Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 5 Section 8

Bhagavat Gita

5.8

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః {5.16}

తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్

ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశించినదో అట్టివారి జ్ఞానము శ్రేష్ఠమై సూర్యుని వలె ప్రకాశించును.

తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్సత్పరాయణాః {5.17}

గచ్ఛ న్త్యపునరావృత్తి౦ జ్ఞాన నిర్ధూత కల్మషాః

బ్రహ్మమునందే బుద్ధి గలిగి, దాని యందే మనస్సు కలిగి, దానియందే నిష్ఠ కలిగి, దానినే పరమ గతిగ భావించు జ్ఞానులు జ్ఞానముచే పాపములను పోగొట్టు కొనిన వారై పునర్జన్మ లేని మోక్షమును పొందుచున్నారు

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని {5.18}

శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః

విద్యా వినయములుగల బ్రాహ్మణుని యందును, గోవు నందును, కుక్కయందును, చండాలుని యందును పండితులు సమదర్శనము చేయుదురు ఀ

శ్రీకృష్ణుడు సమదర్శిన -- అనగా అందరినీ సమానంగా చూడడం, అందరి యందు సమానమైన ప్రేమ కలిగి యుండడం--అనే పదప్రయోగం చేసేడు. దేవుని నమ్ముకున్న వారు, అందరినీ ప్రేమించి, గౌరవిస్తారు. వేరే మతం, దేశం, జాతి, సంస్కృతి ఉన్నవారిని హేళన చెయ్యరు. జీవైక్య సమానత గురించి తెలిసికొ౦టే, మనము ఇతరులకన్న ఉత్తమమైన వారలమనే భావన -- వారికీ, మనకీ ఎంత తేడా ఉన్నా-- కలుగదు.

ఇతరులని పైపై ప్రేమించి, గౌరవించే పద్దతి మార్చుకోవాలి. మనము అందరినీ అర్థం చేసికొని, దయతో మెలగాలి. కొంత మంది పైపై ఎంతో సంస్కృతి గలవారిగా కనిపించి, లోపల తమ దేశమే, జాతే, మతమే గొప్పదనే భావనలో ఉంటారు. కొన్ని పుస్తకాల రచయితలు, తెలిసో, తెలీకో, ఇతర మతాలను, సంస్కృతులను, దేశాలను హేళన చేస్తారు.

బ్రిటిష్ వారిని మనకన్నా ఉత్తములని భావించి మనము అనేక సమస్యలు ఎదుర్కొన్నాము. వేరొకరి పరిపాలనలో మన యందు ఉన్న నమ్మక౦, గౌరవం క్షీణిస్తుంది. ఈ విధంగా ఆసియా, ఆఫ్రికా లలో వలస రాజ్యాల పరిపాలనలో ఒక రకమైన మనోదౌర్బల్యం ఏర్పడింది. పాశ్చాత్య దేశాలు ఎవరి క్రింద ఏలబడక, వలస రాజ్యాలను స్థాపించడం వలన, వారిని ఆసియా, ఆఫ్రికా వాసులు పూర్తిగా నమ్మరు.

గాంధీజీ వలస రాజ్యాల వలన ఏలబడిన ప్రజలేకాక, ఏలే వారు కూడా నష్టపోతారు అని అన్నారు. చాలామంది బ్రిటిష్ యువకులు పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులయి, ప్రజలకు ఎంతో సేవ చెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ, మన దేశానికి వచ్చి, కొంత కాలం తరువాత తామే మనకన్నా ఉత్తమమైన వారలమనే భావ మార్పిడి చేసికొన్నారు. అలాగే కొందరు బ్రిటిష్ ప్రజలు, గాంధీజీ యొక్క స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించి, ఆయనకు అండగా నిలబడ్డారు. అనేకమంది బ్రిటిష్ దేశస్తులు మన దేశంలో స్థిరపడి ఇప్పడికీ ఇక్కడే నివసిస్తున్నారు.

మనం ప్రేమ, గౌరవం మన కుటుంబ సభ్యుల యందు సమానంగా చూపాలని భావిస్తాం. మనకన్నా వేరే స్థిర భావాలు గలవారి గురించి ఆందోళన చెంద౦. తరం మారిన తరువాత మన భావాలను ఎదుర్కొని, మనల్ని, ఇతరులని వారి భావాలతో ముడిపెట్టి చూడడం మనకి భయం కలిగిస్తుంది. అది ఎలాగంటే మన ఒంటి ఛాయలలో బేధం వలన ప్రభావితం కాకూడదు. అది వేర్వేరు రంగుల చొక్కాలు వేసికొన్నట్టే. అలాగే భావాలు కూడా: అవి వేరైనప్పటికీ ఇతరుల యందు ప్రేమ, గౌరవము కలిగి ఉండాలి. తరాల మధ్య ఎంతో బేధమున్నా, క్రొత్త భావాల వలన మన కుటుంబానికి మేలు జరగవచ్చు. వృద్ధులు తమ అనుభవంతో, తమకన్నా చిన్న వారికి మంచి సలహాలు ఇవ్వగలరు. అలాగే యుక్త వయస్కులు క్రొత్త భావాలతో ఇంటికి సజీవత్వము, నూతనత్వము కలిగిస్తారు. చిన్న పిల్లలు తమ అమాయకత్వముతో అందరినీ అలరిస్తారు.

శ్రీకృష్ణుడు భూత దయ కలిగి ఉండమని కూడా బోధిస్తున్నాడు. ఎందుకంటే జంతువులలోనూ దేవుడు ఉన్నాడు. జంతువులు తమని ప్రేమించే వ్యక్తులను గుర్తు పెట్టుకుంటాయి. 319

Eknath Gita Chapter 5 Section 7

Bhagavat Gita

5.7

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ {5.13}

నవద్వారే పురే దేహే నైవ కుర్వ న్న కారయన్

కర్మయోగి సమస్త కర్మలను మనసుచే సన్యసించి, తాను చేయక, చేయించక, నవద్వారపురమగు శరీరమునందు సుఖముగ ఉండును

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః {5.14}

న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే

పరమాత్మ కర్తృత్వమును గాని, కర్మములను గాని, కర్మ సంబంధమును గాని కలుగజేయడు. సృష్టి యందు ప్రకృతి స్వభావము అలా ప్రవర్తించుచున్నది

నా దత్తే కస్య చి త్పాపం న చైవ సుకృతం విభుః {5.15}

అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్వన్తి జంతవః

జనుల యొక్క పాపపుణ్యములను పరమాత్మ గ్రహింపడు. జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి యున్నది. అందుచేత జనులు మోహము నొందుచున్నారు

జీవితాన్ని ఆనందంగా అనుభవించాలంటే మనము త్యజించవలసింది, ప్రపంచం కాక, అహంకారం. మనము అహంకారాన్ని పారద్రోలాలని ఎంత ఆలోచించినా సాధ్యం కాదు. ఇతరుల గురించి ఆలోచిస్తూ, వారిని మనకన్నా ఎక్కువ ప్రేమిస్తూ, నిస్వార్థంగా సేవ చేస్తే తప్ప అహంకారం పోదు.

ఇక శ్రీకృష్ణుడు చెప్పే రెండో అంశం దేహం తొమ్మిది ద్వారబంధాలతో కూడిన పురం. మన రెండు కళ్లలోంచీ దృశ్యాలు వస్తూ వుంటాయి. అలాగే మన రెండు చెవులనుంచి మనకి ఇష్టమున్నా లేకపోయినా వార్తలు వస్తాయి. మనలో చాలామంది దేహంతో తాదాత్మ్యం చెంది, తాము అ౦దులో నివసించే వారలమనే జ్ఞానాన్ని పొందలేదు. అందువలన వారు ఇతరులగురించి ఎక్కువ పట్టించకోకుండా బ్రతుకుతారు. మనకు ప్రియమైన వారిని సరిగ్గా చూడం. ఎన్నేళ్ల క్రింద పెళ్ళయినా మన సహ ధర్మచారిణిని పూర్తిగా చూడం. అలాగే కుటుంబంలో అందరితోనూ కాలం గడిపి వారెవరో చూడకుండా పోతాం. నిజానికి వారంతా దేహమనే పురంలో నివసించే ఆత్మలు.

మనం గతంలో ఎన్ని తప్పులు చేసినా --అంటే తెలీక చేసినవి-- శ్రీకృష్ణుడు మనల్ని విడనాడడు. ఆయన అందరిలోనూ ప్రతిష్ఠితమై ఉన్నాడు. కాబట్టి ఒకడెన్ని తప్పులు చేసినా, వానిని ద్వేషించడు. మనము తప్పుల మీద తప్పులు చేసినవారి నుండి దేవుడు వేరుకాలేదని మరచిపోతాం. తప్పు చేయడాన్ని నియంత్రించి, తప్పు చేసినవాడిని ప్రేమించడం చాలా కొద్దిమందికి తెలుసు. ముఖ్యంగా తెలియక చేసిన తప్పుల విషయంలో ఇది వర్తిస్తుంది. మనము ఒకనిలోని స్వార్థాన్ని దూరంగా పెట్టి, వాని స్వస్వరూపాన్ని ప్రేమించడం ఆధ్యాత్మిక సాధనలో ఒకానొక లక్ష్యం. ఒకడు అహంకారం, స్వార్థంతో కూడి ఉంటే, వాడు జీవించడానికి పనికిరాడని నిర్థారించకూడదు. వారిలో దేవుడున్నాడని గుర్తించి, వారిని ప్రేమించి, గౌరవించి, అహింసతో వారిని చూచి, సహనంతో వారు పెట్టే బాధలను అనుభవించాలి. ఎందుకంటే వారికి తప్పులు చేస్తున్నామనే జ్ఞానము లేదు.

తప్పులు ఎదుగుతున్న వయస్సులో సహజంగా జరుగుతాయి. కాబట్టి గతంలో చేసిన తప్పుల గూర్చి ఆలోచించకూడదు. చేసిన తప్పును మళ్ళీ చెయ్యకపోవడం ఉత్తమం. ప్రతి తప్పుకి పర్యావసానము ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాలు ఉండచ్చు. మనం ఒక పెద్ద నిర్ణయం తీసికొన్నప్పుడు, దాని నుండి ఎంతో ఆశించి, మనకు, ఇతరులకు కలుగబోయే దుఃఖాన్ని తక్కువ అంచనా వేస్తాము. మనం చేసే కర్మలోనే మనం పొందే ఫలం యొక్క బీజముందని తెలిసికోం. మనము తప్పు సాధనాలతో, మంచి గమ్యం ఎప్పటికీ చేరలేము. మంచి సాధనాలలో మంచి లక్ష్యాలు అంతర్లీనమై ఉన్నాయి. 315

Eknath Gita Chapter 5 Section 6

Bhagavat Gita

5.6

బ్రహ్మ ణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః {5.10}

లిప్యతే న స పాపేన పద్మపత్రమివా౦భసా

తాను చేయు కర్మలను భగవానునికి సమర్పించి, ఆసక్తిని వీడి కర్మలను చేయువాడు, తామరాకు నీటిచేత అంట బడనట్లు పాపము చేత అంటబడడు

ఇహైవ తైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః {5.11}

నిర్దోష౦ హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః

ఎవరి మనస్సు సమత్వభావమున స్థిరముగ నుండునో వారు ఈ జన్మమునందే జీవన్ముక్తులు. బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది. కావున వారు బ్రహ్మ నిష్ఠులే యగుదురు

న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం {5.12}

స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవి ద్బ్రహ్మణి స్థితః

స్థిరబుద్ధి కలిగి, మోహ రహితుడైన బ్రహ్మవేత్త బ్రహ్మము నందున్న వాడై ప్రియము కలిగినపుడు సంతసింపడు, అప్రియము కలిగినపుడు దుఃఖి౦పడు

కలువ పువ్వుని అనేక విధాలుగా వర్ణిస్తారు. దాని పర్యాయ పదము: పంకజ అనగా బురద నుండి పుట్టినది. కలువ ఆకు పెద్దదిగా ఉండి నీటి మీద తేలుతూ ఉంటుంది. కానీ దానికి తడి తగలదు. అలాగే మనము దేవుని శరణు కోరి, ఆయన చేతుల్లో పని ముట్టుగా పరోపకారం చేస్తూ ఉంటే, మనకు కష్టాలెదురైనా, అవి మనల్ని అంటిపెట్టుకొని ఉండవు. మనము సవాళ్లను అలుపు, ఒత్తిడి, విసుగు, విరామం లేకుండా ఎదుర్కోగలం.

మనము ఆధ్యాత్మిక సాధన కొంత స్వార్థంతో చేస్తాము. పరోపకారం చేస్తే మన౦ దేవుడ్ని పొందవచ్చనే భావం కలిగి ఉండచ్చు. అలాగే మన స్వార్థం కూడా చూసుకొంటాం. మన క్షేమం, ఇతరుల క్షేమం మీద ఆధారపడి ఉన్నదని, మనం ఇతరులకై పాటు పడితే, మన గురించి కూడా పాటు పడుతున్నామనే జ్ఞానం పొందటానికి కొంత సాధన అవసరం.

నిస్వార్థ సేవ యొక్క రహస్యం తెలియడానికి కొన్నేళ్ళు పడుతుంది. గొప్ప దాతలు ప్రజా సేవకై నడుం బిగించి, వారి స్వార్థం చూసుకొంటారు. నాకైతే ధ్యానం చేస్తే కాని నిస్వార్థ సేవ గురించి తెలియదని అనిపిస్తుంది. మనం పరులకై పని చేస్తున్నామని తలంచవచ్చు. కానీ వారి అవసరాలు ఏమిటో తెలియక పోవచ్చు. ఇతరుల అవసరాలు, వారి కష్టాలు తెలిసికోవాలంటే, మన అహంకారాన్ని వదులుకోవాలి. ధ్యానం ద్వారా అహంకారాన్ని పోగొట్టుకొని, ఎప్పుడూ మన గురించే ఆలోచించే మనస్తత్వాన్ని దూరం చేసికోవచ్చు.

ఒక చిన్న పిల్లవానికి తన అవసరాలు గురించి బాగా తెలిసి, ఇతరుల అవసరాల గురించి ఆసక్తి లేక పోవచ్చు. కానీ పెద్ద వాళ్ళకు ఇతరుల అవసరాల యందు ధ్యాస ఉండాలి.

మన౦ ఆధ్యాత్మిక సాధన కొంత అహంకారంతో, కొంత పరుల సేవకై మొదలపెట్టి ఉండవచ్చు. మొదట్లో మనం స్వర్గం, మోక్షం మొదలగు వాటి గురించి స్వార్థంతో కూడి ఉండవచ్చు. ఇటువంటి ప్రేరణ లేనిదే కర్మ చెయ్యడం కష్టమనిపించవచ్చు. మనం స్వలాభానికై కర్మ చేసినా, అది ఇతరులకు హాని చెయ్య కూడదు. ఉదాహరణకి: సిగరెట్టు పరిశ్రమలలో పనిచేసేవారు, అందరికీ క్యాన్సర్ వ్యాధిని తెప్పిస్తారు. అది వారి జీవనోపాధి కావచ్చు, కానీ అది ఆధ్యాత్మిక సాధనకు అడ్డు గోడ. వారికి ఎంతో కొంత చెడు కర్మ కలుగుతుంది. ప్రతి దినం మన ఉద్యోగం వలన పరోపకారం జరుగుతోందా లేదా అని ప్రశ్నించుకోవాలి. మన ఉద్యోగం ఇతరులకు హాని చేసేదైతే, దానివలన మనమెంత లాభం, అధికారం పొందినా, దానిని వదిలిపెట్టాలి. అలాంటి ఉద్యోగం కన్నా, పేదరికమే మేలు.

మనం స్వంత లాభానికై, డబ్బు, కీర్తి, ప్రతిష్ఠ లకై పని చేస్తే, నాడీ వ్యవస్థపై ఒత్తిడి కలుగుతుంది. మనల్ని అలసట పెట్టేది సాధారణమైన పని కాదు--స్వలాభానికై చేసే పని; ఏ పనైతే ఇష్టమో అది చేసి, ఇష్టం లేని పని చెయ్యకపోవడం. కర్మ ఫలం గురించి సదా ఆలోచిస్తూ ఉంటే మానసిక ఒత్తిడి, నిద్ర లేమి కలుగుతుంది. జయాపజయాలు గురించి ఆలోచిస్తూ పోతే మనకు ఆందోళన అలసట కలుగుతుంది. మనలో చాలామందికి భవిష్యత్ లో ఏమి జరుగుతుందో అనే ఆందోళన ఎక్కువై, అది దురదృష్ట వశాత్తూ జరిగిన నష్టం కన్నా విపరీతంగా ఉంటుంది. నష్టం ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు. కానీ ఆందోళన నిరంతరం ఉండేది. మనకు మన్నన లేదా ఛీత్కారము కలుగుతుందో తెలీదు. మనకు ఛీత్కార౦ తప్పదని తలుస్తే ఆందోళన ఉండదు.

కానీ భగవంతుని నమ్మిన వానికి మన్నన, ఛీత్కారం రెండూ ఒక్కటే. అవి వానిని మోహంలో దించవు లేదా నిరాశ కలిగించవు. ఎటువంటి నష్టాలు కలిగినా మనలోని దేవుడ్ని నమ్ముకొ౦టే భయముండదు. అటువంటి అనన్య భక్తి మనల్ని ఒత్తిడి, ఆందోళన, అపజయంపై దృష్టి లేక పని చేయిస్తుంది. ఈ విధంగా కర్మ ఫలాన్ని ఆశించకుండా ఉండేవానికి శాంతము, భద్రత కలుగుతాయి. 312

Eknath Gita Chapter 5 Section 5

Bhagavat Gita

5.5

యోగయుక్తో విశుద్దాత్మా విజితాత్మా జితేంద్రియః {5.7}

సర్వభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే

యోగయుక్తుడు, విశుద్ధహృదయుడు, మనసును జయించిన వాడు, జితేంద్రియుడు, సర్వుల యందలి ఆత్మయు తన ఆత్మయు ఒకటే యని తెలిసినవాడు కర్మలను చేసినను వాటి చేత అంటబడడు

నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ {5.8}

పశ్యన్ శ్రుణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిష న్నిమిషన్నపి

ఇంద్రియాణీ౦ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్ {5.9}

ఆత్మ తత్వము నెరిగిన యోగి చూచుచు, వినుచు, తాకుచు, వాసన చూచుచు, తినుచు, నడచుచు, నిద్రి౦చుచు, శ్వాసించుచు, పలుకుచు, విసర్జించుచు, గ్రహించుచు, కనులు తెరచుచు, మూయుచూ, ఇంద్రియాలు ఆయా విషయము లందు ప్రవర్తించు చున్నవే గాని నేనేమియు చేయుట లేదని భావించును

నేను బాల్యంలో ఉండగా మా ఊర్లో అథాని అనబడే గోడల్ని దారి పొడుగునా కట్టేవారు. అవి ఒక మనిష౦త ఎత్తు ఉండి, తల మీద బరువుమోసేవారు, తమ బరువుని వాటిమీద పెట్టి విశ్రాంతి తీసికొనే అవకాశం కల్పిస్తాయి. ఆధ్యాత్మిక పథంలో పరోపకారం చెయ్యగలిగితే ఇటువంటి అనుభవం వస్తుంది. మన సమస్యలు జటిలమైనప్పుడు మనలోని దేవుడు "నేను అథాని గోడను. నీ బరువుని నా మీద పెట్టు" అని అంటాడు.

దేవుని మీద భారం వేసినవాడు, దేవుని చేతుల్లో ఒక పనిముట్టుగా ఉండి, ఎన్నటికీ నిరాశ, నిస్పృహ చెందడు. అతడు దేవుని పూర్తిగా నమ్మి, ఆత్మ జ్ఞానము కలిగి, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందడు. అతడు ప్రతి కర్మ దైవార్పణం చేస్తాడు. అతడు ఆహారం తన కొరకై కాక, దేవుని సేవ చేయడానికై తింటాడు. మనం పోషకాహారాన్ని దేవుని ప్రసాదంగా భావించి తింటే దేహము, మనస్సు, బుద్ధి బలోపేతమౌతాయి. అలాగే వ్యాయామం చేసి, దేహాన్ని ఆరోగ్యంగా చూసుకొంటే, మనం ఇతరులను సేవ చెయ్యడానికి వీలవుతుంది.

మనకి దేవుని దగ్గరకు వెళ్ళడానికి మరో అవకాశం: నిద్రలోకి ప్రవేశిస్తున్నప్పుడు దైవ నామ స్మరణం చెయ్యడం. దీనివలన నిద్రలో దేహం, మనస్సు శుద్ధమై, మనం నిద్ర లేచినప్పుడు స్వస్థతో ఉంటాం.

దేవునిలో ఏకమవ్వాలంటే ప్రతి కార్యం దేవుని సేవలా భావించాలి. దూషణ, హేళన, ద్వేషం మన౦ చెయ్యకూడదు. రెప్ప వాలుస్తున్నప్పుడు కూడా దేవుని గురించే అని భావించాలి. మన౦ చేసే ప్రతి చిన్న కార్యం దేవునితో అనుసంధానం చెయ్యాలి. నా అమ్మమ్మ చెప్పేది: కలలో కూడా మనం క్రోధం, ద్వేషం ప్రదర్శించకూడదు. ఈ విధంగా చేతన మనస్సును మలచుకొని, నిద్రలో కూడా ప్రేమను, జీవైక్య స్థితిని పొందాలి. 309

Eknath Gita Chapter 5 Section 4

Bhagavat Gita

5.4

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం త ద్యోగైరపి గమ్యతే {5.5}

ఏకం సాంఖ్య౦ చ యోగం చ యః పశ్యతి స పశ్యతి

సాంఖ్య యోగులకు ఏ స్థానము లభించునో కర్మ యోగులకు కూడా అదియే లభించును. ఈ రెంటిని ఒక్కటిగ దర్శించువాడే జ్ఞాని

సన్యాసస్తు మహాబాహో దుఃఖ మాప్తు మయోగతః {5.6}

యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణా ధిగచ్ఛతి

అర్జునా! యోగము లేకుండా సన్యాసమును పొందుట కష్టము. యోగయుక్తుడైన మననశీలుడు బ్రహ్మమును శీఘ్రముగ పొందును ఀ

ఊహాతీతమైన జ్ఞానం ప్రపంచాన్ని త్యజించి వైరాగ్యంతో గాని, నిస్వార్థమైన కర్మలు చేయడంవలనగాని పొందవచ్చు. శ్రీకృష్ణుడు, కర్మ యోగమే సులభమైన మార్గమని చెప్తున్నాడు. నిస్వార్థ కర్మలు, ధ్యానం చేస్తే తప్ప సన్యసించడ౦ మనలో చాలామందికి సాధ్యం కాదు. కొందరు యుక్త వయస్కులు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్దామని, చదువుని, ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సన్యసించి నిర్మానుష్యమైన ప్రదేశానికి పోతారు. మనకి, దేవునికి మధ్యనున్న పెద్ద అడ్డంకు అహంకారం. ఆధ్యాత్మిక సాధన చేసి అహంకారాన్ని జయించాలి. అలా చేయాలంటే మన కుటుంబము, మిత్రులు, సమాజం అవసరము. బంధుమిత్రులతో ఒక్కొకప్పుడు కష్టమనుభవిస్తాం. కానీ అది ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం కాబట్టి, మన అహంకారాన్ని క్రమంగా వదిలివేస్తాం.

నాకొక మిత్రుడు ఉండేవాడు. అతను మనుష్యులతో సంపర్కం లేకుండా తన ధ్యానం తను చేసికొనేవాడు. అతనికి మనుష్యులకన్నా చెట్లు, చేమలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఒక రోజు అతను తోటలో పని చేస్తూ, ఎందుకో తోటమాలితో తగవు పెట్టుకొన్నాడు. చివరకు వారు పని ముట్లు పట్టుకొని వొకరి మీద ఒకరు కలియబడ్డారు. దారిన పోతున్న ఒక వ్యక్తి వారిని ఎలాగో విడదీసి హింస లేకుండా చేసేడు. అప్పుడు నేను నా మిత్రుడని పరామర్శించేను. "నువ్వు మనుష్యులతో సంబంధం పెట్టుకోవు. నిన్ను రెచ్చ గొట్టే వారితో ఎప్పుడూ నివసించలేదు. ధ్యానంలోలాగ మంత్ర జపం చేసి ఉంటే, ఆ తోటమాలిని మిత్రునిగా చేసికొనే అవకాశం ఉండేది. క్రోధంతో ఒకర్ని పారతో కొట్టడం పెద్ద కష్టం కాదు. ఒక నిజమైన మనిషే తనను నియంత్రించుకోగలడు." అని చెప్పేను. అతడు "అది నేను ఎలాగ చేసేది?" అని అడిగేడు. "నీలాంటి వారితో సహజీవనం చేస్తేనే అబ్బుతుంది" అని చెప్పేను.

ఒకరికి ఎంత ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ నిస్వార్థ సేవ చేయనిదే అది ఆచరణలోకి రాదు. నేటి కాలంలో మన ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించాలంటే మనందర౦ ఏకమవ్వాలి. గీతని కాలమానానుసరం సమన్వయం చేసికొని ప్రపంచ సమస్యలయందు దృష్టి సారించాలి. ఇది "నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను" అనే సమయం కాదు. ఎవరైతే నిరాశా నిస్పృహలతో ఉంటారో, సమాజానికి వెన్ను చూపిస్తారో, ప్రపంచానికి తమ కౌశలం చూపలేరు. మనం ఒక పెద్ద నాయకుడు లేదా అధికారి కానప్పటికీ, మన ఇంట్లో, మన ఇంటి ప్రక్కవారితో, సమాజంతో సామరస్యంగా ఉండి, ఎప్పటికీ అహింసని పాటించి, ప్రశాంతత పొందగలం.

ధ్యానం, నిస్వార్థ కర్మ జోడీగా ఉంటాయి. మనం ఇతరులను మనకన్నా ముఖ్యులని తలిస్తే ధ్యానం గట్టి పడుతుంది. తద్వారా మనలో ఎంతో శక్తి ఉత్పన్నమై ఇతరులకు మరింత మేలుచేయగలం. 306

Eknath Gita Chapter 5 Section 3

Bhagavat Gita

5.3

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పండితాః {5.4}

ఏక మప్యాస్థిత స్సమ్య గుభయో ర్విందతే ఫలమ్

సాంఖ్యము వేరు, యోగమువేరు అని అవివేకులు భావింతురు. పండితులు భావించరు. ఈ రెంటిలో ఒకదానినైనను చక్కగా ఆచరించినవాడు రెండిటి యొక్క ఫలమును పొందును

శ్రీకృష్ణుడు జ్ఞానము, కర్మ వేర్వేరు కాదని చెప్తున్నాడు. ఎవరైతే జ్ఞానమును దైనింద జీవితంలో పాటించక ఉంటారో వారు పిల్లలతో సమానము. ఆధ్యాత్మిక జ్ఞానము దైనింద కార్యాలలో ఉపయోగించాలి. అహంకారంతో ఉండి, అనుబంధాలలో సమస్యలు ఉండి, ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోతే ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నామని చెప్పేవారు పిల్లలతో సమానము.

అస్సీసి కి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ మన జ్ఞానము, కర్మను ఆచరించు విధానము బట్టి ఉంటుంది అని చెప్పేరు. ఉపనిషత్తులలో అపరా విద్య -- అంటే ప్రపంచంలో జీవనం సాగించడానికి ఉపయోగపడేది--గూర్చి చెప్పబడింది. అపరా విద్య వలన మన వ్యక్తిత్వము, నడవడిక మొదలగునవి మార్పు చెంద బడవు. రెండవది పరా విద్య -- అంటే మనకు కావలసిన ఆధ్యాత్మిక పరమైన విద్య.

శాస్త్రజ్ఞానము దైనింద కార్యాలకు ఉపయోగపడదు. ఉదాహరణకు: కొందరు ధూమపానం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని తెలిసికూడా దానిని మానరు.

ధ్యానం గాఢమైతే, దేవుని "ఈ వాంఛను కలుగజేయకు" అని అడిగితే, అది పోతుంది. ఇదే ధ్యానంలోని అద్భుతం.

మనం వస్తువులనుండి ప్రేమను వెనక్కి తీసికోలేందే, మన బంధుమిత్రులను ప్రేమించలేము. ఉదాహరణకి: డబ్బే ప్రపంచానికి మూలం అనుకునేవాడు, బంధుమిత్రులను ప్రేమించలేడు. మారక ద్రవ్యాలు వాడే వాడు తన ప్రేమను, విశ్వాసం చూపలేడు. కోరిక ప్రేమకు ముడిసరుకు.

మనస్సు కోర్కెల గొలుసు. ఒక కోరిక తీరితే, ఉంకో కోరిక కలుగుతుంది. మనము వృధా ప్రయాసల యందు బహిర్గితమౌతున్న ప్రేమను వెనక్కు లాక్కొని, మనస్సులో అలజడి రేపే కోరికల వలయాన్ని నిశ్చలం చేసికోవడానికి, బుద్ధి సహకరించదు. డబ్బు, వస్తువులు, ఆహ్లాదం, మారక ద్రవ్యాలు మొదలగు వాటిపై కోర్కె కలిగి ఉంటే, మన ధ్యానంతో చేతన మనస్సు లోతులకు వెళ్ళాలి. చిన్న చిన్న కోర్కెలు -- బట్టలకై, వాహనాలకై, తీపి వస్తువులకై, బహుమతులకై -- ఏకమై వొక పెద్ద కోర్కెగా మారుతాయి. అవి మన౦ ప్రేమించ గలిగే శక్తిని వృధా చేస్తాయి.

బ్యాంకులో డబ్బు ఆదా చేసికోవాలంటే ఒక పెద్ద మొత్తాన్నే జమ కట్టనక్కరలేదు. ఖర్చులు పోను మిగిలిన ఒక చిన్న మొత్తాన్ని రోజూ జమ కడితే, అది కొన్నాళ్ళకు ఒక పెద్ద మొత్తంగా మారుతుంది. అలాగే దేవుడు ప్రత్యక్షమవుతే "నేను యోగులవలె గొప్ప సాధన చేసినవాడను కాను. కొన్ని సార్లు సహనం వహించేను. మరికొన్ని సార్లు నా కుటుంబాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించేను. కొన్ని కోర్కెలు తీరకపోయినా సంతృప్తిగా ఉన్నాను" అని చెప్తే, దేవుడు ఆ చిన్న మొత్తాన్ని జమ కట్ట మంటాడు. ఇలాగే చాలా మంది ఆధ్యాత్మిక జీవనాన్ని చాలా కాలం సాగిస్తారు. అనేకమైన చిన్న నిస్వార్థ కర్మలు పోగై, కాలక్రమేణా మనలో అమితమైన ప్రేమ, ఆధ్యాత్మిక చింతన కలిగిస్తాయి.

ప్రతిరోజూ ఒక మంత్రాన్ని చేతన మనస్సుతో జపిస్తూ ధ్యానం చేస్తే, మనలోని ఆధ్యాత్మికత బహిర్గతమవుతుంది. ఉదాహరణకి: సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన ప్రార్ధన -- "పరులకు దానం చేస్తే, మనము ఎంతో తిరిగి పొందుతాము. ఇతరుల తప్పులను క్షమిస్తే, మన తప్పులు క్షమింప బడతాయి" -- చేస్తే, మన అనుబంధాలలో క్రోధం, ద్వేషం లేక ఇతరులు చేసిన తప్పులను క్షమించి, మరచి పోతాము. ధ్యానం వలన విడుదలైన శక్తి సహజ౦గా వ్యక్తిత్వాన్ని, నడవడికను, చేతన మనస్సును మంచికై మారుస్తుంది. 303

Eknath Gita Chapter 5 Section 2

Bhagavat Gita

5.2

జ్ఞేయ స్స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి {5.3}

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధా త్ర్సముచ్యతే

అర్జునా! దేనిని ద్వేషించని వాడు, దేనిని కోరనివాడు నిత్య సన్యాసి యని తెలియదగి యున్నాడు. ద్వంద్వములను విడిచిన అతడు సుఖముగ బంధము నుండి విడిపడుచున్నాడు

సన్యాస మంటే హిమాలయాల్లోకో, అడవుల్లోకో వెళ్ళి నివసించడం అనుకుంటాం. శ్రీకృష్ణుడు అలాగ మనల్ని సన్యాసాన్ని పుచ్చుకోమని పురమాయించడం లేదు. సాధారుణులైన మనకు సన్యాసమంటే అహంకారం, స్వార్థం, వేర్పాటు, ఏవైతే ఆధ్యాత్మిక సాధానకి అడ్డుగా వస్తాయో, వాటిని విసర్జించడం.

పనస పండు కోసి, తినే వాళ్ళకు దానిలోని జిగటను గూర్చి తెలుసు. చేతులకి నూనె రాసుకుంటే తప్ప పనస తొనలను వేరుచేయలేం. అలాగే మనం ఇతరులను ప్రేమించి; కుటుంబంలో, సమాజంలో నిస్వార్థంగా బ్రతికి ఆనందాన్ని పొందాలంటే, సన్యాసమనే నూనెతో అహంకారమనే జిగటను తొలగించుకోవాలి.

మనందరికీ అమితమైన ప్రేమ ఉంది. దూరానికెక్కడకో పోయి ప్రేమించడం నేర్చుకోనక్కరలేదు. ప్రేమ మన గుండెల్లోనే ఉంది. దాన్ని నిరోధించి; మన ఇంటిని, సంఘాన్ని ఆనంద సాగరంలో ముంచక ఉన్నది అహంకారం అనే జిగట.

మనం అహంకారాన్ని జయించి, మనస్సును నిర్మలంగా ఉంచుకొని, వేర్పాటు లేకుండా ఉన్నామని ఎలా నిరూపిస్తాం? శ్రీకృష్ణుడు నిర్ద్వంద్వ౦గా ఉన్నప్పుడు అని సమాధాన మిస్తాడు. అంటే మనము మంచి-చెడు, తప్పు-ఒప్పు, జయం-అపజయం, పుట్టుకు-మరణం అనే ద్వంద్వాలకు అతీతమైనప్పుడు అని అర్థం. ఎంతకాలం మనము ఇష్టాయిష్టాలు అనే నియంతలకు లోబడి ఉంటామో, ఉల్లాసాన్ని సదా కోరి, ఉల్లాసం లేనివాటికి దూరంగా ఉంటామో, అంతకాలం మనస్సు అల్లకల్లోలమై ఉంటుంది.

నా మామయ్య కుటుంబానికి ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు నా అమ్మమ్మ అందరికీ సమ్మతంలేని పెళ్లి చేసికోవద్దని సలహా ఇచ్చింది. పెళ్ళయిన తరువాత కుటుంబ సభ్యులెవ్వరూ వారిని పలకరించలేదు. అప్పుడు నా అమ్మమ్మ వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. స్వతంత్రత భావాల్లో కూడా ఉండాలి. అప్పుడప్పుడు ఒక నిర్ణయాన్ని ప్రతిఘటించాలనే భావన మనకుంటుంది. కానీ మనం నాణేనికి రెండు వైపులు ఉన్నట్టే, నిర్ణయాన్ని పునః పరిశీలిస్తే భావనను మార్చుకుంటాం. సహజంగా ఇలా చెయ్యగలిగేవారు అరుదు. కానీ ధ్యానంతో మన ఇష్టాయిష్టాలను మార్చుకోవచ్చు.

దైనింద జీవితంలో ఇష్టాయిష్టాలకు అతీతంగా బ్రతకడం మన సమస్య. బంధు మిత్రులతో కలిసి ఉన్నామంటే అది సాధ్యం. ఎందుకంటే వారిని మనకన్నా ముఖ్యులని తలచడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అర్జునునికి అన్నదమ్ములు ఉన్నారు. వారితో కలిసి ఉండడంవలన ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండే అవకాశాలు అనేకం ఉన్నాయి. ఆహారం, వినోదం, సుఖాలు, తదితర విషయాలలో ఇతరులను మనకన్నా ముఖ్యులని తలంచడం మంచిది. ఉదాహరణకి మనము, మిత్రుడితో సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మనం చూద్దామనుకొన్న సినిమా గురించి చాలా విన్నాం, చదివేం. కానీ మన మిత్రుడు వేరే సినిమాకి వెళ్దాం అని అన్నాడు. మనం అనుకున్న సినిమాకే వెళ్లాలని పేచీ పెట్టడానికి అనేక కారణాలు ఉండచ్చు. కానీ సర్దుకు పోయి మన మిత్రుడు కోరిన సినిమాకే వెళ్తాం. ఇదే ఆధ్యాత్మిక సాధన వలన కలిగే సమైక్యత. 301

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...