సార శతకము
ఉపోద్ఘాతము
పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుడటఅని పోతనామాత్యుడు భాగవత అనువాదము ప్రారంభించగా
నే పలికెద వినమ్రముగా భూగోళ భాషలలో ఆంధ్రము లెస్స
దానిని పరభాష చెరనుండి విముక్తి చేయుట తక్షణ కర్తవ్యము
1
హాస్యముతో వ్రాయలేని పామరుడిని
జంధ్యము లేని పాశ్చాత్య దేశ వాసిని
సంధ్యా వందనము చేయని మందమతిని
మాంద్యము ఆవహించిన ఆంగ్ల విదేశిని
2
కాయకష్టము ఎండనక వాననక పని చేయు రైతుది
పరకాయ ప్రవేశము అద్వైత శంకరుని మాయది
మొట్టికాయ వేదమెరుగని కవి కోవిదునికి తగినది
జెల్లకాయ నా వలె మిడి మిడి జ్ఞానులకు మిగిలినది
3
జగాల్ని పాలించు పరమాత్మ లలితాదేవి
గజగామిని, భక్తులు కోరిన వర ప్రసాదిని,
రాగాలు అల్లు వాగ్గేయుని స్పూర్తిదాయిని
పరాగాలు జల్లు మధుపంబు ఆ జనని!
4
శంకరుని అద్వైత వైభవము జూడ మనస్సు ఝల్లను
ముక్కంటి కనులు కుట్ట మిగిలినది మూడవదే
ఒంటికంటైన భోళా శంకరుడు అద్వైతి పాద సేవ జేయ
ఒంటరిదైనది హిమగిరి తనయ నిజ శంకరుని పోల్చలేక
5
ఆంధ్రుల జన్మ హక్కు ఉత్కృష్టమైన తెలుగు భాష
ప్రవాసాంధ్రులు మొక్కు ఆంధ్ర తిరుమలేశుని
భాగ్యనగరము చెందు వ్యాపారము చేయువార్లకు
భోగము అనుభవించెడిది ఆంధ్రముకాని తెలంగాణ
6
గీతామృతమును అనురక్తితో పానము జేసి
ఏకాంతమైన సేవలో ఆర్తితో భక్తి సల్పుచు
శ్రీకాంతుని ధ్యానించు, ఆంధ్ర అనువాదక
పితామహుడు, పోతనామాత్యుడు పూజ్యుడు
7
భుజకీర్తులు విస్మరించి స్మరించు భక్తుని ఆలకించుచు
వజ్రములు పొదిగిన హేమ కిరీటము ధరింప జాలక
ప్రజలు వైకు౦ఠమునందు అత్యంత అచ్చెరువొందగా
గజమును కాపాడ హరి వడి వడి వెంట నడచు సిరిని మరచె
8
కంఠము నందు హాలాహాలము నింపి
సంకటములు కడతేర్చు, అభయమునిచ్చి
కంటకములు లేని కైలాసమున ధ్యానించు
నీలకంఠా! సుంఠయైన నాకు నీవే శరణ్యము!
9
గ్రహముల వలన ప్రకోపించిన దేహినై
ఆగ్రహముతో కూడిన దేవతల శాపగ్రస్తుడనై
గ్రాహ్యములు ఇంద్రియములను భాది౦ప
విగ్రహారాధన చేయని నను బ్రోవుము బ్రహ్మన్!
10
ప్రశస్త సప్తగిరుల వైకుంఠ ప్రవాస వాసి
సుప్రభాత పఠనముతో నెలతలో సేవిత
శంఖ చక్ర గధా వజ్ర వైరూఢ్య భూషిత
కలియుగ రాజస తామస జన పోషక, వేంకటేశా!
11
పాతివ్రత్య మహిమాన్విత భూదేవి పుత్రికా!
రాతి గుండెల వలన అరణ్యముల కేగితివి
ఇక్ష్వాకు వంశాంకురములను ప్రసవించి
నిలిపితివి రాముని ఘన కీర్తి, జానకీ మాతా!
12
నమకచమకములను శ్రద్ధతో పఠి౦చిన
శ్రీపురుష సూక్తములను భక్తితో వల్లించిన
అవతార మూర్తులను ప్రేమతో పూజించిన
తప్పునే ప్రారబ్ధ కర్మము? ఇక దిక్కెవరు నాకు?
13
సీతమ్మ మాయమ్మని పొగిడిన త్యాగరాజ స్వామికి
బ్రహ్మమొక్కటే అని ఉగ్గడించిన అన్నమయకు
నే నెవరినని ఆత్మ విచారణ చేసిన రమణ మహర్షికి
తప్పలేదు కదా వృద్ధాప్యమునందు దిన చర్య ఖర్మ
14
కలడు కలడు దీనులయందు అందురు; అది కల్ల కాదేమో!
పాపులను కూడ బ్రోచునని అందురు పుణ్య భూయిష్టులు
పాపపుణ్యములు కాని కర్మల నాచరించు మరమనుషులు
అక్కటా, కృత్రిమ మేధ ఎంత అనర్థము కొని తెచ్చునో కదా !
15
బాహ్య ప్రపంచము సత్తని వాదించు విద్వాంసులు
మనస్సులోని ప్రపంచము మిథ్యనే వైరాగ్యులు
ఒకరికొకరు తీసిపోరు, కడవరకూ సంఘటించెదరు
ఇక మనస్సు మిథ్య అని తలంచెడివారల గతి ఏమి?
16
ధనార్జన ఏడుకొండల వాడికి తెలుసును మెండుగ
జీవనాథారము కొదువలేని వారలు వాని భక్తులు
కూలికై పనిచేయు వారలకు లేదు పూజకు సమయము
ఉపనిషత్తుల సారము తెలిసిన కొందరు దిన కూలీలే!
17
వేదముల నభ్యసించితినని మిడిసిపడరాదు
ప్రహ్లాదుడు, ధ్రువుడు ఏ వేదములను చదివెను?
నచికేతుడు ఏది చదివి చిరస్మరణీయుడయ్యెను?
భక్తి మూఢము అయిన కూడ దొరుకునే ముక్తి
18
యమధర్మరాజును పరమాత్మ నియమింపగా
యమకింకరులను నియమించు వారెవరు?
కర్మ సఫలమైన దొరకునా కింకరుని ఉద్యోగము?
కింకరులు కొనిపోదురు పాప జీవులను శిక్షింప
19
పునర్జన్మ ఎట్టిది అని విచారించుట కుందేటి కొమ్మును వెతకుటయే
భద్రాచల రామదాసు చాటెను తారక మంత్రము వలన పుట్టుక సున్నా
అనగా సంచిత ఆగామి కర్మలు రామునిపై నిత్య జపము దహించు
ఇక సృష్టి చేయ పనిలేదు ఆ బ్రహ్మన్ కు తారక మంత్రము జపించిన
20
ప్రారబ్దము పూర్వ జన్మల సుకృతమందురు వేదము తెలిసినవారు
వర్ణములు విరాట్ పురుషుని నుండి ఆవిర్భవించెనందురు కొందరు
మరియు కులములు వృత్తి వలన కలిగెనందురు మరి కొందరు
వర్ణము, కులము పద్మపత్రమివా౦భస అని చెప్పక చెప్పెను గీతాచార్యుడు
21
ధైర్యము విలోలంబయ్యెను, ఏలన దేవుని దండము వలన
సూర్యుడు చలించును ఆ పరమాత్ముని భయము వలన
పంచభూతములు పనిచేయు బ్రహ్మన్ యందలి వెఱపు వలన
ఇక ఎవరు కర్మల నాచరి౦తురు పరమాత్మ యందు ప్రేమతో?
22
బ్రహ్మన్ సాక్షాత్కరించు, దాని యందు ప్రేమ గలవారిక౦దురు
ఆత్మ స్వస్వరూపము తెలిసిన సాధకులికి అగుపించు నందురు
ఈ రెంటికీ గుణరూపములు లేనందున ఎట్లు గుర్తించుటో తెలుపరు
విద్యుచ్చ్చక్తి కనబడునే ఎంత ప్రేమతో శాస్త్రజ్ఞులు పరిశ్రమించినా?
23
జీవన్ముక్తి బొంది యుండగానే కర్తృత్వము భోక్తృత్వము లేక పొందెడిది
విదేహముక్తి; యమధర్మరాజు దండనము లేకనే పొందు పునర్జన్మ రాహిత్యము;
ముక్తిలేదు నిర్గుణ నిష్కామ బ్రహ్మన్ గూర్చి తెలిసికో దలచని పామరులకు
ఇక మిగిలిన చరాచర జీవులు బ్రహ్మన్ సృష్టి అనే క్రీడా భూమిలో పావులు
24
బ్రహ్మన్ "బొమ్మను చేసి ప్రాణము పోసె" న౦దురు
శాస్త్రజ్ఞులు చెప్పిన పరిణామము ఎటుల జరిగెను
దశావతారములు వైకుంఠ వాసుని పరిణామము కాదా
విచిత్రము చలన చిత్ర కోకిలల వికృత కూతలు
25
"విశ్వం విష్ణు వషట్కార" మనే మంత్రము పిదప సహస్రనామముల పని ఏల?
ఆ ఉపోద్ఘాతము కేవలము పరమాత్మ దృష్టి సారించుటకు ఉపాయము
ఆడుదురు భక్తులు దాగుడు మూతలు, ఉపాసించి దేవుని ప్రశంసింప
తల్లిని బోలు వెర్రి బ్రహ్మన్ కు తెలియదాయె బిడ్డలైన మానవుల చాతుర్యము
26
"వస్తా వట్టిదె పోతా వట్టిదె" అనెడి నైరాస్యము
దాన గ్రహీతులకు మంచి చేయునదే
దానమిచ్చువాడు అర్హుల కీయవలె
సంసారికి దొరకునా ముక్తి పైకము లేక?
27
బ్రహ్మన్ అద్వితీయుడు; సృష్టికి మూలము
మనమెమవరము దాని సృష్టిని దెప్పిపొడవ?
సృష్టి జరిగి నన్ను సృష్టికర్త మరచెననుట
తిన్నింటి వాసాలు లెక్క పెట్టుటయే
28
శంకరుడు చెప్పిన ఆభాస
అద్వైత పరాకాష్ట
తానొకటి తలచిన
దైవమి౦కొకటి తలచు
29
ఆర్యులు పూర్వమా? వేదములు పూర్వమా? అని ప్రశ్నించిన,
ఆర్యులు పురాణ పురుషులు; వేదములు అపౌరుషేయములు
ప్రతి సృష్టి ఆదియందు బ్రహ్మచే వేదములు ఆవిర్భవించు
ఆర్యులు సృష్టి క్రమమున వేదములను ప్రతిపాదించు
30
ఒక బ్రహ్మాండమునకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు పరిపాలకులు
అనేక బ్రహ్మాండముల కలయిక బ్రహ్మన్ యొక్క అంగుష్ట ప్రాయము
ఒక బ్రహ్మవిష్ణుమహేశ్వరులను పూజించుటే గగనమయితే
సకల బ్రహ్మాండములకు శక్తి లలితాదేవిని ప్రసన్నము చేయుటెట్లు?
31
యజ్ఞయాగాదులు వైదిక కర్మలు
ఉపనిషత్తులకు విరుద్ధము
యజ్ఞ హవిస్సుని ఇంద్రునికివ్వ
కన్నెర్రజేసిరి కొందరు వైదికులు
32
యజ్ఞము కర్మవలననే సాధ్యమని చెప్పెను గీతాచార్యుడు
యజ్ఞకుండముతో పనిలేక సాధన చేయునది కూడ యజ్ఞమే
కర్మలను మధ్యలో త్యజించుట యజ్ఞభంగము గావించుటే
విఘ్నములు తొలగించే ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడే దిక్కు!
33
సాధనతోనె సమకూరు ధరలోన అని నానుడి
సాధకుడు సద్గురువు నాశ్రయించి సేవించ వలె
గురువు కరుణించిన ముక్తి తథ్యమని నమ్మవలె
మరి తాము గురువులమనుకునే వారి సంగతేమిటి?
34
పితృ దేవతల ఋణము తీర్చుట అసాధ్యము
దేవతల ఋణము అర్చించి అభిషేకించి తీర్చవచ్చు
ఋషి ఋణము తీర్చుటెట్లు అని సంశయము కల్గిన
గగనము నందలి సప్త ఋషులను నిత్యము తలచవలె
35
నాడీ వ్యవస్థను దేహమున్నంతవరకు మన్నించవలె
సుషుమ్న నాడి ఆత్మజ్ఞానికి కనబడు ఆధ్యాత్మిక నాళము
రమణ మహర్షి చెప్పెను కుడి ఛాతీ ఆత్మ స్థానమని
షట్చక్రములు, సహస్రారము యోగి పుంగవునికి స్వాధీనములు
36
సాధక షట్ సంపత్తి త్యాగరాజు చెప్పిన కుల ధనము కన్న మిన్న
సమదమములు సాధకులకు శాంతిని ప్రసాదించు దానము
ఉపరతి, తితీక్షలు సహనమనే పారతో వెలికితీసిన లంకె బిందెలు
శ్రద్ధ సమాధానలు గురవుని ఏకాగ్రతతో సేవించి పొందిన వేతనము
37
శ్రీరాముడు చూలాలు సీతమ్మని విడిచి పొందిన పుణ్యము
వేద యజ్ఞవాల్క్యుడు గార్గిని సన్యసించి చేసికొన్నంత
విడాకులకు వేదమెన్నటికీ ప్రమాణము కాజాలదు
సంసారుల తికమక కేవలము కలియుగ భ్రమ
38
కపిలుని సాంఖ్యము గీతాచార్యుని పులకింపగ
కణ్వ మహర్షి అణుశాస్త్రమునకు పితామహుడు కాగా
పతంజలి యోగ సూత్రములు జగతిని మేలుకొల్పగ
హైందవ తటాకము పొంగి పొరలి జనుల దప్పిక తీర్చె
39
ఆర్యభట ఖగోళ శాస్త్రము సృష్టి ఆాద్య౦తములు దైవాధీనమనె
నేటి భౌతిక శాస్త్రజ్ఞులు పరమాత్మను విస్మరించి సృష్టిని వర్ణించె
ఎవరు సృష్టికి సాక్షి అని అడిగిన ఆత్మ జ్ఞానులకు తప్ప
వేరెవరికి సమాధానము తెలియదని వేదములు ఘోషించె
40
సృష్టి స్థితి లయము ఒక బ్రహ్మాండమునకు
అట్లనేక బ్రహ్మాండములను పాలించు లలిత
పొంగిపోవును సహస్రనామముల జపముతో
ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులను ఇచ్చేది ఆ మాతే!
41
ముఖ్య ప్రాణము ఒకటి గాదా అని అడిగిన
పంచప్రాణముల సముదాయమది
పానాపాన ప్రాణములు దేవునికి నైవేద్యము
వ్యానుదానసమాన ప్రాణములు జీవునికి స్వాహా
42
భృంగి-నటేశ-సమీరజాదులు త్యాగరాజునికి స్పూర్తి
ఘటజ-మాతంగ-నారదాదుల ఉపదేశము వాని కీర్తనలు
సంగీతము దివ్యౌషథము సర్వ లోకములలో
కర్ణాటక కృతులు ఆంధ్ర సాహిత్య ఆణి ముత్యములు
43
తెలుగు ప్రవచన కర్తలు ఆంధ్ర వాఙ్మయ చక్రవర్తులు
గంగా-కృష్ణా-గోదావరుల సంగమము వారి వాగ్ధాటి
సర్వవర్ణ సమన్వయము వారికి కరతలామలకము
శ్యామలాదేవి బీజాక్షర వర కాళిదాసుని భ్రాతలు
44
"నీ దయ రాదా" అని వాపోయె త్యాగరాజు
"కాదనె వారెవరని?" సూటిగ నడిగె రాముని
ఇలలో కిట్టని వారు గిట్టక మానరు
తేడా ఆయుష్యు ఒకరు ముందు, మరొకరు వెనుక
45
తాపత్రయముతో కలవరించనేల
ఆధ్యాత్మిక సాధన కత్తి మీద సాము
ఆధిభౌతికము పరుల వలన క్లేశము
ఆధిదైవికము ప్రారబ్ధ వశాత్తు శాస్తి
46
అరిషడ్వర్గాల ఉచ్చులో పడెను దుర్యోధనుడు ఎట్లన
కామ మోహములతో ద్రౌపదిని నిండు సభలో చెరచె
మద మత్సరములతో పాండవులను అడవికి పంపె
లోభ క్రోధములతో కురుక్షేత్ర యుద్ధము గావించె
47
సర్వులకు పునర్జన్మ రాహిత్యము శుభదాయకము
కానీ జీవులు ఇలను ఖాళీ చేసిన బ్రహమన్ కేమి పని?
ముక్తి మోక్షములు బ్రహ్మన్ వేగ ప్రసాదించడు
భూమి జీవులతో నిండె కలియుగ ప్రభావము వలన
48
రామదాసు సీతారామలక్ష్మణభరతశతృజ్ఞులకు పతకములిచ్చె
ఎవడబ్బ సొమ్మని కులకుచు తిరిగేరని? గదమాయించె
కానీ సొమ్ము ముందు ప్రజలనుండి తహశీల్దారుగా ఆర్జించినది
గుళ్ళ గోపురములు పన్నుల వసూలుతో నిర్మించిన మహనీయుడు
49
నేటి కాలమున నూతన దేవుని మందిరములు నిర్మించుట అవసరమా?
రామ జన్మ భూమిలో అతి కష్టముతో స్థాపించిరి ఇక్ష్వాకుల విగ్రహములు
రాజుల సొమ్ము రాళ్ళ పాలనే నానుడి కలి యుగములో నిజమైనది
సర్వమత సామరస్యము గుడులలో అన్ని దేవుళ్ళను పూజించినప్పుడే
50
శిర్డీ సాయిబాబా మహిమలు అనేకమట
నీటిని తైలము చేసి వెలిగించెను దీపమట
ఒకనికి శివశంకర రూపముతో దర్శనమిచ్చెనట
వివిధ మతముల రోగులను నయము చేసేనట
51
కలిలో బాబాలు మహిమలు జూప అవసరమేమి?
గారడి లేకున్న నమ్మరు బాబాలను గార్ధబ జనులు
గొర్రెలు కాపరిని అనుసరించు చందము, భక్త కోటిని
మాయ చేయక బ్రహ్మన్ శాసించగలడా సృష్టిని?
52
బ్రహ్మన్ అన్యాయము చేయడట
నన్ను అన్యునిగా గాంచడట
నా గతి గ్రహస్థితితో ముడిపడినది
బ్రహ్మన్ సూటిగా వ్యవహరించడు
53
నిరవధిక సుఖము ఆత్మ జ్ఞానులది
ఇతరులకు ప్రపంచ సుఖము కొన్నది
దుఃఖము ఎరువు తెచ్చుకొన్నది
గాంచలేరు ప్రజలు సుఖము క్షణికమని
54
బ్రహ్మన్ కర్మలను జేయడు, నిర్గుణుడు, సాక్షి
మరి పంచీకరణము ఎటుల జేసెననిన
సృష్టికి ముందు బ్రహ్మను సృష్టి కర్తను జేసెను
అధికారి పనిచేయక గుమస్తాపై పెత్తనము జేయు
55
ప్రజాపతి ఆత్మ దర్శనమిత్తునని లోకములలో చాటెను
స్వర్గాధిపతి ఇంద్రుడు పడెను ఆతని వ్యూహములో
వందల వత్సరములు స్వర్గము వదలి వేచి చూచె
ఈ లోపు దానవులు స్వర్గముపై దాడి చేయని పుణ్యాత్ములు
56
అనేక ఉపనిషత్తులు కాలగర్భములో కలసి పోయెనట
కానీ శంకరుడు వాటి సారమును భాష్యములో చెప్పెను
అవసరమా సర్వసంగపరిత్యాగికి వేదాంతము?
ఒక్క కనక ధార స్తోత్రము వంద మోక్షముల పెట్టు
57
సర్వ వర్ణములు విరాట్ పురుషుని నుండి ఆవిర్భవించెనట
మరి దళితుల వర్ణ మేమన, చెప్పెను గాంధీ హరిజనులని
నే పలికెద వారు సర్వ శక్తివంతులైన శివగణములని
కర్మను భక్తితో ముడిపెట్టి చేసిన, వేదములతో పనిలేదు
58
మీరాబాయ్ శ్రీకృషనుపై భక్తి సలిపి పొందెను మోక్షము
తుకారాం పాండురంగుని భజించి ముక్తుడయ్యెను
తులసీ దాసు రాముని కొలచి పరమపదించెను
త్యాగరాజు, అన్నమయ్యల వలె మనకి విష్ణువే శరణ్యము!
59
భక్తి మిన్నా? జ్ఞానము మిన్నా? అని సంశయమొ౦దిన
విగ్రహారాధన కన్న ఆత్మ జ్ఞానము మిన్నని తెలియును
రమణ మహర్షి సాక్షిగా నే నెవరిననే విచారణ మేలు కానీ
భక్తులు అరుణా చల భగవాన్ అని పిలువ మిన్నకుండెను
60
దీక్షితార్ తెలుగు కాక దేవ భాషలో రచించెను
తెలుగు అరవము నుండి విడిపడునని తెలిసిన జ్ఞాని
నేడు ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగు వేర్వేరు
ఇక మిగిలినది ఆంధ్రముకాని రాయలసీమ తెలుగు
61
దైవారాధన సిద్ధులు పొందుటకని నమ్ముదురు
కాళిదాసునికి శ్యామలా దేవి బీజాక్షరముల నిచ్చెనట
త్యాగరాజుకి నారదుడు సంగీత తాళపత్రమిచ్చెనట
ఏ గ్రంథమలు పఠించని రమణ మహర్షి స్వయంభు
62
వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని
బ్రహ్మన్న చెప్పినది వేదమట
కానీ వేదము అపౌరిషేయము
వాడుకలో వేదము చివరి మాట
63
గుళ్ళలో వైదిక పద్దతి
ఇళ్ళలో వాస్తు శాస్త్రము
కార్యాలయాలలో ఏమన
ఉండవలసినది క్రియా శక్తి
64
మీన మేషముల లెక్కపెట్టు జ్యోతిష్యము
ప్రజల బలహీనతను బట్టి నిజము
కాలజ్ఞానము విద్యాలయాలలో బోధించుట
వేదాంతము స్త్రీలు అభ్యసించుట వంటిది
65
పుట్టపర్తి సాయి బాబా చిరస్మరణీయుడు
వైద్యశాలలు, జలము ప్రసాదించిన దేవుడు
బాబా అనునది ఉత్తర భారత గురుపరంపర
కానీ రమణ మహర్షి వలె ఆతడు స్వయంభు
66
పాలిచ్చు గోవులను వధించుట దుర్మార్గము
గంగి గోవు పాలు గరిటడైనను చాలనెను వేమన
పనికిమాలిన పాలిచ్చు ఖరము చాకలి బరువు మోసె
ఇక ఆడ ఏనుగుల, గుఱ్ఱముల గతి ఏమి చెప్పెదము?
67
భరించువాడు భర్తనిరి
భార్య సీతమ్మ వంటిది
అగ్నిప్రవేశము చేయించి
ఒక భర్త వేడి భరించలేక పోయె
68
రాముడు పురుషోత్తముడు
హనుమంతుడు సర్వ శక్తిమంతుడు
కపిరాజు పరిణామ క్రమమున
పురుషుపుంగవునికి జన్మ నీయగలడు
69
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో మమతల మూట
అని తెలిసిన శంకరుడు తల్లిని
లోక కళ్యాణమునకై త్యజించెను
70
నేడు హైందవము విశ్వమెల్ల ఆదరణ పొందినది
నిన్న బౌద్ధము ప్రపంచమంతా వ్యాపించినది
బౌద్ధులు శూన్యము సృష్టికి యోననిరి
హైందవులు శూన్యము షష్ఠీ భూతమనిన మేలు
71
ప్రవాసాంధ్రులు తండ్రిని మించిన తనయులు
ఒక ప్రక్క వేడి మరొక వైపు మంచు ననుభవించు
గీతాచార్యుడు చెప్పిన అరుదైన స్థితప్రజ్ఞులు
ఇక పర్యావరణము వేడెక్కితే అందరూ స్థితప్రజ్ఞులే
72
అప్పు చేసి పప్పు కూడు తినరాదు గోవిందుడు తప్ప
కుబేరుని అప్పు వరకట్నం చెల్లి౦చని ఆకాశ రాజుది
అలిమేలు మంగమ్మ అలుక దీర్చ కట్న మడగని
శేషశైల వాసి భక్తులతో ఆడును జగన్నాటకము
73
వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు
అసువులు బాసిరి చక్రాల క్రింద బడి
భక్తులకు దేవుడిచ్చే జీవన్ముక్తి
అని నమ్మి మూఢులు చితిలో బడిరి
74
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? అనిన
రైలు ఎక్కిన బరువు భుజాన మోయ పనిలేదు
కావున బ్రహ్మన్ ను శరణాగతి వేడుము
అని ప్రవచించెను రమణ మహర్షి
75
జీవితము చలన చిత్రము వంటిది
తెర బ్రహ్మన్ వలె కేవలము సాక్షి
బంధాలు మనస్సనే భూతద్దము
కాంతి స్వయంప్రకాశమైన ఆత్మ
76
గీతాచార్యుడు చెప్పెను జీవి తలక్రిందలైన
చెట్టు వలె వూర్ధ్వ మూలము గలవాడని
ఏ మూలమూ లేని భూమాతకు
గురుత్వాకర్షణ ఇచ్చె జగన్నాటక సూత్రధారి
77
బహు పత్నీ వ్రతులైన దేవతలు, రాజులు
సృష్టికి విరుద్ధమా లేక ప్రజాపతికి చేరువా?
ధ్రువుడు తండ్రి మొదటి భార్య కొడుకు
రాముడు దశరథుని పెద్ద భార్య తనయుడు
78
వైకుంఠ వాసులు జయవిజయులు ముని శాపగ్రస్తులై
జన్మించిరి రాక్షస వంశముల ప్రజలను పీడించ
విష్ణు అవతారములు దాల్చె వారిని సంహరింప
కాన శాపవశాత్తూ జనించిరి కలియుగ రాక్షసులు
79
"ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?" అనే
చప్ప వేదాంతము బాధ్యతా రహితము
ఆత్మ జ్ఞానము దీనికి విరుగుడు; దివ్యౌషధము
మనమంతా ఆత్మ దృష్ట్యా సహవాసులము
80
రాక్షసులను సృష్టించనేల? అవతారము ఎత్తనేల?
అని విచారణ జేసిన అది బ్రహ్మన్ క్రీడ
అడవిలో రాజుల వేటకు కారణము
క్రూర జంతువులను నియంత్రించుటకే
81
ముని శాపము లేకున్న భాగవతము లేదు
దైవ నిర్ణయము చిత్ర విచిత్రము
సర్వము త్యజించక, దేహము నశింపక
ఎంత గొప్ప భక్తునికైనా ముక్తి కలదా?
82
స్వర్గముకై కృష్ణపక్షములో చంద్ర మార్గమున వెళ్ళవచ్చు
ముక్తికై శుక్ల పక్షములో సూర్యుని వైపు వెళ్ళవచ్చు
మరి యమలోకమునకు దారెటు? నచికేతునికే తెలియును
నరకము ఎచ్చటనైనా పొందవచ్చు నాస్తికులమై
83
ధైర్యము విలోలంబయ్యెను,
ధైర్యే సాహాసే లక్ష్మీ అనిరి
సాహసము లేని ధైర్యము
డాంబికమైన వృధా ప్రయాస
84
భక్త కన్నప్ప శివునికై కనులను పొడుచుకొనెను
నేటి గుమస్తాలు కళ్ళజోడుతో శ్రమించెదరు
విశ్వరూపము దివ్య చక్షువులతో చూడ తరము
కనులు లేకున్న దివ్య దృష్టి గలదని భక్తి సలుపు
85
కుడి ఎడమైతే పొరపాటు లేదనేవారు అమాయకులు
నేటి రహదారులలో వారు వాహనాలను నడపలేదు
వామ హస్తముతో భోళా శంకరుడు దయతో ఇచ్చును
దక్షిణ హస్తముతో విష్ణువు రెండు రెట్లు తీసికొనును
86
గంధము పూయారుగా అనే త్యాగరాజ కృతము
గంధపు చెట్లను నరికే ఆసురులకు పూర్వము
సింహాద్రి అప్పన్న అణు శక్తిని మరిపించే
ఉగ్ర రూపము గంధముతో కప్పబడినది
87
నరసింహుని అవతారము విచిత్రము
మత్స్య పురుషునిగా రాలేదేమి? అని అడిగిన
హిరణ్యకశిపుడు స్థంబాన్ని చూపెన౦దురు
మరి జక్కన్న శిల్పములో కప్ప దాగలేదా
88
అగుబడే సృష్టికి ఆవల నేమున్నదని అడిగిన
శూన్యము తప్ప వేరేమి గలదని ప్రశ్నింతరు
బౌద్ధులు చతురులు వాదము నందు ; వారికి తెలియదు
పూర్ణము నుండి పూర్ణము తీసిన మిగులు పూర్ణమని
89
ఎవరిది పై చేయి: భక్తునిదా? భగవంతునిదా?
బలి చక్రవర్తి పైచేయితో విష్ణువుకి దానమిచ్చెను
కర్ణుడు కుండలములు పైచేయితో నిచ్చెను
రాజ్యము త్యజించిన దాశరథికి దాన కంకణముతో ఏమి పని?
90
క్షత్రియ నీతి చాణక్యునికి ఉగ్గుపాలు
రాక్షస నీతి ఒక్క౦టైన శుక్రాచార్యునిది
దేవతల నీతి బృహస్పతికి పెట్టిన పేరు
కలియుగ నీతి వినాశ కాలే విపరీత బుద్ధి
91
అడుసు తొక్క నేల? కాలు కడగ నేల?
పురీషము విడిచే అంగము పిరుదులు
వాటిని గాంచి మోహితులగుదురు విటులు
వికలమైన మనస్సుకు మన్మధుడే కారణము
92
అయ్యప్ప శివ మోహినులకు పుడితే
మోహిని విష్ణు రూపమని తెలిస్తే
శివుడు పార్వతీ విధేయుడని భావిస్తే
అయ్యప్ప బ్రహ్మచారి కాక మరేమగును?
93
గోపికలతో రాసలీల సలిపిన వాసుదేవుడు
బహురూపధారియై వారిని కరుణించె
గోవర్దన గిరిధారియై వ్రేపల్లెను రక్షి౦చె
సమన వైరి సన్నుత నను బ్రోచుగాక
94
"దేశమంటే మట్టి కాదోయి" అనెను గురజాడ
నేటి ఇసుక తస్కరులు వినరు ఆయని మాట
కాని "దేశమ౦టే మనుష్యులోయి" వీనుల విందు
మన్ను తిన్న దేవకీ తనయుడు బ్రోవడేమి?
95
దేవుడు వరమిస్తే పూజారి కూడా ఇవ్వాలి
తపోధనము దేవుడికిస్తే వచ్చేది పూజారి జన్మ
అందుకే విదేశీ దేవాలయాల పరిశ్రమ రాణించెను
పాశ్చాత్య దేశాలలో చలికి నులికి భక్తి సలపకున్నగతి ఏమి?
96
న్యాయానికి కళ్ళతో పాటు ముక్కు కూడా లేదు
అందుకే కాబోలు లక్ష్మణుడు వనిత ముక్కు కోసెను
త్రేతా యుగ న్యాయము కలియుగములో చెల్లదు
కానీ ధర్మము అటుల కాక రక్షో రక్షతి
97
భ్రాత ఋణము బహు ప్రమాదకరమ౦దురు
భక్తితో రామదాసు రాముని భ్రాతని తలచెను
రాముడు శంకలో పడి ఇచ్చెను మోక్షము
దాని పర్యావసానము వానికి పుత్ర వియోగము
98
కృష్ణుడు శల్య సారథ్య మొనరి౦చి బొ౦కే నెరుగ
ఎటులన యశోదతో మన్ను తినలేదని బొంకి
తొల్లి ఆమెకు భువన భాండములు చూపెను,
పిమ్మట అర్జునునికి విశ్వరూప సందర్శన భాగ్యమిచ్చెను
99
వసు ప్రసాదిని సర్వ లక్ష్మిని,
అలక్ష్మిని దూరముగా నెట్టి,
భజించిన కలుగు సుఖము
ధనం మూలం ఇధమ్ జగత్
100
కొండపల్లి బొమ్మలో బొమ్మవలె
అన్నమ్-ప్రాణ-మనో-విజ్ఞాన-ఆనంద
మయ పంచ కోశ ములు ఆత్మను కప్పియు౦డగా
భక్తి కోశము విజ్ఞానకోశ ఆవల గాక మరెక్కడ?
పీఠిక
వ్రాసితిని శతకము రాముని కృపవలన
రామ కోటి వ్రాయలేను, పురాణములెల్ల
చదవలేను, వేదములు ఔపాశన పట్టలేను
కలియుగ ప్రారబ్ధము పాపీ చిరాయువు!
No comments:
Post a Comment