Thursday, February 16, 2023

Ramana Maharshi Aatma Vichaarana

నే నెవరిని?


ఆత్మ విచారణ



ప్రతి జీవి ఆనందాన్నే కోరుతుంది.
అలాగే తనయందు మిక్కిలి ప్రేమ
కలిగి ఉంటుంది. ఎందుకంటే జీవి
స్వతహాగా ఆనంద స్వభావము గలది.
గాఢ నిద్రలో ఉండే ఆనందం వేకువలో
కూడా పొందాలంటే జీవి తన గురించి
తాను తెలిసికోవాలి. దానికై "నే నెవరిని?"
అని తనను తాను ప్రశ్నించుకొని
ఆత్మ జ్ఞానము పొందాలి.

"నే నెవరిని?" నేను దేహము కాదు;
పంచేంద్రియాలు, కర్మే౦ద్రియాలు;
పంచ ప్రాణాలు; మనస్సు కాదు.
అలాగే అజ్ఞానములో కేవలము
పూర్వ సంస్కారముల ననుసరించి
కర్మలు నిర్వహించి, మనస్సు,
కర్మే౦ద్రియాలను౦డి
మరియు జ్ఞానేంద్రియాల
గ్రాహకములనుండి విడిపడి
ఉండేవాడిని కాదు.

ఈ విధంగా విచారణ చేస్తే
మిగిలేది, అద్వితీయమైనది,
శుద్ధమైనది అయిన ఆత్మ. అదే మన
స్వస్వరూపము. అది సత్
చిత్ ఆనందము.

జ్ఞానమును పొందడానికి ,
కర్మలు చేయడానికి ఉపయోగపడే
మనస్సు ఉపశమిస్తే గాని ప్రపంచము
మిథ్య అనే భావము కలుగదు.
ఎలాగంటే రజ్జు-సర్పము భ్రాంతి
ననుసరించి, సర్ప భావనను
తొలగిస్తే గాని, అది రజ్జు అనే జ్ఞానము
కలగదు. ఆత్మ మీద ఆరోపింపబడిన
ప్రపంచము మిథ్య, అసత్యము
అనే జ్ఞానము కలగనంత
కాలము స్వస్వరూపము తెలియదు.

ఆత్మ యొక్క శక్తివంతమైన
మనస్సు వలన ఆలోచనలు
కలుగుతాయి. ఆలోచనలను
తీసివేస్తే మనస్సు అనేది లేదు.
కాబట్టి మనస్సుకు మూలం ఆలోచన.

అలాగే భౌతిక ప్రపంచము ఒక
ఆలోచన మాత్రమే. గాఢ నిద్రలో
ఆలోచనలుగాని, ప్రపంచముగాని
లేవు. నిద్రలోనూ, వేకువలోనూ
మనస్సు ఆలోచనలతో నిండి ఉంటుంది.
ఎలాగైతే సాలె పురుగు తన నుంచే
గూడు కట్టుకుని, తిరిగి తనలోకి ఆ గూడును
వెనక్కి తీసికొ౦టుందో, మనస్సు
ప్రపంచాన్ని తనలోనే ఊహించి,
తిరిగి తనలోకే లాక్కుంటుంది.

మనస్సు బహిర్ముఖమై, ఆత్మను
విస్మరించి ఉన్నప్పుడు ప్రపంచము
సత్ అనిపిస్తుంది. అలా జరిగితే
ఆత్మ స్వస్వరూపమనే జ్ఞానము
కలుగదు. అదే ఆత్మ జ్ఞానము కలిగి
ఉంటే ప్రపంచము సత్యమనే
అజ్ఞానము కలుగదు.

మనస్సు యొక్క స్వభావము గూర్చి
దీర్ఘంగా విచారణ చేస్తే దానికి "నేను"
అనబడే ఆలోచన మూలం అని
తెలుస్తుంది. మనస్సుకు స్థూలమైన
ఆధారం అవసరం. దానికి స్వతహాగా
ఉనికి లేదు. అదే సూక్ష్మ శరీరము,
అహంకారము, జీవుడు.

భౌతిక శరీరము నుండి "నేను" అని
లేచేది మనస్సే. ఆ "నేను" గూర్చి
విచారణ చేస్తే అది హృదయం నుండి
ఆవిర్భవించినది అని తెలుస్తుంది.
అదే మనస్సు యొక్క స్వస్థానము. అలాగే
"నేను-నేను" అని ధ్యానం చేస్తే చివరకు
ఆ హృదయాన్నే చేరుకొంటాం.

అన్ని ఆలోచనలకి మూలం ప్రప్రథమంగా,
"నేను". అది లేచినతరువాతే
తక్కిన "నువ్వు", "మనము" మొదలగు
ఆలోచనలు కలుగుతాయి.

అన్ని ఆలోచనలకు
మూలం "నేను", మనస్సు ఆలోచనల
సమూహం అని తెలిసికొని, "నే నెవరిని?" అని
విచారణ చేస్తేనే మనస్సును
నియంత్రించ గలం. ఈ విధంగా
విచారణ చేస్తే చివరకు మిగిలేది
"నేను" అనే ఆలోచన. విచారణ
పరిపక్వమైతే "నేను" అనే
ఆలోచన కూడా తొలగిపోతుంది.

అలా విచారణ చేస్తున్నప్పుడు
ఆలోచనలు చిందరవందరగా
ఉంటే "ఈ ఆలోచనలు ఎవరికి
కలుగుతున్నాయి?" అని ప్రశ్నించుకోవాలి.
ఎన్ని ఆలోచనలు వచ్చినా అలా
ప్రశ్నించుకొంటే "నాకు" అనే సమాధానం
తెలిసివస్తుంది. అప్పుడు "నేను ఎవరిని?"
అని విచారణ చేస్తే మనస్సు
అంతర్ముఖమై ఉండి, ఆలోచనలు
నియంత్రింపబడతాయి. అలా
దీర్ఘ కాలము విచారణ కొనసాగిస్తే
మనస్సు బలోపేతమై తన
హృదయ స్థానంలో నిశ్చలంగా
ఉంటుంది.

మనస్సు బహిర్ముఖమైనప్పుడే
బుద్ధి, ఇంద్రియాలు నామరూపాత్మక
ప్రపంచాన్ని చూస్తాయి. అదే మనస్సు
తన హృదయ స్థానంలో నిలకడగా
ఉంటే నామరూపాత్మక ప్రపంచం
నశిస్తుంది.

ఈ విధంగా మనస్సు హృదయ స్థానంలో
అంతర్ముఖమై ఉంటే "నేను", తద్వారా
ఉద్భవించే ఆలోచనలు
అంతర్ధానమై ఆత్మ ఉజ్జ్వలంగా
ప్రకాశిస్తుంది. ఆ స్థితిలో "నేను"
అనే భావన పూర్తిగా లేక మన
స్వస్వరూపాన్ని దర్శిస్తాము. అదే
మౌనము.

శుద్ధమైనదానిలో వ్యవస్థితమైతే
ఆత్మ జ్ఞానము కలుగుతుంది. అప్పుడు
మనస్సు ఆత్మచే పరిపాలింప
బడుతుంది. అట్టి జ్ఞానము వేరే విధంగా
-- దివ్య దృష్టి, వశీకరణము,
ఇతరుల ఆలోచనలను
తెలిసికోవడం, మొదలగునవి --
సాధ్యము కాదు.

ఉన్నది సత్యమైన ఆత్మే. ప్రపంచము,
జీవుడు, భగవంతుడు అనే త్రిపుటి
ఎండమావులవలె మిథ్య.
అవి ఒకప్పుడు ఉంటాయి, మరొక్కప్పుడు
ఉండవు. ఆత్మ ఒక్కటే ప్రపంచము,
జీవుడు, భగవంతుడు. సర్వము
పరమాత్మ యొక్క సృష్టి.

మనస్సును ఉపశమింపజేయాలంటే
ఆత్మ విచారణ కంటే వేరే మార్గం లేదు.
ఇతర పద్దతులు కొంత కాలము
మనస్సును ఉపశమింపజేసినా,
వాటి ప్రభావము పరిమితము.

ఉదాహరణకు ప్రాణయామంతో
మనస్సును నిశ్చలం చెయ్యవచ్చు.
కాని ప్రాణయామం కొంత కాలము
చెయ్యకపోతే మనస్సు తిరిగి
బహిర్ముఖమై పూర్వ సంస్కారాల
ననుసరించి సంచరిస్తుంది.

మనస్సు, ఊపిరి యొక్క జన్మ
స్థానం ఒక్కటే. మనస్సు ఆలోచనల
సమూహం. వాటిలో "నేను" అనే ఆలోచన
ప్రథమమైనది. అదే అహంకారం.
కానీ ఊపిరి అహంకారం ఎక్కడైతే
ఉద్భవిస్తుందో అక్కడే ఉద్భవించేది.
కాబట్టి మనస్సు నిశ్చలమైతే ఊపిరి,
పంచప్రాణాలు నియంత్రింపబడతాయి.
అలాగే ఊపిరి, పంచప్రాణాలు
నియంత్రింపబడితే, మనస్సు
నిశ్చల మవుతుంది.

ఊపిరి, పంచప్రాణాలు మనస్సు యొక్క
స్థూల స్వరూపాలు. మరణము వరకు
మనస్సు వాటిని దేహంలో నడుపుతుంది.
మరణించినపుడు మనస్సు వాటిని
తీసుకుపోతుంది. నిద్రలో మనస్సు
పనిచేయకపోయినా ఊపిరి,
ప్రాణం ఉంటాయి. ఎందుకంటే
ఇతరులకు మనము బ్రతికి ఉన్నామని
తెలియడానికి. కానీ మెలకువలో,
సమాధిలో, మనస్సు నిశ్చలమైతే,
ఊపిరి కూడా ఉపశమిస్తుంది. కావున
ప్రాణయామము వలన మనస్సు
ఉపశమించబడుతుందే గాని,
పూర్తిగా నాశనమవ్వదు.

ప్రాణాయామము లాగే విగ్రహారాధన,
జపము, ఆహార నియమాలు, మనస్సు యొక్క
ఉపశమనానికి దోహదమవుతాయి.
వాటి వల్ల మనస్సు ఏకాగ్రతను పొందుతుంది.
ఎలాగంటే ఒక ఏనుగు తొ౦డానికి ఒక
వస్తువు ఇవ్వనంత కాలమూ తొ౦డం
అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.
మనస్సు ఏనుగు తొ౦డం వలె ఆలంబనము
లేనంత వరకూ నిశ్చలంగా ఉండదు.
అందుకే మనస్సుకి జపం, ధ్యానం
వంటి అలవాట్లతో తర్ఫీదు ఇస్తే వాటినే
అంటిపెట్టుకొని ఉంటుంది.

మనస్సు అతలాకుతలమయి అనేక
ఆలోచనలు కలిగితే, అవి బలహీనంగా
మారుతాయి. అలాకాక ఆలోచనలు
అణిగిపోయి నాశనమైతే, మనస్సు
ఏకాగ్రతను పొంది, ఆత్మ విచారణకు
అవసరమయ్యే బలాన్ని, శక్తిని
పొందుతుంది.

సాత్వికమైన ఆహారాన్ని మితంగా భుజిస్తే
ప్రాణాయామం వంటి ప్రయత్నాలకన్నా
ఉత్తమం. దాని వలన మనస్సు సాత్విక
గుణం కలిగి ఉంటుంది. అది ఆత్మ
విచారణకు దోహదమవుతుంది.

ఇంద్రియాలు సదా తమ గ్రాహ్యములను
మనస్సుకు సముద్రములోని అలల వలె
చేరవేస్తే, మనస్సు అలజడి పొందుతుంది.
ఆత్మ ధ్యానమొక్కటే వాటిని అరికట్టగలదు.
స్వస్వరూపాన్ని దర్శించడం లేదా
పూర్వ సంస్కారాలను అధిగమించడం
సాధ్యం అవునా కాదా అనే అనుమానాలు
లేకుండా మనము ఆత్మ ధ్యానం చెయ్యాలి.

ఒకడు ఎంత పాపాత్ముడైనప్పటికీ
ఆత్మ ధ్యానానికి అర్హుడే. తాను
ముక్తిని పొందగలనా అని ఆలోచింపక
ఆత్మ విచారణ మొదలుపెట్టాలి.

ఎంతకాలమైతే పూర్వ సంస్కారాలు
ఉంటే అంత కాలము ఆత్మ విచారణ
చెయ్యాలి.

ఆత్మ విచారణకు ప్రతిబ౦ధకమైన
ఆలోచనలను సమూలంగా నాశనం
చెయ్యాలి.

వస్తువులను కాంక్షింపక పోవడాన్ని
వైరాగ్యం లేదా నిరాశ అంటారు. ఆత్మను
ధ్యానించడం జ్ఞానం. నిజానికి
వైరాగ్యం, ధ్యానం ఒక్కటే.
ఒకడు ముత్యాల కొరకై దేహానికి
రాళ్ళు కట్టుకొని సముద్ర గర్భానికి
చేరుకొంటాడు. అలాగే మనం
మనస్సు లోతులకు వెళ్ళి ఆత్మ జ్ఞానం
పొందాలి. మనము స్వస్వరూపంలో
ధ్యానము చెయ్యగలిగితే అది సరిపోతుంది.
ఎలాగంటే శత్రువులు కోటలో ఉన్నంత
వరకూ వారిని జయించలేము. వారిని
కోట వెలుపలకి లాగి జయించాలి.

దేవుడు, గురువు వేర్వేరు కాదు. ఇద్దరూ
ఒక్కటే. ఎవడిపైన గురువుయొక్క దయ
ఉంటుందో వానికి ఎన్నటికీ ఓటమి
రాదు. ఎలాగంటే పులి జంతువును
నోటితో పట్టుకొంటే, ఆ జంతువు
విడిపించు కోలేదు. కానీ శిష్యుడు గురువు
చెప్పిన మార్గాన్ని విశ్వాసంతో
అనుసరించాలి.

ఆత్మ ధ్యానం చేస్తూ, ఆత్మలో గాఢంగా
స్థితమైతే అది భగవంతుని యందు
సంపూర్ణ శరణాగతి. అతడు ఎంతటి
దుర్భలమైనదాన్నీ దాటించగల
శక్తి గలవాడు. నిజానికి ప్రపంచంలోని
ప్రతీదీ అతని కనుసన్నెలలో నడుస్తుంది.
కాబట్టి "ఇది చేయాలా? అది చేస్తే
మంచిదా?" అనే సంశయాలు
విడిచి అతని దయకు మనము పాత్రులు
కావాలి. ఎలాగంటే రైలు ఎక్కి
మన బరువును మనం మొయ్యనక్కర లేదు.
దానిని రైలే మోస్తుంది.

ఆత్మే ఆనందానికి మూలం. అదే సత్.
అనిత్యమైన బాహ్య వస్తువులతో
ఎన్నటికీ నిత్యమైన ఆనందం పొందలేము.
వస్తువులు నిత్యమైన ఆనందం ఇస్తాయన్నది
అజ్ఞానం. నిజానికి మనస్సు బహిర్ముఖమైతే
దానికి మిగిలేది నిరాశ, నిస్పృహ. దానికి
ఒక కోరిక తీరి, ఆనందం అనుభవించా
లంటే ఆత్మతో అనుసంధానమవ్వాలి.
ఈ విధంగా విషయ ప్రపంచంలోకి
పరిగెత్తి, విసిగి వేసారి, తిరిగి ఆత్మతో
అనుసంధానమవ్వడం మనస్సు
నిరంతరం చేస్తుంది.

ఎండాకాలంలో ఒక చెట్టు నీడ
మనల్ని సూర్యుని తాపంనుంచి
రక్షిస్తుంది. ఒకడు చెట్టు నీడనుండి,
కొంతకాలం తరువాత ఎండలోకి
వెళ్ళి, తిరిగి నీడను చేరి, పదేపదే
ప్రయత్నించడం వృథా. సూర్యుని
తాపం తగ్గే వరకు చెట్టు నీడను
ఆశ్రయించడం ఉత్తమం. ఈ విధంగా
జ్ఞాని బ్రహ్మన్ ను సదా ఆశ్రయించి
ఉంటాడు. అజ్ఞాని ప్రాపంచిక
విషయాలలో తల దూర్చి, నిరాశ
పొంది, తిరిగి బ్రహ్మన్ ను ఆశ్రయిస్తాడు.
దాని వల్ల వానికి కలిగేది దుఃఖమే.

భౌతిక ప్రపంచము ఒక ఆలోచన
మాత్రమే. ప్రపంచం దూరమైతే--
అంటే ఆలోచనల నుండి ముక్తుడైతే--
మనస్సు ఆత్మ ద్వారా ఆనందం
పొందుతుంది. అలాకాక మనస్సు
ప్రపంచ విషయాలతో తాదాత్మ్యం
చెందితే, దుఃఖం అనుభవించక
తప్పదు.

సూర్యుని కాంతి వల్ల భూతద్దం
అగ్నిని సృష్టించ గలదు, కలువ
వికసించగలదు, నీరు ఆవిరి కాగలదు,
మనము కర్మలు చేయగలం. అయస్కాంతం
దగ్గర సూచిక కదిలి దిక్కులు చెప్పగలదు.
అలాగే జీవుడు సృష్టి, స్థితి, లయం
భగవంతుని సమక్షంలో తన
కర్మల ననుసరించి పొందుతాడు. కానీ
భగవంతుడు అప్రమేయుడు. అతనికి
ఎటువంటి కర్మ అంటదు. అతడు
ఏ కర్మా చేయడు. ఎలాగైతే సూర్యునికి
ఏ ఒక్క జీవి లేదా వస్తువుపై అభిమానం
గానీ ద్వేషం గానీ లేదో, పంచ
భూతాలతో ఎటువంటి ప్రమేయం
లేదో, అలా భగవంతుడు సాక్షి మాత్రమే.

మన శాస్త్రాలు మోక్షం పొందడానికి
మనస్సుని ఉపశమింప చేయాలని
ఘంటాపథంగా చెప్తాయి. వాటిని
అదే పనిగా చదవడం వలన లాభం
లేదు. జ్ఞాని అవ్వదలచుకొన్న సాధకుడు
మనస్సును స్వాధీనపరుచుకోవడానికి "నే నెవరిని?"
అనే విచారణ చేయాలి.

ఆత్మని జ్ఞానంతోనే దర్శించాలి. ఒకనికి
తాను రాముడని తెలిసికోడానికి
అద్దం అవసరమా? నిజానికి "నేను"
అనే జ్ఞానము పంచ కోశాల లోపల
ఉంది. కానీ శాస్త్రాలు వాటికి
బయట ఉన్నాయి. కావున ఆత్మ
జ్ఞానం పొందటానికి శాస్త్రాల
అవసరం లేదు. చివరకు
పంచకోశాల అవసరం కూడా లేదు.

"బంధాలతో కట్టబడిన నేను ఎవరిని?"
అని విచారణ చేసి, తన స్వస్వరూపమును
తెలిసికొన్నవాడే మోక్షానికి అర్హుడు.
మనస్సుని సదా ఆత్మయందే ఏకాగ్రతతో
ఉంచడమే ఆత్మ విచారణ. కానీ
ధ్యానం సత్-చిత్-ఆనందం గూర్చి
చేసే ప్రయత్నం. నిజానికి ఒకరోజు
మనము నేర్చుకున్నదంతా వదిలి
పెట్టాలి.

చెత్తని వెదకడం ఎలా వృధాయో,
ఆత్మ జ్ఞానాన్ని పొందదలచే వానికి
తత్త్వాల గూర్చి తెలిసికోవడం
అంత వృధా. సాధకుడు భౌతిక
ప్రపంచం తనకు సంభందించిన౦త వరకు ఒక కల మాత్రమే అని గ్రహించాలి.

మెలకువ కాలము, నిద్ర కాలము కన్నా
దీర్ఘం తప్ప, వాటి మధ్య ఎట్టి భేదం
లేదు. కలలో చేసే కర్మలు నిద్రించు
కాలంవరకు, మెలకువలో చేసే
కర్మలలాగే, సత్యం. కలలో మనస్సు
వేరే రూపం లేదా కోశం ధరిస్తుంది.
ఆలోచనలు, నామరూపాత్మకములు
నిద్రలోనూ, వేకువలోనూ కలిసి
ఉంటాయి.

మంచి, చెడు అని రెండు మనస్సులు
లేవు. కేవలము వాసనలు
మాత్రమే మంచి చెడులుగా ఉంటాయి.
మంచి వాసనలు కావలసినవి,
చెడ్డవి వదిలిపెట్టవలసినవి. మంచి
వాసనలతో కూడిన మనస్సు శుద్ధమైనది.
అలాగే చెడు వాసనలతో కూడిన
మనస్సు అశుద్ధమైనది. ఒకరు ఎంత
చెడ్డవారైనప్పటికీ వారిని ద్వేషించ
కూడదు. ఇష్టాయిష్టాలు, రాగ ద్వేషాలు
వంటి వాటిని వదిలిపెట్టాలి.
మనస్సు సదా విషయ వాంఛలతో
కూడి ఉండడం మంచిది కాదు.
వీలయినంత మటుకు ఇతరుల
విషయాలలో తలదూర్చ కూడదు.
ఇతరులకు దానం చేస్తే అది తమకే
దానం చేసుకొన్నంత ఫలం. ఈ
సత్యం తెలిస్తే ఎవరు ఇతరులకు
దానం చేయరు?

అహంకారం లేస్తే అన్నీ లేస్తాయి.
అది ఉపశమిస్తే అన్నీ నియంత్రింప
బడతాయి. మనమెంత దయ కలిగి
ఉంటే అంత మంచిది. మనస్సును
కట్టడి చెయ్యగలిగితే, మనం
ఎక్కడున్నామని తెలిసికోవడం
అవసరమా?

Friday, February 10, 2023

Ramana Maharshi QuestionAnswers Part 2

అనుభవము




చైతన్య ప్రకాశమంటే ఏమిటి?

ద్రష్టకి నామరూపాత్మక ప్రపంచాన్ని
దర్శింపజేసేదే స్వయం ప్రకాశకమైన
చైతన్యము. దానిని అది ప్రకాశింప
చేసే వస్తువులద్వారా తెలిసికొనవచ్చు.
కానీ అది స్పృహకి అందనిది.


విజ్ఞానమంటే ఏమిటి?

జీవ చైతన్యము సమముగా
ఉన్నప్పుడు జీవుడు అనుభవించే
స్థితి. అది అలలులేని సముద్రము
లేదా కదలికలేని ఆకాశమువలె నుండును.


ఆనందమంటే ఏమిటి?

అది విజ్ఞాన స్థితిలో అనుభవించేది.
ఆ అనుభవము సుషుప్తి వలె నుండును.
దాన్నే కేవల నిర్వికల్ప స్థితి (ఎటువంటి
ఆలోచనలు లేకపోవుట) అనవచ్చు.


ఆనందాన్ని అధిగమించే స్థితి ఏమిటి?

అది మనస్సు అంతరాయములేని శాంతిని
అనుభవించే స్థితి. అది
జాగ్రత్ సుషుప్తి వలె నుండును. ఈ
స్థితిలో చిన్న పిల్లవాడు పరుండినట్లు,
శరీరము, ఇంద్రియాలు, కర్మలు చేస్తున్నా
ఎటువంటి బాహ్య ఎరుక ఉండదు. ఈ
స్థితిలో యోగి కర్మలు చేస్తున్నా
చేయనట్లే ఉంటాడు. దీనినే
సహజ నిర్వికల్ప సమాధి అంటారు.


స్థిరచరాదులు ఒకని ఆలోచన
బట్టి ఉంటాయని చెప్పడానికి
ఏది ఆధారం?

ఆత్మ దేహమును కప్పి ఉంటుంది.
సుషుప్తిలో నిఘూడంగా ఉండే
శక్తి మేల్కొన్నప్పుడు "నేను"
అనే ఆలోచన లేచి వస్తువులయొక్క
అనుభవం ఇస్తుంది. ఆత్మ అన్ని
వస్తువులపై అవగాహన ఉన్నది.
"నేను" అనే స్పృహ లేకపోతే
చూసేందుకు వస్తువులు ఉండవు.
అందువలన ప్రతీదీ ఆత్మనుండి
ఉద్భవించి, దానిలోనే లయమవుతుంది.


అనేక దేహాలతో బహుళంగా ఉండే
జీవాత్మలు సర్వము వ్యాపించి
ఉండగా, ఆత్మ ఒక్కటే--అద్వైతము --
అని ఎలా చెప్పగలము?

"నేను శరీరమును" అని నమ్మితే
జీవాత్మలు అనేకమని చెప్పవచ్చు.
ఆత్మజ్ఞానము కలగక పోతే అది తప్ప
వేరేది లేదనే జ్ఞానము ఉద్భవి౦చదు.
అందువలన ఆత్మ ఒక్కటే; అనగా
ద్వితీయము లేనిది.


బ్రహ్మన్ ని మనస్సుతో పట్టుకోవచ్చు
లేదా పట్టుకోలేము అనడానికి
ఆధారమేమిటి?

దాన్ని శుద్ధమైన మనస్సుతోనే పట్టుకోగలము.
అశుద్ధమైన మనస్సుతో పట్టుకోలేము.


శుద్ధమైన మనస్సు అంటే ఏమిటి?
అశుద్ధమైన మనస్సు అంటే ఏమిటి?

నిర్వచింపలేని బ్రహ్మన్ యొక్క శక్తి బ్రహ్మన్ నుంచి
విడిపడి, చిదాభాసతో ఏకమైనప్పుడు
అనేక రూపాలను ధరిస్తే అది
అశుద్ధమైన మనస్సు. అదే ఆభాస
నుండి వేరుపడి, విచక్షణ కలిగి ఉంటే
దానిని శుద్ధమైన మనస్సు అంటారు.
అది బ్రహ్మన్ తో ఏకమై బ్రహ్మన్ నే
పొందుతుంది. ఆభాసతో పొందిన
శక్తిని అశుద్ధమనికూడా అనవచ్చు.
అది బ్రహ్మన్ కన్న వేరు కనుక,
బ్రహ్మన్ ని పట్టుకోలేదు.


బ్రతికున్నంతకాలం, అంటే మరణము
వరకు, అనుభవించే
ప్రారబ్దాన్ని అధిగమించడ౦
సాధ్యమా?

సాధ్యము. కర్తృత్వ భావము
గల "నేను" అనునది శరీరమునకు,
ఆత్మకు మధ్య నుండి, దాని
మూలములో లయమై, తన
రూపమును పోగొట్టుకొని ఉంటే
దాని మీద ఆధారపడే కర్మకు
ఉనికి ఉంటుందా? కాబట్టి
"నేను" అనే అహంకారం లేకపోతే
కర్మ లేదు.


ఆత్మకు ఉనికి, స్పృహ ఉండగా, అది
చైతన్యమునకు మరియు జడానికి,
వివేకానికి మరియు అజ్ఞానానికి, వేరని
ఎలా చెప్పగలరు?

ఆత్మ సత్ వస్తువు. అది అన్నిటినీ
కప్పి ఉంటుంది. దాని సత్ లేదా అసత్ కి,
లేదా ద్వైత భావానికి ఆస్కారం అది
ఇవ్వదు. కాబట్టి అది సత్ మరియు అసత్ కు
అతీతంగా ఉంటుంది. అలాగే వివేకమునకు
మరియు అజ్ఞానానికి అది అతీతం అని
ఎందుకు చెప్తామంటే దానికి తెలిసికోవడానికి
లేదా గుర్తింపు పొందటానికి ఏమీ లేదు కనుక.

అరుద్ధ



జ్ఞానం సిద్ధిస్తే కలిగే స్థితి ఏమిటి?

అది సర్వం ఆత్మే అనే జ్ఞానం కలిగి,
దానితో మమేకమైన స్థితి. "నేను
మేకను కాను; ఆవును కాను; ఏ జంతువును
కాను; కేవలము మానవుని" అన్న ఎరుక
ఉన్నట్లు, "నేను దేహం మొదలుకొని
తత్త్వాలను కాను, శబ్దాన్ని కాను; ఆత్మ
స్వరూపాన్ని; సత్ చిత్ ఆనందాన్ని;
అంతర్గతమైన చైతన్యము గలవానిని
(ఆత్మ ప్రజ్ఞ)" అనుకునేవాడు సంపూర్ణ
జ్ఞానాన్ని పొందినవాడు.



  1. శుభేచ్చ (ఆత్మ జ్ఞానానికై వాంఛించుట),
  2. విచారణ
  3. తనుమనస (చంచల మనస్సు)
  4. సత్వాపత్తి (ఆత్మ జ్ఞానము),
  5. అస౦శక్తి (బంధము లేకుండుట),
  6. పదార్థభావన (వస్తువులయందు ఆసక్తి లేకుండుట),
  7. తుర్యాగ (ఉన్నతమైనది)

అను ఏడు జ్ఞాన భూమికలలో, జ్ఞాని
ఏ భూమికలో ఉంటాడు?

జ్ఞాని నాల్గవ జ్ఞాన భూమికలో ఉంటాడు.


అలా అయితే ఇంకా మూడు ఉన్నత
భూమికలు ఎందుకు ఉన్నాయి?

నాల్గు నుండి ఏడు వరకు ఉన్న
భూమికలు జీవన్ముక్తునికి చెందినవి.
అవి జ్ఞానానికి సంబంధించినవి
కావు. వాటి మధ్య జ్ఞానం విషయంలో
భేదాలు లేవు.


ముక్తి అందరికీ కలిగేదే అయితే, వరిష్ఠనే
ఎందుకు పొగుడుతారు?

వరిష్ఠ అనుభవించే ఆనందం సర్వ
సామాన్యం. అతనిని పొగడడానికి కారణం
అతని పూర్వ కర్మ ఫలము.


అందరికీ అంతులేని ఆనందం కలగాలనే
వాంఛ ఉండగా, జ్ఞానుల౦దరూ వరిష్ఠ
స్థితిని పొందలేకపోవడానికి కారణం ఏమిటి?

వరిష్ఠ స్థితి వాంఛ లేదా ప్రయత్నము
వలన వచ్చేది కాదు. దానికి కారణం
పూర్వజన్మల కర్మ. నాల్గవ భూమికలో
అహంకారం, దానికి మూలం లేకుండా
ఉండగా, దానిని అధిగమించే స్థితిని
కోరడం లేదా దానికై ప్రయత్నించడము
ఎందుకు? సాధన చేస్తున్న౦త వరకు జ్ఞానులు
అనబడరు. వరిష్ఠ గురించి ప్రస్తావించే
శృతులు మూడు పై భూమికలలో ఉన్నవారు
అజ్ఞానులని చెప్తాయా?


కొన్ని శాస్త్రాలు మనస్సు, ఇంద్రియాలను
జయించడమే ఉఛ్ఛ స్థితి అని చెప్తాయి.
దానికి దేహము, ఇంద్రియాల అనుభవంతో
పొంతన ఎక్కడ?

అలాటి ఉఛ్ఛ స్థితి ఉన్నట్లయితే దానికి,
సుషుప్తికి తేడాలేదు. అది ఒకప్పుడు
ఉండేది, మరొకప్పుడు లేనిది. కాబట్టి
అది నిత్యము కాదు. కొందరికి
అది ప్రారబ్ద కర్మ వలన కొంతకాలము,
మరణించక ముందు కలుగుతుంది.
అదే అంతిమ స్థితి అని చెప్పలేము.
అలా కాకపోతే జ్ఞాన గ్రంథాలు (వేదాలు)
రాసిన దేవతలు అజ్ఞానులని చెప్పవలసి
వస్తుంది. ఉఛ్ఛ స్థితి మనస్సు లేదా
ఇంద్రియాలు లేనప్పుడే కలిగేది
అయితే దానికి పరిపూర్ణత ఎక్కడిది?
జ్ఞానుల చేతనము లేదా అచేతనములకు
కారణం కర్మ ఒక్కటే కావున, సహజ
నిర్వికల్ప స్థితి ఒక్కటే ఆ ఉఛ్ఛ స్థితి.


నిద్రకి, జాగ్రత్ సుషుప్తి కి మధ్య గల
భేద మేమిటి?

గాఢ నిద్రలో ఆలోచనలేకాక, స్పృహ
కూడా ఉండదు. కానీ జాగ్రత్
సుషుప్తిలో ఎరుక ఉంటుంది. అంటే
మేల్కొని ఉంటూ నిద్రించడం.


ఆత్మని తురీయము , తురీయాతీతము
అని ఎందుకు అంటారు?

తూరీయమనగా నాల్గవది. జీవులు
అనుభవించే మూడు అవస్థలు
విశ్వ, తైజస, ప్రాజ్ఞులు పాలించేవి
కాని ఆత్మ కాదు. ఆత్మ ఆ అవస్థలకు
అతీతం, సాక్షి మాత్రమే అని చెప్పడానికి
దాన్ని తురీయ౦ అంటారు. ఆ జ్ఞానము
కలిగినప్పుడు ఆ మూడు అవస్థల
అనుభవము, ఆత్మ సాక్షి అనే
అనుభవము, ఆత్మ తురీయమనే
అనుభవము నశిస్తాయి. అందుకే ఆత్మ
తురీయాతీతము అని చెప్పబడినది.


శృతుల వల్ల జ్ఞాని పొందే ఉపయోగ
మేమిటి?

జ్ఞాని ఉత్కృష్టమైన స్థితిని కలిగిన
వాడు. వానికి శృతుల వలన
ఉపయోగము లేదు.


సిద్ధులు మరియు ముక్తి మధ్య
ఏదైనా సంబంధం ఉందా?

జ్ఞానముతో కూడిన విచారణే ముక్తికి మార్గము.
ఊహాతీత సిద్ధులు మాయ వలన కలిగే
భ్రమలు. ఆత్మజ్ఞాన మొక్కటే
నిజమైన సిద్ధి. నిత్యం కాని సిద్ధులు
మాయ వలన కలిగి ఒకప్పుడు ఉనికిని
కోల్పోతాయి. వాటిని కొందరు పేరు
ప్రతిష్ఠలకై చాటుకొ౦టారు. మరి కొందరికి
పూర్వ కర్మల వలన అప్రయత్నంగా
వస్తాయి. బ్రహ్మన్ తో ఐక్య మవ్వడమే
సాధన పరాకాష్ఠ. దీనినే ఐక్య ముక్తి
లేదా సాయుజ అంటాం.


కొన్ని శృతులు ముక్తిని దేహంతో
ముడి పెట్టి, జీవాత్మ దేహాన్ని వదలకపోతేనే
ముక్తి సాధ్యం అని ఎందుకు చెప్పాయి?

బంధం సత్యమైతేనే ముక్తి, దాని అనుభవం
గూర్చి చెప్పవచ్చు. నిజానికి పురుషుడుకి
నాల్గు అవస్థలలో ఎటువంటి బంధాలూ లేవు.
మన వేదాంత గ్రంథాలు బంధాలు
మాటల వరకే సత్యమని, నిజానికి
మాటలను మించి వాటికి ఉనికి లేదని,
చెప్పినపుడు ముక్తి వాటితో ఎలా
ముడిపడి ఉంటుంది? ఈ సత్యమును
తెలియక, బంధాలు, ముక్తుల గురించి
చేసే సాధన కుందేటి కొమ్మును
వెదకటమే.


అయితే శాస్త్రాలలో బంధాల గురించి
ప్రస్తావన అసత్యమనబడదా?

అనేక జన్మల కారణము వలన
అజ్ఞానము వలన కలిగే బంధము
ఒక్క జ్ఞానంతోనే తొలగింప
బడుతుంది. దాన్నే ముక్తి
అంటాము. ముక్తిని పలువిధములుగా
వర్ణించడము వలన, ఆ వర్ణనలు
ఊహలు మాత్రమే.


అలా అయితే శాస్త్ర పఠనం, నిధిధ్యాసన
మొదలగునవి వృధా కదా?

సాధన చెయ్యడం బంధము లేదా
ముక్తి లేవని తెలిసికోవడానికే.
పఠనము, నిధిధ్యాసన మొదలగునవి
పాటించడం బంధము మరియు
ముక్తి లేవని అనుభవం ద్వారా
తెలిసికోవడానికే.


బంధము, ముక్తులు లేవనడానికి
ఆధారం ఏమైనా ఉందా?

అది శాస్త్రములు కాక, స్వీయనుభవంతో
తెలిసికోబడేది.


ఆ స్వీయానుభవం పొందడం ఎలాగ?

బంధం, ముక్తి కేవలం నామ వాచకములు
మాత్రమే. వాటికి ఉనికి లేదు. కాబట్టి
అవి స్వతంత్రంగా పని చేయలేవు.
కానీ వాటికి ఒక మూలం ఉండాలి.
"ఎవరికి బంధం మరియు ముక్తి?" అని
విచారణ చేస్తే "అవి నాకే" అని
తెలుస్తుంది. "నేను ఎవరిని?" అని
విచారణ చేస్తే "నేను" అనేది లేదని
తెలుస్తుంది. అప్పుడు స్వస్వరూపము
కరతలామలకము వలె దర్శనమిస్తుంది.
నామ వాచకములతో
సంబంధం లేకుండా, అంతర్ముఖులై
యున్న యోగులకు బంధము మరియు
ముక్తి లేవనే సత్యము అవగాహనకు
వస్తుంది. అదే ఆత్మ జ్ఞానము.


బంధం మరియు ముక్తి సత్యము కాకపోతే
సుఖదుఃఖాలకు కారణమేమిటి?

స్వస్వరూపము తెలియని వారికే
సుఖదుఃఖాలు సత్యమని అనిపిస్తాయి.
వాటికి నిజంగా ఉనికి లేదు.


ప్రతిఒక్కరికీ తమ స్వస్వరూపము
తెలిసికోవడం సాధ్యమా?

సాధ్యమే. సుషుప్తిలో, స్పృహ లేనప్పుడు,
ప్రపంచం గురించి తెలియద. కానీ తన
ఉనికి మాత్రం ఉంటుంది. కాబట్టి
శుద్ధమైన స్వస్వరూపం, అందరినీ
కలుపుకొని, స్వీయానుభవానికి
వస్తుంది. వాటివలన తెలిసే నీతి
ఏమిటంటే జ్ఞానులు, అజ్ఞానులు
క్రొత్త క్రొత్త మాటలతో వర్ణించడం
స్వస్వరూప అనుసంధానానికి
వ్యతిరేకం.

Friday, February 3, 2023

Ramana Maharshi QuestionAnswers Part 1

అభ్యాసము



సాధన చేసే పద్దతి ఏమిటి?

ఆత్మజ్ఞానమును పొందదలిచే వాని
ఆత్మ స్వస్వరూపముకన్నా వేరుగా లేదు.
ఆత్మ కన్నా గొప్ప విషయము లేదు. ఎందుకంటే
ముక్తి కోరువాడు ఆత్మ జ్ఞానము వాని సహజ స్థితిని తెలపేదని
తెలిసికొ౦టాడు. దానిపై ఎటువంటి సంశయాలు,
అనుమానములు ఉండవు. అతడు క్షణికమైన,
శాశ్వతమైన వాటి మధ్య భేదము ఏమిటో తెలిసికొని తన
సహజ స్థితియందు నిలిచి ఉంటాడు. దీనినే
జ్ఞాన సాధన అనికూడా అంటారు. ఈ విధంగా
ఆత్మ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది.


ఇతర పద్దతులు ఏమిటి?

అవి:


  1. స్తుతి: భక్తితో దేవుని కీర్తించుట లేదా గానము చేయుట
  2. జపం: దేవుని మంత్రాలు లేదా నామాలు
    మనస్సులో గాని, బయటకు గాని వల్లించుట
  3. ధ్యానము: జపం లాగే దేవుని మంత్రాలు లేదా
    నామాలు భక్తితో వల్లిస్తూ, మనస్సుని బాహ్య
    విషయాలనుండి మరల్చి అంతర్ముఖమవుట
  4. యోగ: మనస్సు, శ్వాస యొక్క మూలము
    ఒక్కటే. కాబట్టి శ్వాస నియంత్రణ ద్వారా --
    ప్రాణాయామము ద్వారా-- మనస్సుని
    ధ్యానం యందు కేంద్రీకరించుటను యోగ అంటారు
    సహస్రారమందు, చక్రాలయందు మనస్సుని
    నిలిపి యోగి ఆనందంతో ఎంతో సమయం
    ఉంటాడు. కానీ మనస్సు లేచినప్పుడు
    మళ్ళీ ఆలోచనలతో సతమతమవుతాడు.
    కావున ధ్యానముతో యోగ చేయడం ఉత్తమం.
  5. జ్ఞానము: ఈ మార్గంలో మనస్సుని ఆత్మతో
    అనుసంధానము చేసి ధ్యానము లేదా
    ఆత్మ విచారణతో దానిని నశింపజేస్తారు. మనస్సు
    నశిస్తే అన్ని కర్మలు కనుమరుగవుతాయి.
    ఇలాగ తమ సహజస్థితిని ఎన్నటికీ పోగొట్టుకోరు.
    మౌనము లేదా కర్మల విసర్జనము కూడా
    జ్ఞాన మార్గమని చెప్పబడతాయి.


నిశ్చలంగా ఉండడం ప్రయత్నంతో
కూడి ఉంటుందా?

అది అప్రయత్నంగా లేదా సులభంగా
వచ్చే స్థితి కాదు. అన్ని కార్యాలనూ మనస్సు
కొంత పెట్టి ప్రయత్నం చెయ్యాలి. మధ్యమధ్యలో
విరామం తీసికోవాలి. కానీ ఆత్మతో
అనుసంధానము లేదా అంతరంలో
నిశ్చలంగా ఉండడం చాలా తీవ్ర
ప్రయత్నం వలననే సాధ్యం. దానికై
మనస్సునంతా ఉపయోగించి విసుగు
విరామం లేకుండా సాధన చెయ్యాలి.

మామూలుగా మాయను జయించడం
అసాధ్యం. కానీ మౌనంతో సాధన చేస్తే
మాయను జయించవచ్చు.


మాయ యొక్క స్వభావమేమిటి?

మాయ ప్రభావము వలన సర్వాన్ని
వ్యాపించిన--అంటే స్వయం ప్రకాశం,
జీవనాధారం, జగత్తుకు ఆధారం, చివరకు
భగవంతుని గురించి జ్ఞానమునకు ఆధారమైన--
ఆత్మ లేదనే భావన కలుగుతుంది.
నిజానికి మాయకి ఉనికిలేదు.


ఆత్మ స్వప్రకాశమైనది అయినా
అందరూ అది తక్కిన వస్తువులులా ఎందుకు
చూడరు?

మనకి ఒక వస్తువు గురించి జ్ఞానము
కలగాలంటే ఆత్మ వాటిని వ్యాపించి
ఉండాలి. కేవలం ఆత్మ శక్తితోనే
వస్తుజ్ఞానము కలుగుతుంది. ఆత్మ
ఒక్కటే జ్ఞానము కలది. తక్కినవాటికి
జ్ఞానము లేక తమను తాము తెలిసికోలేని
స్థితిలో ఉంటాయి. కాబట్టి ఆత్మ తన
స్వస్వరూపాన్ని తెలిసికోలేకపోతే
జనన-మరణ చక్రములో పడి అనేక
బాధలనుభవిస్తూ జీవాత్మ గా
వ్యవహరిస్తుంది.


జీవుడు దేవుని దయలేకపోతే
ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందగలడు?

దేవుడు సర్వజ్ఞుడు. ఒక గుడ్లగూబ
పగలు చూడలేకపోతే దానికి
కారణం సూర్యుడు కాదు. అలాగే
ఆత్మ జ్ఞానము లేనివారు ఆత్మతో
అనుసంధానము కాలేకపోతే
దానికి కారణం వారే. దేవుడు స్వతహాగా పరమ
దయాళువు. అందువలన దేవుడు
ప్రయత్నంతో తన దయను
ప్రదర్శించనక్కరలేదు. అలాగే
ఒక నిర్ణీత సమయంలో దేవుని
దయ కలుగుతుంది అనడం కూడా
తప్పు.


శరీరంలో ఆత్మ ఎక్కడ స్థితమై ఉంటుంది?

ఆత్మ ఛాతీలో కుడివైపు స్థితమై ఉంటుంది.
ఎందుకంటే మన౦ "నేను" అని తెలపడానికి
మన కుడి ఛాతీ పై చెయ్యి వేసి చెప్తాం.
కొందరు సహస్రారము ఆత్మ యొక్క స్థానమని
అంటారు. అలాగైతే నిద్ర పోయినప్పుడు
లేదా సొమ్మసిల్లి నప్పుడు తల
ముందుకి వాలకూడదు.


హృదయం యొక్క స్వభావమేమిటి?

మన పురాణాలు ఛాతీ మధ్యలో ఆరు
అవయవాలు వివిధ రంగులతో
ఉంటాయని చెప్తాయి. వాటిలో తలక్రిందలుగా
ఉన్న కలువ హృదయం అని చెప్పబడుతుంది.
దాని మధ్యలో అజ్ఞానమనే చీకటి
అనేకమైన కోరికలు కలిగి ఉంటుంది.
నాడీ వ్యవస్థకు అదే ఆధారం. ముఖ్య
శక్తులకి, మనస్సుకి, తెలివికి అదే ఆధారం.

అలా చెప్పినప్పటికీ హృదయమే
ఆత్మ స్థానం. దాన్నే సత్, చిత్, ఆనందం,
నిత్యం, పూర్ణం అంటాము. దానికి
అంతర్బాహ్య లేదా మీదా క్రి౦ద అనే
భేదాలు లేవు. నిశ్చలమై, ఆలోచనలు
లేకుండట ఆత్మ యొక్క స్థితి. అలా
భావిస్తే శరీరంలో ఏ భాగంలో
ఉంటుందనే ప్రశ్నను విశ్లేషించ
నక్కరలేదు.


బాహ్య వస్తువులతో సంబంధ౦
లేక పోయినా మనస్సులో ఎందుకు
అనేకమైన ఆలోచనలు వస్తాయి?

దానికి కారణం పూర్వ సంస్కారాలు.
ఆత్మ జ్ఞానము లేని జీవుడు బహిర్ముఖుడు
కావటం వలన. మనస్సులో ఆలోచనల
అలజడ కలిగితే, "ఎవరు వాటిని చూసేవారు?"
అనే ప్రశ్న వేసుకొంటే, అవి మాటు
మాయమవుతాయి.


త్రిపుటి (దృష్టి-దృశ్యం-ద్రష్ట) సుషుప్తిలో
లేదా సమాధిలో లేక వేకువ మరియు
నిద్రావస్థలలోనే ఎందుకు ఉంటుంది?

ఆత్మ నుండి ఇవి లేస్తాయి:


  1. చిదాభాస : ఒకరకమైన ప్రకాశం
  2. జీవుడు: అన్ని దృశ్యాలను చూసేవాడు
  3. దృశ్య ప్రపంచము


ఆత్మ జ్ఞానానికి, అజ్ఞానానికి అతీతమైనప్పుడు
దేహంలో వ్యాపకమై, ఇంద్రియాలు
పనిచేయుటకు ఎలా తోడ్పడుతుంది?

జ్ఞానులు నాడీ వ్యవస్థ, ఆత్మ
హృదయ గ్రంధి వద్ద కలుస్తాయని అంటారు.
ఈ విధంగా కలిసిఉన్న జ్ఞానము, అజ్ఞానములను
ఛేదించాలి. విద్యుత్చ్ఛక్తి ఏ విధంగా
అనేక పరికరాలను వెలిగించి లేదా
పని చేయిస్తుందో ఆత్మ కూడా దేహాన్ని,
ఇంద్రియాలను వ్యాపించి వాటిని
పనిచేయిస్తుంది. హృదయ
గ్రంథిని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదిస్తే
ఆత్మ దానిపాటికది నిర్గుణమై ఉంటుంది.


శుద్ధ జ్ఞానస్వరూపమైన ఆత్మకి,
త్రిపుటితో పరస్పర సంబంధము ఎలా
సాధ్యం?

ఒక సినిమాను చూడండి: చలన
చిత్రాలు తెరపై భూతద్దం ద్వారా
ప్రదర్శింపబడతాయి. అలాగే
పూర్వ సంస్కారాలు ఉన్నంత వరకూ
మెలకువ మరియు నిద్రావస్థలలో
జగత్తనే దృశ్యం కనపడుతూ ఉంటుంది.
ఎలాగైతే భూతద్దం ఫిల్మ్ పైనున్న
చిన్న చిన్న దృశ్యాలను పెద్దవి
చేసి చూపిస్తుందో, మనస్సు సంస్కారాలను
పెద్ద వట వృక్షాలలాగ పెద్దవి చేసి
చూపిస్తుంది. ఎలాగైతే కాంతి
ముందు ఫిల్మ్ లేకపోతే తెరపై
దృశ్యాలు ఉండవో,
ఆత్మ సుషుప్తి, మూర్ఛ, సమాధి స్థితులలో
సంస్కారములు లేనందున త్రిపుటి లేక
శుద్ధ జ్ఞాన స్వరూపమై ఉంటుంది. ఎలాగైతే
కాంతి ఫిల్మ్, భూతద్ద౦లతో ఎటువంటి
సంబంధంలేకుండా ఉంటుందో, ఆత్మ
చిదాభాస మొదలగు వాటిని ప్రకాశింప
జేసి అసంగంగా ఉంటుంది.


ధ్యానమంటే ఏమిటి?


స్వస్వరూపంతో ఉంటూ సహజ స్థితిని
కోల్పోకుండా, ఎటువంటి స్పృహ లేకుండా
చేసేదే ధ్యానం. ధ్యానం చేస్తున్నప్పుడు
వివిధ స్థితుల -- అనగా వేకువ,
నిద్ర, మొదలైనవి--స్పృహ లేనందున
జపం చేస్తూ ఉన్న
నిద్రావస్థ కూడా ధ్యానమనబడుతుంది.


ధ్యానానికి, సమాధికి తేడా ఏమిటి?

ధ్యానం మనస్సుతో ప్రయత్నపూరకంగా
చేయబడుతుంది. సమాధి అప్రయత్నంగానే
కలుగుతుంది.


ధ్యానంలో గుర్తు పెట్టుకోవలసిన
అంశాలు ఏమిటి ?

ధ్యానంలో ఆత్మ నిష్ఠ కలిగి, ఎటువంటి
బాహ్య విషయాల యందు స్పృహ లేకుండా
ఉండాలి. అలాకాక ఉంటే వింత శబ్దాలు,
కాంతులు మనస్సులో చూడవచ్చు.
అది సహజస్థితి కాదు.


సాధకుడు పాటించవలసిన నియమాలేమిటి?

మితాహారం, తగినంత మాత్రమే నిద్ర, వాక్కు
నియంత్రణ


సాధన ఎంత కాలం చెయ్యాలి?

మనస్సు అప్రయత్నంగా ఆలోచనలను
నియంత్రించలేక, నేను, నాది అనే భావనలను
తొలగనంత కాలం సాధన చెయ్యాలి.


ఏకాంత వాసమంటే ఏమిటి?

ఆత్మ సర్వవ్యాపకమైనందున దానికి
ఏకాంత స్థలం లేదు. కాబట్టి మనస్సులో
ఎటువంటి ఆలోచనలు లేకపోవుట ఏకాంత
వాసం.


వివేకానికి చిహ్నం ఏమిటి ?

ఒకమారు సత్యాన్ని తెలిసికొన్న
తరువాత భ్రమలో పడకుండుట.
బ్రహ్మన్ కి, మనకి తేడా తెలిసినంత
వరకూ వివేకం ఉదయించలేదు.
అలాగే దేహమే ఆత్మ అనే భావన
ఉన్నంతవరకూ అవివేకామే.


అంతా ప్రారబ్ద కర్మాచరణమైనప్పుడు
ధ్యానానికి కలిగే విఘ్నాలను తొలగించు
కోవడం ఎలా?

ప్రారబ్దం బాహ్య విషయాలయందు
ఆసక్తి కలవారికే ఉంటుంది. అంతర్ముఖులై
ఉన్నవారిని అది బాధించదు. ఎవరైతే
తమ స్వస్వరూపాన్ని దర్శించడానికి
సాధన చేస్తూ ఉంటారో వారు ఎటువంటి
విఘ్నాలకూ భయపడరు.


ఆత్మ నిష్ఠకు సన్యాసం అవసరమా ?

దేహాన్ని విస్మరించడానికి ఒక కారణం
ఆత్మజ్ఞానాన్ని పొందడ౦. పరిపక్వమైన
ఆలోచనలు, విచారణలు మాత్రమే
దేహాభిమానాన్ని లేకుండా చేస్తాయి.
బ్రహ్మచర్యం, గృహస్తు, సన్యాసము
మొదలైన ఆశ్రమాలు కావు. ఎందుకంటే
మనస్సులో దేహాభిమానము అంతర్గతంగా
ఉంది. కానీ ఆశ్రమాలు బాహ్యంగా ఉన్నాయి.
మనస్సులోని బంధాలు అనాలోచితంగా
ప్రవేశిస్తే, ఒక్క ఆత్మ విచారణే వాటిని
తొలగించగలదు. కానీ సన్యాసం
వైరాగ్యాన్ని కలిగించి, ఆత్మ విచారణ వైపు
నడిపిస్తే, సన్యాశ్రమం తీసికోవడం
ఒక విధంగా మంచిదే. అలా కాకపోతే
గృహస్తు ఆశ్రమమే ఉత్తమం. స్వస్వరూప
అనుసంధానం జరగాలంటే సంకల్ప,
వికల్పాలనుండి విడిపడడం
-- అంటే మనస్సులో కుటుంబాన్ని త్యజించడం -- వలననే
సాధ్యం. అదే నిజమైన సన్యాసం.


కర్తృత్వం ఉన్నంత వరకూ ఆత్మ జ్ఞానము
పొందలేము కదా. అలా౦టప్పుడు గృహస్తు
కర్తృత్వ భావన లేకుండా కర్మలను
ఆచరించగలడా?

కర్మ కర్తృత్వ భావన వలననే జరగాలని
ఎక్కడా రాసిపెట్టి లేదు. ఉదాహరణకు:
ఒక బ్యాంక్ ఉద్యోగి లక్షల, కోట్ల డబ్బును
లెక్కపెట్టినంత మాత్రాన, ఆ సొమ్ము తనకు
దక్కుతుందనే భావన కలిగి ఉండడు.
అలాగే ప్రారబ్దవసాన చేయవలసిన
కర్మలను ఒక గృహస్తు కర్తృత్వ భావన
లేకుండా చేయగలడు. తాను భగవంతుని
పని ముట్టు మాత్రమే అనుకున్నంత కాలం
కర్మ మరియు జ్ఞానము పరస్పర
విరుద్ధములు కావు.


ఎటువంటి సుఖాలు, ప్రతిఫలము ఆశించని గృహస్తుకి
కుటుంబం అవసరమా?

తనకు ఎటువంటి సుఖాలూ అక్కరలేకపోయినా
గృహస్తు ప్రారబ్దవసాన కర్మలు చేస్తూ తన
కుటుంబాన్ని పోషిస్తాడు. దానిని మానవ సేవ
అనవచ్చు. ఒక వివేకవంతుడైన గృహస్తు తన
కుటుంబంద్వారా సంతోషములు, సుఖములు
అనుభవి౦చి, కుటుంబాన్ని ఉద్ధరిస్తే తాను ఉన్నత శిఖరాలను
చేరినట్టే. అటు తరువాత కుటుంబ ఉద్ధరణకు అతడు
చేయవలసినది ఏమి లేదనే జ్ఞానము ఉదయించి
దానిని కూడా త్యజిస్తాడు.


నివృత్తి -- అంటే కర్మలు చేయకుండుట--
మరియు మనశ్శాంతి కర్మలు చేయవలసిన గృహస్తు
ఎలా పొందగలడు?

వివేకవంతుని కర్మలు ఇతరులకు పెద్దవిగా
కనిపించవచ్చు. కానీ తన దృష్టిలో వివేకవంతుడు
కర్తృత్వము లేనివాడు. కాబట్టి నివృత్తి మరియు
మనశ్శాంతికి వాని కర్మలు అడ్డంకులు కావు.
వానికి తాను కర్మలకు సాక్షి మాత్రమే అని తెలుసు.


ఒక జ్ఞాని యొక్క పూర్వ కర్మలు ప్రారబ్దంగా
పరిణమించినప్పుడు, ప్రస్తుత కర్మల వాసనలు
భవిష్యత్ కాలంలో వెంటాడతాయా?

అన్ని వాసనలు అధిగమించినవానినే
జ్ఞాని అంటారు. కర్తృత్వము లేక, కర్మ, వాసనలకు కేవలము
సాక్షిగా ఉన్నవానికి వాటివలన ఎలా
ప్రభావితుడవుతాడు?


బ్రహ్మచర్యమంటే ఏమిటి ?

బ్రహ్మన్ గురించి విచారణ చెయ్యడమే
బ్రహ్మచర్యం


బ్రహ్మచర్యాశ్రమము వలన జ్ఞానము పొందవచ్చా?

బ్రహ్మచర్యంలో ఇంద్రియ నిగ్రహణ మొదలగు
సాధనాలు ఉండడంవలన, బ్రహ్మచారుల
సాంగత్యముతో జ్ఞానాన్ని పెంపొందుకోవచ్చు.


బ్రహ్మచర్యం నుంచి సన్యాసం నేరుగా
తీసుకోవచ్చా?

సాధకులు బ్రహ్మచర్యం తీసికోవాలనే
నిబంధన లేదు. వారు ప్రతిభ కలవారైతే
వివిధ ఆశ్రమాలను దాట నక్కరలేదు.
దాని వలన ఎటువంటి దుష్పరిణామములు
కలుగవు.


సాధకుడు కుల వృత్తులు పాటించక
పోతే ఏమైనా నష్టమా?

జ్ఞాన మార్గము ముక్తికై అన్ని మార్గాలకన్నా
ఉత్తమమైనందున, జ్ఞాని జ్ఞాన సముపార్జన
చేస్తూ తన కుల వృత్తులను లోక కళ్యాణమునకై
చేస్తాడు. కానీ తనకు ఎటువంటి లాభాన్నీ
కోరడు. అలాగే అవి చేయకపోవడం వలన
ఎటువంటి నష్టాన్నీ పొందడు.

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...