Friday, January 13, 2023

Taittireya Upanishat



తైత్తిరీయ ఉపనిషత్








మొదటి భాగము


శ్లోకం 1


పగలు యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
రాత్రి యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
దృష్టి యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
బలం యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
వాక్ యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
ఆకాశం యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
సర్వ శక్తులకు ఆధారమైన బ్రహ్మన్ కు వంగి నమస్కరిస్తున్నాను
నేను సత్యమే పలుకుతాను; నీతినియమాలను పాటిస్తాను
నన్ను, నా గురువును చెడు నించి రక్షించు
నన్ను, నా గురువును చెడు నించి రక్షించు

శ్లోకం 2


మనము చదవడమనే కళని పరిశీలిద్దాం;
దానికై అక్షరాలు, వాటిని పలికే విధానము, ఉఛ్చారణ తెలియాలి;
అలాగే కాల పరిమాణము, ఒత్తులు, అనుక్రమము, లయ తెలియాలి.

శ్లోకం 3


జ్ఞానమనే కాంతి మాపై ప్రసరించుగాక.
మేము పరమాత్మతో ఏకమగుగాక.
ఈ అయిదు విషయాల గూర్చి ఆలోచిద్దాం:
ప్రపంచం, తేజోమయమైన ఊర్ధ్వ లోకాలు,
విద్య, సంతతి, మరియు వాక్కు.
ఈ ప్రపంచం ఏమిటి? క్రింద భూమి, మీద ఆకాశము,
రెంటికీ మధ్య గాలి, వాటినన్నిటిని కలిపే అంతరిక్షం.
ఆకాశంలో దేదీప్యమానంగా వెలిగే ప్రపంచాలు ఏమిటి?
అగ్ని ఒక ప్రక్క, సూర్యుడు మరొక ప్రక్క, మధ్యలో
జలం, వాటిని కలిపే మెరుపులు. విద్య అంటే ఏమిటి?
గురువు ప్రక్కన కూర్చున్న శిష్యునితో సంభాషించడం,
జ్ఞానం మధ్యలో, వారిని కలిపే బోధ. సంతతి అంటే ఏమిటి?
తల్లి ఒక ప్రక్క, తండ్రి మరొక ప్రక్క, బిడ్డ మధ్యలో,
వారిని కలిపియు౦చే అ౦గాలు.

వాక్ అంటే ఏమిటి? క్రింద, మీద దవడలు,
రెంటికీ మధ్య పదాలు, వాటిని కలిపియుంచే నాలుక.
ఎవరైతే ఈ అంశాల గూర్చి ధ్యానిస్తారో వారికి
సంతతి, పశువులు, ఆహారము, జ్ఞానము నిత్యము ఉంటాయి.

శ్లోకం 4


పరమాత్మా! శాస్త్రములలో చెప్పినట్లు నీవు సమస్త జీవుల
రూపాలను ధరించావు; నాకు అమృతత్వాన్ని ప్రసాదించే
మార్గము ఎన్నుకునే జ్ఞానము ప్రసాదించు. నా
దేహమును పుష్టిగా నుంచి, నాలుకుతో తీపి మాటలు పలికించు;
నా చెవులు సదా పరమాత్మకు ప్రతీకయైన ఓంకారము
వినుగాక. పరమాత్మయందు నా భక్తిప్రేమలు వృద్ధి నొందుతూ యుండు గాక

పరమాత్మా! నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించు;
నాకు ఆహారము, ఆచ్ఛాదనము, పశువులు సమృద్ధిగా ప్రసాదించు.
సంవత్సరాంతము ప్రవహించే నదిలా నలుదిక్కుల నుండీ
శిష్యులు నా వద్దకు రాగాక; నాకు వారి ఇంద్రియాలను, మనస్సును
నిగ్రహించుటకై బోధ చేయుటకు బలమునివ్వు; ఇదే
నాకు ధనము, కీర్తుల లాగ యుండుగాక. పరమాత్మా! నేను
నీలో ప్రవేశించుటకు వీలు కలిపించు; నీ నిజ స్వరూపాన్ని
దర్శించే అవకాశము ప్రసాదించు. నీవు బహురూపములు
దాల్చే పరిశుద్ధుడవు. నీ భక్తులకు నీవే శరణ్యం. నేను నీ
భక్తుడను. నన్ను అక్కువ చేర్చుకో.


భూర్, భువస్, సువర్ అనెడివి ప్రకంపనలు.
మహాచమస్య నాల్గవ దానిని బోధించెను. అదే
పరమాత్మకి ప్రతీకయైన "మహ". తక్కినవి
అతని అంగాలు.

శ్లోకం 5


భూర్ భూమి, భువస్ ఆకాశం, సువర్ ఊర్ధ్వ లోకాలు
అయినప్పుడు, మహ సూర్యునివలె అన్ని జీవులను
పోషిస్తుంది.

భూర్ అగ్ని, భువస్ గాలి, సువర్ సూర్యుడు అయినప్పుడు,
మహ చంద్రునివలె అన్ని గ్రహాలకు, నక్షత్ర
మండలాలకు ఆధారం. భూర్ ఋగ్ వేదము, భువస్ సామ వేదము,
సువర్ యజుర్ వేదము అయినప్పుడు మహ బ్రహ్మన్ వలె
నాలుగు వేదాలకు ఆధారం. భూర్ ఊర్ధ్వంగా ప్రసరించే
ప్రాణం, భువస్ క్రిందికి ప్రసరించే ప్రాణం, సువర్
సర్వత్ర వ్యాపించిన ప్రాణం అయినప్పుడు, మహ
ఆహారమువలె జీవులలోని ప్రాణశక్తిని సంరక్షిస్తుంది.
ఈ విధంగా ఈ నాలుగు ప్రకంపనలు నాలుగు రెట్లవుతున్నాయి.
దీనిని తెలిసినవారు పరమాత్మను తెలిసికొని, అందరిచే
మన్నన పొందుతారు.

శ్లోకం 6


పరమాత్మ జీవుల హృదయాలలో వసిస్తాడు.
అతనిని తెలిసికొంటే మృత్యువును దాటుతా౦.
కపాలములో కణత వద్దనున్న ఎముకల,
అంగిలి మధ్య నుండి అగ్నితో ఏకమవు
భూర్ శబ్దము; గాలితో ఏకమవు భువస్ శబ్దము;
సూర్యునితో ఏకమవు సువర్ శబ్దము;
పరమాత్మతో ఏకమవు మహ శబ్దము ఉద్భవిస్తాయి.
ఈ విధంగా ఒకడు తన జీవితానికి రాజై, కోర్కెలను,
ఇంద్రియాలను, బుద్ధిని ఏలుతాడు.
అతడు సత్యము, శాంతి, అమృతత్వము,
ఆనందానికి హేతువు, జీవిత పరమార్థము
అయిన పరమాత్మతో ఐక్యమవుతాడు. కాబట్టి
పరమాత్మని సదా స్మరించు.

శ్లోకం 7


భూమి, ఆకాశము, ఊర్ధ్వ లోకాలు, పావు, అర వంతులు;
అగ్ని, గాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు;
జలము, ఓషధులు, వృక్షాలు, అంతరిక్షం, వస్తువులు
భూతాలు. దేహంలో కన్ను, చెవి, మనస్సు, నాలుక, స్పర్శ;
చర్మము, మాంసము, కండరం, మజ్జ, ఎముకలు; పంచ
ప్రాణాలు ఉంటాయి. పంచమముతో కూడిన వాటిని
జ్ఞాని ధ్యానముచేసి ప్రతీదీ పవిత్రమైనదని
తెలిసికొంటాడు. జీవుడు అంతర్గతాన్ని, బాహ్యంతో
కలుపుకొని సంపూర్ణ మవుతాడు.


శ్లోకం 8



ఓంకారము పరమాత్మకి పరమోత్కృష్ఠమైన ప్రతీక.
ఓం సంపూర్ణమైనది. వేదాలను పఠించునపుడు
వాడబడేది. పురోహితుడు ఓంకారంతో పూజ
ప్రారంభిస్తాడు. ఆధ్యాత్మిక గురువులు, వారి
శిష్యులు ఓంకారంతో పఠనం మొదలబెడతారు.
ఏ విద్యార్థి అయితే ఓంకారం జపిస్తాడో అతడు
పరమాత్మతో అనుసంధాన మవుతాడు.

శ్లోకం 9



సంసారికి సూచనలు



మంచి నడవడిక కలిగి, శాస్త్రముల అధ్యయనము చేసి, బోధన పొందు.
అధ్యయనము, బోధలను చేస్తూ:
ఎల్లప్పుడూ సత్యం పలుకు; కోర్కెలను జయించు;
ఇంద్రియాలను నిగ్రహించు; శాంతికై పాటుపడు;
కుండలిని శక్తిని విడుదల చేయి; మానవాళికి
సేవ చేయి; సంతతిని పొందు.
సత్యవాచ చెప్పేది "ఎల్లప్పుడూ సత్యం పలుకు."
తపోనిత్య చెప్పేది "కోర్కెలను జయించు".
నక చెప్పేది "అధ్యయనము, బోధ సాధకుడుకి
ఎంతో అవసరం."

శ్లోకం 10


"నేను వృక్షము వంటి జీవితముతో ఏకమయ్యేను.
నా కీర్తి కొండ శిఖరమువలె ఎత్తుగా నున్నది.
నిత్య శుద్ధుడు, సర్వజ్ఞుడు, తేజోవంతుడు,
మరణము లేనివాడు అయిన పరమాత్మను
తెలిసికొన్నాను" అని త్రిశంకు మహర్షి
పరమాత్మతో ఐక్యమైనప్పుడు పలికెను.

శ్లోకం 11


వేదాలను బోధించి, గురువు ఇట్లు చెప్పును:
"సత్యమునే పలుకు; నీ కర్మలను నిర్వర్తించు;
శాస్త్రాలను విస్మరించకు. నీ గురువుకు సేవ
చెయ్యి. సంతతిని నివృత్తి చెయ్యవద్దు.
సత్యమార్గము నుండి మరలకు; మంచి
మార్గమునుండి మరలకు; నీ సాధనను
సదా రక్షించుకో. అధ్యయనము, బోధనము
నీ శక్తికి తగినంత చెయ్యి. జ్ఞానులను సదా
గౌరవించు. నీ తలిదండ్రులలో, గురువులో,
అతిథిలో దైవాన్ని చూడు. తప్పుడు పనులు
ఎప్పుడూ చేయకు. గౌరవింప దగినవారిని గౌరవించు.
దానము భక్తితో చెయ్యి; దానము ప్రేమతో చెయ్యి;
దానము ఆనందంగా చెయ్యి. నీకు ఒకటి మంచా చెడా అని
సందేహము వస్తే ఆధ్యాత్మిక ప్రగతికి ఏది
అవసరమో తెలిసిన జ్ఞానులను అడిగి తెలిసికో.
ఇది వేదాలు చెప్పినది. ఇదే రహస్య జ్ఞానం.
ఇదే సందేశం."

రెండవ భాగం



సత్యము, జ్ఞానము, అనంతమైన ఆనంద
స్వరూపమైన బ్రహ్మన్ ని తెలిసినవారు
తమ జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. వారు
తమ దహరాకాశంలో పరమాత్మని
దర్శించి జీవితంలో సమస్త సుఖాలను
పొందుతారు.

బ్రహ్మన్ నుండి ఆకాశం; ఆకాశం నుండి
గాలి; గాలి నుండి భూమి; భూమి నుండి మొక్కలు;
మొక్కలనుండి ఆహారము; ఆహారము నుండి
శరీరము, శిరస్సు, చేతులు, కాళ్ళు, హృదయము
ఉద్భవించేయి.

ఆహారం నుండి సమస్త జీవులు ఉద్భవించి,
మరణించిన తరువాత అవి ఇతరములకు ఆహారమవుతాయి.
శరీరానికి ఆహారము అతి ముఖ్యము. కావున అది
ఆదివ్యాధులకు చక్కటి ఔషధము. ఎవరైతే
ఆహారము భగవంతుని ప్రసాదమని భావిస్తారో,
వారికి జీవితంలో ఏ వెలితీ ఉండదు. అన్ని దేహాలూ
ఆహారంతో పోషింపబడతాయి; అలాగే దేహాలు
పడిపోయినప్పుడు తక్కినవాటికి ఆహార మవుతాయి.

అన్నమయ కోశము ఆహారముతో చేయబడినది.
దానిలోపల ప్రాణమయ కోశమున్నది. దానికి
ప్రాణము శిరస్సు, వ్యానము కుడి చెయ్యి, అపానము
ఎడమ చెయ్యి, ఆకాశం హృదయము, భూమి
పునాది.

ఆడామగా మానవులు, పశుపక్ష్యాదులు ఊపిరి తీసికొంటాయి. అందుకే
బ్రతికి ఉన్నాదని తెలిసికొనుటకు ఊపిరిని చూస్తారు.
మనమెంత కాలము జీవిస్తామో ప్రాణ శక్తి నిర్ణయిస్తుంది.
ఎవరైతే ప్రాణము పరమాత్మ ప్రసాదమని తలుస్తారో,
వారికి పూర్ణాయిష్షు కలుగుతుంది.

ప్రాణమయ కోశము ఊపిరితో చేయబడినది.
దాని లోపల మనోమయ కోసమున్నది.
దాని శిరస్సు యజుర్, కుడి చెయ్యి ఋగ్,
ఎడమ చెయ్యి సామ వేదాలు. హృదయము
ఉపనిషత్తుల సారాంశము. అథర్వణ వేదము
వాటికి పునాది.

ఎవనిని దర్శిస్తే పలుకులు వెనక్కి
తిరిగి వస్తాయో, ఆలోచనలు ఎవరిని చేరవో,
అదే బ్రహ్మన్ వలన కలిగెడి ఆనందము. వానికి
ఎప్పటికీ భయం కలుగదు.

మనోమయ కోశము లోపల ఆలోచనల
సమూహంతో గూడిన విజ్ఞానమయ కోశమున్నది.
దానికి భక్తి శిరస్సు, ధర్మము కుడి చెయ్యి, సత్యము
ఎడమ చెయ్యి. ధ్యానం దాని హృదయం,
వివక్షత దాని పునాది. విజ్ఞానమంటే జీవితాంతం
నిస్వార్థ సేవ చెయ్యడం; దేవతలు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
పొందాలని ప్రయత్నిస్తారు. ఎవరికైతే అట్టి
జ్ఞానము లభిస్తుందో వారు పాపమునుండి విముక్తులై,
నిస్వార్థమైన కోరికలను తీర్చుకొంటారు.

విజ్ఞానమయ కోశము వైరాగ్యముతో కూడినది.
దాని లోపల ఆనందమయ కోశమున్నది.
దాని శిరస్సు ఆనందము; తృప్తి కుడి చెయ్యి;
సంతోషము ఎడమ చెయ్యి; ఆహ్లాదము దాని
హృదయము; బ్రహ్మన్ దాని మూలము. ఎవరైతే
పరమాత్మ లేడని అంటారో, వారు తమనే కించ
పరుచుకున్నవారవుతారు. ఎవరైతే పరమాత్మని
ధ్యానిస్తారో, వారు తమ ఉనికిని ధ్రువపరచు
కొంటారు. జ్ఞానులు పరమాత్మని పొందుతారు.

పరమాత్మ "నేను బహుళ మవుతాను" అని
తలచేడు. అప్పుడు ధ్యానం చేసి సమస్త
సృష్టిని తయారు చేసేడు. ధ్యానంతో
సృష్టి అంతటిలోనూ ప్రవేశించాడు.

రూపము లేనివాడు అనేక రూపాలుగా మారేడు;
అపరిమితమైన వాడు పరిమిత మయ్యేడు;
సర్వాంతర్యామి ఒక ప్రదేశానికి పరిమిత మయ్యేడు;
సంపూర్ణ జ్ఞానము కలవాడు అజ్ఞానాన్ని సృష్టించేడు;
సత్యమైన వాడు అసత్యాన్ని సృష్టించేడు.
అతడే మనం చూసేద౦తా.
సత్యమని ధ్రువపరిచే అన్నిటికీ అతడే కారకుడు.
ప్రపంచము లేక ముందు పరమాత్మ అవ్యక్తమై ఉన్నాడు.
బ్రహ్మన్ పరమాత్మను తన నుండే సృష్టించేడు.
అందుకే అతడు స్వయంభు.

పరమాత్మ అమితమైన ఆనందానికి నిలయం.
అతని దర్శనంతో మన చేతన మనస్సులలో
హృదయాలు ఆనందంతో పులకరిస్తాయి.
అతనే లేకపోతే ఎవరు శ్వాస తీసుకొనేది? ఎవరు జీవించేది?
అతడు అందరి హృదయాలను ఆనందంతో నింపుతాడు.

ఎవరైతే పరమాత్మ జీవుల ఐక్యతకు ప్రతీక, మార్పు
లేనివాడు, నామరూపాలు లేనివాడు అని తెలిసికొంటారో,
వారికి భయమన్నది ఉండదు. మనము జీవుల ఐక్యత
తెలియనంత కాలం భయంతో బ్రతుకుతాము.

పరమాత్మ గురించి తెలియని విద్యార్థి, అతని వేర్పాటువల్ల
భయాన్ని పొందుతాడు. బ్రహ్మన్ కి భయపడి గాలి
వీస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు, అగ్ని రగుల్కొంటుంది,
మృత్యువు అందరినీ తీసుకుపోతుంది.

పరమాత్మ నుండి పొందిన ఆనందమెటువంటిది?
ఒక నాగరీకుడు, ఆరోగ్యవంతుడు, మంచివాడు,
బలవంతుడు, మిక్కిలి ధనవంతుడు అయిన యువకుని
ఒక వంతు ఆనందంగా చూద్దాం.

అ యువకుని ఆనందానికి వంద రెట్లు ఒక గంధర్వుని ఆనందం;
అ గంధర్వుని ఆనందానికి వంద రెట్లు పితృల ఆనందం;
అ పితృల ఆనందానికి వంద రెట్లు ఒక దేవత ఆనందం;
అ దేవతల ఆనందానికి వంద రెట్లు కర్మదేవుల ఆనందం;
కర్మదేవుల ఆనందానికి వంద రెట్లు ఇంద్రుని ఆనందం;
ఇంద్రుని ఆనందానికి వంద రెట్లు బృహస్పతి ఆనందం;
బృహస్పతి ఆనందానికి వంద రెట్లు విరాట్ పురుషుని ఆనందం;
విరాట్ పురుషుని ఆనందానికి వంద రెట్లు ప్రజాపతి ఆనందం;

జీవులలోనూ, సూర్యునిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే.
ఈ సత్యాన్ని అర్థం చేసికొన్నవారు ప్రపంచాన్ని దాటి,
కోశాలనూ దాటి, జీవుల ఐక్యతను తెలిసికొంటారు.

ఎవరి వల్ల పలుకులు, ఆలోచనలు నివృత్తి అవుతాయో,
అట్టి బ్రహ్మన్ ఆనంద స్వరూపుడని గ్రహించి, అభయంతో
బ్రతుకుతాము. వారికి "నేను మంచి కార్యం ఎందుకు చేయలేకపోయాను?"
లేదా "నేను మంచి కాని కార్యం ఎందుకు చేసేను?" అనే
సంశయాలనుండి విముక్తి లభిస్తుంది. బ్రహ్మన్ యొక్క ఆనంద
స్వరూపాన్ని తెలిసికొని, మంచిచెడులను గ్రహించి, వారు
ద్వంద్వాలకు అతీతులవుతారు.

మూడవ భాగం


భృగు తన తండ్రి వరుణుని వినయముతో ఇట్లు అడిగెను:
"బ్రహ్మన్ అనగా నేమి?"

వరుణుడు "మొదట ఆహారం, కన్ను, చెవి, వాక్కు, మనస్సుల
గురించి తెలిసికో; అటు తరువాత అవి ఎక్కడనుండి
ఆవిర్భవించేయి, ఎలా మనుగడ కావిస్తాయి,
ఎవరి గూర్చి వెదకుతాయి, తిరిగి ఎవరిలో ఐక్యమవుతాయి
అనేవాటిని గురించి తెలిసికో. అదే బ్రహ్మన్" అని బదులిచ్చెను.

భృగు ధ్యానం చేసి ఆహారం బ్రహ్మన్ అని తెలిసికొన్నాడు.
అన్ని జీవులు అన్నము నుండి పుట్టి, అన్నం వల్ల పెరిగి, తిరిగి
అన్నంలో లయమవుతున్నాయని తలచెను. కానీ సంతృప్తి
పొందక తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళి "నాకు బ్రహ్మన్ గూర్చి
తెలుపు" అని కోరెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి ప్రాణం బ్రహ్మన్ అని తలచెను. ప్రాణం
వలన జీవులు పుడుతున్నారు, పెరుగుతున్నారు, లయమవుతున్నారు
అని తలచెను. దానితో సంతృప్తి చెందక మరల తండ్రి వద్దకు
వెళ్ళి "నాకు బ్రహ్మన్ గూర్చి ఇంకా తెలుపు" అని అడిగెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి మనస్సు బ్రహ్మన్ అని కనుగొనెను. మనస్సు
నుండి జీవులు పుట్టి, పెరిగి, లయమవుతాయని తలచెను.
కానీ సంతృప్తి చెందక తండ్రిని "బ్రహ్మన్ గూర్చి నాకింకా చెప్పు"
అని కోరెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి బ్రహ్మన్ అంటే జ్ఞానమని కనుగొనెను. జ్ఞానం
నుండి అన్ని జీవులు పుడతాయి, పెరుగుతాయి, దానిలోనే
లయమవుతాయి అని తలచెను. కానీ సంతృప్తి చెందక
తన తండ్రిని బ్రహ్మన్ గూర్చి ఇంకా చెప్పమని అడిగెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి బ్రహ్మన్ ఆనందమని కనుగొనెను. ఎందుకంటే
ఆనందం నుండి జీవులు పుట్టి, పెరిగి, లయమవుతున్నాయని
తలచెను.

ఈ విధంగా వరుణుని సుతుడు భృగు గాఢ ధ్యానంలో
పరమాత్మ గురించి తెలిసికొన్నాడు.

ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో,
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.

అన్నాన్ని గౌరవించు: శరీరము అన్నముచేత చేయబడినది.
అన్నం, శరీరం పరమాత్ముని సేవించుటకై యున్నవి.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో,
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.

అన్నాన్ని వ్యర్థం చేయవద్దు, జలాన్ని వృధా చేయవద్దు,
అగ్నిని వ్యర్థం చేయవద్దు; అగ్ని, జలము పరమాత్ముని
సేవ చేయుటకై ఉన్నాయి.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.

అన్నాన్ని పెంపొందించు. భూమి ఇంకా ఎక్కువ
ఇవ్వగలదు. భూమి, ఆకాశము పరమాత్ముని
సేవించుటకై ఉన్నవి.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.


ఆకలితో ఉన్నవారికి అన్నం ఇవ్వకుండా ఉండవద్దు.
అన్నదానం చేస్తే, పరమాత్మకి సేవ చెయ్యడమే.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.


ఆ జ్ఞానం వలన మన పలుకులు తియ్యనివై, శ్వాస
దీర్ఘమై, చేతులు మన చుట్టూ ఉన్న పరమాత్మ సేవకు సంసిద్ధమై,
కాళ్ళు సహాయము కోరువారలకై ఉంటాయి.
ఆ జ్ఞానం వలన పరమాత్మని జంతువులలో, పక్షులలో,
నక్షత్ర కాంతిలో, ఆనందంలో, శృంగారంలో, వానలో,
ప్రపంచంలోని అన్ని వస్తువులలో చూస్తాము. పరమాత్మ
ఇచ్చిన దేహముతో భద్రత, జ్ఞానము, కర్మలలో ప్రేమ
పెంచుకొని, మనలో అంతర్గతమై యున్న శత్రువును
జయించి, పరమాత్మతో ఐక్యమవుతాం.

జీవునిలోని, సూర్యునిలోని పరమాత్మ ఒక్కడే.
ఇది తెలిసినవారు ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసికొని,
పంచ కోశాలను దాటి జీవైక్యతను పొందుతారు.
ఎవరైతే జీవులన్నీ ఒక్కటే అని అర్థం చేసుకొంటారో,
వారు అ౦తట క్షేమంగా ఉండి, తమలో అన్ని
జీవులను చూసుకొంటారు. వాళ్ళు ఆనందంతో ఇలా
పాడుతారు:

"నేను ప్రాణాన్ని కాపాడే అన్నాన్ని;
నేను ప్రాణ శక్తిని భుజిస్తాను.
నేను అన్నాన్ని, జలాన్ని అనుసంధానము చేస్తాను.
నేను ప్రపంచంలో పుట్టిన మొదటి జీవిని;
దేవతలకంటే పూర్వీకుడను, అమృతత్వము పొందిన వాడను.
ఎవరైతే ఆకలి ఉన్న వారితో అన్నం పంచుకొంటారో,
నన్ను రక్షిస్తారు; అలాకాని వారిని నేను భక్షిస్తాను.
నేనే ఈ ప్రపంచాన్ని; ఈ ప్రపంచాన్ని అనుభవిస్తాను.
ఇది అర్థం చేసుకొన్నవారు, జీవితాన్ని అర్థం చేసుకొంటారు"

ఇది ఉపనిషత్తు యొక్క రహస్య బోధ.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...