Sunday, November 26, 2023

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 31-32)

upanishad


  


రెండవ ప్రకరణము: అప్రజ్ఞాతము

31

దుఃఖ దౌర్మనస్యంగ మేజయత్వ
శ్వాస ప్రశ్వసాః  విక్షేప సహభువః 


దుఃఖః  = దుఃఖము
దౌర్మనస్య = నిస్పృహ
అంగమేజయత్వ = అంగవికలము
శ్వాస ప్రశ్వాసాః = ఉచ్చ్వాస నిశ్స్వా సములు
నిక్షేపసహభువః = మానసిక విక్షేపమువలన
			కలుగునవి.

మానసిక విక్షేపము వలన దుఃఖము, నిస్పృహ,
అంగవైకల్యము, శ్వాసక్రమ  భేదములు కలుగును.

  

పైన చెప్పబడినవికాక మరికొన్ని మార్పులు కూడా కలుగవచ్చు.
వాటి వలన యోగసాధనకు భ౦గము కలుగవచ్చు. 
వీనిలో కొన్ని పరిసరములవలన కలిగేవి. 

1. దుఃఖము 

ఒక్కొక్కసారి పరిసరముల వలన దుఃఖము తప్పనిసరి 
కావచ్చును. మృత్యువు, పోగొట్టుకొనుట , ఎడబాటు, లేదా  
వియోగము మొదలైనవి, మన ప్రమేయము లేకనే సంభవించి 
దుఃఖము కలిగించును. 

2. నిస్పృహ 
 
నిరాశా, నిస్పృహలతో కూడిన వాతావరణము కూడా  
మనస్సును కలత పెట్టును. రాజకీయ, సామాజిక పరిస్థితుల వలన 
మతాలవల్ల, ఒక్కొక్కసారి వ్యక్తులకు సాంఘిక భద్రత 
లోపించవచ్చు. వీనికి సాధారణముగా లోపము వ్యక్తియందు వుండదు. 
కనుక నిస్పృహ చెందడం తప్ప సాధారణ మానవుడు వ్యక్తి గతముగా 
చేయగలిగినది ఏమీ లేదు.

3.  అంగవైకల్యము.

అంగవైకల్యము కూడా మనో వికలత్వము కలిగింపవచ్చును.
తనకున్న అవయవలోపము అనేక విషయములలో పనులకాటంకమై 
తాను కర్తవ్యనిర్వహణ చేయలేక బాధపడవలసి వస్తుంది. ఈ
అంగవైకల్యము పుట్టుకతోగాని లేక ప్రమాదవశాత్తుగాని 
కలుగవచ్చు. 

4. శ్వాసక్రమము 

శ్వాసక్రమము తప్పుటవలన యోగసాధన కలుగదు. 
ఆయాసము వలన శ్వాసలో కలుగు ఇబ్బందులవలన 
శ్వాసక్రమము దెబ్బతినవచ్చు. ఉబ్బసము 
మొదలైన వ్యాధుల వలన ఇలాంటివి సంభవించును. 

ఇటువంటి పరిస్థితులయందు ఎవరునూ ఏమియుచేయలేరు. 
అనగా యోగసాధనకు అవరోధము కలిగి అనర్హతగా పరిణమించును. 
ముందు సూత్రములందు చెప్పిన కారణములు కేవలము
వ్యక్తిగతములు. కాబట్టి అవి సర్దుబాటు అవుతాయి.  కాని ఇందు చెప్పబడిన
మొత్తము సమాజము దేశమునకు సంబంధించినవి, తన
వశములో లేనివి, కనుక ఇటువంటి పరిస్థితులలో యోగసాధన
జరుగడం దుస్సాధ్య౦. అయినా అలాంటి  పరిస్థితులలో 
సహితము యోగసాధన చేస్తూ, కొంత ప్రయోజనము పొందు
వారున్నారు.

32

తత్పృతి షే ధార్ధమేక తత్వాభ్యాసః


తత్‌ ప్రతి షేధార్థం = ఆ మనో వై కల్యము నిలుపుదల
				చేయుటకొరకు
ఏకతత్వాభ్యాసః = ఒకే తత్వమును అభ్యసింపవలెను


ఒకే తత్వమునుపాసించడం వలన (ముందు సూత్రములలో
వివరింపబడినట్టి) పై  మనోవై కల్యములను తొలగించుకొనవచ్చును.
  


మనస్సునకు స్వతహాగా ఒక తత్వ మన్నదిలేదు. అది
ఏమూసలో పనిచేస్తుందో దానిపైనాధారవడుతుంది కనుక 
మనస్సును ఒకే తత్వము లేక ఒకే లక్ష్యము వైపు నడిపిస్తే 
వైకుల్యములుండవు. ఇక్కడ ఒక తత్వమ౦టే  ఏదో ఒక లక్షణము 
కాదు. కనుక  తరహాకాదు. ఒకే తత్వమునకు, 
ఒక తరహాకు భేదము౦ది. ఒకే తరహా (Mood) మనస్సు౦టే 
మిగిలిన తరహాలు, సామర్థ్యములు, దెబ్బతి౦టాయి. ఏదో 
ఒక తరహాను మనస్సుకు బలవంతముగా రుద్దకూడదు.  అలాకాక 
అన్ని తరహాలకు అతీతమైన ఒకే తత్వము (one pointedness)
ను మనస్సు కలవాటు చెయ్యాలి. 

క్లాసులో పాఠము చెప్పే 
ఉపాధ్యాయుడు అవసరమైతే  పిల్లలను అనునయించును. మరియొకసారి 
కోపిస్తాడు. ఈ లక్షణములు పైకి మాత్రమే ప్రకటిస్తాడు. 
ఇవన్నీ ఉపాధ్యాయుని తత్వములోనివి కావు. ఉపాధ్యాయుని 
ఒకే తత్వములోనున్న వేరువేరు తరహాలు, పిల్లలను తీర్చిదిద్దడానికి 
ఆవశ్యకతను బట్టి,  ఉపాధ్యాయునిచే  ప్రకటింపబడేవి. ఈ 
తరహాలలో ఏదీ ఉపాధ్యాయునికి చెందవని వాని తత్వము 
ఈ తరహాలన్నిటికీ అతీత మైనదని తెలిసికోవాలి. అలాగే  ఒకే 
తత్వములో సామ్యము చెందుతుంది. మనస్సు, భావములు, ఇంద్రియములు,
 అవయవములు మవదలైనవన్నీ ఒకే తత్వములో
సామ్యము చెందుతాయి. అంటే ఇవన్నీ వేరువేరుగానుండక 
అప్పుడు ప్రకటింపబడే  తరహాకనుగుణ౦గా మార్పుచెందుతున్నా, 
వాని అసలు తత్వమునకు మాత్రము ఇవన్నీ లోబడి
ఉంటాయి. 


ఉత్తేజము పొందుట దీక్ష కలిగియుండుట అనే  లక్షణాలు 
మనస్సుపై ఒక  మూసలా పనిచేసి మనస్సును ఒకే 
తత్వమునందు తీర్చిదిద్దుతాయి. ఒక ప్రజోపకారమైన కార్యమునకు 
ఉత్తేజము చెంది పనిచేయడం  లేక ఒక  మహాకార్యమునకై 
దీక్ష తీసికోవడం, లేక లలితకళలయందు అభిరుచి కలిగి 
ప్రభావితులై ఆహర్నిసము శ్రమించడం మొదలైనవి ఇలాంటి 
ఏకత్వమునకు ఉదాహరణలు,. తాను సంకల్పించిన 
కార్యము మనస్సులోనుండగా మిగిలిన తరహాలేమీ 
తనమీద  పనిచేయవు. ఒక చక్కని  చిత్రపటము  చిత్రిస్తున్న 
చిత్రకారునికి రూపురేఖలు, రంగుల 
మిశ్రమములు, మొదలైనవి  చూసుకుంటూ, బొమ్మను కొంత 
కొంతగా గీస్తూ, మార్పులు చేసుకొ౦టూ  క్రమేణా బొమ్మను 
పూర్తిచేసేసరికి దినములు, వారములు కూడా పట్టవచ్చు. ఈ
లోపల తానేమి చేస్తున్నాడో, ఎక్కడ తి౦టున్నాడో, ఎక్కడ 
నిద్రిస్తున్నాడో తనకే తెలియదు. ఎవరితో ఏమి 
మాట్లాడుతున్నాడో , ఏమి వి౦టున్నాడో
తనకే తెలియదు. తనకు తెలిసిన దొక్కటే. అదే  తన 
మనస్సులో  తాను గీస్తున్న చిత్రము యొక్క మాతృకమైన
అసలురూపము.

ఆ మనస్సులోని రూపమునే అతడు చిత్రముగా చిత్రీకరించడంలో 
నడుమ ఎన్నోవిషయాలు వానికి సంబంధము
లేకుండానే జరిగిపోతున్నాయి. వానికి తెలియదు అనడానికి వీలులేదు. 
గానీ తెలుసనడానికి కూడా వీలులేదు. వానిని భోజనమునకు,
ఇతర విషయములకు పలుమారులు పలుకరిస్తే  అతడు
కోపముతో గట్టిగా, విసురుగా సమాధానము చెప్పి తన 
కర్తవ్యములోనికి మునిగిపోతాడు. ఇది కోపమువలెనున్నా  కోపము 
కాదు. ఇతరులు తన కర్తవ్యము నుండి తనను మరల్చకుండడానికి 
చేసే హెచ్చరిక. ఇట్లే భక్తి పారవశ్య౦తో  తన్మయత్వము
చెందిన వారికి, సంగీత సాధనలోనున్నవారికి వాటియందలి
అభిరుచే తత్వముగా ఏర్పడి ఇతర మానసిక వైకల్యములను 
ఆ తత్వములోనికి సర్దుబాటు చేస్తాయి. అంటే ఆ వైకల్యములు 
క్రమేణా నశి౦చి, ఒకే తత్వముగా రూపొందుతాయి. దీని వలన 
మనస్సు ఊర్థ్వ ముఖమై సమాధి స్థితిలోకి ఎదుగుతుంది. దీనికి
భావోద్రేకమునకు తేడా ఉ౦ది. భావోద్రేకము కామ క్రోధాదులతో 
కూడి ఉంటుంది. దాని వలన పని పాడవడమే  తప్ప 
పూర్తి అవ్వడం యు౦డదు. మనస్సు ఒకే స్థితిలోనికి 
ఎదుగుట వల్ల  భావోద్రేకములు తొలగిపోయి మనస్సు స్వచ్ఛమైన 
యోగమును ప్రతిబింబిస్తుంది. అంటే అలాంటి స్వచ్చ 
స్థితిలో మనస్సుకు వికల్పముండదు. కాబట్టి మనస్సులో 
ప్రవృత్తి నశిస్తుంది. దానినే యోగమంటారు. 

zz

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...