14
తేహ్లాద పరితాపఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్
తే= వారు హ్లా దపరితాపఫలాః = సంతోషము, దుఃఖము అను ఫలితములను పొందువారు పుణ్యా + అపుణ్య =పుణ్యము, పాపము అనునట్టి హేతుత్వాత్ = కారణముల వలన
పుణ్యము, పాపము అను కారణముల వలన వారు సంతోషము, దుఃఖము అను ఫలితములను పొందుదురు.
సంతోషము కలిగించుపనులను పుణ్యకర్మలని, దుఃఖమును కలిగించు కర్మలను పాపకర్మలని అంటారు. ఈ రెండిటివలన మానవునికి జీవిత మేర్పడుతోంది. పూర్వజన్మయందలి పుణ్య పాపములవలన ఈ జన్మయందలి ఆయుర్ధాయము, జాతకము మొదలైనవి ఏర్పడి, సుఖదుఃఖములను అనుభవింప చేస్తాయి. కొందరు ఆరోగ్యవంతులుగా, ధృడమయిన శరీరముతో పుడతారు. కొందరు అనారోగ్యమయిన, కృశించిన శరీరముతో పుడతారు. ఇవన్నీ వారి పూర్వ జీవితమునందలి ప్రవర్తన, సంస్కారములననుసరించి కలుగుతాయి. అ౦టే ఎట్టి సంస్కారములు కలిగినవారు అట్టి జీవితమునే కలిగియుంటారు. అట్టి తల్లితండ్రులచే ఆకర్షింపబడి వారి కడుపున పుడతారు. అందుకనే సంప్రదాయమేర్పడినది. వివాహాదికములు, లావాదేవీలు చేసుకొను సందర్భములలో వంశము, సంప్రదాయము చూడవలెనను ఆచా రము దీని వలన పుట్టింది. నేటికిని నూటికి 90 మంది విషయమున ఇది సత్యమగుట మనము గమనిస్తూనే యున్నాము. మిగిలిన పది మంది గురించి జాతకము పరిశీలిస్తే తెలుస్తుంది. ఎవడి జన్మసంస్కారములను బట్టి వాడు తన తల్లితండ్రుల నెన్నుకొని పుడతాడు. ఒక అధికారి ఇతర దేశములకు వెళ్తే, అక్కడ తన ఆఫీసుశాఖవారిచే ఆదరింపబడతాడు. అట్లే ఒక జూదగాడు పోయినచో ఆదేశములోని జూదశాలలను దర్శించి, అక్కడి వారితో కలుస్తాడు. అట్లే ఒక నటకునికి పాత్రధారణ లభించుట యన్నది, అతడింతకు ముందు నటించిన పాత్రలను బట్టి నిర్ణయింవబడును. అట్లు ఒక నాటకములోని రంగములు అంకములు, దృశ్యములు ముందుగా ఒక క్రమపద్ధతిలో నిర్ణయింపబడిన ప్రకారము నిర్వహింవబడును. అనగా పాత్రధారులు ఎవరికి తోఛిన విధముగా వారు నటించుట, సంభాషణలు చెప్పు ట కాక, మొదట రచయిత నిర్షయించిన విధానములో సంభాషించి నటిస్తారు. అట్లే ఈ భూమిపై జీవుల వృత్తాంతములు కూడా ముందరి జన్మల సంస్కారములను బట్టి, అనగా ప్రవర్తనను బట్టి లక్షణములను బట్టి నిర్ణయింపబడును. అట్లు వారి పుట్టుక, తల్లితండ్రులు మొదలైనవి కూడా తదనుగుణముగా నిర్ణయింపబడతాయి. ఈ నిర్ణయించుట కూడా ఎవరికి వారే తమకు తామే నిర్ణయించుకుంటారు గాని, ఇంకొకరు నిర్ణయించరు. న్యాయశాస్త్రము చదివినవాడు న్యాయవాదియగుట తన నిర్ణయము వల్లనే కాని ఇంకొకరి నిర్ణయము వలన కాదు. అట్లే ఎవరి ప్రవర్తనా సరళిననునరించి వారికి జీవిత మేర్పడుతుంది. జీవితములో సుఖదుఃఖములకు, వాటికి కారణమైన జీవిత సంఘటనలకు, మన ఆలోచనలు, ఉద్దేశ్యములే కారణములు. యోగియైన వాడు వీటిని లెక్క పెట్టడు. ఒక గొప్ప నటుడు తాను నటింపవలసనది సంతోషకరమైన సన్నివేశమైననూ, దుఃఖకరమైన సన్నివేశమయినా బాధపడడుకదా!
15
పరిణామ తాపసంస్కార దుఃఖై ర్గుణవృత్తి విరోధాచ్చ దుఃఖ మేవ సర్వం వివేకినః
పరిణామ = ఫలితము తాప = తపన సంస్కారదుఃఖైః = దుఃఖమనబడు సంస్కారము గుణవృత్తివిరోధాత్ = గుణము, ప్రవృత్తి అను పరస్పర వైరుధ్యము వలన చ= మరియు దుఃఖమేవ సర్వం = అంతయు దుఃఖమే వివేకినః = వివేకవంతునకు
వివేకవంతులైన వారికి ప్రతిపని మొదటయైననూ చివర కైననూ దుఃఖమునే కలిగించును; లేక గుణముల, ప్రవృత్తుల, వైరుధ్యముల చేతనైననూ దుఃఖమునే కలిగించును.
మంచి పనుల వలన సంతోషము, చెడ్డపనులవలన దుఃఖము కలుగుననునది కొంతవరకే సత్యము. మంచి పనులు సుఖము కలిగించినా అది తొలగిపోయినవెనుక మరల దుఃఖమే కలు గుతుంది. ఆహారము రుచిగానున్నదని మరింత తిన్నవానికి దుఃఖము రోగమను పేర సంక్రమిస్తుంది. ధనము సహితము సుఖమును కలిగించునుకాని, దానిని నిలబెట్టకొనుటకు త్రిప్పలు పడుటలో మరల దుఃఖమే కలుగుచున్నది. సుఖము ధనము వంటిది. అది అనుభవించినచో తరిగపోవును. అనుభవింపని వానికి ఉండి ప్రయోజనములేదు. కనుక ఎట్లైననూ దుఃఖము పర్యవసానమేయగుచున్నది. అట్లే ధనము సహితము దొంగిలింప బడుటవలన, పోగొట్టుకొనుటవలన, తెలివితక్కువగా పెట్టుబడి పెట్టుటవలన, లేక తన పిల్లలు దుర్వినియోగము చేయుటవలన, దుఃఖమునే కలిగిస్తుంది. తుదకు దాచి పెట్టుట సహితము ఆందోళనను కలిగిస్తుంది. చివరకు స్నేహమువలన సహితము, స్నేహితుని ప్రవర్తన మారినప్పుడు కాని, లేక దూరమైనప్పుడు కాని దుఃఖము కలుగుతుంది. కనుక వివేకవంతునికి జీవిత సంఘటనలననుసరించి కలుగు సుఖమునందు నమ్మకముండదు. ఇవియన్నియూ తాత్కాలికములని, అనుభవించినచో తరిగి పోవునని, వాటికి శాశ్వతత్వము లేదని తెలియును. కాని యోగియైనవాడు మంచిపనులనే చేయును. కారణము వాటి ఫలితము గూర్చి కాదు. ఫలితము అశాశ్వతమైనదని తెలియును. మంచి పనులు చేయుటలో గల ఆనందము పనులకు సంబందంచినది కాక, తనకు సంబంధించినదే. చేయుటలో గల ఆనందము ఫలితము నందుండదు. అనగా ఆనందము, తన కర్తవ్యమును లేక ధర్మమునాచరించినప్పుడు తనయందు పుట్టినదే కాని, పనుల ఫలితముల వలన కాదు. పనులు చేయుటవలన పుట్టిన ఆనందము మనస్సును దేహకోశములను శుభ్రపరచి ఆత్మ సంతృప్తిని కలిగించును. ఇది తరిగిపోని సంపద. ఇది అనుభవించిన కొలది సుఖమే కాని దుఃఖముండదు. ఫలితములకు సంబంధము లేక పనులు చేయువానియందు మాత్రమే యిది పుడుతుంది. ఇతరులకు ప్రయోజనకరమై తాను నిర్వహించు పనులు నిజమైన ఆనందము కలిగిస్తాయి. ప్రజలకు ప్రయోజనకరమయిన పనులలో తన సామర్ధ్యమునకు తగినట్టివి తన ధర్మములవుతాయి. కనుకనే ధర్మాచరణము చేయువాడు సుఖమును పొందుననియూ, చేయనివాడు దుఃఖమును పొందుననియూ పెద్దలు చెప్పిరి. అట్టి ధర్మాచరణము చేయువాడు ఫలితమును లెక్క పెట్టక చేయుచున్నచో అట్టివానికి మనస్సు, బుద్ది ఆత్మగతమవుతుంది. దీనినే ప్రశాంతి అంటారు. ఇట్టి స్టితి యందున్నవానికి వేరు సుఖములక్కరలేదు. ఇదియే మెలుకువ యనియూ, జాగ్రదావస్థయనియూ వేదాంతగ్రంధములందు చెప్పబడినది. కనుక "సంతోషము", "ప్రశాంతి" అనునవి ఆత్మగతమైనపుడు అవి రెండునూ ఒక్కటే. ఇట్టి స్థితి, ఆలోచన, ఇంద్రియ స్పర్శలు, ఆదర్శములు, లక్ష్యములు మొదలైనవానికతీతము. అది కారణముకాదు; కార్యము కాదు; దానికి సమమైనదిగాని, లేక అట్టి స్థితికలిగించునది కాన వేరే లేదు. అది కొలువబడినది కాదు. అది అమూల్యమైనటువంటి సత్యము. కనుకనే మంచి పనులు, చెడ్డ పనులు, అనగా పుణ్యపాపములనేవి యోగికిలేవు. పుణ్య పాపములనునవి ఫలితము పొందువానిపై నాధారపడియుంటాయి. యోగిఫలితము కోరడు గనుక అవి ఫలితములు పొందువారిపై ప్రభావమును చూపించును. కనుకనే యోగి మంచి పనులనే చేయును గాని చెడ్డపనులు చేయడు. అవి తనపై ప్రభావము చూపుటకు సంబంధించుటవలన కాక, ఇతరుల పై చూపు ప్రభావముననుసరించి యోగి పనిచేస్తాడు. తన స్వ౦త జీవితము లేదు. ఇతరుల యోగక్షేమమే వానికి జీవితము. కనుక వానికి పుణ్యపాపములు లేవు. కనుక సుఖ దుఃఖములు లేవు. అతడున్న స్థితి ఈ రెండిటికి వెనుకనున్న స్థితి. అదియే ప్రశాంతి. ఇది పుట్టుటకు యోగికి కారణమక్కరలేదు గనుక యోగికిది లేకుండుటలేదు.
No comments:
Post a Comment