Sunday, April 10, 2022

Eknath Gita Chapter 12 Section 3

Bhagavat Gita

12.3

యే త్వక్షర మనిర్దేశ్య౦ అవ్యక్తం పర్యుపాసతే {12.3}

సర్వత్రగ మచింత్యంచ కూటస్థ మచలం ధృవమ్

సంనియమ్యే౦ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః {12.4}

తే ప్రాప్నునంతి మామేవ సర్వభూతహితే రతాః

ఎవరయితే ఇంద్రియములను నిగ్రహించి, అంతటను సమబుద్ధి కలిగి, సర్వ ప్రాణులకు మేలు చేయుటయందు పరమాసక్తి గలవారై అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తమును, సర్వత్రగము, చింతించుటకు వీలు కానిదియు, కూటస్థము, అచలము, ధృవము నైన బ్రహ్మమును ఉపాసించుచున్నారో వారే నన్ను పొందుచున్నారు. ఀ

నిర్గుణ దైవాన్ని ఊహించలేం. కానీ దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులలో అట్టి దైవాన్ని బ్రహ్మన్ అని అంటారు. ఈ రోజుల్లో గుణములతో కూడిన దైవాన్ని పూజించడం మూఢ నమ్మకం లేదా మేధ యొక్క బలహీనత అని తలిచేవారు చాలా మంది ఉన్నారు. జ్ఞాన యోగం మేధకి సంబంధించినది కాదు. మేధ ద్వంద్వాలని -- ఉదాహరణకు తెలిసికొనేవాడు, తెలిసికోబడేది -- విశ్లేషిస్తుంది. నిర్గుణ దైవాన్ని తెలిసికోవాలంటే ద్వంద్వాలను అధిగమించాలి. అంటే తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది ఏకమై ఒకే అఖండమైన బ్రహ్మన్ ఉన్నాడనే జ్ఞానము కలుగుతుంది. దీనినే నిర్వికల్ప సమాధి అని అంటారు. శ్రీ రామకృష్ణ ఉప్పుతో చేయబడిన బొమ్మ దృష్టాంతం ఇచ్చేవారు. ఒక ఉప్పుతో చేయబడ్డ బొమ్మ సముద్రంలో ప్రవేశించిన వెంటనే కరిగిపోతుంది. మరి సముద్రం యొక్క విస్తీర్ణం చెప్పేది ఎవ్వరు?

యోగులు నిర్వికల్ప సమాధిలో అన్ని భేదాలను అధిగమించి బ్రహ్మన్ లో రమిస్తారు. కానీ దాన్ని వివరించేది ఎలాగ అన్న ప్రశ్న మిగిలిపోతుంది. 13 వ శతాబ్ది మైస్టర్ ఎక్ హార్ట్, 8 వ శతాబ్ది ఆది శంకరులు ఈ విషయాన్ని విశ్లేషించారు. 5 వ శతాబ్ధి డై ఓనిసియస్ ది అరియో పెగైట్ ఇలా వ్రాసెను:

తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది మధ్య గల భేదాన్ని దాటితే సాధకుడు పేరులేని, రూపంలేని వాస్తవ౦తో ఏకమై పదార్థాల కంటే విలక్షణమైన స్థితి పొందుతాడు. తన మేధను, మనస్సును నిశ్చలం చేసి తెలుసుకోవడానికి అతీతమైన స్థితిలో ఉంటాడు

జ్ఞాన యోగం, కర్మ యోగం, భక్తి, రాజ యోగం మొదలైన మార్గాలు నిజానికి వేర్వేరు కావు. అవి అన్నీ ఒకే ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే మార్గాలు.

దాన్ని అర్థం చేసికోవడానికి జ్ఞాన మార్గా౦లో వెళ్ళిన వ్యక్తుల జీవిత చరిత్రలను పరిశోధించాలి. ఆది శంకరుడు నిర్గుణ బ్రహ్మన్ ని ఏకం అద్వితీయం -- అనగా రెండవది లేదు--అని తన స్వీయానుభవంతో వర్ణించేరు. ఆయన అద్వైతాన్ని స్థాపించినా శివుడు, పార్వతి మొదలైన సగుణ దేవతలయందు భక్తితో అనేక స్తోత్రాలు వ్రాసేరు. ఉదాహరణకు:

నీవు జగన్మాతవు

నా యందు నీకున్న ప్రేమ గురించి అనుమాన మెందుకు?

ఒకని లెక్కలేనన్ని తప్పులు చేసినా

వాని తల్లి వానిని ఎప్పటికీ విడిచి పెట్టదు

శంకరులు 32 వ ఏట కైవల్యం పొందేరు. అంతకు ముందు ఆయన భారత దేశంలోని శకలాలుగా ఉన్న మతాలను ఏకం చెయ్యడానికై, అనేక మఠాలు స్థాపించుటకై, ఉపనిషత్తులకు భాష్యం వ్రాయడానికై తన సమయాన్ని అర్పించేరు.

శంకరులు అద్వైత ప్రతిపాదనలో నిర్గుణ బ్రహ్మ ఉపాసన గురించి అనేక విధాలుగా వివరించేరు. అది వర్ణింప శక్యము కానిది ఎందుకంటే అది అంతటా ఉంది. దానికి ద్వితీయం లేదు. దానిని భాషతో, ఆలోచనలతో పట్టుకోలేము. అది అక్షరం--అనగా ఎప్పటికీ తరిగి పోయేదికాదు, ఆద్య౦తాలు లేనిది, ఎప్పటికీ నాశము కానిది. అది అనిర్దేశ్య౦ -- దాన్ని చూపలేము; దాన్ని నిర్వచించ లేము; అది బయట, లోపల ఉండేది. అవ్యక్తం -- అనగా వ్యక్తము కానిది, చూడబడనిది ఎందుకంటే చూసేవారు వేరుగా లేరు కనుక. సర్వత్రగం -- అది అన్ని చోట్లా ఉండి, ప్రతిదానికి ఉనికి నిచ్చేది. అచలం-- అనగా మార్పు లేనిది.

ఉపనిషత్తులు "తత్ త్వం అసి" అనగా నీవు దానిగా ఉన్నావు అంటాయి. ఇది మన సహజ స్థితి. ఆత్మ రూపేణ మనమెప్పుడూ పుట్టలేదు, ఎప్పటికీ చనిపోము. నేతి, నేతి ప్రక్రియతో నేను దేహాన్ని కాదు, మనస్సును కాదు అని చెప్పుకుంటూ పోవచ్చు. కానీ దానివలన మన చేతన మనస్సు ఎంతవరకు ప్రభావితమౌతుందో చెప్పలేము. మనకి కోపం, అనుమానం, సందిగ్దం మొదలైన మానవ లక్షణాలు ఎప్పటికీ ఉండేవే. కాబట్టి ఇవి జ్ఞాన సముపార్జనకి ఉపయోగపడవు. కొందరిలో అవి అహంకారాన్ని పెంచి తమపై అనురాగాన్ని పెంచుతాయి.

అలాగే జ్ఞాన యోగానికి సంబంధించిన విషయాలు శ్రీకృష్ణుడు చెప్పిన పై శ్లోకాల్లో ఉన్నాయి. సమ్నియమి ఇన్ద్రియగ్రామం -- అనగా దేహం మన స్వాధీనంలో ఉండడం. ఇంద్రియాలను నియంత్రించడం. సర్వత్ర సమబుద్ధయ --అనగా ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండుట; ఇంద్రియాలతోనూ, వస్తువులతోనూ తాదాత్మ్యం లేకుండుట; శత్రువులు, మిత్రులు లేకుండుట. సర్వభూతహితే రతాః -- అనగా ఇతరులను సేవించి ఆనందం పొందుట; స్వార్థమే ఎప్పుడూ చూసికోకుండుట. నా ఉద్దేశంలో "జ్ఞాన యోగం ఆచరణలో పెట్టగలిగితే, దానితో అవసరం లేదు; అవసరమైతే దానిని ఆచరణలో పెట్టలేము".

ఈ నేపథ్యంలో శ్రీ రామకృష్ణ బృందావనంలోని గోపికల కథ చెప్తారు. మనము శ్రీకృష్ణునిపై భక్తి ఉంటే ఆ గోపికల లాంటివారలమే. ఒక రోజు ఒక జ్ఞాన యోగి బృందావనానికి వచ్చేడు. అక్కడ గోపీకలందరూ ఒక అవతారపురుషుడ్ని ఆరాధిస్తున్నారని చూసి, వాళ్ళకు బ్రహ్మన్ గురించి వివరించేడు. వాళ్ళు చివరకు "మాకు ఇదేమీ అర్థం కాలేదు. మాకు తెలిసిందల్లా చూసి, ఆనందించి, ప్రేమించ గలిగిన శ్రీకృష్ణుడు" అని చెప్పేరు.

శ్రీకృష్ణుడు చెప్పేది మన మేధమీద మనకి ఎంతో నమ్మకమున్నా అది నిర్గుణ బ్రహ్మన్ ని చూడలేదు. మనమున్న స్థితిలో దేహ రహితమైన చేతనాన్ని ఎలా పట్టుకోగలం? ఆత్మ శాశ్వతమైనది, మార్పులేనిది కావచ్చు. కాని దానికి ఒక ఉపాధి అవసరం. ఇదే అవతారాల యొక్క రహస్యం. దేవుడు మానవ రూపాల్లో అవతారాలు ఎత్తి మన ఊహకు అందేలా చేసికోబడి, మనను ఐకమత్యంతో నడిపించగలిగే శక్తి. సెయింట్ బెర్నార్డ్ "కనిపించని దైవము భౌతికమైన మానవ రూపాముతో అవతారమెత్తడానికి కారణం పరస్పర ప్రేమతో బ్రతుకుతున్న మనల్ని తన వైపు త్రిప్పుకొని, క్రమంగా ఆధ్యాత్మికమైన ప్రేమను పెంపొందించడానికి". 340

Eknath Gita Chapter 12 Section 2

Bhagavat Gita

12.2

శ్రీ భగవానువాచ:

{12.2}
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే

శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః

నాయందే మనస్సు నిలిపి, నిత్యయుక్తులై, ఉత్తమమైన శ్రద్ధతో కూడి నన్నే ఉపాసించుచున్నారో వారు యోగి శ్రేష్ఠులని నా అభిప్రాయము

ఒక గ్రామస్తుడు ధ్యానం నేర్చుకోవడానికి ఒక గురువు దగ్గరకు వెళ్ళేడు. గురువు అతన్ని ఓంకారం జపించమని చెప్పేడు. ఆ గ్రామస్తుడు కొన్నాళ్ల తరువాత గురువు దగ్గరకు వచ్చి, తనకు ఓంకారం పనిచెయ్యటం లేదని చెప్పేడు. అప్పుడు గురువు నీకిష్టమైనది ఏమిటి అని అడిగేడు. ఆవు అని గ్రామస్తుడు చెప్పేడు. అయితే ఆవు మీద ధ్యానం చెయ్యమని గురువు చెప్పేడు. కొన్ని రోజులు తరువాత గురువు గ్రామస్తుడు ఎలా ఉన్నాడో చూద్దామని వాని ఇంటికి వెళ్ళేడు. ఇంటివాళ్ళు అతను మూడు రోజులపాటు ధ్యానంలో ఉన్నాడని చెప్పేరు. అది విని గురువు ఆశ్చర్యం చె౦ది, గది తలపును కొట్టి బయటకు రమ్మన్నాడు.

"నేను ధ్యానం చేస్తున్నాను" అని గ్రామస్తుడు చెప్పేడు.

"వెంటనే వెలుపలకు రా. నీతో మాట్లాడాలి" అని గురువు అన్నాడు.

"నేను బయటకు వద్దామంటే నా కొమ్ములు అడ్డుతున్నాయి" అని గ్రామస్తుడు బదులు చెప్పేడు.

ధ్యానంలో మనం దేని మీద ఏకాగ్రత చూపిస్తామో అదే అవుతాం. మన కోర్కెలు, నిర్ణయాలు, విధి మన చేతిలోనే ఉంటాయి. మనము దేనినైతే ప్రేమిస్తామో అదే అవుతాం.

ఈ నేపథ్యంలో మనమంతా చాలా కాలంనుంచి ధ్యానం చేస్తున్నాము. కానీ సమస్య ఏమిటంటే మనం దేనిమీదైతే ధ్యానం చేస్తున్నామన్నది నియంత్రించలేము. దానికి విరుద్ధ ఉదాహరణ: ఒకడు డబ్బుకై ఏదైనా చేస్తాడు. అలా ఎన్నో వ్యాపారాలు డబ్బుకై చేసి అది తప్ప వేరే ధ్యాస లేకున్నాడు. వాడు సిగరెట్ లేదా మారణాయుధాలు చేసే సంస్థలతో వ్యాపారం చేయడానికి వెనుకాడడు. వాడికి డబ్బు తప్ప వేరే మార్గం తెలీదు. ఇదే మన ఆలోచనలో ఉన్న శక్తి.

మనము స్వప్రయోజనానికి ఎలాగైతే ఏకాగ్రతతో ఉంటామో, మనం ప్రేమతో మానవాళికి ఉపయోగపడే ఒక ఆదర్శాన్ని ఎన్నుకొని దానిపై ధ్యానం చేయవచ్చును.

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టేడు. అతను పెరుగుతున్నప్పుడు సాహిత్యం, సంగీతం మొదలైన కళళయందు పూర్తిగా మునిగి తేలేడు. కానీ ఒకమారు జీసస్ క్రైస్ట్ గురించి చదివిన తరువాత అతడు పూర్తిగా మారిపోయి, జీసస్ లాగే తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొన్నాడు. జి కె చెస్టర్ టన్ "మీకు జీసస్ కి చేరువ కాలేరని తలుస్తే, ఆయన ఇచ్చిన బోధలు నమ్మ శక్యం కాకపోతే, ఆయన సంపూర్ణమైన శిష్యుడు ఫ్రాన్సిస్ ని చూడండి" అని చెప్పెను.

మనలో చాలామందికి నిజమైన ప్రేమ మీద పూర్తి అవగాహన లేదు. ప్రసార మాధ్యమాలు ఇద్దరు కౌగలించుకుంటే అదే ప్రేమ అని అనుకునేలాగా మనల్ని మార్చేయి. అదే ఒకనిపై మరొకడు క్రోధం ప్రదర్శిస్తే, వాడు ఓర్పుతో సహిస్తే, వాడు ప్రేమతో ఉన్నాడు అంటే అందరూ మనల్ని పరిహాసం చేస్తారు. యోగులకు ప్రేమ భౌతికమైన ఆకర్షణకే పరిమితం కాదని తెలుసు.

సెయింట్ పాల్ ప్రేమ గురించి ఇలా చెప్పేరు:

ప్రేమ బాధను అనుభవిస్తుంది; ప్రేమకి దేనిపై అసూయ ఉండదు; ప్రేమ తప్పు నడవడికతో ఉండదు; దానికి స్వార్థం లేదు, అసహనం లేదు; చెడును కోరదు; తారతమ్యాలు చూడదు; కానీ సత్యాన్ని కోరుతుంది; ప్రతీదీ నమ్ముతుంది; దేన్నీ కప్పి పుచ్చదు; ఆశతో ఉంటుంది; ప్రతీదీ సహిస్తుంది; ఎప్పటికీ అపజయం పొందదు

గీత శ్రీకృష్ణుని ప్రేమించమని చెప్తుందని అనుకోవచ్చు. నిజానికి గీత ప్రతి ఒక్కరినీ ప్రేమించమని చెప్తున్నాది. ఎందుకంటే ఒకరిని ప్రేమించడానికి మన చేతన మనస్సులను ఐక్యం చేసికోవాలి.

ఆది శంకరుడు దేవునికి, సృష్టికి మధ్య భేదం లేదని తన అద్వైత సిద్ధాంతం గురించి బోధ చేసెను. సెయింట్ పాల్ "నేనుకాదు; క్రైస్ట్ నాలో నివసిస్తున్నాడు" అని చెప్పెను. అంటే ప్రేమించేవాడు, ప్రేమించబడేవాడు ఏకమై ఉన్నారు. కొందరు దంపతులు వేర్వేరుగా ఉంటారు. "ఇది నాది; అది నీది; నీ పరిధిలో నీవు ఉండాలి; నా పరిధిలో నేనుంటాను" అని తమ ధర్మాన్ని ప్రకటించుకొంటారు. వారి మధ్యలో ప్రేమలేదు. వారి మధ్యలో ఉన్నది ఒక ఒప్పందం. ప్రేమకి ఎటువంటి విభేదాలు ఉండకూడదు.

నేనిలా ప్రసంగిస్తే కొందరు "మేము ఒక్క రోజు కూడా అలాగ ఉండలేదు. ఇక జీవితాంతం అంటే వీలవ్వదు. బహుశా మీ ఉద్దేశంలో నేను నిజంగా ప్రేమించలేను" అని అనేవారు. మనమందరమూ ప్రేమించడం నేర్చుకోవచ్చు. మొదట్లో అవకతవకలతో ఉంటుంది. మనలో స్థిరాభిప్రాయాలు, అపోహలు ఉంటాయి. అలాగని "మనము వేరుగా ఉండి ప్రేమించుకుందాము" అనడం నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కలగాలంటే చాలా శ్రమ, ఏళ్లు పట్టవచ్చు. మనం సంపూర్ణమైన ప్రేమకై వేచి ఉండనక్కరలేదు. కొంత ప్రయత్నంతో అందరూ లబ్ది పొందవచ్చు.

ఇదే గీత చెప్పే ప్రేమ. దీన్ని మన బంధాలన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఒక దంపతులు ఏకమవ్వటానికై ముందే నిర్ణయించుకు౦టారు. దాన్ని పెంపొందించుకోవాలి.

ముస్లిం యువతులు బురఖా వేసుకొని మనలో వారి ముఖం చూడాలనే ఆశక్తిని కలిగిస్తారు. అదే విధంగా మనకి దైవానికి మధ్య ఒక తెర ఉంది. దాన్ని తొలగించుకోవడానికి ధ్యానంతో ప్రయత్నిస్తాము. కొన్నేళ్ళ తరువాత ఆ తెర తొలగింపబడి దైవ సాక్షాత్కారాన్ని పొందవచ్చు.

చాలామంది ప్రేమ అంటే ఇద్దరి మధ్యలో ఉ౦డేదని తలుస్తారు. అది భౌతిక పరంగా నిజం కావచ్చు. కాని మన ప్రేమకి పరిమితి లేదు. మనం ఒకరినే ప్రేమించడంతో సంతృప్తి పొందలేము. మనకు కావలసినది సంపూర్ణమైన ప్రేమ. మనమే ప్రేమకి ప్రతిరూపం అవ్వాలి. డోస్టోవ్స్కీ ది బ్రదర్స్ కారమజోవ్ అనే పుస్తకంలో ఇలా వ్రాసేరు:

దేవునిచే సృజింపబడిన సృష్టినంతా ప్రేమించు. ప్రతీ ఇసుక రేణువును ప్రేమించు. ప్రతి ఆకును, కాంతి పు౦జాన్ని ప్రేమించు. జంతువులను, పక్షులను ప్రేమించు. చెట్లను ప్రేమించు. ప్రతీ శకలాన్నీ ప్రేమించు; శకలాన్ని ప్రేమిస్తే సర్వం దేవునిమీద ఆధారపడి ఉన్నదనే రహస్యం తెలుసుకొంటావు. ఈ విధ౦గా ఆ రహస్యం యొక్క అవగాహన దినదినాభివృద్ధి చెందితే దేన్నీ విడిచిపెట్టక సమస్త ప్రపంచాన్ని ప్రేమిస్తావు.

ఇదే నిజమైన ఐకమత్యం అంటే. ఈ రోజుల్లో మన సమాజంలో గందరగోళం పేరుకుపోయింది. అది మన ఇళ్ళలోకీ, హృదయాలలోకీ చొచ్చుకు పోయింది. కాబట్టి మనము సంపూర్ణమైన ప్రేమను అలవరుచుకోవాలి. ఒక హసిడిక్ యోగి ఇలా అన్నారు: సమాజం దేవుని బండి. పరస్పర ప్రేమ తక్కువగా ఉంటే ఆ బండి గాడి తప్పుతుంది. అలాటప్పుడు ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. ఎప్పుడైతే పరస్పర ప్రేమ తక్కువగా ఉంటుందో ప్రేమకై ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి.

ఒక వ్యక్తి రబ్బీ ఇస్రేల్ బాల్ షెం వద్దకు వచ్చి "నా కొడుకు దేవుడికి దూరమవుతున్నాడు. నేనేమి చెయ్యాలి?" అని అడిగేడు. దానికి రబ్బీ ఇచ్చిన సమాధానం: "వానిని ఇంకా ఎక్కువ ప్రేమించు". ఇదే నా అమ్మమ్మ చెప్పేది. ఐకమత్యానికి దీనికన్నా ఉపయుక్తమైన, కళాత్మకమైన, సంతృప్తికరమైన మార్గం లేదు. దీనివలన మన జీవితమనే పూవులు వికసిస్తాయి; కాయలు కాస్తాయి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ప్రతీదీ సరిగా ఉంటుంది. ప్రేమ అంటే జ్ఞానం, క్రియ; దానివలన దేవుని చేరడానికి ఉన్న మార్గాలన్నీ ఏకమై ఉంటాయి. 336

Eknath Gita Chapter 12 Section 1

Bhagavat Gita

12.1

అర్జున ఉవాచ:

{12.1}
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్యా౦ పర్యుపాసతే

యే చాప్యక్షర మవ్యక్త౦ తేషాం కే యోగవిత్తమాః

కొందరు భక్తులు వారి మనస్సును సదా నీయందే నిలిపి నిన్ను ఉపాసించుచున్నారు. మరికొందరు అవ్యక్తమైన అక్షర పర బ్రహ్మమును ధ్యానించు చున్నారు. వీరిలో ఉత్తమ యోగులెవరు?

అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వ రూపమును చూసి అతనితో శాశ్వతముగా ఐక్యమవ్వాలని కాంక్షి౦చెను. ఈ విధంగా చాలామంది యోగులు కాంక్షిస్తారు. భగవంతుడు తనపై ప్రేమను పెంపొంది౦టకు కనీకనబడనట్టు ఉంటాడు. మనమా ఆనందాన్ని పొందుతే, మనమాశించేది శాశ్వతంగా ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి చోటా, ప్రతి నిమిషం, ఆయన ఎరుక కలిగి ఉండాలని.

ఈ శ్లోకంలో అర్జునుడు దేవునితో ఐక్యము పొందడం ప్రేమ వలననా లేదా జ్ఞానం వలననా అని అడుగుతున్నాడు. ఇది చాలా పర్యావసానాలకి దారి తీస్తుంది. ఎందుకంటే దానివలన ఒక ప్రశ్న కలుగుతుంది: మనము ఎవరము మరియు మనము ఏ విధముగ మార్పు చెందగలము?

ఇది ఒక తత్త్వ సంబంధితమైన అంశం కాదు. దీనిని మన జీవిత౦లో ప్రతి విషయంలోనూ అన్వయించవచ్చును. పరిసరాలు, భౌతిక, మానసిక స్థితులు మన భౌతిక పరమైన వ్యక్తిత్వము మీద ఆధారపడి ఉన్నవని తలుస్తాము. శాస్త్రజ్ఞులు మన వ్యక్తిత్వము జన్యువుల, పరిసరాల మీద ఆధారపడి ఉన్నదని చెప్తారు. కాబట్టి మన చేతన మనస్సులో ఒక నిర్ణయానికి వస్తాం: మన స్వభావము ముందే నిర్ణయించబడినది. మనము దాన్ని మార్చలేము.

ఈ విధంగా ఆలోచించడం విచార కరం. విలియమ్స్ జేమ్స్ ఇలా చెప్పెను: జీవితం మన భౌతిక దేహాన్ని పూర్తిగా ఉపయోగించక చిటికిన వేలుతో సాగించడం వంటిది. మనకు పూర్తి దేహం లేదని, చిటికిన వేలొక్కటే ఉందని నమ్ముతా౦.

ఐన్స్టీన్ ని ఒకరు "మీరు ప్రతిపాదించిన రిలేటివిటీ సిద్ధాంతాన్ని ఎలా కనుగొన్నారు?" అని అడిగేరు. ఆయన "నేను తరతరాలుగా పాతుకుపోయిన సిద్ధాంతాలను ప్రశ్నించేను" అని సమాధానమిచ్చేరు. అలాగే గీత వ్యక్తిత్వానికి సంబంధించిన పాత సిద్ధాంతాలను ప్రశ్నిస్తుంది. దీనిని మానవాళికి అన్వయించుకోవాలి.

మనము జన్యువులము కాము. మనం ఆలోచనల సముదాయం. నడవడిక జన్యువులచే నిర్ణయింపబడవచ్చు. కానీ మన ఆలోచనా సరళిని విశ్లేషిస్తే పురాతన పద్ధతులను దాటి, మన వ్యక్తిత్వాన్ని మలచుకోవచ్చు.

ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, శాస్త్రజ్ఞులు చెప్పే సిద్ధాంతాల మధ్య తేడా లేదు. ఎందుకంటే ప్రకృతిని పరిశీలించడమ౦టే మన జీవితాలను పరిశీలించడమే. సి పి స్నో ఐన్స్టీన్ సిద్ధాంతాల గురించి ఇలా అన్నారు: ఆయన దేశకాల పదార్థాలను మేళవించేరు. కానీ శాస్త్రజ్ఞులు ఎంత ప్రయత్నించినా పరిమితమైన భౌతిక ప్రపంచాన్ని దాటి వెళ్లలేరు. స్పినోజా "పరిమితమైనది అపరిమితమైన దానిపై ఆధారపడి ఉన్నదని" చెప్పేరు.

ఇది దేశ కాల, పదార్థ, శక్తి కి మాత్రమే పరిమితంకాక మన వ్యక్తిత్వానికి సంబంధించినది కూడా. జీవితంలోని సమస్యలు -- అనగా ఆరోగ్యము, ఆనందము, బంధాల లేమి--భౌతిక పరంగా పరిష్కరించలేము. ఇంకా భౌతికమైన పరిష్కారం చేస్తే ఆ సమస్యలు ముదురుతాయి. ఎందుకంటే కారణాన్ని వెదకకుండా లక్షణాలనే చూస్తున్నాము కనుక.

నేను వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా అతిగా తినడాన్ని నివారించగలరని చదివేను. అంటే అది తప్ప వేరే మార్గం లేదని చెప్పక చెప్పడం. అదే ఒక యోగి చేతన మనస్సు లోతులను పరిశీలించి ఆ వ్యాధికి కారణమును కనుగొంటాడు. స్పినోజా దేహంలోని జీవ రసాయన వ్యవస్థ వ్యక్తిత్వాని పై పొర మాత్రమే అని చెప్పెను. మన ఆత్మ చేతన మనస్సు కేంద్రంలో ఉంది. చేతన మనస్సు లోతుకు వెళితే మన వ్యక్తిత్వాన్ని మన ఇష్టానుసారం మలచుకోవచ్చు.

నేను జన్యు వ్యవస్థ ఒక చలన చిత్రంలాగా ఉంటుందని చదివేను. అది ఎలా అంటే మన జీవితంలోని అన్ని ముఖ్యాంశాలు ముందే నిర్ణయింపబడినవని. మెదడు, నాడీ వ్యవస్థ మన జన్యువులు మీద ఆధారపడి ఉన్నవని శాస్త్రజ్ఞులు చెప్తారు. అంటే మనకు కలిగే ఆలోచనలు, మన వ్యక్తిత్వం పుట్టుకతోనే నిర్ణయింపబడినవి. మనం దేహం, దాని జీవ వ్యవస్థకే పరిమితమని తలుస్తే అది నిజమవ్వచ్చు. కానీ మనము జన్యు పరమైన డి ఎన్ ఏ కాము. జన్యువులు మన వొడ్డూ, పొడుగూ నిర్ణయించవచ్చు. మన ఆధ్యాత్మిక పెరుగుదలను నిర్ణయింపలేవు. మన ఆలోచనలను సవ్యంగా నడిపిస్తే మెదడును నియంత్రింపవచ్చు. అనగా నడవడికను నిర్దేశించే నాడీ వ్యవస్త, జన్యువుల ప్రభావము మన ఆధీనంలో పెట్టుకోవచ్చు. ధ్యానంతో జన్యువుల పరమైన డి ఎన్ ఏ ను మార్చుకోవచ్చు.

మన జీవితం ఒక చలన చిత్ర మనుకొంటే, జన్యువులు దాని నిర్మాణ౦లో సహాయకులు మాత్రమే. మన మనస్సు, ఇంద్రియాలు వివిధ పాత్రలు ధరించేవారు. వివిధములైన అన్యమనస్కత తక్కిన పాత్రధారులు. దీనికొక భూమిక లేదు. ఇది సినిమాలో మొదటి రీలు. దానిని పూర్తిగా విశ్లేషిస్తే మనము తక్కిన చిత్రం చూడం.

కానీ ధ్యానంలో చలన చిత్ర నిర్మాణంలో ఉపయోగించే పరికరాలను ఆత్మ వైపు మళ్లించగలం. చిత్ర నిర్మాణ౦లో సహాయకులు మారరు. కానీ మనకు క్రొత్త భూమిక వస్తుంది; క్రొత్త నాయకీనాయకులు వస్తారు. అంటే మనము ఒక క్రొత్త వ్యక్తిగా మార్పు చెందుతాము. దానినే యోగులు మనము ఈ జన్మలోనే పునర్జన్మ పొందేము అని చెప్తారు. ఎక్ హార్ట్ చెప్పినట్లు: "వృద్ధుడు మరణించేడు; క్రొత్త వ్యక్తి జన్మించేడు; బికారి మరణించేడు; రాజ కుమారుడు పుట్టేడు". 331

Eknath Gita Chapter 11 Section 26

Bhagavat Gita

11.26

మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్స౦గ వర్జితః {11.55}

నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ

పాండు తనయా! ఎవడు నా కొరకే కర్మలాచరించుచు, నేనే పరమగతి యని భావించి, నాకు భక్తుడై సంగరహితుడై సకల భూతముల యందును వైర బుద్ధి లేక యుండునో వాడు నన్నే పొందుచున్నాడు ఀ

కొందరు గాఢమైన భక్తి గలవారు దేవుడ్ని ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ, శ్రీ రామకృష్ణ వారలు అట్టివారు. దేవుని ప్రత్యక్షంగా చూడడం, దేవదూతల వాక్కు వినడం మనని ఆశ్చర్య పరచినా, నేను ఒక సాధారణమైన విషయం చెప్తాను. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పేది: ఎవరైతే తమ సర్వ కర్మలు దేవునికి నిస్వార్థంగా, దురాలోచన లేకుండా అర్పిస్తారో, వారు దేవుని సదా స్మరిస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ అటువంటి మనీషి. ఆయనకు దేవుడు ప్రత్యక్షము కాలేదు; దేవదూతలు ఆయనతో మాట్లాడలేదు. కానీ ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అమితమైనది. ఆయన తన మిత్రుల, --శత్రువులకై కూడా-- క్షేమానికై తన లాభం చూసుకోకుండా చాలా పాటు పడ్డారు. ఆయన తన ప్రత్యర్థులను బలంతో కాక, ప్రేమతో చూసేవారు.

ఇటువంటి దైవ భక్తి మనం ఎప్పుడైనా అలవరచుకోవచ్చు. ఎప్పుడైతే మనము నిస్వార్థ౦తో కుటుంబము, సమాజము, ప్రపంచము యొక్క క్షేమానికై పాటు పడతామో మనము దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. మనను నొప్పించే పరుష మాటలు ఇతరులను కూడా నొప్పిస్తాయని తలచి, మనసా వాచా కర్మా మంచినే చేస్తే మనము దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. ఎవరైతే మనపై క్రోధం చూపిస్తారో వారియందు దయతో ప్రవర్తిస్తే కూడా మనం దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పే భక్తి, దేవునికి భక్తునికి మధ్యనున్న సంబంధమే కాక, సకల ప్రాణులను కలుపుకొని.

మనం జీవైక్య౦ గురించి ఎరుక గలిగి ఉంటే, దేవుని అన్ని జీవులలోనూ చూస్తాము. బుద్ధుడు మనం ప్రతి మనిషిని, జంతువుని ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్టు ప్రేమించాలని చెప్పెను.

9 వ అధ్యాయం చివర్లో మనం ఆయన మీద గాఢమైన భక్తితో ఉంటే ఆయనతో ఐక్యమవుతామని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు.

ఈ ఉత్తమ లక్ష్యం మనం కలిగి ఉంటే మన జీవితం అర్థవంతమై, మనం చేసే ప్రతి నిర్ణయం సమిష్ఠి క్షేమానికై ఉంటుంది. ప్రతి ఉదయం మనం మన గురించేకాక, ఇతరుల క్షేమానికై బ్రతకాలని అనుకుంటే, మనం ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా ఉత్తమ పౌరులుగా బ్రతకవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఒకే పాలు చేయరు. కొందరు వైద్యులు, మరికొందరు ఉపాధ్యాయులు, ఇంకొందరు తలిదండ్రులు. మనమే ఉపాధి అవలంబించినా మన వంతు మంచి మనం కాక ఇతరులు చెయ్యలేరు. మనం నిస్వార్థంగా ఉండి, దేవుడు అందరి అంతర్గతములలో ఉన్నాడు కనుక, మనము ప్రపంచ క్షేమానికై పాటుపడవచ్చు.

దీనికి ఒక కథ చెప్తారు. సూర్యుడు సృష్టింపబడిన రోజున సూర్యోదయం చూసి ప్రజలందరూ చాలా సంతోషించేరట. కానీ సూర్యాస్తమైన తరువాత ఏమి చెయ్యాలో పాలు పోక వారు నిరాశ చెందారట. అప్పుడు ఒక పిల్లవాడు క్రొవ్వొత్తి వెలిగిస్తానని చెప్పేడట. అందరూ దానికి సమ్మతించి క్రొవ్వొత్తులు వెలిగించి ప్రపంచాన్ని వెలుగుతో నింపేరట.

దీనివలన తెలిసేది ప్రతి మానవుడు, గొప్పవాడు కానప్పటికీ, విలువగలవాడు. మనము బహిర్గతంగా సాధారణమైనప్పటికీ, అంతర్గతంలో ప్రేమ, సేవా గుణాలు కలిగి ఉంటాము. మనం మన చూపుని సదా దేవునిపై పెడితే, ప్రపంచంలోని ఏ సమస్యా మన చేత పరిష్కరింపబడలేనిది కాదు. 326

Eknath Gita Chapter 11 Section 25

Bhagavat Gita

11.25

శ్రీ భగవానువాచ:

సుదుర్ధర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ {11.52}

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః

నీవు చూసిన ఈ విశ్వరూపము చూడ శక్యము గానిది. దేవతలు సైతము సదా ఈ రూపమును దర్శింప గోరు చుందురు.

నాహం వేదైర్న తపసా న దానేన స చేజ్యయా శక్య ఏవంవిధో ద్రష్టు౦ దృష్టవానసి మాం యథా {11.53}

నీవు దర్శించిన ఈ రూపము వేదముల చేత గాని, యజ్ఞదాన తపస్సుల చేత గాని దర్శింప శక్యము గాదు.

భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవ౦విధో అర్జున

జ్ఞాతుం ద్రష్టు౦ చ తత్త్వేన ప్రవేష్టు౦ చ పరంతప {11.54}

పరంతపా! విశ్వరూపుడనైన నన్ను వాస్తవముగ గ్రహించుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు అనన్య భక్తియే సాధనము.

చిత్తశుద్ధితో ఉన్నవారే భగవంతుని చూడగలరని జీసస్ చెప్పెను. ఎందుకంటే అట్టి వారలకే దేవుని మీద పూర్తి నమ్మకం ఉండి, సృష్టి అంతటా దేవుడ్ని చూస్తారు.

హరిదాసు అనబడే ఒక బాలుని తల్లి గొప్ప కృష్ణ భక్తురాలు. ఆ బాలుడు పాఠశాలకు ఒక కీకారణ్యం లోంచి వెళ్ళాలి. దానిలో అనేక కృూర మృగాలు ఉండి హరిదాసుకి మిక్కిలి భయం కలిగించేవి. అతడు అమ్మని సాయం రమ్మంటే, ఆమె హరిదాసు అన్న గోపాలుడు అరణ్యంలోనే ఉంటాడు, వానిని పిలువు అని చెప్పింది. హరిదాసు తన అమ్మ చెప్పినట్టే పలుమార్లు గోపాలా, గోపాలా అని పిలిచేడు. అప్పుడు పింఛ౦, పట్టువస్త్రాలు ధరించిన బాలుడు వచ్చి హరిదాసుకు అడవి చివర వరకు సాయం వచ్చేడు. ఇలాగ కొన్నాళ్ళు గడిచేయి. ఒకమారు హరిదాసు పాఠశాలలో విందుకై అందరినీ ఏదో ఒక తినుబండారాన్ని తీసికొని రమ్మన్నారు. హరిదాసు తన అమ్మను అడిగితే, మనం బీదవాళ్ళం, నీ అన్న గోపాలునే ఏదో ఒకటి అడుగు అని చెప్పెను. హరిదాసు గోపాలునితో ఆ విషయం చెప్పగా, గోపాలుడు వానికి ఒక గిన్నెలో పెరుగు ఇచ్చేడు. విందులో ఆ గిన్నెలోనుంచి ఎంత పెరుగు తీసినా ఇంకా మిగిలి ఉంది. దానిని చూసి ఒక ఉపాధ్యాయుడు ఆశ్చర్యపడి హరిదాసుని ఆ గిన్నె ఎక్కడినుంచి వచ్చిందని అడిగేడు. తరువాత అతను హరిదాసుతో కలిసి గోపాలుడ్ని చూడడానికి అడవికి వెళ్ళేడు. హరిదాసు పిలవగానే గోపాలుడు వచ్చేడు. హరిదాసు గోపాలుడితో తన ఉపాధ్యాయునితో మాట్లాడమని చెప్పి ఇంటికి పరిగెత్తేడు. కాని ఆ ఉపాధ్యానికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.

ఇది ఒక కథ. ఇక్కడ తెలిసికోవలసినది ఏమిటంటే దేవునిమీద పూర్తి నమ్మకం కలిగి, నిస్వార్థంగా ఉంటే మన జీవితం సజావుగా ఉంటుంది.

మనలో చాలామంది ఆధ్యాత్మిక జీవితం అనన్యమైన భక్తితో మొదలుపెట్టం. దేవనిమీద భక్తి ఎక్కడినుంచో వచ్చి పడిపోదు. దాన్ని అలవరచుకోవాలి. మన భక్తి ప్రస్తుతం అనేక విషయాల మీద నుండి, దేవుని మీద కొంత ఉండవచ్చు. మన చైతన్యం ఇతర విషయాల మీద ఉంటే దానిని కట్టడి చేసి దేవునివైపు త్రిప్పడం, ఒక లోయను నింపడానికి చిన్న చిన్న రాళ్ళు వేసినంత కష్టం.

అలాగని మనము నిరుత్సాహ పడనక్కరలేదు. రాళ్ళను వేస్తూనే వుంటే అవి కొన్నాళ్ళకు ఒక పోగు అవుతాయి. ఉదాహరణకి అప్పుడప్పుడు జీడిపప్పు తినడం ఆరోగ్యానికి హానికరం కాదు. మనకు జీడిపప్పు తినాలనే కోరిక బలంగా ఉంటే, దాన్ని నియంత్రించుకోవడం లోయలో రాళ్ళు వేసినట్టు. కొంతకాలానికి ఒక కొండ చరియలు విరిగి పడితే ఆ లోయ పూడుకుపోవచ్చు. అనగా మన జీడిపప్పు కోరిక పూర్తిగా సమసిపోయినట్టు.

మన ప్రాణ శక్తి ఇతర విషయాల మీద వెచ్చించబడుతుంటే, ఒక నదికి ఆనకట్ట లాగా, వాటిని నియంత్రించవచ్చు. కాని ప్రాణ శక్తి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటి అది ఆనకట్టపై నది పొంగి ప్రవహించినట్టు. దానికి పరిష్కారం, ఒక కాలువ నిర్మించి, నీటి ప్రవాహాన్ని మళ్లించడం. అలాగే మనం కొంత ప్రాణ శక్తిని భగవంతుని వైపు మళ్లించాలి. మొదట్లో అది చాలా తక్కువ ప్రవాహం కలిగి ఉండవచ్చు. కాల క్రమేణా దానిలో ప్రవాహం పెరిగి, మన ప్రాణ శక్తి అంతా దేవునివైపు ప్రవహిస్తుంది. ఈ విధంగా మన కోరికలన్నీ ఏకమై దేవుని వైపు ఒక వరాదలా పొంగి పొరలుతాయి. 324

Eknath Gita Chapter 11 Section 24

Bhagavat Gita

11.24

సంజయ ఉవాచ:

ఇత్యర్జున౦ వాసుదేవ స్తథోక్త్వా స్వక౦ రూపం దర్శయామాస భూయః {11.50}

ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా

మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధముగ పలికి సౌమ్యరూపుడై తన పూర్వ రూపమును మఱల చూపెను. అర్జునుని ఓదార్చెను.

అర్జున ఉవాచ:

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్య జనార్దన! {11.51}

ఇదానీమస్మి సంవృత్త స్స చేతాః ప్రకృతి౦ గతః

కృష్ణా! నీ యొక్క ప్రసన్న మానవ రూపమును గాంచి నేను ప్రశాంత చిత్తుడనైతిని. నిర్భయుడనైతిని. ప్రసన్నతను బొందితిని.

శ్రీకృష్ణుడు విశ్వరూపమును చాలించి తన సహజ స్వరూపము దాల్చగా, అర్జునుడు మిక్కిలి సంతసించినవాడై శ్రీకృష్ణుని జనార్ధన -- అనగా ప్రజలని మత్తెక్కించు వాడు -- అని పిలిచెను. మత్తు అనగా మద్యము వలనని కాదు. ఇది దేవునిలో అంతర్లీనమైతే కలిగే ఆనందం.

జాన్ వూల్ మ్యాన్ అనబడే అమెరికా కు చెందిన క్వేకర్ ఇలా అన్నారు:

ఉత్తరానికి, తూర్పుకి మధ్య ఒక కాంతి విహీనమైన పదార్థాన్ని చూసేను. అది అతి దీన స్థితిలో ఉన్న సజీవమైన మానవాళి అని ఒకరు చెప్పేరు. నేను దానిలో ఒక్కడైన౦దున నేను వేర్పాటుతో ఉండలేను.

వూల్ మ్యాన్ చెప్పింది ఏమిటంటే మనము దేవుడి దయవలన జ్ఞానోదయము పొందితే కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. దేవుడు తాను కరుణించిన వారికి అతి క్లిష్టమైన కర్మని అప్పజెప్తాడు. అదేమిటంటే ఇతరులకు తాను పొందిన జ్ఞానాన్ని పంచిపెట్టడం. జ్ఞానోదయమైన యోగులు హిమాలయాల్లోనే ఉండి, క్రింద ఉన్న వారిపై చిన్న చూపు చూడవచ్చు. కానీ వారు ధ్యానంలో ఉంటే "మానవాళి దుఃఖాలతో బాధలను అనుభవిస్తూ ఉంటే, నేనిక్కడ ఉండి చేస్తున్నదేమిటి?" అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి వారు మరల జనుల మధ్యకు వచ్చి తమ జ్ఞాన మకరందాన్ని అందరికీ పంచి పెడతారు.

బుద్ధునికి నిర్వాణము పొందిన ముందు రోజున దుఃఖపూరితమైన మానవాళినుండి దూరంగా పోవాలనే భావన కలిగింది. మారా అనబడే దుర్భోదకుడు, బుద్ధుని నిర్వాణం లోకి వెళ్ళకుండా అనేక ప్రయత్నాలు చేసేడు. బుద్ధుని ఇంద్రియాలను ఐహిక సుఖాలవైపు త్రిప్పలేనని తెలిసికొని చివరగా ఇలా పలికెను: "మీరు నిర్వాణంలో సంపూర్ణమైన ఆనందం పొందేరు. ఈ స్థితిలోనే చిరకాలం ఉండిపోతే తిరిగి ప్రపంచానికి వెళ్ళనక్కరలేదు. ఒకవేళ వెళ్ళినా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకొంటారు? మీలాగా ఎవరు ప్రయత్నం చేస్తారు?" ఇది ఒక విచారకరమైన ప్రశ్న. ప్రతి జ్ఞానోదయమైన యోగికి ఈ ప్రశ్న కలుగుతుంది. బుద్ధుడు దానికి బదులుగా "బహుశా కొందరు నా బోధ విని, నన్ను నమ్మి, నేను చెప్పిన దాన్ని పాటిస్తారు" అని సమాధానమిచ్చెను.

ఇదే యోగులు కోరేది. వారు ధ్యానం గురించై సమస్త మానవాళి ఉత్సాహం చూపిస్తుందని తలచరు. ఎలాగైతే ఒక పద్మం వికసించినపుడు తుమ్మెదలు దాని వైపు వెళతాయో, శాశ్వతమైన సుఖాన్ని, భద్రతని కోరి, జనులు జ్ఞానోదయమైన యోగి పొందు కోరుతారు.

ఇలా జనుల మధ్యకు రావడం చాలా క్లిష్టమైన క్రియ. ప్రజల హృదయాలను తట్టి లేపాలంటే వారితో సహజీవనం చేసి, వారి వలె నిత్య కర్మలు చేసి, సదా దైవ చింతనలో ఉండాలి. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంత కష్టం. బయట ప్రపంచం హింసాకాండతో, దుఃఖంతో నిండి ఉన్నా, దేహం లోపల కొలువై యున్న పరమాత్మ నిత్య ప్రకాశవంతంగా ఉంటాడు. 320

Eknath Gita Chapter 11 Section 23

Bhagavat Gita

11.23

మా తే వ్యథా మా చ విమూఢభావో

దృష్ట్వా రూపం ఘోర మీదృజ్ఞ్మమేదం {11.49}

వ్యపేతభీః ప్రీతమనాః పున స్త్వ౦

తదేవ మే రూపమిదం ప్రపశ్య

భయంకరమైన నా ఈ విశ్వరూపామును గాంచి నీవు భయమును, చిత్త సంక్షోభమును పొందవలదు. నీవు భయమును విడచి సంతుష్టా౦తరంగుడవై నా పూర్వ రూపమును దర్శి౦చుము ఀ

దేవుడు ప్రేమించేవాడూ, శిక్షి౦చేవాడూ కూడా. కర్మ సిద్ధాంతం దాని పర్యావసానము. మనము ఏ విత్తు నాటేమో, దాని మొక్కే మొలుస్తుంది. ఆపిల్ విత్తు నుండి బొత్తాయి చెట్టు రాదు. ప్రపంచ యుద్ధాలు ఎక్కడో దైవ శక్తితో జరగలేదు. మానవాళే దానికి కారణము. హింసాత్మక ఆలోచనలు ఇతరులలోనే కాదు, మన అంతర్గతంలో కూడా ఉన్నాయి. ప్రపంచం వెళ్ళే దిశకు మనము కూడా బాధ్యులము. జీవించడమంటే మనం చేసే క్రియలకే కాక, మనం చెయ్యని క్రియలకు కూడా బాధ్యత వహించడం.

పెళ్లికి ఇద్దరు, జగడానికి ఇద్దర ఉండాలి. అలాగే మారణాయుధాలు అమ్మడానికి, కొనడానికి ఇద్దరు ఉంటారు. ధనిక దేశాలు వర్థమాన దేశాలకు కొన్ని కోట్ల విలువచేసే మారణాయుధాలను ఎగుమతి చేస్తున్నారు. దానికి బాధ్యులు: తయారు చేసేవారు, మంతనాలు జరిపేవారు, రవాణా చేసేవారు, నిల్వ చేసేవారు, వాటిని ఉపయోగించేవారు. వాటికి పౌరులందరూ బాధ్యులు. మనము ప్రపంచ పౌరులమని అనుకొంటే, వీటి పర్యావసానం ఎంత దూరం పోయిందో గ్రహించవచ్చు. మనము మారణాయుధాల తయారీని ఖండించకపోతే, అవి ఉపయోగింప బడినప్పుడల్లా మనము ఇతరులను హింసించేవారితో సమానం.

కాని ఇందులో ఒక వెసులుబాటు ఉంది. మనము మంచి కర్మలు చేసుకుంటూ పోతే అవి చెడు కర్మల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు దుష్ట శక్తులచే క్రుంగి పోక, తన వద్ద ఆశ్రయం పొందమని అర్జునునికి చెప్తున్నాడు.

దీనికై మనం గొప్ప పనులే చెయ్యనక్కరలేదు. మనకు వీలయినంతమటుకు సత్కర్మలు చేస్తూ ఉండాలి. మనము ప్రపంచ శాంతికై పోరాడాలంటే గొప్ప పేరుప్రతిష్ఠలు ఉన్నమారలమే కానక్కరలేదు. నా ఉద్దేశంలో ఐకమత్యంతో పౌరుల౦దరూ నిరశన వ్యక్తంచేస్తే అది రాష్ట్రపతులు, చట్ట సభల కన్న ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

మొదట మనోభావాలను ఇతరులకు ప్రకటించాలి. ఎంత మంది వింటారో అని విచారించనక్కరలేదు. మన భావాలలో సత్యము౦టే, అవి ఎప్పుడో అప్పుడు సరియైన పర్యావసానము చూపిస్తాయి. లింకన్ ప్రభుత్వము ప్రజల వలన, ప్రజల కొరకు అని చెప్పలేదా? అది ఇప్పటికీ సత్యం. మనము దినపత్రికలకు, నాయకులకు ఉత్తరాలు వ్రాయవచ్చు. మన తోటివారలను కూడా అలా చెయ్యమని ప్రోత్సాహించ వచ్చు. వాక్చాతుర్యము ఉన్నవారు సమావేశాలను ఏర్పాటు చేసి తమ భావాలను వివరించచ్చు. మిత్రులతో సమయం వెచ్చించి నప్పుడు, కొంత సమయం పత్రికలకు, నాయకులకు ఉత్తరాలు వ్రాయడానికై కేటాయించవచ్చు.

అటు తరువాత మనము హింసను ఎట్టి పరిస్థితులలోనూ, అంటే మనమంతట మనమే చెయ్యకపోయినా, సమర్థించకూడదు. మారణాయుధాలు చేసే సంస్థలలో, వాటిని సరఫరా చేసే మధ్యవర్తులతో, పని చెయ్యకూడదు. మనలో కొంచెం శాతమైనా ఈ విధంగా చేస్తే, మారణాయుధాలను నివారించవచ్చు. 318

Viveka Sloka 41 Tel Eng

Telugu English All బ్రహ్మానందరసానుభూతికలితైః పూతైః సుశీతైర్యుతై- (పాఠభేదః - సుశీతైః సితైః) ర్యుష్మద్వాక్కలశోజ్ఝితైః శ్రుత...