నే నెవరిని ?
"నేను" వచనం అందరికీ సహజం.
"నేను వచ్చాను, నేను వెళ్ళాను,
నేను చేసాను" అనే మాటాలు తరచు
వింటాము. దాన్ని తరచి
చూస్తే, కదలికలు మొదలగు పనులు
దేహానికి సంబంధించినవి. "నేను" అనే
ఎరుక దేహానికి సంబంధించినదా?
దేహం పుట్టుక ముందు లేనిది; పంచ భూతాత్మకం;
నిద్రలో ఎరుక ఉండనిది; చివరకు
బూడిదలో కలిసి పోయేది.
"నేను" అనే భావనను అహంకారం, అజ్ఞానం,
భ్రమ, అశుద్ధం లేదా ఆత్మ అనవచ్చు.
మన స్మృతులు, శృతులు దాని మీదే
విచారణ చేసేయి. అవి చెప్పింది: అహంకారం
పోతేనే ముక్తి సాధ్యం. కాబట్టి ఎవరు దీనిని
తప్పు పట్టేది? ఎండు కర్రవలె జడమైన
శరీరం "నేను" అని భాసించగలదా? కాలేదు.
శరీరాన్ని అందుకే ప్రక్కన పెట్టి విచారణ
చేద్దాం. నిరంతరం సాగే ఆలోచనా ప్రవాహంలో,
అఖండమైన, నిశ్చలమైన, సహజమైన
"నేను,నేను" అనే ఎరుక హృదయంలో
కలుగుతుంది. దాన్ని పట్టుకొని, నిశ్చలంగా
ఉంటే, అది శరీరంలో "నేను" అనే భావనను
అంతం చేసి, చివరకు అదీ కర్పూర
హారతిలాగ కరిగిపోతుంది. ఋషులు,
గ్రంథాలు దీన్నే ముక్తి అంటారు.
అజ్ఞానమనే తెర ఎప్పటికీ ఆత్మను
కనుమరుగు చేయలేదు. అజ్ఞానులు కూడా
"నేను" అనే వాచకం వాడుతారు.
వారిలో "నేను ఆత్మను" లేదా
"నేను పరిశుద్ధమైన చైతన్యమును"
అనే సత్యాలను కప్పిపుచ్చి దేహంతో
తాదాత్మ్యం చెందుతుంది.
ఆత్మ స్వప్రకాశం. దాన్ని ఊహించే
ఆలోచన బంధానికి కారణం. ఎందుకంటే
ఆత్మ ప్రకాశం వెలుగు-నీడలను అధిగమిస్తుంది.
అందుకే మనస్సుతో దాన్ని పట్టుకోలేం.
ఆత్మ విచారణ భక్తి మార్గంలో ముక్తికి,
అనిర్వచనీయమైన ఆనందానికి దారి
తీస్తుంది. ఋషులు అటువంటి భక్తి
పూర్వక ఆత్మ విచారణ వలననే ముక్తి
సాధ్యమని ప్రవచించేరు. "నేను" అనే
ఆలోచనకు కారణమైన అహంకారం
భ్రాంతికి మూల కారణం. దాని నాశనం వలన
భ్రాంతి తొలగుతుంది. ఈ విధంగా
అహంకారాన్ని తొలగించుకునే మార్గాలను
భక్తి, జ్ఞాన, యోగ లేదా ధ్యాన మార్గాలంటారు.
"నేను దేహాన్ని" అనే ఎరుకలో స్థూల,
సూక్ష్మ, కారణ శరీరాలు, పంచ కోశాలు
ఉంటాయి. ఆ ఎరుకను తొలగిస్తే, అన్ని
ప్రతిబంధకాలూ వాటంతట అవే తొలగిపోతాయి.
స్మృతి, శృతులు ఆలోచనలే బంధాలకు కారణం
అని చెప్పడం వలన, ప్రతిబంధకాలను
వేరువేరుగా తొలగించనక్కరలేదు. చివరగా
మనస్సును "నేను" అనే ఆలోచనతో
ఆత్మకు దాసోహం అయి, నిశ్చలంగా ఉండి,
ఆత్మను ఎప్పటికీ మరచిపోక ఉండడం
ఉత్తమ పద్దతి.
No comments:
Post a Comment