Saturday, December 31, 2022

Upanishat Index


The following upanishat's have been translated by me based on the Prof.Eknath Easwaran's book on Upanishat's. Seven other upanishat's have also been translated but pending review. I will post them in the near future. At a time when Telugu language is getting side-lined it is extremely important to keep it alive. With the translation of Vemana's, Prof.Eknath Easwaran's Gita, and Prof.Eknath Easwaran's Upanishat's some of my life's goals are met. However there is more to do. As poet laureate Robert Frost said "And miles to go before I sleep", I am on a mission. Please wish me luck. Your patronage is gratefully acknowledged.

ఈ క్రింది ఉపనిషత్తులు ప్రొఫెసర్ ఏకనాథ్ ఈశ్వరన్ సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువాద౦ ఆధారంతో తెలుగులోకి నాచే  అనువాదము చేయబడినవి.  ఇంకా కొన్ని, అంటే ఏడు ఉపనిషత్తులు, కూడా నాచే అనువదింపబడినవి. ఉపేక్ష ఎందుకంటే వాటిలో ఎటువంటి తప్పులు ఉండకూడదని నా ప్రయత్నం. కొద్ది కాలంలోనే వాటిని కూడా వల/వెబ్ లో  పెట్టడం జరుగుతుంది. మన తెలుగు భాష మిక్కిలి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అనేకమైన ఒడిదుడుకులను తట్టుకొని తెలుగు భాష ఇప్పటివరకు ఉంది, ఎప్పటికీ ఉంటుంది అని మీరనుకోవచ్చు. ఉదాహరణకి https://www.andhrajyothy.com/2022/prathyekam/hyderabad-book-fair-madhurantakam-narendra-ssd-980449.html  మధురాంతక౦ నరేంద్ర  అనే నవలల రచయిత గ్రంథాలయాలు శిధిలమయ్యాయని వాపోయేరు. ఆయన బ్రాహ్మణులను తక్కువగా చూపించి  వ్రాసిన నవల ఎక్కువగా అమ్ముడుపోయిందని చెప్పారు. ఆ నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ బహుమతి ఇవ్వడం విశేషం. ఈ మధ్యకాలంలో వచ్చిన స్మార్ట్ ఫోనుల ప్రభావము వలన నవలల ఆదరణ తగ్గిందని ఆయన చెప్పారు.  ఏది ఏమైనా మనం తెలుగు భాషని  ఆదరించి పెంపొందించాలి. దానికై కృషి చేయాలి. 

పరమహంస ఉపనిషత్
కఠోపనిషత్తు
తేజోబిందు ఉపనిషత్
తైత్తిరేయ ఉపనిషత్
ఆత్మ ఉపనిషత్
చాందోగ్య ఉపనిషత్
శ్వేతాశ్వతర ఉపనిషత్

Paramahamsa Upanishat

పరమహంస ఉపనిషత్

పరమహంస ఉపనిషత్ భక్తుడు లేదా భిక్షువు ధరించే వస్తువులు సాధకునికి అవసరంలేదని చెపుతుంది. యజ్ఞయాగాదులు చేసే సంసారికుల వలె, అవి వాని స్వతంత్రకు, ప్రేమకు, జ్ఞానానికి ఊతనిచ్చే సాధనములై అంతర్ముఖుడ్ని చేస్తాయి. ఈ విధంగా ఉపనిషత్ చెప్పే ఆధ్యాత్మిక విషయాలు భౌద్ధులు చెప్పినట్లు లేదా కబీర్ దాస్ చెప్పిన గీతాలవలె ఉంటాయి.

Sloka#1
ఒకసారి నారద మహర్షి బ్రహ్మాన్ని ఇలా సంభోదించెను:
"తమరి పరిస్థితి ఎలా ఉన్నది?"
బ్రహ్మన్ ఇలా జవాబిచ్చెను:
నన్ను చేరడం అతి దుర్లభం. కోటికొక్కరు
నన్ను చేరుతారు. కానీ ఒక్కడైనా చాలు.
ఎందుకంటే అతడు పురాణాల్లో చెప్పబడే
శుద్ధమైన పరమాత్మ. అతడు నిజానికి
మహోత్కృష్టుడు. ఎందుకంటే అతడు
సదా నన్నే తలచి సేవ చేస్తాడు. కాబట్టి
నేను అతని ద్వారా తెలియబడతాను.

Sloka#2
అతడు అన్ని బంధాలను విడనాడి,
ఎటువంటి యజ్ఞాలు, యాగాలు ఆచరించడు.
అతని స్వీయ వస్తువులు అతి తక్కువగా ఉంటాయి.
మరియు పరోపకారనికై జీవిస్తాడు.

Sloka#3
అతనికి దండము, శిరోముండనము, జంధ్యములు లేవు.
అతడు మిక్కిలి చలి లేదా మిక్కిలి ఉష్ణాన్ని,
సుఖదుఃఖాలను, మానావమానాలను
శాంతంగా అనుభవిస్తాడు.
అపనిందలన వలన ప్రభావితుడు కాడు.
గర్వం, మత్సరము, ప్రతిష్ట, సంతోషము
లేదా దుఃఖము, దురాశ, క్రోధము, మోహము,
ఉబలాటము, అహంకారము మొదలగునవి
లేకుండా ఉంటాడు. ఎందుకంటే తను
దేహధారి లేదా మనస్సు కానని తెలుసు కనుక.

Sloka#4
అనుమానాలు లేదా అసత్య జ్ఞానాన్ని విడిచి
బ్రహ్మన్ తో తాదాత్మ్యము చెంది ఉంటాడు.
ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండి, మార్పు చెందక,
అఖండమై, సమస్త ఆహ్లాదానికి మరియు
సుజ్ఞానానికి కారకుడై ఉంటాడు.
బ్రహ్మనే అతని నిజ గృహము, కేశములు,
జంధ్యము. ఎందుకంటే అతడు బ్రహ్మన్ తో
అనుసంధానమై, ఏకమై ఉన్నాడు.

Sloka#5
అతడు స్వార్థానికై ఏదీ కోరుకోకుండా
బ్రహ్మంతో లీనమై శాశ్వతమైన విశ్రాంతి పొందుతాడు.
జ్ఞానము అతనికి దండమువలె ఊతనిస్తుంది.
ఎవరైతే ఇంద్రియాలకు లోబడి, భిక్షువు వలె దండాన్ని
పట్టుకొని ఉంటారో వారికి అనేకమైన బాధలు తప్పవు.
జ్ఞానోదయము పొందిన వాడే జీవన
సత్యాలని గ్రహిస్తాడు.

Sloka#6
వానికి ప్రపంచమే ఆచ్ఛాదనము;
బ్రహ్మన్ తన కంటే వేరుకాడు.
పితృదేవతలకు తర్పణాలు చేయడు;
ఎవ్వరినీ పొగడడు లేదా దూషించడు;
అలాగే ఎవ్వరిమీదా ఆధారపడడు.

Sloka#7
వానికి మంత్రజపము అవసరములేదు;
ధ్యానం చేయనక్కరలేదు.
మార్పు చెందే ప్రపంచము మరియు
మార్పు చెందని సత్యము రెండూ
అతనికి ఒక్కటే. ఎందుకంటే
అతడు సర్వంలో పరమాత్మను దర్శిస్తాడు.

Sloka#8
బ్రహ్మన్ ను పొందదలచే సాధకుడు
బంధుమిత్రులతో, ధనముతో, వస్తువులతో
స్వార్థపూరిత బంధాలను పెట్టుకోకూడదు.
వాని మనస్సు ప్రతి ఒక్క స్వార్థపూరిత ఆలోచనను వదిలిపెడితే,
ద్వంద్వాల నుండి విముక్తుడై, సుఖదుఃఖాలకు అతీతుడై,
ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుతాడు.
అట్టివానికి చెడు భావనలు ఉండవు;
అలాగే ఉల్లాసంలో రమించడు. ఎందుకంటే వాని
ఇంద్రియాలు పరమాత్మయందే కేంద్రీకరింపబడి ఉంటాయి.
అతడు పరమాత్మతో అనుసంధానమై
పరిణామము యొక్క గమ్యాన్ని పొందుతాడు.
నిజంగా అతడు పరిణామము యొక్క లక్ష్యాన్ని చేరుతాడు.

Sunday, December 25, 2022

Katha Upanishat





కఠ ఉపనిషత్















మొదటి భాగము



ఒకానొకప్పుడు వాజస్రవసుడు తన
ఆస్తినంతటిని ఉత్తమ గతులకై దానము
చేయుచుండెను. అతనికి నచికేతుడనబడే
కొడుకు గలడు. నచికేతుడు శాస్త్రముల మీద
అపారమైన శ్రద్ధ గలవాడు. తన తండ్రి
ఇస్తున్న దానాలను చూసి నచికేతుడు
"పాలు ఇవ్వలేని గొడ్డు ఆవులను దానమిస్తే ఏమి
పుణ్యం ?" అని తలచెను. తన తండ్రిని
"నన్ను ఎవరికి దానం చేస్తావు?" అని పదే
పదే అడిగెను. కృద్ధుడైన తండ్రి
"నిన్ను యమునికి ఇస్తాను" అని పలికెను.

నచికేతుడు ఇలా ఆలోచించెను:
"నేను ప్రప్రథముడుగా -- ఎంతో మంది
పూర్వము మరణించినప్పటికీ--యమలోకానికి
వెళ్ళి యముని చూస్తాను"

"నా పూర్వీకులు ఎలా ఉన్నారో, ప్రస్తుతం
ఉన్నవారి గతి ఏమిటో తెలిసికొంటాను.
జొన్న గింజ పరిపక్వము చెంది నేల మీద
పడి మొక్కగా మొలుస్తున్నట్లు"

నచికేతుడు యమలోకానికి వెళ్ళెను. కానీ
యముడు అక్కడ లేడు. మూడు రోజులు
తరువాత యముడు తిరిగివచ్చి ఇలా
పలికెను:

"ఒక ఆధ్యాత్మిక అతిథి ఇంటికి వచ్చినపుడు,
ఒక ప్రకాశవంతమైన జ్యోతిలా అతనిని
ఆహ్వానించి, కాళ్ళు కడుక్కోవటానికి
జలమివ్వాలి. అలా చేయనివారు
అజ్ఞానులు. వారి ఆశలు తీరవు;
పుణ్యం క్షీణిస్తుంది; వారి సంతతి, పశువులు
వృద్ధినొందవు. "

యముడు: ఓ ఆధ్యాత్మిక అతిథీ! నీవు
మూడు రోజులు పడిన కష్టానికి
బదులుగా మూడు వరాలిస్తాను. కోరుకో.

నచికేతుడు: యమధర్మరాజా! నా
మొదటి కోరిక నా తండ్రి కోపం ఉపశమించి,
నన్ను మునపటిలాగే గుర్తించి, ప్రేమతో
నన్ను అక్కువ చేర్చుకోవాలి.

యముడు: ఉద్దాలక అరుణులకి పుత్రుడైన నీ తండ్రి
నిన్ను పూర్వములాగే ప్రేమిస్తాడు. నువ్వు
మృత్యువు కోరల నుండి క్షేమంగా
బయట పడ్డావని తెలిసి ప్రశాంతంగా నిద్రిస్తాడు.

నచికేతుడు: నువ్వు లేని కారణాన స్వర్గంలో మృత్యు భయం
లేదు. అలాగే జరామరణాలు లేవు. ఆకలి దప్పికలు
లేక స్వర్గలోకస్తులు ఆనందంగా ఉంటారు.

నీకు స్వర్గం పొందుటకై చేసే యజ్ఞము తెలుసును.
యమధర్మరాజా, నా రెండవ కోరికగా, ఆ యజ్ఞ
విధానాన్ని నాకు బోధించు.

యముడు: అవును నచికేతా నాకా యజ్ఞం
తెలుసు. నీకది బోధిస్తాను.

యముడు యజ్ఞ వాటికను ఎలా తయారు చెయ్యాలో,
ప్రపంచమును ఆవిర్భవింపజేసే అగ్నిని ఎలా ఉపాసన
చెయ్యాలో బోధించెను. నచికేతుడు ఆ యజ్ఞ విధానాన్ని
తిరిగి అప్పజెప్పడంతో సంతుష్టుడై యముడిలా పలికెను:

నీకొక ప్రత్యేకమైన వరాన్నిస్తాను. ఇకనుంచి ఈ యజ్ఞము నీ పేరు మీద
పిలవబడుతుంది. అలాగే ఈ దివ్యమైన హారాన్ని స్వీకరించు.
ఎవరైతే ఈ యజ్ఞాన్ని మూడు మార్లు చేసి; తమ తలిదండ్రులు, గురువులను
పూజించి; శాస్త్ర పఠనము, యాగాలూ, దానాలూ చేస్తారో వారు జనన
మరణాలను అధిగమిస్తారు. బ్రహ్మన్ నుంచి పుట్టిన అగ్ని దేవతను
కొలిచి వారు శాంతిని పొందుతారు. ఈ మూడు కర్మలను సంపూర్ణమైన
జ్ఞానంతో ఎవరాచరిస్తారో వారు మృత్యు భయం నుండి విముక్తులై,
దుఃఖాన్ని పొందక, స్వర్గలోకం చేరుతారు.

ఇక మూడవ వరము కోరుకో

నచికేతుడు: ఒకడు మరణిస్తే ఒక సందేహం కలుగుతుంది:
కొందరు అతనికి ఉనికి ఉందని అంటారు. మరికొందరు
లేదు అంటారు. నాకు ఏది సత్యమో తెలుపు. ఇదే
నే కోరుకునే మూడవ వరము

యముడు:ఈ సందేహము పూర్వము దేవతలకు కూడా కల్గెను.
మృత్యువు యొక్క రహస్యం తెలిసికోవడం మిక్కిలి కష్టం.
కాబట్టి నీవు వేరే వరమేదైనా కోరుకో

నచికేతుడు: నాకు నీకన్నా ఉత్తమమైన గురువు తెలియడు. దీనిని
మించిన కోరిక నాకు లేదు.

యముడు:చిరకాలం జీవించే సంతతిని కోరు; పశువులు, ఏనుగులు,
గుర్రాలు, బంగారం, భూమి కావలసినంత కోరు.
నీ ఆయుష్షు పెంచమని కోరు. నీకు తోచినది
ధనము, ఆయుష్షుతో పాటు కోరుకో. ఒక గొప్ప
రాజ్యానికి రాజవ్వాలని కోరుకో.
నిన్ను సంగీతముతో మురిపించి, నీతో రథంలో
కదిలే అందమైన వనితలను కోరుకో. కానీ
మృత్యువు యొక్క రహస్యాన్ని మాత్రం కోరకు.

నచికేతుడు: నీవిచ్చే సుఖాలు ఈ రోజు ఉండి రేపు పోయేవి.
అవి ప్రాణ శక్తిని క్షీణింప చేస్తాయి. భూమి మీద
ప్రాణం ఎంత అనిత్యం కదా! కాబట్టి నీ గుర్రాలు,
రథాలు, ఆటా పాటా నీదగ్గరే ఉంచుకో. మర్త్యుల౦దరూ
ధనం సుఖాన్నిస్తుందని నమ్ముతారని అనుకోకు.
నువ్వొకడున్నావని తెలిసి , మేమెలా ధనాన్ని కోరి అభయంతో
ఉండగలం? అందుకే నేను ఆ మూడవ కోరిక కోరేను.

అమృతుడవైన నిన్ను చూసి, జరామరణాలు
పొందే నేను క్షణికమైన ఇంద్రియ సుఖాలకై దీర్ఘాయుష్షుతో
ఎలా రమించగలను? కాబట్టి యమధర్మరాజా,
నా ఈ సందేహాన్ని నివృత్తి చెయ్యి:
మరణము తరువాత మనిషికి ఉనికి ఉంటుందా, ఉండదా?

యముడు:ఆత్మ యొక్క జ్ఞానము, ఇంద్రియ సుఖములో లేని,
పరిపూర్ణమైన ఆనందం ఇస్తుంది. ఈ రెండూ, లక్ష్యాలు
వేరైనప్పటికీ, అవి కర్మలను చేయిస్తాయి. ఆత్మ జ్ఞానము
కోరేవారు తరిస్తారు. కానీ క్షణిక సుఖాలను కోరేవారు
జీవిత లక్ష్యాన్ని సాధించలేరు. శాశ్వత ఆనందమా
లేదా క్షణిక సుఖమా అనే ఎన్నిక ఎప్పుడూ ఉన్నదే.
జ్ఞానులకు అది తెలుసు. అజ్ఞానులకు అది తెలియదు.
జ్ఞానులు మొదట దుఃఖములను అనుభవించినప్పటికీ
శాశ్వతమైన ఆనందానికై సాధన చేస్తారు. అజ్ఞానులు
ఇంద్రియాల వెంట పరిగెడతారు. నువ్వీ క్షణిక
సుఖాలను పరిత్యజించేవు నచికేతా. ప్రపంచ
రీతి నుంచి నీవు తిరోగమించి మానవాళి మరచిన
ఉన్నత లక్ష్యాన్ని పొందదలిచేవు.

జ్ఞానుల, అజ్ఞానుల మధ్య చాలా తారతమ్యముంది.
మొదట కోవకు చెందిన వారు ఆత్మ జ్ఞానం పొందుటకు
ప్రయత్నిస్తారు. రెండవ కోవకు చెందిన వారు తమ
ఆత్మలకి సుదూరంగా ఉంటారు. నీకు క్షణిక సుఖాల
మీద ఆశ లేనందున, నువ్వు నా బోధకు అర్హుడవని
భావిస్తున్నాను.

తాము అజ్ఞానులమని గుర్తించక, తమ ఉనికియందు
అహంకారంతో, భ్రాంతితో, విద్యా గర్వంతో,
గ్రుడ్డివాడు గ్రుడ్డివారిని నదిని దాటించు రీతి
ఈ ప్రపంచంలో మూఢులు మెలగుతున్నారు.
అమృతత్వము వారి భ్రాంతి వలన
ఎప్పటికీ వారిచే పొందబడదు. 'నేనీ దేహాన్ని.
అది పడిపోయిన తరువాత, నేను మరణిస్తాను' అని
వారు నమ్ముతారు. ఈ మూఢులు మరల మరల జన్మించి
నా దండనకు పాత్రులవుతారు.

ఆత్మ గురించి కోట్లలో ఒకనికి తెలియును. వారిలో
వేయికొకడు ఆత్మజ్ఞానానికై ప్రయత్నిస్తాడు. ఆత్మ
గురించి మాట్లాడేవారు అపురూపము. అదే
తమ జీవితగమ్య మనుకునేవారు బహు అరుదు.
ఎవరైతే జ్ఞానులైన గురువుల ద్వారా ఆత్మ జ్ఞానము
పొందుతారో వారు ధన్యులు.

తన స్వస్వరూపము ఆత్మ అని తెలియని వాడు
నిజముగా ఆత్మ జ్ఞానము లేనివాడు. బుద్ధితో
ఆత్మను పట్టుకోలేము. అది ద్వంద్వాలకు అతీతం.
ఎవరైతే తమను అందరిలోనూ, తమలో అందరినీ
దర్శిస్తారో వారు ఇతరులను ఆత్మజ్ఞానము పొందు
మార్గమువైపు ప్రేరేపిస్తారు. అట్టి ఎరుక తర్కము,
స్వాధ్యాయము నుండి కాక, గురువు వలననే సాధ్యము.
నచికేతా నీవు నిత్యమైన ఆత్మ గురించి తెలియగోరిన
జ్ఞానివి.

నచికేతుడు: నాకు ఐహికభోగాలు అనిత్యమని తెలుసు. వాటితో నిత్యమైన
దానిని ఎప్పటికీ పొందలేను. కాబట్టి వాటిని పరిత్యజించి,
నీ బోధతో నిత్యమైన దాని గూర్చి తెలుసుకోదలచాను.

యముడు:నీకు సమస్త కోర్కెలను తీర్చుకొనే అవకాశం -- భూమిలో
ఏకఛత్రాధిపత్యం, దేవతలు యజ్ఞయాగాదులతో పొందే
సుఖాలు, దేశాకాలాలకు అతీతమైన శక్తులు --ఇచ్చేను.
కానీ పట్టుదలతో, జ్ఞానంతో వాటిని త్యజించేవు.

జ్ఞానులు, ధ్యానం ద్వారా అభౌతికము, నిత్యమైన ఆత్మను
తమ హృదయంలో దర్శించి సుఖదుఃఖాలకు అతీతులైనారు.
ఎవరైతే తమ దేహము, మనస్సు అనిత్యమని, ఆత్మ
నిత్యమని తెలిసికొంటారో వారు శాశ్వతమైన ఆనందాన్ని
పొందుతారు. నచికేతా నీవట్టి సుఖాన్ని పొందుటకు అర్హుడవు.

నచికేతుడు: నాకు తప్పొప్పులకు, కార్యకారణములకు, భూతభవిష్యత్ కాలాలకు
అతీతమైన దానిని గూర్చి చెప్పు.

యముడు:ఓంకారము సర్వ శాస్త్రాలు, యోగములు; ఇంద్రియ నిగ్రహం,
నిరహంకారం లతో జీవనం గలవారు చెప్పేది. అది దేవతాగణానికి
పరమ పవిత్రమైనది. దాన్ని జపించి అన్ని కోర్కెలను
తీర్చుకోవచ్చు. అది సాధకులందరికీ ఊత. ఓంకారము
నిరంతరము హృదయంలో ప్రతిధ్వనిస్తే అతడు ధన్యుడు, ఆత్మ జ్ఞానము
పొందినవాడు.

సర్వజ్ఞమైన ఆత్మకి జననమరణాలు లేవు. కార్యకారణాలకు
అతీతమై ఆత్మ మార్పు లేనిది, నిత్యమైనది. దేహం పడిపోతే,
ఆత్మ మరణించదు. తాను చంపేవాడు, తాను చంపబడేవాడు అనుకునేవారు
అజ్ఞానులు. నిత్యమైన ఆత్మ చంపదు, చంపబడదు.

ప్రతి జీవి యొక్క హృదయంలో సూక్ష్మాతి సూక్ష్మంగా,
పెద్దవాటికన్నా అతిపెద్దగా ఆత్మ ప్రతిష్ఠితమై ఉన్నది.
అహంకారాన్ని వీడిన వారు దుఃఖాలను అధిగమించి,
పరమాత్మ దయతో ఆత్మ వైభవాన్ని దర్శిస్తారు.

ధ్యానంలో ఒక ప్రదేశానికి దేహం పరిమితమైనా,
ఆత్మ అన్నిచోట్లకు ప్రసరించగలదు. ఈ విధంగా
సాధకుడు తక్కినవాటిని ప్రభావితం చేస్తాడు.

ఆత్మ రూపాల మధ్య రూపము లేనిది, మార్పు
చెందే వాటిలో మార్పులేనిది, సర్వ వ్యాపకము,
ఉత్కృష్ఠమైనది, దుఃఖాలకు అతీతము.

ఆత్మ శాస్త్ర పఠనము ద్వారా, బుద్ధితో,
ప్రవచనములద్వారా తెలిసికోబడనిది.
ఆత్మ తాను ఎన్నుకున్నవారికే విదితము. వారికే
ఆత్మ సాక్షాత్కారము.

ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో, ఇంద్రియ నిగ్రహం
లేకుండా ఉంటారో, మనస్సుని నిశ్చలము
చేసుకోలేరో, ధ్యానం చెయ్యరో వారికి ఆత్మ
జ్ఞానము లభించదు.

సర్వత్ర ఉన్న ఆత్మ, పురోహితుని మంత్రములను,
వీరుని పరాక్రమమును అతిశయించి, మృత్యువుకే
మృత్యువును ఇవ్వగలదు.

హృదయంలో అహంకారం, ఆత్మ వ్యవస్థితమై
ఉన్నాయి. ఆ రెండూ తీపి చేదు అనుభవాలను
పొందుతాయి. అహంకారం తీపిని ఆనందించి,
చేదును తిరస్కరిస్తుంది. ఆత్మ తీపి చేదులను
సమానంగా ఆస్వాదిస్తుంది. అహంకారం అంధకారంలో
ఉంటుంది; ఆత్మ ప్రకాశంలో భాసిస్తుంది.
ఇది పరమాత్మ స్వరూపమైన అగ్నిని ధ్యానించు
జ్ఞానులు, సంసారులు చెప్పినది.

నచికేత అనే అగ్నితో అహంకారాన్ని మండించి, భయానకమైన
పరిచ్చిన్నము నుండి సంపూర్ణమైన,
మార్పులేని స్థితిని పొందుదాము.

ఆత్మ రథాన్ని అధిరోహించిన రథికుడు; దేహము రథము;
బుద్ధి రథ సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియాలు గుర్రాలు;
కోరికలు రహదారులు. ఆత్మని దేహము, మనస్సు, ఇంద్రియాల
సమూహమని తప్పుగా అర్థం చేసికొంటే సుఖాలలో
ఆనందించి, దుఃఖాలలో విచారమును అనుభవించక తప్పదు.

విచక్షణ లేకపోతే, మనస్సు క్రమశిక్షణతో లేకపోతే , ఇంద్రియాలు
కళ్ళె౦లేని గుర్రాలవలె అటుఇటు పరిగెడతాయి. కానీ
విచక్షణ కలిగి, ఏకాగ్రతతో ఉన్నవారికి ఇంద్రియాలు లోబడి
ఉంటాయి. విచక్షణ లేని వారు, ఆలోచనలను నియంత్రించు
శక్తి లేనివారు, శుద్ధమైన హృదయము లేనివారు, అమృతత్వమును
పొందలేక, మరల మరల పుట్టి మరణిస్తూ ఉంటారు. కానీ
విచక్షణ గలవారు, నిశ్చలమైన మనస్సు గలవారు, శుద్ధమైన
హృదయము గలవారు, తమ గమ్యమును చేరి, మృత్యువాత
ఎన్నటికీ పడరు. విచక్షణ కలిగిన రథికుడు, క్రమశిక్షణ
కలిగిన మనస్సనే కళ్ళెంతో, జీవిత లక్ష్యాన్ని సాధించి, పరమాత్మతో
ఐక్యమవుతాడు.

ఇంద్రియాలు గ్రాహకములనుండి; గ్రాహకములు మనస్సునుండి;
మనస్సు బుద్ధినుండి; బుద్ధి అహంకారం నుండి; అహంకారం
అవ్యక్తమైన చైతన్యము నుండి; చైతన్యము బ్రహ్మన్ నుండి వస్తాయి.
బ్రహ్మన్ మొదటి కారణము, ఆఖరి శరణ్యము. బ్రహ్మన్ మనలో
గుహ్యంగా నిక్షిప్తమైన ఆత్మ. ఎవరికైతే పరమాత్మ యందు ఏకాగ్రత,
అవ్యక్త చైతన్యము కలదో వారికే బ్రహ్మన్ విదితమవుతాడు.
ధ్యానం చైతన్య లోతులకు తీసుకువెళ్తుంది; వాక్ తో గూడిన
ప్రపంచమునుండి ఆలోచనలతో గూడిన ప్రపంచము వైపు
తీసుకువెళ్తుంది; చివరకు ఆలోచనలకు అతీతమైన ఆత్మ
జ్ఞానం వైపు నడిపిస్తుంది.

జ్ఞానులు "లే! మేల్కో! గురువును ఆశ్రయించి ఆత్మ
జ్ఞానాన్ని పొందు" అంటారు. ఆ మార్గము కత్తి మీద
సాము వంటిదని జ్ఞానులు చెప్తారు.

పరమాత్మ నామరూపాలకు, ఇంద్రియాలకు అతీతుడు;
అవ్యయము, ఆద్యంతములు లేనివాడు, దేశకాలకార్యాలకు
అతీతుడు; నిత్యము; మార్పు లేనివాడు. ఎవరైతే
ఆత్మ జ్ఞానము పొందుతారో వారు మృత్యువు కోరల ఎన్నటికీ
బడరు.

ఎవరికైతే కాలాతీతమైన ఈ యమధర్మరాజు నచికేతుల వృత్తాంతము
అనుభవానికి వస్తుందో వారు ఆధ్యాత్మిక జ్ఞానులవుతారు.
దీన్ని భక్తితో ఎవరు సామూహికంగా చదువుతారో
వారు నిత్యమైన ముక్తిని పొందుతారు.

రెండవ భాగము




స్వయంభు పరమాత్మ ఇంద్రియాలను సహజంగా
బాహ్యంగా ప్రసరింపజేశాడు. అందుకే మనము
మనలోని ఆత్మను దర్శించలేక పోతున్నాము.
ఒక జ్ఞాని అమృతత్వమును
కోరి ఇంద్రియాలను సదా మార్పు చెందే
ప్రపంచం నుండి వెనక్కు లాగి, అంతర్గతంలో
నాశనము లేని ఆత్మను దర్శి౦చును.

అల్పులు ఇంద్రియాలను అనుసరించి
జననమరణ చక్రములో చిక్కుకొంటారు.
జ్ఞానులు ఆత్మ నాశనములేనిదని
తెలిసి మార్పు చెందే ప్రపంచంలో
మార్పు చెందనిదానిని కోరుతారు.

ఆత్మ వలననే రూపము, రుచి, వాసన,
శబ్దము, స్పర్శ, రతి అనుభవించ గలుగుతున్నాము.
సర్వాంతర్యామికి తెలియనిది ఏమైనా ఉందా?
ఒకరిని తెలిసికొంటే సర్వము తెలిసినట్లే.
ఆత్మ వలననే మెలకువలోనూ, నిద్రలోనూ
సుఖం పొందగలము. దాన్ని చైతన్యమని
తెలిసికొనుట దుఃఖములకు అతీత౦గా
పయనించడం. ఎవరైతే ఆత్మ
పుష్పము వంటి ఇంద్రియాలలోని మకరందము
ఆస్వాదించునది, కాలాతీతము, నిత్యము,
అని తెలిసికొంటారో వారు అభయమును
పొందుతారు. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

బ్రహ్మన్ ధ్యానం చేసి సృష్టి కర్త అయిన బ్రహ్మను
జీవులకంటే ముందు సృష్టించెను. అతడు జీవుల
హృదయాలలో ప్రతిష్ఠితమైనవాడు. అతడే
ఆత్మ స్వరూపము. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

ఆది శక్తి అదితి, బ్రహ్మన్ యొక్క అపారమైన
చేతనత్వము నుండి పుట్టి, అన్ని సృష్టి
శక్తులకు తల్లియై, అందరి హృదయాలలో
ప్రతిష్ఠితమైనది. ఆమే ఆత్మ స్వరూపము. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

అగ్ని దేవత, రెండు కట్టెలలో బిడ్డ తల్లి గర్భము
యందు క్షేమముగా ఉండు నట్లు నిక్షిప్తమై, మనచేత
గాఢ ధ్యానములో ఆరాధింపబడి యున్నాడు. అతడే
ఆత్మ స్వరూపము. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

సూర్యునికి కారణము, సృష్టిలోని ప్రతి ప్రకాశమునకు
మూలము, అది లేనిదే సృష్టిలో ఎటువంటి
వ్యాపారములు జరగవో, అదే ఆత్మ స్వరూపము.
ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

ఇక్కడ ఉన్నది అక్కడా ఉన్నది; అక్కడ ఉన్నది
ఇక్కడా ఉన్నది. ఎవరైతే ద్వంద్వాలను లేదా బహుళత్వమును
చూస్తారో, అపరిచ్చిన్నమైన ఆత్మను దర్శించరో
వారు జనన మరణాలను పదే పదే పొందుతారు.

ఏకాగ్రతతో కూడిన మనస్సే ఐక్య స్థితిని
పొందగలదు. ఆత్మ తప్ప వేరేది లేదు.
ఎవరైతే ద్వంద్వాలను లేదా బహుళత్వమును
చూస్తారో, అపరిచ్చిన్నమైన ఆత్మను దర్శించరో
వారు జనన మరణాలను పదే పదే పొందుతారు.

బొటన వేలు పరిమాణము గల, హృదయంలో
ప్రతిష్ఠితమైన, భూత భవిష్యత్ కాలాల
పరిపాలకుని దర్శించుట వలన అభయం
పొందుతాము. అదే ఆత్మ స్వరూపము.
ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

బొటన వేలు పరిమాణము గలిగి, పొగలేని
నిప్పువలె నున్న, భూత భవిష్యత్ కాలాలను
పరిపాలించు, నిత్యము మార్పు లేనివాడే
ఆత్మ స్వరూపము. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

పర్వతము మీద పడిన వర్షము అన్ని దిక్కుల
ప్రవహించునట్లు, ద్వంద్వాలను లేదా బహుళత్వము చూడువారు
అన్ని దిక్కులకు వస్తువులవెనక పరిగెడెదరు.

శుద్ధమైన నీటిని శుద్ధమైన నీరులో పోసినప్పుడు
ఒకటైనట్లు, నచికేతా, జ్ఞాని పరమాత్మతో
ఐక్యమవుతాడు.

పదకొండు ద్వారాలతో కూడిన పురమొకటి గలదు.
దాని రాజు జన్మనెత్తని ఆత్మ. అది నిత్య ప్రకాశము.
అట్టి ఆత్మను ధ్యానించువారు దుఃఖాలకు
అతీతమై, జనన మరణ చక్రమునుండి
విముక్తి పొందుతారు. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడు ఆత్మ స్వరూపము;
వీచేగాలి ఆత్మ స్వరూపము; పూజామందిరములోని
దీపము, ఇంటికి విచ్చేసిన అతిథి ఆత్మ స్వరూపులు;
ఆత్మ మానవులలోనూ, దేవతలలోనూ, సత్యంలోనూ,
అపరిమితమైన ఖగోళం లోనూ స్థితమై ఉన్నది;
నీటిలో చరించే చేప, భూమిపై మొలిచే మొక్క,
పర్వతమునుండి పుట్టిన నది ఆత్మ స్వరూపములు.
ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

పూజింపదగు ఆత్మ హృదయంలో స్థితమై
శ్వాసను పాలిస్తుంది; ఇంద్రియాలు తమ శక్తులు
దాని వలననే అని తలుస్తాయి. అది దేహమునుండి
నిష్క్రమిస్తే ఇక మిగిలింది ఏమిటి? ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

మనము జీవించి యున్నది ఉచ్ఛ్వాస నిశ్వాస
వలన కాదు; శ్వాసను నడిపించే వాని వలన.

నచికేతా, ఇప్పుడు నీకు అదృశ్యమైన,
నిత్యమైన బ్రహ్మన్ గురించి, మరణము తరువాత
ఆత్మ స్థితి గురించి బోధిస్తాను. ఆత్మ జ్ఞానము
లేనివారిలో కొందరు మానవులిగా,
కొందరు జంతుజాలములుగా, వారి పరిణామ క్రమమును
బట్టి పుడతారు.

మనం నిద్రించినపుడు మేల్కొని యున్నది,
కలలలో ఇంద్రియాలు వా౦ఛి౦చే వాటి రూప
కల్పనము చేసేది, శుద్ధమైన ప్రకాశము గలది
అమృతమైన బ్రహ్మన్. అతనియందు సృష్టి
సమస్తము ఉన్నది. అతనిని దాటిపోవ
శక్యము కాదు. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

అగ్ని ఏ విధముగా తాను మండించే వాటి రూపాలను
పొందుతుందో, అదే విధముగా ఆత్మ తాను౦డే
జీవుల శరీరాకృతిని పొందుతుంది. ఎలాగైతే
గాలి వివిధ వస్తువులలో వివిధ ఆకృతి గల్గి యుండునో
అలాగే ఆత్మ తాను౦డే జీవుల శరీరాకృతిని పొందుతుంది.

ఎలాగైతే ప్రపంచానికి కన్ను వంటి సూర్యుడు మన
దృష్టిలోపమో లేదా వస్తువుల వలననో ప్రభావిత
మవ్వడో అలాగే అన్ని జీవులలో స్థితమైన ఆత్మ
చెడుతో కళంకమవ్వదు. ఆత్మే పరమ ఉత్కృష్ఠము.

రాజాధి రాజైన ఆత్మ తన అద్వితీయమునుండి
సమస్తమును తయారు చేసెను. ఎవరైతే
తమ హృదయంలో ఈ నిత్యమైన ఆత్మను
దర్శిస్తారో వారికి ఎనలేని ఆనందము కలుగుతుంది.
ఇంకెవరికీ కాదు.

మారే వస్తువులలో మారనిది, శుద్ధ చైతన్యము,
జీవుల చైతన్యమునకు మూలము, సర్వుల
పూజలను మన్నించేది ఆత్మ. ఎవరైతే
తమ హృదయంలో ఈ నిత్యమైన ఆత్మను
దర్శిస్తారో వారికి ఎనలేని ఆనందము కలుగుతుంది.
ఇంకెవరికీ కాదు.

నచికేతుడు: నేను ఈ పరమానంద భరితమైన, ఉత్కృష్ఠమైన,
అనిర్వచనీయమైన, జ్ఞానులకు తెలిసిన ఆత్మను
ఎలా తెలిసికోగలను? అది కాంతి పుంజమా లేక
కాంతిని ప్రతిబింబించేదా?

యముడు:సూర్యుడు, చంద్రుడు, మెరుపు, భూమి మీద అగ్ని
సమస్తము ఆత్మ యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబిస్తాయి.
అది ప్రకాశిస్తే, అన్నీ ప్రకాశిస్తాయి.

జీవితము అశ్వత్థ వృక్షము వంటిది. దాని వేళ్ళు మీదన, కొమ్మలు
క్రిందన వుంటాయి. అమృతుడైన బ్రహ్మన్
దాని నిజమైన వేరు. అతని వలననే సర్వ లోకాలూ
జీవించి ఉంటాయి. అతనిని ఎవరూ అధిగమించ లేరు.
ఆత్మ పరమ ఉత్కృష్ఠము.

సృష్టి బ్రహ్మన్ నుండి ఆవిర్భవించింది. అతనిలోనే
చలిస్తుంది. అతని శక్తివలన పిడుగు వలె ప్రకంపిస్తుంది.
అతనిని తెలిసినవారు మృత్యువును అధిగమిస్తారు.

అతని భయము వలన అగ్ని మండుతుంది, సూర్యుడు
ప్రకాశిస్తాడు, మేఘము వర్షిస్తుంది, గాలి వీస్తుంది,
మృత్యువు కబళిస్తుంది.

బ్రహ్మన్ గూర్చి తెలియని జీవికి, మరణించిన
తరువాత మరల దేహమును
ధరించి పునర్జన్మము పొందక తప్పదు.

బ్రహ్మన్ శుద్ధమైన హృదయము గలవారిలో అద్దములోని
ప్రతిబింబములా,
పితృలోకములో కలలోలాగ, గంధర్వ లోకములో
నీటి ప్రతిబింబములో, బ్రహ్మన్ యొక్క లోకంలో
ప్రకాశవంతముగా చూడబడతాడు.


ఇంద్రియములు ఆత్మ కన్న వేరని, వాటి
అనుభవము క్షణికమని తెలిసిన
జ్ఞానులు విచారము పొందరు.

ఇంద్రియాల మీద మనస్సు; మనస్సు మీద
బుద్ధి; బుద్ధి మీద అహంకారం; అహంకారం మీద
అవ్యక్తము; దాని మీద గుణములులేని,
సర్వాంతర్యామి అయిన బ్రహ్మన్ ఉన్నాడు.
అతనిని తెలిసికొన్నవారికి జనన మరణ
చక్రంనుండి విముక్తి కలుగుతుంది.

అతనికి ఒక రూపం లేదు. రెండు కళ్ళతో ఎప్పటికీ
చూడలేము. ఎవరైతే ఇంద్రియ నిగ్రహము కలిగి
ఉంటారో, ధ్యానంతో హృదయం పరిశుద్ధంగా
ఉంచుకొంటారో వారికి తన దర్శనమిస్తాడు.
అతనిని తెలిసికొన్నవారికి జనన మరణ
చక్రంనుండి విముక్తి కలుగుతుంది.

పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధులను
నిశ్చలముగా చేయుట పరమోత్తమైన స్థితి
అని జ్ఞానులంటారు. దానిని యోగ అంటారు.
యోగులు పూర్తి నిశ్చలనముతో,
జీవ ఐక్యముతో, ఎప్పటికీ వేర్పాటు లేక
ఉంటారు. ఆ స్థితిని సదా పొందనివారిలో ఐక్య స్థితి
వస్తూ పోతూ ఉంటుంది.

ఆ ఐక్య స్థితి మాటలతో, ఆలోచనలతో, చూపుతో
పొందలేము. ఆ స్థితిలో ప్రతిష్ఠితమైన వానికి
తప్ప ఇతరులకు అది పొందడం ఎలా సాధ్యం?

అహంకారం, అపరిచ్చిన్నమైన ఆత్మ అనేవి రెండూ
దేహంలో ఉన్నాయి. నేను, నాది అనే భావములను అధిగమిస్తే ఆత్మ
దర్శనము కలుగుతుంది.

హృదయంలో ఉదయించే సమస్త కోరికలనూ
త్యజిస్తే జీవి అమృతత్వమును పొందుతాడు. హృదయం
చుట్టూ ఉన్న బంధాలన్నిటినీ త్రెంచుకొంటే
జీవి అమృతత్వమును పొందుతాడు. ఇదే శాస్త్రాల
సమగ్ర సారాంశం.

హృదయము నుండి నూటఒక్క నాడులు
ఆవిర్భవించి దేహ మంతా వ్యాపించి ఉంటాయి. వాటిలో
ఒకటి శిరస్సు మీది సహస్రారకము చేరుతుంది. ఆ మార్గము
అమృతత్వానికి తీసుకు వెళ్తుంది. తక్కినవి మరణానికి
తీసుకు వెళ్తాయి.

బొటన వేలు పరిమాణము గల పరమాత్మ అందరి
హృదయములలో స్థితుడై ఉన్నాడు. అతనిని
ముంజు గడ్డిలోని కాండము వలె, భౌతిక శరీరము
నుండి వెలికి తీయాలి.

నువ్వు ఎప్పటికీ పవిత్రము, అమృతము.

నచికేతుడు ఈ విధముగా యమధర్మరాజు నుండి
ధ్యానం గురించి సంపూర్ణముగా తెలిసికొన్నాడు.
అన్ని వేర్పాటులను అధిగమించి
బ్రహ్మన్ లో అమృతత్వమును పొందేడు.
ఆత్మ జ్ఞానము కలవారు ధన్యులు.

Friday, December 16, 2022

Tejobindu Upanishat

తేజోబిందు ఉపనిషత్

తేజోబి౦దు ఉపనిషత్ అన్ని ఉపనిషత్తులకన్నా చిన్నది. దీనికి ఆది శంకరులు భాష్యం వ్రాయలేదు. అలాగని దీనిని చిన్న చూపు చూడడానికి అవసరం లేదు. ఇది ప్రపంచానికి అతీతంగా ఉండే దానిని మనకు రామాయణ, భారతాది గ్రంధాదులను చదివే అవసరం లేకుండా సాధన ద్వారా పొందే మార్గాన్ని చెపుతుంది.

Sloka#1

ప్రజ్వలమైన బ్రహ్మం గూర్చి ధ్యానం చేద్దా౦.
అది సదా మారే సృష్టిలో మార్పులేనిది;
సమాధిలో హృదయంలో తెలిసికోబడేది

sloka#2

జీవితంలో ఉత్కృష్టమైన లక్ష్యం సాధించడానికి సాధన అవసరం.
దానిని వివరించడం మిక్కిలి కష్టం, మరియు సాధన అంతకన్నా కష్టం

Sloka#3

ఎవరైతే తమ ఇంద్రియాలను కట్టడి చేస్తారో, కోపతాపాలు లేకుండా ఉంటారో,
అహంకారంలేకుండా ఉంటారో, ఇష్టాయిష్టాలకు అతీతులో,
బంధుమిత్రులతో స్వార్థ పూరిత బంధాలు లేకుండా ఉంటారో
వారే సమాధిని పొందగలరు

Sloka#4


ఎవరైతేధ్యానంలోని మూడు అవస్థలలో
సవాలు తరువాత సవాలును ఎదుర్కొంటారో
వారికి సమాధి పొందడం సాధ్యం.
వారు ఒక గురువు వద్ద నుంచి బోధ పొంది
బ్రహ్మంతో ఐక్య మవుతారు.
అట్టి బ్రహ్మమే సర్వాంతర్యామి అయిన విష్ణువు.

Sloka#5


త్రిగుణాలు అతని నుండి ఆవిర్భవించినా
అతడు అదృశ్యం, పరి పూర్ణం.
అనేక నక్షత్రాలు అతని నుండి పుట్టినవి.
అతనికి ఒక రూపం లేదు.

Sloka#6


అట్టి బ్రహ్మన్ లో లీనం అవ్వడమంటే
అన్ని బంధాలనుండి విముక్తి పొందడం.
అదే ఆలోచనలకి, మాటలకి అతీతమైన
మన స్వస్వరూపాన్ని తెలిసికొనే మార్గం

Sloka#7


ఉజ్జ్వలమైన అట్టి బ్రహ్మన్ ని ధ్యానం చేద్దాం.
అతడే సమస్తం; అతనిని తపోధనులు
ధ్యానంతో పొందుతారు

Sloka#8


ఎవరైతే దురాశ, భయం, క్రోధాలతో బ్రతుకుతారో
వారికి బ్రహ్మన్ ని పొందడం అసాధ్యం;
ఎవరైతే పేరు, ప్రతిష్టలకై ప్రాకులాడుతారో
వారికి కూడా బ్రహ్మన్ ని పొందడం అసాధ్యం;
ఎవరైతే విద్యా గర్వంతో ఉంటారో, ప్రపంచాన్నిద్వంద్వాలతో చూస్తారో
వారికి కూడా బ్రహ్మన్ ని పొందడం అసాధ్యం

Sloka#9


కాని ఎవరైతే ద్వంద్వాలను జయిస్తారో ,
తమ హృదయాలను బ్రహ్మన్ తో నింపుకొంటారో
వారిని బ్రహ్మన్ తన అపారమైన దయతో కరుణిస్తాడు

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...