Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 1 Section 9

Bhagavat Gita

1.9

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః {1.43}

ఉత్సాద్యన్తే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః

ఈ కులనాశకుల దోషము చేత శాశ్వతములైన జాతి ధర్మములు, కులధర్మములు నశించిపోవును

ఉత్సన్న కుల ధర్మాణాం మనుష్యాణాం జనార్థన {1.44}

నరకే నియతం వాసో భవతీ త్యనుశుశ్రుమ

జనార్థనా! కులధర్మములను పాడుచేసుకొనిన మనుష్యులకు శాశ్వతముగ నరకము ప్రాప్తించునని మనము వినుచున్నాము

అర్జునడు ఐకమత్యము లేకుండా ఉన్న జీవితం యొక్క పర్యావసానాన్ని చెప్పుచున్నాడు. మనము స్వర్గము, నరకము ఎక్కడో ఉన్నాయని ఊహిస్తాము. నిజంగా అవి భూమి మీద ఉన్న మన పరిస్థితిని వివరించే భావాలు. మనం ఇతరుల సంతోషానికై పాటుపడితే భూతల స్వర్గాన్ని అనుభవిస్తాం. అలా కాక ఇతరుల యందు నిర్దయతో ఉంటే నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాం.

హింస, యుద్ధాలు, కాలుష్యం, ఎడబాటు, కఠినత్వం మొదలగునవి ఐకమత్యము లేకుండా ఉంటే కలిగే అనర్థాలు. మనం జీవితాన్ని లోతుగా పరిశీలించక యుండడం వలన మనలోని క్రోధాన్ని, భయాన్ని గ్రహింపలేకున్నాము. కొన్నేళ్ళు ధ్యానం చేస్తే వాటిని ఎదుర్కొని నిర్మూలించగలిగే శక్తి వస్తుంది. ధ్యానం మొదట్లోనే మన వ్యక్తిత్వాన్ని, నడవడికను, చేతన మనస్సును మార్పు చెయ్యగలిగే శక్తిని పొందుతాము. మనలో అలజడి చేసే ఎడబాటును నిర్మూలించే౦దుకు ప్రయత్నిస్తాము. దానివలన మన ఆరోగ్యం, ఇతరులతో సామరస్యం పెరిగి మన మనస్సు నిర్మలమై, మేధ పదునుగా అవుతాయి. అలాగే మనకు భద్రత, స్వస్థత కలిగేయనే భావన గట్టి పడుతుంది. ఎటువంటి సమస్యలు ఎదురైనా, పట్టుదలతో, జ్ఞానంతో వాటిని అధిగమిస్తాం.

జీవైక్యతా భావన సాధారణ వ్యక్తులను కూడా అత్యంత ఆధ్యాత్మిక శక్తి గలవారుగా మారుస్తుంది. సమాధిలో మనము అట్టి భావనలను పొందుతాము. అప్పుడు మన హృదయం, మనస్సు, ఆత్మ దేవుని మీద నిలకడగా ఉంటాయి. స్వామీ రామదాసు ఇలా చెప్పేరు:

"సాధనలన్నీ మనస్సును నిశ్చల౦గా ఉంచడానికై చెయ్యబడతాయి. ఏ మనస్సయితే అచలంగా ఉంటుందో అది పరమాత్మ స్వరూపము. " 41

Eknath Gita Chapter 1 Section 8

Bhagavat Gita

1.8

సంకరో నరకాయైన కులఘ్నానాం కులస్య చ

పత౦తి పితరో హ్యేషా౦ లుప్త పిండోదక క్రియాః {1.42}

వర్ణ సంకరము వలన కులమునకు, కుల నాశకులకు నరకము సిద్ధించును. అట్టివారి పితరులు శ్రాద్ధాది క్రియలు లేక అధోగతికి పోవుదురు

అన్ని గ్రంధాలలోనూ చెప్పే విషయాల సారాంశం పరిణామ సిద్ధాంతం ఒక ఉత్కృష్టమైన జీవైక్య స్థితికి తీసికివెళుతుంది. ప్రతి సున్నితమైన పరిశీలుకుడు ఈ విషయాన్ని తేనెటీగల జీవనశైలిని చూసి తెలిసికోవచ్చు. అలాగే ఒక అడవిలో నడిస్తే లేదా ఒక నిస్వార్థ వ్యక్తితో జీవిస్తే ఆ విషయం అర్థమవుతుంది. సృష్టిలోని ప్రతి శకలం తక్కిన వాటితో సామరస్యంగా ఉంటుంది. మనమెప్పుడు క్రోధాన్ని ప్రదర్శించి జీవైక్యాన్ని విస్మరిస్తామో అప్పుడు ఈ పరిణామానికి వ్యతిరేకంగా ఉంటాము. అలాకాక ఇతరులను క్షమించి, వారికేది మంచో అది చేసి, వారి ఒత్తిడిని తగ్గించే విధంగా వ్యవహరిస్తే మనం పరిణామంతో కలసి వెళుతున్నాము.

జీవైక్య౦ అంటే ఒక చిన్న జీవిని బాధ పెడితే మొత్తం జీవాల్ని బాధ పెట్టినట్టే. మనము ఇతర జీవులను బాధపెట్టే అలవాట్లను వదులుకొని, పదిమందికి ఉపకరించే ఉద్యోగాలు చేసి, మన క్రోధాన్ని, ఎడబాటును నియంత్రిస్తే సమిష్ఠికయి పనిచేస్తాం. జాన్ డాన్ ఇలా చెప్పెను:

"ఏ మనిషి ఒక ద్వీపం కాదు; ప్రతి మానవుడు ఖండంలో ఒక భాగం; ఒక మట్టి ముద్ద సముద్రపు కెరటం వలన కొట్టుకుపోతే, ఖండం క్షీణించినట్టే; అలాగే ఒక కొండ శిఖరం, ఒక రాజ సౌధము, మీ ఇల్లు కూడా; ఏ మనిషి మరణమైనా నన్ను క్షీణింపజేస్తుంది. ఎందుకంటే నేను మానవాళిలో ఒక భాగము; కాబట్టి గంట కొట్టబడితే వేరొకరిని పంపవద్దు; ఆ గంట మీ గురించే కొట్టబడింది"

ఈ జీవైక్యాన్ని మనము కుటుంబంతో, మిత్రులతో, సహచరులతో, సహఉద్యోగులతో, సమాజంతో, దేశాలతో, ఇతర జాతులతో, ఇతర మతములతో పంచుకోవాలి. ఇదే దేవుని ఉనికిని కనుక్కొనే మార్గం. 40

Eknath Gita Chapter 1 Section 7

Bhagavat Gita

1.7

యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ {1.33}

త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ

ఎవరి కొరకు మేము రాజ్యమును, భోగములను, సుఖములను ఆశించుచున్నామో, వారే ప్రాణధనముల మీద ఆశను వీడి యుద్ధము నందు నిలబడియున్నారు

ఆచార్యాః పితరః పుత్రా స్తథైవచ పితామహాః {1.34}

మాతులా శ్శ్వశురాః పౌత్రాస్స్యాలా స్సంబంధిన స్తథా

గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావలు, మరియు బంధువులును

ఏతాన్న హన్తు మిచ్చామి ఘ్నతో అపి మధుసూదన {1.35}

అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కింను మహీకృతే

ఓ మధుసూదనా! వీరు నన్ను చంపవచ్చినను, త్రైలోక్యాధిపత్యము లభించినను నేను వీరిని చంపను. ఇక భూమికొరకు చంపజాలనని చెప్పవలెనా?

నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్స్యాజ్జనార్దన {1.36}

పాపమేవాశ్రయే దస్మాన్ హ త్త్వైతా నాతతాయినః

జనార్థనా! దుర్యోధనాదులను వధించి మనము పొందే సంతోషమేమున్నది? పాపులైన వీరిని జంపిన మనకు పాపమే కలుగును

తస్మా న్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రా న్స్వ బాంధవాన్ {1.37}

స్వజనం హి కథం హత్వా సుఖిన స్స్యామ మాధవ

ఓ మాధవా! అందుచేత, బంధువులతో గూడి దుర్యోధనాదులను చంపుట మనకు తగదు. బంధువులను వధించి మనమెట్లు సుఖించెదము ?

యద్య ప్యేతే న పశ్య౦తి లోభోపహత చేతనః {1.38}

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్

కథం న జ్ఞేయ మస్మాభిః పాపా దస్మా న్నివర్తితుమ్

కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ర్జనార్థన {1.39}

లోభముచేత మనసు చెడిన ఈ కౌరవులు కులక్షయముచే కలుగు దోషమును, మిత్ర ద్రోహముచే కలుగు పాతకమును గాంచలేకున్నారు. జనార్థనా! కులక్షయముచే కలుగు దోషమును చక్కగా గ్రహించిన మేము ఈ పాపము నుండి మరలుటకు ఎందుకు ప్రయత్నించకూడదు?

కులక్షయే ప్రణశ్య౦తి కులధర్మా స్సనాతనాః

ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో అభి భవత్యుత {1.40}

కులక్షయము వలన పరంపరాగతములైన ధర్మములు నశించుచున్నవి. ధర్మము నశించుట వలన కులమంతటను అధర్మము వ్యాప్తి చెందును

అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః

స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణసంకరః {1.41}

అధర్మము వ్యాప్తి నొందినచో కులస్త్రీలు చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటవలన వర్ణసంకరము కలుగును ఀ

మనము జీవైక్యాన్ని పొందటానికి ఉద్యోగాలని, కుటుంబాలని, సమాజాన్ని వదిలి ఎక్కడో అడవిలోకి వెళ్ళి తపస్సు చేసికోనక్కరలేదు. బంధు మిత్రులతో కలసి మెలసి వారిలోని దైవత్వాన్ని చూసి మైమరచి, ఇతరులకై అవసరమయితే సుఖాలను త్యజించి వారి సంతోషానికై బ్రతకవచ్చు. ఇదే మనకి దేవునికి మధ్యనున్న స్వచ్ఛంద భావాలను తొలగించుకునే మార్గము.

అర్జునడు శ్రీకృష్ణుని మాధవ -- అనగా మధు వంశీయుడు --, వార్ష్నేయ -- అనగా వ్రిష్ని వంశీయుడు -- అని సంబోధించెను. వంశము ఐకమత్యానికి, నిస్వార్థ ప్రేమకు ప్రతీక. అర్జునునికి తన కుటుంబ బాధ్యతలమీద కలిగిన సందిగ్దత మనకు కూడా వర్తిస్తుంది. మనము పోటీ పడి, స్వార్థ పూరితులమై కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేము. భార్యాభర్తల మధ్యన, తలిదండ్రులు పిల్లలు మధ్యన, అన్నాచెల్లెళ్ళ మధ్యన, ఎక్కడ చూసినా పోటీ కనబడుతుంది. క్రమంగా పోటీ ఇంటినుంచి పాఠశాలలకు, సంస్థలకు, అంతర్జాతీయ సంబంధాలకు ప్రాకుతుంది. దానివలన అపనమ్మకము, సందేహము, ఈర్ష్య కలుగుతాయి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేనికై పోటీ పడనక్కరలేదు. ఎందుకంటే ఆనందము, జ్ఞానము మనలోనే ఉన్నాయి కనుక.

ఒక కుటుంబ సభ్యుడు ఆధ్యాత్మిక జీవనం అవలంబిస్తే తక్కిన వాళ్ళు ప్రభావితమౌతారు. తద్వారా రణ రంగంగా తలపించే ఇల్లు శాంతియుతంగా మారుతుంది. ఇది స్త్రీలకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే వారిలో సహనశీలత, ప్రేమ మొదలగునవి సహజంగా ఉంటాయి. కుటుంబ౦ మీద విశ్వాసం, ఐక్యమత్యంగా ఉండడం తలిదండ్రుల పిల్లల మధ్యనే కాదు. ఎవరైతే మన క్షేమం, బాగు కోరుతారో వారిని కూడా కలుపుకొని ఒక కుటుంబంగా భావించాలి. ఆనందమయి మా అని పిలవబడే యోగిని ఇలాగ చెప్పేరు: "మన దేహంలోని అవయవాలు వేర్వేరు పనులు చేస్తాయి. కొన్ని పనులు తక్కినవాటికన్నా ఉత్తమమైనవి. కానీ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఒక్క అవయవము తన క్రియను కోల్పోకూడదు. అలాగే మన బాంధవ్యాలన్నిటిలోనూ ప్రేమతో మెలగాలి. దీన్ని ఒక అలవాటుగా చేసుకొంటే సమస్త మానవాళి మన కుటుంబమవుతుంది. నాది, నీది అనే భావన పోతుంది. ఇదే భక్తి యొక్క గమ్యం." 38

Eknath Gita Chapter 1 Section 6

Bhagavat Gita

1.6

గాండీవం స్ర౦సతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే {1.30}

నచ శక్నో మ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః

గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది. చర్మము మండుచున్నది. నిలుచుటకు అశక్తుడనై యున్నాను. మనస్సు భ్రమించుచున్నది

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ {1.31}

న చ శ్రేయో అను పశ్యామి హత్వా స్వజన మహవే

కేశవా! విపరీతములైన అపశకునములు నాకు కనపడుచున్నవి. యుద్దములో బంధువులను వధించి నేను పొందు శ్రేయమేమిటో తెలియకున్నాను

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ {1.32}

కిం నో రాజ్యేన గోవింద కిం భోగై ర్జీవితేన వా

హే కృష్ణా! నేను విజయమును గాని, రాజ్యమును గాని, సుఖములను గాని ఆశించుట లేదు. హే గోవిందా! మాకు ఆ రాజ్యముతో, భోగములతో, ఆ జీవితముతో ఏమి లాభము?

అర్జునుడు మనందరి లాగే పట్టుదలను వీడుతున్నాడు. మనము యుద్ధాలు చెయ్యకుండా ఉందామనుకొంటూ సరికొత్త ఆయుధాలను తయారుచేస్తున్నాము. పైపెచ్చు అవి శాంతికై అవసరమని ఇతర దేశాలకు పంచి పెడతాము. మనం హింసని నిర్మూలిద్దామని అనుకొంటూ, మన పిల్లల్ని హింసాకాండతో కూడిన టివి కార్యక్రమాలను చూడనిస్తాము. పర్యావరణ కాలుష్యం ఉండకూడదనుకొంటాం, కానీ కాలుష్యాన్ని నదులు, సముద్రాలలోకి వదులతున్నాము. మనం పీల్చే గాలి, త్రాగే నీరు కాలుష్యంతో నిండి ఉంది. కాలుష్యాన్ని, హింసను తక్షణమే నిర్మూలించవచ్చు. కానీ దాని కవసరమైన పట్టుదల, జ్ఞానము లేవు.

అర్జునుడు తన తామస గుణాన్ని, తనయందు కలిగిన జాలిని వీడుదామనుకొన్నా వీడలేకున్నాడు. ఇదీ మనకు కూడా కలిగేదే. మన తప్పులు తెలిసికొని, మన ప్రపంచ౦ యొక్క వ్యాధి లక్షణాల తెలిసినా, వాటి గురించి మేధావుల్లా మాట్లాడగలముకానీ, వాటిని నివారించలేము; శాంతిని నెలకొల్పలేము; కాలుష్యాన్ని నిర్మూలించలేము; కనీసం విడిపోయిన కుటుంబాలను, మిత్రులను కలిపి సామరస్యాన్ని పెంపొందించలేము. మనస్సు లోతులలో నున్న పట్టుదలను ధ్యానం ద్వారా బయటకు తెచ్చి, మనలోని సృజనాత్మక గుణాలను, అగణితమైన శక్తిని పెంపొందించుకోవచ్చు.

ప్రత్యర్థుల సైన్యాన్ని చూసి అర్జునుని మనస్సు గందరగోళమై పోయి, తన గాండీవాన్ని పట్టుకోలేనంత బలహీనతను పొంది యుద్ధం చేయకూడదనుకొన్నాడు. ఇటువంటి పరిస్థితి మనకందరకూ కలుగుతుంది. మన దుఃఖానికి, బాధకు కారణమైన స్వచ్ఛంద భావాలను వీడాలని తలుస్తాము. ఆధ్యాత్మిక సాధనలో విజయం పొందాలంటే మిక్కిలి ధైర్యముతో నుండాలి. ఎందుకంటే అది మనకున్న బలాన్ని, సాహసాన్ని పరీక్ష చేస్తుంది కనుక. నా అమ్మమ్మ అంటూ ఉండేది అహింసా వాదిని ఎవరూ భయపెట్టలేరు అని. హింసా వాదిని ఎక్కువ హింసతోనే స్వాధీనం చేసికోవాలి. ఎవరైతే హింసను సహిస్తారో, అవకాశమున్నా పగ తీర్చుకోరో, ఇతరులను హింసించక వారు చేసిన అన్యాయం సహిస్తారో వారే నిజమైన ధైర్యవంతులు. ఇదే జీసస్ క్రైస్ట్ ఈ విధముగా చెప్పెను: "శత్రువులను ప్రేమించండి; క్రోధంతో దూషణ చేసేవారిపై దయ చూపండి; ద్వేషించేవారికి మంచి చెయ్యండి; మనకు అన్యాయం చేసినవారికై ప్రార్ధించ౦డి". శ్రీకృష్ణుడు అత్యంత దయతో కూడినవాడై, ఎలాగైతే మనల్ని హింసలో సహనంతో నుండే౦దుకు, ఇతరులు ప్రేరేపించినా ఓర్పుతో సహించుటకు, ఇతరులు ద్వేషిస్తూ ఉంటే వారిపై ప్రేమ చూపుటకు తగిన శక్తినిస్తాడో అలాగే అర్జునుని తనకు తానే తన బలాన్ని గుర్తించేటట్టు చేసేడు. ఈ విధంగా మనము ధైర్యవంతులము, బలవంతులము అయి ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి కావలసిన శక్తిని పొందుతాము. 35

Eknath Gita Chapter 1 Section 5

Bhagavat Gita

1.5

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపి ధ్వజః {1.20}

ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః హృషీకేశ౦ తదా వాక్యం ఇదమాహ మహీపతే

పిమ్మట ఓ రాజా! శస్త్ర యుద్ధము కాబోవు సమయాన కపిధ్వజుడగు అర్జునుడు సమర సన్నుద్ధులై యున్న దుర్యోధనాదులను జూచి విల్లు నెక్కుపెట్టి శ్రీకృష్ణుని జూచి ఇలా పలికెను

అర్జున ఉవాచ:

సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత {1.21}

యాన దేతా న్నిరీక్షే అహం యోద్ధుకామా నవస్థితాన్

హే అచ్యుతా! రెండు సేనల నడుమ నా రథమును ఉంచుము.

కైర్మయా సహ యోద్ధవ్య మస్మిన్ రణ సముద్యమే {1.22}

కైర్మయా సహ యోద్ధవ్య మస్మిన్ రణ సముద్యమే

ఈ రణరంగమున నేను ఎవరితో పోరాడవలెనో అట్టి యుద్ధము చేయగోరి నిలుచున్న వారిని చూచెదను

యోత్స్యమానా నవేక్షే అహం య ఏతే అత్ర సమాగతాః {1.23}

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ర్యుద్ధే ప్రియచికీర్షవః

దుర్బుద్ధియగు దుర్యోధనునికి యుద్ధమందు మేలు జేయగోరి ఇచ్చట సమాగతులైన యుద్ధవీరులను నేను చూచెదను.

సంజయ ఉవాచ:

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత {1.24}

సేనయో రుభయో ర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్

ఓ ధృతరాష్ట్రా! అర్జును డిట్లు పలుకగా శ్రీకృష్ణుడు భీష్మద్రోణులు మొదలగు రాజులకు ఎదురుగ గొప్పదియగు రథమును ఉభయసేనలకు మధ్య నిలిపి,

భీష్మ ద్రోణ ప్రముఖత స్సర్వేషా౦చ మహీక్షితామ్ {1.25}

ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి

"అర్జునా! యుద్ధమునకు సన్నద్ధులై యున్న ఈ కౌరవులను వీక్షింపుము" అనెను

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పిత్రూనథ పితామహాన్ {1.26}

ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీ౦ స్తథా శ్వశురాన్ మహృదశ్చైవ సేనయో రుభయో రపి

పిమ్మట, అచ్చట ఉభయ సేనల యందున్న తండ్రులను, తాతలను, గురువులను, మామలను, సోదరులను, కుమారులను, మనుమలను, స్నేహితులను గూడ అర్జునుడు చూచెను.

తాన్ సమీక్ష్య స కౌ౦తేయ స్సర్వాన్ బ౦ధూ నవస్థితాన్ {1.27}

కృపయా పరయా ఆవిష్టో విషీద న్నిద మబ్రవీత్

యుద్ధ సన్నద్ధులై యున్న బంధువులను జూచి అపార దయాపరవశుడై అర్జునుడు దుఃఖించుచు ఇలా పలికెను

అర్జున ఉవాచ:

దృష్ట్వేమం స్వజనం కృష్ణ {1.28}

యుయుత్సుం సముపస్థితమ్

కృష్ణా! యుద్ధమునకు వచ్చిన ఈ బంధువులను గాంచి నా అవయవములు శిధిలము లగుచున్నవి.

సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి {1.29}

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే

నోరు ఎండి పోవుచున్నది. శరీరము వణకుచున్నది. గగుర్పాటు కలుగుచున్నది

మనం చెయ్యవలసిన పనులు చెయ్యక, పనికిమాలిన పనులు చేస్తే కలిగేది గందరగోళం. ఇది మనం బంధు మిత్రులతో కలహించి, మన స్వచ్ఛంద భావాలు, వేర్పాటులతో పోరు చెయ్యకపోవడం వలన కలిగేది. అర్జునునికి యుద్ధం చెయ్యవలసింది తన అంతరాత్మతోనే అని నెమ్మదిగా తెలిసివస్తున్నాది. మనస్సులోంచి ప్రతి స్వార్థ పూరిత ఆలోచనను తీసివేయడానికై మనలాగే అర్జునడు "నేను నా బంధుమిత్రులతో ఎలా యుద్ధం చెయ్యడం?" అని శ్రీకృష్ణుని అడుగుతున్నాడు.

కొందరు చిన్నప్పటినుంచీ ఇంద్రియాలతో సుఖం అనుభవించడమే జీవిత లక్ష్యమని, వాటిని తిరస్కరిస్తే జీవితం వ్యర్థమని భావిస్తారు. వారి ఆధ్యాత్మిక సాధన ముందుకు వెళ్తున్నకొద్దీ కోరికలు నియంత్రింపబడి, సంతోషంగా ఉండడానికి బదులు ఆందోళనతో, భద్రత కి బదులు వస్తువులను సేకరించడం చేస్తారు. వారు తరచు నిరాశ పొందినా, శాశ్వతమైన ఆనందం ఒక వస్తువులాగ తలచి దానికై ప్రాకులాడుతారు. గతంలో అపజయం పొందినా, మరల మరల దానికై ప్రయత్నిస్తారు. నేను రెండు కుక్కలు తోటను తడిపే కొళాయిలోంచి వచ్చే నీటిమీద ఆవిర్భవించిన ఇ౦ద్రధనుస్సును పట్టుకోవడానికి ప్రయత్నించడం చూసేను. వాటికి అది ఒక భ్రాంతి అని, దానిని ఎన్నటికీ పట్టుకోలేవని తెలియదు. అలాగే కొందరు ఆనందం, పరువు ప్రతిష్ఠలు, లాభానికై ప్రయత్నిస్తున్నారు. వారికి ఎన్ని మార్లు ప్రయత్నించి విఫలమైనా వాని గురించి పూర్తి అవగాహన కలుగలేదు.

ప్రసార మాధ్యమాలు, ప్రకటనలు మన దృష్టిని శాశ్వతమైన ఆనందం మీద కాకుండా క్షణికమైన సుఖాల వైపు మళ్ళిస్తాయి. వాటివలన చిన్న వయస్సు నుంచి దేహేంద్రియ మనస్సులను సంతోష పరిచే విషయాలపై ఆసక్తి చూపిస్తాము. మన౦ ఇంద్రియాలకు, మనస్సుకు తర్ఫీదు ఇచ్చి అహంకారం మీద ఎదురు తిరగడానికి భయపడతాం. ధ్యానం ద్వారా మనకు తెలిసే ముఖ్యా౦శం అహంకారం ఒక నియంతగానై సమస్త జ్ఞానానికి, సృష్టికి మూలమైన ఆత్మ యొక్క స్థానాన్ని లాక్కుందని. ఆ విధమైన జ్ఞానంతో నిత్యం ఉండగలిగితే అహంకారాన్ని జయించిన వారలమవుతాము. 34

Eknath Gita Chapter 1 Section 4

Bhagavat Gita

1.4

పాంచజన్యం హృషీ కేశో దేవదత్తం ధనంజయః {1.15}

పా౦డ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః

శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును, భయంకరమైన కార్యములు చేయు భీముడు పా౦డ్రమును పూరించిరి

అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః {1.16}

నకులః సహదేవశ్చ సుఘోష మణి పుష్పకౌ

కుంతీ కుమారుడును, రాజును అగు ధర్మరాజు అనంత విజయమను శంఖమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పక మను శంఖమును,

కాశ్యశ్చ పరమేష్వాస శ్శిఖండీ చ మహారథః {1.17}

ధృష్టద్యుమ్నో విరాటశ్చసాత్యకి శ్చాపరాజితః

ఉత్కృష్టమైన విల్లు గల కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపజయ మెరుగని సాత్యకియు,

దృపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృధివీపతే {1.18}

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్పృథక్

హే రాజా! దృపదుడు, ద్రౌపది కుమారులు, గొప్ప భుజములుగల శుభద్ర తనయుడగు అభిమన్యుడు అందరు వేరువేరుగ తమ శంఖములను పూరించిరి

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ {1.19}

నభశ్చ పృధివీం చైవ తుములో వ్యనునాదయన్

ఆ భయంకరమైన శంఖనాదము భూమ్యాకాశములను ప్రతిధ్వనింపజేయుచు, దుర్యోధనాదుల హృదయములను తల్లడిల్ల జేసెను ఀ

కురుక్షేత్రంలో విలుకాళ్లు, మావటులు తో యుద్ధం జరిగితే నేటికాలంలో తుపాకులతోనూ, మారణాయుధాలతోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. దేశ కాలాలు, ఆయుధాలు మారేయిగానీ యుద్ధాలు జరగడానికి కారణాలు మారలేదు. "ద్వేషము ప్రేమ వలననే తొలగుతుంది" అని బుద్ధుడు చెప్పెను. హింసాకాండను హింసతో ఎదుర్కోలేము. పగ, కక్ష సాధింపు ఇరు పక్షాలను మరింత దూరం చేసి, జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.

స్వచ్ఛంద౦గా ఉంటే అభద్రత, అనారోగ్యం, ఒంటరితనం, దుఃఖం కలుగుతాయి. ఎవరైతే పేరు ప్రతిష్ఠలకై, స్వలాభానికై, తమ కుటుంబాన్ని, సమాజాన్ని విస్మరించి స్వార్థపూరితంగా బ్రతుకుతారో వారికి నిరాశ తప్పదు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి "ఒకరికి ఇవ్వడం ద్వారా మనం పొందుతాం. క్షమించడం వలన మనం క్షమింప బడతాం" అని చెప్పిరి. చాలా మందిలో ఎంత దోచుకుంటే అంత పొందుతాం, కోపాన్ని ప్రదర్శించడంవలన సంబంధాలు మెరుగుపడతాయి, స్వచ్ఛందంగా ఉంటే సంతృప్తి కలుగుతుంది అనే తప్పుడు భావాలు ఉన్నాయి. ఇతరులను మోసం చెయ్యడం, వస్తువులను పోగుచేసుకోవడం వలన ఆనందం ఎన్నటికీ రాదు. భద్రత ఆయుధాల వలన కాక, వ్యక్తుల, జాతుల, దేశాల మధ్య నమ్మకం, గౌరవం ఉంటే కలుగుతుంది. శాంతి మన హక్కులు ఇతరుల హక్కుల కన్న ఎక్కువని భావించడం వలన కాక, మన బంధు మిత్రుల లేదా మానవాళి క్షేమానికై పాటు పడడం వలన వస్తుంది. ఇదే ధ్యానంలో కలిగే జ్ఞానం: ఆధ్యాత్మిక మార్గంలో పరాజయ౦ కలుగదు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా, మార్గ దర్శిగా ఉండి స్వచ్ఛంద భావాలను తొలగించుకోవడానికి తోడ్పడుతాడు.

శ్రీకృష్ణుని కున్న అనేక నామాలలో హృషీకేసుడు అను నామము ఉన్నతమైనది. దాని అర్థం ఆయన కేశాలు ఆనందంతో నిక్కబొడుచుకొని ఉంటాయని. అలాగే అర్జునుని నామాలలో ధనంజయ అను నామము విశిష్టమైనది. దాని అర్థం ధనాన్ని జయించినవాడు అని. ఇది ధ్యానం చేయువానికి కూడా బాగా వర్తిస్తుంది. ఎందుకంటే అసలైన ధనం పరుల సేవతోనే వస్తుంది. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. మన స్వచ్ఛంద భావాలు అంత వేగిరాంగా పోవు. అహంకారంతో మన పోరు దీర్ఘకాలం సాగి ఒక్కొక్కప్పుడు జీవితా౦తం పట్టవచ్చు. ఎప్పుడైతే ఈ సవాలును తీసికొంటామో నిరాశ లేక, విజయం పొందడానికి కావలసిన సమర్థత, బలం, కోరిక కలుగుతాయి. క్రోధం మొదలగు చెడ్డ గుణాలను నియంత్రించి మన లక్ష్యానికై ఉపయోగిస్తాము. క్రోధ౦ మన అదుపులో పెట్టుకొని ఒక శక్తిగా వాడుకొంటాం. చాలా మంది యోగులు ఈ సవాలును తీసికొని కృత్యకృత్యులైనారు. బుద్ధుడు "ఒకడు వేలాది సార్లు, వేలాదిమందిని యుద్ధంలో ఓడించవచ్చు. కానీ ఇంకొకడు తనని తానే ఓడించుకొంటే యోధులందరిలో వాడే గొప్పవాడు" అని చెప్పెను. ఒక యోగికే తెలుసు స్వచ్ఛంద భావాలను ఎటువంటి కష్టాలతో నియంత్రించాలో; సహనాన్ని పరీక్షించే పరిస్థితులను ఎలా గెలవాలో; ఇతరులు దూషిస్తున్నా వారిని క్షమించగలిగే స్వభావం ఎలా పొందాలో. 31

Eknath Gita Chapter 1 Section 3

Bhagavat Gita

1.3

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః {1.12}

సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్

పరాక్రమవంతుడును, కురువృద్ధుడును, పితామహుడును అగు భీష్మాచార్యులు దుర్యోధనునికి సంతసమును కలిగించుటకు బిగ్గరగ సింహనాదము చేసి శంఖమును పూరించెను

తత శ్శ౦ఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః {1.13}

సహసై వా భ్యహన్య౦త స శబ్ద స్తుములో అభవత్

పిదప శంఖములును, దుందుభులును, తప్పెటలును, మృదంగములును, బూరలును కౌరవసైన్యమున ఒక్కసారిగ మ్రోగింప బడినవి. ఆ శబ్దములు అంతటను వ్యాపించెను

తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ {1.14}

మాధవః పాండవశ్చైవ దివ్యౌ సంఖౌ ప్రదధ్మతుః

పిమ్మట, తెల్ల గుఱ్ఱములు గట్టిన గొప్ప రథము నందాసీనులై యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి

కురుక్షేత్రంలో మంచి, చెడు మధ్య జరిగిన మహాసంగ్రామంలో అర్జునుడు మనకందరికీ ప్రతీక. ప్రతి జీవిలోనూ ప్రేమతో నెలకొన్న శ్రీకృష్ణుడు అతని మిత్రుడు, సఖుడు, గురువు, మార్గదర్శి. శ్రీకృష్ణుడు ఎక్కడో అంతరిక్షంలో లేడు. అతను మన దేహానికన్నా దగ్గరలో ఉన్నాడు. క్రిష్ అనగా లాగుకొనుట. మనలోని కృష్ణుడు మనని తనవైపు లాక్కొ౦టున్నాడు. శ్రీకృష్ణుడు అనాదిగా, సర్వవ్యాపకమై ఉన్నాడు. అతడే విశ్వమంతటిని ఐకమత్యంతో నడిపించే యాదార్థమైన చేతన శక్తి. 28

Viveka Sloka 39-40 Tel Eng

Telugu English All శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమభవార్ణవం జనా- నహేతునాన్యానపి తారయంత...