Friday, February 10, 2023

Ramana Maharshi QuestionAnswers Part 2

అనుభవము




చైతన్య ప్రకాశమంటే ఏమిటి?

ద్రష్టకి నామరూపాత్మక ప్రపంచాన్ని
దర్శింపజేసేదే స్వయం ప్రకాశకమైన
చైతన్యము. దానిని అది ప్రకాశింప
చేసే వస్తువులద్వారా తెలిసికొనవచ్చు.
కానీ అది స్పృహకి అందనిది.


విజ్ఞానమంటే ఏమిటి?

జీవ చైతన్యము సమముగా
ఉన్నప్పుడు జీవుడు అనుభవించే
స్థితి. అది అలలులేని సముద్రము
లేదా కదలికలేని ఆకాశమువలె నుండును.


ఆనందమంటే ఏమిటి?

అది విజ్ఞాన స్థితిలో అనుభవించేది.
ఆ అనుభవము సుషుప్తి వలె నుండును.
దాన్నే కేవల నిర్వికల్ప స్థితి (ఎటువంటి
ఆలోచనలు లేకపోవుట) అనవచ్చు.


ఆనందాన్ని అధిగమించే స్థితి ఏమిటి?

అది మనస్సు అంతరాయములేని శాంతిని
అనుభవించే స్థితి. అది
జాగ్రత్ సుషుప్తి వలె నుండును. ఈ
స్థితిలో చిన్న పిల్లవాడు పరుండినట్లు,
శరీరము, ఇంద్రియాలు, కర్మలు చేస్తున్నా
ఎటువంటి బాహ్య ఎరుక ఉండదు. ఈ
స్థితిలో యోగి కర్మలు చేస్తున్నా
చేయనట్లే ఉంటాడు. దీనినే
సహజ నిర్వికల్ప సమాధి అంటారు.


స్థిరచరాదులు ఒకని ఆలోచన
బట్టి ఉంటాయని చెప్పడానికి
ఏది ఆధారం?

ఆత్మ దేహమును కప్పి ఉంటుంది.
సుషుప్తిలో నిఘూడంగా ఉండే
శక్తి మేల్కొన్నప్పుడు "నేను"
అనే ఆలోచన లేచి వస్తువులయొక్క
అనుభవం ఇస్తుంది. ఆత్మ అన్ని
వస్తువులపై అవగాహన ఉన్నది.
"నేను" అనే స్పృహ లేకపోతే
చూసేందుకు వస్తువులు ఉండవు.
అందువలన ప్రతీదీ ఆత్మనుండి
ఉద్భవించి, దానిలోనే లయమవుతుంది.


అనేక దేహాలతో బహుళంగా ఉండే
జీవాత్మలు సర్వము వ్యాపించి
ఉండగా, ఆత్మ ఒక్కటే--అద్వైతము --
అని ఎలా చెప్పగలము?

"నేను శరీరమును" అని నమ్మితే
జీవాత్మలు అనేకమని చెప్పవచ్చు.
ఆత్మజ్ఞానము కలగక పోతే అది తప్ప
వేరేది లేదనే జ్ఞానము ఉద్భవి౦చదు.
అందువలన ఆత్మ ఒక్కటే; అనగా
ద్వితీయము లేనిది.


బ్రహ్మన్ ని మనస్సుతో పట్టుకోవచ్చు
లేదా పట్టుకోలేము అనడానికి
ఆధారమేమిటి?

దాన్ని శుద్ధమైన మనస్సుతోనే పట్టుకోగలము.
అశుద్ధమైన మనస్సుతో పట్టుకోలేము.


శుద్ధమైన మనస్సు అంటే ఏమిటి?
అశుద్ధమైన మనస్సు అంటే ఏమిటి?

నిర్వచింపలేని బ్రహ్మన్ యొక్క శక్తి బ్రహ్మన్ నుంచి
విడిపడి, చిదాభాసతో ఏకమైనప్పుడు
అనేక రూపాలను ధరిస్తే అది
అశుద్ధమైన మనస్సు. అదే ఆభాస
నుండి వేరుపడి, విచక్షణ కలిగి ఉంటే
దానిని శుద్ధమైన మనస్సు అంటారు.
అది బ్రహ్మన్ తో ఏకమై బ్రహ్మన్ నే
పొందుతుంది. ఆభాసతో పొందిన
శక్తిని అశుద్ధమనికూడా అనవచ్చు.
అది బ్రహ్మన్ కన్న వేరు కనుక,
బ్రహ్మన్ ని పట్టుకోలేదు.


బ్రతికున్నంతకాలం, అంటే మరణము
వరకు, అనుభవించే
ప్రారబ్దాన్ని అధిగమించడ౦
సాధ్యమా?

సాధ్యము. కర్తృత్వ భావము
గల "నేను" అనునది శరీరమునకు,
ఆత్మకు మధ్య నుండి, దాని
మూలములో లయమై, తన
రూపమును పోగొట్టుకొని ఉంటే
దాని మీద ఆధారపడే కర్మకు
ఉనికి ఉంటుందా? కాబట్టి
"నేను" అనే అహంకారం లేకపోతే
కర్మ లేదు.


ఆత్మకు ఉనికి, స్పృహ ఉండగా, అది
చైతన్యమునకు మరియు జడానికి,
వివేకానికి మరియు అజ్ఞానానికి, వేరని
ఎలా చెప్పగలరు?

ఆత్మ సత్ వస్తువు. అది అన్నిటినీ
కప్పి ఉంటుంది. దాని సత్ లేదా అసత్ కి,
లేదా ద్వైత భావానికి ఆస్కారం అది
ఇవ్వదు. కాబట్టి అది సత్ మరియు అసత్ కు
అతీతంగా ఉంటుంది. అలాగే వివేకమునకు
మరియు అజ్ఞానానికి అది అతీతం అని
ఎందుకు చెప్తామంటే దానికి తెలిసికోవడానికి
లేదా గుర్తింపు పొందటానికి ఏమీ లేదు కనుక.

అరుద్ధ



జ్ఞానం సిద్ధిస్తే కలిగే స్థితి ఏమిటి?

అది సర్వం ఆత్మే అనే జ్ఞానం కలిగి,
దానితో మమేకమైన స్థితి. "నేను
మేకను కాను; ఆవును కాను; ఏ జంతువును
కాను; కేవలము మానవుని" అన్న ఎరుక
ఉన్నట్లు, "నేను దేహం మొదలుకొని
తత్త్వాలను కాను, శబ్దాన్ని కాను; ఆత్మ
స్వరూపాన్ని; సత్ చిత్ ఆనందాన్ని;
అంతర్గతమైన చైతన్యము గలవానిని
(ఆత్మ ప్రజ్ఞ)" అనుకునేవాడు సంపూర్ణ
జ్ఞానాన్ని పొందినవాడు.



  1. శుభేచ్చ (ఆత్మ జ్ఞానానికై వాంఛించుట),
  2. విచారణ
  3. తనుమనస (చంచల మనస్సు)
  4. సత్వాపత్తి (ఆత్మ జ్ఞానము),
  5. అస౦శక్తి (బంధము లేకుండుట),
  6. పదార్థభావన (వస్తువులయందు ఆసక్తి లేకుండుట),
  7. తుర్యాగ (ఉన్నతమైనది)

అను ఏడు జ్ఞాన భూమికలలో, జ్ఞాని
ఏ భూమికలో ఉంటాడు?

జ్ఞాని నాల్గవ జ్ఞాన భూమికలో ఉంటాడు.


అలా అయితే ఇంకా మూడు ఉన్నత
భూమికలు ఎందుకు ఉన్నాయి?

నాల్గు నుండి ఏడు వరకు ఉన్న
భూమికలు జీవన్ముక్తునికి చెందినవి.
అవి జ్ఞానానికి సంబంధించినవి
కావు. వాటి మధ్య జ్ఞానం విషయంలో
భేదాలు లేవు.


ముక్తి అందరికీ కలిగేదే అయితే, వరిష్ఠనే
ఎందుకు పొగుడుతారు?

వరిష్ఠ అనుభవించే ఆనందం సర్వ
సామాన్యం. అతనిని పొగడడానికి కారణం
అతని పూర్వ కర్మ ఫలము.


అందరికీ అంతులేని ఆనందం కలగాలనే
వాంఛ ఉండగా, జ్ఞానుల౦దరూ వరిష్ఠ
స్థితిని పొందలేకపోవడానికి కారణం ఏమిటి?

వరిష్ఠ స్థితి వాంఛ లేదా ప్రయత్నము
వలన వచ్చేది కాదు. దానికి కారణం
పూర్వజన్మల కర్మ. నాల్గవ భూమికలో
అహంకారం, దానికి మూలం లేకుండా
ఉండగా, దానిని అధిగమించే స్థితిని
కోరడం లేదా దానికై ప్రయత్నించడము
ఎందుకు? సాధన చేస్తున్న౦త వరకు జ్ఞానులు
అనబడరు. వరిష్ఠ గురించి ప్రస్తావించే
శృతులు మూడు పై భూమికలలో ఉన్నవారు
అజ్ఞానులని చెప్తాయా?


కొన్ని శాస్త్రాలు మనస్సు, ఇంద్రియాలను
జయించడమే ఉఛ్ఛ స్థితి అని చెప్తాయి.
దానికి దేహము, ఇంద్రియాల అనుభవంతో
పొంతన ఎక్కడ?

అలాటి ఉఛ్ఛ స్థితి ఉన్నట్లయితే దానికి,
సుషుప్తికి తేడాలేదు. అది ఒకప్పుడు
ఉండేది, మరొకప్పుడు లేనిది. కాబట్టి
అది నిత్యము కాదు. కొందరికి
అది ప్రారబ్ద కర్మ వలన కొంతకాలము,
మరణించక ముందు కలుగుతుంది.
అదే అంతిమ స్థితి అని చెప్పలేము.
అలా కాకపోతే జ్ఞాన గ్రంథాలు (వేదాలు)
రాసిన దేవతలు అజ్ఞానులని చెప్పవలసి
వస్తుంది. ఉఛ్ఛ స్థితి మనస్సు లేదా
ఇంద్రియాలు లేనప్పుడే కలిగేది
అయితే దానికి పరిపూర్ణత ఎక్కడిది?
జ్ఞానుల చేతనము లేదా అచేతనములకు
కారణం కర్మ ఒక్కటే కావున, సహజ
నిర్వికల్ప స్థితి ఒక్కటే ఆ ఉఛ్ఛ స్థితి.


నిద్రకి, జాగ్రత్ సుషుప్తి కి మధ్య గల
భేద మేమిటి?

గాఢ నిద్రలో ఆలోచనలేకాక, స్పృహ
కూడా ఉండదు. కానీ జాగ్రత్
సుషుప్తిలో ఎరుక ఉంటుంది. అంటే
మేల్కొని ఉంటూ నిద్రించడం.


ఆత్మని తురీయము , తురీయాతీతము
అని ఎందుకు అంటారు?

తూరీయమనగా నాల్గవది. జీవులు
అనుభవించే మూడు అవస్థలు
విశ్వ, తైజస, ప్రాజ్ఞులు పాలించేవి
కాని ఆత్మ కాదు. ఆత్మ ఆ అవస్థలకు
అతీతం, సాక్షి మాత్రమే అని చెప్పడానికి
దాన్ని తురీయ౦ అంటారు. ఆ జ్ఞానము
కలిగినప్పుడు ఆ మూడు అవస్థల
అనుభవము, ఆత్మ సాక్షి అనే
అనుభవము, ఆత్మ తురీయమనే
అనుభవము నశిస్తాయి. అందుకే ఆత్మ
తురీయాతీతము అని చెప్పబడినది.


శృతుల వల్ల జ్ఞాని పొందే ఉపయోగ
మేమిటి?

జ్ఞాని ఉత్కృష్టమైన స్థితిని కలిగిన
వాడు. వానికి శృతుల వలన
ఉపయోగము లేదు.


సిద్ధులు మరియు ముక్తి మధ్య
ఏదైనా సంబంధం ఉందా?

జ్ఞానముతో కూడిన విచారణే ముక్తికి మార్గము.
ఊహాతీత సిద్ధులు మాయ వలన కలిగే
భ్రమలు. ఆత్మజ్ఞాన మొక్కటే
నిజమైన సిద్ధి. నిత్యం కాని సిద్ధులు
మాయ వలన కలిగి ఒకప్పుడు ఉనికిని
కోల్పోతాయి. వాటిని కొందరు పేరు
ప్రతిష్ఠలకై చాటుకొ౦టారు. మరి కొందరికి
పూర్వ కర్మల వలన అప్రయత్నంగా
వస్తాయి. బ్రహ్మన్ తో ఐక్య మవ్వడమే
సాధన పరాకాష్ఠ. దీనినే ఐక్య ముక్తి
లేదా సాయుజ అంటాం.


కొన్ని శృతులు ముక్తిని దేహంతో
ముడి పెట్టి, జీవాత్మ దేహాన్ని వదలకపోతేనే
ముక్తి సాధ్యం అని ఎందుకు చెప్పాయి?

బంధం సత్యమైతేనే ముక్తి, దాని అనుభవం
గూర్చి చెప్పవచ్చు. నిజానికి పురుషుడుకి
నాల్గు అవస్థలలో ఎటువంటి బంధాలూ లేవు.
మన వేదాంత గ్రంథాలు బంధాలు
మాటల వరకే సత్యమని, నిజానికి
మాటలను మించి వాటికి ఉనికి లేదని,
చెప్పినపుడు ముక్తి వాటితో ఎలా
ముడిపడి ఉంటుంది? ఈ సత్యమును
తెలియక, బంధాలు, ముక్తుల గురించి
చేసే సాధన కుందేటి కొమ్మును
వెదకటమే.


అయితే శాస్త్రాలలో బంధాల గురించి
ప్రస్తావన అసత్యమనబడదా?

అనేక జన్మల కారణము వలన
అజ్ఞానము వలన కలిగే బంధము
ఒక్క జ్ఞానంతోనే తొలగింప
బడుతుంది. దాన్నే ముక్తి
అంటాము. ముక్తిని పలువిధములుగా
వర్ణించడము వలన, ఆ వర్ణనలు
ఊహలు మాత్రమే.


అలా అయితే శాస్త్ర పఠనం, నిధిధ్యాసన
మొదలగునవి వృధా కదా?

సాధన చెయ్యడం బంధము లేదా
ముక్తి లేవని తెలిసికోవడానికే.
పఠనము, నిధిధ్యాసన మొదలగునవి
పాటించడం బంధము మరియు
ముక్తి లేవని అనుభవం ద్వారా
తెలిసికోవడానికే.


బంధము, ముక్తులు లేవనడానికి
ఆధారం ఏమైనా ఉందా?

అది శాస్త్రములు కాక, స్వీయనుభవంతో
తెలిసికోబడేది.


ఆ స్వీయానుభవం పొందడం ఎలాగ?

బంధం, ముక్తి కేవలం నామ వాచకములు
మాత్రమే. వాటికి ఉనికి లేదు. కాబట్టి
అవి స్వతంత్రంగా పని చేయలేవు.
కానీ వాటికి ఒక మూలం ఉండాలి.
"ఎవరికి బంధం మరియు ముక్తి?" అని
విచారణ చేస్తే "అవి నాకే" అని
తెలుస్తుంది. "నేను ఎవరిని?" అని
విచారణ చేస్తే "నేను" అనేది లేదని
తెలుస్తుంది. అప్పుడు స్వస్వరూపము
కరతలామలకము వలె దర్శనమిస్తుంది.
నామ వాచకములతో
సంబంధం లేకుండా, అంతర్ముఖులై
యున్న యోగులకు బంధము మరియు
ముక్తి లేవనే సత్యము అవగాహనకు
వస్తుంది. అదే ఆత్మ జ్ఞానము.


బంధం మరియు ముక్తి సత్యము కాకపోతే
సుఖదుఃఖాలకు కారణమేమిటి?

స్వస్వరూపము తెలియని వారికే
సుఖదుఃఖాలు సత్యమని అనిపిస్తాయి.
వాటికి నిజంగా ఉనికి లేదు.


ప్రతిఒక్కరికీ తమ స్వస్వరూపము
తెలిసికోవడం సాధ్యమా?

సాధ్యమే. సుషుప్తిలో, స్పృహ లేనప్పుడు,
ప్రపంచం గురించి తెలియద. కానీ తన
ఉనికి మాత్రం ఉంటుంది. కాబట్టి
శుద్ధమైన స్వస్వరూపం, అందరినీ
కలుపుకొని, స్వీయానుభవానికి
వస్తుంది. వాటివలన తెలిసే నీతి
ఏమిటంటే జ్ఞానులు, అజ్ఞానులు
క్రొత్త క్రొత్త మాటలతో వర్ణించడం
స్వస్వరూప అనుసంధానానికి
వ్యతిరేకం.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...