Sunday, April 10, 2022

Eknath Gita Chapter 11 Section 24

Bhagavat Gita

11.24

సంజయ ఉవాచ:

ఇత్యర్జున౦ వాసుదేవ స్తథోక్త్వా స్వక౦ రూపం దర్శయామాస భూయః {11.50}

ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా

మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధముగ పలికి సౌమ్యరూపుడై తన పూర్వ రూపమును మఱల చూపెను. అర్జునుని ఓదార్చెను.

అర్జున ఉవాచ:

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్య జనార్దన! {11.51}

ఇదానీమస్మి సంవృత్త స్స చేతాః ప్రకృతి౦ గతః

కృష్ణా! నీ యొక్క ప్రసన్న మానవ రూపమును గాంచి నేను ప్రశాంత చిత్తుడనైతిని. నిర్భయుడనైతిని. ప్రసన్నతను బొందితిని.

శ్రీకృష్ణుడు విశ్వరూపమును చాలించి తన సహజ స్వరూపము దాల్చగా, అర్జునుడు మిక్కిలి సంతసించినవాడై శ్రీకృష్ణుని జనార్ధన -- అనగా ప్రజలని మత్తెక్కించు వాడు -- అని పిలిచెను. మత్తు అనగా మద్యము వలనని కాదు. ఇది దేవునిలో అంతర్లీనమైతే కలిగే ఆనందం.

జాన్ వూల్ మ్యాన్ అనబడే అమెరికా కు చెందిన క్వేకర్ ఇలా అన్నారు:

ఉత్తరానికి, తూర్పుకి మధ్య ఒక కాంతి విహీనమైన పదార్థాన్ని చూసేను. అది అతి దీన స్థితిలో ఉన్న సజీవమైన మానవాళి అని ఒకరు చెప్పేరు. నేను దానిలో ఒక్కడైన౦దున నేను వేర్పాటుతో ఉండలేను.

వూల్ మ్యాన్ చెప్పింది ఏమిటంటే మనము దేవుడి దయవలన జ్ఞానోదయము పొందితే కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. దేవుడు తాను కరుణించిన వారికి అతి క్లిష్టమైన కర్మని అప్పజెప్తాడు. అదేమిటంటే ఇతరులకు తాను పొందిన జ్ఞానాన్ని పంచిపెట్టడం. జ్ఞానోదయమైన యోగులు హిమాలయాల్లోనే ఉండి, క్రింద ఉన్న వారిపై చిన్న చూపు చూడవచ్చు. కానీ వారు ధ్యానంలో ఉంటే "మానవాళి దుఃఖాలతో బాధలను అనుభవిస్తూ ఉంటే, నేనిక్కడ ఉండి చేస్తున్నదేమిటి?" అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి వారు మరల జనుల మధ్యకు వచ్చి తమ జ్ఞాన మకరందాన్ని అందరికీ పంచి పెడతారు.

బుద్ధునికి నిర్వాణము పొందిన ముందు రోజున దుఃఖపూరితమైన మానవాళినుండి దూరంగా పోవాలనే భావన కలిగింది. మారా అనబడే దుర్భోదకుడు, బుద్ధుని నిర్వాణం లోకి వెళ్ళకుండా అనేక ప్రయత్నాలు చేసేడు. బుద్ధుని ఇంద్రియాలను ఐహిక సుఖాలవైపు త్రిప్పలేనని తెలిసికొని చివరగా ఇలా పలికెను: "మీరు నిర్వాణంలో సంపూర్ణమైన ఆనందం పొందేరు. ఈ స్థితిలోనే చిరకాలం ఉండిపోతే తిరిగి ప్రపంచానికి వెళ్ళనక్కరలేదు. ఒకవేళ వెళ్ళినా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకొంటారు? మీలాగా ఎవరు ప్రయత్నం చేస్తారు?" ఇది ఒక విచారకరమైన ప్రశ్న. ప్రతి జ్ఞానోదయమైన యోగికి ఈ ప్రశ్న కలుగుతుంది. బుద్ధుడు దానికి బదులుగా "బహుశా కొందరు నా బోధ విని, నన్ను నమ్మి, నేను చెప్పిన దాన్ని పాటిస్తారు" అని సమాధానమిచ్చెను.

ఇదే యోగులు కోరేది. వారు ధ్యానం గురించై సమస్త మానవాళి ఉత్సాహం చూపిస్తుందని తలచరు. ఎలాగైతే ఒక పద్మం వికసించినపుడు తుమ్మెదలు దాని వైపు వెళతాయో, శాశ్వతమైన సుఖాన్ని, భద్రతని కోరి, జనులు జ్ఞానోదయమైన యోగి పొందు కోరుతారు.

ఇలా జనుల మధ్యకు రావడం చాలా క్లిష్టమైన క్రియ. ప్రజల హృదయాలను తట్టి లేపాలంటే వారితో సహజీవనం చేసి, వారి వలె నిత్య కర్మలు చేసి, సదా దైవ చింతనలో ఉండాలి. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంత కష్టం. బయట ప్రపంచం హింసాకాండతో, దుఃఖంతో నిండి ఉన్నా, దేహం లోపల కొలువై యున్న పరమాత్మ నిత్య ప్రకాశవంతంగా ఉంటాడు. 320

Eknath Gita Chapter 11 Section 23

Bhagavat Gita

11.23

మా తే వ్యథా మా చ విమూఢభావో

దృష్ట్వా రూపం ఘోర మీదృజ్ఞ్మమేదం {11.49}

వ్యపేతభీః ప్రీతమనాః పున స్త్వ౦

తదేవ మే రూపమిదం ప్రపశ్య

భయంకరమైన నా ఈ విశ్వరూపామును గాంచి నీవు భయమును, చిత్త సంక్షోభమును పొందవలదు. నీవు భయమును విడచి సంతుష్టా౦తరంగుడవై నా పూర్వ రూపమును దర్శి౦చుము ఀ

దేవుడు ప్రేమించేవాడూ, శిక్షి౦చేవాడూ కూడా. కర్మ సిద్ధాంతం దాని పర్యావసానము. మనము ఏ విత్తు నాటేమో, దాని మొక్కే మొలుస్తుంది. ఆపిల్ విత్తు నుండి బొత్తాయి చెట్టు రాదు. ప్రపంచ యుద్ధాలు ఎక్కడో దైవ శక్తితో జరగలేదు. మానవాళే దానికి కారణము. హింసాత్మక ఆలోచనలు ఇతరులలోనే కాదు, మన అంతర్గతంలో కూడా ఉన్నాయి. ప్రపంచం వెళ్ళే దిశకు మనము కూడా బాధ్యులము. జీవించడమంటే మనం చేసే క్రియలకే కాక, మనం చెయ్యని క్రియలకు కూడా బాధ్యత వహించడం.

పెళ్లికి ఇద్దరు, జగడానికి ఇద్దర ఉండాలి. అలాగే మారణాయుధాలు అమ్మడానికి, కొనడానికి ఇద్దరు ఉంటారు. ధనిక దేశాలు వర్థమాన దేశాలకు కొన్ని కోట్ల విలువచేసే మారణాయుధాలను ఎగుమతి చేస్తున్నారు. దానికి బాధ్యులు: తయారు చేసేవారు, మంతనాలు జరిపేవారు, రవాణా చేసేవారు, నిల్వ చేసేవారు, వాటిని ఉపయోగించేవారు. వాటికి పౌరులందరూ బాధ్యులు. మనము ప్రపంచ పౌరులమని అనుకొంటే, వీటి పర్యావసానం ఎంత దూరం పోయిందో గ్రహించవచ్చు. మనము మారణాయుధాల తయారీని ఖండించకపోతే, అవి ఉపయోగింప బడినప్పుడల్లా మనము ఇతరులను హింసించేవారితో సమానం.

కాని ఇందులో ఒక వెసులుబాటు ఉంది. మనము మంచి కర్మలు చేసుకుంటూ పోతే అవి చెడు కర్మల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు దుష్ట శక్తులచే క్రుంగి పోక, తన వద్ద ఆశ్రయం పొందమని అర్జునునికి చెప్తున్నాడు.

దీనికై మనం గొప్ప పనులే చెయ్యనక్కరలేదు. మనకు వీలయినంతమటుకు సత్కర్మలు చేస్తూ ఉండాలి. మనము ప్రపంచ శాంతికై పోరాడాలంటే గొప్ప పేరుప్రతిష్ఠలు ఉన్నమారలమే కానక్కరలేదు. నా ఉద్దేశంలో ఐకమత్యంతో పౌరుల౦దరూ నిరశన వ్యక్తంచేస్తే అది రాష్ట్రపతులు, చట్ట సభల కన్న ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

మొదట మనోభావాలను ఇతరులకు ప్రకటించాలి. ఎంత మంది వింటారో అని విచారించనక్కరలేదు. మన భావాలలో సత్యము౦టే, అవి ఎప్పుడో అప్పుడు సరియైన పర్యావసానము చూపిస్తాయి. లింకన్ ప్రభుత్వము ప్రజల వలన, ప్రజల కొరకు అని చెప్పలేదా? అది ఇప్పటికీ సత్యం. మనము దినపత్రికలకు, నాయకులకు ఉత్తరాలు వ్రాయవచ్చు. మన తోటివారలను కూడా అలా చెయ్యమని ప్రోత్సాహించ వచ్చు. వాక్చాతుర్యము ఉన్నవారు సమావేశాలను ఏర్పాటు చేసి తమ భావాలను వివరించచ్చు. మిత్రులతో సమయం వెచ్చించి నప్పుడు, కొంత సమయం పత్రికలకు, నాయకులకు ఉత్తరాలు వ్రాయడానికై కేటాయించవచ్చు.

అటు తరువాత మనము హింసను ఎట్టి పరిస్థితులలోనూ, అంటే మనమంతట మనమే చెయ్యకపోయినా, సమర్థించకూడదు. మారణాయుధాలు చేసే సంస్థలలో, వాటిని సరఫరా చేసే మధ్యవర్తులతో, పని చెయ్యకూడదు. మనలో కొంచెం శాతమైనా ఈ విధంగా చేస్తే, మారణాయుధాలను నివారించవచ్చు. 318

Eknath Gita Chapter 11 Section 22

Bhagavat Gita

11.22

శ్రీ భగవానువాచ:

మయా ప్రసన్నేన తవార్జునే దం రూపం పరం దర్శితమాత్మ యోగాత్ {11.47}

తేజోమయం విశ్వమనంతమాద్య౦ యన్మే త్వదన్న్యేన న దృష్టపూర్వమ్

తేజోమయ మైనదియు, అంతము లేనిదుయు, ఆది యందున్నదియు నగు ఈ విశ్వరూపమును దయచేసి నీకు దర్శింపచేసితిని. నీవు తప్ప మరెవ్వరు గతములో ఈ రూపమును దర్శించలేదు

న వేదయజ్ఞాధ్యయన్నైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః

{11.48}
ఏవంరూపశ్శక్య అహం నృలోకే ద్రష్టు౦ త్వదన్యేన కురుప్రవీర!

అర్జునా! మానవ లోకము నందు నీవు దప్ప అన్యులెవ్వరు వేదాధ్యయనము వలనగాని, యజ్ఞములు, దానములు వైదిక కర్మలు, ఉగ్ర తపస్సులు మొదలగువాని చేతగాని నన్ను చూడలేరు. ఀ

మనం ఏ యోగినైనా దేవుని ఎలా కనబడతాడు అని అడిగితే వారు చెప్పేది: మేము అర్హుల మైనందుకు కాదు; ఆయన దయ వలన. మనం చెయ్యగలిగిందల్లా చిత్తశుద్ధితో ధ్యానం. చిట్ట చివరకి అహంకారాన్ని జయించి, మనమి౦క ముందుకు సాగలేకుంటాము. అప్పుడు మన నమ్మకంతో "నీవు ప్రత్యక్షం కాకపోయినా ఫరవాలేదు. నిన్ను మనసారా ప్రేమిస్తే చాలు. నాకు బదులుగా ఏమీ వద్దు" అని వేడుకొంటాం. సూఫీ యోగిని రబియా ఇట్లు చెప్పెను:

దేవా! నేను నిన్ను నరకం అంటే భయంవలన ప్రేమిస్తే

నన్ను నరకంలో పడేయ్

నేను స్వర్గ సుఖాలకై నిన్ను ప్రేమిస్తే

నన్ను స్వర్గం లోకి రానీయకు

కానీ నీ మీద ఉన్న ప్రేమతో ప్రేమిస్తే

నన్ను ఒంటరి దాన్ని చెయ్యద్దు

మనమిలాగ సంపూర్ణమైన ప్రేమతో దేవుడ్ని -- అల్లా, జీసస్, బుద్ధుడు, శ్రీకృష్ణుడు ఎవరినైనా -- ప్రార్థిస్తే క్రమంగా దేవునిలో ఐక్య మవుతాం.

"ఓ దేవా నేను మంచి కార్యాలు చేయడం మొదలు పెట్టడానికి, వాటిని చేయడానికి, విజయం పొందటానికి నీ కరుణ ఎంతో అవసరం. నీ కరుణ లేనిదే నేనేమీ చెయ్యలేను. కానీ నీ కరుణ నన్ను బలోపేతం చేస్తే నేనన్ని పనులు చేయగలను"

అని ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ చెపుతుంది.

సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా చెప్పేరు:

మనమెంత ధ్యానం చేసినా, అహంకారాన్ని జయించినా, ఆనంద భాష్పాలు ధ్యానంలో రాల్చినా మనకి దైవ కృప లభించక పోవచ్చు. అది దేవుడు ఇష్టం మీద ఆధారపడేది. మనమంతా ఆయన బంటులం. ఆయన మనను తన కిష్టమైన రీతిలో నడిపిస్తాడు.

సూఫీ జలాలుల్ దిన్ రూమి "మనం బాణాన్ని ప్రయోగించే వారలము కాదు; మనము విల్లు మాత్రమే. విలుకాడు భగవంతుడు" అని వ్రాసెను. 316

Eknath Gita Chapter 11 Section 21

Bhagavat Gita

11.21

అదృష్టపూర్వం హృషితో అస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే {11.45}

త దేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస

దేవదేవా! మునుపెన్నడూ దర్శించని రూపమును గాంచి సంతసించితిని. నా మనస్సు భీతి చెందుతున్నది. జగాన్నివాసా! నాకు నీ పూర్వపు మంజుల రూపమునే చూపుము. కృష్ణా! కరుణింపుము

కిరీటినం గదినం చక్రహస్తం మిచ్చామి త్వాం ద్రష్టుమహం త థైవ {11.46}

తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో ! భవవిశ్వమూర్తే!

ఓ విశ్వరూపా! సహస్ర బాహూ! కిరీటము, గదా చక్రములు, చతుర్భుజములు గల నీ మంజుల రూపమును నేను దర్శింప గోరుచున్నాను. ఆ రూపాముతో నవధరింపుము. ఀ

బైబిల్ చెప్తుంది "దేవుని యందలి భయము జ్ఞానానికి నాంది" అని. భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు. అన్ని జీవులకు అతడు సాక్షి (అక్షి అనగా కళ్ళు). మన ఆలోచనలు, క్రియలు, వాక్కు మొదలైనవాటన్నిటికీ భగవంతుడు సాక్షి.

మనం ఈ విధంగా నమ్మితే, మనం పలికే ప్రతి మాటా, చేసే ప్రతి క్రియ జాగురూకతతో చేస్తాము. అలా అని మనం ఆలోచనలను నియంత్రించి, చేయబోయే క్రియల గురించి చింత పడనక్కరలేదు. కానీ మన ఆలోచనలు, మాటలు, చేష్టలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలిసికోవాలి. మనలోని ఆత్మ మనకి, ఇతరులకు కూడా సాక్షి. మనం ఇతరులను నొప్పించే మాటలాడి "నేను ఎటువంటి ఇబ్బంది కలిగించాలని అనుకోలేదు" అంటే సరిపోదు. మన నోటి నుండి తెలివైన ఉక్తి రాబోయినా మనమితరులను బాధ పెట్టకూడదు. ఎందుకంటే అదే ఇతరులు మనకు చేస్తే మనము ఎలా బాధపడతామో ఊహించుకోవాలి. సాధారణంగా చలోక్తులు ఇతరులను బాధ పెట్టకుండా ఉండవు. అలాటివాటిని ఇతరులతో భేదాభిప్రాయాలు రాకుండా ఒదులుకోవడమే మంచిది.

ఒక అరబిక్ సామెత ఇలా ఉంది: నాలుకకు ముగ్గురు కాపాలాదార్లు ఉండాలి. మనం మాటలాడడానికి ముందే మొదటివాడు "ఇది నిజమా?" అని అడుగుతాడు. చాలా మాటలు దీనివలన నియంత్రింపబడతాయి. మొదటి వాడిని దాటిన తరువాత రెండవవాడు "ఇది దయతో కూడినదా?" అని అడుగుతాడు. ఇక మూడవవాడి దగ్గరకు వస్తే "ఇది అవసరమా?" అని అడుగుతాడు.

ఈ విధంగా మన వాక్కును నియంత్రిస్తే మనని మితభాషి అంటారు. అలాకాకుండా ఉండాలంటే మూడో కాపలాదారుని చూసీచూడనట్టు ఉండాలి. ఎందుకంటే ఇతరుల మైత్రినాశించి లేదా ఒకరిని సంతోషపెట్టడానికి మాట్లాడక తప్పదు. దాన్ని ఒక కళగా భావించవచ్చు. మనము నోరు మూసుకొని జీవిస్తే ఇతరులలోని దైవత్వాన్ని చూడలేము. మొదటి రెండు కాపలాదార్లను తప్పక పాటించాలి. వ్యర్థ ప్రసంగం, ఇతరులను హేళన చేయడం, వాదించడం, పరుషంగా మాట్లాడడం వంటివి ఆ కాపలాదార్లు నియంత్రిస్తారు. ఈ విధంగా మనము చేసే భాషణము, క్రియలు మలచుకొంటే మనలోని పరమాత్మతో తాదాత్మ్యం చెందుతాము. 314

Eknath Gita Chapter 11 Section 20

Bhagavat Gita

11.20

పితా అసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ {11.43}

న త్వత్సమో అస్త్యభ్యధికః కుతో అన్యో లోకత్రయే అప్య ప్రతిమప్రభావ

అసదృశ ప్రభావా! నీవు చరాచర ప్రపంచమునకు తండ్రివి. గురువువు. పూజ్యుడవు. ముల్లోకముల యందు అసమానుడవు. నిన్ను మించిన వాడెక్కడుండును?

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహ మీశ మీడ్యం {11.44}

పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసిదేవ సోఢుమ్

అందుచేత ఈశ్వరుడవు, స్తుతింప దగినవాడవు నగు నీకు సాష్టాంగ ప్రణామము చేయుచు నన్ను కరుణింప వేడుకొను చున్నాను. తండ్రి కుమారుని తప్పును, స్నేహితుడు స్నేహితుని అపరాధమును, ప్రియుడు ప్రియురాలియొక్క లోపమను సహించునట్లు నీవు నా అపరాధములను క్షమింపుము ఀ

అర్జునడు శ్రీకృష్ణుని క్షమాభిక్షకై పరి పరి విధములుగ అడుగుచున్నాడు.

మన పిల్లలు తప్పు చేసినప్పుడు వారితో ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. వాళ్ళు క్షమాభిక్ష తలిదండ్రులు ఇస్తారనే నమ్మకం కలిగి ఉండి, ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఉండాలనే నిశ్చయం చేసికోవాలి.

నా చిన్నప్పుడు మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళే వాడిని. రోజూ సాయంత్రం చీకటి పడిన తరువాత ఇంటికి వచ్చే వాళ్ళం. దారిలో పొలాలు ఉండి, అనేక రకాలైన పాములు తిరుగుతూ ఉంటాయని అందరూ అనుకునేవారు. నా అమ్మమ్మకి అలాంటి సాహసమైన పనులు చేయడం ఇష్టంలేదు. కానీ ఆమె ఒక్కమారు కూడా తన మనోభావం నాతో చెప్పలేదు.

ఒకరోజు చాలా ఆలస్యంగా ఇంటిదారి పట్టేను. నా అమ్మమ్మ చెప్పులు లేకుండా బయట నుంచుని నాకోసం ఎదురు చూస్తోంది. ఆమె ఎంతసేపు అక్కడ నుంచుందో తెలియదు. కానీ నేను అర్థం చేసికొన్నదేమిటంటే, ఆమె ప్రతిరోజూ అలాగే ఎదురు చూస్తూ ఉంటుందని. నా అమ్మమ్మను కష్టపెట్టడం ఇష్టం లేక నేను మరెప్పుడూ ఆలస్యంగా ఇంటికి రాలేదు. 310

Eknath Gita Chapter 11 Section 19

Bhagavat Gita

11.19

సఖేతి మత్వా ప్రసభ౦ యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి {11.41}

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ప్రణయేన వాపి

యచ్చాపహాసార్థ మసత్కృతో అసి విహార శయ్యాసన భోజనేషు {11.42}

ఏకో అథవాప్యచ్యుత తత్సమక్ష౦ తత్ క్షామయే త్వామహ మప్రమేయమ్

కృష్ణా! నీ వైభవమును తెలియక పొరపాటున గాని, అజ్ఞానము వలన గాని, స్నేహము వలన కలిగిన చనువు చేతగాని నిన్ను సామాన్యునిగ భావించి, హే కృష్ణా! ఓ యాదవా! ఏ సఖా! అని నిర్లక్ష్యముగా భాషించి యుంటినేమో! విహార, శయ్య, ఆసన, భోజన, సమయాలలో ఏకాంతముగా యుండునపుడు గాని, అన్యుల యెదుట గాని పరిహాసమునకై అపరాధములు చేసియు౦టినేమో! ఆ నా తప్పులను క్షమించమని అప్రమేయుడవగు నిన్ను వేడుకొనుచున్నాను ఀ

అర్జునుడు శ్రీకృష్ణుని తాను గతంలో ఆయన నిజ స్వరూపము తెలీక చేసిన తప్పులకు క్షమాపణ కోరుతున్నాడు. మనందరిలో దేవుడు నివాసమున్నాడని తలపక మనమూ అర్జునిలా బాధ పడతాము.

దేవుడు పరమ ప్రేమ స్వరూపుడై "మీరు నన్ను క్షమించేనని త్వరగా చెప్పగలరా?" అనే మన విన్నపాన్ని ఎన్నడూ కోరడు. నిజమైన ప్రేమ ఒప్పందాలతో కూడి ఉండదు. కొందరు దేవుని తమను క్షమించమని అడగడానికి సంకోచించరు, కానీ తాము ఇతరులను క్షమించడానికి సంకోచిస్తారు. నాకు ఇదే నిజమైన పరీక్ష: నన్ను బాధ పెట్టిన లేదా అవమాన పరచిన వ్యక్తులను క్షమించి వారి బాగును కోరుకోగలనా? అవునంటే ఆ వ్యక్తి యందు నాకు నిజమైన ప్రేమ ఉంది. నా బంధుమిత్రులు, వాళ్ళ మంచికై ఏదో చేయబోయి, ఒక తప్పు చేస్తే, వాళ్ళు నన్ను ద్వేషించరు. ఎందుకంటే నేను వారికి ఎటువంటి అపకారం చేయలేనివాడను కనుక. ఇటువంటి నమ్మకం ప్రతి బంధం లోనూ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, ఉండాలి.

మనం ఒకరి తప్పును క్షమించి, వారికి మన సహాయం కావాలని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తే, మనం గతంలో చేసిన తప్పులకు మనమే క్షమించుకున్నట్లు. మనం ఎవరి యందైతే తప్పు చేసేమో, వారు దాన్ని మరచి పోయి ఉండవచ్చు. కానీ మనలో అది చెరగని ముద్ర వేసి ఉండవచ్చు. దాని వలన మనమనేక మనోభావాలతో అతలాకుతలమవ్వచ్చు. క్షమ వలన మన మనస్సు తేలిక పడుతుంది. మనస్సు మీద వొత్తిడి, నాడీ వ్యవస్థలో ఆవేదన తగ్గి, మన యందు తప్పు చేసిన వారలను తేలికగా క్షమిస్తాము.

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అగాస్సీ మనము క్షమా గుణము పోగొట్టుకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందాన్ని పొందలేమని చెప్పెను. ఒక మంచు కురుస్తున్న రోజు ఆయన లియో అనేవానితో నడుస్తున్నారు. అప్పుడు లియో "మనము సంపూర్ణమైన ఆనందం ఎప్పుడు పొందగలము?" అని అడిగేరు.

ఫ్రాన్సిస్ "మన చర్చి లోని సేవకులందరూ శ్రద్ధతో, సంపూర్ణ భక్తితో, ఎన్ని అద్భుతాలు చేసినా మనము సంపూర్ణ సంతోషం పొందలేము" అని చెప్పెను.

"ఏది సంపూర్ణమైన ఆనందము?" అని లియో అడిగెను.

"మనము అన్ని భాషలను నేర్చుకొన్నా పక్షులతోనూ, జంతువులతోనూ మాట్లాడగలిగినా, సృష్టి రహస్యాలన్నీ తెలిసికొన్నా మనకు సంపూర్ణ ఆనందము కలుగదు"

లియో తన ప్రశ్నని మళ్ళీ అడిగేరు.

"మనం భూమిమీద ఉన్న సమస్త వ్యాధులను తీసివేసినా సంపూర్ణ ఆనందము కలుగదు"

లియో "దయచేసి సంపూర్ణ ఆనంద రహస్యం చెప్పండి?" అని అడిగేరు.

"మనం చాలాసేపు మంచులో నడచి ఆకలితో అలసి పోయేం. ఎదురుగా ఉన్న మఠానికి వెళ్ళి, అక్కడ ఉన్న కాపలాదారునితో మన పరస్తితి వివరిస్తే, అతడు మనను తిట్టి, కొట్టి, బయటకు తోసేస్తే, అప్పుడు మనము "జీసస్ నిన్ను క్షమించుగాక" అని అనగలిగితే మనం సంపూర్ణమైన ఆనంద పొందుతాం"

మనకు అలాంటి పరిస్తితి రాక పోవచ్చు. కానీ మన౦ చిన్న చిన్న విషయాలను క్షమించ గలగాలి. ఇతరులు చేసిన తప్పులు మన చేతన మనస్సులో చెరగని ముద్ర వేసి మనకు తెలియకుండానే మన భద్రతను, చేతనత్వాన్ని, బంధాలను ప్రభావితం చేస్తాయి. అలాటప్పుడు మనం అనుభవించిన తప్పులను ఒకటి ఒకటిగా క్షమిస్తే లాభం లేదు. నిజానికి మనం తప్పులనుకొన్నవి కొన్ని తప్పులే కావు. మనం ఇతరులను సరిగ్గా అర్థం చేసికోలేక, అహంకారం దెబ్బ తిని తప్పుగా భావించడం వలన బాధపడ వలసి వస్తున్నాది. మనం గతాన్ని తలచుకోవడమే వ్యర్థం. మంత్ర జపంతో గతం గూర్చి వచ్చే ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఇదే నిజమైన క్షమ. ఎందుకంటే మనము గతంలో చేసిన తప్పులను చేతన మనస్సుకు రానీయం. దానివలన వర్తమాన కాలంలో చేసే క్రియలలో దృష్టి కేంద్రీకరించి, ప్రతి నిమిషం, ప్రతి సంబంధం, తాజాగా తీసికొని ఆనందంతో బ్రతకగలం. 308

Eknath Gita Chapter 11 Section 18

Bhagavat Gita

11.18

నమః పురస్తాదథ పృష్ఠత స్తే నమో అస్తుతే సర్వత ఏవ సర్వ {11.40}

అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతో అసి సర్వః

ఓ సర్వవ్యాపీ ! నీకు ముందు నమస్కరించుచున్నాను. వెనుక వందన మాచరించుచున్నాను. అన్ని వైపుల ప్రణమిల్లు చున్నాను. శక్తి పరాక్రమములు గల నీవు సమస్తమును వ్యాపించి యున్నావు. అందుచేతనే సర్వుడనబడుచున్నావు.

మనం తల ఏ దిక్కులో పెట్టి పడుకోవాలి అన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దక్షిణా మూర్తిని, అనగా దక్షిణ దిక్కుగా చూస్తున్న దేవుని, నమ్మేవారు ఉత్తర దిక్కులో కాళ్ళు పెట్టరు.

తమిళనాడులో ఆండాళ్ళు అనే యోగిని ఒకరి ఇంటిలో రాత్రి బస చేసేరు. ఆ ఇంటి యజమాని ఉదయాన్నే లేపి ఆండాళ్ళు తన తలని తప్పు దిశలో పెట్టుకుందని చెప్పింది. ఆండాళ్ళు దేవుడు అన్ని దిక్కులా ఉన్నాడని చెప్పి, చివరకు శీర్షాసనమేసి పడుకుందామంటే దేవుడు క్రిందా, మీదా కూడా ఉన్నాడు అని చెప్పేరు.

సమాధిలో, మనస్సు నిశ్చలమై, అహంకారం అణిగి ఉంటాము. అప్పుడు దేవుని అంతటా చూస్తాము. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడని తలుస్తాము. రామాయణంలో హనుమంతుడు సాటిలేని రామ భక్తుడు. లంకా నగరాన్ని దహించినందుకుగాను, ఆయన రావణుని సేనచే బంధింపబడి, రావణుని ముందు నేలపై కూర్చోపెట్టబడ్డాడు. అప్పుడు హనుమంతుడు తన వాలాన్ని పెంచి దాన్ని ఆశనంగా చేసికొని రావణుని కన్నా ఎత్తులో కూర్చున్నాడు. రావణుడు ఆయనను పరీక్షింప దలచి, ఒక రత్నాల హారాన్ని హనునమంతునికి ఇచ్చేడు. హనుమంతుడు దాన్ని కొరికి అవతలకు విసిరివేసేడు. రావణుడు అది ఎంతో విలువైనదని తెలుసా అని అడిగితే అందులో నా దేవుడు లేడని బదులు ఇచ్చేడు. రావణుడు ఎవరు నీ దేవుడు అని ప్రశ్నించగా హనుమంతుడు తన వక్షాన్ని చీల్చి రాముని చూపేడు.

ఇది ఒక కథ. కాని దాని వలన తెలిసేదేమిటంటే మన చేతన మనస్సు లోపలకి వెళితే దేవుడే మనకు శాశ్వత ఆనందాన్ని, భద్రతను ఇవ్వగలడు. 306

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...