Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 27

Bhagavat Gita

2.27

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన {2.47}

మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సంగో అస్త్వ కర్మణి

నీకు కర్మ చేయుట యందే అధికారము కలదు. కర్మ ఫలమునందు ఆశవద్దు. కర్మఫలమునకు నీవు కారణభూతుడవు గాకుము. అలాగని కర్మలను వదలుట యందు ఆసక్తి జూపకుము

మనకు అధికారము కర్మలు చేయుట యందే ఉన్నదికాని కర్మ ఫలము మీద లేదు అని చెప్పబడే ఈ శ్లోక తాత్పర్యము మనలో చాలామందికి తెలుసు. ఇంకోవిధంగా కర్మలు చేయడం ఇష్టం లేనివారు, పరిస్థితుల ప్రభావం వలన "లాభం ఏమిటి? ప్రతీదీ గంగలో కలిసిపోతోంది" అని అంటారు. శ్రీకృష్ణుడు మనకిలా బోధిస్తున్నాడు: మీ సంపూర్ణ హృదయం, మనస్సు లతో నిస్వార్థ సేవకై, మంచి మార్గంలో, శుద్ధమైన సాధనాలతో పనిచేస్తే నేను దాని బాధ్యత వహిస్తాను. కాబట్టి మన బుద్ధిని ఉపయోగించి, తప్పొప్పుల గురించి ఆలోచించి, తద్వారా ఒక ఉత్తమ లక్ష్యాన్ని ఎన్నుకొని, మన సామర్థ్యం దృష్టిలో పెట్టుకొని, మంచి సాధనాలతో కర్మ చెయ్యాలి. యోగులు చెప్పేది: చెడు సాధనాల వలన మంచి కార్యం జరుగదు; మంచి సాధానాల వలన కార్యం చెడదు. అందుకే గాంధీ "పూర్ణమైన ప్రయత్నం, పూర్ణమైన విజయం తెస్తుంది" అని అన్నారు.

గాంధీ కర్మ యోగం లేదా నిస్వార్థ సేవ, ఫలంతో సంబంధం లేకుండా, అపజయాలతో నిరాశ చెందకుండా, చేసేరు. ఆయన ఆఫ్రికా నుండి 1915 లో తిరిగి వచ్చినపుడు దేశం రెండు శతాబ్దాలు బానిసత్వంతో మగ్గుతోంది. దేవుని దయతో, తుపాకీ చేత బట్టకుండా, అహింసతో స్వాతంత్ర్యం తాను తెస్తాను అని చెప్పినపుడు ఎవరూ నమ్మలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడి వారితో సామరస్యంతో కలసిమెలసి ఉండి, వాళ్ళను నిద్రనుంచి తట్టి లేపి, మూడు దశాబ్దాలలో, దేశ చరిత్రతో పోలిస్తే అతి తక్కువ సమయంలో, దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణభూతులైనారు. ఎందుకంటే గాంధీ గారి అహింసా వాదం ప్రజలకీ, బ్రిటిష్ వారికీ నచ్చి, ఆయన చెప్పుచేతల్లో ఉన్నారు.

కానీ అది అంత సులభంగా రాలేదు. గాంధీ గురించి అనేక చెడు కథనాలు ప్రచారం చేయబడ్డాయి. ఆయన అనుచరులు, దురదృష్టవశాత్తూ, ఆయనపై ఎదురు తిరిగేవారు. ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ప్రజలు అతనిని తొలగి పొమ్మని నినాదాలు చేసేవారు. ఏది ఏమైనా గాంధీ "నేను అహింసా వాదిని. మీకు అది నచ్చక పోతే మీతో నాకు పనిలేదు" అని ఖచ్చితంగా చెప్పేవారు. ఆయన స్వాతంత్ర్య పోరాటం తనంతట తానే చెయ్యడానికి సిద్ధమయ్యేరు. ఆయనకు దేవుడు తనను విజయుడిని చేస్తాడని తెలుసు. ఎందుకంటే ఆయన మంచి సాధనాలు మంచి లక్ష్యానికై వాడుతున్నారు.

అలాగే శ్రీకృష్ణుడు చెప్పేది కర్మలు చేయకండని కాదు. మనము ఆధ్యాత్మిక చింతనలో పడి, ఒక పంజరంలో చిలకలా ఉండి, ప్రపంచంలోని సమస్యలు నిస్వార్థంతో పరిష్కరించడం మన వలన కాదని తలచకూడదు. మనమంతా సమాజానికి ఋణపడి ఉన్నాము. కాబట్టి సమాజాన్ని విడిచి, ప్రపంచ౦లోని సమస్యలను పట్టించుకోకుండా మనం ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లలేము. గీత కర్మ చెయ్యమని ప్రోద్భలం చేస్తుంది. ఆ కర్మ మంచి సాధనాలతో, ఉన్నతమైన లక్ష్యానికై చెయ్యాలి. 98

Eknath Gita Chapter 2 Section 26

Bhagavat Gita

2.26

యావానర్థ ఉ దపానే సర్వత స్స౦ప్లుతోదకే {2.46}

తావాన్ సర్వేషు బ్రాహ్మణస్య విజానతః

అంతటను నిండియున్న నీరు౦డగా జలాశయమునందు నీటి విషయమై ఎంత ప్రయోజనము కలదో బ్రహ్మ జ్ఞాని యగు బ్రాహ్మణునకు వేదములయందు అంతియే ప్రయోజనము కలదు

నైఋత పవనాలు వచ్చేయంటే ఎండాకాలం పోతున్నాదనే సూచన వచ్చినట్లే. వానలు కురిసి బావులు, చెరువులు, నదులు నిండుగా ఉంటాయి. కానీ మళ్ళీ ఎండాకాలం వచ్చి గడ్డు రోజులు తెస్తుంది. నూతుల్లో, చేరువుల్లో, నదులలో నీరు కరవై ప్రజలకు నీటి ఎద్దడి కలుగుతుంది. కొన్ని గ్రామాల్లో బహు దూరం నుంచి బిందెలతో నీరుని ఇంటికి తెచ్చుకుంటారు. ఎక్కడైతే కొళాయిలు వుంటాయో, అక్కడ నీటి సరఫరా రోజుకు ఒక గంటో, రెండు గంటలో ఉంటుంది.

అలాగే ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహము మనలో నిరంతరమూ లేకపోతే, బిందెలతో బయటినుంచి తెచ్చుకోవాలి. ధ్యానం చేసే ముందు బిందెలు ఖాళీగా ఉంటాయి. ధ్యానం అయిన తరువాత అవి నిండుతాయి. మరుసటి రోజు బిందె మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ఈ చక్రం అలా నడుస్తూ ఉంటుంది. కానీ మనలో దేవుడున్నాడనే వెల్లువ కలిగితే ఇక బిందెలతో పనిలేదు. భగవంతుని ప్రేమ సాగరంలో మునిగిపోయి ఉంటే ఇక బావుల, సరస్సుల అవసరం లేదు. అటువంటప్పుడు మన ధ్యానం చెయ్యనక్కరలేదు. స్మృతుల అవసరం లేదు. మన అచేతన మనస్సులో మంత్రం నిరంతరము జపింపబడి, మన చేతన మనస్సుకు పని లేదు. ఇది ఒక ఊహ. దీనిని అనుభవించగలిగితే మనము ధన్యులము. అంతవరకు మనము ధ్యానం చేసి, మంత్ర జపం చేసి, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని, పరోపకారానికై బ్రతుకుదా౦. 96

Eknath Gita Chapter 2 Section 25

Bhagavat Gita

2.25

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున {2.45}

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మ వాన్

అర్జునా! వేదములు త్రిగుణములే విషయములుగ కలిగి యున్నవి. నీ త్రిగుణములను నతిక్రమి౦చుము. ద్వంద్వాతీతుడవు కమ్ము. సత్త్వాశ్రయుడవు కమ్ము. యోగక్షమముల నుండి విడిపడి ఆత్మజ్ఞానివి కమ్ము.

గీత విశ్వంలో ప్రతి వస్తువు, ప్రాణి త్రిగుణాల వలన జనించినదని చెప్పింది. దానిని మనకి అన్వయించుకొంటే సాత్వికులు చట్టానికి వినమ్రులు, రాజసికులు శక్తిమంతులు, తామసికులు స్తబ్దుగా ఉండేవారు.పరిణామము దృష్ట్యా తమస్ రజస్ గా, రజస్ సాత్వికత గా మార్పు చెందుతాయి. ఈ పరిణామము మన నడవడికకు ప్రమాణము.

కదలనిది , స్తబ్దుగా ఉండేదేదైనా తమస్ తో నిండియున్నది. తామసికులు ఒక శిలలా పడి ఉంటారు. ఒక రాయి యొక్క ధర్మము స్తబ్దుగా ఉండడం. కానీ అది మనకు వర్తించదు. కొందరు తాము ఇతరులతో పూర్తిగా అనుసంధానమై ఉన్నామని చెప్తారు. అది చెడయినా కావచ్చు మంచైనా కావచ్చు. గాంధీ మీరు చెడుతో అనుసంధానమైతే దాన్ని మంచిగా మార్చడానికి ప్రయత్నించాలి అని చెప్పేరు. ఆయన స్వరాజ్యానికై పాటుపడుతున్న రోజుల్లో, ఒకరు ఆయన పని ఏమిటని అడిగేరు. ఆయన "నేను చెడును నియంత్రించేవాడిని" అని చెప్పేరు. ఆయన ఎన్నటికీ తన అహింసా భావాలను వదలక, చెడుతో అనుసంధానమైనప్పటికీ, దానిని వ్యతిరేకించి, దానిని మంచిగా మార్చడానికి ప్రయత్నించేవారు.

తమస్ ను రజస్ గా మార్చుకోడానికి కొన్ని మెట్లున్నాయి. తమస్ పనులు జాప్యం చేయిస్తుంది. అందుకే మనము సంకల్పించిన పనిని వెంటనే చెయ్యడానికి పూనుకోవాలి. యోగులు వర్తమాన కాలంలో బ్రతికేవారు. కాబట్టి వారికి తక్షణమే అనే ప్రయోగం సమ్మతం.

దృష్టి పని యందు కేంద్రీకరించడం వలన తమస్ తగ్గుతుంది. ఉదాహరణకు కొందరు ఒక కార్యం ఉపక్రమించి, ఒక గంట తరువాత దాని వలన ఏమీ లాభం లేదని నిశ్చయించి కార్యాన్ని పూర్తిగా చేయకుండా వదిలిపెట్టేస్తారు. మనక ఒక కార్యం మీద మక్కువ లేకపోతే, దానిపై దృష్టి కేంద్రీకరించి మక్కువగా చేసికోవాలి. అలాగ ఎక్కువసేపు కేంద్రీకరిస్తే కొన్నాళ్ళకు ఆ కార్యాన్ని పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఈ విధంగా ధ్యానాన్నికూడా అభివృద్ధి చేసుకోవచ్చు.

రజస్ నుండి సత్త్వానికి మారడం అంత కష్టం కాదు. ఎందుకంటే మనందరిలో సత్త్వ గుణమెంతో కొంత ఉన్నది కనుక. మనకి బంధుమిత్రులు మనయందు తప్పుగా ప్రవర్తిస్తే వారిని క్షమించి, వారితో మైత్రి చేసే సద్గుణము సత్త్వ. దాన్ని బంధుమిత్రులకే పరిమితం చెయ్యకుండా సర్వత్రా వ్యాపింప జెయ్యాలి. సహజంగా మనలో తమస్ మరియు సత్త్వ గుణములు వేర్వేరు పాళ్ళలో ఉంటాయి. తమస్ ని ధ్యానం ద్వారా రజస్ గా మార్చుకొంటే మనము శక్తివంతులమై పనులు చాకచక్యంగా చేయడం, పరులకు సేవ చెయ్యడం వంటి కార్యాలు తేలికగా చేస్తాం. ఈ శక్తిని సత్త్వగా మార్చుకోవలసి ఉంది. అందుకే నేను తగినంత వ్యాయామం, పనులు లేదా చదువుల మీద దృష్టిని కేంద్రీకరించడం వలన ఆ శక్తిని సమంగా వాడుకుంటామని చెప్తాను. కానీ మనము ధ్యానం చెయ్యకుండా, తగినంత వ్యాయామం చేయక, ఇష్టంలేని ఉద్యోగం చేస్తూ, పరులకు ప్రతిఫల మాశి౦చకుండా సేవ చేయక ఉంటే ఆ శక్తి వృధా అవుతుంది.

వళ్ళు వంచి పనిచెయ్యడం ఒక విధంగా మంచిదైతే నేటికాలంలో త్వరత్వరగా చెయ్యాలనే ఒత్తిడి కొందరు కలిగించుకుంటారు. అందుకై వారు పనిని ఆఫీసులోనేకాక ఇంట్లోకి కూడా తెచ్చి చేస్తారు. ఇది మంచిది కాదు. మనము ఆఫీసు పనిని సమర్థతో చేసి దానిని అక్కడే వదిలిపెట్టి తక్కిన కార్యాలమీద దృష్టి సారించాలి. దీని వలన ఒత్తిడి తగ్గి పనులు చేయడంలో దక్షత వస్తుంది.

సాత్త్వికుడు నిశ్చలంగా, దయతో, అభద్రత లేకుండా జీవిస్తాడు. మనస్సు అతలాకుతలంగా ఉంటే మన నిర్ణయాలు తప్పుగా అవుతాయి. అందుకే మనము క్రోధంతో లేదా భయంతో కూడి ఉన్నప్పుదు పనులు చేయకూడదని గీత చెప్తుంది. మనస్సు ఉద్రేకంగా ఉంటే జపం చేసి దానిని స్వాధీనం చేసికోవచ్చు.

ఇంకా సాత్త్వికులు పరుల తప్పులను తేలికగా క్షమిస్తారు. అచేతన మనస్సులో పాత కక్షలు, పగలు నిర్విరామంగా పనిచేసి అవి చేతన మనస్సును కూడా వ్యాపిస్తాయి. దాని వలన మనస్సు వికలమై, ఎక్కువ నిరాశ కలుగుతుంది. క్షమ గురించి ఎంత చదివినా, మాట్లాడినా లాభంలేదు. మన స్వీయశక్తితో క్షమను పొందలేము. దానికై మంత్ర జపము చేసి, దేవుని ప్రార్ధించాలి.

శ్రీకృష్ణుడు ఇలాగ తమస్ నుండి రజస్ కు, రజస్ నుండి సత్త్వకు మారడంతో సరిపోదు, వాటికి అతీతమైన స్థితిలో ఉండాలని చెప్తున్నాడు. అంటే మనం దేశాకాలకారణ త్రయంనుంచి విడిపడి, మరణాన్ని దాటి శాశ్వతమైన, అమృతత్వమైన, అనంతమైన స్థితిని పొందాలి. 95

Eknath Gita Chapter 2 Section 24

Bhagavat Gita

2.24

యామిమాం పుష్పితాం వాచం ప్రవద స్త్వవిపశ్చితః {2.42}

వేదవాదరతాః పార్థ నాన్య దస్తీతి వా దినః

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫల ప్రదా౦ {2.43}

క్రియావిశేషబహుళా౦ భోగైశ్వర్యగతిం ప్రతి

భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసామ్ {2.44}

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే

పార్థా! వేదవాదముల యందు రమించువారును, కామ్య కర్మలే అధికములని వాదించువారును, స్వర్గమే ఉత్కృష్టమైనది యని భావించి పుష్పిత వాక్కులను పలుకువారును, కోరికలతో నిండినవారును, స్వర్గాభిలాషులును, జన్మ కర్మ ఫలముల నొసగు నదియు, భోగైశ్వర్యములు నొసగునదియునగు వివిధ కార్యములను శ్లాఘించువారును నగు అట్టివారి పుష్పితవాక్కులకు అవశులై ఎవరు భోగైశ్యర్యముల యందు అభిలాషను కలిగి యుందురో అట్టివారికి సమాధియందు నిశ్చయాత్మకమైన బుద్ధి యుండదు

గీత ఇది సమ్మతం, అది నిషేధం అని చెప్పదు. శ్రీకృష్ణుడు చెప్పేది మీకు ఆనందం, భద్రత, జ్ఞానం కావాలంటే నేను చెప్పిన మార్గంలో నడవమని. అలాగే విచారం, అభద్రత, దుఃఖం కలిగే మార్గం వేరే. ఈ రెండు మార్గాల సూచనలు ఇచ్చి, భగవంతుడు మనలను ఎన్నిక చేసుకొమ్మన్నాడు.

ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు సమాధి పొందలేనివారి గూర్చి చెప్తున్నాడు. ఎవరైతే దేవుడు లేడు, జీవితం తిని, తాగి, ఆనందంగా బ్రతికి, చివరికి మరణించడమే అని తలచేవారు సమాధి స్థితికి చేరలేరు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం: ఒకడు నాస్తికుడు అని చెప్పుకోడానికి, అనుభవం ఉండాలి. మన మనస్సులో దేవుడు లేడు అని చెప్పడానికి, దాన్ని ముందు పరిశీలించ గలగాలి. నేను నాస్తికులను అడిగేది: "మీరు మిమ్మల్ని నమ్ముకోరా?" దానికి వారు ఇచ్చిన సమాధానం "తప్పకుండా". "అంటే మీరు దేవుడ్ని నమ్ముతారు" అంటాను. గీత ఈశ్వరుడు, భగవంతుడు అనే పద ప్రయోగం చేసేది, వారు ఎక్కడో "అల వైకుంఠ పురములో, నగరిలో" అన్నట్టు లేరు. వారు మన మనలోనే నిక్షిప్తమై ఉన్నారు.

మన హృదయం స్వార్థంతో, మన౦ ఇంద్రియలోలత్వంతో, ఉన్నప్పుడు సృష్టి యొక్క కార్యకలాపాలు భగవంతుడు చేస్తున్నాడని తెలిసికోలేం. దీన్నే శ్రీకృష్ణుడు కామాత్మనాః అన్నాడు. అనగా -- ఎవడి మనస్సయితే కామ సంకల్పాలతో నిండి ఉందో. శ్రీ రామకృష్ణ ఒకనిలో రాముడు, కాముడు కలిసి ఉండలేరు అని చెప్పేవారు. అది మనలో చాలామందికి అంతుబట్టదు. ఆధ్యాత్మిక సాధన చేస్తే వాటి గురించి తెలిసి, కాముడుని వదిలించుకుంటాం. ఈ నేపథ్యంలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు గతంలో మనం కోరుకున్నవి మనస్సుకు వచ్చినా ఆందోళన చెందనక్కరలేదు. మన౦ ధ్యానంతో గాఢమైతే కోరికలను జయించవచ్చు. ఒక్కొక్కప్పుడు బలమైన కోరిక పందికొక్కువలె మన మనస్సును దొలిచెయ్యవచ్చు. అప్పుడు మనం నిశ్చలంగా ఉండి దానిని కనిపెట్టుకొని ఉండాలి. మనము కోరికలతో తాదాత్మ్యం చెందనంత వరకూ భద్రతతో ఉంటాము. కానీ సుదీర్ఘ కాలంలో, గతంలో కలిగిన కోర్కెలు మనస్సుని ఆక్రమించుకొంటే, పాత సంస్కారాలు మనస్సుని చంచలం చేస్తే, నేను ఇచ్చే సలహా మంత్ర జపం. 93

Eknath Gita Chapter 2 Section 23

Bhagavat Gita

2.23

వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన {2.41}

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినామ్

అర్జునా! ఈ యోగమున నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటియే. నిశ్చయములేని వారి బుద్ధులు బహు శాఖలు గలవియుగను, అనంతములుగను ఉండును.

సామాన్య మానవుల మనస్సు చంచలంగా ఉంటుంది. మిడత ఒక చోట నుంచి మరొక చోటికి ఎలా ఎగురుతూ ఉంటుందో అలా వారి మనస్సు ఒక ఆలోచన నుంచి ఉంకో ఆలోచనకి మారుతూ ఉంటుంది. ప్రతిరోజూ వారు కొన్ని నిర్ణయాలు చేసికొంటూ ఉంటారు. సాధారణంగా అవి తప్పుడు నిర్ణయాలు. ఎందుకంటే వారు ఆనందానికై, లాభానికై, పేరుప్రతిష్ఠలకై ప్రాకులాడుతారు కాబట్టి. ఆధ్యాత్మిక జీవితము అవలంబిస్తే ఒకే ఒక నిర్ణయం చేయవలసి ఉంటుంది. ధ్యానం అవలంబించిన తరువాత మన గతం గుర్తు తెచ్చుకుంటే, ఆనందానికై ఎన్ని తప్పుడు ఎన్నికలు చేసేమో అవగతమౌతుంది. ధ్యానం వలన మనం చేసే ప్రతి కార్యం, ఉన్నతమైన లక్ష్యం గురించి అనే భావన కలుగుతుంది. క్రమంగా ఆ దిశగా మన చేతన మనస్సు నడుస్తుంది.

మనందరికీ జీవితంలో ఆనందానికై ప్రయోగాలు చెయ్యడానికి ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ అవి మనకు ఆత్మ జ్ఞానం పొందుటకు సహకరించవు. కొన్నాళ్ళకి మనలో జీవితం సంతృప్తికరంగా లేదనే విచారం కలుగుతుంది. మనం అహ౦కారానికి విధేయులమై, ఊతలను తీసివేస్తే, మనకు నష్టం కలుగుతుందనే అమితమైన భయం కలుగుతుంది. ధ్యానం చేస్తున్నా మనలో గత స్మృతులు వెలుపలకు వచ్చి ధ్యానాన్ని భగ్నం చేయవచ్చు. మనము వాటిని ఎదిరించనక్కర లేదు. ఎందుకంటే మనం మానవులం కాబట్టి సహజంగా కొన్ని లోటుపాట్లు ఉంటాయి.

మన౦ ఎక్కడైనా స్వేచ్చతో నివసించి --అంటే సుఖదుఃఖాలకు అతీతంగా-- ఆత్మ జ్ఞానానికై, దేవుని పట్టుకోవాలని నిశ్చయించుకొని ఆయనతో ఐక్యం చెందడానికి ప్రయత్నించవచ్చు. గీత చెప్పేది: మన దైనింద జీవితము ధ్యానం మీద కేంద్రీకరించి, మంత్రాన్ని జపిస్తూ, ఇంద్రియాలను నిగ్రహించుకొంటూ, ఇతరులకు మనకన్నా ప్రాముఖ్యత నిస్తే, నిస్సందేహంగా మన లక్ష్యాన్ని సాధిస్తాము. మనం కర్మ ఫలాలకై ఆందోళన చెందనక్కరలేదు. దేవునిదే ఆ భారం. ఆత్మ జ్ఞానము మనలో కొలువున్న దేవుని దయ. 91

Eknath Gita Chapter 2 Section 22

Bhagavat Gita

2.22

నేహాభిక్రమనాశో అస్తి ప్రత్య వాయో న విద్యతే {2.40}

స్వల్ప మన్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్

ఈ కర్మయోగము నందు అభిక్రమ నాశము లేదు. ప్రత్యవాయ దోషమూ లేదు. ఈ ధర్మమును కొద్దిగా అనుష్ఠి౦చినను గొప్పదైన సంసార భయమునుండి రక్షించును

ఈ శ్లోకం మరపు రానిది. జీవితాంతం ఆధ్యాత్మిక సాధన చేస్తే తప్ప అది మనం చేసే ప్రతి కర్మకు వర్తిస్తుందని తెలియదు. మనం ప్రతిరోజూ భగవంతుని మీద ధ్యానం చేస్తే, ఆ శ్రమ ఎన్నటికీ వృధా కాదు. మనమొక అరగంట ధ్యానం చేసి, ఆధ్యాత్మిక పరంగా కొన్ని పనులు చేస్తే, మన చేతన మనస్సులోనున్న భయాలను, అపోహలను పోగొట్టుకోవచ్చు. మనలో చాలా మంది ఉన్నది లేకపోతే అభద్రత కలుగుతుందేమో అని ఆందోళన చెందుతారు. ఉదాహరణకి డబ్బు మీద వ్యామోహం ఉన్నవారు, ఆ డబ్బే తమకు భద్రత నిస్తుందని భావిస్తారు. కానీ వారు వ్యాపారస్తుల చేతిలో కీలుబొమ్మలు. మరికొందరికి ఏళ్లు గడుస్తున్న కొద్దీ సౌందర్యం పోతుందేమోనన్న అభద్రత కలుగుతుంది. నిజానికి సౌందర్యానికి వయస్సుకి సంబంధం లేదు. మనం అన్ని దశలలోనూ నిస్వార్థంగా బ్రతికితే ఎన్నటికీ సౌందర్యవంతులమే. భద్రత కలిగించుకోవాలంటే మన చేతన మనస్సు లోతులలో వెదకాలి. శ్రీకృష్ణుడు చెప్పింది: గడ్డు రోజులలో పరోపకారానికై ప్రయత్నించు. మంచి రోజులలోనూ అదే చెయ్యి. కాబట్టి ఎలాంటి పరిస్థితులలోనూ ఇతరులకు సేవ చెయ్యడమే ఉత్తమం. మనం భద్రత పొందడానికి మనం చేయగలిగింది ఇదొక్క ఎన్నికే. 90

Eknath Gita Chapter 2 Section 21

Bhagavat Gita

2.21

ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు {2.39}

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి

పార్థా! నీకు సాంఖ్యము తెలిపెడి జ్ఞానమును ఇంతవరకు బోధించితిని. ఏ యోగశాస్త్ర జ్ఞానము చేత నీవు కర్మ బంధము నుండి విడిపడ గలవో అట్టి కర్మ యోగమును తెలిపెదను. ఆలకింపుము. ఀ

ఇంతవరకు శ్రీకృష్ణుడు సాంఖ్య యోగం గురించి చెప్పేడు. మేధ నుపయోగించి తర్కం అనుసరించేవారికి దీనివలన ప్రయోజనముంటుంది. గురువు ధ్యానం యొక్క లాభం గురించి చెప్తాడు. కానీ శిష్యులు దాన్ని పాటించాలి. ఇక్కడ ఆ శాస్త్రాన్ని సాంఖ్య అంటారు. దాని ఆచరణని యోగమంటారు. మన ఇంద్రియాలు నిగ్రహింప బడినప్పుడు; మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు; బుద్ధి, అహంకారం స్వాధీనంలో ఉన్నప్పుడు, ఆ స్థితిని యోగమందురు. ఈ నేపధ్యంలో ఈ రోజుల్లో యోగ అంటే వ్యాయామం అనుకుంటారు. అది నిజంగా ఆసనాలు.

శ్రీకృష్ణుడు అర్జునుడు ధ్యానం చేసి, మంత్రం జపించుకొని, ఇంద్రియాలను నియంత్రించుకొని, ఇతరులను తనకన్నా ముఖ్యమని తలచి ఉంటే కర్మ సిద్ధాంతానికి అతీతమవుతాడని బోధ చేస్తున్నాడు. కర్మ సిద్ధాంతాన్ని జీసస్ క్రైస్ట్ ఈ విధంగా చెప్పారు: నువ్వు ఏ విత్తనం నాటితే, దాని పంటే పొందుతావు. మనమితరులకు దుఃఖం కలిగిస్తే ఏది ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మనకి దుఃఖం కలిగిస్తుంది. అదే మనం పరోపకారానికై నిత్యం పాటుపడితే, దాని వలన ఎనలేని ఆనందం పొందుతాము.

ఒక రకంగా మన ద్వేషం, క్రోధం ఇతరుల మీద కాదు. మనమెప్పుడైతే దేవుని నుండి విడదీయబడ్డామో అప్పడినుంచీ ఆ భావాలు మనలో నాటబడ్డాయి. అంతరాత్మ మన సహజ స్థితికి రమ్మని ప్రోద్భలం చేస్తూ ఉంటుంది. కానీ మన ఇంద్రియాలు బయటకు పరుగులు తీస్తూ, మనం సుఖాలకు లోబడి బ్రతుకుతూ అంతరాత్మ చేసే ప్రోద్భలాన్ని విస్మరిస్తాం. మనకు ఒత్తిడి కలిగినప్పుడు, మన కోపం పిల్లల మీద, భార్య మీద, లేదా మిత్రులమీద ప్రదర్శిస్తా౦. ఎందుకంటే వారు మనకు అందుబాటులో ఉన్నారు కనుక. వేరొకరిపై దాడి చేస్తే, వారి కష్టాలను అధికం చెయ్యడమే కాక, మనమొక శత్రువుగా మారుతాము. దాని వలన నిద్ర లేమి కలిగి, ధ్యానం బాగా సాగదు. అలాగే మన తలిదండ్రులను, సహధర్మచారిణిని, చివరకు ఇంటి ప్రక్క నున్న వారలతో కలహాలు పెట్టుకుంటాం. ఈ విధంగా మన దుర్గుణాలను ఇతరులకు ఆపాదిస్తాం. వారు కూడా మనలాగే స్పందిస్తే ఇంకొకరితో వారు కలహిస్తారు. కొన్నాళ్ళకి ఆ దుర్గుణాల వలయంలో మనం చిక్కుకుంటాం. అందుకే యోగులు చెప్పేది, మనం క్రోధంతో ఉగ్రంగా ఉంటే, మంత్ర జపం చేస్తూ, దీర్ఘంగా నడవమని. 89

Viveka Sloka 50-51 Tel Eng

Telugu English All శిష్య ఉవాచ:- ప్రశ్న నిరూపణము కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా । యదుత్తరమహం శ్రుత్వా కృతా...