రెండవ ప్రకరణము
50
తజ్ణః సంస్కారో అన్య సంస్కారప్రతిబన్ధీ
తత్ + జః = దాని నుండి పుట్టినట్టు సంస్కారః = సంస్కారము అన్యసంస్కారః =ఇతర విషయ వాసనలను ప్రతిబన్ధీ = తొలగించును
దీని వలన కలుగు సంస్కారము యితర విషయ వాసనలను తొలగించును
అట్లు చేయు సాధనవలన ఉత్తమ సంస్కారములు మేల్కొని, మిగిలిన విషయ వాసనలు తొలగిస్తాయి. అనగా "తాను" సత్యమందుండడం నభ్యసంచినవారికి, ఇంద్రియములు క్రమేణా అంతర్ముఖమవుతాయి. దీని వలన విషయములయొక్క అస్తిత్వము క్రమేణా నశిస్తుంది. విషయములను కూడ తనలోని భాగములుగా చూచును. ఇచ్చట విషయముల యొక్క అస్తిత్వము నశించుట అ౦టే విషయములు విస్మరించుటకాదు. నది సముద్రమున కలియుచున్నప్పుడు నది యొక్క అస్తిత్వము నశిస్తుంది, కాని నది నశింపదు. నది సముద్రములో భాగముగా ఉంటుంది. నదులన్ని వేరువేరు ప్రవాహములుగా సముద్రమును చేరుతాయి. ఇక్కడ ఒక్కొక్కనది నీటి యొక్క రంగు, రుచి మారవచ్చు. కాని సముద్రములో కలిసిని వెనుక వాటి యొక్క ప్రత్యేకత నశించి, రంగు, రుచి, విషయములన్నీ సత్యమునందుచేరిన వెనుక సత్యమై ఉంటాయి గాని విషయములుండవు.
51
తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః
తస్య + అపి = దానివలన కల్గు నిరోధే = నిరోధము చేత సర్వనిరోధాత్ = సమస్తము నిరోధింపబడుట వలన నిర్బీజః = బీజము లేనట్టి సమాధి =కైవల్యము
సత్యము యొక్క అస్తిత్వము సైతము చిట్టచివరకు నిరోధింపబడుటచే బీజము నశించిన సమాధి స్థితి లభ్యమగును
మొదట సత్యము నుపాసించుట వలన గుణములు లేని స్థితి అనగా నిర్గుణస్థితి సత్యముగా నిలుస్తుంది. ఇక్కడ నిర్గుణము గుణములు లేకుండుటగా నుపాసింపబడుట వలన అదిగూడా గుణముల నుపాసించుటయే. ఇందు గుణములు బీజస్టితిలో విత్తనములుగా ఉన్నాయి. కనుక లేకపోలేదు. విత్తనములు మొల కెత్తితే కర్మలవుతాయి. మొలకెత్తక ముందు వాసనలుగా ఉంటాయి. ఇందుకై మొదట సత్యమును, పైన శ్లోకములలో చెప్పినట్లు, ఉపాసి౦చాలి. అట్లుపాసంచడంవలన నిర్గుణమైన స్టితి అభ్యాసమవుతుంది. తాను నిర్గుణముననున్నా అది కూడ ఒక స్థితియేగనుక అది కూడ గుణముగా అభ్యసించబడుతుంది. అలా కొంతకాలము అభ్యసించిన పదప అది కూడ నశిస్తుంది. ఎండ వలన నీరు అవిరియై, మేఘమై మరల వర్షిస్తున్నాది. ఎన్ని నదులలో నీరు ఆవిరియైనా మేఘముగా అది ఒక్కటే. అలాంటి మేఘము మరల సముద్రమునందు వర్షించినపుడు దాని అస్తిత్వము నశిస్తుంది. సముద్రము యొక్కటియే ఉంటుంది. ఇదే నిర్బీజమను స్థితి. అన్ని గుణములు తనయందు పర్యవసించగా తాను సత్యమై మిగిలినవి తనలో భాగములవుతాయి. అలా తాను అంతర్యామియందు భాగమై అనందమయ స్థితి యందున్నప్పుడు తాను, గుణములు అనునవి అన్నీ నశించి "ఆనందమే" సత్యముగా నిలుస్తుంది. ఇదే (అనగా తన అనుభవమే) బీజము లేని స్థితి. ఇదే యోగికి మెలుకువ. ఇదియోగికి నిజ మైన గమ్యము అని చెప్పబడినది.
No comments:
Post a Comment