Bhagavat Gita
12.13
అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః
{12.16}
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః
అపేక్షలేనివాడును, పరిశుద్ధుడును, సమర్థుడును, నిర్లిప్తుడును, బాధలుడిగినవాడును, కర్మలయందు కర్తృత్వబుద్ధిని వదలిన వాడును నైన భక్తుడు నా కిష్టుడు ఀ
పై శ్లోకంలో శ్రీకృష్ణుడు అనపేక్ష అనే పద ప్రయోగం చేస్తున్నాడు. అనపేక్ష అనగా ఎదురు చూపు లేకుండుట. దాన్నే అనుకోని విధంగా వచ్చునది అని కూడా అర్థం చెప్పవచ్చు. అంటే "నాకు మంచైనా, చెడైనా, ఆనందమైనా, దుఃఖమైనా ఇవ్వండి, సర్దుకు పోతాను" అని చెప్పడం.
అనపేక్షకు వ్యతిరేక పదం కఠినం. మనకి ఎదురు చూసే ఫలితం కలిగితే మంచిదని అనుకుంటాం. కాని దానికి వ్యతిరేకంగా ఉంటే బిగుసుకు పోతాం. కాబట్టి ఎదురు చూపు లేకుండా బ్రతకడం అంటే స్వేచ్ఛ.
ముఖ్యంగా మనము అనుబంధాలలో మనకు అనుకూలంగా ఇతరులు ప్రవర్తించాలని ఎదురు చూస్తాం. వారు అనుకోని విధంగా ప్రవర్తిస్తే మనకు ద్వేషం, కోపం, నిరాశ, దుఃఖం మొదలగునవి కలుగుతాయి. మనము కోరే ప్రతిస్పందన మనకనుగుణంగా లేకపోతే మన స్పందన కూడా అలాగే ఉంటుంది. అంటే, ఉదాహరణకి, కోపాన్ని, కోపంతో ప్రతిఘటిస్తాము.
మనము చేసే క్రియలు ఉత్తమంగా చేసి, ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఉంటే, మనము పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తాము. పరిస్థితులు మనకు అనుగుణంగా ఉన్నా, లేకపోయినా మన ప్రయత్నం ఉత్తమంగా ఉండాలి. కొందరు ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటారు. అది ఉత్తమం కాదు.
అనుబంధాలలో, ఒక్కొకప్పుడు మనము ఇంకొకరి మీద శ్రద్ధ చూపిస్తున్నా వారు పట్టించు కోకుండా ఉండవచ్చు. మనం "ఎందుకు నన్ను పట్టించుకోవటంలేదు?" అని అడిగితే వారు "నేను పనిలో నిమగ్నమయ్యేను" అని చెప్పవచ్చు. అప్పుడు మనం "అతను నేనంటే ఇష్ట పడుతున్నాడా లేదా?" అని సతమతమవ్వ వచ్చు. అయినాసరే వాని మీద శ్రద్ధ చూపడం మానక ఉంటే ఎప్పుడో అప్పుడు అతను అది గుర్తిస్తాడు.
మన యందు ఇతరులు దురుసుగా ప్రవర్తించవచ్చు. అప్పుడు మనము ప్రతికూలంగా స్పందిస్తే పరిస్థితి విషమం అవుతుంది. కొందరు క్రీడాకారులు తమ ప్రత్యర్థి, తమకంటే తక్కువ ప్రతిభ ఉన్నవారలైనా, వాళ్ళ చేతుల్లో ఓడిపోతారు. ఎందుకంటే వారు తమ దృష్టిని క్రీడయందు ఉంచక ప్రత్యర్థిపై ఉంచేరు. అలాగే కొందరు ప్రత్యర్థి తమకన్న ఎక్కువ ప్రతిభ ఉన్నా, కష్టంతో లేదా ఏకాగ్రతతో వారిని ఓడిస్తారు.
నేను ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు సమావేశాలకు వెళ్ళినప్పుడు నా అభిప్రాయాలను చెప్పేవాడిని. కానీ కొందరు వాటిని ఖండించేవారు. మొదట్లో నాకది బాధ కలిగించేది. కానీ క్రమంగా తెలిసికొన్నదేమిటంటే వారు నేను అనుకోని విధంగా ప్రవర్తిస్తున్నారని. కాబట్టి నేను వారు ఖండిస్తారని ఎదురు చూస్తే బాధ కలుగదు. అలా మార్పు చె౦దిన తరువాత కొందరు "నీవు మంచి అంశాలు చెప్పేవు" అని పొగిడేవారు.
"ఇది ఆత్మ వంచన కాదా?" అని మీరనవచ్చు. ఇక్కడ ఆత్మ వంచన కాదు కదా, కోపం చెందడం నిజంగా కపటంతో కూడినది. ఎటువంటి కపట భావనలున్నా మనం ఆత్మ వంచన చేసికొన్నట్టే. శుద్ధంగా, నిర్లిప్తతతో, ఉండి, ప్రతి దబాయింపుకి స్పందించక, మనల్ని దేవుని చేతిలో ఒక పనిముట్టుగా తలచాలి.
ఒక నాటకంలో ఒకడు మహా తపస్వి పాత్రను పోషించేవాడు. వాడు మొదట్లో తన పాత్రను యాంత్రికంగా చేసేవాడు. కానీ ఆ నాటకం కొన్ని వందల మార్లు వేసిన తరువాత ఆ పాత్ర వాని చేతన మనస్సుతో తాదాత్మ్యం చెంది చివరకు వాడు ఆ తపస్వి లక్షణాలను అలవరుచుకున్నాడు.
మనలో ఎదురు చూసే ఆతృత మనస్సు స్వచ్ఛందంగా ప్రవర్తించడంవలన కలుగుతుంది. దాన్ని వదిలివేస్తే మనము జీవితం పరోపకారానికై గడుపుతాము. మన ఆత్మ రక్షణను వదిలివేస్తాము. ఎందుకంటే జీవితం మననుండి ఏదీ బలవంతంగా తీసికుపోలేదు. ఉపనిషత్తులలో "పూర్ణం లోంచి కొంత తీసివేస్తే అది పూర్ణంగానే ఉంటుంది; అలాగే పూర్ణానికి కొంత చేరిస్తే అది పూర్ణంగానే ఉంటుంది" అని చెప్పబడినది.
కొన్నాళ్ల క్రిందట నేను నా భార్యను, కొందరు పిల్లలను కామిలాట్ అనే సినిమాకు తీసికువెళ్ళేను. సినిమా అయిన తరువాత ఒక యుక్త వయస్కురాల్ని సినిమాలోని రాజుల గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని అడిగేను.
"వారు జీవితం ఎంతో ఉల్లాసంగా గడిపేరు. కాని వాళ్ళు కత్తి-ఢాలు పట్టుకోవడం బాగాలేదు" అని చెప్పింది.
కామిలాట్ లోనేకాదు, మనలో చాలామంది ఆత్మ రక్షణకై కత్తి-ఢాలు పట్టుకొని తిరుగుతాం. ఎందుకంటే మనం ఒకదానికై ఎదురుచూస్తున్నాము. మనకెప్పుడైనా ఒక సవాలు వస్తే కత్తి-ఢాలును మన ఆత్మ రక్షణకై పట్టుకొ౦టాము. మళ్ళీ ఇతరులు మనలను తప్పుగా అర్థం చేసికున్నారని తలుస్తాము. భార్యాభర్తలు కూడా ఒకచేత్తో కౌగలించుకొని మరొక చేత్తో ఢాలును పట్టుకొని దాన్ని అభద్రత కలిగినప్పుడల్లా తమ ఆత్మ రక్షణకై ఉపయోగిస్తారు.
కత్తి-ఢాలు పట్టుకోవడంవలన ప్రాణ శక్తి వృధా అవుతుంది. అవి మనల్ని నిజంగా రక్షించలేవు. పైపెచ్చు లేనిపోని సమస్యలు తెస్తాయి. గీత కత్తి-ఢాలుని వదిలేయి అంటుంది. అప్పుడు మన రెండు చేతులూ ఖాళీగా ఉండి, ఇతరులను ఆలింగనము చేసికొని "నాకు నీనుండి ఏమీ పొందాలని లేదు; నేను కోరేదల్లా నీకు సేవ చేయడం" అని చెప్పగలం. ఇదే మనమంతా ఎదురుచూసేది; అటువంటి ప్రేమ పొందడమే కాక, ఇతరులకు ప్రేమ పంచి ఇవ్వడం; దానివలన మన జీవితం ధన్యమవుతుంది. 397