రెండవ ప్రకరణము
36
విశోకావా జ్యోతిష్మతీ
విశోకా = శోకములేనిది వా = లేక జ్యోతిష్మతీ = వెలుగుతోనిండినది
మనస్సునందు జ్యోతిని నింపుటనే దుఃఖమును తొలగించ వచ్చును.
మనస్సుకు దుఃఖము మొదలైనవి కలుగడం అభ్యాసము చేత జరుగుతుంది. అలాగే కొన్నికొన్ని పరినరములు మనస్సుపై ప్రభావము కలిగిస్తాయి. ఉదాహరణకు, ఒక దుఃఖిస్తున్న వ్యక్తిని చూస్తే, సానుభూతిచే, తనకుకూడా దుఃఖము పుడుతుంది. అలాగే ఒంటరిగా చీకటిలోను౦టే భయము కలుగుతుంది. అంతేకాక అలాంటి సంఘటనలు స్మరణకు వచ్చినపుడల్లా, ఆా అనుభూతులు మనస్సుకు కలుగుతాయి. అలాగే ఒక గాలి వెలుతురు లేని గుహను కాని, సొరంగమునుగానీ ఊహించుకొ౦టే తనకు ఉక్కిరిబిక్కిరిగానున్నట్టు అనిపిస్తుంది. తనకు తీవ్రహాని చేసినవారు జ్ఞప్తికి వస్తే ఆవేశముతో ముఖ మెఱ్ఱబడుట, చేతులు బిగిసికొనుట గుండెవేగముగా కొట్టుకొనుట మొదలైనవి కలుగుతాయి. అ౦టే ఇక్కడ వస్తువు ఎదురుగా లేకున్నా, కేవలము స్మరణ చేతనే మనస్సును ప్రభావితము చేయవచ్చునని తెలుస్తోంది. అంతేకాక సంపెంగ, మంచిగంధము మొదలైనవి స్మరిస్తే, వాటి సువాసనతో మనస్సు నిండుతుంది. కనుక మనస్సులోని వస్తువును బట్టి తన చుట్టునున్న వాతావరణము ఆనందకరముగా గానీ దుఃఖమయముగా గాని పరిణమిస్తుంది. మనస్సుకు సంతోషము, ఉల్లాసము కలిగించు విషయములను, రూపములను ఎన్నుకోవచ్చును కదా అని అంటే, అది మంచిదేకాని, మనస్సు ఒకే రూపముపై ఎక్కువ కాలం నిలువదు. మార్పుకోరడం మనస్సుకు సహజము. రూపములననుసరించి కొత్తరూపములు, విషయములు మనస్సులో సాక్షాత్కరిస్తాయి. ఆకారములు, రూపములు, రంగులు మొదలైనవి మనస్సును బంధిస్తాయి. కనుక పెద్దలు మరొక మార్గము కని పెట్టేరు. అదే కాంతిని దర్శించడం. అంటే కనులు మూసుకొని కాంతిని ధ్యానము చెయ్యాలి. ఒక పెద్ద వెలుగు భూమ్యాకాశములంతటా వ్యాపించియున్నట్టు, తానా వెలుగులోనున్నట్టు, తాను కూడా ఆ వెలుగులో భాగమై, ఆ వెలుగునకు కేంద్రముగానున్నట్టు, తనకు పైన, క్రింద, చుట్టూ కాంతియున్నట్టు ధ్యానము చెయ్యాలి. ఇది చేయడం కొంచెము కష్టమనిపిస్తే, సూర్యకాంతిని ధ్యానము చెయ్యాలి. సమస్తము బంగారు కాంతిగానున్నట్టు, ఈ ప్రపంచమంతా అటువంటి బంగారువర్షముతో నిండియున్నట్టు ధ్యానము చెయ్యాలి. లేక ఇది కూడా కొంచెము కష్టమనిపిస్తే, దీపమును వెలిగించి, దీపమును చూస్తూ, కనులు మూసుకుని ఆ దీపకళికను లేక జ్యోతిని చూస్తున్నట్లుగా ధ్యానము చెయ్యాలి. క్రమేణా ఆ జ్యోతి సమస్తమును ఆవరించియున్నట్లు ధ్యానము చెయ్యాలి. ఇదే నారాయణోపనిషత్ లో "ఆర్దృ౦ జ్వలతి జ్యోతిరహమస్మి బ్రహ్మాహమస్మి జ్యోతిరహమస్మి " అని వివరింపబడినది. ఇలా ధ్యానము చేయడంవలన మనస్సు కాంతివంతమై ప్రకాశవంతమవుతుంది. మనస్సులోని రూపములు, ఆకారములు నశించి పైన చెప్పబడిన సంస్కారములన్నీ క్రమేణా నశిస్తాయి. ఇలా ప్రతిదినం ఒకే సమయాన, ఒకే ప్రదేశాన ప్రశాంతముగా కూర్చొని జ్యోతిని ధ్యానం చెయ్యాలి. ఒకవేళ ఏదో రంగును ధ్యానం చేయడం సులభమనిపిస్తే, బంగారు వర్ణము, లేదా గులాబి వర్ణము లేదా ఆకాశ నీలము అనే మూడు వర్ణాలు యోగసాధనకు సౌలభ్యము కలిగిస్తాయి. కాబట్టి ఆ వర్ణాలలో ఒకదానిని ధ్యానం చేస్తే, మనస్సు ఆ వర్ణమునుండి కాంతి వైపు క్రమేణా మరలుతుంది. అలా కాంతిని దర్శించి, అనుభవిస్తే అంతఃకరణానికి సుఖ దుఃఖముల స్పర్శ ఉండదు.
చక్కటి విశదీకరణ.... ధన్యులం
ReplyDelete