మూడవ ప్రకరణము: ఈశ్వరుడు
24
క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః
క్లేశ = చిక్కు కర్మవిపాక = కర్మసంస్కారము అపరామృష్ట్రః = బాధింపబడడు పురుషవిశేషః = విశేషుడైన పురుషుడు ఈశ్వరః = ఈశ్వరుడు
ఈశ్వరుడు (మానవదేహ యం(త్రమునకు అధిపతి) క్షేశములచేత, కర్మలచేత, వాని ఫలితములచేత బాధింపబడడు.
యోగసాధకుడై నవాడు (ఇంతకు ముందు శ్లోకములలో చెప్పబడిన విధానమున సాధన చేయువాడు) ఈశ్వరుని శరణాగతి పొందవలెను. ఈశ్వరుడు అంటే ఏమిటో ఈ క్రింద వివరింపబడుచున్నది. పరమాత్మ అంటే ఈ నృష్టి సమస్తమునూ తానుగా వ్యాపించియున్నవాడు. ఈ పరమాత్మ అనే నీటిపై తేలుతున్న మంచు గడ్డవంటిది జీవాత్మ. అంటే సమస్తమునందు వ్యాపించియున్న పరమాత్మ, జీవులలో నేను అను అంశముగా తెలియబడుతున్నాడు. ఎలాగంటే మనము చోటు (space) లో ఒక గది కడితే, గదిలో మరల చోటుంటుంది. నిజానికి గదిలోని చోటు, గది వల్ల కాక గది కట్టకముందే ఉంది. గది లోపల, గదిబయట అని చోటును మనము రెండుగా విభజించి నప్పటికినీ, చోటు నిజ౦గా విభజింపబడలేదు. మనము చోటులో గదిని కట్టడంవలన చోటు వేరైనట్టు కన్పించినా, చోటు మాత్రము ఒక్కటే. నీటి బుడగ లోపల, బయట, గాలి యుండి మధ్యలో నీటిపొర యేర్పడుతుంది. బుడగలోని గాలిని మనము వేరుగా పిలిచినా, రెండిటిలోని గాలి యొక్కటే . కాని బుడగ లోని గాలికి ఒత్తిడి (pressure) కలదు. బుడగ బయటనున్న గాలికి అ౦త ఒత్తిడి లేదు. అలాగే అంతర్యామి శరీరమందున్నప్పుడు ఆలోచనలు, ఆవేశములు, రాగద్వేషములు మొదలైనవి చెందినట్టు కనిపిస్తుంది. శరీరము వెలుపలనున్న అంతర్యామి వాటిచే కట్టుబడడు. శరీరములోపలనున్న జీవాత్మ మాత్రము పై మార్చులకు లోనగుతుంది. కాని మరల అ౦దులోని అంతర్యామి మాత్రము ఎట్టిమార్పును లేక ఉంటాడు. అతడు శరీరముద్వారా నిర్వహింపబడు పనులకు సంకల్ప, వికల్పాదులు కలిగియుండడు. పనులు జరుగుతున్నా వాటితో సంబంధము లేక ఉంటాడు. కుండకు, దానిలోని మట్టికి యున్న సంబంధము వంటిది. కుండ తయారవడానికి ముందు, కుండయిన్నపుడు, మరియు కుండబద్దలైపోయిన వెనుక మట్టి అలాగే ఉంటుంది. కుండ అనే అకారము కుండకు సంబంధించినది కాని, మట్టికి సంబంధించినదికాదు. అలాగే పగిలిపోవుట మొదలైనవి కుండకు సంబంధించినది కాని మట్టికి నంబంధించినది కాదు.
25
తత్ర నిరతిశయం సర్వజ్ఞబీజమ్
తత్ర = అక్కడ నిరతిశయం = దాటరానిది సర్వజ్ఞబీజమ్ = సర్వజ్ఞుడు అను బీజము.
ఆయనయందు సర్వజ్ఞుడు అను బీజమున్నది.
జిజ్ఞాస అనేది జీవలక్షణము. ప్రతివాడు ఎప్పటికప్పుడు ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సామాన్య రాజకీయముల నుండి మోక్ష ధర్మము వరకు సమస్తము తెలిసి కోడానికి యత్నించుచు౦టారు. ఒక కొత్త వస్తువుగాని, విచిత్ర మైన లేక అందమైన వస్తువు కనిపిస్తే ఇది ఎవరిది? దీని ఖరీదెంత? ఎక్కడ దొరకుతుంది? ఎవరు తయారు చేసేరు? ఎలా చేసేరు? మొదలైన ప్రశ్నలు పుట్టి, వాటి సమాధానము పొందడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఒక సందేహము తీరిన తరువాత, మరియొక సందేహము. ఇలా జీవి కొత్త విషయాలు తెలుసు కోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ తెలుసుకొనడానికి అంతుండదు. ఎంత తెలుసుకొన్నా, ఎప్పటికప్పుడు తెలుసు కొనవలసినది మిగిలి ఉంటుంది. ఇలాగ తెలుసుకొనుట అనేది జీవియందున్న ఒక లక్షణము. ఇది మరల మూడు అంశలుగా తెలియబడుతుంది: తెలుసుకొనువాడు, తెలిసికొనుట, తెలిసికొనవలసిన విషయము. అ౦టే ఈ మూడూ జీవియందున్న తెలిసికొనుట లేక జ్ఞానము అను లక్షణము నుండి పుట్టినవి. ఈ లక్షణమునే బీజము అంటారు. కాబట్టి నిజానికి తెలియాలంటే దీన్నే తెలుసుకోవాలి. ఇది తెలిస్తే సమస్తము తెలిసినట్టే. అంటే మనలో దేనిని తెలియుటచేత తెలిసికొనుట అను ప్రవృత్తి కరిగిపోతుందో అదే నిజమైన తెలివి. ఈ తెలిసికొను లక్షణమే సృష్టికి బీజము. మొట్ట మొదట సృష్టి జరిగినప్పుడు బ్రహ్మకు ఇటువంటి ప్రశ్నలే పుట్టియుండ వచ్చు. నేనెవరిని? నేనెక్కడున్నాను? నేనెవరినుండి పుట్టేను? నేను ఏమి చెయ్యాలి? అను ప్రశ్నలు పుట్టేయి. వెంటనే తానొక చోట ఉండడం, తనచుట్టూ తానుకాక ఇతరముండుట మొదలైనవి జరిగెను. అదే సృష్టి. ఇంతకు ముందు జరిగిన "సృష్టి" అనే వృక్షము నశించి దాని బీజమే మరల కొత్త బ్రహ్మగా మేలుకొని అంతకు ముందు జరిగిన సృష్టిలోని సత్యములే కొత్త బ్రహ్మకు స్పురణకు రాగా అతడు వాటిని ప్రశ్నలుగా జ్ఞాపకము చేసుకొనెను. తాను బయటకు వెళ్ళవలసిన పని ఉండగా, అది సవ్యముగా జ్ఞాపకముంచుకోలేని వాడు, తానెక్కడికి వెళ్ళాలని ప్రశ్శించుకోవడం వంటిది. జీవిలో సత్యములుండగా వాటని ప్రశ్నలుగా జ్ఞాపకము తెచ్చుకోవడం ద్వారా తన కర్తవ్యమును తానే నిర్ణయి౦చుకోగలడు. ఈ సత్యములన్నీ ఒకే సత్యము నుండి పుట్టినవి. అదే అన్ని సత్యములకు, లేక జ్ఞానములకు కారణమైన ఒకే సత్యము, లేక జ్ఞానము. అదే సర్వజ్ఞుడు అని చెప్పబడే పరమాత్మ యొక్క అంశ. ఇదే పైన చెప్పబడిన తెలిసికొనుట అనే లక్షణము. తనలో ఈ లక్షణము ఎక్కడ నుండి పుడుతున్నదో తెలిసినవానికి సమస్తము తెలుస్తుంది. ఎందుకంటే సమస్తము దానినుండే పుడుతున్నాయని తెలుస్తుంది. ఇది తెలిసినవానికి ఇక తెలియవలసినది ఏదీ లేదు. కనుక అతడు "నిరతిశయుడు"
26
సవూర్వేషామపి గురుః కాలేనానవచ్చేదాత్
సః = అతడు పూర్వేషాం అపి = పూర్వులయందు సహితము గురుః = ఉపదేశికుడు కాలేన అనవచ్చేదాత్ = కాలము చేత ఖండింపబడనివాడు
కాలము చేత నశింపని వాడు. కావున అతడే ( ఆ సర్వజ్ఞుడే) ప్రాచీనులకు సహితము గురువైయున్నాడు.
ఒక ఇనుప ముక్కను అయస్కాంతముగా మార్చాలంటే దానికి ముందు మరొక అయస్కాంతము కావలసి ఉంటుంది. మరల ఆ అయస్కాంతము ఎలా వచ్చి౦ది? ఇలా ప్రశ్నించుకుంటూపోగా, అయస్కాంతమునందు అయస్కాంత మను లక్షణము ఒకటి ఉండాలని తెలుస్తుంది. ఇదే అయస్కాంతమునుండి. ఇనుప ముక్కలోనికి దిగివచ్చి౦ది. బ్రహ్మ విద్యాసాంప్రదాయములో మొదటి అయస్కాంతమును తండ్రియనే ప్రజ్ఞగా గుర్తిస్తారు. రండవ అయస్కాంతమును కుమారుడనే (పజ్ఞగా గుర్తిస్తారు. మొదటి అయస్కాంతము నుండి రెండవ అయస్కాంతము పుట్టడానికి వాహికగా పనిచేసిన ఇనుపముక్కను తల్లి అనే ప్రజ్జగా గుర్తిస్తారు. దీని గూర్చి "తై త్తరయోపనిషత్తు" లోని "శీక్షావల్లి" అనే వేదసూక్త౦లో "మాతా పూర్వరూపమ్ పితోత్తరరూపమ్, ప్రజాసంధిః" అని చెప్పబడినది. మరియు యోగవిద్యాసాంప్రదాయములో ఇదే "గురువు నుండి శిష్యుడు పుట్టుచున్నాడని" చెప్పబడి౦ది. కాబట్టి ఇక్కడ "గురువు" అనేది గురువునుండి శిష్యుడికి ప్రనరించి వానిన మరల గురువుగా చేయు ఒక లక్షణమే కాని ఒక వ్యక్తి కాదు. గురువు యొక్క వాక్కుగా నుచ్చరింపబడి శిష్యునిలో ప్రవేశించు లక్షణమే నిజమైన గురువు. అ౦టే ఇక్కడ తెలుసుకొనుట అను లక్షణము వినుట అనే లక్షణముగా మేల్కొ౦టోంది. కనుకనే వినుట నభ్యసించినవాడు, సమస్తమును తెలియగలడు. ఎదుటి వానిలో వాక్కు ఎక్కడ పుడుతోంది, దానిని తానెక్కడనుండి వి౦టున్నాడు అనే విషయాలను ధారణచేయాలి. కనుకనే యోగవిద్యని "శృతి విద్య" అంటారు. గురువు శిష్యునికి చెవిలో రహస్యముగా ఉపదేశము చేయడం, దానిని శిష్యుడు గ్రహించడం "శృతివిద్య". గురువు తన వాక్కుగా తనను తానే యుచ్చరించుచుండగా, శిష్యుడు వినబడునది, వినుట, వినువాడు అను మూడు అంశాలుగా ధారణచేసి ఈ మూడింటికి కారణము తానేయని తెలుసుకొ౦టాడు. ఇదే రహస్యము. ఈ రహస్యమును తెలియడమే శిష్యుడు గురువగుట. ఇదియే "ఆచార్యపూర్వఃరూపమ్ అంతే వాన్యుత్తర రూపమ్. విద్యాసంధిః" అని శీక్షావల్లిలో గానము చేయబడినది. ఇక్కడ ఉచ్చరించువాడు ఉచ్చరించుటకు కారణము వానిలోని శ్వాస. శ్వాసలేనిదే వాక్కులేదు. శ్వాసకు కారణము తానే. తానే శ్వాసగా పుడుతున్నాడు. అ౦టే తాను మొదట శ్వాసను ఉచ్ఛరించిన తర్వాత , వాక్కుగా దిగివస్తున్నాడు . అటువంటి ఉచ్చారణనే "ఓంకారము" అంటారు. కాబట్టి శ్వాసకు కారణమైన "ఓంకారమును" ధ్యానము చేయవలెను.