Thursday, November 30, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 33-34 )

upanishad


  


33

వితర్క బాధనే ప్రతిపక్షభావనమ్‌

వితర్కబాధనే = వితర్కముచే బాధింపపడినపుడు
ప్రతిపక్షభావనమ్‌ = ప్రతిషక్షభావము (అవలంబింపవలెను)

(ఈ చెప్పబడిన మంచి గుణముల అభ్యాసము) వితర్క
ముచే బాధింపబడినపుడు, ప్రతిపక్షభావనచే దానిని తొలగింపవలెను.
  






పైన చెప్పబడిన మంచి గుణములు అభ్యసంచుట ప్రారంభించిన
కొంతకాలము వరకు అనగా కొన్ని సం॥ల వరకు మనలో
అనేక ప్రశ్నలుపుడతాయి. మనము దీనిని దేనికి చేయవలెను? 
ఇతరులు కూడా ఇలా చేస్తున్నారా? అందరూ చేయనప్పుడు మన
మెందుకు చేయవలెను? మనమొక్కరమే చేసినందువల్ల
ప్రయోజనమేమి? అర్హతగలవారికే మంచి విషయములు చెప్పవలెనుగాని 
ప్రతి పాపొత్మునికి చెప్పవచ్చునా?  బ్రహ్మచర్యము ప్రతివారును
అవలంబిస్తే  సృష్టి ఏమవుతుంది? భూమి అంతా ఖాళీ అయి
పోవునుకదా, అని, ఇటువంటి చొప్పదంటు ప్రశృలు  మనస్సున 
పుడతాయి. అలాంటి  ప్రశ్నలను మనస్సులో వ్యతిరేకించుటకుగాని, 
పరిహరించుటకుగాని ప్రయత్నింపకూడదు.  వాటికి సమాధానము
చెప్పుకొన్నకొలది ప్రశ్నలెక్కువై  ఆచరణపోతుంది. వీటినన్నిటికి
వ్యతిరేకపద్దతిలో ఆలోచించాలి. వ్యతిరేకపద్దతి అంటే  పైన 
చెస్పినవాటికి వ్యతిరేకముగా వాదించుట కాదు. దీని వలన
మనస్సులో ఆందోళన మరింత పెరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలకు
సమాధానముగా మనస్సును మరియొక మార్గమున పురికొల్పాలి. 
అంటే  శ్రీరాముడు సత్యవాక్పరిపాలన ఎట్లు చేసెను?
శిభి, దధీచి వంటి వారు ఎట్లు దానము చేసిరి? లేక గాంధీ
గారు ఎట్లు  సత్యమును పాటించెను? మున్నగు విషయములను
గూర్చి మనన్సునాలోచించుటకు పురికొల్పాలి. దానివలన పై
విషయములకు నమాధానము మనన్సుకే వచ్చి, మనస్సునుండి
అట్టి వ్రశ్నలుకూడా తమంతట తామే తొలగిపోతాయి. అ౦టే 
మనసులో  మరియొక కేంద్రబిందువును ప్రతిపాదనచేసి, దాని
వలన పై ప్రశ్నలు వాటంతట అవియే నశించునవకాశమును
కల్పించాలి. అంతేకాక ఏదైననూ ఒక మంచి పనికి మనస్సును
పురికొల్పాలి. దానివలన కూడా ప్రశ్నలు నశించి కర్తవ్యము
వైవువకు మనస్సు మొగ్గతుంది.

34

వితర్కా హింసాదయః కృతకారితాను మోదితా
లోభక్రోధ మోహ పూర్వకా మృదుమధ్యాదిమా(త్రా
దుఃఖాజ్ఞానాన్తఫలా ఇతి ప్రతిపక్ష భావనమ్‌

వితర్కాః = వితర్కమునకు చెందినట్టి
హింసాదయః = హింన మొదలగునవి
కృతకారితాః = చేయుట లేక చేయించుట
అనుమోదితాః  = అభినందనలు
లోభాః ‌ = లోభము
క్రోధాః = క్రోధము 
మోహ = మోహము
పూర్వకా = మొదలెనట్టివి
మృదు = మృదు వై నట్టివి
మధ్య = మధ్యమమైనట్టి
అధిమాత్రాః = కొలతకతీత మైనట్టి
దుఃఖ = దుఃఖము
అజ్ఞాన = అజ్ఞానము
అనంతఫలాః = అంతులేనట్టి  ఫలితము కలిగినట్టిది
ఇతి = అని
ప్రతిపక్షభావనమ్‌ = ప్రతిపక్షభావనము



హింస మొదలైనవి వితర్కములు. అట్టి  వితర్కము మన
యందు అట్టి పనులను (హింస మొదలగునవి) ఇతరులచేత
చేయించుటగాని లేక చేసినప్పుడు మెచ్చుటగాని మున్నగు వాని
వలన లోభము, కోపము అనువాని వలన, కలుగును. ఇవి
మృదువు, మధ్యమము, మరియు కొలత కతీత మైనట్టివిగా 
తెలియబడును. ఇవి నిరంతర దుఃఖమునకు కారణమగును. 
కనుక ప్రతిషక్షభావనయే తగినది.

  

మనము ఒక చెడ్డపని చేస్తున్నప్పుడు అది చెడ్డది అని తెలిసినా  
చేస్తాము. మంచి పనియని మనము నిజముగా విశ్వసిస్తే  
చాటుగానేల చేస్తాము? దొంగతనము చేయువాడు
చూడకుండా దొంగతనము చాటుగనే చేస్తాడు గాని
బహిరంగముగా చేయడు. దొరకినచో తన్నుదురని భయముంటుంది.
కాని అది చెడ్డపనియని వానికి తెలుసు.  అయిననూ వాని 
మనసు అట్లి పనులకు (పేరేపించుచునే యుండును. కనుకనే 
వితర్కము వలన చెడ్డపనులు పుట్టునని చెప్పబడినది. చేయుట 
యన్నది భౌతికమేగాక మానసికము కూడా. నేరము చేయుట
శరీరముతో కాక మనస్సుతో కూడ చేయవచ్చును. మరియొకరి
నేరములను ప్రోత్సహించుట, లేక నేరము చేసినవానిని మెచ్చుకొనుట 
తాను మానసికముగా చేయుటయేయగును. అనగా నేరము
తన మనస్సుతోను వేరొకరి శరీరముతోను  చేయుటయగును.
తాను నేరము చేయలేనివాడు ఇతరులను ప్రోత్సహించి వానిచేత
చేయించును.

అట్టి పరిస్టితులు ఎలా  సంభవిస్తాయి? సామాన్యముగా
మనస్సు సహజ స్టితిలో నున్నపుడు దురాలోచనను రానివ్వదు.
కాని మనస్సులో కోరిక పుట్టునపుడు అట్టి కోరికను మనస్సు
దమించుకొనలేదు. అదే కోరిక తిరిగి తిరిగి వచ్చినప్పుడు మనస్సు 
తనకు తెలియకుండానే వితర్కమునకు తావిస్తుంది. ఇక్కడ 
ఒకసారి మనసులో అట్టి ఆలోచన ప్రారంభమైనప్పుడు దాని
వెనుకనే దురాలోచనలు పుడతాయి. తాను పొందలేని వస్తువును
గూర్చి కోరిక పుట్టినపుడు దానిని పొందుటకు మనస్సు మార్గ
మన్వేషిస్తుంది. అట్టి  అన్వేషణలో ఒక్కొక్కసారి దురాలోచనకు
మనస్సు లొంగుతుంది. అట్లే క్రోధము కలిగినప్పుడు దానికి కార
ణమైన వ్యక్తిపై ప్రభావము చూపుతుంది. అట్టి సందర్భములలో
మనస్సులో  చెడ్డ ఆలోచనలు పుట్టి వానిని తీర్చుకొను
మార్గము మనస్సన్వేషిస్తుంది. ఇట్లు కలిగిన ఆలోచనలను 
వ్యతిరేకమయిన ఆలోచనలతో ఎదిరించుటకు మనస్సునకు నచ్చచెప్పు 
టకు ప్రయత్నించకూడదు. దాని వలన మనస్సులోని  ఆలోచనలు
మరింత బలపడును. తన ఆలోచనతో తానెట్లు, వ్యవహరించిననూ 
అది అట్టి ఆలోచన కొనసాగించుటయేయగును. కనుక
ప్రతిపక్షభావనయే సరియైన మార్గము.

Sunday, November 26, 2023

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 31-32)

upanishad


  


రెండవ ప్రకరణము: అప్రజ్ఞాతము

31

దుఃఖ దౌర్మనస్యంగ మేజయత్వ
శ్వాస ప్రశ్వసాః  విక్షేప సహభువః 


దుఃఖః  = దుఃఖము
దౌర్మనస్య = నిస్పృహ
అంగమేజయత్వ = అంగవికలము
శ్వాస ప్రశ్వాసాః = ఉచ్చ్వాస నిశ్స్వా సములు
నిక్షేపసహభువః = మానసిక విక్షేపమువలన
			కలుగునవి.

మానసిక విక్షేపము వలన దుఃఖము, నిస్పృహ,
అంగవైకల్యము, శ్వాసక్రమ  భేదములు కలుగును.

  

పైన చెప్పబడినవికాక మరికొన్ని మార్పులు కూడా కలుగవచ్చు.
వాటి వలన యోగసాధనకు భ౦గము కలుగవచ్చు. 
వీనిలో కొన్ని పరిసరములవలన కలిగేవి. 

1. దుఃఖము 

ఒక్కొక్కసారి పరిసరముల వలన దుఃఖము తప్పనిసరి 
కావచ్చును. మృత్యువు, పోగొట్టుకొనుట , ఎడబాటు, లేదా  
వియోగము మొదలైనవి, మన ప్రమేయము లేకనే సంభవించి 
దుఃఖము కలిగించును. 

2. నిస్పృహ 
 
నిరాశా, నిస్పృహలతో కూడిన వాతావరణము కూడా  
మనస్సును కలత పెట్టును. రాజకీయ, సామాజిక పరిస్థితుల వలన 
మతాలవల్ల, ఒక్కొక్కసారి వ్యక్తులకు సాంఘిక భద్రత 
లోపించవచ్చు. వీనికి సాధారణముగా లోపము వ్యక్తియందు వుండదు. 
కనుక నిస్పృహ చెందడం తప్ప సాధారణ మానవుడు వ్యక్తి గతముగా 
చేయగలిగినది ఏమీ లేదు.

3.  అంగవైకల్యము.

అంగవైకల్యము కూడా మనో వికలత్వము కలిగింపవచ్చును.
తనకున్న అవయవలోపము అనేక విషయములలో పనులకాటంకమై 
తాను కర్తవ్యనిర్వహణ చేయలేక బాధపడవలసి వస్తుంది. ఈ
అంగవైకల్యము పుట్టుకతోగాని లేక ప్రమాదవశాత్తుగాని 
కలుగవచ్చు. 

4. శ్వాసక్రమము 

శ్వాసక్రమము తప్పుటవలన యోగసాధన కలుగదు. 
ఆయాసము వలన శ్వాసలో కలుగు ఇబ్బందులవలన 
శ్వాసక్రమము దెబ్బతినవచ్చు. ఉబ్బసము 
మొదలైన వ్యాధుల వలన ఇలాంటివి సంభవించును. 

ఇటువంటి పరిస్థితులయందు ఎవరునూ ఏమియుచేయలేరు. 
అనగా యోగసాధనకు అవరోధము కలిగి అనర్హతగా పరిణమించును. 
ముందు సూత్రములందు చెప్పిన కారణములు కేవలము
వ్యక్తిగతములు. కాబట్టి అవి సర్దుబాటు అవుతాయి.  కాని ఇందు చెప్పబడిన
మొత్తము సమాజము దేశమునకు సంబంధించినవి, తన
వశములో లేనివి, కనుక ఇటువంటి పరిస్థితులలో యోగసాధన
జరుగడం దుస్సాధ్య౦. అయినా అలాంటి  పరిస్థితులలో 
సహితము యోగసాధన చేస్తూ, కొంత ప్రయోజనము పొందు
వారున్నారు.

32

తత్పృతి షే ధార్ధమేక తత్వాభ్యాసః


తత్‌ ప్రతి షేధార్థం = ఆ మనో వై కల్యము నిలుపుదల
				చేయుటకొరకు
ఏకతత్వాభ్యాసః = ఒకే తత్వమును అభ్యసింపవలెను


ఒకే తత్వమునుపాసించడం వలన (ముందు సూత్రములలో
వివరింపబడినట్టి) పై  మనోవై కల్యములను తొలగించుకొనవచ్చును.
  


మనస్సునకు స్వతహాగా ఒక తత్వ మన్నదిలేదు. అది
ఏమూసలో పనిచేస్తుందో దానిపైనాధారవడుతుంది కనుక 
మనస్సును ఒకే తత్వము లేక ఒకే లక్ష్యము వైపు నడిపిస్తే 
వైకుల్యములుండవు. ఇక్కడ ఒక తత్వమ౦టే  ఏదో ఒక లక్షణము 
కాదు. కనుక  తరహాకాదు. ఒకే తత్వమునకు, 
ఒక తరహాకు భేదము౦ది. ఒకే తరహా (Mood) మనస్సు౦టే 
మిగిలిన తరహాలు, సామర్థ్యములు, దెబ్బతి౦టాయి. ఏదో 
ఒక తరహాను మనస్సుకు బలవంతముగా రుద్దకూడదు.  అలాకాక 
అన్ని తరహాలకు అతీతమైన ఒకే తత్వము (one pointedness)
ను మనస్సు కలవాటు చెయ్యాలి. 

క్లాసులో పాఠము చెప్పే 
ఉపాధ్యాయుడు అవసరమైతే  పిల్లలను అనునయించును. మరియొకసారి 
కోపిస్తాడు. ఈ లక్షణములు పైకి మాత్రమే ప్రకటిస్తాడు. 
ఇవన్నీ ఉపాధ్యాయుని తత్వములోనివి కావు. ఉపాధ్యాయుని 
ఒకే తత్వములోనున్న వేరువేరు తరహాలు, పిల్లలను తీర్చిదిద్దడానికి 
ఆవశ్యకతను బట్టి,  ఉపాధ్యాయునిచే  ప్రకటింపబడేవి. ఈ 
తరహాలలో ఏదీ ఉపాధ్యాయునికి చెందవని వాని తత్వము 
ఈ తరహాలన్నిటికీ అతీత మైనదని తెలిసికోవాలి. అలాగే  ఒకే 
తత్వములో సామ్యము చెందుతుంది. మనస్సు, భావములు, ఇంద్రియములు,
 అవయవములు మవదలైనవన్నీ ఒకే తత్వములో
సామ్యము చెందుతాయి. అంటే ఇవన్నీ వేరువేరుగానుండక 
అప్పుడు ప్రకటింపబడే  తరహాకనుగుణ౦గా మార్పుచెందుతున్నా, 
వాని అసలు తత్వమునకు మాత్రము ఇవన్నీ లోబడి
ఉంటాయి. 


ఉత్తేజము పొందుట దీక్ష కలిగియుండుట అనే  లక్షణాలు 
మనస్సుపై ఒక  మూసలా పనిచేసి మనస్సును ఒకే 
తత్వమునందు తీర్చిదిద్దుతాయి. ఒక ప్రజోపకారమైన కార్యమునకు 
ఉత్తేజము చెంది పనిచేయడం  లేక ఒక  మహాకార్యమునకై 
దీక్ష తీసికోవడం, లేక లలితకళలయందు అభిరుచి కలిగి 
ప్రభావితులై ఆహర్నిసము శ్రమించడం మొదలైనవి ఇలాంటి 
ఏకత్వమునకు ఉదాహరణలు,. తాను సంకల్పించిన 
కార్యము మనస్సులోనుండగా మిగిలిన తరహాలేమీ 
తనమీద  పనిచేయవు. ఒక చక్కని  చిత్రపటము  చిత్రిస్తున్న 
చిత్రకారునికి రూపురేఖలు, రంగుల 
మిశ్రమములు, మొదలైనవి  చూసుకుంటూ, బొమ్మను కొంత 
కొంతగా గీస్తూ, మార్పులు చేసుకొ౦టూ  క్రమేణా బొమ్మను 
పూర్తిచేసేసరికి దినములు, వారములు కూడా పట్టవచ్చు. ఈ
లోపల తానేమి చేస్తున్నాడో, ఎక్కడ తి౦టున్నాడో, ఎక్కడ 
నిద్రిస్తున్నాడో తనకే తెలియదు. ఎవరితో ఏమి 
మాట్లాడుతున్నాడో , ఏమి వి౦టున్నాడో
తనకే తెలియదు. తనకు తెలిసిన దొక్కటే. అదే  తన 
మనస్సులో  తాను గీస్తున్న చిత్రము యొక్క మాతృకమైన
అసలురూపము.

ఆ మనస్సులోని రూపమునే అతడు చిత్రముగా చిత్రీకరించడంలో 
నడుమ ఎన్నోవిషయాలు వానికి సంబంధము
లేకుండానే జరిగిపోతున్నాయి. వానికి తెలియదు అనడానికి వీలులేదు. 
గానీ తెలుసనడానికి కూడా వీలులేదు. వానిని భోజనమునకు,
ఇతర విషయములకు పలుమారులు పలుకరిస్తే  అతడు
కోపముతో గట్టిగా, విసురుగా సమాధానము చెప్పి తన 
కర్తవ్యములోనికి మునిగిపోతాడు. ఇది కోపమువలెనున్నా  కోపము 
కాదు. ఇతరులు తన కర్తవ్యము నుండి తనను మరల్చకుండడానికి 
చేసే హెచ్చరిక. ఇట్లే భక్తి పారవశ్య౦తో  తన్మయత్వము
చెందిన వారికి, సంగీత సాధనలోనున్నవారికి వాటియందలి
అభిరుచే తత్వముగా ఏర్పడి ఇతర మానసిక వైకల్యములను 
ఆ తత్వములోనికి సర్దుబాటు చేస్తాయి. అంటే ఆ వైకల్యములు 
క్రమేణా నశి౦చి, ఒకే తత్వముగా రూపొందుతాయి. దీని వలన 
మనస్సు ఊర్థ్వ ముఖమై సమాధి స్థితిలోకి ఎదుగుతుంది. దీనికి
భావోద్రేకమునకు తేడా ఉ౦ది. భావోద్రేకము కామ క్రోధాదులతో 
కూడి ఉంటుంది. దాని వలన పని పాడవడమే  తప్ప 
పూర్తి అవ్వడం యు౦డదు. మనస్సు ఒకే స్థితిలోనికి 
ఎదుగుట వల్ల  భావోద్రేకములు తొలగిపోయి మనస్సు స్వచ్ఛమైన 
యోగమును ప్రతిబింబిస్తుంది. అంటే అలాంటి స్వచ్చ 
స్థితిలో మనస్సుకు వికల్పముండదు. కాబట్టి మనస్సులో 
ప్రవృత్తి నశిస్తుంది. దానినే యోగమంటారు. 

zz

Thursday, November 16, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 35-36)

upanishad


  


35

అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః


అహింసాప్రతిష్టాయాం =అహింసనిలబడియున్నపుడు
తత్‌ + సన్నిధౌ = దాని ముందు
వైరత్యాగః = వైరము నశించును

అహింస స్టిరమైనప్పుడు, దాని సాన్నిధ్యమువలన వైరము
నశించును
  




ఇచ్చట గ్రంధకర్త యమముయొక్క లక్షణములలోనొకటియగు 
అహింసను గూర్చి చెప్పుచు ప్రతిపక్ష భావనమును గూర్చి
నిరూపిస్తున్నాడు.

మొట్ట మొదట అహింసయనునది కేవలము మన ఆలోచన
గానే ఉంటుంది. అది మనకున్న అన్ని ఊహలలో నొక్కటియేగాని
దానికి ప్రత్యేకతలేదు, క్రమేణా అది మన మనస్సు నాక్రమించు
కొ౦టుంది. ఇది మనస్సునందు స్థిరముగా నిలుచున్నంతవరకు,
మనము దానిని గూర్చి కొంత అభ్యాసము చేయవలసివస్తుంది. 
అట్లు  స్థిరత్వము పొందినవెనుక, మనస్సులో 
అహింస నిరంతరము నిలచియుంటుంది. అప్పుడు మనయందు
శతృత్వము అనునది పూర్తిగా తొలగిపోతుంది. అట్లు తొలగిపోవుటకు 
ముందు మనము మన శత్రువులను గూర్చి ఎంతో 
అలోచిస్తూ ఉంటాము. అహింసకు మనస్సునందు స్టిరత్వము కలిగిన 
తరువాత, శతృత్వము అను భావము మనస్సు నుండి
తొలగిపోతుంది. నిజానికి శతృత్వము అనునది మన ఆలోచనే 
గాని సత్యముకాదు. ప్రపంచములో నిజమునకు శతృవులనువారు
లేనేలేరు. ఒకరిని గూర్చి ఒకరికి మనస్సులో నేర్పడు
భావమే శతృత్వముగా తెలియబడుతోంది. అంతేకాని ఎవరూ
పుట్టుకతోనే శతృవు కాలేరు. మనకు శతృవై నవాడు వాని 
తల్లితండ్రులకు బిడ్డయూ, ప్రేమపాత్రుడు యగుచున్నాడు గాని వాడి 
తల్లితండ్రులకు వాడు శత్రువుకాడు. ఇట్లు శతృత్వము మనస్సు
నందు ఆరోపింపబడుచున్నది గాని సత్యముకాదు. మనస్సులోని 
భావములు అనేకములుగాని అవియన్నియు ఒకే భావము నుండి
పుట్టుచున్నవి. అట్టి ఒకే భావము రెండుగా చీల్చబడి యిష్టము,
అయిష్టము, మంచి, చెడు, శత్రువు, మిత్రుడు, అను జంటలుగా 
విడిపోతున్నాయి. కుడిచేయి, ఎడమచేయి ఒకే వ్యక్తిలోని
భాగములు కదా! అలా  చీల్చబడిన జంటలను ఒకే భావము
లోని రెండు భాగములుగా చూచినచో లేక తెలుసుకొన్నచో
సత్యము తెలుస్తుంది. ఇచ్చట అహింసను ప్రతిపాదించుటవలన
శతృత్వము ప్రతిపాదించబడుతోంది. శత్రుత్వమనగా, హింసతో
కూడిన ఊహ. దాని మరియొక భాగము అహింస లేక మైత్రి.
శత్రుత్వమును పోగొట్టుకొనవలెనంటే స్నేహమును అభ్యసించ
వలెను. క్రమేణా తనకు నచ్చని వ్యక్తియందున్న వైరభావము
పోయి, వానితో కూడా స్నేహము చేయును. కనుక అహింసను
గూర్చి మనస్సున ఊహలు పెంపొందిపవలెనన్నచో, అహింసను
చక్కగా నాచరించు ఒక మహానుభావుని గూర్చి ఊహించవలెను. 
ఉదాహరణకు గౌతమ బుద్దుడు ఎట్లు  అహింసతో తన జీవితమున
వ్యవహరించెనో తెలిసికొనుట వలన తన మనస్సున అహింసను
గూర్చిన భావము స్టిరపడును. 

36

సత్యప్రతిష్టాయాం క్రియా ఫలాశ్రయత్వమ్

సత్యప్రతిష్టాయాం = సత్యమునందు
			ప్రతిష్టింపబడుటచే

క్రియాఫలాశ్రయత్వమ్‌ = పనులు ఫలితము
			నాశ్రయించును

సత్యము స్థిరమైనప్త్పుడు పనులు ఫలితమునా(శయించును.
  


నీ వాక్కు, నీ చేత అను రెండునూ నీవు నమ్మిన సత్యము
ననుసరించి యున్నచో అట్టి మూడునూ ఒకే మూసయందు
ఇమడగలవు. భావమునకు వాక్కు, చేతలపై ఆధిపత్యము కలుగును. 
అట్టివారు ఆచరించిన పనులు నిర్ణీతఫలితములనివ్వగలవు.
ఇట్టి స్టీతి కలుగుటకు ముందు మనస్సు స్వచ్చమై యుండవలయును.
మనస్సు నందు తాను విశ్వ సించునది తనమాటలయందు, చేతల
యందు ప్రతిబింబింపవలెను. అట్లుగాక తాను నమ్మినదానికి
వ్యతిరేకముగా తానాచరించినచో తనకు సత్య దర్శనము కాదు.
ఫలితములు వేరగును. ఒకడు తన శతృవునకు వైద్యకళాశాలలో
స్టానము చిక్కినచో తనకు కూడా కావలెననియూ తానేల పొంద
రాదనియూ తలచును. తనకది అక్కరలేదను యూహరాదు. అనగా 
ఇచ్చట తాను విశ్వసించునది వేరు, చేయునదివేరు. సత్యమును
విశ్వసించువానికీ యిట్టి  భ్రమ తొలగిపోవును. ఏ పనియైననూ
తనకావశ్యకమేనా? కాదా? యని ప్రశ్నించుకొనునేగాని  మరి
యొకరు చేసితిరను భావము వలన చేయడు. ఇదియే సత్యమును
దర్శించుట. అట్లివారికి సంకల్పించిన పనులు వాటంతట అవియే
నెరవేరును. 

ఇట్టి సాధనకు మొదట కొంత కష్టపడవలసియుండును. 
సాధన ప్రారంభించిన తోడనే వాడింతకుముందు ఆచరించిన పనుల 
ఫలితములు ఒక్కసారిగా ప్రజ్వరిల్లి, వానిని భయ పెట్టి, మోహపెట్టును. 
వానికి చలింపక మరియు వారు జోక్యము చేసుకొనక 
తన భావము నందలి స్వచ్చతను అనగా సత్యమును దర్శించుచూ
అది తానేయని తెలుసుకొన్నవానికి అన్నియు క్రమముగా నుపశమించి 
స్వస్థత చెందును. అనగా మనస్సు నిర్మలమై, స్వచ్చమై
సమస్తమును తన యందు ప్రతిబింబించును. కలకతీరిన నిర్మ
లమైన నీటివలె స్వచ్చత వలన మనస్సునకు అస్తిత్వము నశి౦ 
చును. మనస్సు వేరుగా నుండక తనలోని భాగమై కలక 
తీరిన నీరు అడుగుభాగమును స్పష్టముగా చూపునట్లు మనస్సు 
తాను లేక నేనను వెలుగునందు లీనమై అట్టి వెలుగే మరల 
మనస్సుగా, ప్రతిబింబించును. అట్టివాడు ఎవరిని చూచిన
దేనిని చూచిననూ, ఎప్పుడు చూచిననూ, తననే చూచునుగాని 
ఇతరమనునది వానికి లేదు. ఇదియే సత్యదర్శనము. 

Wednesday, November 8, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 26-32)

upanishad


  


26

సమాన వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః

వివేకఖ్యాతిః = వివేకసామర్థ్యముచేత 

అవిప్లవా  = తలక్రిందులుకానట్టి 
హానోపాయః = అదృశ్యకారణము 

వివేకము ప్రాధాన్యత వహించుటచేత మాత్రమే ఇట్టి
సంయోగము అదృశ్యమగును. 
  


వివేకము వలన తనయందలి ఆలోచనలు తన గమనికకు
వచ్చును. అది ఎలా  సాధింపబడుననగా 

అ) తనయందు సాక్షిగా నున్న వానిని అ౦టే  పశ్యకుని, 
వాని స్వభావమును గమనించుట. అంటే తాను తన చుట్టునున్న 
ప్రకృతిని గమనింపగలుగుట. 

ఆ) తరువాత, తానెవరో, తానేమి చూచుచున్నాడో, 
తనయందేమియున్నది, మొదలైన ప్రశ్నలను వేసుకొనవలెను. 
ఇందు శాశ్వతమైనది ఏది? తాత్కాలికమైనది ఏది? మార్పు 
చెందేది ఏది? చెందనిది ఏది? అని గమనించాలి. ఇలా 
గమనించడంవలన తాను సత్యముగానూ, మార్పులేని వానిగానూ 
తెలియబడుచున్నాడు. దీనినే కైవల్యము అంటారు. 

27

తస్య సవ్తధా ప్రాన్తభూమిః ప్రజ్ఞా

తస్య = వానికి 
సప్తధా = ఏడు విధములెన 
ప్రాంతభూమిః  = విహారభూమి 
ప్రజ్ఞా = ప్రజ్ఞ 

అప్పుడు వాని ప్రజ్ఞయే వానికి క్షేత్రమగును. అది ఏడు 
పొరలు కలిగియుండును.
  

సంయోగము నశించిన తరువాత వాని ప్రజ్ఞయే విహార
భూమి అవుతుంది. అ౦టే అతనికి కనిపించునది సమస్తము తనలోని
భాగమేయగును. నీరు, మంచుగడ్డ, నీటి ఆవిరి అను మూడు
స్థితులుగా జలము ఏర్పడినట్లు తాను ఏడు స్టితులలో వర్తించును. 
మరల ఈ ఏడునూ తానే పంచభూతములు, మనన్బు,
తాను, అను ఏడును ఏడు స్థితులు. ఈ ఏడు స్థితులయందునూ 
తానేడు విధములుగా ప్రవర్తించుచున్నాడు. భౌతికమైన
పదార్హము నందు సహితము తానందలి పదార్హమను తత్వముగా
పనిచేయుచున్నాడు. మనస్సు అను తత్వముగనూ తానేయున్నాడు,.
ఆరోగ్యవంతునకు మనస్సునందు తన దేహభాగములయొక్క స్పర్శ
యుండనట్టు, యోగియైనవానికి ప్రపంచమును గూర్చిన స్పృహ
యుండదు. వానికి సమస్తము తానేయగును. అట్టి వానికి
వేరుగా యోగసాధనయన్నది లేదు. 

32

జాతిదేశకాల సమయాన వచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతమ్‌

జాతి = పుట్టుక
దేశకాల సమయః =దేశము, కొలము, సమయము
అనవచ్చిన్నాః = వేరువేరు కానట్టిది
సార్వభౌమాః  = సమస్త ప్రపంచమునకు
		సంబంధించినట్టిది
మహావ్రతమ్‌ = గొప్పదైన వ్రతము |

ఇట్టి సాధనలు పుట్టుకను బట్టి, దేశమును బట్టి, కాల
మును బట్టి మరియు, సమయమును బట్టి మారునట్టివికావు. 
అవి సమస్త ప్రపంచమునకు సంబంధించినట్టి ఒకే ఉపాసనగా
పర్యవసించుచున్నవి.
  

అష్టాంగ యోగమార్గము, అందలి క్రమము ప్రతివారికి
తప్పని సరియైనట్టిది. సత్యము, అహింస మొదలైనవి ప్రతి యోగ
సాధన యందు అనుష్టింపదగినట్టివి. దీనికి జాతి, కుల మత,
భేదములు లేవు. లింగభేదము, వయస్పు మొదలైనవడ్డురావు. వీని
కొక ప్రత్యేక సమయము లేదు. ఇవి నిరంతరము ఆచరింపదగి
నట్టివి. కాని దినములో  ఏకొద్ది సమయమో లేక ఏ ప్రత్యేక
ప్రదేశమునందో మాత్రమే చేయదగినట్టిది కాదు. నేను ఇంటి
దగ్గర మాత్రమే శాంతమును, అహింసను పాటిస్తాననుట సరి 
యేనా? లేక ధ్యానసమయమునందు మాత్రము పాటిస్తాననుట
సమంజసమా? అట్లే మంచివారియందు మాత్రమే దయకలిగి
యుంటానని, లేక నాగురువు నందు మాత్రమే శాంతము
చూపిస్తానని అనుట ఏమాత్రము సరికాదు. ఎవరి యందైననూ,
ఎట్టి సమయమందైననూ ఆచరింవవలసినవి, సర్వేసర్వత్రా 
అనుసరింవదగినవి. యోగసాధకుడుకాకున్ననూ, ఇటువంటి మంచి 
గుణములు పాటించువానియందు అందరూ మంచివారుగా 
ఉంటారు. అంతేకాక జీవితమున సుఖమును పొందవలెనన్నచో, ఇది 
తప్పనిసరియగును. అట్టిచో యోగికి ఇవి మిక్కిలి అవశ్యకముకాక 
నిర౦తరము అనునరింపవలసియుండును. జీవితకాలమంతయు 
అన్ని సమయములయ౦దు, ప్రదేశములయందు, దశలయందు 
ఎడములేక కొనసాగింపవలసిన  లక్షణములివి.

Thursday, November 2, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 23-25)

upanishad


  


23

స్వస్వామిశక్త్యోః  స్వరూపోపలబ్ది హేతుః సంయోగః 

స్వస్వామిశక్ష్యోః = తన శక్తి మరియు పరమాత్మ
			శక్తి అనువానిమధ్య
స్వస్వరూప = తన యొక్క స్వరూపము
ఉపలబ్ది హేతుః; = పొందుటకు హేతువైనది
సంయోగః = కలయిక

యోగమనగా, తన శక్తి మరియు పరమాత్మ శక్తి యొక్క
కలయిక వలన నిజస్వరూపము సాధించుకొనుట.
  

ప్రకృతి మరియు పరమాత్మ వేరుకాదు. స్వశక్తి అంటే 
ప్రకృతిశక్తి. ప్రకృతియొక్క శక్తి  మరియు పరమాత్మ యొక్క
శక్తి  రెండునూ ఒక్కటే. కాని రెండునూ వేరుగానున్నట్లు
కనిపించును. అది అట్లు రెండుగానున్నట్లు కనిపించుటవలననే
యోగవిద్య సాధ్యమగును. అంతయూ నొక్కటియేయైనచో, యోగ
సాధన ఎట్లుుండును? కనుక యోగసాధనయనగా, తాను సాధన
చేయుచున్నట్లు కలుగు భావము. చివరకు అంతర్యామి యందు
లీనమగుట.  అప్పుడు తాను నిజమయిన స్థితియందుండును.

24

తస్య హేతురవిద్యా

తస్య హేతుః = దానికారణము 
ఆవిద్య = తెలియకుండుటయే 

దానికి కారణము అజ్ఞానమే 
  

ఇచ్చటి ప్రకృతి, పరమాత్మల యొక్క కలయికకు కారణము 
అజ్ఞ్జానమేయని చెప్పబడుతోంది. అజ్ఞానము వల్లనే, ఈ 
భేద మేర్పడుతోంది. నిజమునకు సత్య మొక్కటైనప్పుడు,
ప్రకృతి, వురుషుడు అనునవి రెండు వేరువేరుగా నెచ్చట నుండి
వచ్చినవి? అని (ప్రశ్నింపగా నీరు, మంచుగడ్డ అను రె౦డు వచ్చి
నట్టు, ఇవి వచ్చినవి, అని సమాధానము. రెండునూ గుణమున
కొక్కటియేయైననూ, రూపమునకు వేరు వేరుగా నుండుట 
సంభవించినపుడు, యోగసాధన మొదలైనవి సత్యములవుతాయి. అ౦టే 
అవి అసత్యములే అయిననూ, చూచువారికి సత్యము. ప్రతి,
వానికిని తనచూపే తనకు సత్యముగనుక, తనకవి సత్యములే
యగును. ఎందుకనగా కేవలము తెలియుటయే అనగా పరమాత్మను
గూర్చిన జ్ఞానమే చాలునన్నచో, ఎంత వేదాంతము చదువుకున్నా 
ఆకలి వేయునప్పుడు తినుట, తినకుండావుండలేకపోవుట,
అట్లే  నొప్పివచ్చినపుడు బాధపడుట మొదలగునవి జరుగుచున్నవి
కదా! కనుక జ్ఞానము వేరు, అనుభవము వేరు. జ్ఞానము అనుభవమునకు 
కారణమగును. అట్టి అనుభవముతో. కూడిన జ్ఞానమునే
విద్య అందురు. అనుభవము, జ్ఞానముల  ఏకీకరణమే యోగము.
ఇచ్చట ఇంకొక మెలికయున్నది. తాను వేరు, పరమాత్మ వేరు
అను అజ్ఞానమే లేకపోతే , యోగవిద్య ఎచ్చటి నుండి వచ్చును.
కనుక మరల యోగసాధనకు అవిద్యయుండవలెను. ఇదియే పర
మాత్మ క్రీడయని పైన చెప్పబడినది.

25

తదభావా సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్‌

తత్  + అభావా = దాని ఆభావముచేత
సంయోగ  + అభావః = సంయోగమునశించుటచేత
హానం = అద్భశ్యమగుట
తత్ ‌ + దృశేః = అట్టి చూపువేత
కైవల్యం = కైవల్యము

అవిద్య నశించుట వలన సంయోగము అదృశ్యమగును.
అప్పుడు సత్యదర్శనము చేయుశక్తి కలుగును.
  

పరమాత్మ, తాను, ప్రకృతి అను రెండుగా కన్పించుట
అవిద్య లేక  అజ్ఞానముచేత. అజ్ఞానము, ఒక్కటిగా నున్న సత్యము
రెండుగా చూచుటచేత పుట్టుచున్నది. ఇది త్రిగుణములచే కలు
గును.  అట్టి (తిగుణముల వలన మానవ స్వభావమేర్పడును.
మరియు స్వభావము వలన అహంకార మేర్పడును. అహంకారము
వలన చూచువాడు, చూచునది అనుభేదమేర్పడును. అట్టి భేదముచే
మరల యోగసాధన ప్రారంభమగును, అది ఇనుప ముక్కను
అయస్కాంతముగా మార్చుటవంటింది. ఇది మరియొక 
అయస్కాంతము చేత సాధ్యపడును. అప్పుడు అవిద్యలేదు. అవిద్య
నశించుట  వలన సత్యము దర్శింపబడుచున్నది. అట్లు దర్శించు
వానిని పశ్యకుడందురు.


Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...