అష్టాంగ యోగ
ధ్యాన రూపేణ భక్తిని సాధించుటకు
అష్టాంగ యోగ లోని మొదటి రెండు:
యమ, నియమలు సూచింపబడినవి.
వీటిలో రెండు విభాగాలు ఉన్నవి. మొదటిది
యోగము, రెండవది జ్ఞానము. శ్వాసను నియంత్రించడాన్ని
యోగ అంటారు. మనస్సును అధిగమించడాన్ని
జ్ఞానమందురు. ఏది మనకు సులువో మన
వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. రెండు
మార్గాల గమ్యం ఒకటే. శ్వాస నియంత్రణ
వలన మనస్సు నియంత్రి౦పబడుతుంది.
అలాగే మనస్సుని నియంత్రిస్తే శ్వాస
నియంత్రింపబడుతుంది. వీటి లక్ష్యం
మనస్సును నియంత్రించడం.
- యమ అనగా నైతిక విలువలను
పాటించడం. అబద్ధం, దొంగతనం,
లోభం మొదలగువాటిని లేకుండుట
- నియమ అనగా శ్రద్ధతో శాస్త్రము
నిర్దేశించిన కర్మలు చెయ్యడం
- ఆసన అంటే శరీరాన్ని, మనస్సుని
వివిధ పద్దతులలో (హఠ యోగ)
స్వాధీన౦లో ఉంచుకోవడం
- ప్రాణాయామ అంటే శ్వాసను
నియంత్రించడం
- ప్రత్యాహార అంటే ఇంద్రియాలను
స్వాధీనంలో ఉంచుకొనుట
- ధారణ అంటే దృష్టిని
ఏకీకృతం చెయ్యడం
- ధ్యాన అనగా నిరంతరం
మంత్రం జపించడం
- సమాధి ఆత్మతో అనుసంధానము
చేయుట
ఈ విధంగా అష్టాంగ యోగము శాస్త్రములో
చెప్పబడినది. వీటిలో శ్వాస నియంత్రణ
ఉచ్ఛ్వాస, నిస్శ్వాస, కుంభకంలతో
కూడి ఉంటుంది. శాస్త్రము ఉచ్ఛ్వాస,
నిస్శ్వాసలు ఒకే కాల పరిమాణము,
కు౦భకం దానికి రెండు రెట్లు
కలిగి ఉండాలని చెప్తుంది. కానీ
రాజయోగములో కుంభకం ఉచ్ఛ్వాసకు
నాలుగు రెట్లు, నిస్శ్వాసకు రెండు రెట్లు
ఉండాలని చెప్పబడినది. రాజయోగ
మార్గము ఉత్తమము. శ్వాస నియంత్రణ
సునాయాసంగా, క్రమం తప్పకుండా
చెయ్యగలిగితే, దేహము కొంత శ్రమ
పడినా, నిశ్చలంగా ఉండి, ఉత్కృష్టమైన
ఆనందాన్ని మనస్సు కోరుతుంది. అటు
పిమ్మట ప్రత్యాహారము చెయ్యాలి. దాని
వలన మనస్సు ఏకత్వము పొంది
నామరూపాత్మకమైన జగత్తు నుండి
వెనక్కు మళ్ళుతుంది. మనస్సు సహజంగా
అన్ని బాహ్య విషయాలలో కలవడానికి
ప్రయత్నించినప్పుడు ప్రణవ జపం
చెయ్యాలి. అదే ఓంకార మంత్రోపాసన.
అలా చేస్తూ దృష్టిని కనుబొమల మధ్య,
లేదా ముక్కు చివరిమీద కేంద్రీకరించాలి.
అలాగే కుడిచెవిని, ఎడమచెవి మీద,
ఎడమచెవిని కుడిచెవి మీద దృష్టి పెట్టాలి.
దీని తరువాత ధారణ చెయ్యాలి. అంటే
దృష్టిని ఒక అంగం మీద కేంద్రీకరించడం.
దానికై హృదయము లేదా శిరస్సు యొక్క
అగ్ర భాగము -- సహస్రారకము -మీద
దృష్టి కేంద్రీకరించాలి. అలాగే ఇష్ట
దైవాన్ని ఒక దీపంగా భావించి
దానిపై దృష్టి పెట్టాలి.
అలా చేస్తూ, తాను ఇష్ట దైవం కన్నా
వేరుకాదని, దీపం ఆత్మకి ప్రతీక అని
భావించాలి. అనగా "నేను పరమాత్మ కన్నా వేరుకాను"
అనే ధ్యాసతో ధ్యానం చెయ్యాలి.
అప్పుడు సర్వాంతర్యామి, బుద్ధికి
సాక్షి అయిన బ్రహ్మన్,
హృదయంలో ప్రకాశిస్తుంది.
అప్పుడు "నేనెవరిని?" అని ప్రశ్న వేసుకొంటే
హృదయ కమలంలో దైవము లేదా
ఆత్మ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
ఈ విధంగా సాధన చెయ్యడం "నేను
పరమాత్మకన్నా వేరుకాను" అనే
ధ్యానం చెయ్యడం కన్నా ఉత్తమం.
మనకి ఏది సులువైతే దానిని చెయ్యచ్చు.
ఇటువంటి ధ్యానము వలన ఆత్మ జ్ఞానము
పొంది, బాహ్య స్పృహ లేకుండా ఆత్మలో
రమిస్తాము. అటువంటి స్థితిలో ఎటువంటి
స్పందన లేకపోతే సమాధి స్థితిని
చేరుతాము. ఇక్కడ నిద్ర పట్టకుండా
మెలుకువతో ఉండాలి. తద్వారా
పరమోత్కృష్టమైన ఆనందం కలుగుతుంది.
ఇలాగ ప్రతి రోజూ క్రమం తప్పకుండా
సాధన చేస్తే, పరమాత్మ కరుణించి,
ఉత్తమ పథ౦లో నడిపించి, అనిర్వచనీయమైన
శాంతిని ప్రసాదిస్తాడు.
ప్రణవమనగా మూడున్నర మాత్రలు గల
ఓంకారోపాసన. అ, ఉ, మ్ అనే అక్షరాలు
ఒక్కొక్కటి ఒక మాత్ర కలిగి ఉంటాయి. అ అనగా
మెలకువ అవస్థ, స్థూల శరీరం, సృష్టి. ఉ అనగా
కలలతో కూడిన నిద్ర, సూక్ష్మ శరీరము,
సృష్టి స్థితి. మ అనగా సుషుప్తి, కారణ శరీరము,
సృష్టి లయం. అర్థ మాత్ర నాల్గవ అవస్థకు
ప్రతీక. అదే ఆత్మ యొక్క సహజ స్థానం.
అది మిక్కిలి ఆనందదాయకం. ఆ
నాల్గవ అవస్థలో అన్ని శబ్దాలు నివృత్తి
చెంది ఉంటాయి. దీన్నే నిశ్శబ్ద జపము
అంటారు. దానిలో ద్వితీయం లేదు. అదే
అన్ని జపాలకు మూలం. ఓంకారము యొక్క
నిజ అనుభవము కలగడానికి, ప్రత్యాహారము
--నిశ్శబ్ద జపము -- చెయ్యాలి.
ఆత్మ మెరుపు యొక్క వ్రకాశం గల దీపంలాగ
హృదయ కమలంలో స్థితమై ఉండే కారణాన
దాన్నే కైలాసము, వైకుంఠం, పరమపదం అంటారు.
ఒక్కొక్కప్పుడు ఆత్మ ఉందా అనే అనుమానం,
ధ్యానం యొక్క లక్ష్యాన్ని
ద్వైతంగా భావించడం వలన సాధన
సక్రమంగా ఉండక పోవచ్చు. అప్పుడు సాధకుడు
తన ఆత్మ --అనగా స్వస్వరూపం-- మీద సాధన చెయ్యాలి.
అన్ని ధ్యానాలకన్నా ఆత్మ ధ్యానమే మిన్న.
దాన్ని సాధిస్తే మిగతా ధ్యానాలు అక్కరలేదు.
ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వారు ధ్యాన ప్రక్రియ
ఎన్నుకోవచ్చు. ఆత్మ జ్ఞానము వలన దైవ
సాన్నిధ్యము కలుగుతుంది. ఎవరైతే
తాము భగవంతుడి నుండి వేరు అని తలుస్తారో,
వారు తమ నీడను తామే కొలచడం వంటిది. దాన్ని
కొలుస్తున్న కొద్దీ నీడ ముందుకు సాగుతుంది.
ఆత్మ ధ్యానము, సర్వ దేవతలకు
అధిపతి అయిన పరమాత్మతో
అనుసంధానమైనది కావున, దాన్నే చెయ్యడం
ఉత్తమం.
No comments:
Post a Comment