రెండవ ప్రకరణము
42
తత్రశబ్ధార్థజ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః
తత్ర = అక్కడ శబ్ధార్థజ్ఞాన వికల్పైః = శబ్దముల అర్థములు, జ్ఞానములు అను రెండింటి వికల్పముచేత సంకీర్ణ = కలసివున్నట్టిది సవితర్కా = వితర్కములతో కూడినట్టిది సమాపత్తిః = సామ్యమైనట్టిది
అచ్చట శబ్దముల అర్హము, వికల్పము అను రెండు స్థితుల యందు నిలిచియుండును. అది కూడా యోగికి సామ్యస్టితియే.
పదములు, వాని అర్థములనేవి అందరకున్నట్లే యోగికి కూడా ఉంటాయి. ఆ వస్తువులున్నా, లేకున్నా వాటి అస్తిత్వము, పరోక్షత అనేవి యోగిపై ప్రభావము కలిగింపలేవు. నూతనముగా వివాహమైన వానికి భార్య దగ్గర లేకున్నా, ఆమె ప్రసక్తి వచ్చినప్పుడు వానికి సంతోషము, పులకరింత కలుగును. ఇచ్చట భార్య అను పదము వట్టి పదమే తప్ప దానికి అస్తిత్వము లేదు. అనగా దాని అర్హములో సత్యము లేదు. ఇలాంటి వాటి యందు యోగి ప్రత్యేక భావములను యూహలను కలిగియుంటాడు. ఎవరైనా, నీకు ఆశ్రమ నిర్మాణమునకై ఒక లక్షరూపాయలు ఇస్తానంటే, యోగికి దానిపై ప్రభావము లేదు. అనగా అతడిచ్చేవాని దాతృత్వబుద్దిని మెచ్చుకొ౦టాడే గానీ ఇచ్చుటను గూర్చియూహచేయడు. అవతలవాడివ్వలేక పోతే, నిరాశచెందడం అన్నది యోగికిలేదు. ఆశ్రమ నిర్మాణము గురించి కలలుగనుట, పథకములు వేసుకొనుట మొదలైనవి ఉ౦డవు. పథకము వేసికొన్నా, అది ధనము సద్వినియోగము చేయుటగూర్చి తన కర్తవ్యముగా తయారు చేయుటే గానీ, ధనము వచ్చితీరాలనేయూహచేతగాదు. అ౦టే ఇక్కడ తన కర్తవ్యము అంతవరకేయని తెలిసికొ౦టాడుగాని, ఇవ్వలేనివానిని నిరసించడం, కోపించడం, విమర్శించడం మొదలైనవి ఉండవు. ధనము చేతికిస్తే, సద్వినియోగం చేయడానికి వెనుకాడడు. ధనము గురించి భయపడడం గాని, ప్రాకులాడడం గాని లేవు. ఇక్కడ ధనము అనే పదము దాని అర్థ వికల్పాదుల జ్ఞానము యోగిపై ప్రత్యేక ప్రభావమును కలిగించదు. అటువంటి స్థితినే వితర్కముతో కూడిన సమాధి స్థితి అంటారు. అటువంటి యోగికి ప్రపంచంలో అన్నీ ఉన్నా, ఏమీ లేనట్లే.
43
స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్థమాత్ర నిర్భాసా నిర్వితర్కా
స్మృతి పరిశుద్ధౌ = స్మృతి పరిశుద్ధము చెందుటవలన స్వరూపశూన్యఇవా =స్వరూపము నశించునట్లు అర్థమాత్రనిర్భాసా = అర్థము మాత్రమే ప్రకాశించునట్లు నిర్వితర్క = విమర్శలేని స్థితి
బుద్ధి స్వచ్ఛమైనప్పుడు అర్థము మాత్రమే యుండి రూపము నశించి అట్టి స్థితియందు విమర్శకూడాయుండదు.
యోగి కాని వానికి పదములు, అర్థములు వాని యందు ఆ వ్యక్తికితో ఉన్న సాన్నిహిత్యము బట్టి ఉంటుంది. ఉదాహరణకు పైన చెప్పబడినట్లు భార్య అనే పదము తీసుకొంటే, క్రొత్తగా వివాహమైన వానికి భార్య అనే పదం వలన మనస్సులో ఆహ్లాదము మొదలైనవి కలుగుతాయి. భార్య మరణించిన వానికి అదే పదము దుఃఖము కలిగిస్తుంది. భార్యను ద్వేషించే వాడికి, ఆ పదముచే మనస్సులో ద్వేషము పుడుతుంది. యోగి అయిన వానికి మాత్రము పదములయందు ఎలాంటి వాననలూ లేవు. వానికి భార్య అను పదానికి సామాన్యార్థము తప్ప వేరే యూహ రాదు. అలాగే భార్య పరిష్వంగములో ఉంటే వానికి ఈ పదములు, అర్థములు మొదలైనవేమీ లేవు. భార్య వద్దనేయున్నపుడు భార్య గురించి ఊహ వుండదుగదా! అలాగే యోగి అయినవానికి అంతర్వామి యందుండడమే తప్ప వానిగూర్చిన నామరూపాదులు, ఊహలు, ఆరాధనావిశేషములు లేవు. కనుకనే భాగవతాది గ్రంధముల యందు భగవంతునియందు శృంగార రసాత్మకమైన భక్తిని అత్యున్నతముగా చెప్పేరు. ఇచ్చట శృంగారమునకు కామమను అర్థము తీయువారు కలరు. అలాంటి వారికర్థమగునట్టిదికాదిది. స్వచ్ఛ మైన (పేమగలిగిన అన్నాచెలెళ్ళెకు, తల్లీ కుమారులకు, తండ్రీ కుమార్తెలకు, కామవాసన లేని భార్యాభర్తలకు తేడా లేదు. ఇలాంటి ప్రేమే రాధాకృష్ణుల ప్రేమతత్వముగా, గోపికాకృష్ణుల రాసలీలలుగా వర్ణింపబడినవి. ఇది ఎవరికి వారికి హృదయములో అనుభూతి పూర్వకముగా తెలియవలసినదేకాని, వివరింపగలిగినది కాదు. అర్థము చేసికొనలేనివారికిది బూతు కథవలె కనిపిస్తుంది. అంటే అలాంటి వారియందు (పేమ యింకా కామముగనే తెలియబడుచున్నది గాని కామ వాసనలేని ప్రేమ అనుభూతిలోనికి రాలేదని తెలిసికొనవలెను. ఇక్కడ పరమాత్మయందుండుట యనగా, ఎట్టి మానసిక వితర్కములు అనగా, ఊహలు, సంఘర్షణలూ లేక స్వచ్చమైన యనుభూతిగా నుండుటయేయని యర్థము. ఇచ్చట అనుభూతి సత్యము, ఊహ అసత్యము. అనుభూతి (పేమకు, హృదయమునకు సంబంధించినది. ఊహ మనస్సుకు సంబంధించినది. సమస్తము పరమాత్మయొక్క అస్తిత్వముగా చూసేవానికి అంతా ఒక్కటే అనుభవముగానీ, వేరే యూహ ఉండదు. అనేకమంది వ్యాఖ్యాతలు ఇక్కడ చెప్పబడిన ఈ రెండవ సమాధే ముందు శ్లోకములో చెప్పబడిన సమాధికన్నా ఉత్తమమని వాదించేరు. కానీ ఈ సూత్రములో పతంజలి అలా ప్రతిపాదించటం లేదు. గ్రంధకర్తకు లేని ఊహలు, ఉద్దేశ్యాలు, వ్యాఖ్యాతలు కల్పించడం హాస్యాస్పదం. నిజమైన యోగికి అటువంటి తేడా లేదు. ఈ చెప్పబడిన రెండు స్థితులూ, సమాధి స్థితిలో రెండు అంతర్భాగాలు. అవి యోగి ఉండే రెండు వివిధ స్థితులను తెలియజేస్తాయే గాని, వాటిలో ఎక్కువ తక్కువలు లేవు. అతడు ఆవశ్యకతనుబట్టి ఆయా స్థితులలో ఉంటాడు. ఇక్కడ ఆవశ్యకత అంటే ఇతరులకు సంబంధించినది కాని యోగికి సంబంధించినది కాదు. అతనికి ఆవశ్యకతలూ, ఎక్కువ తక్కువలూ లేవు. ఉన్నది అంతర్యామి యొక్క పరివ్యాప్తమే !
No comments:
Post a Comment