Thursday, November 16, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 35-36)

upanishad


  


35

అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః


అహింసాప్రతిష్టాయాం =అహింసనిలబడియున్నపుడు
తత్‌ + సన్నిధౌ = దాని ముందు
వైరత్యాగః = వైరము నశించును

అహింస స్టిరమైనప్పుడు, దాని సాన్నిధ్యమువలన వైరము
నశించును
  




ఇచ్చట గ్రంధకర్త యమముయొక్క లక్షణములలోనొకటియగు 
అహింసను గూర్చి చెప్పుచు ప్రతిపక్ష భావనమును గూర్చి
నిరూపిస్తున్నాడు.

మొట్ట మొదట అహింసయనునది కేవలము మన ఆలోచన
గానే ఉంటుంది. అది మనకున్న అన్ని ఊహలలో నొక్కటియేగాని
దానికి ప్రత్యేకతలేదు, క్రమేణా అది మన మనస్సు నాక్రమించు
కొ౦టుంది. ఇది మనస్సునందు స్థిరముగా నిలుచున్నంతవరకు,
మనము దానిని గూర్చి కొంత అభ్యాసము చేయవలసివస్తుంది. 
అట్లు  స్థిరత్వము పొందినవెనుక, మనస్సులో 
అహింస నిరంతరము నిలచియుంటుంది. అప్పుడు మనయందు
శతృత్వము అనునది పూర్తిగా తొలగిపోతుంది. అట్లు తొలగిపోవుటకు 
ముందు మనము మన శత్రువులను గూర్చి ఎంతో 
అలోచిస్తూ ఉంటాము. అహింసకు మనస్సునందు స్టిరత్వము కలిగిన 
తరువాత, శతృత్వము అను భావము మనస్సు నుండి
తొలగిపోతుంది. నిజానికి శతృత్వము అనునది మన ఆలోచనే 
గాని సత్యముకాదు. ప్రపంచములో నిజమునకు శతృవులనువారు
లేనేలేరు. ఒకరిని గూర్చి ఒకరికి మనస్సులో నేర్పడు
భావమే శతృత్వముగా తెలియబడుతోంది. అంతేకాని ఎవరూ
పుట్టుకతోనే శతృవు కాలేరు. మనకు శతృవై నవాడు వాని 
తల్లితండ్రులకు బిడ్డయూ, ప్రేమపాత్రుడు యగుచున్నాడు గాని వాడి 
తల్లితండ్రులకు వాడు శత్రువుకాడు. ఇట్లు శతృత్వము మనస్సు
నందు ఆరోపింపబడుచున్నది గాని సత్యముకాదు. మనస్సులోని 
భావములు అనేకములుగాని అవియన్నియు ఒకే భావము నుండి
పుట్టుచున్నవి. అట్టి ఒకే భావము రెండుగా చీల్చబడి యిష్టము,
అయిష్టము, మంచి, చెడు, శత్రువు, మిత్రుడు, అను జంటలుగా 
విడిపోతున్నాయి. కుడిచేయి, ఎడమచేయి ఒకే వ్యక్తిలోని
భాగములు కదా! అలా  చీల్చబడిన జంటలను ఒకే భావము
లోని రెండు భాగములుగా చూచినచో లేక తెలుసుకొన్నచో
సత్యము తెలుస్తుంది. ఇచ్చట అహింసను ప్రతిపాదించుటవలన
శతృత్వము ప్రతిపాదించబడుతోంది. శత్రుత్వమనగా, హింసతో
కూడిన ఊహ. దాని మరియొక భాగము అహింస లేక మైత్రి.
శత్రుత్వమును పోగొట్టుకొనవలెనంటే స్నేహమును అభ్యసించ
వలెను. క్రమేణా తనకు నచ్చని వ్యక్తియందున్న వైరభావము
పోయి, వానితో కూడా స్నేహము చేయును. కనుక అహింసను
గూర్చి మనస్సున ఊహలు పెంపొందిపవలెనన్నచో, అహింసను
చక్కగా నాచరించు ఒక మహానుభావుని గూర్చి ఊహించవలెను. 
ఉదాహరణకు గౌతమ బుద్దుడు ఎట్లు  అహింసతో తన జీవితమున
వ్యవహరించెనో తెలిసికొనుట వలన తన మనస్సున అహింసను
గూర్చిన భావము స్టిరపడును. 

36

సత్యప్రతిష్టాయాం క్రియా ఫలాశ్రయత్వమ్

సత్యప్రతిష్టాయాం = సత్యమునందు
			ప్రతిష్టింపబడుటచే

క్రియాఫలాశ్రయత్వమ్‌ = పనులు ఫలితము
			నాశ్రయించును

సత్యము స్థిరమైనప్త్పుడు పనులు ఫలితమునా(శయించును.
  


నీ వాక్కు, నీ చేత అను రెండునూ నీవు నమ్మిన సత్యము
ననుసరించి యున్నచో అట్టి మూడునూ ఒకే మూసయందు
ఇమడగలవు. భావమునకు వాక్కు, చేతలపై ఆధిపత్యము కలుగును. 
అట్టివారు ఆచరించిన పనులు నిర్ణీతఫలితములనివ్వగలవు.
ఇట్టి స్టీతి కలుగుటకు ముందు మనస్సు స్వచ్చమై యుండవలయును.
మనస్సు నందు తాను విశ్వ సించునది తనమాటలయందు, చేతల
యందు ప్రతిబింబింపవలెను. అట్లుగాక తాను నమ్మినదానికి
వ్యతిరేకముగా తానాచరించినచో తనకు సత్య దర్శనము కాదు.
ఫలితములు వేరగును. ఒకడు తన శతృవునకు వైద్యకళాశాలలో
స్టానము చిక్కినచో తనకు కూడా కావలెననియూ తానేల పొంద
రాదనియూ తలచును. తనకది అక్కరలేదను యూహరాదు. అనగా 
ఇచ్చట తాను విశ్వసించునది వేరు, చేయునదివేరు. సత్యమును
విశ్వసించువానికీ యిట్టి  భ్రమ తొలగిపోవును. ఏ పనియైననూ
తనకావశ్యకమేనా? కాదా? యని ప్రశ్నించుకొనునేగాని  మరి
యొకరు చేసితిరను భావము వలన చేయడు. ఇదియే సత్యమును
దర్శించుట. అట్లివారికి సంకల్పించిన పనులు వాటంతట అవియే
నెరవేరును. 

ఇట్టి సాధనకు మొదట కొంత కష్టపడవలసియుండును. 
సాధన ప్రారంభించిన తోడనే వాడింతకుముందు ఆచరించిన పనుల 
ఫలితములు ఒక్కసారిగా ప్రజ్వరిల్లి, వానిని భయ పెట్టి, మోహపెట్టును. 
వానికి చలింపక మరియు వారు జోక్యము చేసుకొనక 
తన భావము నందలి స్వచ్చతను అనగా సత్యమును దర్శించుచూ
అది తానేయని తెలుసుకొన్నవానికి అన్నియు క్రమముగా నుపశమించి 
స్వస్థత చెందును. అనగా మనస్సు నిర్మలమై, స్వచ్చమై
సమస్తమును తన యందు ప్రతిబింబించును. కలకతీరిన నిర్మ
లమైన నీటివలె స్వచ్చత వలన మనస్సునకు అస్తిత్వము నశి౦ 
చును. మనస్సు వేరుగా నుండక తనలోని భాగమై కలక 
తీరిన నీరు అడుగుభాగమును స్పష్టముగా చూపునట్లు మనస్సు 
తాను లేక నేనను వెలుగునందు లీనమై అట్టి వెలుగే మరల 
మనస్సుగా, ప్రతిబింబించును. అట్టివాడు ఎవరిని చూచిన
దేనిని చూచిననూ, ఎప్పుడు చూచిననూ, తననే చూచునుగాని 
ఇతరమనునది వానికి లేదు. ఇదియే సత్యదర్శనము. 

2 comments:

  1. అహింస, సత్యము, క్షమ, ధర్మము గూర్చి పై రెండు శ్లోకములతో నీ విశ్లేషణ అద్భుతం, ఆలోచనా సరళి బాగుంది...
    తరువాత సంకలనం దీనిపైన

    ReplyDelete

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...