Tuesday, February 6, 2024

Vidura Neeti Index

మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుని మంత్రిగా కౌరవ-పాండవ యుద్ధాన్ని నివారించడానికై బోధ చేస్తాడు. ఈ సంభాషణని శ్రీ పురాణపండ రామమూర్తి గారు 1961 లో తెలుగులోకి అనువదించేరు.దీనిలో అనేక నీతి వాక్యాలు పొందు పరిచేరు. వాటిలో చాలామటుకు నేటికీ వర్తిస్తాయి. చదివి తరించండి.
విదుర నీతి Part 1
విదుర నీతి Part 2
విదుర నీతి Part 3
విదుర నీతి Part 4
విదుర నీతి Part 5
విదుర నీతి Part 6
విదుర నీతి Part 7

కొన్ని ముఖ్యమైన విదుర నీతులు

చక్కనివాక్కులు గలవాడు, తర్కమెరిగిన వాడు సమయస్పూర్తిగలవాడు అవసరమెనచోట శాస్త్రమును చెప్పగలవాడు విషయమును త్వరగా నెరుగువాడు, మేలు చేయువాడు, కీడుచేయనివాడు పండితుడనబడును.

శాస్తజ్ఞానము లేక పలవరించువాడు గాలిమేడలు కట్టువాడు అధర్మపనులతో ఆభరణములను కొనువాడు, తన పనిని వదలుకొని లోకవ్యవహారమున మెప్పుకై చరించువాడు, సదా సంశయములు గలవాడు, తొందరపనులను ఆలస్యముగా చేయువాడు, పిలువకనే పోవువాడు, అడుగకపోయినను చెప్పువాడు, తన తప్పును ఇతరులపై మోపువాడు మూఢుడనబడును.

రుచిగల పదార్థములను ఒక్కడే తినరాదు. బాటలో ఒంటిరిగా వెళ్ళరాదు అందరు నిద్రించు నపుడు ఒక్కడు మేల్కొనరాదు. ముఖ్య విషయముల నొక్కడే ఆలోచింపరాదు.

ఈ ప్రపంచమున ఇద్దరే అధములు గలరు. కార్యశూన్యుడైన గృహస్థుడు. సర్వకార్యారతుడైన సన్యాసి, అలాగే ఇరువురు దుఃఖభాగులు గలరు. వారెవరనగా శత్రువులను మిగిల్చిన రాజు. ఇంటి నొదలిపెట్టన పండితుడు.

ఏమరిపాటుగల వానివలన దొంగలు బతుకుచుందురు. రోగులవలన వైద్యులు జీవించుచుందురు. కాముకుల వలన వేశ్యలు మనగలుగుదురు. యజ్ఞము చేయువారి వలన ఋత్విక్కులు వసించుచుందురు. పేచీలున్నచోట న్యాయాధిపతులు రాణించుచుందురు. మూర్ఖులవలన పండితులు తిండారగించుచుందురు. ఆ యారుగురి వలన ఈ యారుగురు బతుకుచున్నారు.

"పదుగురాడు మాట పాడియై ధర జెల్లు" యని మనము వినియున్నాము. "పదుగురాడు మాట పనికిరాదు" అని విదురనీతిలో తెలియును. ఆ పదుగురెవరో వినండి. 1. మత్తుడు, 2. ప్రమత్తుడు, 3.ఉన్మత్తుడు, 4. అలసి పోయినవాడు, 5. కృద్ధుడు 6. ఆకలితో యున్నవాడు 7. తొందరపాటు వాడు, 8. అత్యాశా పరుడు, 9. భయపడువాడు, 10. కాముకుడు

“ఒకదానిచే రెంటిని నిర్ణయించి, మూటిని నాల్గింటితో వశపరచుకొనుము. అయిదింటిని జయించి ఆరింటిని తెలిసికొని ఏడింటిని త్యజించి సుఖింపుము,” అని విదురుడనెను.

ఒకటైన బుద్దిచేత నిత్యానిత్యములను రెండింటిని నిర్ణయించాలి. సాధన చతుష్టయమనెడి నాల్గింటిచేత కామక్రోధ లోభము లనెడి మూడింటిని వశపరచుకొనవలెను. పంచేంద్రియములనే అయిదింటిని జయించి, మోసపుచ్చెడి అరిషడ్వర్గము అనెడి ఆరింటిని కనిపెట్టి, సప్తవ్యసనములనెడి ఏడింటిని విడచి సుఖింపవలెనని భావము,

పాపుల సాంగత్యమువలన పాపము చేయనివారు గూడ శిక్షింపబడుచుందురు. ఎండిన వాటితో చేరుటవలన తడిసినవి గూడ కాలిపోవుచున్నవి. కావున పాపము చేయువారి సంపర్కము మంచిదికాదు.

తినుటకు వీలుగా నుండాలి. తినుటకు యోగ్యముగా యుండాలి. తినిన పిదప చక్కగా జీర్ణము కావాలి. జీర్ణమైన పిదప చక్కగా దేహమున కుపకరించాలి. అట్టి ఆహారమునే భుజించాలి.

చూపుతో, మనసుతో, మాటతో, కర్మతో లోకము నెవడు ఆకర్షించునో వానిని లోకము ప్రసన్నముగా చూచును. ఎన్నటికి ఫలితము నివ్వని కార్యములను మొదలిడరాదు.

పూలు కందకుండా తుమ్మెద తేనెను గ్రహించునట్లు ప్రభువు ప్రజలను నొప్పింపక వారినుండి ధనమును గ్రహింపవలెను అని విదురుడనెను.

దీపముచేత చీకటిలో యున్న వస్తువు తెలియును. నడవడిక చేత ధర్మము తెలియును. వ్యవహారము చేత మంచితనము తెలియును. శూరుడైనవాడు భయము లేర్పడినపుడు తెలియును. ధీరుడు కష్టములలో తెలియును. మిత్రులేవరో, శత్రువులెవరో ఆపదలలో తెలియుదురు.

మంచి పనులు చేయుటవలన సంపద కలుగును. నేర్పువలన సంపద వృద్ధి చెందును. సామర్థ్యము వలన కుదుట పడును. మిడిసి పడనిచో నిలువగలుగును.

రాత్రి సుఖముగా నిద్రించుటకు తగిన స్థితిని పగటి యందే తయారుచేసుకోవాలి. వర్షాకాలమున హాయిగా ‌ జీవించు యత్నమును తక్కిన యెనిమిది మాసములలో చేయవలెను. వృద్ధాప్యమున సుఖించుటకు బాల్యముననే యత్నింపవలెను. మరణానంతరము సుఖించుటకు జీవితమంతయు కృషిచేయవలెను.

ముసలితనము రూపమును చెరచును. ఆశ ధైర్యమును పోగొట్టును. మృత్యువు పరాణములను హరించును. అసూయ ధర్మాచరణమును వక్రింపజేయును. క్రోధము సంపదను నశింపజేయును. నీచులసేవ శీలమును పాడుచేయును. కామము లజ్జను తొలగించును. అభిమానము సమస్తమును ధ్వంసమొనర్చును అని విదురుడనెను.

మానవుడు తనను నిందించువారిని తిరిగి నిందించనిచో ఆ నిందలు నిందించినవానినే దహించి వేయును. అదియును గాక నిందించినవాని పుణ్యము సహించినవానిని చేరును.

రథము చిన్నదైనను పెద్దబరువును మోయగలుగును. పెద్దవియైన వృక్షములు ఆ విధముగా మోయలేవు. (శేష్ఠులైనవారు ఎంతటి బరువునైనను మోయ గలుగుదురు. ఇతరులు ఉన్నతులుగా గోచరించినను భారమును మోయలేరు.

సంతాపము వలన రూపము చెడును. బలము తగ్గను. జ్ఞానము క్షీణించును. రోగము వృద్ది చె౦దును. రాగోరినది రాదు. శరీరము దహింపబడును. శత్రువులు ఆనందింతురు. కనుక శోకించుట తగదు.

“చిత్తము చలించువానిని జ్ఞానము లేనివానిని ఇంద్రియములకు వశమైన వానిని సంపదలు, ఎండిన సరస్సును హంసలు చేరనట్లు, చేరకుండును,” అని విదురుడనెను. .

మనిషి వంద సంవత్సరములు జీవించునని వేదములు పలుకుచున్నవి. మరి మానవుడు అంత కాలము ఎందులకు జీవింపలేకున్నాడు? ఏ కారణములో అతనిని మధ్యలో చంపుతున్నవి, అవి ఏమనగా! 1. గర్వము 2. అతిగా వాగుట, 3. పాపాచరణము, 4. క్రోధము, 5. తనసుఖమునే చూచుకొనుట, 6. నమ్మినవారిని మోసపుచ్చుట ఈ ఆరును పదునైనా కత్తులై ఆయువును ముక్కలు చేయుచున్నవి,

కొందరు దుష్టులు కలిసి చేసిన ఆలోచనను వెంటనే తిరస్కరింపరాదు. నీ పై నాకు నమ్మకము లేదు యని పలుకరాదు. ఏదో కారణము చెప్పి తప్పించుకొనవలెను.

"గొప్ప కీడు చేయు మనుజునితో శతృత్వము పెట్టుకొని, అతడు దూరముగా ఉన్నాడని ధీమాగా ఉండరాదు. " అని విదురుడు పలికెను.

తనయందు దోషములనుంచుకొని, నిర్దోషులైన తనవారిని బాధించు మనుజుడు పామున్న ఇంటిలో ఉండువానివలె నిద్రలేక, శాంతిలేక యుండును.

నమ్మదగనివానిని నమ్మరాదు. నమ్మదగినవానిని గూడ హద్దు మీరీ నమ్మరాదు. నమ్మకము వలన జనించు భయము వ్రేళ్ళను గూడ త్రెంచును.

పెద్దలు అరుదెంచునపుడు యువకుని ప్రాణములు పైకిలేచును. అతని కెదురేగి నమస్కరించుటవలన తిరిగి యువకుడు ప్రాణములను బొందును.

"స్త్రీలు పూజార్హులు. గొప్ప వైభవోపేతులు, పుణ్యవతులు, ఇంటికి దీపము వంటివారు, ఇంటిలోని లక్ష్మీ దేవులు. వారిని శ్రద్ధతో కాపాడవలెను" అని విదురుడనెను.

గొప్ప ప్రజ్ఞావంతులు బోధించు విషయము గూడ ఒక్కొక్కసారి నిష్పలమగుచు౦డును. ఎందులకనగా బోధించు విషయమును శ్రోత గ్రహింపలేకపోవుట, గ్రహించినను ఆచరింపకుండుట.

వినయము చెడ్డపేరును తొలగించును. పరాక్రమము చెడును నిర్మూలించును. సహనము క్రోధమును చంపును. ఆచారము చెడు నడవడిని పోగొట్టును.

ఒక్క మాటలో చెప్పవలె నన్నచో తనకు విరుద్ధమైన దానిని పరులకు చేయకుండుటయే ధర్మము. తోచినట్టు ప్రవర్తించుట అధర్మము.

"వేలకొలది ధనమున్నవారు జీవించుచున్నారు, వందలున్నవారు బ్రతుకుచున్నారు. ధృతరాష్ట్రా! సంపదపై ఆశను వీడుము. ఏ విధముగ నైనను బ్రతుక వచ్చును" అని విదురుడు పలికెను.

కట్టెలతో అగ్ని శాంతించదు. నదులతో సముద్రము నిండదు. జీవులతో యముడు తృప్తిని బొందడు. పురుషులతో కులట సంతృప్తి పడదు.

కాయలు, పండ్లు లేని చెట్లను పక్షులు వదలి వెళ్ళునట్లు, మృతుడైన వాని దేహమును బంధుమిత్రాదులు త్యజింతురు. పోయినవాని సంపద నెవరో అనుభవింతురు. దేహ ధాతువులను పక్షులు, అగ్ని తినివేయును.

జీవుడు ఒక నదిలాంటివాడు. పుణ్యమే అందులోని జలము. సత్యరూపమైన బ్రహ్మమునుండి జీవుడనే జీవనది పుట్టినది. ధీర స్వభావమే దాని తీరము. కరుణయే కెరటము. అందు జలకమాడిన పుణ్యశీలి పవిత్రుడగును.

"సుఖము గోరు వానికి విద్య ఎక్కడిది? విద్యగోరువానికి సుఖము లేదు. సుఖమును కోరినచో విద్యను త్యజింపవలెను. విద్యను గోరినచో సుఖమును విడనాడవలెను" అని విదురుడనెను.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...