భగవంతుని ధ్యానము
నిర్గుణ పరమాత్మను ప్రార్ధించుటకు
కారణము "అహం బ్రహ్మోస్మి" అనే
సత్యాన్ని తెలిసికోవడానికి. "నేను
బ్రహ్మన్" అనుకునే ధ్యానం త్యాగం,
కామం, నియమనిష్ఠలు, యోగ,
పూజ మొదలగువాటితో కూడినది.
ధ్యానం నిర్విఘ్నంగా సాగాలంటే
మనస్సుని బాహ్య విషయాల
నుండి మరల్చి ఆత్మ వైపు తిప్పాలి.
దానివల్ల బాహ్య విషయాలకు తటస్థంగా
ఉంటాము. ఇది తప్ప వేరే మార్గం లేదు.
ఒక్క రెప్పపాటు కాలంలో కూడా ఆత్మను
మరువకూడదు. మనస్సుని ఆత్మ లేదా
హృదయము నందు నిశ్చలంగా ఉంచడం
యోగ, ధ్యానం, జ్ఞానం, భక్తి, పూజల యొక్క
పరాకాష్ఠ.
పరమాత్మ ఆత్మ రూపేణా మన హృదయంలో
వసిస్తాడు కనుక, సదా ఆత్మయందు శరణాగతి
కలిగివుంటే అది అన్ని పూజలకన్నా మిన్న.
మనస్సు జీవ చైతన్యం. అజ్ఞానులు అది
ఒక సర్పంలా చుట్లు చుట్టుకొని వెన్నెముక
క్రిందన ఉంటుందని అంటారు. అదే కుండలిని.
ఆరు చక్రాలు యోగాలో పరిపక్వం లేనివారి
గురించి చెప్పబడినవి. మనం బాహ్యంగా
విగ్రహారాధన ఎందుకు చేస్తామంటే
మన అంతర్గతంలో పూజ చెయ్యడం
తెలియదు కనుక. ఆత్మ జ్ఞానము వలన
సర్వము తెలియబడి, జ్ఞానము పూర్ణమవుతుంది.
ఆత్మ విచారణ, అంటే దైవము యొక్క విచారణ,
చేస్తే మన ఆలోచనలు నియంత్రింపబడతాయి.
చివరికి దానిని కూడా మనస్సులోనుంచి
తీసేస్తే మనల్ని బహిర్ముఖము చేసేవన్నీ
బాధించక పరమాత్మ పూర్ణ చైతన్యము
మన మనస్సులో దర్శింపబడుతుంది.
ఇదే ముక్తి.
సదా పూర్ణమైన ఆత్మ విచారణ, యోగ,
జ్ఞానము, మతపరంగా చేసే కార్యాల
లక్ష్యం. మనస్సు బహిర్ముఖమైనప్పుడు,
ఆత్మను మరిచిపోతే మనము
జాగురూకతతో ఉండి "నేను దేహాన్ని
కాను; నేను మరి ఎవ్వరిని?" అని
విచారణ చెయ్యాలి. తద్వారా
మనస్సు తన స్వచ్చ స్థితికి తిరిగి
వస్తుంది.
"నేను ఎవ్వరిని?" అనే విచారణ
ఒక్కటే ఈతి బాధలను తొలగిస్తుంది.
ఇదొక్కటే ముక్తికి మార్గం.