16
హేయం దుఃఖమనాగతమ్
హేయం = పరిహరింపదగినది దుఃఖం = దుఃఖము అనాగతం = జరుగనది
ఇంకను సంభవించని దుఃఖములను పరిహరింపవలెను.
ఎవరైనా దుఃఖమును తొలగించుకొనగలరా! అది అసాధ్యమనిపించును. మన దేశమున పెక్కుమంది కర్మసిద్దాంతమును, జ్యోతిశ్శాస్త్రమును గుడ్డిగా విశ్వశిస్తారు. అ౦టే ఆయా శాస్త్రములయందు సత్యము లేదనికాదు. వైద్య శాస్త్ర మెట్లో ఇవి యున్నట్లే. ఒక వెద్యుడు రోగిని పరీక్షచేసి నీకు T.B. యున్నదని చెప్పినచో అతడా రోగముతో మరణించుననిగాని, మరణించి తీరవలెనని గాని అర్థము కాదు. సకాలములో సరియైన వైద్యము చేయించుకొని ఆహారవిహారాదులయందు క్రమశిక్షణ పాటిస్తే రోగము నిర్మూలనమగును. అట్లుకాక నిర్లక్ష్యము చేసినచో, ఆవ్యాధి తీవ్రమై మరణించును. కర్మ సిద్ధాంతమనగా కార్యకారణ సిద్దాంతము. కార్యమునకు లేక ఫలితములకు కారణములుంటాయి. ఫలితమును తొలగించుకొనలేముగాని, కారణమును తొలగించుకొనుట మనచేతిలోనే ఉంటుంది. కారణములు తొలగి పోయినచో ముందు రాబోవు ఫలితములు కూడా తొలగిపోవును. అంతేకాని అవి ఫలితములైన తరువాత తొలగింపలేము. శరిరమునకు సరిపడనివి తినినచో కడుపునొప్పివచ్చును. కడుపునొప్పివచ్చిన వెనుక చేయగలిగినదేమిలేదు. కాని సరిపడనివి తినుట పరహరి౦చినచో తర్వాత కడుపునొప్పిరాకుండ నివారించుకొనగలము.
17
ద్రష్టదృశ్యయోః సంయోగో హేయ హేతుః
ద్రష్ట = చూచువాడు దృశ్యయోః = చూడబడునట్టిది సంయోగ = కలయిక హేయ = వర్ణింపదగినది హేతుః = కారణము
(దష్ట, దృశ్యముతోనేకమైనచో అది హేయకారణమగును.
నిజమైన దుఃఖకారణము మన పరిసరములపై నాధారపడియు౦టుంది. అనగా మన పరిసరములగూర్చి మనయందున్న భావనపై నాధారపడియు౦టుంది. మనస్సు, యింద్రియములు, ఇంద్రియార్థము లన్నవి మనలో భాగములే. అనగా మన స్వభావము నుండి పుట్టినవే. మన యింద్రియములు, మనయందలి ఇంద్రియముల గూర్చిన భావనపైనాధారపడి పనిచేస్తున్నాయి. అట్టి భావనయే మనము స్వభావము అని పిలుస్తున్నాము. అట్లు మనస్సు సహి తము మననుండి పుట్టి మనపై పనిచేస్తున్నాది. పరిసరములు కూడా మనలోనివే. మనస్వభావమే మనమని పొరపడినప్పుడు మనము చూచినవి, విన్నవి, రుచిచూచినవి మనపై ప్రభావము చూపుతాయి. దానివలన మనకు మంచి పనులు, చెడు పనులు అన్నవి ఏర్పడుతాయి. పనులు వాట ఫలితములను కలిగిస్తాయి. కనుక మన మెవరమో, మనకు తెలియవలెను. దానినే యోగము అందురు. యోగికి చూచుట, వినుట, మొదలైనవి యుండవు. యోగికి కనులు చూస్తున్నా, అతను చూడడు. అనగా వాని స్వభావము పనిచేస్తున్నా, అతడు దాని కతీతముగా నుండును. ఇది ఎట్టిదనగా సూర్యుని కాంతి సూర్యుని నుండి ప్రసరించుచునేయున్ననూ, సూర్యుడు ప్రసరించడు. కాని సూర్యుని ద్వారా సూర్యకాంతి ప్రసరిస్తుంది. అట్లే యోగియైనవానికి, వాని శరీరము, మనస్సుపని చేస్తున్నా అతడు పనిచేయడు. అట్టివానికి కారణములు లేవు కనుక ఫలితములు కూడా లేవు. అప్పుడు అతనికి పనులుండవు. పనులన్నియూ పరమాత్మ వేయగును.
18
ప్రకాశ క్రియాస్టితిశీలం భూతేంద్రియాత్మకం భోగాసవర్గార్థమ్ దృశ్యమ్
ప్రకాశ = ప్రకాశించుట క్రియ =పని స్థితి= ఉనికి శీలం = గుణములుగాగలది భూత = భౌతికమైనట్టు ఆకారము ఇంద్రియాత్మకం = ఇంద్రియములతో కూడినట్టిది భోగ = సుఖము అపవర్గార్థమ్ = స్వేచ్చకొరకు దృశ్యమ్ = దృశ్యము
దృశ్యమునకు (అనగా చూడబడుదానికి) ప్రకాశము, కర్త వ్యము మరియు స్టితి అనునవి గుణములుగానున్నవి. అవి అనేక రూపములు మరియు ఇంద్రియములు కలిగినట్టివి. సుఖము, స్వేచ్చ అనునవి దాని ప్రయోజనములు.
దృశ్యము, విషయము మొదలైనవి ఇప్పుడు వివరింపబడుతున్నాయి. తానుతననుండి వేరై అనేకములుగా మార్చు చెందుట అసత్తుగా చెప్పబడినది. అనంతముగానున్న తాను, తననుండి. వేరుగానున్నానని తెలియుటయే అహంకారము. అహంకారమనగా జీవియందలి నేను అను ప్రజ్ఞ. ఇది ప్రధానముగా మూడు భాగ ములు: 1 ) తాను వెలుగై, ఇతరముగా వ్యాపించుట 2) అట్లు వ్యాపించుటయను ప్రవృత్తియే తానగుట 3) మరియు, తానే ఇతరము అను స్టితిగా నిలుచుట అట్లు ఆయన వ్యాపనము నందలి కర్త, కర్మ, క్రియ యను మూడు ప్రవృత్తులుగా దిగివచ్చుట. ఇచ్చట వ్యాపనము అనునది సత్యమైనచో, అట్టి సత్యమే "నేను". అట్టి నేను పై మూడుగా విశ్లేషణము చెందును. ఇదియే పరమాత్మ స్వభావము. ఇట్టి స్వభావమే త్రిగుణాత్మకమైన ప్రకృతిగా తెలియబడుతోంది. ఇందు సత్యమనగా కర్త. అనగా చేయువాడు. రజస్సు అ క్రియ లేక చేయుట. తమస్సు అనగా కర్మ లేక చేయబడు వస్తువు. ఇట్లే త్రిగుణాత్మకమయిన అతని స్వభావముననుసరించి సృష్టి ఏర్పడుతోంది. దీనికి కావలసిన యంత్రాంగమంతా తననుండే ఏర్పడుతోంది. అది: 1) పంచభూతములతో కూడిన భౌతికశరీరము 2) పంచేంద్రియములు (రుచి, స్పర్శ, వాసన చూపు, శబ్దము) ఈ యంత్రాంగ మేర్పడిన తరువాత ఈ రెండు కోశములను ఒకదానిననుసరించి మరియొకటి ప్రతిస్పందించును. ఇందు పృథ్వీతత్వము వాసనకు, జలము రుచికి, వాయువు స్పర్శకు, కాంతి చూపునకు, చోటు శబ్దమునకు స్పందించును. ఈ యంత్రాంగము మరల రెండు విభాగములకు చెందును. 1) వాహిక (body) 2) విషయసంయోగ కరణములు (senses) దేహ వ్యాపారము మరల వాహికను రెండు భాగములుగా చేస్తుంది. అవి చూచువాడు, చూచునది. ఈ రెండునూ రెండు స్థితులకు ప్రతీకలు. అవి సంబంధము, విముక్తి. ఇందు ఇంద్రియ వ్యాపారము కర్తకు సంబంధము కలిగిస్తుంది. అటువంటి బంధము లేకపోతే విముక్తి అనేది ఉండదు కదా! విముక్తి అంటే సంబంధమును తొలగించుకొనుట. అసలు సంబంధమే లేకపోతే, తొలగింపబడేది ఏది? కనుక ఈ రెండు స్థితులను ఒకే స్థితికి గల రెండు రూపములు. విద్యుత్ ఎట్లు పుట్టునో గమనిస్తే ఇది తెలియును. శరీరమొక డైనమో మోటారు వంటిదైతే, అందులో పుట్టే విద్యుత్తు అహంకారము వంటిది. ఈ అహంకారమే కర్తయనబడుతుంది. విద్యుత్తు తీగెల అమరిక పూర్తియైన తరువాత, వాటియందు అహంకారమను వ్యక్తిగత ప్రజ్ఞ ప్రవహిస్తుంది. దీనినే జీవి యనియందురు.
19
విశేషావిశేష లింగమా(తాలింగాని గుణపర్వాణి
విశేషా + అవిశేష = విశేషములు, సామాన్యములు లింగమాత్రా + అలింగాని = లింగభేదముతో కూడినవి, లేనివి గుణపర్వాణి = గుణములే పర్వములుగాగలది.
గుణములు పర్వములుగా నేర్చడి లింగభేదముతోను మరియు లింగ భేదము లేకుండగనూ విశేషములు, సామాన్యములు, అను రెండు స్టితులుగా నేర్పడుచున్నవి.
పశ్యకునికి (చూచువానికి) ప్రకృతి ఆధారము. ఈ రెండునూ అంతర్యామియైన పరమాత్మపై నాధారపడి యున్నవి. అట్టి పరమాత్మకు భేదములు లేవు. కాని పరమాత్మయందున్న పశ్యకుడైన జీవికి మరియు, ప్రకృతికి భేదములున్నవి. జీవికి వ్యక్తిగత ప్రజ్ఞ ఏర్పడి జీవిగానగుచున్నాడు. అట్టి జీవికి ప్రకృతి యాధారము. అట్టి ప్రకృతి మూడు గుణములుగా వ్యక్తమగును. అవి రజస్సు, తమస్సు, సత్వము. ఈ మూడు గుణములునూ అనేక మార్పులు చెంది వేర్వేరు స్వభావములుగా, గుణములుగా నేర్పడుతున్నాయి. ఒక గాజు పట్టకములో సూర్యకాంతి ప్రసరింపగా, అది వేరు వేరు రంగులుగా విడిపోయినట్లు, ఈ స్వభావముగా పనిచేయు ప్రకృతి, విశేషములు సామాన్యములు మొదలైనవిగా సమస్తమును చూచును. ఇందు సామాన్యములు తెల్లని సూర్య కాంతి వంటివి కాగా, విశేషములు, విడిపోయిన రంగులవంటివి. అట్లే చోటు సామాన్యముకాగా దాని నుండి పుట్టిన విషయము లన్నియూ విశేషములు. ఒక గదియందొక కుర్చి, ఒక బల్ల మొదలైనవి యున్నచో గది సామాన్యము. కుర్చీ, బల్ల విశేషములు. అట్లే మనమందరము వేరు వేరు కాగా మానవ జాతి యొక్కటే గనుక అది సామాన్యము. ఇట్లే సంఖ్యలును ఇందు లెక్కింపబడవలసిన మొత్తము, సామాన్యముకాగా, లెక్కింపబడు వస్తువుయొక్క సంఖ్య విశేషము. కనుక ప్రతి దానిని సామాన్యముగను, విశేషముగను జ్ఞప్తియందుంచుకొనవలెను.
20
ద్రష్టాదృశిమాత్రః శుధ్ధో అపి ప్రత్యయానుపశ్యః
ద్రష్టా= చూచువాడు దృశిమాత్రః = చూపుయను కొలత కలవాడు శుదః + అపి =స్వచ్ఛమైనప్పటికిని ప్రత్యయ + అనుపశ్య = ప్రత్యయముచే చూచునట్టవాడు
పశ్యకుడు కేవలము సాక్షిగను, స్వచ్చముగనున్ననూ, అతడు ప్రత్యయమునే చూచువాడగును
ఒక రంగుటద్దము ద్వారా చూచువాడు అన్నిటిని ఆ ర౦గుతోనే చూస్తాడు. ఇచ్చట చూచువానియందుకాని, వాని కన్నుయందుకాని వర్ణములేదు. అతడు చూచుటయే తన అస్తిత్వముగా కలవాడు. అనగా వాని చూపునందుగాని, చూడ బడువస్తువునందుగాని రంగులేదు. కాని అద్దమునకు రంగున్నది కనుక అద్దము ద్వారా చూచువానికి దాని రంగు లేక రంగులు కనిపించును. తెల్లని సూర్యకిరణము గాజు పట్టకమునందు విశ్లేషణము చెంది అనేక రంగులుగా ప్రకాశించును గదా! అట్లే ప్రకృతి లేక స్వభావము అను అద్దము వలన చూచువాని యందు, చూడబడువాని యందు లేని రంగులు వున్నట్లు కనిపించును. అవియే సత్వము, తమస్సు, రజస్సు అను మూడు గుణములు.
21
తదర్థ ఏవ దృశ్యస్యాత్మా
తదర్థ + ఏవ = అతనిని గూర్చి మాత్రమే దృశ్యస్య + ఆత్మా = దృశ్యము ఆత్మకు సంబంధించినది కనుక
చూచువానికి ఆత్మ ప్రకృతిగా తెలియబడును.
ప్రకృతి లేక స్వభావము అనునది అంతర్యామి యొక్క వ్యక్తస్వరూపమేగాని తదితరముకాదు. చూచునట్టి జీవికూడా (లేక పశ్యకుడు కూడా) తనకు తానను వెలుగేకాని అన్యము కాడు. వాని చుట్టును ప్రకృతి స్వభావముగా నేర్పడి పనిచేస్తున్నాది. అతడు గమనించినచో వాని స్వభావమే వాని నుండి వేరై ప్రకృతిగా దేహకోశములుగా వ్యక్తమగుచున్నది. అట్టి వాని స్వభావము పైన చెప్పబడిన రంగుటద్దము వంటది. తానే తన స్వభావమై దేహము మొదలైనవి ఏర్పడుచున్నాయి. కనుక ప్రకృతియనునది తన నుండి వేరుకాదు. తానే తనప్రకృతిగా తెలి యబడుచున్నాడు. అందలి వేరు వేరు దేహకోశములు తానే కనుక ప్రకృతి తననుండి వేరగుట మరల తనలో లీనమగుట తన ప్రణాళికలో ఒకభాగము. అదియే తనకు క్రీడ. ఉదాహరణకు మనచుట్టు వున్నచోటు మనకు చోటుగా కనిపించునుగాని దాని కదిచోటుకాదు. పరమాత్మయొక్క స్వరూపమే అది. ఒక స్త్రీ తన భర్తకు మాత్రమే భార్య కాని, తనకు తానేమియూకాదు. అట్లే ఈ ప్రకృతి పరమాత్మనుండి వాని క్రీడకొరకు దిగివచ్చి నది. దీనినే లీల అందురు. ఆ క్రీడయే బంధము, మోక్షముల ప్రత్యామ్నాయము.
22
కృతార్థం ప్రతి నష్ట మవ్యనష్టం తదన్యసాధారణత్వాత్
కృతార్థం ప్రతి = పరమార్థము సాధించినవానికి నష్టం + అపి = నస్టమున్ననూ అనం + తత్ = నష్టమే అన్యసాధారణత్వాత్ = ఇతరములతో సామ్యము కలిగియుండుట వలన
పరమార్థము చేకూరువానికి ప్రకృతి యుండదు. కాని ఇతరులకు మాత్రము అతడికియున్నట్లు కనిపించును.
యోగసాధన పూర్తియై, పరిపూర్ణత్వము పొందిన యోగికి ప్రకృతి యుండదు. దాని ఆవశ్యకత తీరినది కనుక, అది అంతర్యామిలో లీనమవుతుంది. అనగా తనయందే లీన మవుతుంది. కాని అట్టి ప్రకృతి ఇతరులకు మాత్రము పనిచేయును. ఇచ్చట ఇతరులనగా ఇంకనూ పరివూర్ణత్వము పొందనివారే. వారంతర్యామి యందు భాగములుగానున్ననూ, తమను తాము వేరుగా చూచు కొనుచున్నారు గనుక వేరుగానున్నట్టు గమనింతురు. మరియు వారు అంతర్యామిని ఇతరముగా చూచుచున్నారు గనుక, వారి కంతర్యామి ప్రకృతిగను, అందలి భాగములుగను తెలియబడును. యోగియైనవాడు ఇతరులు తనను ప్రకృతిగా చూచుచున్నారు గనుక, వారినట్లే చూడనిచ్చును. సాయిబాబా, రమణమహర్షి మున్నగు మహానుభావులు సైతము తమను ఇతరులు ప్రకృతిలో భాగములుగా చూచి తమకు సేవచేయుట ఆహారపానీయములిచ్చుట మొదలైనవి చేసిననూ, తామంగీకరించిరేగాని కాదనలేదు. అట్లు వారి సేవ నంగీకరించుట, వారిని తరింపచేయుట కొరకే. వారు తరించిన వెనుక ప్రకృతియను మాయ తమ మధ్య తొలగిపోవును. మంచుగడ్డ నీరే. అయిననూ నీటిపై తేలుటయను గుణము కలిగియుండును. కాని కరిగిన వెనుక అదియునూ నీటి యందలి భాగమే. నిజమునకు బంధము, విముక్తియనునది ఒకే త్రాటకి యున్న రెండు కొనలు. ఈ రెండిటిని కలుపుట వలన వృత్తము లేక పరిపూర్ణత్వమేర్చడును. ఈ వృత్తమునకు మొదలెచ్చట నున్నదో, చివరకూడానదియే. బంధము లేనిది ముక్తియుండదు కదా! కనుక పరమాత్మకు బంధము ముక్తియనునవి వేరువేరు గావు. అవి రెండునూ తనచే క్రీడార్థమై కల్పింపబడినవి.
No comments:
Post a Comment