్రులతో, లేదా పిల్లలతో, లేదా మిత్రులతో, విభేదాలు ఉంటే, వాటిని పరిష్కరించే శక్తి వస్తుంది. మనతో విభేదములు వున్నవారల యందు ప్రేమతో, గౌరవముతో మెలిగితే శత్రువులు కూడా మిత్రులవుతారు. 368

Eknath Gita Chapter 6 Section 16

Bhagavat Gita

6.16

సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః {6.24}

మనసై వేంద్రియగ్రామం వినియమ్య సమంతతః

శ్శనై శ్శనై రుపరమే ద్భుద్ధ్యా ధృతి గృహీతయా {6.25}

ఆత్మ సంస్థ౦ మనః కృత్వా న కించదపి చింతయేత్

సంకల్పముల వలన జనించెడి ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరల్చి, ధైర్యముతో గూడిన బుద్ధి చేత మనస్సును బాహ్య విషయముల నుండి మెల్లమెల్లగా మరలించి ఆత్మయందు ఉంచవలెను. ఆత్మకు అన్యమైన ఏ విషయమును కూడా చింతింపకూడదు

ఊహాతీతమైన భద్రత, ఆనందం పొందాలంటే స్వార్థాన్ని వీడాలి. మనలో చాలామందికి మనస్సులోని సాలె గూడులను తొలగించడానికి ఒక జీవిత కాలం పడుతుంది.

నా అమ్మమ్మ రోజూ పూజ గదిని చీపురుతో తుడిచేది. ఆ గదిని నెలకి లేదా సంవత్సరానికి ఒకమారు తుడుస్తే దుమ్ము దట్టంగా చేరి తుడవడం కష్టమవుతుంది. అలాగే మన ధ్యానం ప్రతిరోజూ చెయ్యాలి. దానివలన మన మనస్సులోని సంకల్పాలు తొలగిపోతాయి. ధ్యానం చెయ్యకపోతే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా కష్టం. ఇంద్రియాలను నిగ్రహించుకోలేక పోతే భౌతిక దేహం స్వాధీనంలో ఉండదు; భౌతిక దేహం స్వాధీనంలో లేకపోతే జీవైక్య సమానతను అనుభవించలేం.

దేవుడు మనల్ని ఎప్పుడు ఐక్యం చేసుకొంటాడో అని ఎదురుచూడడం కన్నా ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, నిస్వార్థ సేవ చెయ్యడం ఉత్తమం. అందువలన మనం చేతన మనస్సును నియంత్రించగలం. ఆధ్యాత్మిక సాధనలో తప్పులు చేస్తే, చిన్న చిన్న అడుగులు వేసి, తప్పులు సరిదిద్దుకొని లక్ష్యాన్ని చేరవచ్చు. ఒక్కొక్కప్పుడు మనము స్వార్థ పూరితంగా ఉండి ఇతరుల అవసారాలను గ్రహించలేము. మన తప్పులు వెంటాడుతాయి. అలాటప్పుడు విచారింపక మంత్ర జపం చెయ్యడం ఉత్తమం.

ఒకప్పుడు నేను మిత్రులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, ఇంద్రియాలను నిగ్రహించుకోలేక, అతిగా తినేవాడిని. ధ్యానంలో శ్రీకృష్ణుడు చెప్పిన "ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించుకోలేడో, గాలీ వానలో చిక్కుకున్న పడవవలె, ఒడ్డు చేరడు" గుర్తుకువచ్చేది. ఆ బోధ నన్ను కత్తి పోటువలె కలత పెట్టేది. అప్పుడు దాన్ని ఎలాగో ఒకలాగ పదే పదే మననం చేసికొనేవాడిని. ఇంద్రియాలు మనల్ని తప్పుడు ద్రోవలో నడిపిస్తూ ఉన్నప్పుడు, అహంకారం బంధాలను చెడిపితే, మనకు తాత్కాలికంగా సంతృప్తి కలిగినా, మనము ధ్యానంలో చెయ్యవలసిన కత్తి పోటు వంటి శ్రీకృష్ణుని బోధ గుర్తు తెచ్చుకొని, స్వార్థ పూరిత కోరికలను విడనాడాలి.

మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలంటే మంత్ర జపం చాలా ఉపయోగ పడుతుంది. మనకి కోపం వచ్చినప్పుడు మనస్సును ప్రశ్నిస్తే కోపం ఇంకా పెరుగుతుంది. మనస్సు ఒక పెద్ద కంప్యూటరు లాంటిది. అది ఒక్కమారు యంత్రంలా పని చెయ్యక ఆగిపోవచ్చు. అలాగే మనస్సు క్రోధం లేదా భయంతో ఉంటే, అది ఆత్మను ప్రభావితం చేయలేదు. క్రోధం, భయం కలిగినప్పుడు, మంత్ర జపం చేస్తూ, దీర్ఘంగా నడవడం మంచిది. అలాచేస్తే క్రోధం దయగా, భయం ధైర్యంగా, ద్వేషం ప్రేమగా మారుతాయి.

మన అలవాట్లు చిన్నప్పుడు నుంచీ ఉన్నా వాటిని ధ్యానంతో సరి చెయ్యవచ్చు. అందుకే ధ్యానం చాలా శక్తివంతమైన ప్రక్రియ. మొదట్లో కష్టం అనిపించినా, సాధన చేసి, సంపూర్ణమైన సంతృప్తిని పొందవచ్చు. మనలో చిన్ననాటి చెడు భావాలు ఉండవచ్చు. వాటిని నియంత్రించడం మన చేతులలో లేదని భావించవచ్చు. కాని ధ్యానం తో అది సాధ్యం. 367

Eknath Gita Chapter 6 Section 15

Bhagavat Gita

6.15

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృటా {6.19}

యోగినో యతచిత్తస్య యుంజతే యోగ మాత్మనః

యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా {6.20}

యత్ర చైనాత్మ నాత్మానాం పశ్యన్నాత్మని తుష్యతి

సుఖ మాత్య౦తికం యత్త ద్భుద్ధిగ్రాహ్య మతీ౦ద్రియమ్ {6.21}

వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః {6.22}

యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే

తం విద్యా ద్ధుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞితమ్ {6.23}

స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణచేతసా

ఆత్మ ధ్యానము నభ్యసించు యోగి యొక్క నియమిత చిత్తము గాలిలేనిచోట నుండు దీపము వలె నిశ్చలముగ నుండును. యోగోభ్యాసముచే నిగ్రహింపబడిన మనసు ఎచ్చట ఉపరతి నొందుచున్నదో, ఎచ్చట ఆత్మను ఆత్మయందు ఆత్మ చేత దర్శి౦చి సంతసించుట జరుగుచున్నదో, ఇంద్రియములకు లభించక, బుద్ధికి లభించు సుఖము ఎచ్చట తెలియబడుచున్నదో, ఎచ్చట చేరిన పిమ్మట చలనము ఉండదో, దేనిని పొందిన పిదప దుఃఖములు కూడా కదలింపలేవో, సర్వ దుఃఖములకు దూరమైయున్న దేదియో అదియే యోగమని చెప్పబడినది. అట్టి యోగమును విసుగు చెందక నిశ్చయ బుద్ధితో అభ్యసింపవలెను

కేరళలో గుళ్ళలో ప్రమిద దీపాలు ఈదురు గాలి లేని గూళ్ళలో పెట్టేవారు. మన మనస్సు నిశ్చలంగా ఉండే దీపం లాగ ఉండాలి.

మనం గొప్పవారిని--దేశ అధ్యక్షుడు, అతి పెద్ద పరిశ్రమ అధినేత, సినిమాలలో నటించే కథా నాయకీనాయకులు-- కలవాలని కాంక్షిస్తా౦. మనలోని ఆత్మ దర్శనం అన్నిటికన్నా లేదా అందరికన్నా ముఖ్యం.

ఆత్మ దర్శనం చేసుకొంటే ప్రపంచంలోని ధనం, సుఖం, పేరు ప్రఖ్యాతులు దాని సాటి రావు. ధ్యానం వలన వచ్చే ఆనందం వాటితో పోలిక పెట్టే అవకాశం కలిగిస్తుంది. ధ్యానం చెయ్యకపోతే అవి అల్పమైన వాంఛలని తెలియదు.

సమాధి స్థితిలో విచారము, ద్వేషము, ఎదురుచూపు, అశాంతి తొలగిపోతాయి. అది దుఃఖానికి అతీతం. మనం దేవునిలో స్థితమై, జీవులన్నిటిలోనూ దేవుని దర్శిస్తాము. శ్రీకృష్ణుడు అర్జునికి ఇలా చెప్పేడు: "నీవు పట్టుదలతో ఆధ్యాత్మిక సాధన చేసి, దుఃఖాన్ని జయించి, జీవైక్య సమానతా దృక్పథాన్ని పొందు" 364

Eknath Gita Chapter 6 Section 14

Bhagavat Gita

6.14

యదా వినియతం చిత్త మాత్మన్యే వావతిష్ఠతే {6.18}

నిస్పృహ స్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా

ఎప్పుడు నిగ్రహింపబడిన మనస్సు ఆత్మయందు నిలిచియుండునో అప్పుడు సమస్త కోరికల నుండి విముక్తుడై యోగ యుక్తుడగుచున్నాడు

ఈ శ్లోకంలో ముఖ్యాంశం వినియత౦ చిత్తం-- అనగా క్రమశిక్షణ తో కూడిన మనస్సు; ఇంద్రియాలను, మనస్సుని స్వాధీన౦లో ఉంచుకొనినది. బుద్ధుడు మనల్ని బుద్ధి పూర్వకంగా జీవనం సాగిస్తామని అనడు. అతడు మనము బాహ్య శక్తులచే కదల్పబడిన బొమ్మలవలె, ఇంద్రియ వాంఛలను తీర్చుకోవడానికి నలు దిక్కుల పరిగెత్తుతున్నామని అంటాడు. అంటే మన మనస్సుకి నచ్చిన వాటిని పొందడానికి వాటివైపు పరిగెత్తుతూ; మన అహంకారం వికర్షి౦చిన వాటినుండి దూరంగా పోతున్నాము. ఇది బ్రతకడం కాదు. కొలనులో తేలే నాచులాగ బ్రతుకుతున్నాం. ఎప్పుడైతే మన ఇంద్రియాలను నిగ్రహించి, అహంకారాన్ని అదుపులో పెట్టుకొంటామో, అప్పుడే బుద్ధిపూర్వకంగా బ్రతికినట్టు.

ఒక వంద మర కార్లు, నడిపేవారు లేక, రహదారులపై పయనిస్తే, ఎ౦తో మందికి గాయాలు తగులుతాయి. అలాగే ఇంద్రియాలచే ఉత్తేజితులై, అహంకారంతో ప్రవర్తించేవారు కూడా ఇతరులకు హాని చేస్తారు. వారు దేహేంద్రియమనస్సులను నియంత్రించుకోలేక అందరికీ బాధ కలిగిస్తారు. ఒక కారు నడిపే నేర్పరి కళ్ళు అన్ని దిశలా పనిచేస్తాయి. బహుశా వాని తల వెనుక కూడా కళ్ళున్నాయా అనిపిస్తుంది. మనకు తల వెనుక కళ్ళు ఉంటే, గతంలో చేసిన తప్పులను సరిదిద్దు కొని జీవితం దిగ్విజయంగా సాగించ వచ్చు. ఈ విధంగా ఇతరుల స్వతంత్రతను గౌరవించి, ఎవ్వరినీ మభ్య పెట్టక, ఎవ్వరిపై దాడి చెయ్యక, ఉండేవాడు, ఎప్పటికీ కారు నడిపే నేర్పరిలా ఉంటాడు. ఇది తనయందు స్థితమైన మనిషి స్వభావం: కోపిష్టులతో కలియబడక, ఎట్టి పరిస్థితులలోనూ ఇతరులను ప్రేమించి, గౌరవించి ఉంటాడు. 361

Eknath Gita Chapter 6 Section 13

Bhagavat Gita

6.13

యుక్తాహార విహారాస్య యుక్తచేష్టస్య కర్మసు {6.17}

యుక్త స్వప్నాబోధస్య యోగో భవతి దుఃఖహా

మితమైన ఆహార విహారములు, మితమైన నిద్రయు, మెలుకయు గలవానికి, కర్మలయందు ఉచితరీతిన చరించువానికి, ఈ యోగము దుఃఖమును పోగొట్టును

మనము మానసికంగా ఎదగాలంటే విషాదం అవసరం. దేవుడు ఒక దేహ శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయునివలె నుండి, మనలోని స్వార్ధ పరులను, అహంకారులను ఉద్దేశించి కొన్ని శిక్షలు విధిస్తాడు. అదే నిస్వార్థ పరులు, పరోపకారులు దేవుని శిక్షకు పాత్రులు కారు. అంటే వారు స్వార్థం, అహంకారం వీడి ఉన్నవారు.

మన దుఃఖాలను గుర్తు తెచ్చుకుంటే, అవి మనం చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడానికి తోడ్పడుతాయి. నేను చిన్న వయస్సులో అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసి దుఃఖమనుభవించేను. కానీ నా అమ్మమ్మ సహాయంతో, వేర్పాటుతో లేదా స్వార్థంతో బ్రతకడం మానుకొని, క్రోధం లేకుండా, భూత దయతో కూడి బ్రతికేను. నేను దుఃఖం గూర్చి ఎన్నో పాఠాలు నేర్చుకొని జీవితంలో చేసిన తప్పులు చెయ్యకుండా ఉన్నాను. ఈ విధంగా స్వార్థ కర్మలు విడిచిపెట్టి, మన అహంకారాన్ని బంధుమిత్రుల యందు, సమాజం మీద, చివరకు శత్రువుల మీద కూడా ప్రదర్శించక ఉంటే యాతన పడవలసిన అవసరం లేదు. 360

Eknath Gita Chapter 6 Section 12

Bhagavat Gita

6.12

నాత్యశ్న తస్తు యోగో అస్తి నచై కాంత మనశ్నతః {6.16}

న చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున

అర్జునా! ఈ యోగము అధికముగ భుజించు వానికి, అసలే భుజించని వానికి, అతిగ నిద్రించువానికి, అసలే నిద్రించని వానికి ఫలించదు

మనమేది చేసినా మితంగా చెయ్యాలి. ఇంద్రియాలను పరిమితి లేకుండా లేదా అతి తక్కువగా వాడడం మంచిది కాదు. అలాగే అపరిమితమైన ధనము, ధనము లేమి; అమితమైన జ్ఞానము, అంతులేని అజ్ఞానము; సదా కర్మలు చేయుట, అమితమైన సమయం కర్మలు చేయకుండుట కూడా మంచివి కావు. అన్ని రంగాలలోనూ సమంగా ఉండడమనే క్రమశిక్షణను అందరమూ పాటించవచ్చు.

చాలా మంది అతిగా ఆహారం తింటారు. వారికి ఉంకో వాయి వద్దనే కోరిక లేదు. మితంగా తినేవారు ఆహారం ఇంకా గిన్నెలో ఉన్నా వద్దని లేచిపోతారు. అది మొదట్లో కష్టమే; కాని అటు తరువాత భుజి౦చిన ఆహారమును ఆస్వాదించే స్థితి కలుగుతుంది. నేను రోజుకు మూడు సార్లు: ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, తినమని చెప్తాను.

నాలుకను నియంత్రించుకోవడానికి అనేక పద్దతులు ఉన్నాయి. ఒక తీపి పదార్థాన్ని తినే బదులు దీర్ఘమైన నడక చెయ్యవచ్చు. అటు తరువాతి మనస్సు మళ్ళి, తీపి పదార్థాన్ని కోరక, ఆహారంతో సంబంధం లేని వేరొకటి కోరుతుంది. ఈ విధంగా మనస్సును, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవాలి.

ఇటువంటి చిట్కాలు పాటించి మనస్సును స్వాధీనంలో పెట్టుకోవచ్చు. కానీ అదే పనిగా దానిని హింస పెట్టనక్కర లేదు. దానిని సున్నితంగా, ఓర్పుతో సాధించాలి. ఎందుకంటే మనమిన్నాళ్ళూ దానికి స్వతంత్రత నిచ్చి, ఒకటి, రొండు రోజుల్లో క్రమశిక్షణతో మెలగమనడం సాధింపలేని కార్యము. ఒక్కొక్కప్పుడు అమితమైన ద్వేషం, ఆందోళన, ఒత్తిడి కలగవచ్చు. అప్పుడు ఒక రోజు ఉపవాసం చెయ్యడం శ్రేయస్కరం. అలాగని శక్తి లేకుండా, నిర్జీవంగా ఉండనక్కరలేదు.

మితిమీరిన నిద్ర దేహానికి, మనస్సుకు, ధ్యానానికి అవరోధాలు కల్పిస్తుంది. మనమెక్కువగా నిద్రపోతే సవాళ్ళను ఎదుర్కోలేము. అతి నిద్ర: "నాకు మానవునిగా బ్రతకడం ఇష్టం లేదు; ఒక చెట్టు లేదా రాయిగా ఉంటాను" అని చెప్పడం. అలాగే నిద్ర లేమి కూడా ధ్యానానికి అవరోధం. రాత్రి నిద్రకు ఎంతవేగిరంగా ఉపక్రమిస్తే అంత వేగిర౦; ఉదయాన్నే వేగిర౦గా లేవడం అలవరచుకోవాలి. నిద్రకు తొందరగా, లేదా ఆలస్యంగా ఉపక్రమించడం. నిద్రనుండి తొందరగా లేదా ఆలస్యంగా లేవడం; అతిగా తినడం లేదా సరిగ్గా తినకపోవడం; క్రోధంతో లేదా దైన్యం తో ఉండడం మొదలగునవి మన ఆలోచనల, మాటల, కర్మల వలన ఏర్పడతాయి. వాటిని ధ్యానంతో నియంత్రించవచ్చు. 359

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...