Sunday, January 22, 2023

Ramana Maharshi Chapt 6

పరమాత్మ జ్ఞానము



మనస్సు అహంకారం దాల్చి,
శరీరాన్ని ఆత్మగా భావించి,
బాహ్య౦గా ప్రసరించి నప్పుడు,
దానిని హృదయ౦ను౦చి సమూలంగా తీసివేసి,
నేను అనే భావనను నియంత్రించి, విచారణ చేస్తే,
"నేను-నేను" అనే ఒక సున్నితమైన అనుభవము
వస్తుంది. అదే హృదయ కమలంలో,
పట్టణమనే శరీరంలో విరాజిల్లే ఆత్మ.
అదే పరమాత్మ కూడా. అప్పుడు మనము
మనస్సు నిశ్చలం చేసి, ఆత్మను అన్నిటిలోనూ--
బాహ్యంలో లేదా అంతరంగ౦లో -- ప్రసరింపజేసి,
సర్వవ్యాపకమైనదిగా, అన్నిటినీ అధిగమించే
పదార్థమైనదిగా అనుభవంలోకి తెచ్చుకోవాలి.
దీన్నే "శివోహం" అనబడే ధ్యానం అంటారు.
నేను శివుడను అనే భావనను నాల్గవ స్థితిగా
భావించాలి.

ఇటువంటి సున్నితమైన భావనే అనేక రీతులుగా
తెలియబడే భగవంతుడు: నాల్గవ స్థితికి అతీతం;
సర్వాంతర్యామి; హృదయంలో దీపంగా విరాజిల్లే
పరమాత్మ; ఏకాగ్రత మరియు ధ్యానంలో
తెలిసికొనబడేవాడు; అష్టాంగ పథంలో ఆరు మరియు ఏడవ
మెట్టు; హృదయాకాశంలో ప్రతిష్ఠి౦పబడినవాడు;
పరిశుద్ధమైన చైతన్యం; ఆత్మ స్వరూపం;
పరిపూర్ణమైన ఆనందం; సమస్త జ్ఞానం గలవాడు.

"నేను పరమాత్మను" అనే భావనతో
దీర్ఘమైన కాలం, సదా ధ్యానం చేస్తే హృదయాన్ని
కప్పిపుచ్చిన అజ్ఞానం తొలగి, సుస్థిరమైన
జ్ఞానోదయం కలుగుతుంది. ఈ విధంగా హృదయ
కమలంలో సత్యాన్ని దర్శించి, శరీరమనే
పురంలో ఉండేది పరమాత్మే అని గ్రహించాలి.
అట్టి పరమాత్మ అన్ని జీవులలోనూ ఉన్నాడు.
ఎందుకంటే హృదయమే అన్నిటికీ మూలం.

మన వాఙ్మయం ఇలా దాని గురించి చెప్పింది:
"ఒక ఋషి నవ ద్వారాలతో కూడిన శరీరంలో
తన్మయత్వముతో ఉంటాడు"; "శరీరం
ఒక గుడి; అక్కడ పూజింపబడేది ఆత్మ.
'నేను పరమాత్మను' అనే భావంతో
ఆ గుడిలో పూజిస్తే ముక్తి తప్పక
ప్రాప్తిస్తుంది. పంచకోశాలతో కూడుకొన్న
శరీరంలో గుహ్యంగా ఒకటుంది. అదే
హృదయాంతరిక్షం; అదే అన్నిటినీ
అధిగమించే పరమాత్మ యొక్క స్థానం. "

ఈవిధంగా పరమాత్మను తెల్పేదాన్ని
దహర విద్య అంటారు. దాన్ని
సూటిగా, తత్ క్షణమే అనుభవంలోకి
తెచ్చుకోవచ్చు.


Ramana Maharshi Chapt 5

పరమాత్మ


సర్వత్రా సత్యమైన సిద్ధాంతం:
మనలోని ఆలోచనలు, ప్రపంచంలోని
వస్తువులతో అనుసంధానమై ఉంటాయి.
ఆ ఆలోచనా సమూహాలనే మనస్సు అంటారు.
కనుక, దేహం, బాహ్య ప్రపంచం నిజానికి
మనస్సులోని ఆలోచనలు. హృదయమే
అన్ని వస్తువుల ఆవిర్భావమునకు ముఖ్య
కారణం. అటువంటి హృదయ మధ్యలో,
అనగా మనస్సు విస్తీర్ణంలో, "నేను" అనే
దివ్య చైతన్యం వశిస్తోంది. అది అన్ని జీవులలోనూ
అంతర్గతమై సర్వమునకు సాక్షియై ఉంది.
అదే వేకువ, కల, సుషుప్తి లకు ఆవల ఉండే
నాల్గవ అవస్థ

అపరిమితమైన సృష్టిలో ఆత్మ సత్యమై,
నిత్యమై, అన్ని జీవులలోనూ "నేను"
అనే స్ఫురణను, చైతన్యమును కలిగిస్తుంది.
నాల్గవ అవస్థకి ఆవల ఉండేది పరమాత్మ
చైతన్యము. అదే నాల్గవ స్థితిని
వెలుగుతో నింపుతోంది. అది ఒక దీపం లోనీ నీలి
మంటనుండి, విస్తారమైన ప్రపంచం వరకు
వ్యాపించే కాంతి వలె ఉంది.
సత్యమైన అవస్థ అనగా
సర్వత్రా కాంతితో నింపే దీపం యొక్క
సర్వ వ్యాపాకత్వము. కాంతిని విస్మరిస్తే,
అహంకారంలేని అవస్థే సత్యమైనది.
ప్రతిఒక్కరు "నేను" అని చెప్పినపుడు
తమ ఛాతీపై చెయ్యివేసి చెప్తారు. ఇదే
పరమాత్మ మన హృదయంలో ఉన్నాడనే
నిజానికి ప్రమాణం.
హృదయంలో "నేను-నేను"
అనే స్ఫురణను ప్రక్కనబెట్టి, ఆత్మను
బాహ్యంలో వెదకడం, ఒక విలువైన వజ్రాన్ని
గులక రాయి కోసం వదులుకోవడం వంటిదని
వశిష్ఠ మహర్షి అన్నారు. వేదాంతులు సృష్టి పరిపాలన
-- ఆవిర్భావము, స్థితి, లయము--చెయ్యడానికి
అనేక దేవతలు -- గణపతి, బ్రహ్మ, విష్ణు,
రుద్ర, మహేశ్వర, సదాశివ --అనవసరమని
నమ్ముతారు.

Ramana Maharshi Chapt 3-4

సృష్టి




స్మృతులు, శ్రుతుల ముఖ్య ఉద్దేశం
ప్రపంచం మిథ్య, బ్రహ్మన్ సత్యం
అని చెప్పడం. అందుకే సృష్టి
క్రమం చెప్పబడినది. దానిలో
త్రిగుణములతో కలిసి పంచభూత
సృష్టి ఎలా జరగబడినదో తెలపబడింది.
సృష్టి ఒక కలలా ఉండి, ఆ కలలో
ఆత్మను కప్పిపుచ్చి లేనిపోని ఆలోచనలు
కలుగుతాయి. సత్యం తెలపడానికి
సృష్టి మిథ్య అని చెప్పబడుతుంది.
అది జ్ఞానులకు బాగా ఎరుక.


ఆత్మ శుద్ధ చైతన్యం; అన్నిటినీ
గ్రహిస్తుంది; సర్వ ద్రష్ట. అహంకారం,
మనస్సు మొదలగునవి ఆత్మ సాధనాలు.
ఆత్మ వేరొకరికి దృశ్యము కాలేదు. వేరొకరు
దానిని గ్రహించలేరు.

అహంకారం



మనస్సు అంటే "నేను" అనే భావన.
మనస్సు, అహంకారం ఒకటే. బుద్ధి,
అహంకారం, చిత్తం, మొదలగునవి కూడా
మనస్సే. ఒక వ్యక్తి తండ్రి, తమ్ముడు, అన్న,
ఉద్యోగి అని ఎలా పిలువబడుచున్నాడో
అలాగే మనస్సుని వేర్వేరు రకాలుగా
చిత్రీకరిస్తారు. మనస్సు ఆత్మానుభవము
పొందితే కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప
కడ్డీలా ఉంటుంది. ఆత్మకు వేరే సాక్షి
లేరు గనుక అహంకారమే ఆ పని చేస్తుంది.
ఎందుకంటే మనస్సు ప్రజ్వలమైన
చైతన్యానుభవము పొందినది కనుక.
ఆత్మ హృదయంలో ఎర్రగా కాలిన
కడ్డీ లోని అగ్నిలా అసంగమై ఉంటుంది.
కానీ అది ఎల్లలులేనిది. అది స్వయంప్రకాశం.
అన్ని జీవులలోనూ ఉండేది అది ఒక్కటే.
అద్వితీయం. దాన్నే పరమాత్మ అంటాం.


ఎర్రగా కాలిన ఇనుప కడ్డీ జీవి అయితే, అగ్ని
సర్వ సాక్షి అయిన ఆత్మ,; ఇనుప కడ్డీ అహంకారం.
శుద్ధమైన అగ్ని సర్వాంతర్యామి, సర్వజ్ఞమైన
పరమాత్మ.


Ramana Maharshi Chapt 2

మనస్సు


మన స్మృతి, శృతులలో మనస్సు గురించి
ఈ విధంగా చెప్పబడినది:


  • తినే పదార్థాలలో సూక్ష్మమైనది మనస్సును పోషించేది
  • ప్రేమ, క్రోధం, కామం, మదం మొదలగునవి దాని గుణాలు
  • ఆలోచన, బుద్ధి, కోరిక, అహంకారంలతో నిండినది
  • దానికి అనేక కార్యాలు చేసే శక్తి ఉన్నప్పటికీ, మనం
    చూసే జడపదార్థముల వంటిదే
  • అది జడమైనప్పటికీ, చైతన్యముతో అనుసంధానమైన
    కారణాన చైతన్యమువలె అనిపిస్తుంది; ఎలాగంటే ఒక కొలిమిలో ఇనుప
    కడ్డీని కాల్చడం వల్ల ఆ కడ్డీ ఎర్రగా రంగు మారడానికి
    కారణం అగ్నే; కానీ అగ్ని ఆ ఇనుప కడ్డీ యొక్క సహజ గుణం కాదు.
  • అది విచక్షణా జ్ఞానం కలిగి ఉన్నది
  • అది చంచలము; లక్క, బంగారముల వలె దాని
    రూపము సునాయాసంగా మారేది
  • అన్ని తత్వాలకు మూలమైనది
  • దృష్టి కంటిలో, వినికిడి చెవిలో ఉన్నట్టే
    అది హృదయంలో వశిస్తుంది.
  • అది జీవికి ప్రత్యేకతను ఇచ్చి బాహ్య వస్తువుల
    కనుగుణంగా ఆలోచనలు కలిగిస్తుంది
  • అది మెదడుతో నడపబడే పంచేంద్రియాలతో అనుసంధానమై
    "నేను ఫలానా దానిని అర్థం చేసికొన్నాను" అనే స్ఫురణను
    కలిగించేది

    ఒక పదార్థాన్ని తినవచ్చా అనే ఆలోచన మనస్సులో
    ఆవిర్భవిస్తుంది: "ఇది మంచిది. ఇది మంచిది కాదు.
    దీన్ని తినవచ్చు. దాన్ని తినకూడదు" అనే విచక్షణా
    జ్ఞానం మనస్సులో భాగమైన బుద్ధి వలన కలుగుతుంది. మనస్సే
    అహంకారం, దేవుడు, ప్రపంచము అనే త్రిపుటికి మూలం.
    మనస్సు ఆత్మలో లయమైతే దానిని కైవల్యం
    అంటారు. అది బ్రహ్మన్ ను పొందడం వంటిదే

    ఇంద్రియాలు బాహ్య వస్తువులపై ప్రసరిస్తే,
    మనస్సు అంతరంగంలో పని చేస్తుంది. బాహ్యము,
    అంతర్గతము అనే విబేధాలు శరీరానికి
    సంబంధించినవి. వాటికి పరమాత్మతో
    సంబంధం లేదు. మన శృతులు, స్మృతులు,
    ప్రపంచం మన హృదయ కమలంలో సూక్ష్మంగా
    ఉందని చెప్తాయి. నిజానికి అది ఆత్మ బోధ. అవిద్య,
    మాయ కారణాన నిద్రలో మనం అచేతనంగా
    ఉంటాము. సుషుప్తిలో స్థూల, సూక్ష్మ శరీరాలు
    ఆత్మలో లయమవుతాయి. అజ్ఞానము నుండి
    అహంకారం ఉద్భవించింది. అదే సూక్ష్మ శరీరం.
    మనస్సుని ఆత్మ వైపు త్రిప్పడానికి మనం
    సాధన చెయ్యాలి

    మనస్సు చేతనము. అది స్వతహాగా శుద్ధము,
    పారదర్శకము. కానీ ఆ శుద్ధ స్థితిలో అది మనస్సు
    అనబడదు. అపరిశుద్ధ మనస్సు వలన తప్పుడు
    ఆలోచనలు వస్తాయి. శుద్ధమైన మనస్సు, అనగా
    శుద్ధ చైతన్యము, తామసముతో కప్పబడితే
    స్థూల ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం
    కలుగుతుంది. అలాగే రజస్ తో కప్పబడితే
    అది దేహంతో తాదాత్మ్యం చెంది, "నేను"
    అనే అహంకారాన్ని ప్రదర్శించి, అదే సత్యం
    అని నమ్ముతుంది. రాగద్వేషాలతో
    కూడి అది మంచి లేదా చెడు కర్మలను ఆచరించి
    జనన-మరణ వలయంలో చిక్కుకొంటుంది. సుషుప్తిలో,
    మూర్చలో మనకు ఆత్మ గురించి ఎరుక ఉండదు.
    కానీ నిద్రనుండి మేల్కొనినప్పుడు, స్పృహ వచ్చినపుడు
    మనస్సు అనుభవంలోకి వస్తుంది. దాన్నే విజ్ఞానమని
    అంటారు. మనస్సుకి దానంతట దానికి ఉనికి లేదు.
    అది ఆత్మ వస్తువుపై ఆధారపడి ఉంటుంది. ఆత్మతో
    అనుసంధానమైనప్పుడు సుజ్ఞానమని అంటారు.
    అనాత్మతో అనుసంధానమైనప్పుడు అజ్ఞానము
    కలుగుతుంది. మనస్సు ఆత్మతో తాదాత్మ్యం
    చెంది ఆత్మవలె ప్రకాశించినప్పుడు అహం స్ఫురణ
    కలుగుతుంది. అది రాబోయే ఆత్మ జ్ఞానానికి
    సంకేతం. ఇదే ప్రజ్ఞానం. ఇదే వేదాంతంలో
    చెప్పబడిన "ప్రజ్ఞాన ఘన" అనే మహా వాక్యం.
    ఆది శంకరులు వివేకచూడామణిలో ఇలా చెప్తారు:
    "విజ్ఞానమయ కోశంలో సర్వమునకు సాక్షి, స్వప్రకాశమైన
    ఆత్మ భాసిస్తుంది. దాన్ని పొందడమే లక్ష్యంగా
    చేసుకో. అదే సత్యం. స్వానుభవంతో దానిని
    ఆస్వాదించు. అఖండమైన ఆలోచనా క్రమముతో
    దానిని ఆత్మగా తెలుసుకో"

    స్వయంప్రకాశంతో ఆత్మ ఒక్కటే సర్వత్రవ్యాపించి
    ఉన్నది. మూడు అవస్థల కాలాలు తప్పించి
    ఆత్మ శుద్ధము, నిశ్చలము. అది స్థూల, సూక్ష్మ,
    కారణ శరీరాలతో బంధింపబడనిది. అలాగే
    దృశ్యం, ద్రష్ట, దృష్టి అనే త్రిపుటి లేనిది.

    ఆత్మ వేకువలో కంటిలో స్థితమై ఉంటుంది.
    నిద్రలో మెడలో ఉంటుంది. సుషుప్తిలో
    హృదయంలో లయమవుతుంది. వీటిలో
    ముఖ్యమైనది హృదయం. అందుకే ఆత్మ
    మొదటి స్థానం హృదయమని చెప్పడం.
    కొందరు మనస్సు యొక్క స్థానం మెడ;
    బుద్ధి యొక్క స్థానం మెదడు; అహంకారం
    యొక్క స్థానం హృదయం అని చెప్తారు.
    కానీ బుద్ధి, అహంకారం మొదలగునవి మనస్సుకు
    సంబంధించినవే. సామూహికంగా వాటిని
    మనస్సు అనవచ్చు. అనేక ముని పుంగవులు,
    ఋషులు ఈ విషయంపై విచారణ చేసి
    "నేను" అనే స్ఫురణ హృదయంలోనే
    కలుగుతుందని చెప్పేరు.


Ramana Maharshi Chapt 1

నే నెవరిని ?


"నేను" వచనం అందరికీ సహజం.
"నేను వచ్చాను, నేను వెళ్ళాను,
నేను చేసాను" అనే మాటాలు తరచు
వింటాము. దాన్ని తరచి
చూస్తే, కదలికలు మొదలగు పనులు
దేహానికి సంబంధించినవి. "నేను" అనే
ఎరుక దేహానికి సంబంధించినదా?
దేహం పుట్టుక ముందు లేనిది; పంచ భూతాత్మకం;
నిద్రలో ఎరుక ఉండనిది; చివరకు
బూడిదలో కలిసి పోయేది.
"నేను" అనే భావనను అహంకారం, అజ్ఞానం,
భ్రమ, అశుద్ధం లేదా ఆత్మ అనవచ్చు.
మన స్మృతులు, శృతులు దాని మీదే
విచారణ చేసేయి. అవి చెప్పింది: అహంకారం
పోతేనే ముక్తి సాధ్యం. కాబట్టి ఎవరు దీనిని
తప్పు పట్టేది? ఎండు కర్రవలె జడమైన
శరీరం "నేను" అని భాసించగలదా? కాలేదు.
శరీరాన్ని అందుకే ప్రక్కన పెట్టి విచారణ
చేద్దాం. నిరంతరం సాగే ఆలోచనా ప్రవాహంలో,
అఖండమైన, నిశ్చలమైన, సహజమైన
"నేను,నేను" అనే ఎరుక హృదయంలో
కలుగుతుంది. దాన్ని పట్టుకొని, నిశ్చలంగా
ఉంటే, అది శరీరంలో "నేను" అనే భావనను
అంతం చేసి, చివరకు అదీ కర్పూర
హారతిలాగ కరిగిపోతుంది. ఋషులు,
గ్రంథాలు దీన్నే ముక్తి అంటారు.

అజ్ఞానమనే తెర ఎప్పటికీ ఆత్మను
కనుమరుగు చేయలేదు. అజ్ఞానులు కూడా
"నేను" అనే వాచకం వాడుతారు.
వారిలో "నేను ఆత్మను" లేదా
"నేను పరిశుద్ధమైన చైతన్యమును"
అనే సత్యాలను కప్పిపుచ్చి దేహంతో
తాదాత్మ్యం చెందుతుంది.

ఆత్మ స్వప్రకాశం. దాన్ని ఊహించే
ఆలోచన బంధానికి కారణం. ఎందుకంటే
ఆత్మ ప్రకాశం వెలుగు-నీడలను అధిగమిస్తుంది.
అందుకే మనస్సుతో దాన్ని పట్టుకోలేం.
ఆత్మ విచారణ భక్తి మార్గంలో ముక్తికి,
అనిర్వచనీయమైన ఆనందానికి దారి
తీస్తుంది. ఋషులు అటువంటి భక్తి
పూర్వక ఆత్మ విచారణ వలననే ముక్తి
సాధ్యమని ప్రవచించేరు. "నేను" అనే
ఆలోచనకు కారణమైన అహంకారం
భ్రాంతికి మూల కారణం. దాని నాశనం వలన
భ్రాంతి తొలగుతుంది. ఈ విధంగా
అహంకారాన్ని తొలగించుకునే మార్గాలను
భక్తి, జ్ఞాన, యోగ లేదా ధ్యాన మార్గాలంటారు.

"నేను దేహాన్ని" అనే ఎరుకలో స్థూల,
సూక్ష్మ, కారణ శరీరాలు, పంచ కోశాలు
ఉంటాయి. ఆ ఎరుకను తొలగిస్తే, అన్ని
ప్రతిబంధకాలూ వాటంతట అవే తొలగిపోతాయి.
స్మృతి, శృతులు ఆలోచనలే బంధాలకు కారణం
అని చెప్పడం వలన, ప్రతిబంధకాలను
వేరువేరుగా తొలగించనక్కరలేదు. చివరగా
మనస్సును "నేను" అనే ఆలోచనతో
ఆత్మకు దాసోహం అయి, నిశ్చలంగా ఉండి,
ఆత్మను ఎప్పటికీ మరచిపోక ఉండడం
ఉత్తమ పద్దతి.


Saturday, January 21, 2023

Atma Upanishat

ఆత్మ ఉపనిషత్

ఆత్మ ఉపనిషత్ పురుషుని మూడు విధములుగా వర్ణిస్తుంది. మానవుడు బాహ్య ప్రపంచంలోనూ, అంతరంగంలోనూ మెలగుతాడు. అనగా శరీరంలోనూ, మనస్సులోనూ చలిస్తాడు. తక్కిన ఉపనిషత్తులు లాగే ఆత్మ ఉపనిషత్ అంతరంగం గురించి చెప్పినపుడు: ఎరుకను సూక్ష్మంగా, లోతుగా మరియు కొంచెం హాస్యంగా వివరిస్తుంది. కనిపించే సృష్టికి ఆవలనున్న దాని గురించి ఎవ్వరికీ వర్ణింప శక్యము కాదు. కానీ దాని గురించి తెలిసికొనే ప్రయత్నము మిక్కిలి ఉత్కృష్టమైనది.

అంగిరశ ఉవాచ:

Sloka#1
పురుషుడు మూడు విధములుగా విరాజిల్లుతాడు:
బయట, లోపల మరియు బ్రహ్మంగా.
చర్మము, మాంసము, వెన్నెముక, జుట్టు, చేతి వేళ్ళు,
కాళ్ళ వేళ్ళు, చీల మండ, గోళ్ళు, కడుపు, బొడ్డు, తుంటి
ఎముకలు, తొడలు, బుగ్గలు, కనుబొమలు, నుదురు,
తల, కళ్ళు, చెవులు, చేతులు, రక్త నాళాలు,
నాడులు మున్నగునవి బాహ్యము.

Sloka#2
అంతరాత్మ బయట ప్రపంచాన్ని విశ్లేషిస్తుంది. అది
భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో చేయబడినది.
అది ఇష్టాయిష్టాలకు, కష్టసుఖాలకు, భ్రమ మరియు అనుమానాలకు
లోబడి ఉంటుంది. దానికి భాష జ్ఞానము తెలుసు; నాట్యం, సంగీతం
మరియు లలిత కళలు అంటే ఇష్టం; ఇంద్రియాలు అందించే
సుఖాలను పొందుతుంది; గతాన్ని స్మృతికి తెచ్చుకొ౦టుంది;
గ్రంథాలను చదువుతుంది; అవసరమైతే కార్యం చేయడానికి
పూనుకొంటుంది.

Sloka#3
పురాణాల్లో వర్ణించే పరమాత్మను యోగ మార్గము
ద్వారా కూడా పొందవచ్చు. మర్రి విత్తనము కన్నా,
ఎటువంటి గింజ కన్నా , వెంట్రుకలో వెయ్యో
వంతు కన్నా సూక్ష్మమైన బ్రహ్మాన్ని పట్టుకోవడానికి
లేదా దర్శించడానికి సాధ్యంకాదు.

Sloka#4
పరమాత్మకి చావుపుట్టుకలు లేవు.
అతనిని కాల్చడానికి, కదల్చడానికి, పొడవడానికి,
ఖండించడానికి, ఎండబెట్టడానికి సాధ్యం కాదు.
ఆపాదించడానికి వీలు లేని ఆ పరమాత్మ సర్వానికి
సాక్షి, నిత్యము శుద్ధము, అఖండము, మిశ్రమము
కానివాడు. అతడు ఇంద్రియాలకు, అహానికి
పట్టుబడడు. ఆయనలో విభేదాలు, ఆశలు లేవు.
అతడు ఊహాతీతమై సర్వత్ర ఉన్నవాడు; అతడు
ఏ బాహ్య లేదా అంతర్కర్మా చేయడు; బాహ్యం
మరియు అంతరంగం నుండి విడిబడినవాడు;
పరమాత్మ అశుద్ధాన్ని పవిత్రం చేస్తాడు.

Friday, January 13, 2023

Taittireya Upanishat



తైత్తిరీయ ఉపనిషత్








మొదటి భాగము


శ్లోకం 1


పగలు యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
రాత్రి యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
దృష్టి యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
బలం యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
వాక్ యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
ఆకాశం యొక్క అధిష్ఠాన దేవత మాకు శాంతిని ప్రసాదించుగాక!
సర్వ శక్తులకు ఆధారమైన బ్రహ్మన్ కు వంగి నమస్కరిస్తున్నాను
నేను సత్యమే పలుకుతాను; నీతినియమాలను పాటిస్తాను
నన్ను, నా గురువును చెడు నించి రక్షించు
నన్ను, నా గురువును చెడు నించి రక్షించు

శ్లోకం 2


మనము చదవడమనే కళని పరిశీలిద్దాం;
దానికై అక్షరాలు, వాటిని పలికే విధానము, ఉఛ్చారణ తెలియాలి;
అలాగే కాల పరిమాణము, ఒత్తులు, అనుక్రమము, లయ తెలియాలి.

శ్లోకం 3


జ్ఞానమనే కాంతి మాపై ప్రసరించుగాక.
మేము పరమాత్మతో ఏకమగుగాక.
ఈ అయిదు విషయాల గూర్చి ఆలోచిద్దాం:
ప్రపంచం, తేజోమయమైన ఊర్ధ్వ లోకాలు,
విద్య, సంతతి, మరియు వాక్కు.
ఈ ప్రపంచం ఏమిటి? క్రింద భూమి, మీద ఆకాశము,
రెంటికీ మధ్య గాలి, వాటినన్నిటిని కలిపే అంతరిక్షం.
ఆకాశంలో దేదీప్యమానంగా వెలిగే ప్రపంచాలు ఏమిటి?
అగ్ని ఒక ప్రక్క, సూర్యుడు మరొక ప్రక్క, మధ్యలో
జలం, వాటిని కలిపే మెరుపులు. విద్య అంటే ఏమిటి?
గురువు ప్రక్కన కూర్చున్న శిష్యునితో సంభాషించడం,
జ్ఞానం మధ్యలో, వారిని కలిపే బోధ. సంతతి అంటే ఏమిటి?
తల్లి ఒక ప్రక్క, తండ్రి మరొక ప్రక్క, బిడ్డ మధ్యలో,
వారిని కలిపియు౦చే అ౦గాలు.

వాక్ అంటే ఏమిటి? క్రింద, మీద దవడలు,
రెంటికీ మధ్య పదాలు, వాటిని కలిపియుంచే నాలుక.
ఎవరైతే ఈ అంశాల గూర్చి ధ్యానిస్తారో వారికి
సంతతి, పశువులు, ఆహారము, జ్ఞానము నిత్యము ఉంటాయి.

శ్లోకం 4


పరమాత్మా! శాస్త్రములలో చెప్పినట్లు నీవు సమస్త జీవుల
రూపాలను ధరించావు; నాకు అమృతత్వాన్ని ప్రసాదించే
మార్గము ఎన్నుకునే జ్ఞానము ప్రసాదించు. నా
దేహమును పుష్టిగా నుంచి, నాలుకుతో తీపి మాటలు పలికించు;
నా చెవులు సదా పరమాత్మకు ప్రతీకయైన ఓంకారము
వినుగాక. పరమాత్మయందు నా భక్తిప్రేమలు వృద్ధి నొందుతూ యుండు గాక

పరమాత్మా! నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించు;
నాకు ఆహారము, ఆచ్ఛాదనము, పశువులు సమృద్ధిగా ప్రసాదించు.
సంవత్సరాంతము ప్రవహించే నదిలా నలుదిక్కుల నుండీ
శిష్యులు నా వద్దకు రాగాక; నాకు వారి ఇంద్రియాలను, మనస్సును
నిగ్రహించుటకై బోధ చేయుటకు బలమునివ్వు; ఇదే
నాకు ధనము, కీర్తుల లాగ యుండుగాక. పరమాత్మా! నేను
నీలో ప్రవేశించుటకు వీలు కలిపించు; నీ నిజ స్వరూపాన్ని
దర్శించే అవకాశము ప్రసాదించు. నీవు బహురూపములు
దాల్చే పరిశుద్ధుడవు. నీ భక్తులకు నీవే శరణ్యం. నేను నీ
భక్తుడను. నన్ను అక్కువ చేర్చుకో.


భూర్, భువస్, సువర్ అనెడివి ప్రకంపనలు.
మహాచమస్య నాల్గవ దానిని బోధించెను. అదే
పరమాత్మకి ప్రతీకయైన "మహ". తక్కినవి
అతని అంగాలు.

శ్లోకం 5


భూర్ భూమి, భువస్ ఆకాశం, సువర్ ఊర్ధ్వ లోకాలు
అయినప్పుడు, మహ సూర్యునివలె అన్ని జీవులను
పోషిస్తుంది.

భూర్ అగ్ని, భువస్ గాలి, సువర్ సూర్యుడు అయినప్పుడు,
మహ చంద్రునివలె అన్ని గ్రహాలకు, నక్షత్ర
మండలాలకు ఆధారం. భూర్ ఋగ్ వేదము, భువస్ సామ వేదము,
సువర్ యజుర్ వేదము అయినప్పుడు మహ బ్రహ్మన్ వలె
నాలుగు వేదాలకు ఆధారం. భూర్ ఊర్ధ్వంగా ప్రసరించే
ప్రాణం, భువస్ క్రిందికి ప్రసరించే ప్రాణం, సువర్
సర్వత్ర వ్యాపించిన ప్రాణం అయినప్పుడు, మహ
ఆహారమువలె జీవులలోని ప్రాణశక్తిని సంరక్షిస్తుంది.
ఈ విధంగా ఈ నాలుగు ప్రకంపనలు నాలుగు రెట్లవుతున్నాయి.
దీనిని తెలిసినవారు పరమాత్మను తెలిసికొని, అందరిచే
మన్నన పొందుతారు.

శ్లోకం 6


పరమాత్మ జీవుల హృదయాలలో వసిస్తాడు.
అతనిని తెలిసికొంటే మృత్యువును దాటుతా౦.
కపాలములో కణత వద్దనున్న ఎముకల,
అంగిలి మధ్య నుండి అగ్నితో ఏకమవు
భూర్ శబ్దము; గాలితో ఏకమవు భువస్ శబ్దము;
సూర్యునితో ఏకమవు సువర్ శబ్దము;
పరమాత్మతో ఏకమవు మహ శబ్దము ఉద్భవిస్తాయి.
ఈ విధంగా ఒకడు తన జీవితానికి రాజై, కోర్కెలను,
ఇంద్రియాలను, బుద్ధిని ఏలుతాడు.
అతడు సత్యము, శాంతి, అమృతత్వము,
ఆనందానికి హేతువు, జీవిత పరమార్థము
అయిన పరమాత్మతో ఐక్యమవుతాడు. కాబట్టి
పరమాత్మని సదా స్మరించు.

శ్లోకం 7


భూమి, ఆకాశము, ఊర్ధ్వ లోకాలు, పావు, అర వంతులు;
అగ్ని, గాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు;
జలము, ఓషధులు, వృక్షాలు, అంతరిక్షం, వస్తువులు
భూతాలు. దేహంలో కన్ను, చెవి, మనస్సు, నాలుక, స్పర్శ;
చర్మము, మాంసము, కండరం, మజ్జ, ఎముకలు; పంచ
ప్రాణాలు ఉంటాయి. పంచమముతో కూడిన వాటిని
జ్ఞాని ధ్యానముచేసి ప్రతీదీ పవిత్రమైనదని
తెలిసికొంటాడు. జీవుడు అంతర్గతాన్ని, బాహ్యంతో
కలుపుకొని సంపూర్ణ మవుతాడు.


శ్లోకం 8



ఓంకారము పరమాత్మకి పరమోత్కృష్ఠమైన ప్రతీక.
ఓం సంపూర్ణమైనది. వేదాలను పఠించునపుడు
వాడబడేది. పురోహితుడు ఓంకారంతో పూజ
ప్రారంభిస్తాడు. ఆధ్యాత్మిక గురువులు, వారి
శిష్యులు ఓంకారంతో పఠనం మొదలబెడతారు.
ఏ విద్యార్థి అయితే ఓంకారం జపిస్తాడో అతడు
పరమాత్మతో అనుసంధాన మవుతాడు.

శ్లోకం 9



సంసారికి సూచనలు



మంచి నడవడిక కలిగి, శాస్త్రముల అధ్యయనము చేసి, బోధన పొందు.
అధ్యయనము, బోధలను చేస్తూ:
ఎల్లప్పుడూ సత్యం పలుకు; కోర్కెలను జయించు;
ఇంద్రియాలను నిగ్రహించు; శాంతికై పాటుపడు;
కుండలిని శక్తిని విడుదల చేయి; మానవాళికి
సేవ చేయి; సంతతిని పొందు.
సత్యవాచ చెప్పేది "ఎల్లప్పుడూ సత్యం పలుకు."
తపోనిత్య చెప్పేది "కోర్కెలను జయించు".
నక చెప్పేది "అధ్యయనము, బోధ సాధకుడుకి
ఎంతో అవసరం."

శ్లోకం 10


"నేను వృక్షము వంటి జీవితముతో ఏకమయ్యేను.
నా కీర్తి కొండ శిఖరమువలె ఎత్తుగా నున్నది.
నిత్య శుద్ధుడు, సర్వజ్ఞుడు, తేజోవంతుడు,
మరణము లేనివాడు అయిన పరమాత్మను
తెలిసికొన్నాను" అని త్రిశంకు మహర్షి
పరమాత్మతో ఐక్యమైనప్పుడు పలికెను.

శ్లోకం 11


వేదాలను బోధించి, గురువు ఇట్లు చెప్పును:
"సత్యమునే పలుకు; నీ కర్మలను నిర్వర్తించు;
శాస్త్రాలను విస్మరించకు. నీ గురువుకు సేవ
చెయ్యి. సంతతిని నివృత్తి చెయ్యవద్దు.
సత్యమార్గము నుండి మరలకు; మంచి
మార్గమునుండి మరలకు; నీ సాధనను
సదా రక్షించుకో. అధ్యయనము, బోధనము
నీ శక్తికి తగినంత చెయ్యి. జ్ఞానులను సదా
గౌరవించు. నీ తలిదండ్రులలో, గురువులో,
అతిథిలో దైవాన్ని చూడు. తప్పుడు పనులు
ఎప్పుడూ చేయకు. గౌరవింప దగినవారిని గౌరవించు.
దానము భక్తితో చెయ్యి; దానము ప్రేమతో చెయ్యి;
దానము ఆనందంగా చెయ్యి. నీకు ఒకటి మంచా చెడా అని
సందేహము వస్తే ఆధ్యాత్మిక ప్రగతికి ఏది
అవసరమో తెలిసిన జ్ఞానులను అడిగి తెలిసికో.
ఇది వేదాలు చెప్పినది. ఇదే రహస్య జ్ఞానం.
ఇదే సందేశం."

రెండవ భాగం



సత్యము, జ్ఞానము, అనంతమైన ఆనంద
స్వరూపమైన బ్రహ్మన్ ని తెలిసినవారు
తమ జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. వారు
తమ దహరాకాశంలో పరమాత్మని
దర్శించి జీవితంలో సమస్త సుఖాలను
పొందుతారు.

బ్రహ్మన్ నుండి ఆకాశం; ఆకాశం నుండి
గాలి; గాలి నుండి భూమి; భూమి నుండి మొక్కలు;
మొక్కలనుండి ఆహారము; ఆహారము నుండి
శరీరము, శిరస్సు, చేతులు, కాళ్ళు, హృదయము
ఉద్భవించేయి.

ఆహారం నుండి సమస్త జీవులు ఉద్భవించి,
మరణించిన తరువాత అవి ఇతరములకు ఆహారమవుతాయి.
శరీరానికి ఆహారము అతి ముఖ్యము. కావున అది
ఆదివ్యాధులకు చక్కటి ఔషధము. ఎవరైతే
ఆహారము భగవంతుని ప్రసాదమని భావిస్తారో,
వారికి జీవితంలో ఏ వెలితీ ఉండదు. అన్ని దేహాలూ
ఆహారంతో పోషింపబడతాయి; అలాగే దేహాలు
పడిపోయినప్పుడు తక్కినవాటికి ఆహార మవుతాయి.

అన్నమయ కోశము ఆహారముతో చేయబడినది.
దానిలోపల ప్రాణమయ కోశమున్నది. దానికి
ప్రాణము శిరస్సు, వ్యానము కుడి చెయ్యి, అపానము
ఎడమ చెయ్యి, ఆకాశం హృదయము, భూమి
పునాది.

ఆడామగా మానవులు, పశుపక్ష్యాదులు ఊపిరి తీసికొంటాయి. అందుకే
బ్రతికి ఉన్నాదని తెలిసికొనుటకు ఊపిరిని చూస్తారు.
మనమెంత కాలము జీవిస్తామో ప్రాణ శక్తి నిర్ణయిస్తుంది.
ఎవరైతే ప్రాణము పరమాత్మ ప్రసాదమని తలుస్తారో,
వారికి పూర్ణాయిష్షు కలుగుతుంది.

ప్రాణమయ కోశము ఊపిరితో చేయబడినది.
దాని లోపల మనోమయ కోసమున్నది.
దాని శిరస్సు యజుర్, కుడి చెయ్యి ఋగ్,
ఎడమ చెయ్యి సామ వేదాలు. హృదయము
ఉపనిషత్తుల సారాంశము. అథర్వణ వేదము
వాటికి పునాది.

ఎవనిని దర్శిస్తే పలుకులు వెనక్కి
తిరిగి వస్తాయో, ఆలోచనలు ఎవరిని చేరవో,
అదే బ్రహ్మన్ వలన కలిగెడి ఆనందము. వానికి
ఎప్పటికీ భయం కలుగదు.

మనోమయ కోశము లోపల ఆలోచనల
సమూహంతో గూడిన విజ్ఞానమయ కోశమున్నది.
దానికి భక్తి శిరస్సు, ధర్మము కుడి చెయ్యి, సత్యము
ఎడమ చెయ్యి. ధ్యానం దాని హృదయం,
వివక్షత దాని పునాది. విజ్ఞానమంటే జీవితాంతం
నిస్వార్థ సేవ చెయ్యడం; దేవతలు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
పొందాలని ప్రయత్నిస్తారు. ఎవరికైతే అట్టి
జ్ఞానము లభిస్తుందో వారు పాపమునుండి విముక్తులై,
నిస్వార్థమైన కోరికలను తీర్చుకొంటారు.

విజ్ఞానమయ కోశము వైరాగ్యముతో కూడినది.
దాని లోపల ఆనందమయ కోశమున్నది.
దాని శిరస్సు ఆనందము; తృప్తి కుడి చెయ్యి;
సంతోషము ఎడమ చెయ్యి; ఆహ్లాదము దాని
హృదయము; బ్రహ్మన్ దాని మూలము. ఎవరైతే
పరమాత్మ లేడని అంటారో, వారు తమనే కించ
పరుచుకున్నవారవుతారు. ఎవరైతే పరమాత్మని
ధ్యానిస్తారో, వారు తమ ఉనికిని ధ్రువపరచు
కొంటారు. జ్ఞానులు పరమాత్మని పొందుతారు.

పరమాత్మ "నేను బహుళ మవుతాను" అని
తలచేడు. అప్పుడు ధ్యానం చేసి సమస్త
సృష్టిని తయారు చేసేడు. ధ్యానంతో
సృష్టి అంతటిలోనూ ప్రవేశించాడు.

రూపము లేనివాడు అనేక రూపాలుగా మారేడు;
అపరిమితమైన వాడు పరిమిత మయ్యేడు;
సర్వాంతర్యామి ఒక ప్రదేశానికి పరిమిత మయ్యేడు;
సంపూర్ణ జ్ఞానము కలవాడు అజ్ఞానాన్ని సృష్టించేడు;
సత్యమైన వాడు అసత్యాన్ని సృష్టించేడు.
అతడే మనం చూసేద౦తా.
సత్యమని ధ్రువపరిచే అన్నిటికీ అతడే కారకుడు.
ప్రపంచము లేక ముందు పరమాత్మ అవ్యక్తమై ఉన్నాడు.
బ్రహ్మన్ పరమాత్మను తన నుండే సృష్టించేడు.
అందుకే అతడు స్వయంభు.

పరమాత్మ అమితమైన ఆనందానికి నిలయం.
అతని దర్శనంతో మన చేతన మనస్సులలో
హృదయాలు ఆనందంతో పులకరిస్తాయి.
అతనే లేకపోతే ఎవరు శ్వాస తీసుకొనేది? ఎవరు జీవించేది?
అతడు అందరి హృదయాలను ఆనందంతో నింపుతాడు.

ఎవరైతే పరమాత్మ జీవుల ఐక్యతకు ప్రతీక, మార్పు
లేనివాడు, నామరూపాలు లేనివాడు అని తెలిసికొంటారో,
వారికి భయమన్నది ఉండదు. మనము జీవుల ఐక్యత
తెలియనంత కాలం భయంతో బ్రతుకుతాము.

పరమాత్మ గురించి తెలియని విద్యార్థి, అతని వేర్పాటువల్ల
భయాన్ని పొందుతాడు. బ్రహ్మన్ కి భయపడి గాలి
వీస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు, అగ్ని రగుల్కొంటుంది,
మృత్యువు అందరినీ తీసుకుపోతుంది.

పరమాత్మ నుండి పొందిన ఆనందమెటువంటిది?
ఒక నాగరీకుడు, ఆరోగ్యవంతుడు, మంచివాడు,
బలవంతుడు, మిక్కిలి ధనవంతుడు అయిన యువకుని
ఒక వంతు ఆనందంగా చూద్దాం.

అ యువకుని ఆనందానికి వంద రెట్లు ఒక గంధర్వుని ఆనందం;
అ గంధర్వుని ఆనందానికి వంద రెట్లు పితృల ఆనందం;
అ పితృల ఆనందానికి వంద రెట్లు ఒక దేవత ఆనందం;
అ దేవతల ఆనందానికి వంద రెట్లు కర్మదేవుల ఆనందం;
కర్మదేవుల ఆనందానికి వంద రెట్లు ఇంద్రుని ఆనందం;
ఇంద్రుని ఆనందానికి వంద రెట్లు బృహస్పతి ఆనందం;
బృహస్పతి ఆనందానికి వంద రెట్లు విరాట్ పురుషుని ఆనందం;
విరాట్ పురుషుని ఆనందానికి వంద రెట్లు ప్రజాపతి ఆనందం;

జీవులలోనూ, సూర్యునిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే.
ఈ సత్యాన్ని అర్థం చేసికొన్నవారు ప్రపంచాన్ని దాటి,
కోశాలనూ దాటి, జీవుల ఐక్యతను తెలిసికొంటారు.

ఎవరి వల్ల పలుకులు, ఆలోచనలు నివృత్తి అవుతాయో,
అట్టి బ్రహ్మన్ ఆనంద స్వరూపుడని గ్రహించి, అభయంతో
బ్రతుకుతాము. వారికి "నేను మంచి కార్యం ఎందుకు చేయలేకపోయాను?"
లేదా "నేను మంచి కాని కార్యం ఎందుకు చేసేను?" అనే
సంశయాలనుండి విముక్తి లభిస్తుంది. బ్రహ్మన్ యొక్క ఆనంద
స్వరూపాన్ని తెలిసికొని, మంచిచెడులను గ్రహించి, వారు
ద్వంద్వాలకు అతీతులవుతారు.

మూడవ భాగం


భృగు తన తండ్రి వరుణుని వినయముతో ఇట్లు అడిగెను:
"బ్రహ్మన్ అనగా నేమి?"

వరుణుడు "మొదట ఆహారం, కన్ను, చెవి, వాక్కు, మనస్సుల
గురించి తెలిసికో; అటు తరువాత అవి ఎక్కడనుండి
ఆవిర్భవించేయి, ఎలా మనుగడ కావిస్తాయి,
ఎవరి గూర్చి వెదకుతాయి, తిరిగి ఎవరిలో ఐక్యమవుతాయి
అనేవాటిని గురించి తెలిసికో. అదే బ్రహ్మన్" అని బదులిచ్చెను.

భృగు ధ్యానం చేసి ఆహారం బ్రహ్మన్ అని తెలిసికొన్నాడు.
అన్ని జీవులు అన్నము నుండి పుట్టి, అన్నం వల్ల పెరిగి, తిరిగి
అన్నంలో లయమవుతున్నాయని తలచెను. కానీ సంతృప్తి
పొందక తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళి "నాకు బ్రహ్మన్ గూర్చి
తెలుపు" అని కోరెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి ప్రాణం బ్రహ్మన్ అని తలచెను. ప్రాణం
వలన జీవులు పుడుతున్నారు, పెరుగుతున్నారు, లయమవుతున్నారు
అని తలచెను. దానితో సంతృప్తి చెందక మరల తండ్రి వద్దకు
వెళ్ళి "నాకు బ్రహ్మన్ గూర్చి ఇంకా తెలుపు" అని అడిగెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి మనస్సు బ్రహ్మన్ అని కనుగొనెను. మనస్సు
నుండి జీవులు పుట్టి, పెరిగి, లయమవుతాయని తలచెను.
కానీ సంతృప్తి చెందక తండ్రిని "బ్రహ్మన్ గూర్చి నాకింకా చెప్పు"
అని కోరెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి బ్రహ్మన్ అంటే జ్ఞానమని కనుగొనెను. జ్ఞానం
నుండి అన్ని జీవులు పుడతాయి, పెరుగుతాయి, దానిలోనే
లయమవుతాయి అని తలచెను. కానీ సంతృప్తి చెందక
తన తండ్రిని బ్రహ్మన్ గూర్చి ఇంకా చెప్పమని అడిగెను.

"ధ్యానం ద్వారా తెలిసికో. ఎందుకంటే బ్రహ్మన్ అంటే ధ్యానం"
అని వరుణుడు చెప్పెను.

భృగు ధ్యానం చేసి బ్రహ్మన్ ఆనందమని కనుగొనెను. ఎందుకంటే
ఆనందం నుండి జీవులు పుట్టి, పెరిగి, లయమవుతున్నాయని
తలచెను.

ఈ విధంగా వరుణుని సుతుడు భృగు గాఢ ధ్యానంలో
పరమాత్మ గురించి తెలిసికొన్నాడు.

ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో,
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.

అన్నాన్ని గౌరవించు: శరీరము అన్నముచేత చేయబడినది.
అన్నం, శరీరం పరమాత్ముని సేవించుటకై యున్నవి.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో,
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.

అన్నాన్ని వ్యర్థం చేయవద్దు, జలాన్ని వృధా చేయవద్దు,
అగ్నిని వ్యర్థం చేయవద్దు; అగ్ని, జలము పరమాత్ముని
సేవ చేయుటకై ఉన్నాయి.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.

అన్నాన్ని పెంపొందించు. భూమి ఇంకా ఎక్కువ
ఇవ్వగలదు. భూమి, ఆకాశము పరమాత్ముని
సేవించుటకై ఉన్నవి.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.


ఆకలితో ఉన్నవారికి అన్నం ఇవ్వకుండా ఉండవద్దు.
అన్నదానం చేస్తే, పరమాత్మకి సేవ చెయ్యడమే.
ఎవరైతే పరమాత్మను తమలో ప్రతిష్ఠి౦చుకొంటారో
వారు స్థిర చిత్తులై, ధనవంతులై, పరివారము కలిగినవారై,
అందరి ప్రేమని పొందుతారు.


ఆ జ్ఞానం వలన మన పలుకులు తియ్యనివై, శ్వాస
దీర్ఘమై, చేతులు మన చుట్టూ ఉన్న పరమాత్మ సేవకు సంసిద్ధమై,
కాళ్ళు సహాయము కోరువారలకై ఉంటాయి.
ఆ జ్ఞానం వలన పరమాత్మని జంతువులలో, పక్షులలో,
నక్షత్ర కాంతిలో, ఆనందంలో, శృంగారంలో, వానలో,
ప్రపంచంలోని అన్ని వస్తువులలో చూస్తాము. పరమాత్మ
ఇచ్చిన దేహముతో భద్రత, జ్ఞానము, కర్మలలో ప్రేమ
పెంచుకొని, మనలో అంతర్గతమై యున్న శత్రువును
జయించి, పరమాత్మతో ఐక్యమవుతాం.

జీవునిలోని, సూర్యునిలోని పరమాత్మ ఒక్కడే.
ఇది తెలిసినవారు ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసికొని,
పంచ కోశాలను దాటి జీవైక్యతను పొందుతారు.
ఎవరైతే జీవులన్నీ ఒక్కటే అని అర్థం చేసుకొంటారో,
వారు అ౦తట క్షేమంగా ఉండి, తమలో అన్ని
జీవులను చూసుకొంటారు. వాళ్ళు ఆనందంతో ఇలా
పాడుతారు:

"నేను ప్రాణాన్ని కాపాడే అన్నాన్ని;
నేను ప్రాణ శక్తిని భుజిస్తాను.
నేను అన్నాన్ని, జలాన్ని అనుసంధానము చేస్తాను.
నేను ప్రపంచంలో పుట్టిన మొదటి జీవిని;
దేవతలకంటే పూర్వీకుడను, అమృతత్వము పొందిన వాడను.
ఎవరైతే ఆకలి ఉన్న వారితో అన్నం పంచుకొంటారో,
నన్ను రక్షిస్తారు; అలాకాని వారిని నేను భక్షిస్తాను.
నేనే ఈ ప్రపంచాన్ని; ఈ ప్రపంచాన్ని అనుభవిస్తాను.
ఇది అర్థం చేసుకొన్నవారు, జీవితాన్ని అర్థం చేసుకొంటారు"

ఇది ఉపనిషత్తు యొక్క రహస్య బోధ.

Viveka Sloka 27 Tel Eng

Telugu English All సర్వదా స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా । (పాఠభేదః - సమ్యగాస్థాపనం) తత్సమాధానమిత్యుక్తం న తు చిత...