మనస్సు
మన స్మృతి, శృతులలో మనస్సు గురించి
ఈ విధంగా చెప్పబడినది:
- తినే పదార్థాలలో సూక్ష్మమైనది మనస్సును పోషించేది
- ప్రేమ, క్రోధం, కామం, మదం మొదలగునవి దాని గుణాలు
- ఆలోచన, బుద్ధి, కోరిక, అహంకారంలతో నిండినది
- దానికి అనేక కార్యాలు చేసే శక్తి ఉన్నప్పటికీ, మనం
చూసే జడపదార్థముల వంటిదే
- అది జడమైనప్పటికీ, చైతన్యముతో అనుసంధానమైన
కారణాన చైతన్యమువలె అనిపిస్తుంది; ఎలాగంటే ఒక కొలిమిలో ఇనుప
కడ్డీని కాల్చడం వల్ల ఆ కడ్డీ ఎర్రగా రంగు మారడానికి
కారణం అగ్నే; కానీ అగ్ని ఆ ఇనుప కడ్డీ యొక్క సహజ గుణం కాదు.
- అది విచక్షణా జ్ఞానం కలిగి ఉన్నది
- అది చంచలము; లక్క, బంగారముల వలె దాని
రూపము సునాయాసంగా మారేది
- అన్ని తత్వాలకు మూలమైనది
- దృష్టి కంటిలో, వినికిడి చెవిలో ఉన్నట్టే
అది హృదయంలో వశిస్తుంది.
- అది జీవికి ప్రత్యేకతను ఇచ్చి బాహ్య వస్తువుల
కనుగుణంగా ఆలోచనలు కలిగిస్తుంది
- అది మెదడుతో నడపబడే పంచేంద్రియాలతో అనుసంధానమై
"నేను ఫలానా దానిని అర్థం చేసికొన్నాను" అనే స్ఫురణను
కలిగించేది
ఒక పదార్థాన్ని తినవచ్చా అనే ఆలోచన మనస్సులో
ఆవిర్భవిస్తుంది: "ఇది మంచిది. ఇది మంచిది కాదు.
దీన్ని తినవచ్చు. దాన్ని తినకూడదు" అనే విచక్షణా
జ్ఞానం మనస్సులో భాగమైన బుద్ధి వలన కలుగుతుంది. మనస్సే
అహంకారం, దేవుడు, ప్రపంచము అనే త్రిపుటికి మూలం.
మనస్సు ఆత్మలో లయమైతే దానిని కైవల్యం
అంటారు. అది బ్రహ్మన్ ను పొందడం వంటిదే
ఇంద్రియాలు బాహ్య వస్తువులపై ప్రసరిస్తే,
మనస్సు అంతరంగంలో పని చేస్తుంది. బాహ్యము,
అంతర్గతము అనే విబేధాలు శరీరానికి
సంబంధించినవి. వాటికి పరమాత్మతో
సంబంధం లేదు. మన శృతులు, స్మృతులు,
ప్రపంచం మన హృదయ కమలంలో సూక్ష్మంగా
ఉందని చెప్తాయి. నిజానికి అది ఆత్మ బోధ. అవిద్య,
మాయ కారణాన నిద్రలో మనం అచేతనంగా
ఉంటాము. సుషుప్తిలో స్థూల, సూక్ష్మ శరీరాలు
ఆత్మలో లయమవుతాయి. అజ్ఞానము నుండి
అహంకారం ఉద్భవించింది. అదే సూక్ష్మ శరీరం.
మనస్సుని ఆత్మ వైపు త్రిప్పడానికి మనం
సాధన చెయ్యాలి
మనస్సు చేతనము. అది స్వతహాగా శుద్ధము,
పారదర్శకము. కానీ ఆ శుద్ధ స్థితిలో అది మనస్సు
అనబడదు. అపరిశుద్ధ మనస్సు వలన తప్పుడు
ఆలోచనలు వస్తాయి. శుద్ధమైన మనస్సు, అనగా
శుద్ధ చైతన్యము, తామసముతో కప్పబడితే
స్థూల ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం
కలుగుతుంది. అలాగే రజస్ తో కప్పబడితే
అది దేహంతో తాదాత్మ్యం చెంది, "నేను"
అనే అహంకారాన్ని ప్రదర్శించి, అదే సత్యం
అని నమ్ముతుంది. రాగద్వేషాలతో
కూడి అది మంచి లేదా చెడు కర్మలను ఆచరించి
జనన-మరణ వలయంలో చిక్కుకొంటుంది. సుషుప్తిలో,
మూర్చలో మనకు ఆత్మ గురించి ఎరుక ఉండదు.
కానీ నిద్రనుండి మేల్కొనినప్పుడు, స్పృహ వచ్చినపుడు
మనస్సు అనుభవంలోకి వస్తుంది. దాన్నే విజ్ఞానమని
అంటారు. మనస్సుకి దానంతట దానికి ఉనికి లేదు.
అది ఆత్మ వస్తువుపై ఆధారపడి ఉంటుంది. ఆత్మతో
అనుసంధానమైనప్పుడు సుజ్ఞానమని అంటారు.
అనాత్మతో అనుసంధానమైనప్పుడు అజ్ఞానము
కలుగుతుంది. మనస్సు ఆత్మతో తాదాత్మ్యం
చెంది ఆత్మవలె ప్రకాశించినప్పుడు అహం స్ఫురణ
కలుగుతుంది. అది రాబోయే ఆత్మ జ్ఞానానికి
సంకేతం. ఇదే ప్రజ్ఞానం. ఇదే వేదాంతంలో
చెప్పబడిన "ప్రజ్ఞాన ఘన" అనే మహా వాక్యం.
ఆది శంకరులు వివేకచూడామణిలో ఇలా చెప్తారు:
"విజ్ఞానమయ కోశంలో సర్వమునకు సాక్షి, స్వప్రకాశమైన
ఆత్మ భాసిస్తుంది. దాన్ని పొందడమే లక్ష్యంగా
చేసుకో. అదే సత్యం. స్వానుభవంతో దానిని
ఆస్వాదించు. అఖండమైన ఆలోచనా క్రమముతో
దానిని ఆత్మగా తెలుసుకో"
స్వయంప్రకాశంతో ఆత్మ ఒక్కటే సర్వత్రవ్యాపించి
ఉన్నది. మూడు అవస్థల కాలాలు తప్పించి
ఆత్మ శుద్ధము, నిశ్చలము. అది స్థూల, సూక్ష్మ,
కారణ శరీరాలతో బంధింపబడనిది. అలాగే
దృశ్యం, ద్రష్ట, దృష్టి అనే త్రిపుటి లేనిది.
ఆత్మ వేకువలో కంటిలో స్థితమై ఉంటుంది.
నిద్రలో మెడలో ఉంటుంది. సుషుప్తిలో
హృదయంలో లయమవుతుంది. వీటిలో
ముఖ్యమైనది హృదయం. అందుకే ఆత్మ
మొదటి స్థానం హృదయమని చెప్పడం.
కొందరు మనస్సు యొక్క స్థానం మెడ;
బుద్ధి యొక్క స్థానం మెదడు; అహంకారం
యొక్క స్థానం హృదయం అని చెప్తారు.
కానీ బుద్ధి, అహంకారం మొదలగునవి మనస్సుకు
సంబంధించినవే. సామూహికంగా వాటిని
మనస్సు అనవచ్చు. అనేక ముని పుంగవులు,
ఋషులు ఈ విషయంపై విచారణ చేసి
"నేను" అనే స్ఫురణ హృదయంలోనే
కలుగుతుందని చెప్పేరు.
No comments:
Post a Comment