Friday, August 11, 2023

Patanjali Samaadhi Paada Second Prakarana (Slokas 17-20)

upanishad


  


రెండవ ప్రకరణము: అప్రజ్ఞాతము

17

సూః వితర్క విచారానందస్మితా అనుగమాత్ సంప్రజ్ఞాతః

వితర్క 		= వస్తు విమర్శనము 
విచార 		= అనేక విషయములను 
			 గూర్చి ఆలోచించుట 
ఆనందా 		= ఆనందము 
అస్మితాః 		= తన అస్తిత్వము 
అనుగమాత్ 	= అనుసరించుట వలన 
సంప్రజ్ఞాతః 	= ప్రజ్ఞ చక్కగా వికసించిన స్థితి 

ప్రజ్ఞ చక్కగా వికసించుట అనే స్థితి, ప్రతీ 
వస్తువు గురించి విమర్శ చేసికొని, దాని 
నిజస్థితిని గమనించడం వలన,
అన్నిటిలోనీ ఆనందం గురించి తెలియుట 
వలన, తానను ప్రజ్ఞ అన్నిటిలోనూ వెలుగుటను 
గమనించడం వలన, సాధ్యమవుతుంది. 
  

ఈ ప్రపంచంలో సమస్తము మనస్సు చేత,
ఇంద్రియముల చేత గమనింపబడి గ్రహింప 
బడుతోంది. సరైన ప్రమాణము స్వీకరిస్తే,
అన్నీ చక్కని విమర్శకు లోబడి వుంటాయి. 
ఇక్కడ ప్రమాణమంటే ఒక వస్తువు యొక్క 
విలువ లేదా ఉపయోగము. ధాన్యము నుండి 
బియ్యం చేసి వండితే అది ఆకలి తీరిస్తుంది. 
ఇదే ధాన్యము యొక్క సరైన ప్రమాణము. 
అలాకాక దాచితే పురుగులు పట్టి పనికిరాకుండా 
పోతుంది. అంటే ధాన్యమును వెంటనే 
ఉపయోగించాలి, దాచడానికి పనికిరాదు అని 
తెలుస్తోంది. ఇదే సరైన ప్రమాణము.  అంటే 
వెంటనే ఉపయోగించడం వలన ధాన్యము 
మొదలైనవి సుఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి 
ఈ విలువ ధాన్యానికి ప్రమాణము. 

అలాకాక ధనం లాగ దాచడానికి ప్రయత్నిస్తే 
అది విపర్యయము. అంటే క్లిష్టతను కలిగిస్తుంది. 
కాబట్టి మనం ధాన్యాన్ని విపర్యయముగా గాక 
ప్రమాణమనే ప్రవృత్తితో స్వీకరిస్తే, దానివలన 
మనం సుఖపడతాం. లేకపోతే దుఃఖపడ 
వలసి వస్తుంది. ఇలాగ ఒక వస్తువు యొక్క 
ప్రమాణమును, అంటే సరైన ప్రవృత్తిని,
గమనించే పద్ధతిని వితర్కమంటారు. అటువంటి 
వితర్కము వలన సంతోషము, సుఖము కలుగు 
తాయి. ఇటువంటి విచారము వలన మనలో 
ఆనందం పుడుతుంది. అంటే ఆనందం కలిగే 
మార్గము దొరుకుతుంది. 

నేనబడే ప్రజ్ఞ వలన వితర్కము, విచారము,
మొదలైనవి వివేకమును కలిగించి సుఖానికి 
దారి చూపుతాయి. అటువంటి నిరంతర 
సంతోషము అనే స్థితినే యోగి యొక్క సమాధి 
స్థితి అని చెప్తారు. 

18

సూః విరామ ప్రత్యయాభ్యాసపూర్వసంస్కార శేషోఅన్యః

విరామ 		= విరామము, నిలుపుదల 
ప్రత్యయా 		= గ్రహణము 
అభ్యాసపూర్వః 	= అభ్యాసముచే ప్రారంభింపబడినది 
సంస్కారశేషః 	= సంస్కారములు వాదలబడినట్టిది 
అన్యః 		= మరియొకటి 

మరియొక స్థితి, ప్రత్యయము నశించి సంస్కారములు 
పూర్తిగా వదిలిపెట్టుటను అభ్యసించుట చేత 
సాధ్యపడును 
  

పైన చెప్పబడిన సమాధిస్థితిని పొందిన వెనుక మరొక 
సాధన ఉంది. దీనిలో  ఇంద్రియ స్పర్శలుండవు. అ౦టే 
ఒకడు దేనినీ గమనించడంగాని,  చూడడంగాని చేయడు. అలాంటి 
వాడు ఉదాసీనుడు, విగతస్పృహుడు అని  భగవద్గీతలో 
చెప్పబడినది. అతడు తనకుతానే తప్ప వానికి మరియొకటిలేదు.
అయితే అలాంటివాడు ఏమిచేయాలి? ఎలా ఉండాలి ?
శ్వాసించాలా? అతడు శ్వాసిస్తాడు కాని శ్వాసింపనివాడే 
అవుతున్నాడు. అ౦టే  శరీరము శ్వాసిస్తుంది,  అన్నము తింటుంది కానీ 
వాడు శ్వాసించడు. తనకుతాను అన్నము తినడు. వాడి  శరీరమే
ఇవి నిర్వహిస్తుండగా వాడు కల్పించుకోక చూస్తూ సాక్షి
వలె ఉంటాడు. అ౦టే ఆకలి వేస్తే, ఎదురుగా తినదగిన వస్తువు
ఉ౦టే  తి౦టాడు. లేకపోతే  ఊరక ఉంటాడు. అంతేగాని తిండినిగురించి 
దిగులు పెట్టుకోడు, ఆలోచించడు, విచారించడు. 
అంటే  తాను చేయవలసినవి తాను చేస్తూ ఉంటాడే కాని 
వాటిని గూర్చి బాధపడడం, ఆలోచించడం మొదలైనవి  ఉండవు.
అతడు మాట్టాడినా, విన్నా, చూచినా, అవి అన్నీ 
వాని ఇంద్రియ ప్రజ్ఞలు నిర్వహిస్తాయేగాని అతడు చేయడు. అలా అని 
ఇంద్రియప్రజ్ఞలను బలవంతముగా అణగద్రొక్కడు. అ౦టే  ఆకలి
ఉంటే  ఆహారమున్నపుడు ఉపవాసముల పేరిట శరీరాన్ని 
శుష్కింపచేయడు.  అలా అని  ఆకలిలేనప్పుడు మొహమాటానికి 
తినడు.  అలాగే వాని కుటుంబ బాధ్యతలుకాని, ఉద్యోగ 
బాధ్యతలు కాని వానిచే అప్రయత్నముగా నిర్వహింపబడతాయే గాని అతడు
దేనిని స్వతంత్రించి సంకల్పించడు. అవన్నీ వానిచే 
అప్రయత్నముగా నిర్వహింపబడతాయి. మన౦  భోజన౦  చేసేటప్పుడు 
ఆహారము నోటిలో పెట్టుకొని ప్రతి ముద్దా  నమలాలని 
సంకల్పించి నమిలి మ్రింగుతున్నామా? లేక మన౦ భోజన౦ 
చేస్తున్నప్పుడు, వేరొక విషయాన్ని చూడడంకాని,
లేక సంగీతము మొదలైనవి వినడంకాని చేస్తూ అన్నము నోటిలో
పెట్టుకున్నతడవే  నమలడం, మ్రింగడం వాటంతట అవే మనకు
తెలియకుండగనే జరిగిపోతాయా? పాటవినడం పూర్తి అయిన తరువాత 
మనము చూస్తే అప్పటికి భోజనము యధావిధిగా స్వీకరించడం పూర్తి 
అయిపోయి ఉంటుంది. అన్ని పదార్థాలూ 
సక్రమ౦గానే స్వీకరింపబడతాయి. ఇది అ౦తా  మనలో
మనకు తెలియకుండా ఎలా జరిగి౦దో గమనిస్తే యోగి 
అయిన వానికి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు అలాగే 
నిర్వహింపబడతాయి. పై శ్లోకములో  చెప్పబడిన రెండు స్టితు
లు: సంప్రజ్ఞాతము మరియు అసంప్రజ్ఞాతము. 
సంప్రజ్ఞాతము అ౦టే  అన్నిటియందు వున్న ఒకే వెలుగును
దర్శించి దాని యందుండడం; అసంప్రజ్ఞాతమ౦టే  భౌతిక 
ప్రపంచముతో సంబంధములేని ఒకే వెలుగుగా తానుండడం. 
మొదటిదానిలో వ్యక్తులు, విషయములు మొదలైనవి 
ప్రమాణమనే ప్రవృత్తిలో స్వీకరింపబడతాయి. రెండవదానిలో 
వాటి సంస్కారములు లేక అంశలు మాత్రము వుంటాయి. వానికి కర్తవ్యమే కాని 
సంకల్పము లేదు. అ౦టే ప్రతీకారము లేదు. వానికున్నది ఒక్కటే. 
అదే "తాను". అతడు తనయందు తానుండగా పనులు 
అప్రయత్న౦గా మనస్సు ఇంద్రియములు, శరీరము మొదలైన 
వాటిచే నిర్వహింపబడతాయి. 

19

భవ ప్రత్యయో విదేహ ప్రక్పతి లయానాం.


భవప్రత్యయోః 	= పుట్టుకకు ఆధార మైనట్దిది 
విదేహ 		= దేహములేనట్టివారికి
ప్రకృతిలయానాం  = ప్రకృతియందు లయ మైనట్టివారికి

  శరీరములేనట్టివారికిని మరియు ప్రకృతియందు లీనమై
  యున్నట్టి వారికిని (ఇది) పుట్టుకకు ఆధారమై యున్నది.

  


విదేహల౦టే  శరీరమందున్నా లేనట్టివారు. అంటే  వీరు
వృక్ష జంతు స్టితులలో, అణుదశలోకూడా ఉన్నారు.
వీరు పురుషరహిత స్టితిలో ఉంటారు. అ౦టే  వీరు శరీరము
వేరుగా నున్నా, లేకున్నా ప్రకృతిలో  ఉండి పని 
చేస్తారు.  కాబట్టి  వీరు దేవలోకమునకు చెందినవారు. వీరికి
(అ౦టే దేవతలకు) శరీరమక్కరలేదు. కాబట్టి విదేహలని 
పిలవబడతారు. వీరు మన శరీరములలో గ్రహణశక్తిగాను,  ఊహలు,
ఆలోచనలుగాను, జ్ఞాపకశక్తిగాను,  అభ్యాసముగాను పని చేస్తారు. 
యోగి తన భౌతిక వ్యాపారములను నిలిపివేయగానే ఈ
విదేహులనేవారు శరీరమును వదిలి ప్రకృతియందు లయమవుతారు. 
అక్కడినుండి వారు ప్రపంచ౦లో  మానవజాతియొక్క
మొత్తాన్ని  వ్యాపిస్తారు. అటుతర్వాత అన్ని భూతములలో ,
 జీవులలో వ్యాపిస్తారు. తర్వాత భూమిలో 
అన్ని అణువులలోనూ,  దాని నుండి, సౌరమండలము
ప్రవేశించి చివరకు అన్నిటికి కారణమైన పరమాత్మగా
వ్యాప్తి చెందుతారు.

ఇక్కడ దేవతలు వ్యాపించుట అంటే యోగి 
లోని ఉత్తమ సంస్కారములు వ్యాపించడం. మనలో నున్న 
ఉత్తమ సంస్కారములుగా దేవతలు పనిచేస్తారు. కాబట్టి 
యోగిలోని ఉత్తమ సంస్కారములను ఇలాగ  వ్యాపి౦ప చేసి
చివరకు అంతర్యామిలోకి విస్తరింపచేస్తారు.  అక్కడ నుండి 
మరల వారు సృష్టిలోకి దిగివస్తారు.  కాని అలా రావడం 
ఇతరులను సేవించడం కొరకేకాని తమ గురించి కాదు. 
మరల వేరొక జీవికి శిక్షణ ఇవ్వడానికే  తప్ప ఇంకొక కారణ౦ 
లేదు. అలాగ  శిక్షణ పొందిన వ్యక్తి యోగి అవుతాడు. వారికి 
శరీరము, బంధము కాదు. అలాంటివారు ఇతరులకై  జీవిస్తారు. 
అలాంటి యోగులందు దేవతలుకూడ తమ కర్తవ్యము పూర్తయినది 
కాబట్టి  వారిని శరీరములో బంధింపరు. అనగా శరీరమక్కరలేని స్థితి 
లోనికి వారిని పరిణమింపజేస్తారు.  కాబట్టి  అటువంటి
యోగికూడ వారిలో కలసి విదేహమను స్టితిలో ఉంటాడు. 

20

శ్రద్దా వీర్య న్మృతి సమాధి ప్రజ్ఞావూర్వక ఇతరేషా౦


శ్రద్ధా  = శ్రద్ధ 
వీర్య = బలము,
స్మృతి = జ్ఞాపకము
సమాధి = సమాధి
ప్రజ్ఞాపూర్వకః = ప్రజ్ఞతో మొదలైనది
ఇతరేషాం = ఇతరులకిరకు.

ఇతరులకు ఇది నిరంతర శ్రద్ధ, ప్రయత్నము,
పునఃశ్చరణ, సమాధి మరియు జాగరూకత 
మొదలైన  వాని వలన సాధ్యమగును.
  


విదేహులు మరియు సమాధిస్టితిలో నున్న యోగులకు
యోగజీవనము నిరంతరము అవ్యయము మరియు శాశ్వతము.
వారెప్పుడు యోగమునందే యుండి అట్టి యోగమునకు గురువులుగా 
మరియు మార్గదర్శకులుగా ఉంటారు. శ్రీకృష్ణుడు అటువంటి 
వారిలో, కుమారసర్గమును, సప్తర్షులను, మనువులను, మరియు
నారదుడు, దేవలుడు, వ్యాసుడు అను ఋషులను ప్రత్యేకముగా
పేర్కొన్నాడు. వారి అస్తిత మనే వెలుగులో జీవులందరూ రక్షణ
పొందుటేగాక, నిజమైన యోగ  జీవితమునకు కొనిపోబడతారు. 
 
ఇది ఇలా ఉండగా సమస్త జీవులను అలాంటి  మార్గములకై, 
తమంతటతాముగా జన్మల పరంపరలో ఎప్పుడో ఒకప్పుడు
మొదటి అడుగు వేయవలసి వస్తుంది. దాని కొరకై 
తన దేహశక్తులను, ప్రజ్ఞలను సమీకరించుకొనవలసి ఉంటుంది.
నిరంతరం మెలుకువ కలిగి జీవితములో ఏమరపాటు లేకుండ
ఉండాలి. అంటే  జీవిత ప్రణాళికలో  మెలకువ కలిగి
ఉండాలి. యోగజీవనము గురించి తెలుసుకొని, ఆచరించే 
మనస్తత్వము  కలిగి ఉండాలి. అతని ప్రయత్నము
చక్కగా పురోగమించుట తోడనే అతడు యోగి అవుతాడు.

అంటే  జీవి తన జీవిత సంఘటనలన్నింటిని ఒక ప్రత్యేక
దృష్టితో గమనించుకొనవలసియుండాలి. ప్రతి సంఘటనలో 
తాత్కాలిక కష్టసుఖములేగాక వాటిలోని పరమార్హమును
గమనించాలి. పరమార్హమనగా దేని వలన  ఆత్మసంతృప్తి,
సమర్పణ బుద్ధి, ఔదార్యము మొదలైన సద్గుణములు మనలో 
వికసించునో, అదియే. ప్రతి సంఘటన సన్నివేశము ప్రత్యక్షముగా
కాని, పరోక్షముగా కాని జీవియందు మార్పు కలిగిస్తూ ఉంటుంది. 
అటువంటి మార్పులను గమనించడమే మెలకువ. అలాంటి 
మెలకువ గలవాడే యోగి. 

No comments:

Post a Comment

Viveka Sloka 22 Tel Eng

Telugu English All విరజ్య విషయవ్రాతాద్దోషదృష్ట్యా ముహుర్ముహుః । స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే ॥ 22॥ ముహుర్ముహుః ...