Wednesday, September 27, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 6-9)

upanishad


  


6

దృగ్దర్శనశక్త్యో రేకాత్మ తేవాస్మితా


దృగ్దర్శనశక్త్యోః   = చూపు మరియు దర్శనము
		అను రెండు శక్తులను
ఏకాత్మతా + ఇవా = తానొక్కడనే యనునది
అస్మితా = ఉనికి 

  
చూచువాడు తనచూపుతో నేకీభవించినచో దానిని అహం 
కారము అందురు

  


కన్ను చూస్తున్నాదనీ, చెవి వి౦టున్నాదనీ,
ముక్కు వాసన చూస్తున్నాదనీ, నాలుక రుచి చూస్తున్నాదనీ,
అలాగే   చర్మము స్పృశిస్తున్నాదనీ  అనిపిస్తుంది. 
అది తప్పు. కరంటు బల్బు వెలిగిస్తే  అక్కడ 
వెలుగు నిచ్చేది బల్బుయేనా? టెలిఫోను ఉపయోగించినపుడు
నీతో మాటలాడేది టెలిఫోనుయేనా? ఇక్కడ టెలిఫోను ద్వారా 
నీవు మాట్టాడుట సత్యముగాని, టెలిఫోను మాట్లాడదు కదా?
అట్లే బల్బు ద్వారా వెలుగునిచ్చేది  విద్యుత్తే  కదా! కనుక
కన్ను ద్వారా చూసేది  నీవుకాని కన్ను చూడదు. అలాగే మిగిలిన
అవయవములు కూడా. ఆకాశము నీలముగా కనబడితే,
అలా కనబడేది నీ కంటికి గాని ఆకాశము నీలముగానున్నాదని 
అర్థము కాదు. అసలు నీవనుకొ౦టున్న ఆకాశము అనేది లేదు. 
ఆ కనిపించు నీలవర్షము నీ  కంటికలా కనిపిస్తుందిగాని సత్యము
కాదు. కనుక పరికరముల కొలతలను, సత్యముగా తీసుకొ౦టే 
నీవు మోసపోతావు. పరికరము నీవు ఉపయోగించుటకు కాని 
అదియే నీవనుకొనుట కొరకు కాదు. అట్టి ఏకీకరణము (అట్టి
విషయములే) తానని భ్రాంతి చెందుట అహంకారమనబడును. 
అట్టి భ్రాంతి యోగియైనవాడు తొలగించుకొనును.

7

సుఖానుశయీరాగః


సుఖానుశయీ = సుఖము ననుసరించుట 
రాగః = రాగము

  కోరికయనగా సుఖము ననుసరించుట 
  

నీ వొక వ్యక్తియందు యిష్టపడుతున్నావ౦టే అది అతడొక
వ్యక్తియగుట వల్లకాక అతనియందు నీకిష్టము కలుగుటవలననే. 
ఇచ్చట యిష్టము వేరు. ప్రేమ వేరు. ఒక వ్యక్తి యందు
మనమిష్టపడుతున్నామ౦టే ఆ వ్యక్తి కూడా మనయందిష్టము
కలుగుట చేతనే. అతడు మనలను ద్వేషిస్తే, మనకతనిపై
నున్న అభిమానమంతా మాయమవుతుంది. కనుక యిష్టమనేది 
చంచలము. అది ఎప్పుడు, ఎవరియందు ఎంతకాలముంటుందో 
తెలియదు. మనమనస్సు సహజముగా సుఖముకోరుతుంది. 
సుఖమును కలిగించే వస్తువులపైన, పరిసరముల పైన వ్యక్తులపైన 
మన కిష్టముంటుంది. ఆ యిష్టము సుఖముననుసరించి ఏర్పడినదేకాని,
సహజమైన ప్రేమ కాదు. అట్టి ఇష్టమనేది  సుఖము
మారినప్పుడల్లా మారుతుంది. దాని వలన అసంతృప్తి, అసౌఖ్యము
కలుగుతాయి. (పేమ అనేది  వేరు. తల్లి, బిడ్డను బిడ్డ ఇష్టాయిష్టాలకు 
 సంబంధము లేక ప్రేమిస్తుంది. 

8

దుఃఖానుశయీ ద్వేషః

దుఃఖానుశయీ = దుఃఖముననుసరించుట .
ద్వేషః = ద్వేషము 

  మనస్సు అసౌఖ్యముననుసరించుటయే ద్వేషము
  

ఒక వ్యక్తిని ద్వేషించుట అంటే  అతడు మనకెట్లు
దుఃఖము కలిగింపగలడో గుర్తుపెట్టుకొనుట. అయిష్టత, యిష్టము 
వలనే మనస్సునకు బంధము కలిగించును. ఇష్టపడకుండుట
అనగా దానిని జ్ఞాపకముంచుకొనుటయే. మన మొక వస్తువును 
గాని, వ్యక్తిని గాని ద్వేషిస్తున్నామంటే,  వారిని ప్రత్యేకముగా
జ్ఞాపకముంచుకొ౦టున్నామన్నమాట. మానవుడు సుఖమును మరచి
పోనట్లే  ద్వేషమునుకూడా మరచిపోడు. రెండూ సమముగానే 
జ్ఞప్తికుంటాయి. కనుక ఇదికూడా ఒక క్లేశమే. యోగ మార్గము
నందున్నవాడు ఇట్టి  క్షేశములను తొలగించుకోవాలంటే,
ఇంతకన్నా మంచిది మరియొక విషయమునుపాసింపవలెను. 
అటువంటిదే  ప్రేమ. ఇది మంచి విషయములందు అభిలాషగా
మనలో ప్రారంభమగును.

9

స్వరసవాహీ విదుషో అపితధారూఢో అభినివేశః

స్వరసవాహీ = తన రుచిని తానే
	ధరించియున్నది
విదుషః + అపి = విద్యాంసునకు కూడా
తధా = అట్టు
అరూఢః = పొందియున్నట్టుది
అభినివేశః = ఆసక్తి

  అభినివేశముగా తనకు రుచియెన (ఇష్టమైన) దానిని ధరించి,
స్థాపించుటకు ప్రయత్నించుట. విద్వాంసులలో సహితము 
అది ఇట్లే యుండును 

  

అభినివేశమ౦టే తన అభిరుచులను ఇతరులకాపాదించుటకు 
ఉత్సుకత జూపుట. తనకెలాంటి  అభిరుచులున్నా తప్పులేదు కాని 
తోటివారికి కూడా అదే అభిరుచి ఉండాలని  కోరుతే సరి కాదు. 
విద్యావంతులు సహితము ఇట్టి విషయాలలో పొరపడతారు. 
నీవొక వ్యక్తిని యిష్టపడితే  అదే వ్యక్తి యందు ఇతరులకు 
యిష్టము కలగాలని  కోరకూడదు. అది నీకు నీ తోటివారికి బాధ 
కలిగింపవచ్చును. కనుక క్లేశమునకిది యొక ఉదాహరణ. ఎందు
కనగా ఒకరి స్నేహితుడు ఇంకొకరికి స్నేహితుడు కాకపోవచ్చును. 
అట్లే ఒకరికి నచ్చిన గ్రంథము ఇంకొకరికి నచ్చకపోవచ్చును. 
అభిప్రాయములుగాని, ఆదర్శములుగాని ఇతరులకు యిష్టముగాక 
పోవచ్చును. గొప్పగొప్ప పండితులు సహితము తమనమ్మకాలను 
ఇతరులపై  రుద్ద ప్రయత్నిస్తారు. కనుక గొప్పతనము గురించిన 
మన అభిప్రాయము ఇతరులకాపాదించుట సరికాదు. నీవు 
నీ అభిప్రాయమును ఇతరులకు వివరిస్తే తప్పులేదు కాని 
వారు వినితీరాలని పట్టుబట్టకూడదు. ఒక వర్తకుడు వ్యాపారములో 
పోటీ ఉంటే  మంచిదని విశ్వసించుననుకొనుము.
అట్టివానితో పోటీ మంచిదికాదని నచ్చచెప్పుటకు గాని బోధించుటకుగాని
ప్రయత్నింపకు. వాని పోటీని మంచి వస్తువులను 
తెచ్చి సరసమైన ధరలకు అమ్ముటలో వినియోగించినచో జనులు
సుఖపడతారు. విద్యావేత్తలు పండితులు, రాజకీయ వేత్తలు, అట్లే 
ఇతరులనేకులు, గురువులుకూడా తమ ఇష్టాయిష్టములు నిస్సహాయులైన 
ప్రజలపై నెట్టి వారిని మరింత గందరగోళపరచి, చికాకు 
పెడతారు, అందువల్ల యోగి దీనిని పరిహరింపవలెను.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...