Friday, August 4, 2023

Patanjali Samaadhi Paada First Prakarana (Slokas 1-11)

upanishad


  


మొదటి ప్రకరణము: ఐదు మూల ప్రవృత్తులు

1

అథ యోగానుశాసనమ్

By స్వామీ  వివేకానంద 

ఇక ఏకాగ్రత లక్షణాల గురించి చెప్పుకుందాం 
  


2

యోగశ్చిత్తవృత్తి నిరోధః


చిత్తవృత్తులను నిగ్రహించటమే యోగం 
(చిత్తం = అంతఃకరణం)
  

నాకు కన్నులున్నాయి. కాని, అవి తమంత తామే 
చూడలేవు. మెదడులో నేత్ర నాడీ కేంద్రము౦టుంది;
దాన్ని తీసివేయండి. కన్నులు మామూలుగానే 
ఉంటాయి. రెటీనా (నేత్రా౦తఃపటలం) కూడా 
చక్కగానే ఉంటుంది. దానిపై ప్రతిబింబాలు 
పడుతూనే ఉంటాయి. అయినా సరే, కన్నులు 
రూపాలను చూడలేవు. కాబట్టి కన్నులు 
అప్రధాన సాధనాలు; అవి చూసే ఇంద్రియాలు 
కావని తేలుతోంది కదా!

మెదడులోని ఒక నాడీ కేంద్రంలో ఈ చూసే 
ఇంద్రియము౦టుంది. కన్నులున్నంత 
మాత్రాన చూపు౦టుందని చెప్పలేం. ఒక 
వ్యక్తి కన్నులు తెరచుకొని నిద్రిస్తున్నాడు. 
చుట్టూత మంచి వెలుతురుంది. వెలుపలి 
వస్తువుల నుండి ప్రతిబింబాలు కూడా 
ఏర్పడుతున్నాయి. అయినా వస్తువు 
కనిపించదు. కారణమేమిటంటే వీటికి 
తోడుగా మరొకటి ఉండాలి. అదే మనస్సు. 
ఇంద్రియంతో మనస్సు సంయోగం 
చెందాలి. అప్పుడే వస్తువు కనిపిస్తుంది. 

కన్ను వెలుపలి ఉపకరణం. దీనికి 
మెదడులోని కేంద్రం మనోనియంత్రణం 
సహాయపడాలి. అప్పుడే కన్ను గ్రహించే 
రూపం కనిపిస్తుంది. దారివెంట వాహనాలు 
వెళుతున్నాయి. అయినా వాటి చప్పుడు 
మనకు విన్పించుట లేదు. ఎందుకని?

మన మనస్సు, "చెవి" అనే ఇంద్రియ 
పరికరంతో సంయోగం చెందటం లేదు. 
ఉపకరణం, ఇంద్రియం ఈ రెంటితో కలిసే 
మనస్సు అనే మూడు విషయాలు ఈ 
క్రియలో ఉన్నాయి. 

వీటి మూలంగా వచ్చే స్పర్శ (వార్త) 
మనస్సులోని బుద్ధికి చేరుతుంది. 
"నిశ్చయం" చేసే పని బుద్ధిది. బుద్ధి 
నిశ్చయం చేస్తుంది. అదే బుద్ధి 
ప్రతిక్రియ. 

ఈ ప్రతిక్రియను వెన్నంటి అహంభావం 
ఉంటుంది. ఈ క్రియ ప్రతిక్రియల 
సంయోగం పురుషునికి (ఆత్మకి) అందుతుంది;
పురుషుడు మన నిజాత్మ క్రియాప్రతిక్రియల 
సమ్మేళనంగా పురుషుడు విషయాన్ని 
గ్రహిస్తాడు. 

ఇంద్రియ౦, మనస్సు, బుద్ధి, అహంభావం 
వీటిని అంతఃకరణ చతుష్టయమంటారు. 
నిజానికి ఇవన్నీ చిత్తం చేసే వేరు వేరు 
వ్యాపారాలే. చిత్తంలోని సంకల్పాలే 
వృత్తులు. మరి సంకల్పమంటే ఏమిటి?

అదొక శక్తి. భూమ్యాకర్షణశక్తి లాంటిదే. 
ప్రకృతిలో ఆనంతశక్తిరాశి ఉంది. దాన్ను౦డి 
చిత్తం కొంత శక్తిని గ్రహిస్తుంది. ఆ 
శక్తినే సంకల్ప రూపంగా బయటికి పంపుతూ 
ఉంటుంది. 

ఆహారం వల్లే ఈ శక్తి మనకు లభిస్తుంది. 
ఆహారం ద్వారానే శరీరం కదలికలు చేసే 
శక్తిని పొందుతుంది. ఇతర సూక్ష్మ శక్తులు 
కూడా సంకల్ప రూపంలో ఆహారం ద్వారా 
వెలువడుతున్నాయి. కాబట్టి చిత్తం 
కూడా ఒక పదార్థమే. 

అది స్వయంగా చైతన్యవంతం కాదు. 
మరది చైతన్యవంతంగా ఉన్నట్లు 
కనిపిస్తుంది కదా! అంటారా? 

చిత్తం వెనుక చైతన్యవంతుడైన పురుషుడు 
ఉన్నాడు సుమా! అందుకే చిత్తం అలా 
కనిపిస్తుంది. నువ్వే అసలు చైతన్యం. 
చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే; దాని 
ద్వారా నువ్వు ప్రపంచాన్ని గ్రహిస్తావు. 

ఈ పుస్తకముంది కదా; బాహ్య ప్రపంచంలో 
ఇది పుస్తక రూపంలో లేదు. బాహ్యంలో 
మరది ఏమై వుందో అది మనకు తెలియదు;
తెలియబోదు. ఈ అజ్ఞాత వస్తువు వల్ల 
చిత్తానికి ఘర్షణ ఏర్పడుతుంది. రాతిని 
నీటిలో వేస్తే, నీటిపై తరంగాలు బయల 
దేరుతాయి. అలాగే వస్తువుతో చిత్తానికి 
సంఘర్షణ కలగగానే, చిత్తంలో పుస్తక రూప 
ప్రతిక్రియ కలుగుతుంది. నిజంగా 
ప్రపంచమంటే ఏమిటి?

బాహ్యవిషయాలతో చిత్తం చేసే ప్రతిక్రియా 
రూపమైన సంఘటనలే. పుస్తక రూపం, 
ఏనుగు రూపం, మనిషి రూపం అంటూ 
బాహ్య ప్రపంచంలో ఏ రూపాలూ లేవు. 
బాహ్య స్పర్శతో చిత్తంలో కలిగే 
ప్రతిక్రియలనే మనం గ్రహిస్తుంటాం. 
జాన్ స్టూవర్ట్ మిల్, "స్పర్శాది ఇంద్రియ 
అనుభూతుల శాశ్వత సంభావనీయతే 
భౌతిక ప్రకృతి" అని అంటాడు. 

బాహ్య ప్రపంచంలో శబ్దాది విషయాలు 
మాత్రమే ఉన్నాయి. ఒక ముత్తెపు చిప్పను 
తీసుకోండి; మంచి ముత్యం ఎలా 
తయారౌతుందో మీకు తెలుసు కదా!
పరాన్నభుక్కు అయిన క్రిమి ఒకటి 
ముత్తెపు చిప్పలో ప్రవేశిస్తుంది. చిప్పకు 
కంపనాలు కలిగిస్తుంది. దానితో చిప్ప 
పింగాణి వంటి పదార్థాన్ని ఆ క్రిమి 
చుట్టూ వెదజల్లుతుంది. అదే 
ముత్యమవుతుంది. 

ఈ దృశ్య ప్రపంచం కూడా మనం 
వెదజల్లే పింగాణి అనే చెప్పాలి. యథార్థ 
ప్రపంచం ఆ క్రిమిలాంటిది. ఈ యథార్థ 
ప్రపంచాన్ని సామాన్యులు ఎప్పుడూ 
గుర్తించలేరు. తెలుసుకునే ప్రయత్నం 
చేసినా, తాము కల్పించే భావనా 
ప్రపంచమే వారికి కనిపిస్తుంది. 

చిత్తవృత్తులంటే ఏమిటో ఇప్పుడు మనకు 
తెలిసింది కదా! మనస్సుకు పురుషుడు 
ఆధారం. అతని చేతిలో మనస్సు ఒక 
పరికరం. అతని చైతన్యమే మనస్సు 
ద్వారా వెలువడుతోంది. 

నీవు మనస్సుకు ఆధారం, కాబట్టి మనస్సు 
చైతన్యవంతమవుతోంది. పురుషుడు 
మనస్సును త్యాగం చేస్తే, వెంటనే అది 
నశించి పోతుంది. చిత్తం అంటే ఇదే. 
చిత్తం మనస్సనే పదార్థం. బాహ్య 
విషయాలతో చిత్తానికి సంయోగం 
కలగటంతో, వృత్తులనే తరంగాలు 
చిత్తంలో లేస్తాయి. ఈ వృత్తులే సుమా,
మన ప్రపంచం. 

అలలతోనున్న కొలను అడుగుభాగాన్ని 
మనం చూడలేం. అలలు అణిగిపోయి,
నిశ్చలమైనప్పుడే అడుగు భాగం క్షణ 
కాలం మనకు కనిపిస్తుంది. నీరు 
మలినంగా ఉన్నా, కదులుతున్నా నీటి 
అడుగుభాగం మనకు కనిపించదు. 

చిత్తమనే సరస్సు అడుగుభాగమే మన 
నిజ స్వరూపం ఆత్మ. చిత్తంలో 
చెలరేగే వృత్తులే తరంగాలు. చిత్తానికి 
మూడు స్థితులున్నాయి: సాత్త్వికం, 
రాజసం, తామసం అని. 

పశువుల్లోను, పశుప్రాయుల్లోను 
తామసికత (అజ్ఞానంధకారం) అధికంగా 
ఉంటుంది. ఈ స్థితిలోని చిత్తానికి 
ఇతరులకు హాని చేయటమే స్వభావమై 
ఉంటుంది. విషయభోగాలను, 
అధికారాన్ని కోరటం రాజసిక చిత్త 
ముఖ్య లక్షణం. ఇలాంటి చిత్త స్థితి,
"శక్తిమంతుడినై అందరిపై అధికారం 
చూపిస్తాను." అన్న ప్రేరణకు 
గురిచేస్తుంది. 

శాంతం, ప్రసన్నత సాత్త్వికస్థితి 
లక్షణం. ఈ స్థితిలో మనస్సులో ఎలాంటి 
తరంగాలుండవు; నిర్మలంగా ఉంటుంది 
కానీ అది జడత్వం కాదు. సాత్త్విక మనస్సు 
ధృతి ఉత్సాహాలతో కూడి ఉంటుంది. 
శాంతంగా ఉండటమంటే ఎక్కువ 
శక్తిని ప్రదర్శించటం. పని చేస్తుండటం 
(చపలంగా ఉండటం) చాలా సులభం. 

కళ్ళె౦ వదిలిపెడితే, గుఱ్ఱాలు ఇష్టం 
వచ్చినట్లు పరుగులు పెడతాయి. ఇది 
అందరికీ సాధ్యమే. కాని, గొప్ప వేగంతో 
పరిగెత్తే గుఱ్ఱాలను అదుపు చేయగలవాడే 
నిజంగా బలవంతుడు. అదుపు చేయటానికి 
మాత్రమే చాలా బలం కావలసి ఉంటుంది. 
వదిలి పెట్టడానికి బల మెందుకూ?

కాబట్టి శాంతచిత్తుడంటే, పనిపాటలు లేక 
మందుడై, అలసుడై, ఉండేవాడు కాదు. 
సత్త్వమంటే అలసత్వం, సోమరితనం అని 
అనుకోవద్దు. చిత్తవృత్తుల్ని నిరోధించేవాడే 
సుమా! ప్రశాంతచిత్తుడు! నికృష్టబలాన్ని 
ప్రకటిస్తే అది ప్రవృత్తి; ఉత్కృష్టబలాన్ని 
ప్రకటిస్తే అది ప్రశాంతత. 

తన సహజ శుద్ధావస్తను చేరటానికే 
మనసెప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. 
అయితే ఇంద్రియాలు మాత్రం మనస్సును 
బయటికి లాగుతూ ఉంటాయి. ఇలా మనస్సు 
వెలుపలికి వెళ్ళకుండా అరికట్టటమే 
మనో నిగ్రహం; మనస్సును నిగ్రహించి,
ప్రజ్ఞాన ఘన ఆత్మలో లయం 
చేయటానికి దాన్ని అంతర్ముఖం చేయటమే 
యోగానికి మొదటి మెట్టు. మనోనిగ్రహానికి 
ఇదే సరైన దారి. 

క్రిమికీటకాలు మొదలు పశుపక్ష్యాదులదాకా 
అన్ని జంతువుల్లోనూ మనోవ్యాపారం 
కనిపిస్తూ ఉంటుంది. మనిషిలో మాత్రమే 
మనస్సు బుద్ధి రూపాన్ని ధరిస్తుంది. 

చిత్తం బుద్ధి రూపం పొందాలి; అప్పుడే 
నివృత్తి మార్గం అవలంబించటం సాధ్యం 
అవుతుంది; అనేక సాధనలు చేసిన 
తరువాత ఆత్మ ముక్తి పొందటానికి వీలు 
అవుతుంది. ఆవు, కుక్క మొదలైన 
జంతువులకు మనస్సు౦ది; నిజమే, కానీ 
వాటి మనస్సు, బుద్ధి అనే రూపాన్ని 
పొందలేదు. కాబట్టి సత్వరం ముక్తి 
పొందటం వాటికి సాధ్యంకాదు. 

చిత్తానికి రకరకాల అవస్థలున్నాయి:

	1. క్షిప్తం  అంటే చెల్లా చెదురై పోవటం 
	2.మూఢ౦ అంటే చీకటిలో/అజ్ఞానంలో 
			ఉండటం 
	3. విక్షిప్తం అంటే ప్రోగు చేసుకోవటం 
	4. ఏకాగ్ర౦ అంటే ఒకే లక్ష్యం పట్ల 
		దృష్టి ఉంచడం (ఈ స్థితిలో 	
		ఇతర వృత్తులు కూడా 
		స్వల్పంగా ఉంటాయి )
	5.నిరుద్ధం అంటే తీక్షణమైన ఏకాగ్రత/
		సమాధి (ఈ స్థితిలో ఇతర 
		వృత్తులు ఉండవు)
		
సుఖదుఃఖాల్లో ఇలాంటి మనస్థితి 
వ్యక్తమౌతూ ఉంటుంది. ప్రమాదాన్ని 
కలిగించే సోమరితనం మూఢావస్థకు లక్షణం. 
దేవతలకు విక్షిప్తావస్థ; రాక్షసులకు 
క్షిప్తావస్థ సహజమని యోగసూత్ర వ్యాఖ్యాత 
చెబుతాడు. నివృత్తి విక్షిప్తావస్థకు లక్షణం. 
చిత్తం ఏకాగ్రత కావటానికి ప్రయత్నించే 
సమయంలో ఏకాగ్రస్థితి ఏర్పడుతుంది. 
ఏకాగ్రస్థితి నుండి సమాధిస్థితికి 
కొనిపోయే స్థితే నిరుద్దావస్థ. 

3

తదా ద్రష్టుః స్వరూపే అవస్తానమ్

By స్వామీ వివేకానంద


యోగావస్థలో ఉండే కాలంలో సాక్షి 
అయిన పురుషుడు, తన స్వరూపంలో 
నెలకొని ఉంటాడు. 
  

అలలన్నీ ఆగిపోయి, సరస్సు నిర్మలంగా 
ఉన్నప్పుడు అడుగు భాగాన్ని మనం 
స్పష్టంగా చూస్తాం. అలాగే మనస్సు 
ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనం మన 
స్వరూపాన్ని తెలుసుకోగలం. ఆ 
స్థితిలో మనస్సుతో తాదాత్మ్యం చెందకుండా 
ఆత్మ స్వరూపులమై ఉంటాం. 

4

వృత్తి సారూప్య మితరత్ర

By స్వామీ  వివేకానంద 

ఇతర సమయాల్లో (యోగంలో లేని 
సమయాల్లో) పురుషుడు వృత్తులతో 
సమాన స్వరూపాన్ని పొంది ఉంటాడు 
  

ఎలా అంటారా? ఉదాహరణకు ఒకరు 
నన్ను తిట్టారనుకోండి, ఆ తిట్టు వల్ల 
నా మనస్సులో ఒక వృత్తి కలుగుతుంది. 
ఆ వృత్తితో నేను ఏకమైపోతాను. దాని 
ఫలితం నాకు దుఃఖం

5

వృత్తయః పంచతయ్యః క్లిష్టాక్లిష్టః

 వృత్తయః 	= ప్రవ్రుత్తులు 
 పంచతయ్యః = ఐదు విధములు 
 క్లిష్టాః 		  = క్లిష్టమైనవి 
 అక్లిష్టాః 	 = సులభమైనవి 
 

  మనః ప్రవృత్తులు క్లిష్టములు, సులభములు 
  అను రెండు విధములు 
  

మనస్సు తన ప్రవృత్తి చేత అనేక 
విధములైన మార్పులకు లోనవుతుంది. 
మనస్సులో పరిస్థితులకు 
ప్రతీకారచర్యగా ఇలాంటి మార్పులు 
జరుగుతాయి. ఇది ప్రజ్ఞ 'తాను' (i am)
అను స్థితిను౦డి చలించడంవల్ల  
నేర్పడుతోంది. అంటే తన నుండి ఇతర 
మున్నదని అంగీకరించడవల్ల ఏర్పడుతుంది.  
ఇతరము అంటే బింబ ప్రతిబింబ న్యాయమును 
మరవడం. ఇదే అసత్తు (objectivity). 
నోటిలో రొట్టెముక్కను కరుచుకొనియున్న
కుక్క నీటిలోనికి తొంగిచూచి భ్రమపడి 
మొరుగుట౦ వలన  తన నోటిలోని రొట్టె ముక్కను 
పోగొట్టుకోవడం వంటిది ప్రస్తుతము జీవుడున్న 
స్థితి. అ౦తా  తానుగా నిండియున్న ప్రజ్ఞను 
మనం 'అంతర్యామి' యని వ్యవహరిస్తాము. 
అలాగే  ప్రవాహిస్తున్న నీరు వేరువేరు 
బిందువులుగా చిందునట్లు ఒక్కటిగానున్న 
అంతర్యామి ప్రజ్ఞ వేరువేరు జీవులుగా లేక 
ఆత్మలుగా చిందిపోతో౦ది. ఏనీటి 
బిందువు కానీటి బిందువు, తననుండి ఇతరమైన  
బిందువులను చూసి అవికూడా 'నీరే' అనే 
పరమాంశాన్ని విస్మరించి మరొక నీటి 
బిందువుగా, లేక ఇతర బిందువులుగా 
గుర్తించునట్టు, జీవ ప్రజ్ఞ ఇతర జీవులను 
తననుండి వేరుగా గమనిస్తుంది. ఇట్లు వేరు 
అను ప్రవృత్తినే మనం 'మనస్సు' అని అంటాము. 
నీటిలోని తన ప్రతిబింబము వేరొక జీవిగా 
భ్రమపడినట్లు జీవాత్మ సృష్టిలో  సకల 
భూతాలను (Beings) తననుండి వేరుగా 
చూస్తుంది. తాను, ఇతరము అను వ్యత్యాసము 
వలన ఈ సృష్టి ఏర్పడుతోంది. 
  
మొదట 'నేను' లేక 'తాను' అనే  వెలుగు 
కేంద్ర౦గా ఈ సృష్టే పరిధిగా సృష్టి 
నిర్మాణము జరిగింది. ఆ వెలుగు యొక్క 
కిరణములు జీవులు. ఆ కిరణాల విశ్లేషణము వలన  
నేర్పడిన రంగులే మనస్సు, ఇంద్రియములు 
మొదలైనవి. అలాంటి  విశ్లేషణము వలన వర్ణ 
భేదములేర్పడి, వాటి కలగాపులగాలే 
పరిస్థితులుగా ప్రతిబింబిస్తున్నాయి. దీనినే 
మనం సృష్టిగా అంటే ప్రపంచముగా 
పొరబడుతున్నాము. అంటే ఇది అబద్దమని 
కాదు కానీ సత్యము కూడా కాదు. పైన చెప్పిన 
నీటి బిందువులు ఒకదానికొకటి వేరను మాట 
అబద్ధము కాకున్నా,  అవి అన్నీకలిపి 
నీరనడం అంతకన్నా మిక్కిలి మరియూ 
శాశ్వతమైన సత్యము కదా! కాబట్టి తననుంచి 
ఇతరమున్నదని అంగీకరిస్తే,
మనస్సులో వికారము ఏర్పడుతుంది. నిజానికి  
అలాంటి  వికారమే మనస్సు. ఆ వికారముల ప్రభావమే 
ఆలోచనలు మరియు సంస్కారములు. వీటినే 
జీవలక్షణములని అంటారు. ఇలాంటి  జీవ లక్షణములు 
పరిస్థితులు వాటిలోని వ్యక్తుల మధ్య 
తారతమ్యలనేర్పరచుకొని దాని వలన 
అనుకూలము, ప్రతికూలము అనే ద్వంద్వ 
వైఖరిని మనస్సులో సృష్టించుకొ౦టున్నాయి. 
దీని ప్రభావము వలన  మిత్రులు, శత్రువులు, బంధువులు,
వస్తువులు వాటి విలువలు మొదలైన  అనేక 
వికారములు ఏర్పడుతున్నాయి. 
  
నిజానికి జాగ్రత్తగా గమనిస్తే,
ఇక్కడ గందరగోళాలకి  తావేలేదు. తనలోని  
భిన్న ప్రవృత్తులే, లేక లక్షణములే 
ఒకదానికొకటి విరుద్ధముగా ఉండడం వలన 
జీవిత౦లో  అటువంటి సంఘర్షణలుగా
వ్యక్తమౌతాయి. అంటే ప్రేమ, ద్వేషము అనే భిన్న 
లక్షణములు గల మనస్సుకి  తనకనుకూలముగా 
నున్న వాళ్ళని ప్రేమించడం, లేనివారిని 
ద్వేషించడం ఏర్పడుతుంది. తానే ఇతర జీవుల 
రూప౦లో  నున్నానని తెలిసిన వానికి 
సంఘర్షణ యుండదు. ఆ ఇతర జీవులు తన 
భార్య అయినా,  మిత్రులైనా, శత్రువులైనా 
తన మనస్సులోని వికారములు, లేక 
ప్రవృత్తులే తనకు అద్దము పట్టబడుతున్నాయని  
తెలుసుకొని వారితో సమన్వయము చెందుతాడు. 
దీనినే  యోగమంటారు. యోగమ౦టే  సమన్వయ 
పూర్వకమమైన కలయిక. అలా కాకపోతే  తన 
భార్య తన మాట వినాలని, వినకపోతే 
కోప్పడడం మొదలైన  వికారములు ఏర్పడి
దాని వలన మనస్సు క్లిష్టత చెందుతుంది. ఇదే 
పై సూత్ర౦ ప్రతిపాదించేది. 

6

ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః

ప్రమాణ  		= ప్రమాణము లేక కొలత 
విపర్యయ			= వ్యతిరేకమైన (తప్పుడు కొలత)
వికల్ప 			 = శూన్యము (కొలత లేనిది)
నిద్రా 			  = నిద్ర 
స్మృతయః 	   = స్మృతి 

  పైన చెప్పబడిన ప్రవృత్తులు ప్రమాణము,
  విపర్యయము, వికల్పము, నిద్ర మరియు స్మృతి 
  

ఈ చెప్పబడిన ఐదు మౌలిక ప్రవృత్తుల ననుసరించి 
జీవికి ప్రవర్తన ఏడ్పడుతోంది. వ్యక్తులలో అనేక 
వేల, లక్షల ప్రవర్తనలుండవచ్చు. కానీ మౌలిక 
ప్రవృత్తులు (Basic Aspects of Behavior) 
మాత్రము ఐదు. అవి:

1. ప్రమాణము అంటే నిజమైన కొలత లేక 
గ్రహణముకు చిహ్నము. నీవొక గ్రంథాన్ని 
చదువేటప్పుడు ఆ గ్రంథ కర్తను గురించి నీకొక 
అవగాహన ఏర్పడుతుంది. అదే నిజ౦గా 
గ్రంథము చదువుట. అలా  అవగాహన ఏర్పడాలంటే 
కర్తకు నీకు మధ్య ఒక సంజ్ఞానముచ్చయముండాలి. 
అటువంటి సంజ్ఞలే గ్రంథకర్త ఉపయోగించే వాక్యములు. 
ఈ వాక్యములు పదములచే ఏర్పడతాయి. పదము 
కొన్ని అక్షరములు లేక శబ్దముల సంపుటము. 
ఇలాంటి  శబ్దములకు సంజ్ఞలే అక్షర లిపి. కాబట్టి 
ఇక్కడ  గ్రంథకర్త యొక్క సందేశమునకు ఈ 
లిపిలోని  అక్షరములు వాహికలు అవుతున్నాయి. 
గ్రంథకర్త మరియు పాఠకుడు అను ఇరువురిచే 
ఈ సంజ్ఞలు ఒకే అర్థమున ప్రయోగింపబడి అర్థము 
చేసికొ౦టే  వాటిని "ప్రమాణము" అంటారు. 
కాబట్టి ప్రమాణము విస్మరి౦పకపోతే   సందేశము 
చక్కగా అవగతమగుతుంది. అంటే ఇక్కడ 
రచయిత మరియు, పాఠకుల ప్రవృత్తి ఒక్కటే 
యని క్లిష్టత లేదని అర్థము. 

అట్లే ఏదైనా శాస్త్రములో గానీ, సైన్స్ లో గానీ 
నీవు ప్రమాణములను ఇలాగే ఉపయోగింప 
బడ వలసి ఉంటుంది. ఇతర వ్యక్తులు మరియు 
వస్తువుల యందు మరియు వారి ప్రవృత్తి 
యందు, దీనిని ఇదే విధముగా గమనింపవలసి 
ఉంటుంది. వ్యక్తులను, పరిసరములను 
ప్రమాణముగా స్వీకరించేవానికి జీవిత౦లో  
క్లిష్టత యుండదు. అంటే ఏ వ్యక్తికావ్యక్తియే 
ప్రమాణముగా స్వీకరింపాలి గానీ 
ఇతరులతో పోల్చకూడదు. ఇతరులను గురించి 
మన అభిప్రాయము లెప్పుడూ ఒకరితో 
నొకరికి పోల్చి చూడడం మీద  ఆధారపడి 
ఉంటాయి. ఎవరైనా, తనని 
గౌరవించకపోతే  అంతకు ముందు తనను 
గౌరవించినవారితో పోల్చుకుని వారి లాగ 
ఇతడు గౌరవింపబడలేదని తాను బాధపడతాడు. 
ఎక్కడ  ఎవరికి వారే ప్రమాణము. అంటే 
ఒక్కొక్క జీవి ప్రవృత్తి ఒక్కొక్క విధముగా 
ఉంటుంది. ఒకరిలాగ  ఇంకొకరుండుట 
సాధ్యము కాదు. దీనిని అంగీకరించడం వలన  
ఎవరికి వారే ప్రమాణమనగా సత్యమని 
కూడా అర్థము. ఎరుపు, నలుపు, పసుపు, మొదలైన 
రంగులు వేనికవే ప్రమాణములు. 
ఎరుపు రంగుకు ఎరుపు రంగే ప్రమాణము 
కానీ దానిని నలుపు రంగుతో పోల్చడం సరికాదు. 
అలాగే  రాత్రి పగలు అనేవి ఒకదానికొకటి 
వ్యతిరేకముగా కనిపించినా  ప్రమాణములే 
గాని సామ్యములుగావు. గ్రహించినవానికి ఒక 
రంగుమీద అభిమానము గాని ఇంకొక 
రంగుమీద ద్వేషముగానీ ఉండదు. ఇదే  
ప్రమాణము. దీనిని వ్యక్తులలో, 
పరిసరములలో, వస్తువులలో 
గమనించువానికి క్లిష్టత యుండదు. అంటే 
అతడు ఉదాసీనుడుగా, తటస్థుడుగా ఉంటాడు.
అతనికి ప్రమాణము మీద, సత్యము మీద 
అభిలాష ఉంటుంది కానీ వ్యక్తుల మీద 
ఉండదు. అందువలన అతడెటువంటి పరిస్థితులలో 
జీవించుచున్నా వాని వలన 
బంధముండదు. అంటే వాని మనస్సుపై వాటికి 
వేరుగా ప్రభావము౦డదు. 

2. విపర్యయము 

విపర్యయమ౦టే వ్యతిరేకముగా పోల్చుట. 
అంటే మన మిట్టి పోలీకలను, కొలతలను 
తప్పు పద్ధతిలో నుపయోగిస్తే 
జీవితము తప్పొప్పుల పట్టికవలె అవుతుంది. 
పైన చెప్పిన గ్రంథములో  రచయిత 
పదములను తప్పుడర్థముతో ఉపయోగించినా 
లేక పాఠకుడు తప్పడర్థముతో చదివినా  
అది విపర్యయము. అలాగే  స్నేహితులనుగానీ,
బంధువులనుగానీ, వారి దృక్పధములో 
నుండిగాక నీ దృక్పధము నుండి చూస్తే 
వారు విపర్యయముగా అర్థమవుతారు. అంటే 
చెడ్డవారిగా, యిష్టము లేనివారలుగా 
కన్పిస్తారు. 

అలాగే  నీవు సంపాదించిన ధనమువలన 
మంచి విషయములను లేక వస్తువులను 
పొందగల్గితే  అది ప్రమాణము. 

నీవు సమాజమునకు చేసిన సేవకు 
ప్రతిఫలముగా సమాజము నీ కిచ్చే 
జీతము ద్రవ్యము. ఇక్కడ ద్రవ్యము నీ 
సేవకు పర్యాయము మాత్రమే. అలా గాక 
ధనమువలన మాత్రమే సుఖము పొంద 
వచ్చునను అభిప్రాయము కలిగితే  
అది విపర్యయ మవుతుంది. 

దానివలన యాచించుట, అప్పుతెచ్చుట, లేక 
దొంగలించుట మొదలగు దుర్లక్షణములు 
పుడతాయి. అదే విపర్యయము. 

అలా గాక నీవితరులకు చేసిన సేవకు 
ప్రతిఫలముగా ధనము ద్వారా కొన్ని 
సౌకర్యములు, సౌఖ్యములు కల్పింప
బడుతున్నాయని  గమనిస్తే  అది 
ప్రమాణమవుతుంది. 

అలాగే  ధనమున్న౦తమాత్రాన అదే 
సంపద అనుకోవడం పొరబాటు. అపుడు 
సుఖము౦డదు. అపుడు ధనమును 
గురించి ఆందోళన, ఆత్రుత మొదలైన 
వాటివలన ఆరోగ్యమనే మూల ధనము 
దెబ్బ తి౦టుంది. 

కాబట్టి ఇక్కడ ధనము సుఖములు, లేక 
సౌకర్యములు పొందడానికి  నిమిత్తము 
కావచ్చునుగానీ ధనము సూటిగా వాటిని 
కల్పింపలేదు. ఆకలి తీర్చుకొనడానికి  
కావలసిన ఆహారమును సంపాదించుకోడానికి 
ధనము కారణము కావచ్చును గానీ, ధనమే 
ఆకలిని తొలగింపలేదుకదా!

అంటే తినుటకు పనికిరాదుకదా! కానీ 
అలాగని  వైరాగ్యమను పేర ధనమును 
ద్వేషించుట సరికాదు. ధనము సూటిగా 
సుఖమును కలిగింప లేకపోయినా, 
ధనము ద్వారా సుఖము పొందబడుచున్నదికదా!

అలాగే  తన భార్యను తానన్న ప్రజ్ఞకు 
ప్రతిరూపముగా తెలుసుకొన్న వానికి 
అదియే ప్రమాణమవుతుంది. ఆమెను 
ఒక సేవకురాలిగా చూసేవాడికి  అది ఒక 
విపర్యయ మవుతుంది. అంటే క్లిష్టతను 
కలిగిస్తుంది. 

అలాగే ఆమెను తన కామమునకుపయోగపడు 
మాంసపు ముద్దగా చూచేవాడికి  అది ఒక 
విపర్యయము. దీనివలన వాని ప్రవృత్తిలో 
క్లిష్టత సంభవిస్తుంది.  

3. వికల్పము 

వికల్ప మనగా సంకల్పములు లేని 
శూన్యస్థితి. ధనము వినియోగమువలన 
మాత్రమే ఉపయోగపడేది. అలాంటి 
ధనమును వినియోగింపకుండా ఒకచోట 
కూర్చి దానిని చూచుకుంటూ  
సంతోషిస్తూ ఉంటే అది నిజమైన 
సంతోషము కాదు. 

అలాగే  భార్యకు విడాకులిచ్చిన 10 
సంవత్సరముల తరువాత ఆమెను 
చూపించి ఈమె నా భార్య అ౦టే 
అది అర్థములేనిది. కనుక వికల్పము. 

అలాగే మనస్సు ఆందోళన పూరితమై 
ఉద్వేగముతో "శాంతి శాంతి" అని 
అరుస్తే  అది కూడా వికల్పమే. 

ఇంకా సుఖము కోసము రాత్రింబగళ్ళు 
శ్రమించి పనిచేసే వానికి 
సుఖమెక్కడిది? వానికి ధనము యొక్క 
లావాదేవీలతో దినమంతా చాలదు;
ఇక ధనము ననుభవించటం ఎప్పుడు?
సుఖమెక్కడ?

ఒక యువకుడు ప్రక్కపై కూర్చుని 
ఒక నగ్న స్త్రీని ఊహించుకుంటూ 
సెక్సు సాహిత్యమును చదువుతే 
అది కేవలము ఊహయే కనుక 
వికల్పము. దానివలన అతని మనస్సు 
క్రమేణా వ్యాధిగ్రస్త మవుతుంది. 

కాని నిజానికి వికల్పము వలన 
కొన్ని మంచి విషయములు కూడా 
సాధించ వచ్చు. ధ్యానము,
భగవత్ సాన్నిధ్యము, క్రమశిక్షణతో 
గూడిన జీవితము మొదలగునవి,
ఊహపై నాధారపడేవేకదా! అవి 
వికల్పములైనా క్రమేణా 
ప్రమాణములవుతాయి. 

4. నిద్ర 

నిద్ర కూడా మౌలిక ప్రవృత్తులలో 
ఒక్కటి. నిద్ర అంటే ప్రవృత్తి 
లేకుండా ఉండడం. కాని ఇది శాశ్వతమైన 
ప్రవృత్తి లేని నిరామయ స్థితి కాదు. 
ఇది కూడా తాత్కాలికమే. 

మానవ శరీర యంత్రమునకు నిద్ర 
మిక్కిలి అవసరం. దాని వలన 
శరీరము స్వస్థత చెంది ఆరోగ్యవంతమై,
శక్తియుతమై, తేజోవంతమవుతుంది. 

కనుక మానవ ప్రవృత్తులలో నిద్ర 
కూడా నొకటి. దీనిని ప్రమాణము అను 
ప్రవృత్తిని అర్థము చేసికొన్నట్లుగా 
చేసికొ౦టే చక్కగా సద్వినియోగమవుతుంది. 

5. స్మృతి 

స్మృతి అంటే జ్ఞాపకము తెచ్చుకొనుట. 
మనస్సు ఇంద్రియముల పూర్వ 
అనుభవములననుసరించి మరల అదే 
విషయమును లేక వస్తువును మనస్సునందు 
సృష్టించుకొ౦టుంది. భౌతిక విషయములు 
ఇంద్రియముల ద్వారా మనస్సును 
ప్రభావితము చేస్తాయి. ఆ వస్తువు 
తొలగిపోయిన తరువాత కూడా మనస్సుపై 
బడిన ప్రభావము సంస్కారరూపమై 
బీజముగా మనస్సునందు నిలిచిపోతుంది. 

ఈ బీజము మరలా భౌతిక ప్రపంచమున 
మొలకెత్తి వృక్షముగా విస్తరింపగలదు. 
చిత్రకారుడు, శిల్పి మొదలైనవారు తమ 
మనస్సులలోని రూపాములనే భౌతిక 
ప్రపంచములో నిజమూర్తులుగా 
మలచుచున్నారు కదా!

బ్రహ్మ కూడా ఒకసారి సృష్టి జరిగి,
ప్రళయము వచ్చి, పిదప నూతన సృష్టిని 
ప్రారంభింప గలగడానికి  కారణము 
ఈ స్మృతియే. 

దీనిని ప్రమాణముగా తీసుకొ౦టే 
మనలో ఉన్న "నేను" మరల స్మృతికి 
తేగలదు. అంటే తనను తాను 
తెలుసుకొన గలుగు స్థతికి చేర్చగలదు. 

మనం మన ప్రస్తుత బాహ్య ప్రవర్తనతో 
కూడిన స్థితి నుండి నిజమైన, నిత్యమైన,
స్థితిలోనికి దీని వలననే చేరగలుగు
చున్నాము. 

గమనించినచో మన లోని  అభ్యాసము 
లేక అలవాటు అను స్థితికి మూల 
కారణము ఈ మన స్మృతియే. దీనిని 
యోగాభ్యాసముగా మార్చుకొ౦టే అదే 
మనల్ని సత్యస్థితి లోనికి చేర్చ గలదు. 

కాఫీ, టీ, సిగరెట్టు మొదలైనవి 
స్వీకరించడం  అలవాటైన మానవుడు 
వాటిని మరలా స్వీకరింపకుండా నుండలేడు. 
దీనినే సరియైన మార్గములో నుపయోగిస్తే,
అంటే ఉదయముననే లేచుట, ధ్యానము 
చేసికొనుట, గ్రంథములను పఠించుట 
మొదలైన  మంచి అలవాట్లను శ్రద్ధగా 
అలవరచుకొ౦టే దాని వలన మనస్సు 
క్రమేణా వికాశవంతమై మోక్షమునకున్ముఖము 
అవుతుంది. 

కాబట్టి  ఈ పై వాటిని గమనిస్తే 
ఈ ఐదింటిలో నాలుగు ప్రవృత్తులు మనకు 
యోగాభ్యాసమునకు అవశ్యకములేయని 
తెలుస్తోంది.

విపర్యయ మొక్కటే అక్కరలేని ప్రవృత్తి. 
దీనికి కూడా  ఒక ఉపయోగము కలదు. అది 
ఏమనగా దుఃఖమ౦టే ఏమిటో తెలిసికోవడం 
వలన మానవుడు సుఖమును పొందగలుగు 
చున్నాడు. విపర్యయము వలన జీవితము 
క్లిష్టమై దుఃఖమును కలిగించును. అప్పుడు 
మానవునకు సుఖమనగానేమో, దానిని 
సాధించుకొనుట ఏట్లో తెలుస్తుంది. 

7

సూః ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని

ప్రత్యక్ష 		= ఎదురుగా నున్నది 
అనుమాన 	   = అనుమానము 
ఆగమాః 		= ఉచ్చరింపబడినట్టిది 
ప్రమాణాని 	  = ప్రమాణము లేక సరికొలతలు 

  ప్రత్యక్షము, అనుమానము, మరియు ఆగమము 
  అనునవి మూడును ప్రమాణములు 
  

ఇంతకు ముందు చెప్పబడిన వానిలో ప్రమాణము 
ఐదు మౌలిక ప్రవృత్తులతో అత్యంత ప్రధాన 
మైనదని తెలుసుకొన్నాము. ఇపుడు దానిని 
గురించి మరి కొంత తెలిసికొ౦టాము. ఈ 
ప్రమాణము 3 విధములుగా ఉంది. అవి:

    1. ప్రత్యక్షము 
    2. అనుమానము 
    3. ఇతిహాసము లేక పురాణము లేక ఆప్త వాక్యం 
    
ఈ మూడిటిని  మన పెద్దలు మనకు 
తెలిసిన దాని కన్నా విశేషమైన, విలక్షణమైన 
రీతిలో నుపయోగించేరు. 

1. ప్రత్యక్షమ౦టే కంటికి ముందున్నది అని 
అర్థము. మన ఐదు జ్ఞానే౦ద్రియముల ద్వారా 
ఏది గ్రహింపబడుచున్నదో అదియే ప్రమాణము. 

కంటిద్వారా రాత్రింబగళ్ళను, సృష్టిని, తోటి 
జీవులను దర్శించుచున్నాము. అట్లే ఒకరి 
వాక్కులు వినిపించినచో మనం వానిని 
చూడలేక పోయినా  అక్కడ ఒక వ్యక్తి 
ఉన్నాడని గ్రహిస్తాము. 

అలాగే వాసనవలన వస్తువులను, పువ్వులను 
గ్రహిస్తున్నాము. రుచి వలన ఆహార 
పదార్థములను గురించి తెలుసుకుంటున్నాము. 
ముట్టుకొనుట (స్పర్శ) వలన వేడి,
చల్లదనము గ్రహిస్తున్నాము. 

ఇలాగ పంచేంద్రియముల వలన 
వస్తువులను గురించి, వ్యక్తుల గురించి 
తెలియ బడుతుంది. 

ఇలాగ ఇంద్రియముల ద్వారా గ్రహింపబడునవి
ప్రత్యక్షములనబడును. కాని ప్రత్యక్షము 
లనగా కళ్ల కెదురుగా నున్నవి మాత్రమే. 
ఇవే ప్రమాణముగా స్వీకరింపబడతాయి. 
మిగిలినవి అనుమానము చేత 
నిర్దారణ అవుతాయి. కనుక అవి 
ప్రమాణముగా పరిగణింపబడవు. 

2. అనుమానము 

అనుమానమ౦టే  మనస్సుకు గాని,
ఇంద్రియములకుగాని గోచరించు విషయముల 
కతీతముగా ఒక వస్తువును గురించి 
పరోక్షముగా ధారణ చేయడం. గదికవతల 
నున్న గులాబీపూవు పరిమళము మనకు 
కిటికీ ద్వారా తెలియునప్పుడు గులాబీపూవును 
కంటితో చూడకుండానే మనమక్కడ 
గులాబీ యున్నదని నిర్ధారిస్తాము. 

ఇక్కడ  గులాబీపూవు యొక్క ఉనికి 
దానిని కంటితో చూడకు౦డ కేవలము 
వాసనతో నిర్ధారిస్తాము. ఇలాగే 
అంతర్యామి యొక్క సాన్నిధ్యము కూడా 
అనుమానము చేత నిర్ధారింపబడుతుంది. 

ప్రకృతిలోని విశేషములను గమనిస్తే 
వీటిని నడుపు మహాశక్తి యొకటి 
అంతర్లీనముగా నున్నదని మనం 
అంగీకరించి తీరాలి. 

3. ఆగమః 

ఆగమమనగా వాక్కు లేక వేదము. అంటే 
ఉచ్చరింప బడినది అని అర్థము. 
నిజానికి  వేదమ౦టే  ఒక గ్రంథము 
కాదు. వేదము ప్రకృతికి కారణమైన 
మహాశక్తి. సృష్టియ౦దలి ద్రవ్యము,
శక్తి, మరియు ప్రజ్ఞ అనువాని కలయిక చేత 
సమస్తము నేర్పడుచున్నది. 

మట్టి రేణువు నుండి, సూర్యునివరకు 
సమస్తము ఒక చిత్రమైన మరియు,
అన్ని౦టికీ అతీతమైన ధర్మమును 
అనుసరించి పనిచేస్తోంది. దీనినే 
పరమధర్మ మంటారు. 

ఈ పరమధర్మము సూర్యుని ద్వారా సౌర 
మండలముగా అంటే సౌర ధర్మముగా 
విస్తరిస్తోంది. 

దానిననుసరించి భూమికి, చంద్రునికి,
ఇతర గ్రహములకు ధర్మము లేర్పడు 
తున్నాయి  

The law of planetary consciousness
which differentiates into various
layers of nature and creation.

పంచదార తియ్యగా ఉండడం, ఉప్పు 
ఉప్పగా ఉండడం, నీరు ప్రవహించడం,
అగ్ని దహించడం మొదలైనవి పైన 
చెప్పబడిన పరమధర్మము నుండి 
ఏర్పడిన ఉపధర్మములు, లేక చిల్లర 
ధర్మములు. 

అంటే ఈ చిన్న ధర్మములన్నీ 
వేనికవిగా వర్తించక పైన చెప్పబడిన 
శాశ్వత ధర్మము యొక్క అంగములుగా 
వర్తిస్తాయి. 

ఎండాకాలము, వానాకాలము, చలికాలము 
మొదలగునవి సంవత్సర చక్ర౦లో 
ఆకులుగా నేర్పడి, ఒకదాని తర్వాత 
ఒకటి ఒక క్రమమైన పద్దతిలో వర్తించు 
చున్నాయి  కాని అస్తవ్యస్తముగా వర్తించుట 
లేదు. 

అంటే జీవితము, సంపద, సుఖము, 
వానివలన శాంతి, అనేవి శాశ్వత 
ధర్మము యొక్క ప్రధానాంశములని 
గమనిస్తే మనకు బోధపడును. 
ప్రకృతిలోని ధర్మములన్నీ  ఈ 
అంశములకు సమన్వయముగా 
వర్తిస్తున్నాయి. 

దీనినే సృష్టి సంకల్పము అని కూడా 
పిలుస్తారు. నిజమైన మానవుడు ఈ 
సృష్టి సంకల్పము ననుసరించి 
జీవించును గాని తాత్కాలికమైన 
సంపదలను, సౌఖ్యములను లెక్క 
చేయడు. జీవులందరి సౌఖ్యము,
సంపదలతో సంబంధము లేని శాంతి 
అనునది సాధించుటయే వాని 
లక్ష్యము. 

సృష్టి సంకల్పము ననుసరించి సృష్టి 
ధర్మములు ఏర్పడినవి. వాని 
ననుసరించి సృష్టి ఏర్పడినది. కనుక 
పరమాత్మ నుండి వ్యక్తమైన ఈ సృష్టి 
సంకల్పమే "వాక్కు" లేక వేదము 
అను పేర పిలువబడినది. 

అన్ని ప్రమాణములూ, అనుమానములూ
ఈ వాక్కు ననుసరించి యేర్పడినవి. 
కనుక ఇదియే నిజమైన ప్రమాణము. 

ఈ ప్రమాణము ననుసరించియే 
మిగిలినవి గమనించి ధారణ చేయ 
వలసి యుండును. దీని ననుసరించి 
వ్రాయబడిన గ్రంథమే నిజమైన గ్రంథము. 

అదియే వేదము.

8

సూః విపర్యయో మిథ్యాజ్ఞాన మత ద్రూప ప్రతిష్ఠమ్

విపర్యయ 		= విపర్యయము 
విథ్యాజ్ఞానము 	   = జ్ఞానము లేని స్థితి 
అతద్రూప 		= నమ్మకములేనిది 
ప్రతిష్ఠమ్ 			= స్థాపన చేయబడినది 

  విపర్యయము, లేని విషయమును వున్నట్లుగా 
  స్థాపన చేసి మిథ్యాజ్ఞానము  (భ్రాంతి)
  కలిగించును 
  

విపర్యయము 5 మౌలిక ప్రవృత్తులలో నొక్కటి. 
దీని వలన లేనిది ఉన్నట్లుగా కనిపించును. 

ఒకడు భార్యను సత్యముగా తలచినచో 
అది పొరపాటు. అంటే భార్య అను తనచే 
ఆపాదింపబడిన ధర్మము ఆమెకు సత్యము 
కాదు. ఆమె మొదట స్త్రీ. భార్య యను 
ధర్మము వీనిని ననుసరించి మాత్రమే 
తాత్కాలముగా పనిచేయును. అట్లు 
కానిచో మామిడి చెట్టు ఎవరికైననూ 
మామిడి చెట్టే అయినట్లు ఆమె కూడా 
తనకేగాక ఎవరికైననూ భార్య యగుటలేదు. 
వీనికొక్కనికి మాత్రమే భార్య. 
మిగిలినవారికి స్త్రీ. అంటే ఆమె మొదట 
స్త్రీగానే పుట్టినది. తర్వాత అతని కోరికపై 
భార్యగా నుండుటకు అంగీకరించినది 
కనుక భార్య అయింది. ఇది విస్మరించిన 
వాడు ఆమె భార్యయని సత్యముగా 
నమ్మితే  తాను బాధపడవలసి యుండును. 
అంటే ఆమెకు కూడా  అభిలాషలు, 
ఆపేక్షలు, ఊహలు, ఆలోచనలు 
తనకున్నట్లే నున్నాయని, తాను తన 
భార్యకు భర్తగా మాత్రమే కాక 
ఇతరులకు తండ్రిగా, సోదరుడుగా, 
స్నేహితుడుగా, శ్రేయోభిలాషిగా ఎలా 
మెలగుచున్నాడో అలాగే ఆమెకు కూడా 
అలాంటివి  కలవని తెలియ వలెను. లేకపోతే 
అంతా గందరగోళమై 
భార్యవలన సౌఖ్యము బదులు సంఘర్షణ,
మనస్తాపము మిగులును. 

ఇట్లు స్త్రీని, స్త్రీగా కాక భార్యగా 
ప్రతిపాదించుకొనడం విపర్యయము 
అనబడును. అలాగే  మన స్నేహితుల 
యందు, తోటివారి యందు, 
అధికారుల యందు దీనిని 
గుర్తు౦చుకోకపోతే  చిక్కులు ఎదురవుతాయి. 

9

సూః శబ్ద జ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః

శబ్ద జ్ఞానానుపాతీ 	= శబ్దము యొక్క అర్థమును 
					అనుసరించునది 
వస్తు శూన్యము 	  = వస్తువులేనిది 
వికల్పః 		  = వికల్పము 

  వికల్పము అంటే శబ్దము యొక్క అర్థము 
  ననుసరించునది మరియు అస్తిత్వము లేనిది 
  

సాధారణ౦గా పదాలు భౌతిక వస్తువుల 
నుద్దేశించి ఉంటాయి. అ౦టే  వస్తువుల 
ననుసరించే  పదాలు ఏర్పడతాయి. 

పర్వతము అనే  పదాన్ని తీసుకొ౦టే,
ఈ పదము పర్వతము పుట్టిన చాలాకాలము 
తర్వాత పర్వతమును గుర్తుంచుకోవడానికి  
మానవులచే నుపయోగింపబడేది. 

పర్వతము అనే  పదము విన్నంతనే,
మనలో అ౦టే మనస్సులో ఒక ఎత్తయిన 
మరియు మిక్కిలి పెద్దదయిన రాతిగుట్ట 
స్ఫురిస్తుంది. 

కాని కొన్ని పదాలు అలాకాక మరొక 
విధ౦గా ఉపయోగ పడతాయి. సంతోషము 
అనే పదము అటువంటిది. అ౦టే  సంతోషము 
అనేది  భౌతికము కాదు. ఒకడు 
సంతోష౦గా ఉన్నానని  మనకు 
చెప్తే  వాడు సంతోష౦గా ఉండడాన్ని 
మనం ఊహించి చెప్తామే  గాని వాని 
మనస్సులో నిజ౦గా ఏము౦దో తెలియదు. 

అలాగే  ఆశలు, కోరికలు, ఆశయములు, లక్ష్యములు,
ఉద్దేశ్యములు, ఆదర్శములు మొదలైనవి. ఇవి 
కేవలము పదాలే కాని, వాటికి అస్తిత్వము 
లేదు. ఇవి కేవలము ఉన్నట్లు కనిపించి 
మానవుని భ్రమపెడతాయి. 

కాబట్టి యోగసాధకుడు ఇలాంటి  వికల్పాలను 
వదిలిపెట్టాలి. అ౦టే  వీటిలో ఎక్కువ  
భాగము మన మనస్సు నుండి  పుట్టినవే 
కాని సత్యములు కావు. 

ప్రతివాడూ తనచుట్టూ ఉన్న వారిని గురించి 
మరియు పరిసరముల గురించి  కొన్ని 
అభిప్రాయములు, ఉద్దేశ్యములు కలిగి 
ఉంటాడు. అవి వానికి సంబంధించినవే 
కాని సత్యములు కావు. 

ఒక అధికారి తన క్రింద పనిచేస్తున్న 
వారిని గురించి, తన సౌకర్య౦ కోసం  
ఆఫీసు వారిచ్చిన కారు, ఇల్లు మొదలైన  వాటిని 
గురించి  అవి అన్నీ తనకోసమే 
యేర్పరుపబడినవి అని తలుస్తాడు. వారందరు 
తనను సేవించడానికి యున్నారని తలస్తాడు.. 
ఇవి వాని అభిప్రాయాలే కాని సత్యములు 
కావు. 

అధికారి తన ధర్మము పాటిస్తున్నట్లే 
మిగిలిన వారు తమ ధర్మాలను 
పాటిస్తున్నారు. అధికారికి ఉద్యోగ 
విరమణ వలనగాని, మరి ఏ యితర కారణముల 
వలనగాని పైన చెప్పబడేవి దూరమైతే  
ఆ అధికారికి సత్యము అప్పుడు బోధపడుతుంది. 

ఇదే  వికల్పము.  వికల్పములను 
తొలగించు కొనే  వానికి మాత్రమే వాటిలో 
ఒకే సత్యము బోధపడుతుంది. 
దానినే పరమాత్మ అంటారు. 

10

సూః అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా

అభావ 			= లేనట్టిది 
ప్రత్యయా 		  = సంబంధించినది 
ఆలంబన 		  = ఆధారమైనట్టిది 
వృత్తిః 		   = ప్రవృత్తి 
నిద్రా 			  = నిద్ర 

  అభావము లేక అసత్యముపై నాధారపడి 
  ప్రవృత్తి కలిగినది నిద్ర 
  

మన మనస్సు మరియు ఇంద్రియాల
ద్వారా తెలియబడే దానిని ఆస్తిత్వమని 
అంటారు. కాని అస్తిత్వము లేనిది అంటే 
అసత్తు (non existence) అంటే ఏమిటో 
మనకు తెలియదు. 

ఎందుచేతన౦టే  అక్కడ మనం లేము కనుక. 
కాబట్టి  అసత్తు అంటే మిథ్య అని, 
భ్రాంతి అని మనకు అనిపిస్తుంది.  నిజానికి 
అసత్తు ఉ౦దా? అలాంటిది ఉండడం 
సాధ్యమా? అనే ఎన్నో ప్రశ్నలు మనలో 
తలెత్తుతాయి. దీనికి సమాధానము ఉ౦దా 
అ౦టే, ఉ౦దని చెప్పాలి. 

అసత్తు సాధ్యమే అని మన కర్థము 
కాకపోయినా అలాంటిది ఉ౦దని ఒప్పుకోక 
తప్పదు. అయినా దానికి ఋజువే౦టి?

మనం ప్రతిదిన౦  ఉండుట, లేకుండుట 
అనే  రెండు స్థితుల మధ్య  ప్రయాణము 
చేస్తున్నాము. ఈ లేకుండుట అనే స్థితి 
మనకు నిద్ర అనే పేరుతో అనుభవానికి 
వస్తోంది. 

మెలకువగానున్నప్పుడు మనం ఉన్నట్లే,
నిద్రిస్తున్నప్పుడు మనం లేము. 
అ౦టే మన౦ నిద్రిస్తున్నప్పుడు మనకు 
తెలియదు కదా!

నిద్ర పూర్తయిన తరువాత మన౦ 
నిద్రిస్తున్నట్లు తెలుస్తుంది గానీ,
నిద్రపోయేటప్పుడు మన౦ నిద్రిస్తున్నామని 
తెలియదు గదా!

అలా తెలుస్తూ ఉంటే అది నిద్ర ఎలా అవుతుంది?
కాబట్టి  మనం ఉన్నట్లు మనకు 
తెలియనప్పుడు సహితము మనం ఉన్నామని 
మనకు ఋజువవుతోంది. 

ఇందుకు సాక్ష్యము మన౦ నిద్రిస్తున్నప్పుడు
ఊపిరితిత్తులు, గుండె మొదలైనవి  పని
చేస్తూ ఉంటాయి. కాని మనస్సు, ఇంద్రియములు 
మాత్రము తాత్కాలికముగా పనిచేయవు. 

కాబట్టి  మనం ఉన్నట్లు మనకు తెలియక పోయినా  
మనం ఉన్నామని మనకు తెలుసు. కనుక 
అసత్తు అనబడేది  సాధ్యమేనని తెలుస్తోంది. 

ఇక్కడ నిద్ర అంటే  మెలుకువ వచ్చిన 
తరువాత  మనమింతకు ముందు నిద్రించేమనే 
సత్యము వలన  తెలుస్తోంది. 

ఇదే  పైన సూత్రీకరింపబడి౦ది. దీని వలన 
ఇంకొకటి తెలుస్తుంది. మనం మనకు 
తెలియకుండానే నిద్రలో ఎలా ఉన్నామో అలాగే 
మనం పుడుతూ, మరణిస్తూ ఉన్నా,  
నిద్రలో ఉన్నట్లే మనం ఉండగలమని 
తెలుస్తోంది.

అట్లే సృష్టి ఉన్నా, నశించినా  
ఉండగలము. ఇలా ఉండడాన్నే  అంతర్యామిలో 
ఉండడం లేక పరమాత్మగా ఉండడం. 

అప్పుడు శరీర౦లో ఉన్నప్పటికీ,
మనస్సు, ఇంద్రియములు పరమాత్మ యొక్క 
ఆస్తిత్వములుగా తెలుసుకొన్న వానికి 
వుండకపోవుటయన్నది లేదు. దీనినే 
యోగము (fusion) అంటారు. 

11

అనుభూత విషయాసంప్రమీషః స్మృతిః

అనుభూత 			= అనుభూతమైనట్టిది 
విషయా 			 = విషయములు 
అసంప్రమీషః 		  = చెదిరిపోనట్టిది 
స్మృతిః 		   = స్మృతి 

  స్మృతి యనగా ఇంతకు ముందు అనుభూతమైనట్టి 
  విషయమును చెదిరిపోకుండనుంచు ప్రవృత్తి 
  

మనస్సు, భౌతిక వస్తువుల అస్తిత్వము తన 
ఇంద్రియముల ద్వారా గ్రహిస్తుంది. ఇచ్చట 
మనస్సు చూసేది  వస్తువు యొక్క 
ప్రతిబింబమేకాని, వస్తువుని తనలోనికి 
స్వీకరింపలేదు కదా!

అంటే మనం రుచి చూస్తున్నా,
వాసన చూసినా  లేక విన్నా ఇవి 
అన్నీ  ఆయా విషయములయొక్క 
అనుభవము మనలో మేల్కొని, తర్వాత 
వాటి తాలూకు సంస్కారములుగా 
నిలిచియుండడం. 

మరలా ఆ వస్తువు పేరు వినగానే ఈ 
మొత్తము అనుభవము మనలోనికి తిరిగి 
సాక్షాత్కరిస్తుంది. దీనినే జ్ఞాపకము అంటారు. 

ఇలా జ్ఞాపకము అన్నది  మన అనుభవాలనే 
సంస్కారములకు కోశము లేదా నిధిగా 
పనిచేస్తుంది. ఇటువంటి  సంస్కార పేర్పు 
వలన మానవునికి యోగ సాధన జరుగుతోంది. 

అంటే అటువంటి అనుభవములు, స్మృతులును
సద్వినియోగమొనర్చుకొనేవాడు పరిపూర్ణుడై,
ముక్తుడై అంతర్యామియందు లయమవుతాడు. 

జ్ఞాపకములను సద్వినియోగమొనర్చుట 
యనగా తాను చూచిన, విన్న, మంచి 
విషయములను మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడం. 

తిరుపతివంటి ఒక పుణ్యక్షేత్రము దర్శించి 
వచ్చినవాడు అచ్చట గడిపిన దివ్య 
క్షణాలను, పరమాత్మ దర్శనమును 
మరల మరల జ్ఞప్తికి తెచ్చుకొ౦టే   
వాని మనస్సు వాని ప్రయత్నము లేకుండానే  
దివ్యత్వము పొందుతుంది. 

అలాగే  ఒక మహానుభావుని, లేక పుణ్యపురుషుని 
దర్శించిన లేక వానితో సహచరించిన సంఘటనలు,
క్షణములు స్మృతికి వస్తే  అది 
మరల మరియొక సందర్శనమై మనను 
ప్రభావితము చేసి మనస్సు ఆనందమయము 
చేస్తాయి. 

ఇలాగే  సద్గ్రంథ పఠనము కూడ. వివేకవంతుడైన 
మానవుడు ఈ స్మృతిని  సద్వినియోగము 
చేసుకొని నిత్యత్వము పొందుతాడు. 

అలా ఉ యోగించుకొనలేని ఇతరులు ఈ 
స్మృతి వలననే బంధాలను సృష్టించు 
కొ౦టున్నారు. 

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...