Wednesday, December 6, 2023

Venkateswara Mahatmyam


upanishad

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం - చరిత్ర

నైమిశారణ్య ప్రాశస్త్యము

ఆర్య నాగరికతకు పుట్టి నిల్లయిన మన భారత ఖండమునకు ఉత్తర భాగముననున్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిమాలయ పర్వత శ్రేణులలో అతి సుందరమైనట్టి, ఆహ్లాదకరమైనట్టి, పవిత్రమైనట్టి భూభాగమందు "నైమిశారణ్యము" అను పేరున ప్రసిద్ధమయిన అరణ్యము కలదు. ఆ ప్రశాంత వాతావరణమునందు ఋషులు తపస్సుచేసికొని సిద్ధి పొందుటకు ఎంచుకున్న స్థలమిది. ఆ నైమిశారణ్యములో ఋషి శ్రేష్టులు ఆశ్రమములు నిర్మించుకొని ప్రతి నిత్యము భారత, భాగవత, రామాయణాది పురాణ పఠనములు, వేద పారాయణలు, సకల శాస్త్ర, అష్టాదశపురాణాది శ్రవణకాల క్షేత్రములతో విరాజిల్లు ప్రదేశము నైమిశారణ్యము.

అటువంటి నైమిశారణ్యమందు వ్యాస మహాముని శిష్యులయిన సూతులవారు ఆశ్రమము నిర్మించుకొని తన శిష్యులగు శౌనకాది ముని పుంగవులకు, సుదూర ప్రాంతములనుండి వచ్చిన మునికుమారులకు, పురాణేతిహాస సకల ధర్మ శాస్త్రములు సోదాహరణముగ తెలిపి వారి సంశయములు నివృత్తి చేయించెడివారు.

ఒకనాడు సూతులవారు, శౌనకాది ముని శ్రేష్ఠులు దర్భాసనులై కుశల ప్రశ్నలతో గోష్ఠి జరుపుకొను సమయములో సూతులవారితో "మహానుభావా! ఈ కలియుగములో గాక 'కలౌ వేంకటేశాయ నమః' అను వేంకటేశ్వరుని జీవిత లీలలు మాకు కూలంకషముగా తెలియజేయ గలందులకు ప్రార్థించుచున్నాము. యీ మా కోర్కెను మన్నించి, ఆ చరిత్రను వివరింపుడని" మునిపుంగవులు కోరిరి.

సూత మహాముని వేంకటేశ్వర చరిత్ర వివరించుట

సూతముని మందహాసవదనుడై శౌనకాది మునుల అభీష్టము తీర్చనెంచి, తన గురువర్యులగు వ్యాసుల వారిని "గురుభ్యోనమః" అని మనస్సులో ధ్యానించి "శౌనకాది ముని పుంగవులారా! మీ కందరకు వేంకటేశ్వర మహాత్మ్యమును వివరించుటకు నాకును కడు కుతూహలముగానే యున్నది. ఆ చరిత్ర పరమ పవిత్ర మైనది. విన్నవారు మీరు, చెప్పినవాడను నేను మనమందరము ధన్యులము కాగలము. 'పవిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం, ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగే' అను భగవంతుని గీతోపదేశం ప్రకారం, అన్ని యుగాలలో ధర్మము క్షీణించి, అధర్మము, అక్రమము, హింస, ప్రబలినప్పుడు శ్రీమన్నారాయణుడు అప్పటి పరిస్థితి అనుగుణముగా అవతారమెత్తి దుష్ట శిక్షణ, భక్త రక్షణ జేసి లోకాన్ని శాంతియుతంగా వుంచుతున్నాడు. ఈ కలియుగంలో శ్రీ విష్ణుమూర్తి శ్రీనివాసునిగ అవతారమెత్తిన స్థలము భూలోకములన్నింటా అతి పవిత్రమైన స్థలము. ఈ పుణ్య భూమిని వృషభాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి అని పిలువబడుచున్నవి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములు పూర్తి అయిన తరువాత నాల్గవది కలియుగము. కలిపురుషుడు ప్రవేశముతో కశ్యపాది మునులు తమ దూరదృష్టితో భూలోక పరిస్థితిని చూచి, ఆందోళనపడ్డారు. ఎక్కడ చూచినా అశాంతి, ఆరాచకములు, కరువు కాటకములు తాండవిస్తున్నాయి. యుక్తాయుక్త విచక్షణాజ్ఞానము లేక ప్రజలు సంచరిస్తున్నారు. జనులు ముక్తి మార్గమును వెతుకుకొనలేక శ్లేష్మములో పడ్డ ఈగవలె సంసారబంధములనుండి బయటపడి ముక్తులు కాలేకపోతున్నారు. దీనికి తారుణోపాయంగా మహామునులంతా యాగము చేయ సంకల్పించారు.

నారదుడు బ్రహ్మను దర్శించుట

దివ్యదృష్టిగల నారదుడు కూడా భూలోక సంచారము చేస్తూ నరులు అవలంబించే అకృత్యాలకు బాధపడ్డాడు. వెంటనే సత్యలోకమునకు వెళ్ళి తండ్రియగు బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఉభయులు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత నారదుడు బ్రహ్మతో "తండ్రీ! శ్రీమన్నారాయణుడు కృష్ణావతారం చాలించిన తర్వాత తిరిగి భూలోకములో మరే అవతారము పొందలేదు. భూలోకమంతా పాపకార్యములతో, అశాంతితో నిండియున్నది. ఈ పరిస్థితిలో శ్రీమన్నారాయణుడు మరల అవతరించి శాంతిని నెలకొల్పే ఉపాయం తెలియజేయకోరుచున్నాను" అని బ్రహ్మను ప్రార్థించెను.

అంత బ్రహ్మ "నాయనా! నారదా! నీవు సర్వజ్ఞుడవు. జరగబోయే కార్యమంతా నీకు తెలుసు. అయినా కొద్ది కాలం ఓపికతోవుండు. త్వరలో విష్ణుమూర్తి భూలోకమున అవతరిస్తాడు" అని బ్రహ్మ నారదునికి నచ్చచెప్పి పంపించాడు.

లోక శాంతికై మునులు యజ్ఞము చేయుట

లోక కళ్యాణార్థము కశ్యప మహాముని నాయకత్వాన్న మునులంతా యజ్ఞము చేయ తలపెట్టినారు. విష్ణు స్వరూపమైన గంగానదీ తీరాన్ని యజ్ఞ స్థలముగా ఎంపిక చేశారు. యజ్ఞానికి కావలిసిన అన్ని ఏర్పాట్లు చేసి, ముహూర్తం నిర్ణయించి, యజ్ఞంలో పాల్గొనవలసినదిగా సకల మునిపుంగవులకు ఆహ్వానాలు పంపించేరు. వారితో పాటు నారదమహర్షిని కూడా ఆహ్వానించారు.

యజ్ఞము ప్రారంభ సమయానికి మునులతో పాటు త్రిలోక సంచారియగు నారద మహర్షి కూడా హరినామ సంకీర్తనతో యజ్ఞ స్థలానికి చేరుకున్నాడు. నారదుడు వచ్చినందున అంతా సంతోషించారు. బ్రహ్మపుత్రునికి యధోచిత సత్కారములు చేసి దర్భాసనంపై కూర్చుండబెట్టేరు. యజ్ఞము శాస్త్రోక్తముగా వేద ఘోషతో ప్రశాంత వాతావరణంలో చేస్తున్నారు. అట్టి సమయంలో నారదుడు కశ్యపాది మునిపుంగవులతో "మహా తపస్వులారా! లోక కళ్యాణార్థమై యీ క్రతువును మీరు చేస్తున్నారు. ఈ యజ్ఞ ప్రభావం వలన అరిష్టాలు తొలగి శాంతి ఏర్పడుతుంది. బాగానే ఉంది. కాని ఈ యజ్ఞ ఫలం ఎవరికి ధారపోస్తారు? సామాన్యుడు అర్హుడు కాడు గదా! నా అభిప్రాయం ప్రకారం దీనికి అర్హులయినవారు ఆ త్రిమూర్తులే. అందున శాంతము, సహనము, సత్య గుణముకల వారెవ్వరో వారికి ఈ యజ్ఞఫలము ధారపోయవలెను సుమా" అని హెచ్చరించేడు.

నారదుడు పలికిన పలుకులకు మునీశ్వరులంతా తెల్లబోయి ఆలోచనలో పడ్డారు. త్రిమూర్తులలో ఎవరు సాత్వికులు? ఎవరు కాడు? అని వాదోపవాదాలు లేవనెత్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వారు పొగుడుతున్నారు. ఇది తెగని సమస్యగా తయారైనది.

పరిస్థితిని నారదమహర్షి గమనించాడు. "ఓ ముని శ్రేష్ఠులారా! మీ వాదోపవాదాలు మానండి. సర్వము తెలిసిన మీకు యజ్ఞమును ఆపి తగవుని పెంచుట మంచిది కాడు. త్రిమూర్తులలో ఎవరు సత్వ గుణము కలవారో పరీక్ష చేయండి. సత్త్వ, రజస్, తమో గుణములలో ప్రధానమైనది సత్త్వ గుణమే. కాన, త్రిమూర్తులలో శాంతి గుణముగల వారెవ్వరో నిర్ధారించుటకు మహా తపస్వి, జ్ఞాని, మహిమాన్వితుడు యగు భృగు మహర్షి సమర్థుడు. గాన మనమంతా భృగునే ఎన్నుకుందాం" అని సూచన చేయగా అందరూ అంగీకరించారు. వారి మాట కాదనలేక భృగుడు ఆ కార్యము సాధించుటకు అంగీకరించాడు.

భృగుమహర్షి గొప్ప తపశ్శాలి; తేజోవంతుడు. అతని పాదమందు మూడవ నేత్రం ఉన్నందున మహాగర్విష్టియై యున్నాడు. ఆ మూడవ నేత్ర ప్రభావము వలన నా యంతటివాడు మరొకడు లేడనే అహంభావం కలవాడు.

కశ్యపాది మహర్షులు తలపెట్టిన ఆ మహాయజ్ఞమే వేంకటేశ్వరస్వామి అవతారమునకు, చరిత్రకు మూలకారణమైనది.

భృగు మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్ళుట

కార్యార్థియై బయలుదేరిన భృగుమహర్షి మొట్టమొదట సత్యలోకానికి వెళ్ళి చతుర్ముఖుడగు బ్రహ్మ నివాసానికి వెళ్ళేడు. ఆ సమయంలో బ్రహ్మ అష్టదిక్పాలురతో, మహా ఋషి పుంగవలుతో కొలువుదీరి, సృష్టి రహస్యములపై చర్చ సాగించు చున్నాడు. కొలువుదీరియున్నవారంతా దీక్షతో బ్రహ్మ వివరించే వివరణలను రెప్ప వాల్చక వింటున్నారు. భృగుడు లోనికి వచ్చి ఎవరికీ అభివాదన చేయకుండా ఆశనముపై ఆశీనుడయ్యాడు. బ్రహ్మ తన కార్యములో మునిగి ఉన్నాడు. బ్రహ్మ తనను పలకరించి, ఉచితాసనము చూపలేదనే కోపముతో "చతుర్ముఖా! సకల చరాచర సృష్టికి నీవు కర్తవనే అహంభావంతో కార్యార్థమై వచ్చిన నన్ను కన్నెత్తియైన చూడలేదు. నీకింత గర్వమా! లోకకళ్యాణార్థము మాబోటి వారము శ్రమపడి క్రతువులు చేయుచుండగా మమ్ము ఆశీర్వదించుటకు బదులు పలుకనైనా పలుకక గర్విష్ఠియై యున్నావు. గాన భూలోకమున నీకు పూజలుగాని, దేవాలయాలుగాని, లేకుండుగాక!" అని శపించి తను వచ్చిన కార్యము నెరవేరలేదనే కోపముతో సత్యలోకము విడిచి కైలాసానికి వెళ్ళేడు.

భృగుని ప్రవర్తనకు సరస్వతీదేవికి ఆశ్చర్యము కలిగి "స్వామీ! ఏమిటిది?" అని ఆతురతిగా అడిగింది. "దేవీ! తొందరపడకు. భృగువు చేయవలసినది చాలా ఉన్నది. చూస్తూ ఉండు" అని సరస్వతిని ఓదార్చాడు.

భృగు మహర్షి శివుని దర్శించుట

సత్యలోకంలో బ్రహ్మ వలన తన కార్యము నెరవేరలేదని రుసరుసలాడుతూ భృగుడు కైలాశానికి వెళ్ళేడు. శివుని పరీక్షించడానికి అక్కడ తన కార్యము నెరవేరును అనుకున్నాడు. ఆ సమయంలో కైలాశంలో శివుని నివాసమందు ప్రమథగణములు శివ నామ స్మరణతో తన్మయులై తాండవమాడు చున్నారు. పార్వతీ పరమేశ్వరుడు కేళీమందిరంలో ఏకాంతంగా సరసాలాడుచున్నారు. భృగుని రాక ఎవ్వరూ గమనించలేదు. ఎవరి తాండవ నృత్యము వారిదే. భృగుడు సరాసరి కేళీమందిరం లోనికి వెళ్ళబోయాడు. ద్వారా పాలకులు అడ్డుపడి లోనికి ప్రవేశించనీయలేదు. భృగుడు ఉగ్రుడై వారిని గద్దించి, అడ్డువచ్చిన వారిని త్రోసి, లోనికి ప్రవేశించాడు. ఆ సమయంలో శివపార్వతులు శృంగార క్రీడలో ఉండగా భృగుని చూచి పార్వతి సిగ్గుపడి ప్రక్కకు తొలగినది. శివునికి పట్టరాని కోపము వచ్చినది. "ఓయీ భృగువా తపశ్శాలివై యుండి కూడా ఇలాంటి స్థలమునకు రాకూడదని తెలియదా! నిన్ను క్షమించి విడుచుచున్నాను. లేకున్న నిన్ను భాస్మీపటలం చేసెడివాడనే!" అని ఉగ్రుడయ్యాడు శివుడు.

భృగుడు శివుని కోపాన్ని గ్రహించాడు. తనువచ్చిన కార్యాన్ని గ్రహించలేక తామస గుణముతో నన్ను దూషించినాడు. నేను వచ్చిన కార్యము శివుని వలన కూడా వ్యర్థమైనది. అని మనస్సులో అనుకున్నాడు. "శంకరా! నీకోసం శ్రమపడి వచ్చినందుకు దూషణలతో నన్ను పంపు చున్నావు. కానిమ్ము. ఇదిగో నా శాపము: 'భూలోక వాసులు నిన్ను లింగాకారముగానే పూజింతురుగాక' అని శపించి చరచరా వైకుంఠానికి వెళ్ళిపోయినాడు.

భృగు మహర్షి వైకుంఠములో శ్రీహరిని దర్శించుట

వైకుంఠము లక్ష్మీనారాయణుల నివాసము. సర్వ సంపదలకు, సర్వ సుఖాలకు నిలయము. పుణ్య ఫలము నొందిన జనులు అక్కడ లక్ష్మీ నారాయణులను కొలుస్తూ వుంటారు. గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులంతా అక్కడ నివసిస్తూ వుంటారు. ఎటు చూచినా బంగారపు భవంతులు, ఉద్యానవనాలు, ముక్కోటి దేవతలకు పుణ్య స్థలము. అటువంటి వైకుంఠానికి భృగు మహర్షి వచ్చి లక్ష్మీ నారాయణుల నివాసములో ప్రవేశించాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి భర్త పాదములొత్తుచు, సిగ్గుతో తలవంచుకొని యున్నది. లక్ష్మీదేవి చేయు సేవలకు లోలోన సంతసించుచున్నాడు నారాయణుడు.

భృగువు ఆ దృశ్యాన్ని చూచి, మనసులో లక్ష్మీనారాయణుల దర్శన భాగ్యమునకు తన్మయుడై నారాయణుని ధ్యానించి, నిలుచున్నాడు. మహర్షి రాకను లక్ష్మీనారాయణులు గమనించలేదు. భృగువు పట్టరాని ఆవేశంతో నారాయణుని దరిజేరి తన కాలితో విష్ణువక్షస్థలాన్ని తన్నగా లక్ష్మీ నారాయణులు ఉలిక్కిపడి లేచిరి. బ్రహ్మ వలన, శివుని వలన పరాభవింపబడిన భృగువు ఆ ఆవేశమును ఆపుకొనలేక లక్ష్మీదేవి నివాసమైన విష్ణు వక్షస్థలాన్ని తన్నుటచే లక్ష్మీదేవికి క్రోధము, భరించలేని అవమానము కలిగినవి. వెంటనే నారాయణుడు భృగుమహర్షికి నమస్కరించి, "స్వామీ, నన్ను తమ సుకుమార పాదములతో తన్నుటవలన మీ పాదమునకు ఎంత నొప్పి కలిగినదో కదా! ఆహా! ఏమి నా భాగ్యము, మీవంటి తపశ్శాలి పాదాస్పర్శ తగిలినందుకు నా జన్మ ధన్యత నొందినది, అంటూ భృగుని పాదము నెమ్మదిగా పట్టుకొని ఒత్తుచు అరికాలి యందున్న మూడవ నేత్రాన్ని చిదిపివేసెను. అప్పటివరకు భృగు మహర్షికి వున్న అహంకారము వదిలి, జ్ఞానోదయమైనది. శ్రీమన్నారాయణుడు మహర్షికి పాద పూజ చేసి, ఉచితాసనముపై కూర్చుండపెట్టి - "ఋషి పుంగవా! మీరు వచ్చిన కార్యమును గ్రహించినాను. మీ మనో భావము సిద్ధించుగాక" అని వినమ్రతతో చెప్పగా - "ఆహా! ఏమి శాంత స్వభావము; నా తొందరపాటుకు ఏ మాత్రము కినుక వహించక తిరిగి నాకే సపర్యలు చేయుటయా! నిజముగా సాత్త్విక గుణము కలవాడు శ్రీమన్నారాయణు డొక్కడే" అని మనసులో భావించి, "మహానుభావా! లోకకళ్యాణము కొరకు కశ్యపాది ముని శ్రేష్ఠులు యజ్ఞము చేయుచున్నారు. ఆ యజ్ఞఫలము మీరు దక్క మరొక రెవ్వరూ పొందుటకు అర్హులు కాదు. గాన ఆ యజ్ఞఫలము స్వీకరించ తమరు దయచేయుడు" అని ఆహ్వానించేడు భృగు మహర్షి. మీ యజ్ఞము పూర్తియగు సమయమునకు నేను తప్పక వచ్చి యజ్ఞఫలము స్వీకరింతునని విష్ణుమూర్తి చెప్పి భృగుని సాగనంపెను.

సంతోషముతో భృగు యజ్ఞస్థలానికి వచ్చి తాను త్రిమూర్తులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించిన తీరు, వారి గుణవిశేషములు తెలియజేసి, యాగ ఫలము ఒక్క విష్ణుమూర్తికే దక్కునని తన నిశ్చితాభిప్రాయము ముని పుంగవులకు విన్నవించెను. శాంత స్వభావుడగు విష్ణుమూర్తికి యాగఫలము ఇవ్వ నిశ్చయించినారు కశ్యపాది మునిశ్రేష్ఠులంతా.

శ్రీ హరిని వైకుంఠాన్ని వదలి లక్ష్మి భూలోకమునకు వచ్చుట

"వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే" అనగా లక్ష్మీ దేవి ఎల్లప్పుడు శ్రీమన్నారాయణుని గుండెపైనే తన నివాసం కలది. అటువంటి విష్ణువక్షస్థలాన్ని తన్నిన భృగునిపై పట్టరాని కోపముతో "నాథా! ఏమి మీ శాంతానికి కారణం? ఒక జఠధారి వచ్చి సృష్టి పాలకుడవు మిమ్ము తన్నుటయా? ఇదేమి చోద్యము? ఎంత అవమానము?" అని లక్ష్మీదేవి భోరుని ఏడ్వసాగెను. లక్ష్మీదేవి కండ్ల నీరు వట్టి విష్ణుమూర్తి "దేవీ! భృగువు సామాన్యుడు కాడు. మహా జ్ఞానవంతుడు. ఒక మహత్కార్యము సాధించ ఇటకు వచ్చినాడు. అతడు వచ్చిన పని ఫలించినది. నేనాటాని గర్వమణచి జ్ఞానోదయం కలిగించాను. ఇందులో తప్పేమున్నది?" అని ప్రశ్నించగా లక్ష్మీ దేవి తాటాలున లేచి "స్వామీ! మీరెన్ని ఉపమానములు చెప్పినను నా హృదయ బాధ మాన్పలేరు. ఒక జఠధారి వచ్చి అన్యోన్య ప్రేమికులపైన మన ఇద్దరి మధ్య గల సాన్నిహిత్యాన్ని అగాధం చేసి వెళ్ళినాడు. నన్ను మీ గుండెపై దాచుకున్న స్థలాన్ని అపవిత్రం చేయటంవల్ల నేనిక ఒక్క క్షణం కూడా వుండను. మీకూ నాకూ ఋణాను బంధం తీరిపోయినది" అని కోపముతో పలుకగా, శ్రీహరి ఎన్ని హిత వచనములు చెప్పిననూ వినక చేయి వదిలించుకొని శ్రీహరి పాదములకు నమస్కరించి భూలోకమునకు లక్ష్మీ దేవి వచ్చినది.

భర్తపై అలిగి భూలోకానికి చేరుకొన్న లక్ష్మీదేవి అరణ్యాలు, నదులు, పర్వతాలు, సెలయేర్లు దాటి పుణ్య గోదావరి తీరస్థమైన కొల్లాపురము చేరుకొని, ప్రశాంత ప్రదేశములో పర్ణశాల నిర్మించుకొని తపస్సులో నిమగ్నమైనది.

మహాలక్ష్మీ విష్ణుమందిరాన్ని, వైకుంఠాన్ని విడిచి వెళ్ళగా శ్రీహరి నివ్వెర పోయాడు. ఈ విధంగా జరుగునని ఏనాడూ ఊహించియుండ లేదు. కళకళలాడే వైకుంఠము కళావిహీనమైనది. మందిరంలో శ్రీహరి ఒక్కడై పోయాడు. వైకుంఠ వాసులంతా హతాశులయ్యారు. శ్రీహరి బాధ చెప్ప నలవి కాకున్నది. ఎటులైననూ మహాలక్ష్మిని వెదకి తెచ్చి నా వక్షస్థలముపై అధిరోహించాలని విష్ణుమూర్తికి పట్టుదల మిక్కటమయ్యెను. నా లక్ష్మీదేవి లేని యీ వైకుంఠము నాకేల? లక్ష్మి వల్ల భూలోక వాసులంతా లక్ష్మీ పుత్రులవుతారు. ధన మదాంధతతో గర్విష్టు లవుతారు. నా రమా దేవిని నేను తీసుకురావాలని శపథం పట్టి విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవిని వెదకుచూ భూలోకానికి బయలుదేరేడు. నదులు దాటాడు. సముద్రాలు దాటాడు. ఘోరారణ్యాలు తిరిగాడు. "లక్ష్మీ! నా లక్ష్మీ! ఎక్కడున్నావు లక్ష్మీ? సుకుమార లావణ్యమైన నీవు ఏ బండలపై ఏ ఎడారిలో వున్నావో" అని పిచ్చివాని వలె కేకలువేస్తూ తిరిగి తిరిగి నిద్రాహారాలు మాని కృశించి శేషాద్రి పర్వతానికి చేరుకున్నాడు నారాయణుడు.

ఆహా! కాల వైపరీత్యము! సర్వలోకాల పాలకుడైన శ్రీహరికి లక్ష్మీదేవి వల్ల ఎంతటి ధుర్దశ వచ్చినదో కదా!

శేషాద్రి పర్వతరాజు చరిత్ర

శేషాద్రి పర్వతాన్ని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలిచేవారు. దీనినే వేంకటాచలమని కూడా అనేవారు. ఈ పర్వతం మీదనే వరాహస్వామి ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ వున్నాడు.

ఒకనాడు ఆదిశేషునకు వాయుదేవునికి తమ తమ బలాల గురించి వాదోపవాదాలు వచ్చినవి. చిలికి చిలికి గాలివానవలె ఘర్షణ పెద్దదయింది. ఇద్దరూ నీ వెంత నీ బలమెంత యని భుజాలు చరచుకుంటుండగా ఆ సమయానికి త్రిలోకసంచారియగు నారద మహర్షి వచ్చి ఘర్షణలకు మూలకారణం తెలుసుకొన్నాడు. వీరి అహం తగ్గించాలని ఒక యుక్తి పన్ని, "ఓ బలాఢ్యులారా! మీరు ఇలా భుజాలు చరిచే కన్నా నేను పెట్టే పరీక్షలో పాల్గొనండి. ఎవరు విజయం పొందుతారో వారే మహా బలవంతులుగా పరిగణింపబడతారు. అది ఏమనగా- వింధ్య పర్వతములోని భాగమైన ఆనంద పర్వతాన్ని మీలో ఎవరు కదలించగలరో వారే మహా బలవంతులు. గాన మీరు ఉద్యుక్తులై పోయి ఆనంద పర్వతాన్ని కదలించండి" అని సలహా యిచ్చాడు. వాయువు శేషుడూ బుసలు కొట్టుకుంటూ ఆనంద పర్వతానికి బయలు దేరారు.

శేషుడు ఆ పర్వతాన్ని గట్టిగా బిగించి చుట్టుకున్నాడు. వాయువు తన శక్తితో పెనుగాలులు వదలి పర్వతాన్ని కదపబోతున్నాడు. శేషుడు ఇంకా గట్టిగా బిగించి, పర్వతాన్ని కదపబోయాడు. ఇద్దరి ప్రయత్నాలు భగ్న మయ్యేయి. ఈ విధంగా ఒకరిని మించి, మరొకరు తమ బాలాలను ఉపయోగిస్తున్నారు. శేషుడు బుస కొడుతున్నాడు. వాయువు భయంకరంగా విజృంభించగానే పర్వతము పైనున్న ప్రాణికోటి మూర్ఛ పోయి కొన ప్రాణంతో గిలగిల కొట్టుకుంటున్నాయి. ఈ ఘోరమైన పట్టుదలలను మాన్పించనెంచి దేవేంద్రుని నాయకత్వాన్న దేవతలు ఆనంద పర్వతం వద్దకు వచ్చి "ఓ మహా బలాఢ్యులారా! మీ పట్టుదలవలన సర్వ ప్రాణికోటి నాశనమయ్యే స్థితి వచ్చింది. వాయువు ప్రచండంగా వీస్తున్నందున సముద్రాలు పొంగిపోతున్నాయి. శేషుని పట్టువలన భూకంపాలు వస్తున్నాయి. గాన, జీవకోటి మనుగడకైనా మీ పట్టుదలలు వదలుకోండి" అని వేడుకున్నారు. జీవరాశులపై ప్రేమకొలదీ శేషుడు తన పట్టును సడలించాడు. వెంటనే వాయువు కూడా తన పట్టుదలను తగ్గించాడు. ఉభయులను శాంతింపజేసినారు. వేయి పడగల శేషుడు తన శరీరాన్ని పెంచి, ఆనంద పర్వతాన్ని చుట్టినందున, ఆ పర్వతాన్ని "శేషాచల" మని నామకరణ చేసారు. వాయువు కూడా తన బలాన్ని విజృంబింపజేసినందున ప్రక్కనున్న గిరిని "అంజనాద్రి" యని పిలవసాగిరి.

శేషుడు శ్రీహరిని స్మరించుకుంటూ పర్వతరూపముగా మారిపోయినాడు. శేషాద్రి అనబడే ఆ పర్వతము యొక్క ఫణి ప్రదేశమే వేంకటాద్రి. మధ్య భాగమే అహోబిలము. బ్రహ్మ శేషునకు చెప్పిన ప్రకారము వరాహస్వామి శేషాద్రిపైకి వచ్చి ఆశ్రమం నిర్మించుకొన్నాడు.

బ్రహ్మ ఈశ్వరుడు ఆవు దూడగా మారుట

శ్రీమన్నారాయణుడు తిరిగి తిరిగి అలసిపోయినాడు. శరీరములోని శక్తి ఉడిగినది. ఇక ఎంత మాత్రము ప్రయాణము సాగించలేని స్థితిలో వుండగా శేషాద్రి చేరుకుని అక్కడొక చింత చెట్టు క్రింద చతికలబడ్డాడు. ఎక్కడి వైకుంఠము? ఎక్కడి శేషాచలము? శ్రీహరి దీర్ఘంగా ఆలోచించి, విశ్రాంతి ఎక్కడ తీసుకోవలెనాయని ఆలోచించి కడకు దగ్గరగా ఒక వల్మీకము కనబడగా ఎవరికీ కనబడకుండా ఉండ వచ్చునని ఆ పుట్టలో ప్రవేశించాడు. అదే అతనికి వైకుంఠము. తిండి లేక రోజులు గడిచిపోతున్నాయి. నారదుడు దివ్య దృష్టితో నారాయణుని అవస్థను అర్థము చేసుకొని సత్యలోకమున బ్రహ్మను, కైలాసమున శివుణ్ణి కలసి విషయమంతా విన్నపించగా, శ్రీహరి ఆకలి బాపుటకు బ్రహ్మ ఆవు రూపమును, ఈశ్వరుడు దూడ రూపము దాల్చి శ్రీహరి ఆకలి దీర్చ నెంచిరి. శ్రీలక్ష్మీ దేవి భూలోకములో కొల్లాపురమందు తపస్సు చేసుకొనుట విని లక్ష్మీ దేవిని దర్శించిరి. శ్రీహరి అవస్థ చెప్పగా లక్ష్మి కంట తడి బెట్టినది. "అమ్మా! జరిగినదానికి విచారిస్తూ ఉండేకన్నా దానికి తరుణోపాయము ఆలోచించాలి. అందుకు మాకు తోచిన సలహా ఏమనగా- మేమిద్దరము ఆవు దూడగా మారగలము. నీవు గొల్ల కన్యగా మారి మమ్ములను తోలుకు పోయి, చోళ రాజుకు అమ్మిన, మేము మేతకై వెళ్ళినపుడు శ్రీహరి ఆకలి తీర్చుటకు పాలు ఇవ్వగలము గాన మా కోరిక మన్నించి నీవు గొల్లభామ రూపము దాల్చవమ్మా" అని అన్నారు. నాధుని ఆకలి తీర్చుటకు ఇది చక్కని ఆలోచనయని సంతసించి గొల్లభామగా మారగా, బ్రహ్మ ఆవుగను, ఈశ్వరుడు లేగదూడగా మారిరి. వాటినిదోలుకొని చోళరాజ కడకు లక్ష్మి వెళ్ళగా వాటి అందము, పుష్టి, సాదుత్వము చూచి, రాజుగారి పట్టపు దేవి భర్తతో ఆ ఆవుదూడను ఎటులైన కొనవలెనని వేడుకొనగా, రాజు కూడా సంతోషించి బేరమాడి వాటిని గ్రహించినాడు.

చోళరాజుకు అంతకు క్రితమే పెద్ద ఆవులమంద ఉన్నది. పశుల కపర్లూ ఉన్నారు. ఆ మందలో ఈ ఆవు దూడను కలిపినారు. ప్రతి దినము అడవికి తోలుకొని పోయి, తిరిగి సాయంకాలము ఇంటికి తీసుకొనివచ్చుట పశుల కాపరుల పని. ఇటుల ప్రతి దినమూ జరుగుచునే యున్నది. కాని గోవు కడుపునిండా మేసి సాయంత్రము ఇంటి ముఖం పట్టేముందు శ్రీహరి విశ్రమించుచున్న పుట్టపై కెక్కి, తన పొదుగులోని పాలను పుట్ట రంధ్రము గుండా శ్రీహరి నోట పడులాగున చేయుచున్నది. ఇటుల రోజులు గడుస్తున్నవి. సాయంత్రము ఆవుపాలు పితుకగా పాలు రావటంలేదు. ఈ సంగతి రాణి రాజుతో విన్నవించినది. రాజుకు పశుల కాపరిపై కోపము అనుమానము కలిగి "ఓరీ! నా ఆవుపాలను పితికి త్రాగుచున్నావా? కొన్న ముహూర్త మెలాంటిదోగాని ఒక్క రోజుకూడా ఆవుపాలను కంటితో చూడలేదే" అని గద్ది౦చినాడు.

పశుల కాపరికి కూడా అనుమానము కలిగినది. ఇదేదో మాయగా ఉన్నది, దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి అని మనసు నందాలోచించి, యధా ప్రకారం ఆవులను మేతకు తోలుకు పోయినాడు. ఈ ఆవు దూడ మేతమేసి మందలో నుండి విడిపోయి పుట్ట వద్దకు వచ్చి పుట్టలోనికి తన చిక్కటి పాలను శ్రీహరి నోట పడునట్లు చేసినది. ఆ దృశ్యము చూచి, పశుల కాపరికి పట్టరాని కోపము వచ్చి "దీనివలన గదా నాకు అపవాదు వచ్చినది. ఇది ఇలాగ పుట్టలోనికి విడిచి పాలను వృధా చేయుచున్నది. దీనికి తగిన ప్రాయశ్చితము చెయ్యాలి" అని తన చేతిలోని గొడ్డలితో ఆవును కొట్టబోయినాడు. తనకుపకారము చేయు గోమాతను కొట్టును గదా అని శ్రీహరి తలంచి పుట్టనుండి బైటకు తల ఎత్తి గోవుకు అడ్డం రాగా పశుల కాపరి దెబ్బ శ్రీహరి తలకు బలముగా తగిలినది. రక్తము ధారగా బొటబొట కారిపోవుచున్నది. ఆ రక్త ధారను చూచి పశుల కాపరి కళ్ళు తిరిగి మూర్ఛపోయాడు. ఆ గోవు అంబాయని గోలపెట్టి శేషాచల పర్వతము దిగి చోళరాజు గృహమునకు వచ్చినది. దాని కన్నుల వెంట ధారగా కారుతున్న కన్నీటిని చూచి రాజు ఆశ్చర్యపోయి మరొక పశుల కాపరిని పిలిచి ఎందుకిలా కన్నీరు కార్చుచున్నదో దీని వెంట వెళ్ళి విషయము తెలిసు కొనమని అతనిని పంపినాడు. పశువుల కాపరి వెళ్ళి చూడగా అచట వాల్మీకము రక్తసిక్తమై యున్నది. తోటి పశుల కాపరి మూర్ఛపడి వున్నాడు. వచ్చిన వానికి కూడా ఆశ్చర్యము కలిగి పరుగు పరుగున వచ్చి తాను చూచిన దృశ్యాలను రాజునకు విన్నవించాడు. రాజు ఆశ్చర్యపడి తాను కూడా కళ్ళారా చూడవలెనని గొల్ల వానితో శేషాచల పర్వతము పైకెళ్ళి చూడగా పుట్టనుండి శ్రీహరి బైటకు వచ్చి "ఓరీ! మదాంధా! నన్ను నీ గోపాలునితో కొట్టించితివా! ఎంత పొగరుతో ఉన్నావు! నీకు బదులు నీ అనుచరునితో నా తల పగల గొట్టినది చాలక నన్ను వెక్కిరించుటకై చూడ వచ్చితివా! ఇదిగో నిన్ను శపించుచున్నాను. రాక్షస జన్మ ఎత్తెదవు గాక!" అని శపించగా రాజు వణకుచూ ప్రభూ అని శ్రీహరి పాదాలపై ఒరిగి పోయి "స్వామీ! నాకు నీ సంగతి తెలియదు. నేనే పాపము ఎరుగను. స్వామీ! నన్నెందుకు రాక్షస జన్మ కలుగునట్లు శపించారు? నాకీ రాక్షస రూపము ఎటుల పోవును? మీరీ పుట్టలో నుండుటకు కారణమేమి?" అని అతి దీనంగా ప్రార్థించినాడు.

భగవానుడు కరుణా మయుడు

"రాజా! నేనన్న మాటకు తిరుగులేదు. అటుల జరిగి తీరవలెను. కాని, నీ శాప విమోచనము ఎప్పుడు కలుగుననగా త్వరలో ఆకాశ రాజు కుమార్తెయగు పద్మావతీ దేవితో నాకు వివాహమగును. ఆ వివాహ వేడుక నీవు చూచిన తక్షణం రాక్షస రూపం వదలి నిజరూపము దాల్చుదువు. అంతవరకు నీవు రాక్షస రూపముతోనే యుందువు" అని శ్రీహరి దీవించెను. "చిత్తము ప్రభూ!" అని స్వామికి నమస్కరించి రాక్షస రూపాముతో చోళరాజు వెడలిపోయెను. అనంతరము అచ్యుతుడు స్పృహ కోల్పోయి వున్న ఆ గొల్ల వానికి తెలివి వచ్చినట్లు చేసి, ఆవుల మందతో పంపించెను.

శ్రీహరి శ్వేతవరాహావతారము

ఒకప్పుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుని నివాసమందు జయవిజయులనే యిద్దరు భక్తులుండేవారు. వారెల్లప్పుడు హరి నామ స్మరణముతో స్వామి వారి ద్వారము వద్దనే ఉండేవారు. శ్రీహరి ఆజ్ఞ లేనిదే ఎవ్వరినీ లోనికి పంపించే వారు కాదు. ఇలా ఉండగా ఒకనాడు కొంతమంది మునులు శ్రీహరి దర్శనార్థము భవంతికి వచ్చి లోనికి వెళ్ళబోవుచుండగా జయవిజయులు వారిని అడ్డగించి ప్రవేశించుటకు అనుమతి ఇవ్వలేదు. మునులు వారికి నచ్చచెప్పినను వారు వినకుండిరి. మునులకు కోపము వచ్చినది. వారిపై తీవ్రముగా చూచి, "ఓరీ మదాంధులారా! శ్రీహరిని దర్శించి మా విన్నపములు తెలుపవచ్చిన మమ్ములనే అడ్డగించెదరా! చూడుడు, మిమ్ములను ఈ క్షణమందే రాక్షస జన్మలెత్తవలెనని శపించెదము" అని శపించిరి. వారే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వారు శాపవిమోచనకై పరిపరి విధాల ప్రాధేయపడగా, "మీరు మూడు జన్మలెత్తి శ్రీమన్నారాయణుని చేత వధింపబడిన తర్వాత మరల మామూలు స్థానములు పొంది శ్రీహరిని కొలవగలరు" అని దీవించిరి.

హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడై ఘోరాతి ఘోరమగు దుష్కార్యములు చేసెడివాడు. ముల్లోకములకు తానే అధిపతిగా దలచి భూమండలాన్ని చాపగా చుట్టి సముద్రములో ముంచి వేయ సాహసించెను. బ్రహ్మాది దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్ధించి ఈ విపత్తు నుండి రక్షించమని వేడుకొనిరి. శ్రీహరి వారికి అభయ మిచ్చి తాను శ్వేత వరాహ రూపము దాల్చి సముద్రములో మునిగిపోతున్న భూమాతను పైకి దీసి హిరణ్యాక్షుని సంహరించి ముల్లోకాలను శాంతింపజేశాడు.

శ్వేతవరాహావతారము చాలించి వైకుంఠానికి రాకుండా భూలోకమందే స్థిర నివాసుడవై యుండమని దేవతలు ప్రార్ధించిరి. వరాహస్వామి వారి కోరికను మన్నించి భూలోకమందుండుటకు శేషాచలమును ఎన్నుకొని అక్కడ ఆశ్రమము నిర్మించి వకుళాదేవి, మహాభక్తులతో కూడి తపస్సుచేసుకుంటున్నాడు.

శ్రీహరి తలకు తగిలిన గాయమును మాన్పుటకు వనమూలికలను వెదుక బయలుదేరినాడు. కొంతదూరము పోవుసరికి ఒక ఆశ్రమము కనిపించినది. ఆశ్రమము చేరి బైటనుండి "అమ్మా!" అని పిలిచాడు. ఆ సమయములో శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తూ కృష్ణనామ సంకీర్తనలు చేయుచున్న మహా భక్తురాలు వకుళాదేవి బయటకు వచ్చి చూసేసరికి శ్రీహరి కృష్ణ రూపముతో మురళి వాయిస్తున్నట్లు కనిపించెను.

వకుళాదేవికి ద్వాపర యుగములోని స్మృతులు జ్ఞాపకము వచ్చినవి. "నాయనా గోపాలకృష్ణా! వచ్చావా తండ్రీ! ఎంతకాలానికి వచ్చావు. నన్ను తరింప జేశావు నాయనా. అయ్యో, ఏమిటీ గాయము? రక్తము కారి గడ్డకట్టుచున్నదే. ఎలా తగిలింది? లేక ఎవరు కొట్టినారు?" అని కంగారుపడి తన చీర కొంగు చింపి గాయాన్ని తుడిచి, పసరుతో కట్టు కట్టినది.

వకుళాదేవి వృత్తాంతము

వకుళాదేవి గొప్ప వైష్ణవ భక్తురాలు. పూర్వజన్మలో ఆమె యశోదాదేవి జన్మలో గుమారుడైన కృష్ణుని పైనున్న ప్రేమాభిమానాలు ఈ జన్మలో కూడా పోలేదు. సర్వ వేళలా గోపాలకృష్ణునే ధ్యానిస్తూ, కృష్ణ ప్రసాదమునే ఆరగిస్తూ, కొండపైనున్న వరాహస్వామిని సేవిస్తూ తన శేష జీవితాన్ని గడుపుచున్నది.

శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు కుమారుడేగాని కంసుని భయంచేత వసుదేవుడు వ్రేపల్లెకు వెళ్ళి కృష్ణుని యశోద ప్రక్కన పెట్టి వచ్చినాడు. అప్పటినుండి కృష్ణుని ఆలనాపాలనా, ముద్దు ముచ్చట్లు అన్నీ యశోదా దేవియే చూసేది. కృష్ణుడు చిన్న తనం నుండి చేయని అల్లరిపనులంట్లూలేవు. వాటన్నింటిని యశోద సహించేది. పెరిగి పెద్దవాడయిన తరువాత ఎనమండుగురిని వివాహం చేసుకొన్నాడు. కాని కృష్ణునకు జరిగిన ఒక్క వివాహం కూడా యశోద చూడలేకపోయింది. ఆ ఒక్క కోరిక ఆమెకు మిగిలిపోయింది. ఒకసారి యశోదాదేవి కృష్ణునితో తన కోరిక చెప్పగా, "అమ్మా! నా లీలలన్నీ పూర్తయిపోయినవి. నీకోరిక తీర్చడానికి ఇది సమయం కాదు. అందుకు రాబోయే కలియుగంలో నా కళ్యాణ వేడుక చూచుటకు అవకాశము కలుగుతుంది. అప్పుడు నన్ను ఆశీర్వదించు తల్లీ" అని ఆమెకు మాట ఇచ్చాడు. మరు జన్మలో యశోద వకుళగా పిలవబడుచు వరాహస్వామి ఆశ్రమంలో ఉంటున్నది.

ఆనాటి వాగ్దానము ప్రకారం శ్రీహరి వకుళాదేవి వద్దకు వచ్చి "అమ్మా!" అని నోరారా పిలిచాడు. ఆ పిలుపు తన కుమారుడగు కృష్ణుడే వచ్చి పిలిచినట్లు భావించింది. వకుళాదేవి, ఆహా! వకుళ ఎంత ఎంతటి అదృష్టవంతురాలు! ఏమి పూర్వజన్మ సుకృతము !

వెంటనే వకుళాదేవి కొండపై తపస్సు చేసుకొనుచున్న వరాహస్వామి దగ్గరకు శ్రీహరిని తోడ్కొనిపోయినది. వచ్చినవారి చప్పుడు విని కండ్లు తెరచి, "ఎవరీ నూతన వ్యక్తి? ఎందుకొచ్చాడు?" అని దీక్షగా చూడగా, శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మాలు ధరించి వరాహస్వామికి దర్శన మిచ్చాడు. వరాహస్వామి ఆశ్చర్యమొంది "హరీ! ఇలా వచ్చావేమి? లక్ష్మీ దేవి ఏది? నీ ముఖములో విచారము కన్పించు చున్నది. ఏ దానవుడైనా భూలోకాన్ని అల్లకల్లోలం చేయుచున్నాడా? అందుకు నా సహాయమేదైనా కావలయునా?" అని ఆతృతగా ప్రశ్నించగా

"వరాహా! ప్రస్తుతం నా చరిత్ర ఏమని చెప్పుదును ! నేను వైకుంఠంలోనే ఉంటున్నాను. లక్ష్మి నా హృదయ పీఠమందే నివసిస్తూ ఉంది. ఒకనాడు భృగు మహర్షి వచ్చి తనకున్న సహజ అహంకారంతో తన కాలితో నా హృదయాన్ని తన్నినాడు. అందుకు లక్ష్మీ దేవికి కోపం వచ్చి, నన్ను వీడి ఈ భూలోకమందున్న కొల్లాపురము చేరుకున్నది. వైకుంఠము విడిచి వెళ్ళవద్దని లక్ష్మిని ఎంత బ్రతిమాలిననూ వినిపించుకొనలేదు.

లక్ష్మీ దేవి లేని వైకుంఠము కళావిహీనమై పోయింది. లక్ష్మిని వెదుక్కుంటూ ఈ ప్రాంతమునకు వచ్చి ఒక వల్మీకమునందు నివసిస్తుండ ఒక గోవు ప్రతి నిత్యము వచ్చి నా ఆకలి తీర్చుటకు తన పాలను నా నోట విడిచేది. ఇలా కొన్ని రోజులు జరుగుతుండగా ఒకనాడు పశులకాపరి ఆ దృశ్యమును చూచి ఆవును తన చేతి గొడ్డలితో కొట్ట బోవుచుండగా నేను అడ్డు పడుట చేత ఆ దెబ్బ నాకు తగులుట చేత రక్తము కారినందున, గాయము మానుటకు వన మూలికలను వెదుక్కుంటూ వకుళాదేవి ఆశ్రమమునకు వచ్చాను. వెంటనే వకుళాదేవి నన్నిక్కడకు తోడ్కొని వచ్చిన" దని శ్రీహరి చరిత్రనంతా వివరించాడు.

అంత వరాహస్వామి "శ్రీహరీ! విచారింపకుము. నేటి నుండి నా ఆశ్రమము నందే నివసింపుము. ఈ వకుళాదేవి నీకు ఉపచర్యలు చేయగలదు. వకుళా! ఈయనెవరో నీకు తెలుసా? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగంలో నీవు యశోదాదేవివి, ఈతడు కృష్ణ నామముతో నీ యింట నీ కుమారునిగా పెరిగినాడు. ఈ జన్మలో కూడా నీ బిడ్డగానే యుండగలడు. నీవీతనికి ఉపచర్యలు చేస్తూ వుండు" అని అజ్ఞాపించాడు.

వరాహస్వామి వద్ద ఇద్దరూ సెలవుతీసుకొని వకుళా శ్రమమునకు వచ్చారు. అప్పటినుండి శ్రీహరి శ్రీనివాసుడనే పేరుతో వ్యవహరిస్తూ వకుళాదేవి సేవలతో తృప్తి జెందు౦డెను. వకుళాదేవి శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో సేవించినందుననే శ్రీనివాసుని విగ్రహము మెడలో బొగడ పూల దండయై నేటికిని అలంకరించియున్నది. ఆమె ధన్య జీవి! పుణ్యవంతురాలుగనుకనే శ్రీహరిని చేరుకోగలిగింది.

ఆకాశరాజు చరిత్ర

సుధర్ముడను చంద్రవంశపు రాజు చోళరాజ్యాన్ని పాలించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద కుమారుని పేరు ఆకాశరాజు. రెండవ కుమారుని పేరు తొండమానుడు. కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యము పై బడినందున పెద్దకుమారుడగు ఆకాశరాజుకు పట్టాభిషేకముచేసి రాజ్యపాలన అప్పగించాడు. రెండవ కుమారుడగు తొ౦డమానునికి మంత్రి పడవినిచ్చి తాను పరిపాలన చేసినట్లుగా న్యాయం, ధర్మం, కరుణ ఇత్యాది సద్గుణాలతో ప్రజలను కన్న బిడ్డలవలె చూడవలెనని ఆజ్ఞాపించి తాను తపస్సుకు పోయి కొంతకాలానికి తనువు చాలించాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం అన్నదమ్ములిద్దరూ తమ బాధ్యతలను విస్మరించకుండా న్యాయసమ్మతముగా పరిపాలిస్తూ ప్రజల మన్నన పొందుచు౦డిరి.

ఆకాశరాజు భార్య ధరణీదేవి. ఆ దంపతులకు వివాహమయి యేండ్లు గడచిననూ సంతానము కలుగలేదు. అందుకు ఆ దంపతులిద్దరూ విచారగ్రస్తు లయిఋ. ఒకనాడు వారి వంశగురువర్యులగు శుకమహర్షిని పిలిపించి వారికి సంతానము కలిగే ఉపాయము చెప్పుడని వేడుకొనిరి. దూరదృష్టి గల శుకమహర్షి "రాజా! పుత్రసంతానము కొరకు దశరథమహారాజు పుత్రకామేష్ఠి అనే యజ్ఞం చేసి పుత్ర సంతానం పొందాడు. నీవును అటులనే పుత్రకామేష్ఠి చేయి" అని సెలవిచ్చాడు.

గురువర్యులు చెప్పిన ప్రకారం ఒక శుభముహూర్తమున యజ్ఞము తలపెట్టిరి. శాస్త్రోక్తముగా పండితుల సమక్షమున యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత ఆకాశరాజు బంగారు నాగలితో భూమి దున్న సాగెను. ఆ నాగలి కొయ్యకు ఏదో తగిలి నాగలి ముందుకు సాగడం లేదు. రాజు ఆశ్చర్యమొంది నాగలి ప్రక్కకు తీసి త్రవ్వి చూడగా ఒక పెట్టి కనిపించినది. దానిని పైకి తీసి తెరసిచూడగా వెయ్యిరేకుల తామర పువ్వు మధ్య ఒక బాలిక చిరునవ్వు నవ్వుతూ ఆడుకొను చుండెను. అంతలో "రాజా! నీవు ధన్యుడవు. ఈ బిడ్డ దొరుకుట నీ పూర్వ జన్మ సుకృతము. బిడ్డను తీసుకొని పునీతుడవు కమ్ము" అని ఆకాశవాణి పలికినది. "ఆహా! ఏమి భాగ్యము! ధన్యుడను. సూర్య చంద్రుల బోలు ముఖవర్చస్సుతో ప్రకాశించు యీ బిడ్డ నాకు లభించుట నా పూర్వ జన్మ సుకృతము" అని పరమ సంతోషముతో ఆ శిశువుని తన మందిరానికి తీసుకొని వెళ్ళి భార్య ధరణీదేవి ఒడిలో వేసి జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. అమిత ఆనందముతో ధరణీదేవి ఉప్పొంగి పోయింది. భర్త పాదములకు మ్రొక్కి బిడ్డను తన ప్రాణము కన్న మిన్నగా చూచుకుంటూ సద్బ్రాహ్మణులను రప్పించి, గోదానములు, భూదానములు ఘనంగా చేసి నామకరణ మహోత్సమునకు ముహూర్తము నిశ్చయించమని కోరినది. పండితులు రాశి చక్రము వేసి వెయ్యి రేకుల పద్మ౦లో లభించినది గాన పద్మావతియని నామకరణము చేసిరి. లక్ష్మీదేవియే తమ యింట వెలసినట్లుగా రాజదంపతులు భావించి అల్లారుముద్దుగా పెంచుచుండిరి.

పద్మావతి దినదిన ప్రవర్ధమానమగుచు, పెరగసాగినది. పండితుల వద్ద సకల శాస్త్రములు అభ్యసించి, సుగుణాలరాశిగా అలరారుచున్నది. మరికొంత కాలమునకు ఆకాశరాజు, ధరణీదేవికి ఒక కుమారుడు జన్మించెను. ఆ బాలుని పేరు సుధాముడు. పద్మావతీ సుధాములు పెరిగి పెద్దవారయ్యారు. వసుధామునికి ఉపనయనము చేసారు. పద్మావతికి పెండ్లి వయసు వచ్చినందున వివాహము చేయ నిశ్చయించుకున్నారు.

పద్మావతి యొక్క పూర్వ జన్మ వృత్తాంతము

పద్మావతి త్రేతాయుగంలో వేదవతియను పేర తపస్సు చేసుకొనుచు౦డేది. ఆమె గంధర్వ స్త్రీలను, దేవతా స్త్రీలను సహితం మరిపించేటంత అందమైనది. రావణాసురుడు ఆమె అందానికి మోహితుడై తనను వివాహమాడమని కోరినాడు. శ్రీరాముని తప్ప మరెవ్వరినీ వివాహమాడనని నిష్కర్షగా చెప్పినది. నాలాంటి మహా బలవంతునే వివాహమాడవా అని రావణుడు కోపగించి, ఆమెను బలాత్కరించి సిద్ధమవగా "కామాంధా! నీవు స్త్రీ వ్యామోహమువలననే చనిపోదువుగాక" అని శపించి అగ్నిలో పడిపోయినది. ఆమెను అగ్నిహోత్రుడు రక్షించినాడు. ఆమెయే మాయా సీత.

కైక కోరికపై శ్రీ రామచంద్రుడు, సీతా లక్ష్మణులను వెంటబెట్టుకొని పదునాలుగే౦డ్లు అరణ్యవాసము చేయడానికి బయలుదేరి అరణ్యమున ఒక చోట ఆశ్రమం నిర్మించుకొని కాలం గడుపుచున్నారు. రావణుడు తన చెల్లెలు శూర్పణక వల్ల సీతాదేవి అందాన్ని గ్రహించి, సీతను ఎటులైన తీసుకు రావాలని బయలుదేరి మారీచుడనే రాక్షసుని బంగారు లేడిగా మార్చి ఆశ్రమ సమీపమున తిరుగాడు చుండగా దాని అందాన్ని చూచి సీత దానిని పట్టి తెమ్మని భర్తను కోరెను. శ్రీరాముడు దానిని పట్టుకొన బోవ అది చెంగు చెంగను దూకుచు కొంతదూరము తీసుకుపోయెను. రాముడు విల్లునెత్తి బాణము సంధించి ఆ బంగారు లేడిని కొట్టెను. ఆ మాయలేడి "లక్ష్మణా!" అని శ్రీరాముని పిలుపువలె కేకవేసి చనిపోయెను. ఆ శబ్దము వినిన సీత కంగారు పడి లక్ష్మణుని పంపా బోవ, లక్ష్మణుడు "రామచంద్రునికి ఏ భయమూ లేదమ్మా" అని నచ్చజెప్పగా సీత పరుషముగా మాట్లాడినందున లక్ష్మణుడు అన్నను వెదకుచు ఆశ్రమము విడచి వెళ్ళాడు. అదనుకనిపెట్టి రావణుడు సీతను ఎత్తుకు పోతుండగా అడ్డము వచ్చిన జఠాయువు అనే పక్షిని చంపి లంకాపురము చేరి సీతను అశోకవనములో వుంచాడు.

అన్నదమ్ములిద్దరూ కంగారుపడి అనుమానంతో ఆశ్రమానికి వచ్చారు. సీత జాడలేదు. "సీతా! సీతా!" అని బిగ్గరగా పిలిచారు. ప్రత్యుత్తరం లేదు. వారు ఎంతో దుఃఖి౦చారు. ఏదో రాక్షస మాయ జరిగిందని ఊహించారు. అడవి అంతా వెదక బయలుదేరారు. కొంతదూరం వెళ్ళేసరికి రావణునితో పోరాడి రెక్కలు తెగిన జఠాయువు కనిపించింది. "రామా వచ్చావా! నీ కోసం బ్రతికి ఉన్నాను. సీతా దేవిని రావణుడు తన పుష్పక విమానం మీద లంకాపురానికి తీసుకుపోతున్నాడు. నేను అడ్డగించి పోరాడేను. సీతను విడిపించాలని కాని, ఆ పోరులో నా రెక్కలు తెగి తీవ్ర గాయాలతో ఇక్కడ పడివున్నాను. యీ సంగతి నీకు చెప్పాలని బ్రతికి వున్నాను. అని చెప్పి చనిపోయింది. జఠాయువు వల్ల విషయం గ్రహించి దానికి అగ్ని సంస్కారము చేసి ముందుకు సాగారు రామలక్ష్మణులు.

జఠాయువు వలన సీత జాడ కొంత తెలుసుకొన్న తరువాత పర్వతముపై సుగ్రీవునితో స్నేహము చేసి, అతని అన్న వాలిని చంపి, సుగ్రీవునికి పట్టాభిషేకము చేసి, మహాబలశాలి హనుమంతుడు మొదలగు వానరవీరుల సహాయంతో సముద్రముపై వారధి కట్టినారు. రామ లక్ష్మణులు వానర సైన్యంతో వారధి దాటి లంకలో ప్రవేశించి, రావణ, కుంభకర్ణాది దానవులను హతమార్చి , రావణుని తమ్ముడైన విభీషణుని లంకా పట్టణానికి రాజుగా చేసి లంకలో ధర్మపాలన స్థాపించినారు. తన కోసం ఎన్నో కష్టాలు సహించి తననే ధ్యానిస్తూ అశోకవనమందున్న సీతను తీసుకొని అయోధ్యకు బయలుదేరేముందు సీతాదేవి లంకలో కొంత కాలం ఉన్నందున ఆమెను శంకించి అగ్ని పరీక్షతో ఆమె శీలాన్ని పరీక్షింప నెంచి అగ్ని గుండములో దూకమని ఆజ్ఞాపించాడు శ్రీరాముడు.

మహా పతివ్రత యగు సీతాదేవి భర్త కోరినట్లుగా అగ్ని ప్రవేశము జేసినది. ఆ అగ్ని నుండి అగ్ని హోత్రుడు ఇద్దరు సీతలను తీసుకువచ్చి శ్రీరామునికి చూపించాడు. ఈ ఇద్దరిలో అసలు సీత ఎవరు గుర్తుపట్టమన్నాడు. శ్రీరాముడు తన సీతను గుర్తుపట్టి స్వీకరించాడు. రెండవ మాయ సీతయే వేదవతి.

లంకలో రావణుని చెరయందున్న సీత మాయ సీత యని, తన వద్దనున్న సీతయే నీ సాధ్వియని అగ్నిహోత్రుడు చెప్పినాడు.

అంత వేదవతి "శ్రీ రామచంద్రా! నేను ఎన్నో సంవత్సరములు తపస్సు చేసాను. నిన్ను తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసాను. ఒక పర్యాయము రావణుడు నన్ను బలాత్కరించబోయాడు. అతనిని శపించి, నేను అగ్ని బ్రవేశము చేసి యీ అగ్నిహోత్రుని వద్దనే వుండిపోయాను. గాన నన్ను కూడ నీ అర్థాంగిగా స్వీకరించు" అని వేడుకున్నది.

"వేదవతీ! ఇప్పుడు నిన్ను స్వీకరించను. ఈ అవతారంలో ఏకపత్నీ వ్రతుడను. కలియుగంలో నీవు ఆకాశరాజుకు కుమార్తెగా ఆవిర్భవించి పద్మావతి అను పేర, వారి ఇంటిలో పెరగగలవు. నేను శ్రీనివాసునిగా అవతరించి నిన్ను వివాహము చేసుకొందును" అని వాగ్దానము చేసాడు శ్రీరాముడు.

ఆ ప్రకారంగానే వేదవతి కలియుగంలో ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి యను పేర పెరిగి ఆ నాటి శ్రీరామచంద్రుని మాట ప్రకారము విష్ణువు శ్రీనివాసుడను పేరనుండగా వివాహము చేసుకున్నది.

నారదుడు పద్మావతి వద్దకు వచ్చి హస్త రేఖలు చూచుట

పద్మావతికి పెండ్లి యీడు వచ్చింది. సకల శాస్త్రాలూ నేర్చుకొని చదువుల్లో, గానంలో సరస్వతీ దేవిని మించి, అందంలో యక్ష, కిన్నెర, గంధర్వ కన్యల కన్న మిన్నయై అలరారుచున్నది. ఒక మారు మంగళ గౌరీ వ్రత మాచరించి తల్లిదండ్రులకు నమస్కరించి తన చెలియలతో గూడి ఉద్యానవనంలో ఆట పాటలతో సంతోషంగా వుండగా త్రిలోకసంచారియగు నారదమహర్షి పద్మావతి దగ్గరకు హరినామ సంకీర్తనము చేస్తూ వచ్చాడు. పద్మావతి తన తండ్రికి గురువైన నారదులవారికి నమస్కరించి ఉచితాసనముపై కూర్చుండబెట్టెను.

"బ్రహ్మపుత్రా! నారద మహర్షీ! నమస్కృతులు. మీ దర్శన భాగ్యము కలిగినందులకు ధన్యురాలనైతిని" అని ప్రార్ధించినది. "అమ్మా పద్మావతి! శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" అని దీవించి "పద్మావతీ నేను త్రిలోక సంచారిని గదా, ఇటు పోతూ నీ తండ్రిని చూచిపోదామని వచ్చాను. నీ భక్తి శ్రద్ధలకు చాలా సంతోషం. ఏదీ నీ వామ హస్తము" అని అనగా పద్మావతి తన ఎడమచేయి చాపింది. నారదుడు దీర్ఘంగా హస్త రేఖలను పరిశీలించాడు. చేతి వ్రేళ్ళను వాటి రేఖలను చూచాడు. పద్మావతితో "బిడ్డా పద్మావతీ! విష్ణు ప్రియ లక్ష్మీ దేవికున్న రేఖలూ, నీ చేతి రేఖలూ ఒక్కటే. ఎంత అదృష్టవంతురాలవమ్మా! సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీనివాసుడు నీకు భర్త కాగలడు. నా మాట ముమ్మాటికీ నిజం. నీవు లక్ష్మీ దేవితో సమానురాలవు" అని పలికాడు.

"ఆ శ్రీహరి వైకుంఠాన్ని విడిచి యీ భూలోకములో వేంకటాచలంలో శ్రీనివాసుడనే పేరుతో నివసిస్తూ యున్నాడు. అతని రూపు రేఖా విలాసాలు నేను కాదు కదా బ్రహ్మమహేశ్వరులు కూడా వర్ణింపలేరు. అతనితో నీ వివాహము జరుగుతుంది" అని దీవించి నారదుడు ఆకాశరాజు భవనంలోకి వెళ్ళాడు.

పద్మావతి వివాహము గురించి సమాలోచన

పద్మావతికి యుక్త వయస్సు వచ్చింది. వివాహము చేయాలని, తగిన సంబంధం చూడాలని ఆకాశరాజు, ధరణీదేవి దీర్ఘంగా ఆలోచిస్తూ యున్నారు. నలుదిశలా పురోహితులను పంపి యున్నారు. కాని పద్మావతికి సరియగు వరుడు ఎక్కడా లభించలేదు. ఆ రాజ దంపతులు చింతాగ్రస్తులై వున్న సమయంలో నారదుడు వారి వద్దకు వెళ్ళి, కుశల ప్రశ్నలడిగి, పద్మావతి వివాహ విషయమై చింతా గ్రస్తులైన ఆకాశరాజును, ధరణీదేవిని ఊరడించి "రాజా! శ్రీహరి శ్రీనివాసుడనే నామముతో వేంకటాచలంలో వుంటున్నాడు. పూర్వము వేదవతియే ఈనాడు పద్మావతిగా నీ యింట పెరుగుచున్నది. పద్మావతికి ఆ శ్రీమన్నారాయణుడితో తప్ప మరొకరితో వివాహం జరుగదు. అతి త్వరలో మీ మనోభీష్టము నెరవేరును. శ్రీహరి మీ అల్లుడు కాగలడు. ఇక మీరు విచారించ వద్దు" అని నారదుడు చెప్పాడు.

ఆకాశరాజుకు పట్టరాని ఆనందం కలిగింది. "ఇది నిజమా! కలా!" అనుకున్నాడు. పూర్వము వామన మూర్తి బలి చక్రవర్తిని మూడడుగుల నేల ఇమ్మంటే ఎంత సంతోషంతో ఇచ్చాడో, యిప్పుడు శ్రీమన్నారాయణుని పాదములు కడిగి కన్యా దానం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని పరమానందం పొందాడు ఆకాశరాజు.

నారదుని నోట వచ్చిన శుభవార్త చాటునున్న సేవకులాండ్రు విని పద్మావతికి చెప్పినారు. పద్మావతి సిగ్గుతో తలవంచి లోలోపల మురిసిపోయింది.

శ్రీనివాసుడు వేటకు వెళ్ళుట

వేంకటా చలమునందు వకుళాదేవి ఆశ్రమంలో వున్న శ్రీనివాసుడు వకుళాదేవి ముని పుత్రులకు పురాణ రహస్యాలు వివరిస్తూ, తాను వారి సేవలను స్వీకరిస్తూ కాలం గడుపుచున్నాడు.

ఒకనాడు ఒక మదపుటేనుగు ఆ అరణ్య ప్రాంతమంతా భీభత్సము చేస్తూ కనిపించిన జంతువును తరుముతూ ఘీంకార శబ్దము చేస్తూ, భూమి అదిరేలాగ అటు ఇటు పరిగెత్తుచూ వకుళాశ్రమ సమీపానికి వస్తుంది. పర్వతం వలె గంభీరంగా ఉన్న ఆ ఏనుగును చూచి ఆశ్రమ వాసులు భయపడి తలుపులు వేసుకొని భయంతో వణికిపోతూ నారాయణ, నారాయణ అని ధ్యానించు చున్నారు. ఆ మదగజాన్ని శ్రీనివాసుడు చూచి, దనుర్బాణాలు ధరించి ఏనుగును చంపుటకై బైటకు వస్తుంటే "వద్దు నాయనా వద్దు. అంత సాహసం చేయవద్దు. ఆ ఏనుగు మహా భయంకరంగా ఉంది. ఆ పర్వతాన్నే పిండి చేసేదిగా ఘీంకరిస్తోంది" అని వకుళ బ్రతిమలాడింది. "శ్రీనివాసా, బ్రతికుంటే బలుసాకు తిని ఉందాం. దీని జోలికి పోవద్దు" అని ముని పుత్రులు చేతులు పట్టుకున్నారు.

"అమ్మా, నాకేమీ భయం లేదమ్మా! దీనిని సంహరించక పోతే ప్రజలకెంతో నష్టము, కష్టము కలుగుతుంది. నష్టము వాటిల్లిన తర్వాత విచారిస్తే ఏమిటి లాభం? అటువంటివి జరుగకుండా ముందు జాగ్రత్త పడాలి గదా!" అని ఆశ్రమం లోంచి శ్రీనివాసుడు విల్లును ఎక్కు పెట్టి ఏనుగు ఎదురుగా ధీరునివలె నిలబడ్డాడు. శ్రీనివాసుడిని చూడగానే ఏనుగు వెనకకు తిరిగి వెళ్ళిపోతోంది. శ్రీనివాసుడు దానిని తరుము తున్నాడు. సత్యలోకములోని బ్రహ్మ యిది గమనించి ఒక గుర్రాన్ని సృష్టించి శ్రీనివాసుని కడకు పంపేడు. శ్రీనివాసుడు ఆ ఆశ్వాన్ని అధిరోహించి ఏనుగును తరుముతూ ఉన్నాడు. అటుల చాలా దూరము వెళ్ళేడు. ఏనుగు కను మరుగైనది. అప్పటికే శ్రీనివాసుడు అలసిపోయాడు. పెద్ద వటవృక్షము క్రింద విశ్రమించాడు.

కొంత దూరములో కిలకిలారావములు కేకలు వినిపించినవి. ఆ ప్రాంతములో మనుజ సంచారము వున్నందున శ్రీనివాసుడు సంతసించి దప్పిక తీర్చుకొనుటకు నడకన ఒక ఉద్యానవనంలో ప్రవేశించాడు.

ఆ ఉద్యానవనంలో పద్మావతి తన చెలికత్తెలతో వసంతాలు ఆడుకుంటూ , పాటలు పాడుతూ, గెంతుతూ ఆనందంగా నాట్యం చేస్తూ ఉంది. సమీపమున నున్న కోనేరులో శ్రీనివాసుడు దప్పిక తీర్చుకొని పద్మావతిని సమీపించెను.

"ఈ ఉద్యానవనంలో పురుషులెవరూ ప్రవేశించకూడదు" అని ఆకాశ రాజాజ్ఞ. చెలికత్తెలకు కోపం వచ్చి అతనిని సమీపించి "ఓయీ! ఎవరు నీవు?" అని గద్దించిరి. శ్రీనివాసుడు పద్మావతిని చూచినది మొదలు పరధ్యానంలో రెప్పవాల్చక నిలబడిపోయాడు. పద్మావతికి ఇంకా దగ్గరగా వస్తున్నాడు. పద్మావతి కూడా శ్రీనివాసుని చూచి నిశ్చేష్టురాలై సిగ్గుతో తలవంచుకొని చెట్టుచాటున నిలబడింది. చెలికత్తెలు పద్మావతి కనిపించకుండా అడ్డుగా నిలబడి "గొడ్డుకో దెబ్బ, మనిషికో మాట అన్నట్లు మామాట వినిపించుకోకుండా ఇంకా దగ్గరగా వస్తున్నావా!" అని చేతులెత్తారు. పద్మావతి కోరికపై అతని గోత్ర నామాలు అడుగగా "చెలులారా నా కెవ్వరూ లేరు. నేను వంటివాడను. జగమంతా నాకు బంధువులు. నాకు ఇల్లు లేదు. ఎవరు ఆదరిస్తే వారి వద్దనే వుంటాను. ఇదీ నా చరిత్ర. మరి మీ నామధేయము?" అని అడిగినాడు. "ఆమె పేరు పద్మావతి. తండ్రి ఆకాశరాజు, తల్లి ధరణీ దేవి. ఇది మా సంగతి" అని చెప్పి చెలికత్తెలు బదులు చెప్పినారు.

"పద్మా! నన్ను వివాహం చేసుకో! నీకు నేను తగిన వరుడను" అని అనగా వేటగానివలెనున్న శ్రీనివాసుని మాటలకు పద్మావతి ఒళ్ళు మండిపోయింది. "చాలు అధిక ప్రసంగము. వెంటనే ఇక్కడినుండి వెళ్ళు" అని హుంకరించింది. పద్మావతి రుసరుసలకు శ్రీనివాసుడు నవ్వుతూ "బాలా! నన్ను తృణీకరించకు. ప్రేమకు అంతరాలు లేవు. ప్రేమ హృదయాలకు సంబంధించినది. అది మమత, అనురాగము, అభిమానములతో ముడివేసుకొని వుంటుంది. నీ సౌందర్యము చూచిన లగాయతు నిన్ను వివాహం చేసుకొనవలెనని కోరిక నాలో జనించింది. నిన్ను వివాహం చేసుకోలేక పోతే నేను జీవించి వుండలేను. నన్ను కాదనకు" అని మరికొంత దగ్గరగా వచ్చేడు. ఇక సహించ కూడదని పద్మావతి చెలులను పిలిచి "ఈ వేటగానిని రాళ్ళతో కొట్టి తరమండి" అని ఆజ్ఞ ఇచ్చింది.

పద్మావతి ఆజ్ఞ వారికి బలమిచ్చింది. "ఓయీ! నీవు జంతువులను వేటాడెదవా! లేక మనుష్యులను వేటాడ వచ్చితివా! పో పొమ్ము" అని రాళ్ళతో కొట్టిరి. అందరూ ఒక్కసారిగా రాళ్ళతో కొట్టుటవల్ల శ్రీనివాసునకు శరీరమంతా దెబ్బలు తగిలినవి. అయినా శ్రీనివాసుడు దగ్గరగా వచ్చాడు. పద్మావతికి జాలి కలిగినది. కులగోత్రాలు తెలుసుకోవాలని మరల అడిగింది.

"నా కులము గోత్రము చెబుతాను. నన్ను నిరాశతో వెనక్కి పంపవద్దు. నాది శీతాంశు కులము, వశిష్ఠ గోత్రం. నా తండ్రి వసుదేవుడు; తల్లి దేవకి. బలరాముడు నా అన్న. నా చెల్లె సుభద్ర. పాండవులు నా ప్రియ బంధువులు. పాండవ మధ్యముడగు అర్జునుడు నా బావమరది. ఇదీ నా చరిత్ర. మరి మీ కులగోత్రాలు తెలుసుకోవచ్చునా?" అని అడిగాడు శ్రీనివాసుడు.

మాటలలో మాట కాలపాలని పద్మావతి అనుకొని "మాది చంద్రవంశము; అత్రి గోత్రము. నా తండ్రి పేరు ఆకాశరాజు. తల్లి ధరణీదేవి. నా తమ్ముని పేరు వసుధాముడు" అని చెప్పి "చెలులారా! త్వరగా ఇటనుండి వెళ్ళమని చెప్పండి" అన్నది.

శ్రీనివాసుడు జాలిగా "నేను వెళ్లలేక, వెళ్లలేక వెళ్ళుతున్నాను. నన్ను వివాహము చేసుకో. నీకే లోటు రానివ్వను" అని అన్నాడు. అతని మాటలకు పద్మావతి లోలోన మురిసిపోయి నారదుడన్న మాటలు జ్ఞప్తికి రాగా చెలులతో రాజ మందిరానికి వెళ్ళిపోయింది.

శ్రీనివాసుడు వకుళతో తన మనోభావాన్ని వివరించుట

పద్మావతిని చూచినది మొదలు శ్రీనివాసునకు పిచ్చి వానివలె మనసు స్థిమితం లేకపోయింది. ఇంటి ముఖం పట్టాడు. బరువైన గొంతుతో కాళ్ళు తడబడుతూ ఆశ్రమానికి వచ్చి ఏకాంతంగా విశ్రమించాడు. వేటకు వెళ్ళి వచ్చాడు కదా, శరీరం అలసి యుండును గదా అని వకుళాదేవి, ఆశ్రమవాసులూ ఊహించినారు. ఒకటి రెండు దినాలు గడిచినాయి. శ్రీనివాసుడు ఆహారం భుజించడం లేదు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఇది గ్రహించి వకుళాదేవి శ్రీనివాసుని ప్రక్క కూర్చుని తల నిమురుతూ "ఏమి నాయనా! వేటకు వెళ్ళి వచ్చిన నాటి నుండి ఏ విధమైన ఆహారం తీసుకొనుటలేదు. మనసులో ఏదో దిగులుగా వున్నట్లు వున్నావు. అయ్యో! నీరసించినావు కూడా. రానాయనా ఫలహారము సిద్ధం చేసినాను. భుజించు" అని బ్రతిమలాడి౦ది. అయినా శ్రీనివాసుడు పలుకలేదు.

"అదేమి శ్రీనివాసా! అంత విచారగ్రస్థుడవై ఏదో దీర్ఘాలోచనాలతో విరక్తి భావంతో వున్నావు. నీవు వేటకు వెళ్ళినపుడు ఏదైనా దుర్ఘటన జరిగిందా? ప్రమాద మేమైనా వాటిల్లినదా? చెప్పు తండ్రీ! నీ విచారానికి కారణమేమిటో వివరించు. పగటి నిద్ర పనికి రాదుగదా! ధైర్యాన్ని పోగొట్టుకొనక త్వరగా చెప్పు నాకు" అని వకుళ ఆతృతగా అడిగింది. శ్రీనివాసుడు మారు పలుకలేదు. మౌనంగా ఉండి పోయాడు.

"అయ్యో నాయనా! దేనికీ జవాబు చెప్పవేమి? నేను నీకు చేస్తున్న సేవలలో ఏదైనా లోపమున్నదా? లేక భూతపిశాచ గణాలు ఏమైనా భయపెట్టినవా? అన్నట్లు వనదేవతగాని, యక్ష, కిన్నెర, గంధర్వ కన్యలు గాని నీ అందాన్ని చూచి సమ్మోహనాస్త్రం ప్రయోగించినారా?" అని అనేక విధాల ప్రశ్నించిననూ పలకడం లేదు. శ్రీనివాసుడు సరే కొండపైనున్న వరాహస్వామితో నీ సంగతి విన్నవించుకొంటాను అని వకుళ అనగా, శ్రీనివాసుడు కొంత తడవాగి "అమ్మా! ద్వాపర యుగంలో నా పెంపుడు తల్లి యశోద గొల్ల వారి౦డ్లకు పోయి అల్లరిపనులు చేయకురా అని బ్రతిమలాడినట్లు నీ మాటలకు ఆనాటి పాత స్మృతులు జ్ఞాపకమోస్తున్నాయి. నీవు మాతృమూర్తి గనుక చెప్పుచున్నాను. విను."

"మదగజాన్ని సంహరింప నేను దానిని తరుముకుంటూ వెళ్ళగా వెళ్ళగా ఆ ఏనుగు ఒక ఉద్యానవనం గుండా వెళ్ళి ఎటో కనిపించకుండా పోయింది. ఆ ఉద్యానవనంలో ఒక అందాల కన్య తన చెలియలతో ఆటలాడుట చూచినాను. ఆ కన్యను చూచినది మొదలు నా కండ్లను నేనే నమ్మలేకపోయాను. నా కాళ్ళు ముందుకు సాగలేదు. ఆమె అందాన్ని ఏమని వర్ణి౦తును? ముల్లోకాలలో అంతటి అందాల మగువ వుండ బోదు. ఆమె శరీరపౌష్ఠవము, ముఖారవిందము ఇప్పటికీ నా కండ్ల ముందే కనిపిస్తోంది. దగ్గరగా వెళ్ళి ఆమె కులగోత్రాలు అడిగాను. ఆమె ఆకాశరాజు కుమార్తెనని చెప్పింది. నన్ను పెండ్లి చేసుకోమని బ్రతిమలాడేను. ఆమె తండ్రితో చెప్పి నాకు దండన విధిస్తానని భయపెట్టింది. నేను భయపడక దగ్గరగా పోయినాను. నా కోరిక తృణీకరించింది. గనుక ఆమెలేని నా జీవితం వృధా. ఆమె నా గురించి జన్మించి ఉంటుంది. నేను ఆమె కోసమే ఈ భూలోకానికి వచ్చితినేమో! అంతా మాయగా వుంది. గాన నా యీ అవస్థ పోవాలంటే ఆమె నాకు భార్యగా వుండాలి" అని దీనంగా చెప్పాడు శ్రీనివాసుడు.

"అయ్యో శ్రీనివాసా! ఎంత సాహసము చేసావు? ఆకాశరాజు సామాన్యుడా! అయినా వారెక్కడ? మన అంతస్తు ఎక్కడ? వియ్యమైనా కయ్యమైనా సమానమైన వారితోనే వుండాలని పెద్దలు చెప్పియున్నారు. వారికి మనకి వియ్యం ఎలా కుదురుతుంది? నీవు ఎలాగ ఊహించావు? ఈ వివాహం జరగని పని గనుక ఈ విషయం మరచిపో. ఆ తలంపు మనసులోకి రానీయకు" అని వకుళ పలికినది.

శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వి "అమ్మా! నీ కొక రహస్యం చెబుతాను విను. త్రేతాయుగంలో నేను రామావతారమెత్తి జనక మహారాజు కూతురు సీతాదేవిని వివాహంచేసుకొన్నాను. నా పిన తల్లి వల్ల సీత, తమ్ముడు లక్ష్మణునితో పదునాలుగు సంవత్సరములు అరణ్యానికి పోవలసి వచ్చింది. ఆశ్రమంలో నేను లక్ష్మణుడు లేని సమయంలో రావణుడు తన మాయారూపంతో సీతను ఎత్తుకు పోయాడు. ఆ సమయంలో అగ్నిహోత్రుడు మాయా సీతను కల్పించి, రావణుని వెంట వెళ్ళులాగున, అసలు సీతను తన దగ్గర రక్షించినాడు. నేను వానర సైన్యమును వెంటబెట్టుకొని లంకలో ప్రవేశించి రావణుని వధించాను. సీత శీలాన్ని శంకించి సీతను అగ్నిప్రవేశం చేయమన్నాను. సీత అగ్నిలో ప్రవేశించగా అగ్నిహోత్రుడు అసలు సీతను మాయ సీతను తెచ్చి నీ సీతను తీసుకోమన్నాడు. నా సీతను ఆనవాలు పట్టి తీసుకున్నాను. మాయాసీతను కూడా ఏలుకొమ్మని అగ్ని చెప్పగా, రామావతారంలో నేను ఏకపత్నీ వ్రతుడను, ఈ సీతను ద్వాపరయుగంలో లేక కలియుగంలో పద్మావతిగా పెరిగినప్పుడు వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాను. గాన ఆ సీత వేదవతి. ఆ వేదవతియే ఈ పద్మావతి. వేదవతిగా ఉన్నప్పుడు నన్ను వివాహం అనగా కలియుగంలోనే నిన్ను వివాహం జేసుకుంటానని చెప్పి యున్నాను. ఇప్పుడు ఈ పద్మావతితో నా వివాహము నీ చేతుల మీదుగా జరగవలసి యున్నది" అని వకుళతో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు.

పద్మావతి మనోవ్యాధితో మంచము పట్టుట

ఉద్యానవనంలో వేటగాని రూపంలో నున్న శ్రీనివాసుని చూచిననాటినుండి అతని రూపాన్ని తలుస్తూ వుండిపోయి, తిండి తినక, తల దువ్వుకొనక, తల్లిదండ్రులతో మాటలాడక, మాటలాడినను ముక్త సరిగా మాటలాడుచూ, చెలికత్తెలను పలకరించక విచార గ్రస్తురాలై మకాం ముమీదే వుండిపోయింది. తిండి తినక రోజు రోజూ చిక్కి పోతూ ఉంది. తన మనో బాధ ఎవరికి చెప్పినా ఎవ్వరూ అంగీకరించరని పరిపరివిధాల ఆలోచిస్తూ లోలోన దుఃఖిస్తూ ఉంది.

తల్లిదండ్రులు తమ బిడ్డ చిక్కిపోవుట చూచి రాజవైద్యులను రప్పించారు. దేవాలయాలలో అభిషేకాలు చేయించారు. భూతవైద్యులచే దిష్టి తీయించారు. అనేక విధాలుగా పద్మావతి ఆరోగ్యం గురించి బహు జాగ్రత్తగా చూస్తున్నారు రాజదంపతులు.

పద్మావతి పరిస్థితి ఇలా వుండగా శేషాచలమందు శ్రీనివాసుడు కూడా విరహ వేదనతో కుమిలి పోతూనే ఉన్నాడు. అతని విచారాన్ని వకుళ అర్థం చేసుకొని "నాయనా! నేను నారాయణపురం వెళ్ళి ఆకాశ రాజుతో వివాహసంబంధం గురించి మాట్లాడి వస్తాను. నీకు పద్మావతిని ఇచ్చి ఎలాగైనా వివాహము జరిగే లాగ చూడమని అర్థిస్తాను. నీవు దిగులు పడక వుండు నాయనా" అని నచ్చ చెప్పింది.

వకుళ చెప్పిన ధైర్య వచనాలకు శ్రీనివాసుడు సంతోషించాడు. సంతోషించాడు గాని తనకు వకుళా దేవి కృషివల్ల పద్మావతితో వివాహం జరుగుతుందా? ఏమో, ఒక స్త్రీ వల్ల యింతటి బంధుత్వము, ఇంటి శుభకార్యము జరగగలదా . యీ కార్యము సఫలము కావడానికి ఏమి ఉపాయమా అని పరిపరి విధాల ఆలోచించాడు శ్రీనివాసుడు. ఆలోచించి ఒక పథకం పన్నాడు. వకుళ ఆకాశరాజుతో సంభాషించే లోగా తాను ఎరుకల స్త్రీ రూపాముతో అంతఃపురములో ప్రవేశించి శ్రీనివాసునితోనే పద్మావతి వివాహమగునని వారికి నమ్మకము కలిగేలాగ వ్యవహరించాలి అని నిర్ణయించుకున్నాడు.

శ్రీనివాసుడు ఎరుకల స్త్రీగా మారి సోదె చెప్పుట

శ్రీనివాసుడు తక్షణం తన రూపాన్ని మార్చి ఒక ముసలి సోదమ్మెవలె మెడ నిండా గవ్వలు, పూసల దండలు ధరించి, చంకన గద్దెబుట్ట, చేతిలో పేము కర్రతో తన రూపాన్ని చూచుకొని నగుమోముతో కొండ దిగి ఒక్క క్షణంలో నారాయణపురం వెళ్ళి "సోదెమ్మ! సోదో సోది చెబుతానమ్మ సోదీ!" అని ఆ పురములో నాల్గు వీధులు తిరిగి పద్మావతియున్న అంతఃపుర సమీపాన వచ్చి నిలబడింది.

ఆ కేక విన్న పద్మావతి చెలికత్తెలు క్రొత్తగా వచ్చిన సోదె ముత్తైదువును చూచి ధరణీ దేవితో "అమ్మగారూ! చాలా దినాలికి మన వూరికి సోదెమ్మ వచ్చింది. పద్మావతమ్మగారి గురించి ఏదయినా అడగవచ్చునుగదా!" అని చెప్పారు. "అవును బిడ్డకు పట్టిన గ్రహస్థితి గురించి అడగవచ్చు. లోనికి రప్పించండి" అని మహారాణి అజ్ఞాపించేరు. సేవకురా౦డ్రు వెళ్ళి సోదెమ్మను లోనికి తీసుకుపోయిరి.

ఎత్తుగడ ఫలించింది, ఇక కార్యము సాధించాలి గదా అని ఎరుకల స్త్రీ వేషంలో ఉన్న శ్రీనివాసుడు లోలోన మురిసిపోతూ అంతఃపురంలో అడుగుపెట్టి వింతగా అన్నీ చూస్తూ ధరణీదేవిని సమీపించాడు.

"ఏమే, సోది బాగా చెప్పగలవా! మా అమ్మాయికి సోదె చెప్పు చూద్దాం" అని ధరణీదేవి అన్నది. "అమ్మగారూ! నేను సోది చెప్పడంలో నాకు మంచి పేరున్నది అమ్మగారూ" అని "ఏదీ బిడ్డను యీ గద్దెబుట్టకు ఎదురుగా కూర్చోబెట్టండి అని అనగా లోనుండి పద్మావతిని కూర్చోబెట్టారు. పద్మ విసుగుదలగా బలవంతంగా కూర్చొని తన ఎడమహస్తాన్ని సోదెమ్మకు చూపించింది.

"దేవతలారా! దయచేయండి. గద్దె పీఠమా గమ్మున రావయ్యా. మూల దేవతలారా బిరబిరా రండి. వచ్చి ఈ బిడ్డ కోరిక తీర్చండి" అని దేవతలను స్మరించి చేతి బెత్తం చేయిమీద పెట్టి దేవతలంతా తనను ఆవహించారు , చెప్పేదంతా నిజమౌతుంది. ఇందులో తిరుగు లేదు అని చెప్పడం మొదలెట్టింది. పద్మావతి ముఖార విందాన్ని చూస్తూ:

"వినుకోవె ఓ బిడ్డ వివరంగ చెపుతా కల్లలాడను నేను కలికిరో వినుమా కళ్యాణ దినములు కదిలొచ్చినాయి కన్యగా నీవింక కలత జెందకుము వనములో పురుషుని వలపుతో చూసి అతని నీ మనసులో దాచి పెట్టేవు ఆనాటినుండి నీవు ఆరాటపడుతూ వెన్నవంటి వాడే నీకు నచ్చాడు నిన్ను బోలిన బాధనున్నాడు వాడు నీ కొరకు ధ్యాసతో నలుగుతున్నాడు వేటకాడనుకొని కొట్టించినావు ఆది దేవుడు వాడు నారాయణు౦డు శ్రీనివాసుని పేర మసులుతున్నాడు ఏది ఏమైనగాని నిన్ను పె౦డ్లాడు నీ కోరికలు తీర్చ నిలికహియున్నాడు అదృష్టమే అబ్బు అతివరో నీకు శీఘ్రమే కళ్యాణం జరిగి పోవునుగా నీ కొరకు ఒక తల్లి అడగవచ్చును తల్లీ మాట తప్పక నీవు అంగీకరించు శ్రీరస్తు శుభమస్తు కళ్యాణ మస్తు!!"

అని ఉద్యానవనంలో జరిగిన ఘట్టాలు జ్ఞప్తి తెచ్చింది. ధరణీ దేవి ఇదంతా విని ఆశ్చర్యపడింది. సోదెమ్మకు చేటలో రత్నాలు పోసి, కొత్త చీర రవికెల గుడ్డ నిచ్చి సాగనంపింది. ఆ రాత్రి శ్రీనివాసుడు పద్మావతి నిద్రలో కనిపించి నిన్నే వివాహం చేసుకుంటానని తన లీలలన్నీ చూపించాడు.

ఆకాశరాజు వద్దకు వకుళ ప్రయాణము కట్టుట

శ్రీనివాసుడు మామూలుగా వేషం మార్చి ఆశ్రమానికి వచ్చాడు. "శ్రీనివాసా! నాయనా! ఎక్కడికి వెళ్ళావు? రా నాయనా ఫలహారం భుజించు" అని తల నిమిరింది. "అమ్మా, రేపు ఉదయం నారాయణపురికి ప్రయాణం కట్టు. మార్గ మధ్యలో కపిల మహా ఋషిని, అగస్త్య మహా మునిని దర్శించు. వారి ఆశీర్వాదములు పొందు. నీ వెళ్ళిన కార్యము సఫలమగును" అని వకుళకు చెప్పేడు.

శ్రీనివాసుని మాట ప్రకారం వకుళ మంచి ఘడియలు చూచి నారాయణ పురానికి బయలు దేరింది. దారిలో కపి ముని, అగస్త్యుల వారిని దర్శించి వారి దీవెనలందుకొని నారాయణపురం చేరుకొంది. ఊరి చివరనున్న శివాలయంలో కొందరు ముత్తైదువులు గుమిగూడి వుండడం చూచి అక్కడికి వెళ్ళి "ఏమిటమ్మా ఈ గుంపు? శివునికి అభిషేకం చేయిస్తున్నారా?" అని అడిగింది. అంత ఒక చెలికత్తె "ఈ అభిషేకం మా రాజుగారు చేయిస్తున్నారు. రాకుమార్తె పద్మావతి ఒక రోజు ఉద్యానవనంలో వుండగా ఒక వేటగాడు వచ్చి ఆమెతో ఏవో మాటలాడి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి మా పద్మావతి తిండి తినదు, నిద్రపోదు, మాట్లాడదు. తల దువ్వుకోక పడిఉంటోంది. దానికి విరుగుడుగా మారేడు పత్రములతో మహేశ్వరుడికి అభిషేకం చేయిస్తున్నారు" అని చెప్పి "మీరెవరమ్మా? చాలా దూరం నుండి వస్తున్నట్లున్నారు" అని అడిగింది.

"మాది వేంకటాచల నివాసము. నా పేరు వకుళ. నా కుమారుని పేరు శ్రీనివాసుడు. మీ రాజ దంపతులతో మాటలాడవలయునని వచ్చాను. నాను వారి వద్దకు తీసుకు వెళ్ళండి" అని వకుళ అన్నది. అభిషేక కార్యక్రమము పూర్తయిన తర్వాత పద్మావతితో పాటు వకుళను కూడా అంతఃపురానికి తీసుకువెళ్ళారు.

అంతఃపుర దాసీలు ఆకాశరాజుతోను, ధరణీదేవితోనూ ఒక భక్తురాలు దూర ప్రాంతం నుండి మీ దర్శనమునకై వచ్చియున్నదని చెప్పారు. "శీఘ్రమే ఆమెను మా వద్దకు తీసుకురండి" అని ఆజ్ఞాపించారు. వెంటనే దాసీలు వకుళాదేవిని తీసుకొని వచ్చారు. ధరణీదేవి వకుళను ఆర్ఘ్యపాదములిచ్చి ఉచితాసనమున కూర్చుండబెట్టి "అమ్మా, తమ పేరేమి? ఎందుకు ఇంత ప్రయాసతో వచ్చినారు? మీరు తపస్వినివలె నున్నారే. మీ రాకవలన మేము ధన్యులమయ్యాము. మీ రాకకు గల కారణం వివరించండి" అని ఆకాశరాజు దంపతులు కోరినారు.

వకుళ ఆకాశరాజును, ధరణీదేవిని ఆశీర్వదించి "పుణ్య దంపతులారా! నీ పేరు వకుళ. నా నివాసం శేషాద్రి. నేను శ్రీనివాసుని సేవకురాలను. ఆ శ్రీనివాసుడు నా బిడ్డ లాంటివాడు. శ్రీనివాసుడు పంపగా నేను మీవద్దకు వచ్చినాను." "ఏ పనిమీద పంపించెనో వివరించవమ్మా వకుళా" అని అనగా "అమ్మా ధరణీ దేవీ! మా శ్రీనివాసునకు మీ కుమార్తె పద్మావతిని ఇచ్చి వివాహము చేయమని అడుగ వచ్చినాను. ఇద్దరూ ఈడూ జోడూ తగినవారు" అని చెప్పినది.

ఆమె మాటలు విన్న ఆకాశరాజు "వకుళా! వరుని కులగోత్రాలు అతని తల్లిదండ్రుల నామ ధేయములు వివరించ" మని కోరినారు.

వకుళ ఆకాశరాజుతో "మహారాజా! శ్రీనివాసుడు చంద్రవంశము వాడు. అతనిది వశిష్ఠ గోత్రము. దేవకీ వాసుదేవులు అతని తల్లిదండ్రులు. బలభద్రుడు అన్న, సుభద్ర చెల్లెలు. జన్మ నక్షత్రము శ్రవణా నక్షత్రము. శ్రీనివామసుడు దైవాంశజుడు. ముల్లోకాలలో అతనికి సరిపోల్చు అందగాడు లేదు. ఇక మీ కుమార్తె లక్ష్మీ సమాను రాలు గాన యీ వివరాలు మీకు తెలియజేసి వివాహము స్థిరపర్చుటకు మీ వద్దకు వచ్చినాను" అని చెప్పినది.

ఆమె పలుకులకు రాజదంపతులు ఆనందించారు. "అమ్మా! మీరు ఉన్న విషయాలన్నీ దాపరికం లేకుండా చెప్పినారు. యీ విషయం మా గురువు గారికి తెలియజేసి మీకు వర్తమానం పంపుతాము. నేటినుండి మీరు మా ఆత్మ బంధురాలవు" అని వకుళను సాగనంపిరి.

ఆ రాత్రి ఆకాశరాజు కలలో శ్రీనివాసుడు కనిపించి "రాజా! నీవు ఏ మాత్రము సంశయింపకుము. నేనెవరినో నా తల్లి వకుళ వివరించి యున్నది. అయినా రాణి ధరణీ దేవి యింకా సంశయిస్తూనే యున్నది. మీరిరువురూ ఆనందంతో మాకు వివాహం జరిపించండి" అని అదృశ్యుడయ్యాడు. ఆకాశరాజు ఉలిక్కిపడి ధరణీ దేవితో తనకు శ్రీనివాసుడు కలలో చెప్పిన మాటలు వివరించాడు. ధరణీదేవి కూడా అలాంటి స్వప్నమే వచ్చినట్లు చెప్పినది.

ఆకాశరాజు శుకయోగితో సంప్రదించుట

ఆకాశరాజు ధరణీదేవి పద్మావతిని శ్రీనివాసునకిచ్చి వివాహము చేసే విషయమై దీర్ఘంగా ఆలోచించి, వివాహం చేయడానికి నిశ్చయించుకొన్నారు. అయినా గురువర్యులగు శుక యోగితో సంప్రదించాలని ఆకాశ రాజు తన ప్రియ సోదరుడగు తొండమానుని పిలిపించి అతనికి విషయం చెప్పి శుకయోగిని పిలుచుకు రమ్మని పంపించాడు. తొండమానుడు శుకయోగి ఆశ్రమానికి వెళ్ళి అన్నగారి ఆజ్ఞ తెలియజేయగా శుకయోగి బయలుదేరి ఆకాశరాజు వద్దకు వచ్చాడు.

శుకయోగి వచ్చుచున్న వార్త విని ఆకాశరాజు ఎదురేగి స్వాగతం పలికి ఉచితాసన మిచ్చి పద్మావతి వివాహ విషయమై జరిగిన ఘటనలన్నీ వివరించి, నిర్ణయం తెలియజేయమన్నాడు. అంత శుకయోగి "రాజా! నీవు చాలా అదృష్టవంతుడవు. శ్రీనివాసుడు ఎవరనుకున్నావు? సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు. అతడు నీకు అల్లుడు కాబోతున్నాడంటే అంతకన్నానీకేమి కావాలి? నీ కుమార్తెను శ్రీనివాసున కిచ్చి వివాహం చేయడంలో ఆలోచించవద్దు. లోకకళ్యాణమునకు ఇది శుభ సూచకం" అని సలహా యిచ్చినాడు.

ఆకాశరాజు దేవగురువైన బృహస్పతిని రప్పించి లగ్నపత్రిక వ్రాయించుట

శుకయోగి సలహాకూడా తీసుకొన్న తర్వాత ఆకాశరాజు దంపతులు శ్రీనివాసునికి పద్మావతిని ఇచ్చి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకారానికి వచ్చారు. వెంటనే ఆకాశరాజ దేవగురువులు, తమ వంశ పారంపర్య పౌరోహిత్యులైన బృహస్పతిని ధ్యానించినాడు. బృహస్పతి ప్రత్యక్షమై కారణమడుగగా "గురువర్యా! చాల దినములకు తమ దర్శన భాగ్యము అయినది. ముఖ్యముగా తమకు విన్నవించున దేమనగా శేషాచల పర్వతమున వకుళ అనే భక్తురాలి ఆశ్రమమందు నివసిస్తూన్నశ్రీనివాసుడని పిలువబడుచున్న మహానుభావునకు నా ఏకైక అభిమాన పుత్రికయైన పద్మావతిని ఇచ్చి వివాహము చేయ నిశ్చయించినాము. గురుదేవరేణ్యులు శుకమహర్షి కూడా వారి అంగీకారము తెలిపియున్నారు. గాన మీకు ఈ విషయము తెలియజేసి శుభముహూర్తము నిశ్చయింపమని వేడుకొనుచున్నాను. ముహూర్తము నిశ్చయించడమే గాక, ఆ లగ్న పత్రికను తమరే స్వయంగా శ్రీనివాసునకిచ్చి రావలయును. ఇది మా కోరిక" అని బృహస్పతితో చెప్పగా అంత బృహస్పతి "రాజా! మీరు చాలా అదృష్టవంతులు. శ్రీనివాసుడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువే. యీ కలియుగంలో శ్రీనివాసుడై నీకు అల్లుడు కాబోతున్నాడు. ప్రస్తుతము లక్ష్మీ దేవి ఎడబాసి యున్నందున వైకుంఠాన్ని వదలి ఇటు సంచరిస్తూ వున్నాడు. గాన 'ఆలస్యం అమృతం విషం' వెంటనే వివాహం చెయ్యి" అని సలహా యిచ్చేడు బృహస్పతి.

బృహస్పతి శుకమహర్షి పంచాంగములో ముహూర్తము చూచి, శ్రీనివాసుని పద్మావతి నామనక్షత్రముతో గణితక గట్టి వైశాఖ మాసంలో శుద్ధ దశమీ శుక్రవారం నాడు ముహూర్తము నిశ్చయించి రాజుతో చెప్పగా ఆ శుభలేఖ మీ చేతులతోనే వ్రాసి ఆ పత్రికను ఎవరిచేత పంపవలెనో మీరే నిర్ణయించమని ఆకాశరాజు ప్రాధేయపడినాడు.

ఉద్ధండులైన మహర్షులిద్దరూ శుభలేఖను నారాయణపుర వాసియగు ఆకాశరాజు పేర శ్రీనివాసునకు వ్రాసి వైశాఖశుద్ధ దశమీ శుక్రవారం నాటివాసుడగు శుభ ఘడియలకు పద్మావతిని వివాహమాడుట తమ పరివారంతో రావలసినదిగా వ్రాసిరి. వారందరూ సంతసించి ఆ శుభలేఖను శుకమహర్షి చేత పంపించుటకు నిశ్చయించి, శ్రీనివాసుని కడకు పంపించి, ప్రత్యుత్తరము తీసుకొని రావలయునని శుకమహర్షిని ఆజ్ఞాపించిరి.

శుకమహర్షి శుభలేఖను శ్రీనివాసున కందించుట

వైకుంఠ వాసుడగు శ్రీనివాసుని పెండ్లి శుభలేఖను శుకమహర్షి తీసుకొని "ఆహా! ఏమి నా భాగ్యము! శ్రీమన్నారాయణుని వివాహమునకు నా చేతులతో యీ శుభలేఖను గొనిపోయి, స్వామివారికి అందించుట సామాన్యమా! ఇది ఆంతయు నా పూర్వజన్మ సుకృతమే! ఈ రూపముగ ఆ వైకుంఠ వాసుని దర్శనము నాకు లభించుట వలన నా జన్మ తరించినది" అని మనసున సంతసించుచు శేషాద్రికి వెళ్ళుచున్నాడు.

శేషాద్రిలో శ్రీనివాసుడు ఆకాశరాజునుండి ఏ వర్తమానము వచ్చునోగదా యని ఎదురుచూస్తున్నాడు. శుకమహర్షి శేషాద్రి పర్వతమెక్కి ఆశ్రమానికి వస్తుండగా శ్రీనివాసుడు సంతోషంతో ఎదురేగి నమస్కరించి చింత చెట్టు క్రింద ఉచితాసనము వేసి కూర్చుండజేసి కుశలప్రశ్నలు అడిగెను. తదుపరి శ్రీనివాసుడు "తాపసవర్యా! మీ రాకవలన యీ శేషాద్రి పర్వతము పవిత్రమయినది. నేనుకూడ ధన్యుడనయ్యాను. తపోధను లెల్లరు క్షేమమేగదా! తమరు ఎచ్చట నుండి వచ్చుచున్నారు? దూరప్రయాణము చేసి వచ్చినట్లు కనిపిస్తున్నారే" అని ఆతృతగా ప్రశ్నించగా, శ్రీనివాసుని కనులార గాంచిన పరవశుడై "పురాణపురుషా! పదునాలుగు భువనములు నీ కుక్షియందు౦చుకొని కాపాడుచున్ననీకు తెలియని విషయములు ఉండునా. అయినను నీకొక శుభవార్తను తెలుపుటకు మీ సన్నిధికి వచ్చినాను" అని చెప్పబోవు చుండగా ఆతృతతో "అటులయిన నేను తలచిన కార్యము ఫలించినదా లేదా త్వరగా చెప్పు స్వామీ" అని శ్రీనివాసుడు అడిగాడు.

"ఓ శేషాద్రివాసా! నేను ఆకాశరాజు పంపగా ఇక్కడకు వచ్చాను. ఇదిగో అతడు పంపిన శుభపత్రిక. దీనిని స్వీకరించి, దీనికి జవాబుగా మరల నాకొక లేఖ యిమ్ము" అని శుకమహాముని పలికెను.

శ్రీనివాసుడు శుభలేఖను చదివి, మహానందం పొందాడు. పరుగున వెళ్ళి వకుళకు చదివి వినిపించాడు. వకుళ పరమానంద భరిత మైనది. శుకమునికి కృతజ్ఞత తెలియజేసినాడు. ఆ రోజు వకుళాశ్రమంలోవారి ఆతిథ్యము స్వీకరించి మరునాడు ఆకాశరాజు పంపించిన శుభలేఖకు శ్రీనివాసుడు జవాబుగా ఈ విధముగా వ్రాసినాడు:

"రాజాధిరాజు ధర్మ పాలకులగు ఆకాశరాజుగారి దివ్యసముఖమునకు, ప్రస్తుతము శేషాద్రి వాసుడగు శ్రీనివాసుడు నమస్కృతులుచేసి వ్రాసుకున్న ఉత్తరము, ఉభయ కుశలోపరి.

వైశాఖశుద్ధ దశమి శుక్రవారం రాత్రి దైవజ్ఞులు, మీరు నిశ్చయించిన ముహూర్తమునాకు నేను నా బంధుమిత్రులందరూ బయలుదేరి ముహూర్తము రోజుకు రాగలము. నా తరపున మా ఆశ్రమవాసులు తరపునా మీకివే మా నమస్కారములు జేస్తున్నాను. చిత్తగించవలెను. ఇట్లు శ్రీనివాసుడు"

ఈ విధముగా తన స్వహస్తాలతో వ్రాసిన లేఖ శుక మహర్షికిచ్చి అతనిని ఆకాశరాజు కడకి పంపెను.

శ్రీనివాసుని కళ్యాణ విషయము వకుళాదేవి వరాహస్వామికి వివరించుట

శుకమహర్షి చేత అంగీకార పత్రిక పంపించినది మొదలు శ్రీనివాసుడు ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉన్నాడు. వకుళ శ్రీనివాసుని దగ్గరకు వచ్చి తల నిమిరి "ఏమి నాయనా! తలచిన కార్యము సాధించావుగదా! ఇంకా దిగులెందుకు?" అని అడిగినది. "అమ్మా! మారేమియులేదు. శుభముహూర్తం దగ్గర పడుతోంది. చేతిలో చిల్లీ గవ్వ యైనను లేదు. ఈ శుభ కార్యము ఏటుల జరపాలో నాకు ఏ ఆలోచనా తోచ కున్నది" అన్నారు. "పరంధామా! ఈ చిన్నవిషయానికే దిగులు పడాలా! ధనలక్ష్మి నీభార్యయై యుండ నీకే ధనమునకు లోటేమిటి? ఆమెను అడిగి తెచ్చుకుందాము" అని వకుళ అనగా "తల్లీ శ్రీలక్ష్మి నాతో వాదనపడి నన్ను విడిచి తపస్సులో వున్నది కదా! నా కెలాగు ఆస్తుంది? అయినా నేను పద్మావతితో వివాహము చేసుకొంటానంటే ఆమె ఇవ్వదు" అని విచారంతో శ్రీనివాసుడన్నాడు. "సరే! ధైర్యంగా ఉండు. వరాహస్వామి ఆశ్రమానికి వెళ్ళి ఇంటికి పెద్దవాడు గనుక విషయమంతా చెప్పి వస్తాను" అని వరాహస్వామి ఆశ్రమానికి వెళ్లింది వకుళ. వరాహస్వామి తపస్సులో వున్నాడు. కొంతసేపటికి కన్నులు తెరచి వకుళను చూశాడు. "అందరూ క్షేమమా? శ్రీనివాసుడు రాలేదే?" అని వరాహస్వామి అడిగేడు. అంతా వకుళ శ్రీనివాసుడు పద్మావతిని ప్రేమించడం, వకుళ ఆకాశరాజు వద్దకు వెళ్ళి వివాహ విషయం మాట్లాడడం, కొద్ది రోజులకు శుక మునిచే ఆకాశరాజు శ్రీనివాసునకు పెండ్లి శుభలేఖను పంపడం, చేతిలో ధనం లేక పోవడం, మొదలగు విషయాలన్నీవివరంగా చెప్పింది. వరాహస్వామి చిరునవ్వు నవ్వి "వకుళా! శ్రీనివాసునికి వివాహం మాటవిని చాలా సంతోషం కలిగింది. ఏ విఘ్నములు లేక జయప్రదంగా వివాహం జరిగి తీరుతుంది. బ్రహ్మ, మహేశ్వర, ఇంద్ర, కుబేరాది సమస్త దేవతలు వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారు. ధనము గురించి చింతించ వద్దు. శ్రీనివాసుని ధైర్యంగా ఉండమని చెప్పు" అని ఆనంద బాష్పాలతో వరాహస్వామి దీవించాడు.

వకుళ శ్రీనివాసుని కడకు వచ్చి వరాహూని మాటలన్నీ వివరించింది. శ్రీనివాసుడు రెండు శుభపత్రికలు వ్రాసి గరుత్మ౦తుని, శేషుణ్ణి ధ్యానంతోరప్పించి, వారితో బ్రహ్మకు, ఈశ్వరునికి ఆ శుభలేఖలు పంపించాడు.

శేషాచలానికి నారదుడు వచ్చుట

పద్మావతీ శ్రీనివాసులకు వివాహము కానున్నదన్న వార్త ముల్లోకాలకూ తెలిసింది. నారదుడు శ్రీనివాసుని దగ్గరకు వచ్చి వివాహ విషయాలు కుశల ప్రశ్నలు అడిగాడు.

"నిజమే నారదా! కానీ వివాహమంటే మాటలా! ఎంతో ధనము కావలసి యుండును. గొప్పవారితో వియ్యమంటే ఎదుటి పక్షం కూడా సమానస్థాయిలోవుండాలి కదా! సిరిలేని శ్రీనివాసుడిగా ఉన్నాను. నా లక్ష్మి నా వద్ద లేదు. అందుకే నాకు ధనము కరువై యున్నది. గనుక నా వివాహ కార్యము ఏటుల చేయవలెనో నీవే చెప్పాలి" అని నారదుణ్ణి అడిగాడు.

"దేవాది దేవా! లోక రక్షకా! నీవే ఇంత దిగులు పడుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్ప శక్యమా! నీ వివాహము అతి వేడుకగా జరిగేటట్లు నేను పూనుకుంటాను" అని దేవతలందరిని రమ్మనమని కబురంపినాడు. గరుత్మంతుని వలన లగ్న పత్రిక అందుకున్న బ్రహ్మ సావిత్రీదేవి, సరస్వతీదేవితో హంస వాహనమెక్కి బయలుదేరాడు. ఈశ్వరుడు ఆదిశేషుడిచ్చిన లగ్న పత్రిక తీసుకొని పార్వతితోను, కుమారస్వామి, విఘ్నేశ్వరునితోను, ప్రమథ గణాలను వెంట బెట్టుకొని శేషాచలం బయలుదేరాడు.

నారదుడు పంపిన లేఖలతో ఇంద్ర, వరుణ, అగ్ని, కుబేరాది అష్ట దిక్పాలకులు, దేవగణములు, శేషాచలం చేరుకున్నారు. వారందరినీ సాదరపూర్వకంగా ఆహ్వానించి ఉచితాసనములపై కూర్చుండబెట్టాడు శ్రీనివాసుడు. "బ్రహ్మపరమేశ్వరాది అష్టదిక్పాలకులారా! మీరాకకు నేనెంతయో సంతసించుచున్నాను. ఈ వైశాఖశుద్ధ దశమీ శుక్రవారం రాత్రి శుభ ఘడియలలో కళ్యాణము జరుగును. ఇందుకు నా ఆహ్వానము పంపగా వచ్చినందుకు నాకు సంతోషం" అని సభాసదులందరినీ ఒప్పించాడు.

కొల్లాపురము లోనున్న లక్ష్మి వద్దకు సూర్యుని పంపుట

బ్రహ్మాది దేవతల సమక్షంలో పద్మావతి వివాహం గురించి వివరించిన తరువాత శ్రీనివాసుని ముఖం చిన్నబోయినది. కండ్ల వెంట నీరు కారుచున్నది. అతనికి వణుకు పుట్టినట్లయింది. ఆ దృశ్యాన్ని చూచిన వారందరూ ఆందోళనపడి "శ్రీ హరీ! ఏమిటి నీ ముఖకవళికలో ఇంతలో ఇంత మార్పు! సంగతేమిటి చెప్పమని" అంతా కోరినారు. శ్రీనివాసుడు దగ్ధస్వరంతో "ప్రియమిత్రులారా! ఏమని చెప్పుదును! ఈలాంటి శుభకార్యము అంతటా నేనే స్థిరపర్చుకున్నాను. యీ శుభసమయంలో నా లక్ష్మికి తెలియజేయకుండా లక్ష్మి నా దగ్గర లేకుండా నేను వివాహం చేసుకోవడమా! నేను అపచారం చేస్తున్నాను. నా లక్ష్మి లేనిదే నేను వివాహం చేసుకోను" అని చెప్పగా దేవతలు మునులు అంతా నిర్ఘాంతపోయినారు. అంతా బ్రహ్మ ముందుకు వచ్చి "శ్రీనివాసా విచారింప వలదు. నేను ఇప్పుడే సూర్యుణ్ణి కొల్లాపురం పంపి లక్ష్మిని ఇటకు రప్పించెదము" అని బ్రహ్మ చెప్పగా అందరూ సంతసించి సూర్యుని కొల్లాపురం పంపించారు.

సూర్యుడు కొల్లాపురంలో లక్ష్మి ఆశ్రమం చేరుకున్నాడు. లక్ష్మి సూర్యుని చూచి ఆనందించి శ్రీహరి క్షేమాన్ని ఆతృతగా అడిగింది. సూర్యుడు విషయం తెలియజేశాడు. లక్ష్మి ఆశ్చర్యపడి నోటమాటరాక నిర్ఘాంత పోయింది. "తల్లీ! విచారించకము. ఈ శుభకార్యము నీ చేతులతో జరగవలెను. అలాగా జరగకపోతే శ్రీనివాసుని పేరుతో శేషాచలమందున్న నీ భర్త కృశించి కృశించి" అని చెప్పబోవుచుండగా "సూర్యా! ఆగు నా భర్త సౌఖ్యం కోసం నేను ఎంత త్యాగమైనా చేస్తాను. నేను నా స్వామిని విడిచి ఇక్కడ ఆశ్రమవాసం గడుపుతున్నాను. నా భర్తనైనా ఇక సుఖపడనిస్తాను" అని సూర్యునితో చెప్పి శేషాచలానికి బయలుదేరింది లక్ష్మి.

లక్ష్మి రాకకు బ్రహ్మ, ఈశ్వర, దేవేంద్రాది అష్ట దిక్పాలకులూ, సరస్వతీ, పార్వతీ, అనసూయ మొదలగు పుణ్య స్త్రీలు లక్ష్మిని కౌగలించుకొనిరి.

కుబేరుని వద్ద శ్రీనివాసుడు ఋణముగా ధనము తీసుకొనుట

శ్రీనివాసుడు ఆసీనుడైన తరువాత నారద మహర్షి లేచి "నారాయణ, నారాయణ" అని సభాసదుల వంక తేరిపారజూచి "శ్రీనివాసుని కళ్యాణ వేడుకలు చూచుట వలన మనమెంతో ధన్యులము కాగలము. కాని ఇప్పుడు శ్రీనివాసుని వివాహమునకు చాలా ధనము కావలసి యున్నది. సిరి దగ్గరలేని శ్రీనివాసుడు యీ కార్యమును మోయలేడు గాన ధన సహాయము చేయుటకు ఒక్క కుబేరుడే తగినవాడు" అని కుబేరునితో "ఓ ధనాధిపా! ముల్లోకాలలో నీకు సరితూగు ధనవంతుడు మరొక లెవ్వరూ లేరు. గాన శ్రీనివాసుని వివాహ ఖర్చులకు ఎంత ధనము కావలెనో అంత ఇవ్వ వలెను" అని అడిగాడు.

కుబేరుడు అందుకు అంగీకరించినాడు. "శ్రీమహావిష్ణువునకు చేయు సహాయము కన్నా నాకు మరొకటేమున్నది" అని పలికినాడు.

శ్రీనివాసుడు కూడా కుబేరునితో అన్నీ విషయాలు చెప్పి "నేను నీ వద్ద ఋణము తీసుకున్నధనమునకు కలియుగం అంతమయ్యేవరకు వడ్డీ మాత్రం ఇచ్చి నేను మరలా వైకుంఠం వెళ్ళిన తరువాత అసలు బాకీ ఇచ్చివేయుదును" అని చెప్పగా కుబేరుడు సరేయని వివాహమునకు కావలసిన ధనము ఆభరణములు ఇచ్చుటకు అంగీకరించినాడు.

శ్రీనివాసుడు కుబేరునివద్ద ధనము తీసుకున్నట్లు తన స్వహస్తముతో పత్రము వ్రాశాడు. అందుకు బ్రహ్మమహేశ్వరులు సాక్షి సంతకాలు చేసారు.

దేవతలు వెంటబెట్టుకు వచ్చిన కామధేనువు అక్షయపాత్ర వలన పంచ భక్ష్య ఫలహారాలు సమకూర్చగా మహా వైభవంగా విందు చేసారు.

వివాహం ఏర్పాట్లు

వివాహానికి కావలసిన ధనము కుబేరునివలన లభించినది. ఆ చింత ఇక లేదు. ఆహ్వానితులకు వసతి ఏర్పాట్లు చేయాలి. శేషాచలమంతా కన్నుల పండుగగా తీర్చిదిద్దాలి. శ్రీనివాసుడు ఇంద్రునితో ఆలోచించి విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మ ఇంద్రుని సలహా ప్రకారము పెద్దపెద్ద విడిది గదులు, మంటపము మొదలగువాటిని అతి రమ్యంగా నిర్మించాడు. వివిధ రకాల పూల మాలలు భవనం చుట్టూ కట్టారు. సుగంధ పరిమళాలు వెదజల్లారు. ముహూర్త కాలం దగ్గరపడుతోంది. శ్రీనివాసుడు గరుత్మంతుని పిలిచాడు. "నీవు పోయి ముల్లోకాలలోని ప్రముఖులను, దేవ గణాలను, దేవకాంతలను అందరినీ పిలుచుకు రమ్మని" పంపించాడు. అనుకున్నట్లుగా అందరూ వారివారి వాహనములపై రివ్వున వచ్చి వేంకటాచలంలో దిగారు. అందరినీ ఆహ్వానించారు. ఇంద్రుడు - కుబేరుడు, తల్లి వకుళ మాలిక, పార్వతిని, సరస్వతిని, అరుంధతిని, సావిత్రి అనసూయలను శ్రీనివాసునికి మంగళ స్నానం చేయించుటకు గరుత్మంతునిచే పుణ్య నదుల లోని జలాన్ని తెప్పించినాడు. వరుడు అయిన శ్రీనివాసుని ముస్తాబు చేయమని కోరగా ముత్తైయిదు స్త్రీలు బంగారు కలశంలో పరిమళాలు వెదజల్లే పన్నీటితో నింపి శ్రీనివాసుని బంగారుపీఠపై కూర్చుండజేసారు. మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. వసిష్ఠులవారు మంత్రపఠనం చేయుచుండగా లక్ష్మీ, సరస్వతులు శ్రీనివాసుని శరీరానికి సుగంధ తైలాలు వ్రాసి మంగళస్నానం చేయించారు. ఆ పుణ్య స్త్రీలు స్నానము చేయించిన తరువాత మంచి గంధం పూసి బొట్టు, బుగ్గ చుక్క, నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో పెండ్లి కుమారుని చేసారు. ఆహా! వరుని వేషంలో నున్న ఆ శ్రీనివాసుని చూచిన కన్నులే కన్నులు. శ్రీనివాసుడు కొండ ఎక్కి వరాహస్వామి ఆశీర్వాదము పొందాడు.

ఈ లోగా ఎవరి వాహనాలు వారు సిద్ధం చేసుకొన్నారు. బ్రహ్మ సరస్వతులు హంస వాహనాన్ని, శివపార్వతులు నంది వాహనాన్ని, ఇంద్ర శచీదేవులు ఐరావతమును, కుబేరుడు, వరుణుడు, అగ్ని, విఘ్నేశ్వరుడు, యముడు ఇత్యాది దేవతల౦తా వారివారి వాహనములపై అదిష్ఠి౦చారు. శ్రీనివాసుడు గరుడారూఢుడై పురోహితుడు వశిష్ఠులవారిని వెంటబెట్టుకుని నారాయణపురానికి బయలుదేరినారు.

దారిలో శుకమహర్షి ఆతిధ్యము

ప్రయాణము సాగిపోతోంది. సంధ్యాసమయం కావస్తోంది. నారాయణపురం వెళ్ళే దారిలో శుకమహర్షి ఆశ్రమమున్నది. పెండ్లివారు వస్తున్నారని శుకుడు గ్రహించి వారికి ఎదురేగి వారందరు తన ఆశ్రమానికి వచ్చి తన ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరగా శ్రీనివాసుడు చిరునవ్వుతో "మునీంద్రా! నా పరివారమందరికీ విందు చేయ కష్టసాధ్యము కదా! అయిననూ నీ కోరిక ప్రకారమే అంగీకరించి యీ రాత్రి ఇక్కడే విశ్రమించెదము" అని అనగా "మహాభాగ్యము" అని శుకమహర్షి సంతసించి తన తపః శక్తిచే అందరికి పంచ భక్ష్యాలతో సంతృప్తిగా విందుచేశాడు.

పెండ్లివారికి ఆకాశరాజు ఆహ్వానించుట, కళ్యాణ వేడుక

మరునాడు ఉదయం బంధుమిత్రులతో శ్రీనివాసుడు నారాయణ పురానికి ప్రయాణమయినాడు. అక్కడ నారాయణపురంలో ఆకాశరాజు, వారి బంధుమిత్ర సపరివారమంతా నగరాన్ని రంగురంగుల పూల మాలలతో తోరణాలు కట్టి చలువ పందిళ్ళు, ముత్యాల ముగ్గులు పెట్టి నారాయణపురాన్ని వైకుంఠం లాగ ముస్తాబు చేసారు. శుభముహూర్తం సమీపిస్తోంది. శ్రీనివాసుడు తన పరివారంతో నగరానికి వస్తున్నట్లు వేగులువారు చెప్పగా ఆకాశరాజు బంధుకోటితో ఎదురేగి శ్రీనివాసుతో ఆహ్వానించి ముస్తాబు చేసిన ఏనుగుపై కూర్చుండబెట్టి మంగళ వాయిద్యాలతో విడిది గృహానికి తోడ్కొని వచ్చాడు. ఆ రాత్రి ఇరువైపుల వారికి ఘనంగా విందు జరిపించారు. అటు పిమ్మట వశిష్ఠులవారు పట్టపుటేనుగుపై శ్రీనివాసుని కూర్చుండబెట్టి నారాయణపురం ముఖ్య వీధుల గుండా శ్రీనివాసుని ఊరేగించి, ఆకాశరాజు ధరణీ దేవిచే వరునికి హారతి ఇచ్చి వరపూజ చేసి కళ్యాణ మండప౦పై ఆశీనుని చేశారు.

శ్రీనివాసుని వైపు వశిష్ఠులవారు, ఆకాశరాజు వైపు బృహస్పతులవారు వేదమంత్రాలతో పౌరోహిత్యం నెరపుతున్నారు. స్వామి పుష్కరిణినుండి ముత్తైదువులచే తీసుకువచ్చిన పవిత్ర జలాలతో శ్రీనివాసుని సుకుమార పాదాలను ఆకాశరాజు ధరణీదేవి కడిగినారు. పద్మావతిని తోడ్కొని తెచ్చి శ్రీనివాసునికి ఎదురుగా కూర్చుండబెట్టిరి. ఆకాశరాజు ధరణీదేవి శ్రీనివాసుని చేతిలో సువర్ణ పాత్రతో నీరుపోసి కన్యాదానం చేసారు.

శుభముహూర్త ఘడియలు వచ్చినాయి. వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణములు కట్టుచుండగా వేదములు చదివినారు; మంగళ వాయిద్యాలు మ్రోగినాయి. శ్రీనివాసుడు పద్మావతీ కంఠానికి మంగళసూత్రం కట్టినాడు. ముత్తైయిదువులు ఇద్దరి చేత రత్నాల తలంబ్రాలు వేయించి దండలు మార్పించినారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. యీ విధంగా శ్రీనివాస పద్మావతీ కళ్యాణవేడుక అతి వైభవంగా లోకపాలకుల, అష్టదిక్పాలకుల, ఋషిపుంగవుల సమక్షంలో జరిగింది.

శ్రీనివాస పద్మావతుల కళ్యాణం కన్నులారా చూచితిమి గదా యని సంతసించి వధూవరులను సువర్ణాక్షతులు వేసి దీవించారు. ఈ జన్మలో శ్రీనివాసుని కళ్యాణం చూచినందుకు వకుళమాళిక ఆనందం అంతాఇంత కాదు.

ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునికి వరకట్నంగా కోటి వరహాలు, పట్టుబట్టలు, బంగారు కిరీటం, రత్నాలు పొదిగిన పతాకహారములు, బంగారు కంటెలు, భుజ కీర్తులు, చేతి కంకణములు, వుంగరాలు, వజ్రకవచము మొదలగు సర్వాభరణములు అందరి సమక్షమున సమర్పించినాడు. హోమాది వివాహ కార్యక్రమం, అరుంధతీ నక్షత్ర దర్శనం పూర్తయిన తర్వాత శ్రీనివాసుడు కుబేరుని చేత దానధర్మాలు, విప్రులకు సంభావనలు ఇప్పించి, వారి ఆశీర్వాదములు పొందాడు. ఈ విధంగా పద్మావతీ శ్రీనివాసుల మహోత్సవం నిరాటంకంగా జరిగినందుకు ఇటు బ్రహ్మాది దేవతులు, అటు ఆకాశరాజు బంధు మిత్రులూ అమితానందం పొందారు. లక్ష్మి కళ్లవెంట ఆనందబాష్ప బిందువులు రాలాయి.

మరునాడు వరుని తరపువారంతా పద్మావతీ శ్రీనివాసులతో వేంకటాచలానికి ప్రయాణానికి సిద్ధ మయ్యారు. ఆకాశరాజు ధరణీదేవి, తొండమానుడు, వసుధాముడు ఆనందబాష్పాలతో దాసీజనంతో నూతన దంపతులకు వీడ్కోలు చెప్పారు.

ప్రయాణమధ్యలో అగస్త్యుని ఇంట విశ్రాంతి

వెంకటాచలంకు వెళ్ళుచుండగా మార్గ మధ్యంలో అగస్త్యులవారి ఆశ్రమం తగిలింది. అగస్త్యులవారు పరమానందమొంది వారందరిని ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చాడు. అప్పుడు శ్రీనివాసునకు ఒక సందేహము వచ్చి "ఆర్యులారా! వివాహమైన ఆరు మాసములవరకు నూతనదంపతులు పర్వత మెక్కకూడదు. గాన ఆరు మాసాలు ఇచ్చటనే ఉండ తలంచితిని. గాన మీ అభిప్రాయము తెలియజేయ వలేను" అని అనగా "మంచిది. నాకెట్టి అభ్యంతరం లేదు" అని అగస్త్యులవారు అనగా బ్రహ్మ, మహేశ్వరులు, దేవతలంతా అంగీకరించిరి. లక్షీదేవి కూడా అటులనే అని చెప్పగా అందరూ ఎవరినివాసములకు వారు వెళ్ళిపోయారు. లక్ష్మి కొల్లాపురం వెళ్ళి పోయినది. వకుళ వేంకటాచలమునకు వెళ్లిపోయింది.

శ్రీనివాస పద్మావతులు ఆగస్త్యాశ్రమంలో ఉన్నారు. కొంత కాలమునకు నారాయణపురం నుండి ఒక వార్తాహరుడు వచ్చి "స్వామీ! ఆకాశరాజుగారు అనారోగ్యంతో బాధపడుచున్నారు. బొత్తిగా చూపు లేదు. గాన తమకీ సంగతి చెప్ప వచ్చితిని" అనగా శ్రీనివాసుడు పద్మావతీ నారాయణపురం వెళ్లిరి. ఆకాశరాజు స్పృహలేని స్థితిలో ఉన్నాడు. శ్రీనివాసుడు తన చేతితో మామగారి శరీరాన్ని నిమిరాడు. ఆ చేతి స్పర్శతో ఆకాశరాజుకి తెలివి వచ్చి అందరినీ కలియజూచాడు. ఎదురుగా అల్లుడు, కుమార్తె, భార్య, కుమారుడు వసుధామడూ, తమ్ముడు తొండమానుడూ నిలబడి ఉన్నారు. శ్రీనివాసుని జూచి, "నాయనా శ్రీహరీ! శ్రీనివాసా! నా సోదరుడు తొండమాను, కుమారుడు వసుధాముడూ చాలా అమాయకులు. నాకు అవసానకాలం సమీపించింది. వారిని ఎలా కాపాడతావో నీదే భారం" అన్నాడు. పద్మావతిని జూచి "బిడ్డా పద్మా! నీవు శ్రీనివాసుని అడుగు జాడలలో మసలి పుట్టినింటికి, మెట్టినింటికి కీర్తి తెచ్చి సుఖంగా వుండు తల్లీ! అని శాశ్వతంగా కన్నుమూశాడు. రాజుగారి అంత్యక్రియలతో పాటు ధరణీదేవి కూడా అగ్నిలోపడి సహగమనం చేసుకున్నది.

రాజ్య పాలనకు తొండమానుడు వసుధాముడు యుద్ధము చేయుట

ఆకాశరాజు, ధరణీదేవి చనిపోగా వారికి ఉత్తర క్రియలు ముగిసిన తరువాత పద్మావతీ శ్రీనివాసులు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు. రాజులేని రాజ్యంగా నారాయణపురం ఉన్నది. పరిపాలన స్తంభించి పోయింది. రాజ్యపాలన చేయుటకు వారసులుగా ఆకాశరాజు కుమారుడు సుధాముడు, సోదరుడైన తొండమానూ రాజ్యాధికారానికై వాదులాడేరు. కడకు చిలికి చిలికి గాలివానవలె వారిద్దరూ రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికివారు యుద్ధానికి సిద్ధ మయ్యారు. తొండమానుడు ఆగస్త్యాశ్రమంలో శ్రీనివాసుని కలిసి విషయం ఎరిగించి, సహాయం కోరాడు. శ్రీనివాసుడు ఆలోచించి "మామగారూ! ఈ పరిస్థితిలో నేను మీ పక్షము వహించినచో పద్మావతి మిగుల దుఃఖించును. పైగా తండ్రి చనిపోయిన దుఃఖమింకను వదలలేదు. గాన మీకో రహస్యం చెపుతాను వినండి. ఇదిగో ఈ సుదర్శన చక్రాన్ని తీసుకోండి. యుద్ధంలో దీనిని ఉపయోగించండి. మీకు జయం కల్గుతుంది" అని చెప్పి తన సుదర్శన చక్రాన్ని ఇచ్చి పంపించాడు. మరి కొంతసేపటికి వసుధాముడు వచ్చి "బావా! శ్రీనివాసా! రాజ్య పాలన వారసత్వం గురించి నాకు పినతండ్రి గారైన తొండమానునకూ యుద్ధం జరిగే ప్రమాదమున్నది. మేమిద్దరం అందుకు సిద్ధంగా ఉన్నాము. గాన నీవు నా పక్షం వుండి నాకు న్యాయం జరిగేలాచూడు" అని ప్రాధేయపడ్డాడు. తమ్ముని దీనావస్థకు అందునా చిన్నవయసు వాడగుటచే పద్మావతి శ్రీనివాసుని బ్రతిమలాడింది. శ్రీనివాసుడు సరే నీ పక్షంలో వుండగాలను అని మాట ఇచ్చి వసుధామునితో నారాయణపురానికి వెళ్ళాడు.

నారాయణపురములో తొండమాన్ చతురంగ బలాన్ని సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు శ్రీనివాసుని సహాయంతో వసుధాముడు కూడా సైన్యాన్ని బంధుమిత్రులను కూడగట్టి బయలుదేరాడు. ఇరు పక్షాలూ యుద్ధభేరీలు మ్రోగించారు. యుద్ధం ప్రారంభమైంది. తొండమాన్ శ్రీనివాసుడిచ్చిన సుదర్శన చక్రాన్ని వసుధాముని మీదకు ప్రయోగించాడు. సుదర్శన చక్రం మహా శక్తివంత మైనద; ముల్లోకాలనూ నాశనం చేయగలదు. జగన్నాటక సూత్రధారి యైన ఆ శ్రీనివాసుడు రివ్వున వసుధాముడు పైకి వస్తున్న చక్రాన్ని అడ్డుపడ్డాడు. వెంటనే శ్రీనివాసుడు మూర్ఛతో ఒరిగిపోయాడు. ఆ దృశ్యాన్ని చూచి ఇద్దరూ వణికిపోయారు. తాత్కాలికంగా యుద్ధం ఆపు చేసి ఇద్దరూ శ్రీనివాసునికి శీతోపచర్యలు చేస్తున్నారు. కొంతసేపటికి శ్రీనివాసుడు మేలుకొని ఉపచర్యలు చేస్తూ ఉన్న ఇద్దరినీ చూచాడు. ఇద్దరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. అంత తొండమానుడు "ప్రభూ! యుద్ధం కక్షను పెంచుతుంది. నేను సుదర్శన చక్రాన్ని వసుధామునిపై ప్రయోగించగా నీవు అడ్డుతగిలావు. అందువలన నీకీ మూర్ఛ నా వలన వచ్చింది. నేను నీకు మహాపచారం చేసాను. పాపాత్ముడను నాకీ రాజ్యం వద్దు. వసుధామునికే ఇచ్చి వేయండి. పాప పరిహారానికి నేను కాశీకు పోయెదను" అని కన్నీరు తెచ్చుకున్నాడు.

శ్రీనివాసుడు వసుధాముని చూచి "విన్నావా, వసుధామా! నీ పినతండ్రి మాటలు? నీ తండ్రి పరలోకమేగెను. పినతండ్రి విరక్తుడై కాశీకి పోతున్నానంటున్నాడు. గనుక తగిన ఉపాయం నీవే ఆలోచించమన్నాడు.

"జగద్రక్షా! నన్నురక్షించబోయి నీవు ప్రమాదానికి గురి అయ్యావు. అందువలన నేనూ పాపాత్ముడ నయ్యాను. పాప పరిహారార్ధం కాశీరామేశ్వరాది పుణ్యతీర్థాలకు పోతాను. యీ రాజ్యభారమంతా పినతండ్రి గారికే ఇచ్చివేస్తాను" అని శ్రీనివాసుని పాదాలకు నమస్కరించాడు.

ఇద్దరకూ రాజీ పెట్టడానికి ఇదే మంచి అదను అని శ్రీనివాసుడు గ్రహించి ఇద్దరకూ నచ్చచెప్పి రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి, ఇద్దరికీ పంచాడు జగన్నాధుడు.

తొండమానునికి విశ్వరూపం చూపుట

తొండమానుడు పరమ విష్ణుభక్తుడు. భగవంతుని స్మరించని ఘడియలేదు. శ్రీనివాసుడు శ్రీమహావిష్ణువని పద్మావతి వివాహసమయాన్న వచ్చిన బ్రహ్మమహేశ్వరాది దేవతలవలన విన్న తరువాతనే నమ్మకం కలిగింది. సుదర్శన చక్రం శ్రీహరికే వుంటుంది. అది కూడా తన నమ్మకానికి బలం చేకూర్చింది. ఒకనాడు శ్రీనివాసుని దర్శించి "జగత్కర్తా! యీ పాప పంకిలం నుండి నన్నువిముక్తుణ్ణి చెయ్యి స్వామీ. నన్నునీలో చేర్చుకో శ్రీనివాసా!" అని ప్రార్థించాడు.

తొండమానుని భక్తి శ్రద్దలకు శ్రీనివాసుడు సంతసించి, తన విశ్వరూపాన్ని చూపించాడు. ద్వాపరయుగంలో కౌరవ సంహారం తరుణంలో విరక్తుడైన అర్జునునికి తన విశ్వరూపాన్ని చూపించాడు గదా! అదే విధంగా ఈ కలియుగంలో తొండమానునికి విశ్వరూపాన్ని చూపి "మామగారూ! నన్ను మీరు ఇంతకాలం సామాన్య మానవునిగా చూసారు. కొన్ని కారణాల వల్ల నేనీ లోకానికి రావలసి వచ్చింది. పద్మావతితో వివాహం జరిగింది. నేను ఈ కలియుగం ఆఖరివరకూ వేంకటాద్రి పర్వతంపై వేంకటేశ్వర నామంతో వెలసియుంటాను. గాన నాకూ, లక్ష్మీ దేవికీ, పద్మావతికి నివాస యోగ్యము కొరకు ఒక దేవాలయమును నిర్మించు. ఆకాశరాజు రాజ్యాన్ని తమ్ముడవైన నీవు, కుమారుడైన వసుధామూడూ సమంగా పంచుకున్నారు గదా, పద్మావతి జ్వేష్ఠ పుత్రిక అయి కూడా ఆమెకు పిత్రార్జిత మేమియూ ముట్టలేదు. గాన అందుకొరకై నీవు వెంకటాద్రిపై మాకు నివాస మేర్పరుచు. ఆ వేంకటాద్రిపై వరాహస్వామి నివసించి యున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి నా కనుకూలమైన స్థలాన్ని చూపించమని అడిగితే వరాహస్వామి స్థలం చూపిస్తాడు. విశ్వకర్మను పిలిపించి, రెండు పెద్ద గోపురాలు, దానికి ఏడు ద్వారాలూ, భోజన శాల, గోశాల, ధాన్యశాల, ఆస్థాన మండపం మొదలగునవి నిర్మాణం చేయించు. అప్పుడు మా ముగ్గురునీ అందు ప్రవేశ పెట్టుము" అని తొండమాన్ తో చెప్పగా "మహా భాగ్యము! నా పవిత్ర కర్తవ్యం ఎంతటి వ్యయ ప్రయాసల కైనా వెరవక నా కర్తవ్యాన్నినిర్వహిస్తాను" అని శ్రీనివాసునికి మాట ఇచ్చాడు.

విశ్వకర్మ మహా వృద్ధుడు; శాస్త్రోక్త శిల్పాచార్యుడు. తొండమానుని పిలుపు నందుకొని వేంకటా చలముపై గోపురాలు, ధ్వజ స్తంభం, పుష్ప బావి, ప్రహారీలు, కళ్యాణ మండపం మొదలగు సకల సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేసాడు. వరాహస్వామికి కూడా ఒక ఆశ్రమం నిర్మించారు.

నారదముని శ్రీలక్ష్మీదేవిని సందర్శించుట

శ్రీనివాసుడు పద్మావతితో ఆగస్త్యాశ్రమంలో వుంటున్నాడు. ఒకనాడు నారదుడు కొల్లాపురంలో తపస్సు చేసు కొనుచున్న లక్ష్మిని చూచుటకు వెళ్ళాడు. నారదుని చూచి లక్ష్మి ఉచితాసనమిచ్చి శ్రీనివాస పద్మావతుల యోగ క్షేమాలు అడిగింది. నారదుడు పెదవి విరిచి "ఏమి చేయుదు తల్లీ! ఆ పద్మావతీ దేవితోనే వుంటూ మరో ఆలోచనే లేకుండా వుంటున్నాడు. నీ మాటే మరచి పోయాడు తల్లీ. నీవు వెంటనే ఆ నారాయణుని దగ్గరకు వెళ్ళడమే మంచిది" అని నారదుడు సలహా యిచ్చాడు.

తన భర్త పద్మావతితో వివాహ సమయానికి వెళ్ళినదే కాని, తనను వదలి మరొక వివాహం చేసుకున్నప్పటి నుండీ లక్ష్మీదేవి బాధపడుతునే వుంది. పుండుపై కారం జల్లినట్లు నారదుని మాటలు తన హృదయానికి ములుకులువలె గుచ్చుకున్నాయి. కోపము కూడా ఆవహించింది. డిగ్గునలేచి, నారదుని వెంటబెట్టుకొని శ్రీనివాసుని ఆశ్రమానికి వచ్చింది.

ఆ సమయంలో శ్రీనివాసుడు పద్మావతితో వన విహారం చేస్తూ శృంగార లీలలతో వున్నాడు. ఆ దృశ్యం లక్ష్మీ దేవి చూచింది. కండ్ల వెంట బొటబొట నీళ్ళు కారినాయి. గుండె బాదుకున్నది. "ఏమిటిది నాధా? తాళి కట్టినది భార్యను కదా! మీరెంత అనురాగంతో పద్మావతిని వివాహమాడినంత మాత్రాన మీ వక్షస్థల మందు ఇన్నాళ్ళూ నివసించిన నన్ను యీ విధంగా మరచిపోవుట తగునా?" అని కన్నులెర్రజేసి కోపముతో అన్నది.

పద్మావతికి కోపం వచ్చినది. "నీవెవ్వరవు? దంపతులు ఏకాంతములో నుండగా రావచ్చునా? ఆడ జన్మ ఎత్తలేదా?" అని అడగగా, లక్ష్మీదేవి "ఓసీ! ముందు వచ్చిన చెవులకంటె వెనుకవచ్చిన కొమ్ములు వాడిగా వుంటాయి కదా! అటులనే నీకు నా భర్తపై అధికారము కలిగినదా! నా స్వామిని నీవాడు అనుచున్నావా?" అని అన్నది. "ఓసీ! కాషాయ వస్త్రాలు ధరించి ముక్కుమూసుకొని తపస్సు చేసేదానికి అగ్ని సాక్షిగా పెండ్లి యాడిన నేను భార్యను కాక నీవా భార్యవు? పోపోమ్ము అవతలకు" అని పద్మావతి గద్దించింది.

ఇలాగ వాదోపవాదాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరిలో ఏ ఒక్కరూ శాంతించడం లేదు. శ్రీనివాసుని చేతులు ఇద్దరూ లాగుతూ నా భర్త అంటే, కాదు నా భర్తయే అని తమవైపు శ్రీనివాసుని లాగుతూ కలహించుచున్నారు. శ్రీనివాసుడు ఇద్దరినీ ఎంత వారించినా వినరైరి. శ్రీనివాసునికి విసుగు జనించినది. ఇక చేయునది లేక శ్రీనివాసుడు ఏడడుగులు వెనకకు నడిచి పెద్ద శబ్దముతో శిలారూపముగా మారిపోయాడు. లక్ష్మీపద్మావతులిద్దరూ ఆ శబ్దానికి వెను దిరిగి చూడగా శ్రీనివాసుడు శిలారూపమై యున్నాడు. లక్ష్మీ పద్మావతులిద్దరూ నిర్ఘాంతపోయారు. స్వామీ, నా స్వామీ, యని తలలు బాదుకున్నారు. భోరుభోరున ఏడ్వసాగారు. అప్పుడు శ్రీనివాసుడు "ప్రియపత్నులారా! దుఃఖించ వలదు. ఇప్పటినుండి నేను వేంకటేశ్వరునిగా పిలువబడతాను. ఈ కలియుగం అంతం వరకు ఈ రూపంతోనే వుంటాను. నా భక్తుల అభీష్టాలను తీరుస్తూ వుంటాను. "

"లక్ష్మీ యీ పద్మావతి ఎవరనుకున్నావు? తొల్లి త్రేతాయుగంలో నేను రామావతారంలో వుండగా సీతను రావణుడు తీసుకొని పోవుచుండగా అగ్ని హోత్రుడు వేదవతిని మాయా సీతగా జేసి రావణునితో పంపి వనవాసము చేయించాడు. రావణ వధానంతరం అగ్ని ప్రవేశం చేయమని సీతను కోరగా అగ్ని పరీక్షకు నిలబడిన వేదవతి తననుకూడా వివాహమాడమని కోరగా అప్పుడు నీ యెదుటనే ఆమెను కలియుగంలోనే వివాహము చేసుకుంటానని మాట యిచ్చి యున్నాను గదా! ఆ వేదవతియే ఈ పద్మావతి. ఈమె నీ అంశయందే జన్మించింది" అని వేంకటేశ్వరుడు పలుకగా లక్ష్మి పద్మావతిని కౌగలించుకొని "చెల్లీ తెలియక జరిగిన పొరపాటును మన్నించమంది".

కలహము తగ్గినందుకు శ్రీనివాసుడు సంతోషించాడు. "లక్ష్మీ! నా వివాహానికి కుబేరునివద్ద ఋణము చేసి యున్నాను. ఆ అప్పు ఈ కలియుగాంతమున తీర్చవలెను. అంతవరకు వడ్డీ కట్టుచుండవలెను. గాన నీవు నా వక్షస్థలముపై ఆసీనురాలవు కమ్ము. పద్మావతి కూడా నా దక్షిణ వక్ష స్థలంలో వుండును. కాన నీ అంశంగా లక్ష్మిని సృష్టించిన పద్మ సరోవరంలో వుండునట్లు చేయుము" అని శ్రీవేంకటేశ్వర స్వామి పలుకగా లక్ష్మీదేవి సంతోషించింది.

శుకాశ్రమం సమీపమున అలివేలుమంగయను పేర ఒక అగ్రహారం, దేవాలయమును నిర్మించి అందు పద్మావతిన, పద్మాసరోవరం కట్టించి ఆ సరోవరంలో పద్మ పుష్ప మందు లక్ష్మిని వుండమని భక్తుల కోర్కెలు తీరుస్తూ వారికి ధనసహాయం చేస్తూ వుండమని ఆజ్ఞాపించాడు. శ్రీమన్నారాయణుడు రాత్రులందు శ్రీనివాసుడు మంగాపట్నానికి వస్తూ సుప్రభాత సమయంలో తిరుమలకు వస్తూ ఉంటాడు.

శ్రీనివాసుడు శిలా రూపమైయున్నచోట దేవాలయము నిర్మించుట

ఆకాశరాజు పాలించే రాజ్యము గురించి తొండమానుడు, వసుధాముడు యుద్ధము చేయగా శ్రీహరి వారలను శాంతింపజేసి రాజ్యాన్ని ఇద్దరికీ పంచి, పద్మావతికి రావలసిన స్త్రీ ధనం క్రింద తనకు ఒక దేవాలయాన్ని నిర్మించమని కోరియున్నాడు గదా! ఆ ప్రకారంగానే తొండమానుడు విశ్వకర్మచే కట్టించి వుంచిన దేవాలయములోనికి శిలగా మారియున్న వేంకటేశ్వరస్వామిని ఆలయ ప్రవేశము చేయించినాడు. ఆ ఆలయమే తిరుమల తిరుపతి మహా క్షేత్రము. ఆ ఆలయము ఏడుకొండలపైన వున్నది. దానినే సప్త గిరియని పిలుస్తూ ఉంటారు. అప్పటినుండి అది మహా పుణ్యక్షేత్రమై కలియుగ వైకుంఠంగా పిలువబడుతూ ఉంది. యీ దేవాలయం వెనుకభాగమున నరసింహస్వామికి కూడ దేవాలయాన్ని కూడా కట్టించాడు భక్తుడైన తొండమానుడు.

వకుళాదేవి పూల మాలగా మారుట

మహాభక్తురాలు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని అతి గారాబంతో లాలించి, పోషించిన యశోద కలియుగంలో వకుళగా వుంది హరినామ స్మరణతో వరాహస్వామికి సేవలు చేస్తూ, శ్రీనివాసుని ఆదరించి వివాహ కార్యక్రమమంతా తన చేతులపై నడిపించిన వకుళాదేవి. శ్రీనివాసుడు శిలారూప మవగా వకుళ పూలమాలగా మారి వేంకటేశ్వరస్వామి కంఠాన్ని అలంకరించి ధన్యురాలయింది.

No comments:

Post a Comment

Viveka Sloka 21 Tel Eng

Telugu English All తద్వైరాగ్యం జిహాసా యా దర్శనశ్రవణాదిభిః । (పాఠభేదః - జుగుప్సా యా) దేహాదిబ్రహ్మపర్యంతే హ్యనిత్యే భోగవస్తు...