Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 13

Bhagavat Gita

6.13

యుక్తాహార విహారాస్య యుక్తచేష్టస్య కర్మసు {6.17}

యుక్త స్వప్నాబోధస్య యోగో భవతి దుఃఖహా

మితమైన ఆహార విహారములు, మితమైన నిద్రయు, మెలుకయు గలవానికి, కర్మలయందు ఉచితరీతిన చరించువానికి, ఈ యోగము దుఃఖమును పోగొట్టును

మనము మానసికంగా ఎదగాలంటే విషాదం అవసరం. దేవుడు ఒక దేహ శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయునివలె నుండి, మనలోని స్వార్ధ పరులను, అహంకారులను ఉద్దేశించి కొన్ని శిక్షలు విధిస్తాడు. అదే నిస్వార్థ పరులు, పరోపకారులు దేవుని శిక్షకు పాత్రులు కారు. అంటే వారు స్వార్థం, అహంకారం వీడి ఉన్నవారు.

మన దుఃఖాలను గుర్తు తెచ్చుకుంటే, అవి మనం చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడానికి తోడ్పడుతాయి. నేను చిన్న వయస్సులో అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసి దుఃఖమనుభవించేను. కానీ నా అమ్మమ్మ సహాయంతో, వేర్పాటుతో లేదా స్వార్థంతో బ్రతకడం మానుకొని, క్రోధం లేకుండా, భూత దయతో కూడి బ్రతికేను. నేను దుఃఖం గూర్చి ఎన్నో పాఠాలు నేర్చుకొని జీవితంలో చేసిన తప్పులు చెయ్యకుండా ఉన్నాను. ఈ విధంగా స్వార్థ కర్మలు విడిచిపెట్టి, మన అహంకారాన్ని బంధుమిత్రుల యందు, సమాజం మీద, చివరకు శత్రువుల మీద కూడా ప్రదర్శించక ఉంటే యాతన పడవలసిన అవసరం లేదు. 360

Eknath Gita Chapter 6 Section 12

Bhagavat Gita

6.12

నాత్యశ్న తస్తు యోగో అస్తి నచై కాంత మనశ్నతః {6.16}

న చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున

అర్జునా! ఈ యోగము అధికముగ భుజించు వానికి, అసలే భుజించని వానికి, అతిగ నిద్రించువానికి, అసలే నిద్రించని వానికి ఫలించదు

మనమేది చేసినా మితంగా చెయ్యాలి. ఇంద్రియాలను పరిమితి లేకుండా లేదా అతి తక్కువగా వాడడం మంచిది కాదు. అలాగే అపరిమితమైన ధనము, ధనము లేమి; అమితమైన జ్ఞానము, అంతులేని అజ్ఞానము; సదా కర్మలు చేయుట, అమితమైన సమయం కర్మలు చేయకుండుట కూడా మంచివి కావు. అన్ని రంగాలలోనూ సమంగా ఉండడమనే క్రమశిక్షణను అందరమూ పాటించవచ్చు.

చాలా మంది అతిగా ఆహారం తింటారు. వారికి ఉంకో వాయి వద్దనే కోరిక లేదు. మితంగా తినేవారు ఆహారం ఇంకా గిన్నెలో ఉన్నా వద్దని లేచిపోతారు. అది మొదట్లో కష్టమే; కాని అటు తరువాత భుజి౦చిన ఆహారమును ఆస్వాదించే స్థితి కలుగుతుంది. నేను రోజుకు మూడు సార్లు: ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, తినమని చెప్తాను.

నాలుకను నియంత్రించుకోవడానికి అనేక పద్దతులు ఉన్నాయి. ఒక తీపి పదార్థాన్ని తినే బదులు దీర్ఘమైన నడక చెయ్యవచ్చు. అటు తరువాతి మనస్సు మళ్ళి, తీపి పదార్థాన్ని కోరక, ఆహారంతో సంబంధం లేని వేరొకటి కోరుతుంది. ఈ విధంగా మనస్సును, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవాలి.

ఇటువంటి చిట్కాలు పాటించి మనస్సును స్వాధీనంలో పెట్టుకోవచ్చు. కానీ అదే పనిగా దానిని హింస పెట్టనక్కర లేదు. దానిని సున్నితంగా, ఓర్పుతో సాధించాలి. ఎందుకంటే మనమిన్నాళ్ళూ దానికి స్వతంత్రత నిచ్చి, ఒకటి, రొండు రోజుల్లో క్రమశిక్షణతో మెలగమనడం సాధింపలేని కార్యము. ఒక్కొక్కప్పుడు అమితమైన ద్వేషం, ఆందోళన, ఒత్తిడి కలగవచ్చు. అప్పుడు ఒక రోజు ఉపవాసం చెయ్యడం శ్రేయస్కరం. అలాగని శక్తి లేకుండా, నిర్జీవంగా ఉండనక్కరలేదు.

మితిమీరిన నిద్ర దేహానికి, మనస్సుకు, ధ్యానానికి అవరోధాలు కల్పిస్తుంది. మనమెక్కువగా నిద్రపోతే సవాళ్ళను ఎదుర్కోలేము. అతి నిద్ర: "నాకు మానవునిగా బ్రతకడం ఇష్టం లేదు; ఒక చెట్టు లేదా రాయిగా ఉంటాను" అని చెప్పడం. అలాగే నిద్ర లేమి కూడా ధ్యానానికి అవరోధం. రాత్రి నిద్రకు ఎంతవేగిరంగా ఉపక్రమిస్తే అంత వేగిర౦; ఉదయాన్నే వేగిర౦గా లేవడం అలవరచుకోవాలి. నిద్రకు తొందరగా, లేదా ఆలస్యంగా ఉపక్రమించడం. నిద్రనుండి తొందరగా లేదా ఆలస్యంగా లేవడం; అతిగా తినడం లేదా సరిగ్గా తినకపోవడం; క్రోధంతో లేదా దైన్యం తో ఉండడం మొదలగునవి మన ఆలోచనల, మాటల, కర్మల వలన ఏర్పడతాయి. వాటిని ధ్యానంతో నియంత్రించవచ్చు. 359

Eknath Gita Chapter 6 Section 11

Bhagavat Gita

6.11

యుంజన్నేవం సదాత్మానా౦ యోగీ నియతమానసః {6.15}

శా౦తిం నిర్వాణ పరమాం మత్సంస్థా మధిగచ్ఛతి

ఈ విధముగా మనస్సును నియమించి, ఆత్మ ధ్యానము నందు మనసును నిలిపిన యోగి నా స్వరూపము, ఉత్కృష్ట పదమునైన శాంతిని బొందుచున్నాడు

శ్రీకృష్ణుడు నిర్వాణమును గూర్చి చెప్పుచు, ఎవరైతే ఉత్సాహముతో సదా ధ్యానం చేసి, ఇంద్రియాలకు తర్ఫీదునిచ్చి, మనస్సును స్వాధీనంలో పెట్టుకొని ఉంటారో వారు జీవైక్య సమానతను తెలిసికొని నిర్వాణమును పొందును అని చెప్పెను. అట్టి వారికి నిర్వాణము ఎక్కడో కాదు, ఇక్కడే, ఈ జన్మలోనే కలుగుతుంది. బుద్ధుడు ధమ్మపాద లో ఇలా చెప్పెను: ఎవరైతే స్వార్థ బుద్ధితో జీవిస్తారో ఈ జన్మలోనూ, రాబోయే జన్మలోనూ దుఃఖమనుభవిస్తారు; కానీ నిర్వాణము పొందినవారు ఈ జన్మలోనూ, పునర్జన్మలోనూ అమితమైన ఆనందం పొందుతారు. ఈ జన్మలోనే నిర్వాణం పొందవచ్చు; అలాగే కుటుంబంలో నివసిస్తూ, అన్ని జీవులలోనూ దేవుని దర్శించువారు, తమలోనే స్థితమై ఉంటారు. 357

Eknath Gita Chapter 6 Section 10

Bhagavat Gita

6.10

సమం కాయశిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః {6.13}

సంప్రేక్ష్య నాసికాగ్ర౦ స్వ౦ దిశశ్చా నవలోకయన్

ప్రశా౦తాత్మా విగతభీ ర్బ్రహ్మచారి ప్రతే స్థితః {6.14}

మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః

యోగియగువాడు శరీరమును, కంఠమును స్థిరముగ నిలిపి, దిక్కులపై దృష్టిని సారించక, నిర్భయుడై, బ్రహ్మ చర్య దీక్షయందు కొనసాగుచు, నా యందే చిత్తము నుంచి, నన్నే పరమగతిగా భావించి యుండవలెను

పై శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ధ్యానం చేసే పద్దతి వివరిస్తున్నాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు తెరిచినంత కాలం మన వెన్నెముక, తల నిటారుగా ఉంటాయి. కళ్ళు మూసుకొని ధ్యానం లోకి ఏకాగ్రతతో, ఇంద్రియ నిగ్రహణతో, ఆలోచనలను నియంత్రించి, లోతుగా వెళ్తే, మన నాడీ వ్యవస్థ సమమవుతుంది. కానీ అప్పుడు భుజాలు, ఛాతీ, తల వంగి ఉండవచ్చు. అలాటప్పుడు మన వీపును ఆనించిన దాని -- కుర్చీ, గోడ -- నుండి సరిచేసి, మళ్ళీ వెన్నెముక, మెడ, తల నిటారుగా పెట్టడానికి ప్రయత్నించాలి.

ధ్యానంలో చాలా మందికి నిద్ర వస్తుంది. అలాటప్పుడు మనము పట్టుదలతో ఉండాలి. సమాధి స్థితిలో నిద్ర వస్తే మనము చేయగలిగేది ఏమీ లేదు. నిద్ర వచ్చినప్పుడల్లా పట్టుదలతో ఉండి, వెన్నెముకను నిటారుగా పెట్టి, అవసరమైతే కళ్ళు తెరిచి ఉంచాలి.

ధ్యానం ద్వారా మన పట్టుదలను పెంచుకొని, ఆహారాన్ని తగు మోతాదులో తింటాము. అలాగే అన్ని ఇంద్రియ వ్యాపారాలు ప్రభావితమౌతాయి. మనస్సు ఆందోళనగా ఉంటే, బంధు మిత్రులు మనతో విభేదాలు కలిగి ఉంటే, వారితో ఏకీభవించి వారి మార్గాన్ని అనుసరించాలి. అలా చేస్తే ధ్యానంలో అలజడి లేక నిద్ర ఎన్నటికీ రాదు. ఇలాగ మనం ఇతరుల సంతోషానికై ప్రయత్నిస్తే ధ్యానంలో ఎన్నటికీ నిద్ర రాదు. అలాగే, కొంత బాధాకరమైనా, మనకి పూర్ణమైన సంతృప్తి కలిగుతుంది.

వెన్నెముక ఎందుకు నిటారుగా ఉంచాలో యోగులు చెప్పే కారణం: వెన్నముక క్రింద భాగమున కుండలిని శక్తి సర్పము వలె చుట్టలు చుట్టుకొని ఉంటుంది. మనము ఇంద్రియాలను నియంత్రించి, ఇతరుల క్షేమాన్ని మన క్షేమం కన్నా ముఖ్యమని తలచి ఉంటే, కుండలిని శక్తి తల వైపు ప్రయాణం చేసి మన చేతన మనస్సును ప్రభావితం చేస్తుంది.

శ్రీకృష్ణుడు కళ్లను గురించి కూడా చెప్పేడు. ఎందుకంటే కళ్ళు మానసిక స్థితికి అద్దం పడతాయి. ఒకడు కోపంతో, విచారంతో లేదా ఆందోళనతో ఉన్నప్పుడు కనుపాపలు నిశ్చలంగా ఉండవు. మనస్సు నిశ్చలంగా ఉండి, హృదయం నిండుగా ఉంటే, కనుపాపలు కూడా సమంగా ఉండి, కాంతిని ప్రసరిస్తాయి. మన కళ్ల సౌందర్యాన్ని ప్రకటించాలంటే, ధ్యానం ద్వారా మనస్సు నిశ్చలం చేసికోవాలి.

ధ్యానం గాఢమైతే, మనస్సు ప్రశాంతతో నుండి, గాబరాగా ఉన్నవారు మనవలన ఉపశమనం పొంది, క్రోధంతో ఉన్నవారు మనతో సామరస్యంగా ఉంటారు. మనము బోధ లేదా సలహాలు ఇవ్వకపోయినా, మన నడవడిక, భూత దయ, ఇతరులను ప్రభావితం చేస్తాయి. మనము బాహ్య కాలుష్యం గురించే ఆలోచిస్తాం; నిజానికి అంతర్గతంలో కూడా కాలుష్యము౦ది. ఒక కోపిష్టి తన కుటుంబాన్ని విచారంలో పెడతాడు. ఒక వ్యక్తి చాలా కాలం ఆందోళనతో ఉంటే, వానికి మారడం కష్టమవుతుంది. మనము హింసను ఎప్పటికీ చెయ్యక, ప్రతీకారం తీర్చుకోకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, మనని ద్వేషించిన వారితో కూడా ప్రేమతో ఉంటే మనము ఆందోళనతో ఉన్నవారిలో మార్పు తెప్పించవచ్చు.

కోపిష్టులు అనేక భయాలకు గురైనవారు. గాంధీజీ ఒకడు తుపాకీతో నడుస్తున్నాడంటే వానికి అనేక భయాలున్నాయని చెప్పేరు. మనము ఇతరులను నమ్మి, వారిని గౌరవిస్తే అన్ని భయాలు పోతాయి. కొందరు ఎదగడానికి భయపడతారు. ఎదగడమంటే జీవితంలో బాధ్యత వహించి, ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంతో, సహనంతో, భద్రతతో కూడి ఉండడం. మనము దేవుడు అందరిలోనూ ఉన్నాడు, ఇతరులలో కూడా ప్రేమ స్వభావము ఉందని నమ్మితే మన భయాలు పఠాపంచలవుతాయి.

ఎవరి చేతన మనస్సు అఖండంగా లేదో వారికి అనేక భయాలుంటాయి. మన వేర్పాటును, ఇతరులకన్నా మనమే ముఖ్యమనే భావాలు వదిలించుకొ౦టే, మన బంధుమిత్రులతోనే కాక, మన శత్రువులతో కూడా సమంగా ఉంటాము. ధ్యానం మనలోని భేద బుద్ధి, చెడ్డ ఆలోచనలు నియంత్రించి మన బంధుమిత్రులతోనూ, చివరకు శత్రువులతోనూ, సామరస్యంగా ఉండేలా సహకరిస్తుంది. మన వేర్పాటు అనే అవరోధాన్ని దాటి, అహంకారాన్ని తగ్గించుకొని, ఉంటే మనస్సులోని అన్ని భయాలను నియంత్రించి, ప్రశాంతతో నుండి ఆ భగవానునే పొందగలము. 356

Eknath Gita Chapter 6 Section 9

Bhagavat Gita

6.9

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిర మాసన మాత్మనః {6.11}

నాత్యుచ్చ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్

త త్రైకాగ్ర౦ మనః కృత్వా యత చిత్తే౦ద్రియక్రియః {6.12}

ఉప విశ్వా ఆసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే

పరిశుభ్రమైన ప్రదేశము నందు మిక్కిలి ఎత్తును, మిక్కిలి పల్లమును కాని చోట ఆసనముగా దర్భలును, మృగచర్మమును, వస్త్రమును క్రమముగ ఉంచి, దానిపై కదలకుండా కూర్చుండి, ఇంద్రియ మనస్సులను వశపరచుకొని, మనస్సును ఏకాగ్ర మొనర్చి ఆత్మశుద్ధి కొరకు యోగము నభ్యసింపవలెను

ఇక్కడ శ్రీకృష్ణుడు ధ్యానం చెయ్యడానికి శుద్ధమైన ప్రదేశము -- అనగా శుభ్రమైన గాలితో కూడినది , ప్రశాంతత కలిగినది, కాలుష్య౦ లేనిది--ఎంచుకో మంటున్నాడు. అటు పిమ్మట మనము కూర్చునే విధానం ఇలాగ ఉండాలి: అది ఎత్తుగా ఉండకూడదు; నేలపై కూర్చోవడం ఉత్తమం; వీలయితే దర్భలు లేకపోతే ఒక మెత్తని దిండు మీద కూర్చోవాలి. ఇక్కడి ముఖ్యాంశం ఏకాగ్రత. పూర్తి పద్మాసనం, లేదా అర్థ పద్మాసనం, వేయవచ్చు. రమణ మహర్షి చెప్పినట్లు ఎక్కడైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందో అదే సరి అయిన ఆసనం.

ధ్యానంలో కూర్చోవడానికి మనం దేహాన్ని, మనస్సుని నిశ్చలంగా ఉంచాలి. దానివలన మనస్సు దేవునిపై కేంద్రీకరింప బడుతుంది.

ఎక్కడ కూర్చున్నా వెన్నెముక నిటారుగా ఉండాలి. మనస్సు చంచలంగా ఉన్నా, నిద్ర వచ్చినా ఆ నియమం పాటించాలి. ధ్యానంలో కొందరి తలలు క్రిందకి వంగవచ్చు, లేదా శరీరము ముందుకీ, వెనక్కీ కదులుతూ ఉండవచ్చు. మన వీపు దేనిమీదైతే ఆనించబడిందో దానిని చక్క చేసికోవాలి.

ఎవరికైతే ఏకాగ్రత లేదో వారికి త్వరగా నిరాశ కలుగుతుంది. దాన్ని చక్కబెట్టుకోవాలంటే మన౦ చేస్తున్న పనిమీద పూర్తి శ్రద్ధ కలిగి ఉండాలి. అలా చేస్తే మన పనిలో నాణ్యత పెరిగి, మనలో ఉత్సాహం కలుగుతుంది. మనలో చాలామంది పూర్తి ఏకాగ్రతను స్వతంత్రంగా చూపలేము. మనకి ఇష్టమైన పనుల మీద అది సాధ్యం. కొంతమంది లెక్కలు చెయ్యడంలో పూర్తి ఏకాగ్రత చూపిస్తారు. కానీ వారికి సాహిత్యం ఇస్తే వారిలో నిరాశ కలుగుతుంది. మనకిష్టం లేని పని ఒక పెద్ద సవాలు. బద్దకం, వెన్ను నొప్పి, ఇంకా అనేకమైన కారణాల వలన కూడా అది కలగవచ్చు. అలాంటప్పుడు మనస్సుతో చిన్న చిన్న అడుగులు వేయించి ముందుకు తీసుకువెళ్ళాలి. ఉదాహరణకు చలి కాలంలో చన్నీళ్ళతో స్నానం చేయాలంటే ఒకే మారు నీళ్ళు పోసుకోం. మొదట కాళ్ళూ, చేతులూ చన్నీళ్లతో కడుగు కొంటాం. క్రమంగా శరీరమంతా చన్నీళ్లతో తడుపుతాం.

జీవితంలో విజయం పొందాలంటే ఏకాగ్రత ఎంతో ముఖ్యమైన అంశం. మనందరికీ ఇష్టంలేని చిన్నా చితకా పనులు అనేకం ఉంటాయి. అవి వేరొకరు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. వాటిని ఇష్టం ఉన్న పనులతో కలిపి ఒక జాబితా తయారుచేయాలి. ఆ జాబితాలోని పనులను క్రమంగా చేసుకుపోతూ ఉంటే మనము ఇషాయిష్టాలకు అతీతమై, ఏ పనైనా ఏకాగ్రతతో చేయగలుగుతాం. 353

Eknath Gita Chapter 6 Section 8

Bhagavat Gita

6.8

యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః {6.10}

ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః

యోగి యగువాడు ఏకాంతమున యుండి, ఇంద్రియ మనస్సులను వశపరచుకొని, ఆశలు లేనివాడై, ఇతరులనుండి దేనిని ఆశించక సదా మనస్సును పరమాత్మయందే ఉంచవలెను

ధ్యానంలో మనం ఏకాగ్రతని పొందవచ్చు. ప్రతి సాధకుడు ఏకాగ్రతను అలవరచుకోవాలి. అది ఎలా సాధ్యమంటే ఒక పని చేస్తున్నప్పుడు, వేరొక పని గురించి ఆలోచింపక, దాని మీద సంపూర్ణమైన శ్రద్ధ చూపాలి. ఏకాగ్రతకి, విశ్వాసమునకు దగ్గిర సంబంధం ఉంది. ధ్యానం ద్వారా ఇతరులయందు ప్రేమ, విశ్వాసములతో, ఎటువంటి అవాంతరాలు వచ్చినా, ఉండగలము.

ఏకాగ్రతని పొందాలంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. చాలాసార్లు మనస్సు యొక్క ఆందోళన కళ్ళలో వ్యక్తమవుతుంది. ఆందోళన పడుతున్నప్పుడు కనుపాపలు ఒక చివర్నించి, ఉంకో చివరకు ఊగిసలాడుతూ ఉంటాయి. మనము వాటికి ఒకే చోట నిలకడగా ఉండేటట్టు తర్ఫీదు ఇవ్వాలి. క్రమంగా మనస్సు నిశ్చలంగా ఉంటే కనుపాపలు కూడా కదలకుండా ఉంటాయి.

మనము ఏకాగ్రత కలిగిఉండాలంటే మనం చేసే పని మీద సంపూర్ణమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఉదాహరణకి ఆహారం తింటున్నప్పుడు, పుస్తకము చదవక, లేదా టివి చూడక, దానిపై పూర్తి ఏకాగ్రత కలిగి ఉండాలి. అలాగే ఇతర ఇంద్రియాలను కూడా స్వాధీనంలో పెట్టుకోవచ్చు. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పూర్తి శ్రద్ధతో చెవులను రక్కి౦చి వినాలి. వాని మీద ఒక పక్షి వాలినా మనము ఏకాగ్రతను వీడకూడదు.

మనము చాలా వాటితో తాదాత్మ్యం చెంది ఉన్నాము. గలివర్ యొక్క సాహస యాత్రలలో గలివర్ ను ఒకసారి అనేక మరుగుజ్జులు కలసి తాళ్లతో బంధించేరు. అతడు వాటిని తేలికగా విడిపించుకున్నాడు. అదే విధంగా మనమనేక వస్తువులచే, మనుష్యులచే బంధింపబడి ఉన్నాము. ఇంకా స్వార్థం, అహంకారం వలన కూడా. ధ్యానం ద్వారా వాటినుండి విడిబడితే పూర్తి స్వతంత్రతను పొందవచ్చు. 351

Eknath Gita Chapter 6 Section 7

Bhagavat Gita

6.7

సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు {6.9}

సాధుష్యపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే

సుహృత్తులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషులు, బంధువులు, సాధువులు, పాపులు మొదలగు వారియందు సమబుద్ధి గలవాడు శ్రేష్ఠుడు

సమబుద్ధి అనే విశేషణానికి అర్థం అందరియందు సమమైన దృష్టి కలవాడు. దాని వలన తెలిసేది మనమంతా దేవుడి నుంచి ఆవిర్భవించి, దేవుని యందే నివసించి, చివరికి దేవునితోనే ఐక్యమవుతాము. అలాగే అందరితోనూ సామరస్యంగా ఉండడము సమబుద్ధి. సమాధి స్థితిలో మనమందరిలోనూ కొలువై యున్న దేవుని దర్శించి, జీవైక్య సమానతను తెలిసికొ౦టాము.

మనము సహాయము చేసిన వారలయందు, అడ్డంకులు కలిగించిన వారలయందు, మనతో మంచి సంబంధాలు కల వారలయందు, అలాగే ఎటువంటి సంబంధము లేని వారలయందు గౌరవముతో మెలగాలి. మన తలదండ్రులకు, మిత్రులకి, చివరికి శత్రువులకి గౌరవమివ్వ గలగాలి. అది మనకే కాక వారికి కూడా ఉపయోగపడుతుంది. ఒకరు ఎటువంటి గౌరవానికీ అర్హులు కాకపోయినా, మనము గౌరవిస్తే స్పందించి మనయందు గౌరవంతో ఉంటారు. మిక్కిలి అహంకారియందు మన నమ్మికను ఉంచి, ఎదగడానికి ప్రయత్నము చేస్తాడని విశ్వశిస్తే అతడు తప్పక మన అంచనాకు వస్తాడు. ఇతరులు మనయందు ఎటువంటి నడవడికను చూపిస్తారని విచారపడక, వారిపై ఎలా స్పందించాలని సదా ఆలోచించక ఉండాలి. "మీరు ఒక అడుగు ముందెయ్యండి. అది ఎంత పొడవో నిర్ణయించి, నేనూ ఒక అంగుళం అటుఇటూ కాకుండా అడుగేస్తాను" అని అంటే మన క్రియలు ఇతరుల క్రియలపై ఆధారపడి, క్రమంగా మన౦ చిన్నచిన్న అడుగులు వేసి, చివరికి అడుగువేయకుండా ఆగిపోతాం. మన అనుబంధాలలో గౌరవము, ప్రేమ ముఖ్యమైన అంశాలు. ప్రత్యుపకారం ఆశించక, ఇతరులకు సేవ చేస్తే, ఇతరులు గాఢంగా స్పందించి వారిలోని దైవత్వాన్ని మనకి చూపుతారు.

నాగరీకులు నాయందు ప్రేమతో ఉంటే, మీయందు ప్రేమతో ఉంటాను; నన్ను ద్వేషిస్తే, మిమ్మల్ని ద్వేషిస్తాను అనే దృక్పథంతో ఉంటారు. ధ్యానాన్ని చేసి, శ్రీకృష్ణుని లాగ, జీసస్ క్రైస్ట్ లాగ, బుద్ధుని లాగ, మన వ్యక్తిత్వాన్ని మలచుకొని, మనము ఇతరుల స్పందనతో సంబంధం లేకుండా ఆనందంతో బ్రతకవచ్చు. ఇదే నిజమైన స్వతంత్రత. ప్రస్తుతం మన౦ స్వతంత్రత అనుభవించడంలేదు. ఎందుకంటే ఇతరుల స్పందన గురించి విచారిస్తున్నాము. అలాకాకుండా ఉంటే మనమే కాకుండా, ఇతరులు కూడా స్వతంత్రతను అనుభవిస్తారు. మనము కలిసే క్రొత్త వ్యక్తులు మనను చూసి జంకు పడక, మనతో సామరస్యంగా ఉంటారు.

కుటుంబంలో ఒక్క అహంకారి ఉంటే చాలు, వాని యందు అందరూ జంకుతో ఉంటారు. ఇది ఒక అప్రయత్నమైన స్పందన: "నన్ను అతడు ఇబ్బంది పెడతాడు." మనమెప్పుడైతే సానుకూలంగా ఉంటామో, ఇతరులు ఇబ్బంది పడక మనయందు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అనుబంధాలలో ఇబ్బందులు శాశ్వతంగా తొలగించాలంటే ఇతరుల క్షేమాన్ని మన క్షేమంకన్నా మిన్నగా చూడాలి.

ఒక వడ్రంగి బల్ల చేస్తున్నప్పుడు బల్ల కాళ్ళు విడి విడిగా చేస్తాడు. వాటికి అనేకమైన అతుకులు ఉండవచ్చు. కానీ బల్ల పూర్తిగా చేసిన తరువాత ఆ అతుకులు కనిపించవు. అలాగే ఇతరుల లోపాల గురించి తక్కువ ఆలోచించి, వారిని మిత్రులుగా చేసికొని వారి స్పందనకై ఎదురచూడకుండా, మన దృష్టిని మనమెలా నడచుకోవాలో అన్న అంశం మీద కేంద్రీకరి౦చాలి. అలా చేస్తే ఇతరులు మనల్ని చికాకు పెట్టినా, వారిని ఆదరిస్తాం.

మనలో చాలామంది విభిన్న స్థిర భావనలు ఉన్నవారాలతో జీవిస్తాము. ప్రతి ఒక్కరి భావాలు, దృక్పథం మనకన్నా విభిన్నంగా ఉంటాయి. కానీ మనందరిలో ఒక హారంలో సూత్రం వంటి తత్త్వం కూడా ఉంది. నన్ను "మీరు అమెరికాకి వచ్చి 12 ఏళ్లు అయింది. మీకు అమెరికా నచ్చిందా?" అని అడిగేవారు. నేను ఇచ్చే సమాధానం "నాకు అక్కడ ఎలా వుందో ఇక్కడ కూడా అలాగే ఉంది" ఏ దేశం లేదా ఖండం వారలమైనా --ఆఫ్రికా, అమెరికా, యూరోప్, ఇండియా -- మన అంతర్గతంలో తేడాలు లేవు. మన ప్రత్యేకత మనలోని అంతర్గతమంతా ఒక్కటే. దానిమీద దృష్టి కేంద్రీకరిస్తే జీవైక్య సమానతని గ్రహిస్తాము. 349

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...