ముక్తి
మనస్సు ఆత్మతో తాదాత్మ్యం చెందక,
బంధాలలో కూరుకుపోయి, ఒక
గొర్రెల కాపరి భుజం మీద మేకపిల్లను
పెట్టుకొని ఊరంతా వెదికిన చందంగా,
తన స్వస్వరూపాన్ని తెలిసికోడానికి
ప్రయత్నిస్తుంది.
ఆత్మతో అనుసంధానము కాని
అహంకారం, ఒకమారు ఆత్మ
గురించి తెలిసికొన్నా, పూర్వ సంస్కారముల
బంధము వలన ముక్తిని సాధించలేదు.
అది దేహమే ఆత్మ అనే అపోహతో ఉంటుంది.
పూర్వ సంస్కారములు దీర్ఘమైన
ధ్యానంతో తొలగించుకోవచ్చు: "నేను
దేహ౦ కాని, ఇంద్రియాలు కాని, మనస్సు
కాని కాదు." కావున అహంకారం, ఒక విధంగా
మనస్సే, దేహాన్ని ఆత్మగా భావించినపుడు,
దాన్ని నియంత్రించి, ముక్తిని ప్రసాదించే
ఆత్మజ్ఞానాన్ని, సర్వ
దేవతల ఉనికికి కారణమైన పరమాత్మని, దీర్ఘ
కాలం ధ్యానించాలి. ఇటువంటి విచారణ
మనస్సును నియంత్రించి చివరకు అదికూడా
అంతమొందుతుంది. ఎలాగంటే ఒక చితికి
ఉపయోగించే కర్ర, చివరికి ఆ చితిలోనే
దహనమవుతుంది.
ఆత్మ, జ్ఞానం, చేతనము, పరమాత్మ,
దేవుడూ అన్నీ ఒక్కటే.
ఒక సామాన్యుడు పెద్ద వ్యాపారిని కలిసి,
తాను కూడా గొప్పవాడని తలంచ వచ్చా?
అతను పాటుపడి, కృషి చేస్తేగాని
సాధ్యం కాదు. అదేవిధంగా అహంకారం,
మనస్సులోని బంధం, ఒక మారు ఆత్మతో
అనుసంధానమై తనను పరమాత్మగా భావించగలదా?
అది మనస్సు యొక్క నియంత్రణ వలననే సాధ్యం
కదా? ఒక బిచ్చగాడు రాజభవనంలో ప్రవేశించి
తానే రాజని భ్రమలో ఉండవచ్చు. అది నిజమా?
కావున మనస్సులోని బంధాలు
"నేనే ఆత్మను, ఉత్కృష్టమైన పరమాత్మను"
అనే ధ్యానంతో త్రెంచుకొని, అన్నిటినీ అధిగమించే ఆనందాన్ని
పొందడానికి గట్టి ప్రయత్నం చేస్తే చివరకు
మనస్సునే ప్రక్కకు గెంటవచ్చు. ఆత్మే బ్రహ్మన్,
బ్రహ్మనే ఆత్మ. పొట్టుతో కప్పబడినది ధాన్యం.
పొట్టుతీసేస్తే అది బియ్యం. అలాగే బంధాలలో
ఇరుక్కొని చేసే కర్మలు ఒకనిని సామాన్యమైన
మానవునిగా చేస్తే, వాటి మీద కప్పబడిన
తెరను తీసేస్తే పరమాత్మ పూర్ణ చైతన్యాన్ని పొందవచ్చు.
ఇదే మన స్మృతులు, శృతులు చెప్పేది.
మనస్సుని లోపలకు లాగుకొని, అనగా
నివృత్తి చేసి, హృదయంలో
బంధించి, అజ్ఞానాన్ని కలిగించే అహంకారాన్ని
నాశనం చెయ్యాలి. ఇదే జ్ఞానము మరియు
ధ్యానం యొక్క గమ్యం. మిగతా పలుకులన్నీ
విస్మరింపదగినవి. పరమాత్మ మీద మనస్సు
లగ్నం చేసి, అతన్ని ధ్యానించి, గట్టి సాధన
చేస్తే అతన్నే పొందవచ్చు.
ఒక బ్రాహ్మణ నటుడు ఏ పాత్రను పోషించినా
తాను బ్రాహ్మణుడని మరచిపోనట్లు, మనం
దేహాన్ని ఆత్మగా చూడక, ఏ కర్మ చేసినా
మన ఉనికిని ఆత్మతో అనుసంధానం
చెయ్యాలి. మనస్సు నిర్మలమైతే ఈ ఎరుక
కలుగుతుంది. తద్వారా ఉత్కృష్టమైన
ఆనందం కలిగి, ఆత్మ సాక్షాత్కారము
పొందవచ్చు. బాహ్య వస్తువుల వలన
కలిగే ఆశా-నిరాశలు వానిని బాధించవు.
కలలోలాగ ఏ వస్తువుతోనూ సంబంధం
లేకుండా జీవించవచ్చు. "ఇది మంచా
లేక అదా? ఇది చేయాలా లేక అది
చేస్తే మంచిదా?" వంటి ఆలోచనలు రాకుండా
ప్రయత్నించాలి. అటువంటి ఆలోచనను
ఆదిలోనే అంతమొందించాలి. అలా కాక
మనస్సుని దాని పాటు కది వదిలేస్తే అది మనకు
పరమ శత్రువుగా మారుతుంది. మనస్సు
ఆత్మతో అనుసంధానమైనప్పుడు, అహంకారం
మరియు సమస్యలు ఉంటాయా?
ఆలోచనలే బంధాలకు కారణం కాదా?
అటువంటి ఆలోచనలు పూర్వ సంస్కారముల
కారణాన వచ్చినపుడు, మనస్సుని నియంత్రించి
దానిని ఆత్మవైపు త్రిప్పి, బాహ్య విషయాలయందు
నిర్లిప్తత, వైరాగ్యం చెందాలి. ఆ ఆలోచనలు
ఆత్మను విస్మరించడంవలన, ఇంకా సమస్యల
వలయంలో చిక్కుకున్నట్లు చేయవా?
అందుకే "నేను కర్తనుగాను. నేచేసే
కర్మలు నా దేహం, ఇంద్రియాలు, మనస్సు
యొక్క ప్రేరణ" అని తలిస్తే మనస్సుని
నిశ్చలం చేసుకోవచ్చు. కానీ అదీ ఒక
ఆలోచనే. మనలో తీవ్రంగా ఆలోచించేవారికి
దాని అవసరం ఉంది. ఇంకా పరమాత్మ మీద
దృష్టి పెట్టుకొని, కర్మాచరణంలో నిమగ్నమై
"నేను దేహాన్ని. కర్మలు చేసేవాడిని" లేదా
"నేను కర్తని కాదు. నా కర్మలకు ప్రేరణ
నా దేహం ఇంద్రియాలు, మనస్సు" అనే
ఆలోచనలలో ఏది మిన్న? మనం క్రమంగా
సాధనతో ఆత్మ స్వరూపాన్ని తెలిసికోవాలి.
అదే పొందితే అంతకన్నా పెద్దది
పొందేది లేదు. మనస్సుని ప్రవృత్తి మార్గంలో
నడిపించకండి. మనం ప్రారబ్దం వలన
చేసే కర్మలను చేసినప్పుడు కూడా కర్తృత్వ
భావాన్ని వదలిపెట్టాలి. అనేక భక్తులు
భక్తితో, వైరాగ్యం వలన ముక్తిని పొందలేదా?
మనస్సు స్వతహాగా సాత్వికం. మనస్సు
యొక్క విస్తారణ మేఘాలు లేని ఆకాశం
వంటిది. రజస్ తో కూడి అది బాహ్య
విషయాలలో కల్పించుకొంటుంది.
ఈ విధంగా తాదాత్మ్యం చెంది సత్యాన్ని
తెలిసికోలేకపోతుంది.
పట్టు చీరను నేసేటప్పుడు బండ
పనిముట్లను వాడరు; ఒక కళా ఖండాన్ని
గాలిలో రెపరెపలాడే దీపంతో సరిగ్గా
చూడలేము. అలాగే తమస్ అనే
చీకటిలో మొద్దుబారి పోయి, రజస్
వల్ల ఎడతెరిపి లేకుండా కర్మలు
చేస్తే సత్యాన్ని కనుగొనలేము. ఎందుకంటే
సత్యం అతి సూక్ష్మమైనది. మనస్సు
శుద్ధినొందడానికి అనేక జన్మలెత్తి ,
నిస్వార్థ కర్మలు చేసి, ఒక మంచి గురువు వద్ద
శుశ్రూష చేసి, సదా పరమాత్మను ధ్యానం చెయ్యాలి.
దాని వలన తమస్ వలన కలిగే చీకటి,
రజస్ వలన కలిగే అశాంతి నియంత్రింపబడతాయి.
అటు పిమ్మట మనస్సు తన నిజ స్థితిని
అనుభవిస్తుంది. మనస్సుని సూక్ష్మం చేసి,
నిశ్చలం చేసినప్పుడే ఆత్మలో రమించడం
సాధ్యం. అట్టివాడు బ్రతికి ఉన్నప్పుడే
ముక్తిని పొందినవాడు.
మనస్సు నుండి ధ్యానంతో తమస్ మరియు రజస్ లను
దూరం చేసికొంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన
మనస్సులో ఆత్మ యొక్క ఆనంద అనుభవం సాధ్యమవుతుంది.
యోగులు అటువంటి స్థితిలో సర్వజ్ఞతను పొందేరు.
అటువంటి సూక్ష్మమైన మనస్సుతో, ఆత్మ జ్ఞానంతో
ఉండేవారు బ్రతికి ఉండగానే ముక్తిని పొందువారు.
ఆ స్థితినే బ్రహ్మ గీతలో సర్వవ్యాపకమైన, ద్వితీయంలేని
నిర్గుణ బ్రహ్మన్ గా చెప్పబడింది. అదే విదేహముక్తుడు
అనుభవించేది. అట్టివాడు అఖండమైన, నిత్యమైన స్వస్వరూపంలో
స్థితమై మనస్సుని, వాక్కుని అధిగమించినవాడు. సూక్ష్మమైన
మనస్సును కూడా అధిగమిస్తే, వాని ఆనందం కూడా
అంతరిస్తుంది. అతడు ఆనంద సముద్రంలో
బాహ్య విషయాలతో సంబంధం లేక ఓలలాడుతాడు.
విదేహముక్తిని అధిగమించి మరేదీ లేదు. అదే అన్నిటికీ
పరిసమాప్తం.
ఆత్మతో తాదాత్మ్యం చెందినప్పుడు క్రమంగా
"నేనే ఉత్కృష్టమైన పరమాత్మను" అనే భావం
వృద్ధి చెంది, సహజంగా అనుభవానికి వస్తుంది.
రజో గుణము, బాహ్య విషయాల స్ఫురణ తగ్గుతుంది.
అనుభవం మనస్సు తోనే సాధ్యము కావున,
జ్ఞానము సూక్ష్మమైన మనస్సులో నిక్షిప్తమయి ఉంటుంది.
విదేహముక్తి అట్టి సూక్ష్మమైన మనస్సు లేని స్థితి
కాబట్టి అది అనుభవాతీతం. అట్టివానిది "నేను దేహాన్ని కాను.
పరిశుద్ధ ఆత్మను" అనుకునే ఉత్కృష్టమైన స్థితి.
కానీ మనస్సుని పూర్తిగా అంతమొందించ లేక పోతే,
బాహ్య విషయాల వలన బాధలను అనుభవించి,
ప్రారబ్ద కర్మను చెయ్యాలి. అతడు ఇతరులకు పూర్తి
ఆనందాన్ని అనుభవించలేక సదా బాధలతో
సతమతమవుతున్న వానిగా కనబడుతాడు. అందువలన
మనస్సును ధ్యానంతో సూక్ష్మంగా, నిశ్చలంగా
చేసినప్పుడే ముక్తి సాధ్యం.
No comments:
Post a Comment