Ramana Maharshi Aatma Vichaarana

నే నెవరిని?


ఆత్మ విచారణ



ప్రతి జీవి ఆనందాన్నే కోరుతుంది.
అలాగే తనయందు మిక్కిలి ప్రేమ
కలిగి ఉంటుంది. ఎందుకంటే జీవి
స్వతహాగా ఆనంద స్వభావము గలది.
గాఢ నిద్రలో ఉండే ఆనందం వేకువలో
కూడా పొందాలంటే జీవి తన గురించి
తాను తెలిసికోవాలి. దానికై "నే నెవరిని?"
అని తనను తాను ప్రశ్నించుకొని
ఆత్మ జ్ఞానము పొందాలి.

"నే నెవరిని?" నేను దేహము కాదు;
పంచేంద్రియాలు, కర్మే౦ద్రియాలు;
పంచ ప్రాణాలు; మనస్సు కాదు.
అలాగే అజ్ఞానములో కేవలము
పూర్వ సంస్కారముల ననుసరించి
కర్మలు నిర్వహించి, మనస్సు,
కర్మే౦ద్రియాలను౦డి
మరియు జ్ఞానేంద్రియాల
గ్రాహకములనుండి విడిపడి
ఉండేవాడిని కాదు.

ఈ విధంగా విచారణ చేస్తే
మిగిలేది, అద్వితీయమైనది,
శుద్ధమైనది అయిన ఆత్మ. అదే మన
స్వస్వరూపము. అది సత్
చిత్ ఆనందము.

జ్ఞానమును పొందడానికి ,
కర్మలు చేయడానికి ఉపయోగపడే
మనస్సు ఉపశమిస్తే గాని ప్రపంచము
మిథ్య అనే భావము కలుగదు.
ఎలాగంటే రజ్జు-సర్పము భ్రాంతి
ననుసరించి, సర్ప భావనను
తొలగిస్తే గాని, అది రజ్జు అనే జ్ఞానము
కలగదు. ఆత్మ మీద ఆరోపింపబడిన
ప్రపంచము మిథ్య, అసత్యము
అనే జ్ఞానము కలగనంత
కాలము స్వస్వరూపము తెలియదు.

ఆత్మ యొక్క శక్తివంతమైన
మనస్సు వలన ఆలోచనలు
కలుగుతాయి. ఆలోచనలను
తీసివేస్తే మనస్సు అనేది లేదు.
కాబట్టి మనస్సుకు మూలం ఆలోచన.

అలాగే భౌతిక ప్రపంచము ఒక
ఆలోచన మాత్రమే. గాఢ నిద్రలో
ఆలోచనలుగాని, ప్రపంచముగాని
లేవు. నిద్రలోనూ, వేకువలోనూ
మనస్సు ఆలోచనలతో నిండి ఉంటుంది.
ఎలాగైతే సాలె పురుగు తన నుంచే
గూడు కట్టుకుని, తిరిగి తనలోకి ఆ గూడును
వెనక్కి తీసికొ౦టుందో, మనస్సు
ప్రపంచాన్ని తనలోనే ఊహించి,
తిరిగి తనలోకే లాక్కుంటుంది.

మనస్సు బహిర్ముఖమై, ఆత్మను
విస్మరించి ఉన్నప్పుడు ప్రపంచము
సత్ అనిపిస్తుంది. అలా జరిగితే
ఆత్మ స్వస్వరూపమనే జ్ఞానము
కలుగదు. అదే ఆత్మ జ్ఞానము కలిగి
ఉంటే ప్రపంచము సత్యమనే
అజ్ఞానము కలుగదు.

మనస్సు యొక్క స్వభావము గూర్చి
దీర్ఘంగా విచారణ చేస్తే దానికి "నేను"
అనబడే ఆలోచన మూలం అని
తెలుస్తుంది. మనస్సుకు స్థూలమైన
ఆధారం అవసరం. దానికి స్వతహాగా
ఉనికి లేదు. అదే సూక్ష్మ శరీరము,
అహంకారము, జీవుడు.

భౌతిక శరీరము నుండి "నేను" అని
లేచేది మనస్సే. ఆ "నేను" గూర్చి
విచారణ చేస్తే అది హృదయం నుండి
ఆవిర్భవించినది అని తెలుస్తుంది.
అదే మనస్సు యొక్క స్వస్థానము. అలాగే
"నేను-నేను" అని ధ్యానం చేస్తే చివరకు
ఆ హృదయాన్నే చేరుకొంటాం.

అన్ని ఆలోచనలకి మూలం ప్రప్రథమంగా,
"నేను". అది లేచినతరువాతే
తక్కిన "నువ్వు", "మనము" మొదలగు
ఆలోచనలు కలుగుతాయి.

అన్ని ఆలోచనలకు
మూలం "నేను", మనస్సు ఆలోచనల
సమూహం అని తెలిసికొని, "నే నెవరిని?" అని
విచారణ చేస్తేనే మనస్సును
నియంత్రించ గలం. ఈ విధంగా
విచారణ చేస్తే చివరకు మిగిలేది
"నేను" అనే ఆలోచన. విచారణ
పరిపక్వమైతే "నేను" అనే
ఆలోచన కూడా తొలగిపోతుంది.

అలా విచారణ చేస్తున్నప్పుడు
ఆలోచనలు చిందరవందరగా
ఉంటే "ఈ ఆలోచనలు ఎవరికి
కలుగుతున్నాయి?" అని ప్రశ్నించుకోవాలి.
ఎన్ని ఆలోచనలు వచ్చినా అలా
ప్రశ్నించుకొంటే "నాకు" అనే సమాధానం
తెలిసివస్తుంది. అప్పుడు "నేను ఎవరిని?"
అని విచారణ చేస్తే మనస్సు
అంతర్ముఖమై ఉండి, ఆలోచనలు
నియంత్రింపబడతాయి. అలా
దీర్ఘ కాలము విచారణ కొనసాగిస్తే
మనస్సు బలోపేతమై తన
హృదయ స్థానంలో నిశ్చలంగా
ఉంటుంది.

మనస్సు బహిర్ముఖమైనప్పుడే
బుద్ధి, ఇంద్రియాలు నామరూపాత్మక
ప్రపంచాన్ని చూస్తాయి. అదే మనస్సు
తన హృదయ స్థానంలో నిలకడగా
ఉంటే నామరూపాత్మక ప్రపంచం
నశిస్తుంది.

ఈ విధంగా మనస్సు హృదయ స్థానంలో
అంతర్ముఖమై ఉంటే "నేను", తద్వారా
ఉద్భవించే ఆలోచనలు
అంతర్ధానమై ఆత్మ ఉజ్జ్వలంగా
ప్రకాశిస్తుంది. ఆ స్థితిలో "నేను"
అనే భావన పూర్తిగా లేక మన
స్వస్వరూపాన్ని దర్శిస్తాము. అదే
మౌనము.

శుద్ధమైనదానిలో వ్యవస్థితమైతే
ఆత్మ జ్ఞానము కలుగుతుంది. అప్పుడు
మనస్సు ఆత్మచే పరిపాలింప
బడుతుంది. అట్టి జ్ఞానము వేరే విధంగా
-- దివ్య దృష్టి, వశీకరణము,
ఇతరుల ఆలోచనలను
తెలిసికోవడం, మొదలగునవి --
సాధ్యము కాదు.

ఉన్నది సత్యమైన ఆత్మే. ప్రపంచము,
జీవుడు, భగవంతుడు అనే త్రిపుటి
ఎండమావులవలె మిథ్య.
అవి ఒకప్పుడు ఉంటాయి, మరొక్కప్పుడు
ఉండవు. ఆత్మ ఒక్కటే ప్రపంచము,
జీవుడు, భగవంతుడు. సర్వము
పరమాత్మ యొక్క సృష్టి.

మనస్సును ఉపశమింపజేయాలంటే
ఆత్మ విచారణ కంటే వేరే మార్గం లేదు.
ఇతర పద్దతులు కొంత కాలము
మనస్సును ఉపశమింపజేసినా,
వాటి ప్రభావము పరిమితము.

ఉదాహరణకు ప్రాణయామంతో
మనస్సును నిశ్చలం చెయ్యవచ్చు.
కాని ప్రాణయామం కొంత కాలము
చెయ్యకపోతే మనస్సు తిరిగి
బహిర్ముఖమై పూర్వ సంస్కారాల
ననుసరించి సంచరిస్తుంది.

మనస్సు, ఊపిరి యొక్క జన్మ
స్థానం ఒక్కటే. మనస్సు ఆలోచనల
సమూహం. వాటిలో "నేను" అనే ఆలోచన
ప్రథమమైనది. అదే అహంకారం.
కానీ ఊపిరి అహంకారం ఎక్కడైతే
ఉద్భవిస్తుందో అక్కడే ఉద్భవించేది.
కాబట్టి మనస్సు నిశ్చలమైతే ఊపిరి,
పంచప్రాణాలు నియంత్రింపబడతాయి.
అలాగే ఊపిరి, పంచప్రాణాలు
నియంత్రింపబడితే, మనస్సు
నిశ్చల మవుతుంది.

ఊపిరి, పంచప్రాణాలు మనస్సు యొక్క
స్థూల స్వరూపాలు. మరణము వరకు
మనస్సు వాటిని దేహంలో నడుపుతుంది.
మరణించినపుడు మనస్సు వాటిని
తీసుకుపోతుంది. నిద్రలో మనస్సు
పనిచేయకపోయినా ఊపిరి,
ప్రాణం ఉంటాయి. ఎందుకంటే
ఇతరులకు మనము బ్రతికి ఉన్నామని
తెలియడానికి. కానీ మెలకువలో,
సమాధిలో, మనస్సు నిశ్చలమైతే,
ఊపిరి కూడా ఉపశమిస్తుంది. కావున
ప్రాణయామము వలన మనస్సు
ఉపశమించబడుతుందే గాని,
పూర్తిగా నాశనమవ్వదు.

ప్రాణాయామము లాగే విగ్రహారాధన,
జపము, ఆహార నియమాలు, మనస్సు యొక్క
ఉపశమనానికి దోహదమవుతాయి.
వాటి వల్ల మనస్సు ఏకాగ్రతను పొందుతుంది.
ఎలాగంటే ఒక ఏనుగు తొ౦డానికి ఒక
వస్తువు ఇవ్వనంత కాలమూ తొ౦డం
అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.
మనస్సు ఏనుగు తొ౦డం వలె ఆలంబనము
లేనంత వరకూ నిశ్చలంగా ఉండదు.
అందుకే మనస్సుకి జపం, ధ్యానం
వంటి అలవాట్లతో తర్ఫీదు ఇస్తే వాటినే
అంటిపెట్టుకొని ఉంటుంది.

మనస్సు అతలాకుతలమయి అనేక
ఆలోచనలు కలిగితే, అవి బలహీనంగా
మారుతాయి. అలాకాక ఆలోచనలు
అణిగిపోయి నాశనమైతే, మనస్సు
ఏకాగ్రతను పొంది, ఆత్మ విచారణకు
అవసరమయ్యే బలాన్ని, శక్తిని
పొందుతుంది.

సాత్వికమైన ఆహారాన్ని మితంగా భుజిస్తే
ప్రాణాయామం వంటి ప్రయత్నాలకన్నా
ఉత్తమం. దాని వలన మనస్సు సాత్విక
గుణం కలిగి ఉంటుంది. అది ఆత్మ
విచారణకు దోహదమవుతుంది.

ఇంద్రియాలు సదా తమ గ్రాహ్యములను
మనస్సుకు సముద్రములోని అలల వలె
చేరవేస్తే, మనస్సు అలజడి పొందుతుంది.
ఆత్మ ధ్యానమొక్కటే వాటిని అరికట్టగలదు.
స్వస్వరూపాన్ని దర్శించడం లేదా
పూర్వ సంస్కారాలను అధిగమించడం
సాధ్యం అవునా కాదా అనే అనుమానాలు
లేకుండా మనము ఆత్మ ధ్యానం చెయ్యాలి.

ఒకడు ఎంత పాపాత్ముడైనప్పటికీ
ఆత్మ ధ్యానానికి అర్హుడే. తాను
ముక్తిని పొందగలనా అని ఆలోచింపక
ఆత్మ విచారణ మొదలుపెట్టాలి.

ఎంతకాలమైతే పూర్వ సంస్కారాలు
ఉంటే అంత కాలము ఆత్మ విచారణ
చెయ్యాలి.

ఆత్మ విచారణకు ప్రతిబ౦ధకమైన
ఆలోచనలను సమూలంగా నాశనం
చెయ్యాలి.

వస్తువులను కాంక్షింపక పోవడాన్ని
వైరాగ్యం లేదా నిరాశ అంటారు. ఆత్మను
ధ్యానించడం జ్ఞానం. నిజానికి
వైరాగ్యం, ధ్యానం ఒక్కటే.
ఒకడు ముత్యాల కొరకై దేహానికి
రాళ్ళు కట్టుకొని సముద్ర గర్భానికి
చేరుకొంటాడు. అలాగే మనం
మనస్సు లోతులకు వెళ్ళి ఆత్మ జ్ఞానం
పొందాలి. మనము స్వస్వరూపంలో
ధ్యానము చెయ్యగలిగితే అది సరిపోతుంది.
ఎలాగంటే శత్రువులు కోటలో ఉన్నంత
వరకూ వారిని జయించలేము. వారిని
కోట వెలుపలకి లాగి జయించాలి.

దేవుడు, గురువు వేర్వేరు కాదు. ఇద్దరూ
ఒక్కటే. ఎవడిపైన గురువుయొక్క దయ
ఉంటుందో వానికి ఎన్నటికీ ఓటమి
రాదు. ఎలాగంటే పులి జంతువును
నోటితో పట్టుకొంటే, ఆ జంతువు
విడిపించు కోలేదు. కానీ శిష్యుడు గురువు
చెప్పిన మార్గాన్ని విశ్వాసంతో
అనుసరించాలి.

ఆత్మ ధ్యానం చేస్తూ, ఆత్మలో గాఢంగా
స్థితమైతే అది భగవంతుని యందు
సంపూర్ణ శరణాగతి. అతడు ఎంతటి
దుర్భలమైనదాన్నీ దాటించగల
శక్తి గలవాడు. నిజానికి ప్రపంచంలోని
ప్రతీదీ అతని కనుసన్నెలలో నడుస్తుంది.
కాబట్టి "ఇది చేయాలా? అది చేస్తే
మంచిదా?" అనే సంశయాలు
విడిచి అతని దయకు మనము పాత్రులు
కావాలి. ఎలాగంటే రైలు ఎక్కి
మన బరువును మనం మొయ్యనక్కర లేదు.
దానిని రైలే మోస్తుంది.

ఆత్మే ఆనందానికి మూలం. అదే సత్.
అనిత్యమైన బాహ్య వస్తువులతో
ఎన్నటికీ నిత్యమైన ఆనందం పొందలేము.
వస్తువులు నిత్యమైన ఆనందం ఇస్తాయన్నది
అజ్ఞానం. నిజానికి మనస్సు బహిర్ముఖమైతే
దానికి మిగిలేది నిరాశ, నిస్పృహ. దానికి
ఒక కోరిక తీరి, ఆనందం అనుభవించా
లంటే ఆత్మతో అనుసంధానమవ్వాలి.
ఈ విధంగా విషయ ప్రపంచంలోకి
పరిగెత్తి, విసిగి వేసారి, తిరిగి ఆత్మతో
అనుసంధానమవ్వడం మనస్సు
నిరంతరం చేస్తుంది.

ఎండాకాలంలో ఒక చెట్టు నీడ
మనల్ని సూర్యుని తాపంనుంచి
రక్షిస్తుంది. ఒకడు చెట్టు నీడనుండి,
కొంతకాలం తరువాత ఎండలోకి
వెళ్ళి, తిరిగి నీడను చేరి, పదేపదే
ప్రయత్నించడం వృథా. సూర్యుని
తాపం తగ్గే వరకు చెట్టు నీడను
ఆశ్రయించడం ఉత్తమం. ఈ విధంగా
జ్ఞాని బ్రహ్మన్ ను సదా ఆశ్రయించి
ఉంటాడు. అజ్ఞాని ప్రాపంచిక
విషయాలలో తల దూర్చి, నిరాశ
పొంది, తిరిగి బ్రహ్మన్ ను ఆశ్రయిస్తాడు.
దాని వల్ల వానికి కలిగేది దుఃఖమే.

భౌతిక ప్రపంచము ఒక ఆలోచన
మాత్రమే. ప్రపంచం దూరమైతే--
అంటే ఆలోచనల నుండి ముక్తుడైతే--
మనస్సు ఆత్మ ద్వారా ఆనందం
పొందుతుంది. అలాకాక మనస్సు
ప్రపంచ విషయాలతో తాదాత్మ్యం
చెందితే, దుఃఖం అనుభవించక
తప్పదు.

సూర్యుని కాంతి వల్ల భూతద్దం
అగ్నిని సృష్టించ గలదు, కలువ
వికసించగలదు, నీరు ఆవిరి కాగలదు,
మనము కర్మలు చేయగలం. అయస్కాంతం
దగ్గర సూచిక కదిలి దిక్కులు చెప్పగలదు.
అలాగే జీవుడు సృష్టి, స్థితి, లయం
భగవంతుని సమక్షంలో తన
కర్మల ననుసరించి పొందుతాడు. కానీ
భగవంతుడు అప్రమేయుడు. అతనికి
ఎటువంటి కర్మ అంటదు. అతడు
ఏ కర్మా చేయడు. ఎలాగైతే సూర్యునికి
ఏ ఒక్క జీవి లేదా వస్తువుపై అభిమానం
గానీ ద్వేషం గానీ లేదో, పంచ
భూతాలతో ఎటువంటి ప్రమేయం
లేదో, అలా భగవంతుడు సాక్షి మాత్రమే.

మన శాస్త్రాలు మోక్షం పొందడానికి
మనస్సుని ఉపశమింప చేయాలని
ఘంటాపథంగా చెప్తాయి. వాటిని
అదే పనిగా చదవడం వలన లాభం
లేదు. జ్ఞాని అవ్వదలచుకొన్న సాధకుడు
మనస్సును స్వాధీనపరుచుకోవడానికి "నే నెవరిని?"
అనే విచారణ చేయాలి.

ఆత్మని జ్ఞానంతోనే దర్శించాలి. ఒకనికి
తాను రాముడని తెలిసికోడానికి
అద్దం అవసరమా? నిజానికి "నేను"
అనే జ్ఞానము పంచ కోశాల లోపల
ఉంది. కానీ శాస్త్రాలు వాటికి
బయట ఉన్నాయి. కావున ఆత్మ
జ్ఞానం పొందటానికి శాస్త్రాల
అవసరం లేదు. చివరకు
పంచకోశాల అవసరం కూడా లేదు.

"బంధాలతో కట్టబడిన నేను ఎవరిని?"
అని విచారణ చేసి, తన స్వస్వరూపమును
తెలిసికొన్నవాడే మోక్షానికి అర్హుడు.
మనస్సుని సదా ఆత్మయందే ఏకాగ్రతతో
ఉంచడమే ఆత్మ విచారణ. కానీ
ధ్యానం సత్-చిత్-ఆనందం గూర్చి
చేసే ప్రయత్నం. నిజానికి ఒకరోజు
మనము నేర్చుకున్నదంతా వదిలి
పెట్టాలి.

చెత్తని వెదకడం ఎలా వృధాయో,
ఆత్మ జ్ఞానాన్ని పొందదలచే వానికి
తత్త్వాల గూర్చి తెలిసికోవడం
అంత వృధా. సాధకుడు భౌతిక
ప్రపంచం తనకు సంభందించిన౦త వరకు ఒక కల మాత్రమే అని గ్రహించాలి.

మెలకువ కాలము, నిద్ర కాలము కన్నా
దీర్ఘం తప్ప, వాటి మధ్య ఎట్టి భేదం
లేదు. కలలో చేసే కర్మలు నిద్రించు
కాలంవరకు, మెలకువలో చేసే
కర్మలలాగే, సత్యం. కలలో మనస్సు
వేరే రూపం లేదా కోశం ధరిస్తుంది.
ఆలోచనలు, నామరూపాత్మకములు
నిద్రలోనూ, వేకువలోనూ కలిసి
ఉంటాయి.

మంచి, చెడు అని రెండు మనస్సులు
లేవు. కేవలము వాసనలు
మాత్రమే మంచి చెడులుగా ఉంటాయి.
మంచి వాసనలు కావలసినవి,
చెడ్డవి వదిలిపెట్టవలసినవి. మంచి
వాసనలతో కూడిన మనస్సు శుద్ధమైనది.
అలాగే చెడు వాసనలతో కూడిన
మనస్సు అశుద్ధమైనది. ఒకరు ఎంత
చెడ్డవారైనప్పటికీ వారిని ద్వేషించ
కూడదు. ఇష్టాయిష్టాలు, రాగ ద్వేషాలు
వంటి వాటిని వదిలిపెట్టాలి.
మనస్సు సదా విషయ వాంఛలతో
కూడి ఉండడం మంచిది కాదు.
వీలయినంత మటుకు ఇతరుల
విషయాలలో తలదూర్చ కూడదు.
ఇతరులకు దానం చేస్తే అది తమకే
దానం చేసుకొన్నంత ఫలం. ఈ
సత్యం తెలిస్తే ఎవరు ఇతరులకు
దానం చేయరు?

అహంకారం లేస్తే అన్నీ లేస్తాయి.
అది ఉపశమిస్తే అన్నీ నియంత్రింప
బడతాయి. మనమెంత దయ కలిగి
ఉంటే అంత మంచిది. మనస్సును
కట్టడి చెయ్యగలిగితే, మనం
ఎక్కడున్నామని తెలిసికోవడం
అవసరమా?

Comments

Popular posts from this blog

Lalita Sahasra Naamaalu

Syamala Dandakam

Ramana Maharshi Index