Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 5 Section 13

Bhagavat Gita

5.13

శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ {5.23}

కామక్రోధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ నరః

ఎవడు దేహమును చాలించుటకు పూర్వమే కామక్రోధముల వలన కలిగిన సంక్షోభమును అరికట్ట గలుగు చున్నాడో వాడే యోగి; వాడే సుఖవంతుడు

యోన్త స్సుఖో అంతరారామ స్తథా౦తర్జ్యోతి రేవ యః {5.24}

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో అధి గచ్ఛతి

ఎవడు ఆత్మయందే ఆనందించుచు, ఆత్మయందే రమించుచు, ఆత్మయందే ప్రకాశము గలవాడై యుండునో అట్టి యోగి బ్రహ్మభూతుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నాడు

లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయః క్షీణకల్మషాః {5.25}

చ్చిన్నద్వైధా యతాత్మాన స్సర్వభూతహితే రతాః

కల్మష రహితులు సంశయ రహితులు, జితేంద్రియులు, సర్వభూతహితులు నగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నారు

ఈ శ్లోకంలో నిర్వాణ మనే విశేషణం వాడబడింది. దాని అర్థం సృష్టి ఒక గమ్యం వైపు పయనిస్తో౦ది. యోగులు సర్వజీవ సమానత్వాన్ని పూర్తిగా నమ్ముతారు. అదే మానవుల మటుకు సృష్టి యొక్క లక్ష్యం.

మన దుఃఖానికి కారణం పరిణామం ద్వారా ఆ గమ్యాన్ని చేరడానికి వేర్పాటు అడ్డుగా ఉన్నది. మనము కుటుంబ క్షేమం గురించి ఆలోచించకుండా ఉంటే అది మనకి, మరియు కుటుంబానికి నష్టం. భార్య, భర్త ఒకరితో ఒకరు పోటీ పడుతూ, వేర్పాటుగా ఉంటే, అది, వారికి, వారి పిల్లలకి, చివరికి సమాజానికి హానికరం. ఎవరైతే ఇతరుల అవసరాలు తమ అవసరాలకన్నా ముఖ్యమని తలుస్తారో, వారు భద్రతతో కూడి ఉండి ప్రతి ఒక్కరిచే ప్రేమించబడి, గౌరవించబడి ఉంటారు. ఒకడు ఇతరుల ఆనందంలో ఓలలాడితే, వానికి సంతృప్తిగా ఉంటుంది. కాని వేర్పాటుతో, స్వార్థంతో ఉంటే వానికి అభద్రత కలుగుతుంది. ఎందుకంటే మనలోని గాఢమైన కోరిక జీవైక్య సమానత భావమును కలిగించుకోవడం.

జీవైక్య సమానత యోగుల వరికే పరిమితం కాదు. శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించి ప్రపంచంలోని అన్ని జీవుల సంక్షేమం, ప్రపంచ శాంతికి ఎంతో అవసరమని గ్రహించేరు. ఒక్క మానవుల, జంతువుల మధ్య జీవైక్య సమానత ఉంటే సరిపోలేదు పర్యావరణం--అనగా చెట్లు, పంట భూమి, పీల్చే గాలి -- యందు కూడా దాన్ని పాటించాలి. మన అవసరాలు, పర్యావరణాన్ని కాలుష్యంతో నింపుతే మనకి మనుగడ సాగదు. కాబట్టి నిర్వాణము మన దేశానికే పరిమితం కాదు.

మన మతంలో పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతము వలె నుండి, మన బాధ్యతలు మనమే నిర్వహించి, మనల్ను మనమే ఉద్ధరించుకోవాలని చెప్పబడినది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని తప్పుగా విధి వ్రాతతో పోలుస్తారు. కర్మ సిద్ధాంతం ఒక పరిస్థితి తలిదండ్రుల, బంధుమిత్రుల వలన కాక, మన పూర్వ కర్మల వలననే కలిగిందని చెప్తుంది. విధి బంధమైతే, కర్మ సిద్ధాంతం స్వతంత్రం. ఎందుకంటే మన కర్మ మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కనుక. మనము గట్టి ప్రయత్నం చేసి, దృష్టిని కేంద్రీకరిస్తే నిర్వాణమనే ఉత్కృష్టమైన స్థితిని పొందుతాము.

జీవైక్య సమానత గూర్చి తెలియనంత కాలము వేర్పాటుతో, బాధలతో కూడిన పునర్జన్మ ఎత్తుతూనే ఉండాలి. భౌద్ధులు (Tibetan Book Of Dead) మరణం తరువాత కర్మ శేషం ఉన్నవారు బార్డో అనే త్రిశంకు స్వర్గం వంటి ప్రదేశంలో ఉంటారని తలుస్తారు. అక్కడ పునర్జన్మ ఎక్కడ ఉంటుందో నిర్ణయిస్తారు. ఉదాహరణకి ఒకడు జీవితమంతా జులాయిగా బ్రతికి ఉంటే, వాడు పుట్టి, జులాయిగా తిరిగే పిల్లలను కంటాడు. తద్వారా తన పాపానికి పర్యావసానము అనుభవిస్తాడు. ఈ విధంగా మన సంస్కారాలు మన జన్మని నిర్ణయిస్తాయి. ఒక రైల్వే స్టేషన్ లో వచ్చి పోయే బండ్లను గూర్చి స్పీకర్ లో ప్రకటిస్తారు. మన బండి గురించి ప్రకటిస్తే మనం దానినెక్కి ప్రయాణం చేస్తాము. అలాగే బార్డో కూడా. మన పూర్వ సంస్కారాలు మన జన్మని నిర్ణయిస్తాయని భౌద్ధులు నమ్ముతారు.

నేను చిన్నవారికి తమ తలిదండ్రుల బలహీనతలను అర్థం చేసికొని బ్రతకమని సలహా ఇస్తాను. ఎందుకంటే ఆ బలహీనతలు వారికి జన్యువుల ద్వారా సంక్రమిస్తాయి కనుక. మనలోని బలహీనత ఉంకొకరిలో చూస్తే మనకు చికాకు కల్పించవచ్చు. కాబట్టి మన తలిదండ్రుల, వృద్ధుల, ఇతరుల బలహీనతల వలన చికాకు పడకూడదు. ఎందుకంటే అవి మనలోనూ ఉన్నాయి కనుక. అలాగ ప్రవర్తించగలిగితే మనలోని చెడు సంస్కారాలెన్ని ఉన్నా, వాటిని అధిగమించ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లగలం.

ధ్యానం ద్వారా ప్రకృతి వలన కలిగే పరిణామం గురించి నిరీక్షింపక, ఇప్పుడే, ఇక్కడే పొందవచ్చు. పర్యావరణం కొన్ని వేల సంవత్సరాలు తరువాత మనకు నేర్పే పాఠం గురించి వేంచేయక ఇప్పుడే "నా భవిష్యత్ ను ఈ జన్మలోనే నిర్ణయిస్తాను. రాత్రింబవళ్ళు నాలోని స్వార్థం విడనాడడానికి శ్రమించి, జీవైక్య సమానత దిశపై జీవితం కొనసాగిస్తాను" అని చెప్పగలగాలి. ఈ విధంగా జీవితాన్ని పాటించేవాళ్ళు బహు అరుదు. పతంజలి ఉత్సాహంగా, కష్ట పడి శ్రమించే వ్యక్తి అట్టి ఉత్కృష్టమైన భావన కలిగి ఉంటాడు అని చెప్పెను. ధ్యానంలో పరిపక్వత పొందాలంటే జ్యోతిష్యం వంటి మూఢ నమ్మకాలు లేకుండా, నడుం బిగించి, పరిశ్రమ చెయ్యాలి. ఏ దేశాకాలమానాలలోనైనా గాఢమైన ధ్యానం ద్వారా జీవైక్య సమానతా జ్ఞానాన్ని పొంది, మానవాళి పరిణామంలో పొందగలిగే ఉత్కృష్టమైన గమ్యాన్ని చేరగల౦. ఏ పరిస్థితిలోనైనా, ఎటువంటి సంస్కారములు ఉన్నా, జ్యోతిష్యం ఏమి చెప్పినా, ఉత్కృష్టమైన లక్ష్యం దిశగా జీవించవచ్చు. ఎందుకంటే మన ఆత్మ, అనగా మన వ్యక్తిత్వము, అఖండమై, అపరిమితమై, మార్పు చెందనిదై యున్నది. 329

Eknath Gita Chapter 5 Section 12

Bhagavat Gita

5.12

యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే {5.22}

ఆద్యంతవంతః కౌ౦తేయ న తేషు రమతే బుధః

కౌ౦తేయ! ఇంద్రియ విషయ భోగములు దుఃఖ హేతువులు. ఆద్యంతములు కలవి. వాటి యందు జ్ఞాని రమించడు

యోగులు ఒకటి పుట్టి, మరణిస్తే, దాని నుండి ఆనందం ఆశించరు. మనకు ఆద్యంతాలు లేని శాశ్వత సుఖం అవసరం. క్షణికమైన వస్తువుల వలన శాశ్వత సుఖము, భద్రత కలుగవు.

పైపైన ఉన్న చేతన మనస్సుతో జీవిస్తూ ఉంటే ఒక క్షణికమైన సుఖం మనను సంతృప్తి పరచదు. కానీ చేతన మనస్సు లోతులకు వెళ్ళగలిగితే మనము పొందే ఆనందానికి అవధులు లేవు.

ఆనందం క్షణికమైనదని తెలిసికోవడానాకి ఒక ఉదాహరణ: సముద్రం అలజడితో ఉన్నప్పుడు, దాని అలల్లోని ఒక పెద్ద బంతివలె నున్న నురుగను చేతితో పట్టి, కొంత సేపయ్యేక అది పూర్తిగా మాటుమయ్యే అనుభవం అందరికీ కలుగుతుంది. క్షణికమైన సుఖం కూడా అలాగే కొంత కాలం తరువాత చెయి జారిపోతుంది.

యుక్త వయస్సులో క్షణికమైన ఆనందాల వెనుక పడవచ్చు. నడి వయస్సు దాటిన వారికి గీత చేసే హెచ్చరిక: క్షణికమైన ఆనందాల వెనుక పడవద్దు. అవి నీటిలోని బుడగల వలె వస్తూ పోతాయి. ఈ విషయం మనం జీవితంలో ఎంత తొందరగా తెలిసికొ౦టే, అంత తక్కువ బాధను అనుభవిస్తాము. గీత చేసే బోధ కొన్ని శతాబ్దాల క్రింద ఉన్న వారలకే పరిమితం కాదు. ఏ దేశకాలాల్లోనైనా, మనలో ప్రతిష్ఠితమైన దేవుని కనుగోవడమనే లక్ష్యం వర్తిస్తుంది.

కొందరు దేహ సంబంధిత సమస్యలు -- అనగా నొప్పి, వాచుట మొదలగునవి-- లేకపోయినా నిద్ర మాత్రలను వైద్యులను వ్రాసి ఇమ్మ౦టారు. దానికి కారణము మానసిక సమస్యలు. నిద్ర మాత్రలు వారీ నాడీ వ్యవస్థపై పని చేసి, వారిని వేకువలో శాంతపరచడానికి లేదా రాత్రి బాగా నిద్ర పట్టడానికి సహకరిస్తాయి. వాటి పర్యావసానాలు అనేకం. వారు జీవిత సమస్యలను ఎదుర్కో లేక క్షణికమైన పరిష్కారం పొందటానికై నిద్ర మాత్రలను కోరుతున్నారు. అలాగే పెద్ద తరం నిద్ర మాత్రలకు అలవాటు పడితే, చిన్న తరం వారినే అనుసరిస్తుంది. 325

Eknath Gita Chapter 5 Section 11

Bhagavat Gita

5.11

బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా విందత్యాత్మని య సుఖమ్ {5.21}

స బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే

బాహ్య విషయములందు ఆసక్తి లేనివాడై, ఆత్మసుఖము ననుభవించెడి బ్రహ్మవిదుడు నాశరహితమైన బ్రహ్మపదమును పొందును

మన మనస్సును సమంగా ఉంచి, ద్వంద్వాలను -- సుఖదుఃఖాలు, మిత్రుత్వం-శతృత్వం మొదలైనవి -- అతిక్రమించి, అందరినీ గౌరవంతో, ప్రేమతో చూసుకోగలుగుతే, మనలోని దైవత్వమును అవగాహన చేసికొన్నట్టే. అప్పుడు మన ప్రేమ అందరిలోనూ, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రసరింప బడుతుంది. ఇదే నిజమైన ప్రేమ అంటే. సెయింట్ బెర్నార్డ్ ఇలా చెప్పేరు: "ప్రేమకు తను తప్ప వేరే కారణము లేదు, ఫలము లేదు. అది దాని ఫలమై, దాని ఆనందానికై ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నాకు ప్రేమ ఉంది గనుక. నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నాకు ప్రేమించడం వచ్చు కనుక." మనము ప్రతిఫలము నాశి౦చి ప్రేమిస్తే, అది నిజమైన ప్రేమ కాదు.

మనము జీవులన్నిటినీ ప్రేమిస్తే, వాటి క్షేమానికై పాటు పడితే, దానికి కావలసిన శక్తి మనలోనే ఉత్పన్నమౌతుంది. ఇతరులనుండి ప్రేమ ఆశిస్తే, మనము వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. అలాకాక హృదయపూర్వకంగా, ఎటువంటి ప్రత్యుపకారము ఆశించకుండా ప్రేమిస్తే మనము స్వతంత్రులము. మనలో ప్రతిష్ఠితమైన భగవంతుని మీద సంపూర్ణముగా ఆధారపడితే, ఇతరుల సహాయ౦ అవసరం లేదు. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం, భద్రత కలుగుతాయి.

స్వతంత్రము లేకపోతే మనము భౌతిక వనరులను కూడా సమంగా ఉపయోగించలేము. వాటిని సమంగా ఉపయోగించాలంటే వాటిపై వైరాగ్యం ఉండాలి. ఉదాహరణకి డబ్బు, దస్కం పై వైరాగ్యం లేకపోతే వాటితో తాదాత్మ్యం చెంది జీవితమంతా వాటి వెంట బడతాం. డబ్బు వెంట పడకపోతే సంపూర్ణమైన సంతృప్తి పొందుతాము. ఇల్లు, వాహనము, వీణ సమంగా ఉపయోగించాలంటే వాటిపై కొంత వైరాగ్యం అవసరం. ఉదాహరణకి: వీణతో తాదాత్మ్యం చెందితే, ఆఫీసు మీద లేదా పరీక్షల మీద దృష్టి కేంద్రీకరించ లేక, సదా వీణే గుర్తుకొస్తుంది.

శ్రీకృష్ణుడు చెప్పే బోధ: మీరు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలంటే బయట వస్తువులపై ఆధారపడక, నిత్యం ధ్యానం చేసి, మీలోని దైవం మీద దృష్టి కేంద్రీకరించాలి. మొదట్లో ధ్యానం చేతన మనస్సును దాట లేక కష్ట మనిపిస్తుంది. చేతన మనస్సు లోతులకు వెళ్ళ గలిగితేగాని, శాంతి కలుగదు. మన నాడీ వ్యవస్తను సమం చేసికొని ధ్యానం చేస్తే , అఖండమైన శాంతిని పొందుతాము. 324

Eknath Gita Chapter 5 Section 10

Bhagavat Gita

5.10

న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం {5.20}

స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవి ద్బ్రహ్మణి స్థితః

స్థిరబుద్ధి కలిగి, మోహ రహితుడైన బ్రహ్మవేత్త బ్రహ్మము నందున్న వాడై ప్రియము కలిగినప్పుడు సంతసింపడు, అప్రియము కలిగినపుడు దుఃఖి౦పడు

అదృష్టం కలిసి వస్తే ఉద్రేకపడక, దురదృష్టం కలిగితే నిరాశ చెందక, తన యందు మంచి చేసినవారల యందే కాక, చెడు చేసిన వారల యందు కూడా ప్రేమ చూపగలిగే వ్యక్తి చాలా అరుదు. అట్టి వాడు జీవితంలో కలిగే బహుళత్వం వలన భ్రాంతి చెందడు. మనస్సు ఆందోళన చెందితే మనము జీవితాన్ని అఖండంగా చూడము. ఆందోళన వలన మనమ౦తా వేరనే భ్రాంతి కలుగుతుంది.

ఇక్కడ ప్రశ్న: మనము ఆనందము, దుఃఖము లకు అతీతంగా ఉంటే జీవితం నుంచి పొంద గలిగే ఆహ్లాదాన్ని అనుభవించగలమా? గీత ఈ అనుమానం ఆనందం, దుఃఖం తప్పితే వేరేది లేదనే తప్పుడు భావనవలన వచ్చి౦దని చెప్తుంది. మన బుద్ధి ద్వంద్వాలనే అర్థం చేసికొ౦టుంది. అంటే జీవితంలోని ప్రతి అనుభవాన్ని బుద్ధి రెండుగా చేసి చూపిస్తుంది. గీత బుద్ధి చూపే ద్వంద్వాలకు అతీతంగా ఉండమని బోధ చేస్తుంది.

ఆ స్థితిని పొందటానికి ధ్యానం మొదట్లో ఆనందాన్ని తిరస్కరించి, దుఃఖాన్ని కోరాలి. అందువలన నాడీ వ్యవస్థ సమమవుతుంది. వేలకొలది ఏళ్ల పరిణామం ద్వారా మనము సుఖాలవైపు పరిగెత్తి, దుఃఖాలనుండి దూరంగా ఉన్నాము. గీత సుఖం వస్తే నిరాకరించమని అనదు. నా అమ్మమ్మ ఇలా సమన్వయం చేసింది: "మీరు సుఖాల వైపు దృష్టి పెట్టి వెళ్ళినా, దుఃఖాల వైపు కూడా వెళ్తునట్టే". ఇది మనందరికీ సమ్మతం కాదు. భవిష్యత్లో సుఖాలని, దుఃఖాలు లేకుండా చెయ్యగలిగే యంత్రం తయారు చేయగలిగితే తప్ప, సుఖం దుఃఖం లేకుండా లేదు.

సాధనలో చాలా మటుకు క్షణికంగా నిరాశ చెందినా, శాశ్వతమైన మంచిని పొందడం మీద దృష్టి కేంద్రీకరించాలి. ఉదాహరణకు: మనమొక హోటల్ కి వెళ్ళి మనకు కావలసిన తిండిని తెప్పించుకొని, దానిని ఆస్వాదిస్తూ తిని సుఖమును పొందవచ్చు. కానీ అదే పనిగా తినడం మంచిది కాదని మన అంతరాత్మ చెప్తున్నప్పుడు దాన్ని పాటించి బిల్లు కట్టి వెళ్ళిపోవడం ఉత్తమం.

ఇది ఆహారానికే పరిమితం కాదు. ఒకరి ఇంట్లో ఒక సంతోషకరమైన కార్యం జరుగుతూ ఉంటే మనం వెళ్ళి కొంత సమయం గడిపి వీలు చూసికొని బయటకు వచ్చేయాలి. అక్కడే దేవుళ్ళాడడంవలన, అతిగా తిన్నట్లే, వెగటు కలుగుతుంది. కాబట్టి గౌరవంతో నిష్క్రమించడం మేలు. ఈ విధంగా మనము ఒక కార్యాన్ని విరమించడంలో స్వతంత్రత అలవాటు చేసికోవాలి. మనము పొందాలనే సుఖం దొరకక పోవచ్చు, కానీ మనము శాశ్వతంగా ఆహ్లాదమనుభవించే స్థితిని పొందుతాము. 322

Eknath Gita Chapter 5 Section 9

Bhagavat Gita

5.9

ఇహైవ త్తైర్జిత స్సర్గో యేషా౦ సామ్యే స్థితం మనః {5.19}

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః

ఎవరి మనస్సు సమత్వభావమున స్థిరముగ నుండునో వారు ఈ జన్మమునందే జీవన్ముక్తులు. బ్రహ్మము దోషరహితమైనది. సమమైనది. కావున వారు బ్రహ్మ నిష్ఠులే యగుదురు

మనమందరితో ప్రేమతో, గౌరవంతో, --వాళ్ళు స్వార్థపరులైనా, కాకపోయినా-- సమంగా మెలగగలగాలి. దీని గురించి శ్రీకృష్ణుడు ముందు (2:48) చెప్పియున్నాడు. మనల్ని ఒకరు మన్నిస్తే మిక్కిలి ఆనందం పొందుతాము. ఒకరు మనము చెప్పింది చెయ్యకపోతే విచారపడతాం. ఈ విధంగా కొసల మధ్య ఊగిసలాడుతున్న మనస్సు వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాలంటే సమంగా ఉండి ఆందోళన పడకూడదు. ఒకరు క్రోధంతో రగులుతూ ఉంటే, మనం కూడా అలాగే చేస్తే, పరిస్థితి చెయ్యి జారుతుంది.

క్రోధం కలిగినప్పుడు మంత్రం జపిస్తూ, దీర్ఘంగా నడవడం ఉత్తమం. మనం ఒకనియందు కోపంతో ఉంటే, వాని మంచి గుణాలు గుర్తు తెచ్చుకోవాలి. క్రోధానికి ప్రతిరూపమని అనుకొన్న వ్యక్తి మళ్ళీ మామూలుగా అవుతాడు. ఈ విధంగా క్రోధాన్ని స్వాధీనంలో పెట్టుకొంటే మనల్ని ఒకరు క్రోధంతో ప్రేరేపించినా, మనం వారి క్రోధం కొద్దిసేపట్లో తగ్గుతుందని తెలిసి సమంగా ఉండవచ్చు.

మనము క్రోధంతో ఊగిసలాడుతున్నప్పుడు అది ఎంతో కాలం ఉంటుందని అనుకుంటాం. అదే మన క్రోధం కొద్దిసేపే ఉంటుందని గుర్తు తెచ్చుకుంటే మనము బంధం తెగేదాకా లాగం. విబేధాలు కలిగినప్పుడు ఒకరిని వదిలేయడం మంచిది కాదు. వదిలేస్తే, బంధం తెగి, ఇరువురికీ మధ్యనున్న ఐకమత్యం సడలి, ఇద్దరినీ క్షీణింపజేస్తుంది. అవతలి వ్యక్తిని బలోపేతం చేస్తే మనమూ బలవంతులమౌతాము. క్రోధితో కలసి జీవించడంవలన వానికి సేవ చేస్తున్నామనుకోవాలి. మండే చెట్టుపై పక్షి వాలనట్లు, క్రోధి నుంచి అందరూ దూరంగా ఉంటారు. కాని మనము వానిని భరించి, వానికి ఊతనిచ్చి, మన మంచి నడవడికతో మార్గదర్శిగా ఉంటే, అతడు మనపై ఎక్కువ ప్రేమ, గౌరవం చూపుతాడు. ప్రేమ రహస్యం, ఇతరులను భరించగలిగే శక్తి. 320

Eknath Gita Chapter 5 Section 8

Bhagavat Gita

5.8

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః {5.16}

తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్

ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశించినదో అట్టివారి జ్ఞానము శ్రేష్ఠమై సూర్యుని వలె ప్రకాశించును.

తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్సత్పరాయణాః {5.17}

గచ్ఛ న్త్యపునరావృత్తి౦ జ్ఞాన నిర్ధూత కల్మషాః

బ్రహ్మమునందే బుద్ధి గలిగి, దాని యందే మనస్సు కలిగి, దానియందే నిష్ఠ కలిగి, దానినే పరమ గతిగ భావించు జ్ఞానులు జ్ఞానముచే పాపములను పోగొట్టు కొనిన వారై పునర్జన్మ లేని మోక్షమును పొందుచున్నారు

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని {5.18}

శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః

విద్యా వినయములుగల బ్రాహ్మణుని యందును, గోవు నందును, కుక్కయందును, చండాలుని యందును పండితులు సమదర్శనము చేయుదురు ఀ

శ్రీకృష్ణుడు సమదర్శిన -- అనగా అందరినీ సమానంగా చూడడం, అందరి యందు సమానమైన ప్రేమ కలిగి యుండడం--అనే పదప్రయోగం చేసేడు. దేవుని నమ్ముకున్న వారు, అందరినీ ప్రేమించి, గౌరవిస్తారు. వేరే మతం, దేశం, జాతి, సంస్కృతి ఉన్నవారిని హేళన చెయ్యరు. జీవైక్య సమానత గురించి తెలిసికొ౦టే, మనము ఇతరులకన్న ఉత్తమమైన వారలమనే భావన -- వారికీ, మనకీ ఎంత తేడా ఉన్నా-- కలుగదు.

ఇతరులని పైపై ప్రేమించి, గౌరవించే పద్దతి మార్చుకోవాలి. మనము అందరినీ అర్థం చేసికొని, దయతో మెలగాలి. కొంత మంది పైపై ఎంతో సంస్కృతి గలవారిగా కనిపించి, లోపల తమ దేశమే, జాతే, మతమే గొప్పదనే భావనలో ఉంటారు. కొన్ని పుస్తకాల రచయితలు, తెలిసో, తెలీకో, ఇతర మతాలను, సంస్కృతులను, దేశాలను హేళన చేస్తారు.

బ్రిటిష్ వారిని మనకన్నా ఉత్తములని భావించి మనము అనేక సమస్యలు ఎదుర్కొన్నాము. వేరొకరి పరిపాలనలో మన యందు ఉన్న నమ్మక౦, గౌరవం క్షీణిస్తుంది. ఈ విధంగా ఆసియా, ఆఫ్రికా లలో వలస రాజ్యాల పరిపాలనలో ఒక రకమైన మనోదౌర్బల్యం ఏర్పడింది. పాశ్చాత్య దేశాలు ఎవరి క్రింద ఏలబడక, వలస రాజ్యాలను స్థాపించడం వలన, వారిని ఆసియా, ఆఫ్రికా వాసులు పూర్తిగా నమ్మరు.

గాంధీజీ వలస రాజ్యాల వలన ఏలబడిన ప్రజలేకాక, ఏలే వారు కూడా నష్టపోతారు అని అన్నారు. చాలామంది బ్రిటిష్ యువకులు పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులయి, ప్రజలకు ఎంతో సేవ చెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ, మన దేశానికి వచ్చి, కొంత కాలం తరువాత తామే మనకన్నా ఉత్తమమైన వారలమనే భావ మార్పిడి చేసికొన్నారు. అలాగే కొందరు బ్రిటిష్ ప్రజలు, గాంధీజీ యొక్క స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించి, ఆయనకు అండగా నిలబడ్డారు. అనేకమంది బ్రిటిష్ దేశస్తులు మన దేశంలో స్థిరపడి ఇప్పడికీ ఇక్కడే నివసిస్తున్నారు.

మనం ప్రేమ, గౌరవం మన కుటుంబ సభ్యుల యందు సమానంగా చూపాలని భావిస్తాం. మనకన్నా వేరే స్థిర భావాలు గలవారి గురించి ఆందోళన చెంద౦. తరం మారిన తరువాత మన భావాలను ఎదుర్కొని, మనల్ని, ఇతరులని వారి భావాలతో ముడిపెట్టి చూడడం మనకి భయం కలిగిస్తుంది. అది ఎలాగంటే మన ఒంటి ఛాయలలో బేధం వలన ప్రభావితం కాకూడదు. అది వేర్వేరు రంగుల చొక్కాలు వేసికొన్నట్టే. అలాగే భావాలు కూడా: అవి వేరైనప్పటికీ ఇతరుల యందు ప్రేమ, గౌరవము కలిగి ఉండాలి. తరాల మధ్య ఎంతో బేధమున్నా, క్రొత్త భావాల వలన మన కుటుంబానికి మేలు జరగవచ్చు. వృద్ధులు తమ అనుభవంతో, తమకన్నా చిన్న వారికి మంచి సలహాలు ఇవ్వగలరు. అలాగే యుక్త వయస్కులు క్రొత్త భావాలతో ఇంటికి సజీవత్వము, నూతనత్వము కలిగిస్తారు. చిన్న పిల్లలు తమ అమాయకత్వముతో అందరినీ అలరిస్తారు.

శ్రీకృష్ణుడు భూత దయ కలిగి ఉండమని కూడా బోధిస్తున్నాడు. ఎందుకంటే జంతువులలోనూ దేవుడు ఉన్నాడు. జంతువులు తమని ప్రేమించే వ్యక్తులను గుర్తు పెట్టుకుంటాయి. 319

Eknath Gita Chapter 5 Section 7

Bhagavat Gita

5.7

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ {5.13}

నవద్వారే పురే దేహే నైవ కుర్వ న్న కారయన్

కర్మయోగి సమస్త కర్మలను మనసుచే సన్యసించి, తాను చేయక, చేయించక, నవద్వారపురమగు శరీరమునందు సుఖముగ ఉండును

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః {5.14}

న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే

పరమాత్మ కర్తృత్వమును గాని, కర్మములను గాని, కర్మ సంబంధమును గాని కలుగజేయడు. సృష్టి యందు ప్రకృతి స్వభావము అలా ప్రవర్తించుచున్నది

నా దత్తే కస్య చి త్పాపం న చైవ సుకృతం విభుః {5.15}

అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్వన్తి జంతవః

జనుల యొక్క పాపపుణ్యములను పరమాత్మ గ్రహింపడు. జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి యున్నది. అందుచేత జనులు మోహము నొందుచున్నారు

జీవితాన్ని ఆనందంగా అనుభవించాలంటే మనము త్యజించవలసింది, ప్రపంచం కాక, అహంకారం. మనము అహంకారాన్ని పారద్రోలాలని ఎంత ఆలోచించినా సాధ్యం కాదు. ఇతరుల గురించి ఆలోచిస్తూ, వారిని మనకన్నా ఎక్కువ ప్రేమిస్తూ, నిస్వార్థంగా సేవ చేస్తే తప్ప అహంకారం పోదు.

ఇక శ్రీకృష్ణుడు చెప్పే రెండో అంశం దేహం తొమ్మిది ద్వారబంధాలతో కూడిన పురం. మన రెండు కళ్లలోంచీ దృశ్యాలు వస్తూ వుంటాయి. అలాగే మన రెండు చెవులనుంచి మనకి ఇష్టమున్నా లేకపోయినా వార్తలు వస్తాయి. మనలో చాలామంది దేహంతో తాదాత్మ్యం చెంది, తాము అ౦దులో నివసించే వారలమనే జ్ఞానాన్ని పొందలేదు. అందువలన వారు ఇతరులగురించి ఎక్కువ పట్టించకోకుండా బ్రతుకుతారు. మనకు ప్రియమైన వారిని సరిగ్గా చూడం. ఎన్నేళ్ల క్రింద పెళ్ళయినా మన సహ ధర్మచారిణిని పూర్తిగా చూడం. అలాగే కుటుంబంలో అందరితోనూ కాలం గడిపి వారెవరో చూడకుండా పోతాం. నిజానికి వారంతా దేహమనే పురంలో నివసించే ఆత్మలు.

మనం గతంలో ఎన్ని తప్పులు చేసినా --అంటే తెలీక చేసినవి-- శ్రీకృష్ణుడు మనల్ని విడనాడడు. ఆయన అందరిలోనూ ప్రతిష్ఠితమై ఉన్నాడు. కాబట్టి ఒకడెన్ని తప్పులు చేసినా, వానిని ద్వేషించడు. మనము తప్పుల మీద తప్పులు చేసినవారి నుండి దేవుడు వేరుకాలేదని మరచిపోతాం. తప్పు చేయడాన్ని నియంత్రించి, తప్పు చేసినవాడిని ప్రేమించడం చాలా కొద్దిమందికి తెలుసు. ముఖ్యంగా తెలియక చేసిన తప్పుల విషయంలో ఇది వర్తిస్తుంది. మనము ఒకనిలోని స్వార్థాన్ని దూరంగా పెట్టి, వాని స్వస్వరూపాన్ని ప్రేమించడం ఆధ్యాత్మిక సాధనలో ఒకానొక లక్ష్యం. ఒకడు అహంకారం, స్వార్థంతో కూడి ఉంటే, వాడు జీవించడానికి పనికిరాడని నిర్థారించకూడదు. వారిలో దేవుడున్నాడని గుర్తించి, వారిని ప్రేమించి, గౌరవించి, అహింసతో వారిని చూచి, సహనంతో వారు పెట్టే బాధలను అనుభవించాలి. ఎందుకంటే వారికి తప్పులు చేస్తున్నామనే జ్ఞానము లేదు.

తప్పులు ఎదుగుతున్న వయస్సులో సహజంగా జరుగుతాయి. కాబట్టి గతంలో చేసిన తప్పుల గూర్చి ఆలోచించకూడదు. చేసిన తప్పును మళ్ళీ చెయ్యకపోవడం ఉత్తమం. ప్రతి తప్పుకి పర్యావసానము ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాలు ఉండచ్చు. మనం ఒక పెద్ద నిర్ణయం తీసికొన్నప్పుడు, దాని నుండి ఎంతో ఆశించి, మనకు, ఇతరులకు కలుగబోయే దుఃఖాన్ని తక్కువ అంచనా వేస్తాము. మనం చేసే కర్మలోనే మనం పొందే ఫలం యొక్క బీజముందని తెలిసికోం. మనము తప్పు సాధనాలతో, మంచి గమ్యం ఎప్పటికీ చేరలేము. మంచి సాధనాలలో మంచి లక్ష్యాలు అంతర్లీనమై ఉన్నాయి. 315

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...