Tuesday, August 29, 2023

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 30)

upanishad

నాల్గవ ప్రకరణము

30

వ్యధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాన్తి దర్శనాలబ్ధ
భూమికత్వా నవస్థితత్వాని చిత్త విక్షేపాస్తే అన్తరాయాః.

వ్యాధి = వ్యాధి
స్త్యాన = నిరాకరణ
సంశయ = సందేహము
ప్రమాద = పొరవాటు
ఆలస్య = సోమరితనము
అవిరతి = లోలత్వము
భ్రాంతిదర్శన = లేనిది వున్నట్టు చూచుట
ఆలబ్ధభూమికత్వ  = పట్టుదొరక కుండుట 
అనవస్థితత్వాని = స్టిరత్వము లేకుండుట
చిత్త విక్షేపాః = చిత్తచాంచల్యము
తే = అవి
అంతరాయాః  = అంతరాయములు


 
అంతరాయములు దేహగతమైన మనస్సు యొక్క 
చాంచల్యములు, అవి వ్యాధి, నిరాకరణ, సందేహము, పొరపాటు,
సోమరితనము, విషయలోలత్వము, భ్రాంతి, పట్టులేకుండుట.
దీక్ష లేకుండుట మొదలైనవిగా తెలియబడును. 

  



యోగసాధనకు అంతరాయములు సహజములు. 
దేహగత మైన మనస్సు  అనేక శక్తులు లేక ప్రజ్ఞల యొక్క సామ్యము.
ఈ సామ్యమునకు ఒక్కొక్కసొరి మనస్సునందలి వ్యతిరేక శక్తులు,
అంతరాయము  కలిగించుచుండును. అవి:

1) వ్యాధి

వ్యాధి అంటే వ్యధ పుట్టించునది. వ్యధ అంటే  బాధ. 
బాధ మనస్సుకే గాని శరీరమునకుగాదు. కనుక వ్యాధి కారణ 
ములు మనస్సునుండి పుట్టి శరీరములో పనిచేయును. 
వ్యాధి కారణమును తొలగింపనిదే, వ్యాధి తాత్కాలిక నివృత్తి 
చె౦దవచ్చును గాని నిర్మూలనముగాదు. మరియు నిత్యజీవితము 
నకు చెందిన దినచర్యయందలి క్రమము చెడినచో శరీరమునందు
వ్యాధి పుట్టును. అనగా స్వయంకృషి, లేక వ్యాయామము, ఆాహా 
రము, విశ్రాంతి, నిద్ర మున్నగువానియందు క్రమము చెడిననో
వ్యాధి పుట్టును. వ్యాధిగ్రస్తమైన శరీరమునందు యోగసాధన
సులభము కాదు.

2)నిరాకరణ

మనస్సు అలవాట్లకు లోబడి ఉంటుంది. అందుచేత తనకు 
నచ్చనివి ద్వేషించుట జరుగుతుంది. అ౦టే  వాటియందు
ఉదాసీనత్వము, ద్వేషించుట అను లక్షణాలు  చూపుతుంది. నిత్య 
జీవితములో మన పరిసరములలో అనేక వస్తువులు, విషయములు, 
వ్యక్తులు తారసపడవచ్చును. వాటియందు మనస్సుకు 
ప్రత్యేక ప్రభావము లేదు. కాని కొందరిని, కొన్ని వస్తువులను లేక
విషయములను చూస్తే మనస్సకు ద్వేషము కలుగుతుంది. 
అంటే  తనకక్కరలేని  విషయములు వేరు, అయిష్టత లేక 
ద్వేషమును  చూపేవి  వేరు. అక్కరలేనివి ఉండవచ్చును గాని 
అట్టి కొన్నిటి మీద  తాను ద్వేషము వేరుగా చూపనక్కరలేదు.
ద్వేషించుట అను లక్షణము వలన చిత్త  విక్షేపము లేక 
చాంచల్యము కలిగి మనస్సులో ద్వంద్వములు సృష్టింప 
బడతాయి. అక్కరలేనివి, కావలసినవి అనేవి మాత్రము
జంతువులకు, మానవులకు సహజము. కాని ఇష్టము లేకుండుట
ద్వేషించుట అను లక్షణాలు మానవుడు వేరుగా చూపును.
ఉదాహరణకు జంతువులు ఆకలి వేస్తే గడ్డితి౦టాయి. ఆకలిలేకపోతే 
తినవు. అంతేకాని ఇక వేరుగా అయిష్టత మొదలైనవినవి లేవు.
మానవుడు ఆకలి వేస్తున్నా  కొందరి వద్దనుండి ఆహారము
స్వీకరించడం, కొందరి వద్ద స్వీకరింపకుండుట౦ చేయును. అ౦టే 
ఇక్కడ అక్కరలేకపోవుటగాక, యిష్టము లేకుండుట కారణము.
ఇదియే స్త్యానము అని చెప్పబడినది. ఎమర్సన్‌ అను
మహాశయుడు "ఈ ప్రపంచము నందు చెడుగా ప్రవర్తించుటయే
తప్ప చెడ్డవారనువారు వేరుగా లేరని" చెప్పెను. కనుక ఇష్టత,
అయిష్టత అను రెండునూ యోగసాధనకు ప్రతిబంధకములు. ఈ
ప్రపంచమునందేదైననూ మనకక్కరలేకపోవచ్చునుగాని, అయిష్టము
కారాదు.

3) సంశయము 

స౦శయమనగా అక్కరలేనివి ఆలోచించుట. మనకు కావసినవి
మరియూ చేయవలసనివి జ్జప్తి యు౦టే సందేహములకు,
సంశయములకు, తావుండదు. ఒక వన్తువు కావలెనా, వద్దా అనే 
సందేహము వచ్చినప్పుడు, దానిని ప్రక్కకు పెట్టి నిశ్చయముగా 
కావలసినవి సంపాదించుట లేక అట్టి పనులే చేయుట 
చెయ్యాలి. సందేహించినవాటిని గూర్చి సంశయము 
తీరిపోయిన వెనుక అవి నిస్స౦శయముగా 
కావలెనని తేలిన పిదప, స్వీకరింపవచ్చును. 
అంతేగాని వాటిని గూర్చి ఆలోచనలతో సమయము వృధా 
చేసికోరాదు. ఎంతసేపు ఆలోచించిననూ చేయుటయో, 
చేయకుండుటయో అను రెండింటిలో నొక్కటియే జరుగుతుంది. 
గానీ రెండూ జరుగవు కదా!

4)  పొరపాటు

ఆలోచనలోగాని, కర్తవ్యములోగాని పొరపాట్లు జరుగుటకు 
కారణము, అట్టిపనులు కావలసిన సమయముకన్నా ముందేచేయడం. 
నీవు రైలు దిగగానే  కలసికొనవలసిన వ్యక్తి కొరకు నీవే హడావుడిగా 
ప్లాట్‌ఫారము బయటకు, లోపలకు పరుగులెత్తితే 
ఆ వ్యక్తి కూడా నీకోసమే వెదకుతూఉంటాడు. కనుక ఇద్దరూ
తిరుగుచుండు వలన ఒకరికొకరు కలియకపోవచ్చును. అదే నీవు 
రైలుదిగగానే ప్లాట్‌ ఫారముపై ఒకచోటనే కొంచెము సేపు 
వేచియు౦టే నీకు కావలసిన వ్యక్తి నీ దగ్గరకే వస్తాడు. కాబట్టి 
తొందరపడకుండుట, చేయవలసిన పనులు చేయవలసిన సమయ
మునకు ముందుగానే యత్నించుట, మొదలైన వాటి వలన పొరపాట్లు
జరుగుతాయి.

5) సోమరితనము

అనగా పైదానికి వ్యతిరేక స్వభావము. చేయవలసిన
పనిని చేయవలసిన సమయమునకు చేయకుండుట. రై లురావలసిన
సమయముకన్నా ముందుగా రైలు స్టేషనుకు వెళితే  మనమెవరిని
కలసుకొనుటకు పోవుచున్నామో ఆ వ్యక్తిని మనము 
కలవలేకపోవచ్చును. కనుక సక్రమమైన సమయమునకు 
సక్రమముగా పనులు నిర్వర్తించుట ఆవశ్యకము.


6) విషయలోలత

విషయలోలత అంటే అలవాట్లను కొనసాగించుట. ఇవి 
పోవలెనన్నచో పాత అలవాట్లు మార్చుకొని, కొత్త అలవాట్లను
చేసుకోవాలి. ఇదే యోగమార్గము. అ౦టే ముందుగా పాత
అలవాట్లను మానిన తరువాత కొత్త అలవాట్లను చేసికోవాలంటే 
అది సాధ్యముకాదు. ముందు మంచివనులు చేయుడం 
అలవాటు చేసుకొ౦టే క్రమేణా పాత అలవాట్లు వాటంతట 
అవే ఆగిపోవును. నిరంతరము పేకాట ఆడి ధనము వృధా
చేనుకొనేవానికి ఏదైనా ఒక ఉత్సవ నిర్వహణము లేక దేవాలయ
నిర్మాణము వంటి వనులు అప్పచెవ్పవలెను. "నీ  వంటి వాడు
తప్ప ఇది నిర్వహింపగలిగిన సమర్దుడు లేడని" పొగడినచో వారు
పొంగిపోయి అంగీకరింతురు. అట్టవారి చేతికి ధనము వినియోగించుట
తప్ప, మిగిలిన పనులనొప్పజెప్పాలి. అవి నిర్వహించడంలో 
సమయము చాలక, పేకాట వంటివి మానివేయవలసివస్తుంది.
ఇలా రెండు, మూడుసార్లు జరిగిన తరువాత మిక్కిలి సుదీర్ఘమైన
పని అప్పచెప్తే  పేకాట పూర్తిగా మానివేయుదురు. ఇలాగ 
విషయలోలతను నిగ్రహించాలి.

7) భ్రాంతి లేక భ్రమ 

భ్రాంతి అనేది  మానసిక కక్ష్యలో జరుగే  పొరపాటు
వంటిది. మన మనన్సు, ఇంద్రియములు మొదలైనవి కూడా
శరీరమునకు పనిముట్టువంటి వేకాని, వాటియందు సహితము 
పరిపూర్ణతలేదు. తాడును చూసి  పామనుకొనినట్లే, పామును చూచి 
తాడనుకొనవచ్చును. కాని ఒక్కొక్కసారి ఇలాంటి భ్రాంతి వలన 
సృష్టి కొనసాగుతోంది.  భార్యను చూసినవుడు ఆమె తన భార్య 
యనునది భ్రాంతియైనప్పటికి అది యావశ్యకమే. అలా గాక 
ఆమె ఒక ఎముకల ప్రోగుగా, రక్త మాంసాదుల ముద్దగా జ్ఞాపకము౦టే ,
కాపురముచేయడానికి కెవడంగీకరిస్తుంది? భ్రాంతి కొన్ని చోట్ల 
ఆవశ్యకమే కాని, అది తగు మాత్రముగా నున్నపుడు దాని వలన 
సుఖము కలుగుతుంది.

8) పరిస్టితులపై  పట్టు  లేకుండుట

పరిస్థితుల పై పట్టులేకుండుట మరొక అవరోధము. 
ఇది సాధింపవలెన౦టే మొదట పరిస్టితులను, ఫలిత
ములను విస్మరించి నీవేమి చెయ్యాలో? ఎప్పుడు చెయ్యాలో?
అ పనులేవో? నీకై నీవు నిర్ణయించుకోవాలి. అప్పుడు పరిస్టితులు
నీపై ప్రభావము చూపుటమాని నీవు పరిస్టితులకు సంబంధము
లేకుండ నీ కర్తవ్యమును నిర్వహింపగలవు. ఇటువంటి  దృక్పధము
వలన నీకు తెలియకుండానే  పరిసరముల పై నీకు పట్టు చిక్కుతుంది.  
ఉదాహరణకు ఒకడు తన పిల్లవానిని చక్కటి ఉన్నత విద్యల
నభ్యసింపజేసెననుకొనుము. వానికి తన పిల్లవాడు కలక్టరు వంటి గొప్ప
ఉద్యోగస్తుడై తనని బాగుగా చూచుకొనును అని అనుకున్నచో అది తప్పు. 
అతడు పెద్దవాడై న తర్వాత తన్ను నిరాదరింప వచ్చును. లేదా
ఇతర దేశములకు పోయి అక్కడే ఉండిపోవచ్చును. అప్పుడు
తాను దుఃఖించవలసి యుండును. అనగా పరిస్టితుల పై తనకు
పట్టులేకుండుటయగును. అలాగాక వానిని చక్కగా చదివించుట
తన కర్తవ్యముగా మాత్రమే గుర్తించి చదివించినచో తరువాత 
పిల్లవాడు తనను గౌరవించినను, నిరాదరించినను దూరదేశ 
ములకు వలసపోయినను తనకొక్కటే. అట్టివానికి ఎల్లపుడు
పరిస్థితుల పై పట్టువిడిపోదు.

9) పనులయందు స్థిరత లేకుండుట

పనులయందు స్టిరత లేకుండుట అనేది  అనేక పనులను 
ఒకేసారి సంకల్పించినప్పుడు వచ్చు స్టితి. ఒక పథకము ఎంత 
గొప్పదైనా ఆచరింపకపోతే అది అబద్దమే. అ౦టే చేస్తే 
మాత్రమే సత్యమవుతుంది గాని లేనిచో అసత్యమే. తాను చేయబోవు 
వంటను ఎంత వర్ణించినా, చేయనంతవరకూ అది అసత్యమే 
కదా! కాబట్టి నువ్వు సంకల్పించిన పనులలో ఏది సుకరముగా 
ఉంటుందో దాన్ని ముందు ప్రారంభించు. శ్రద్ధగా నిర్వహిస్తే 
ఆ పని సత్యమవుతుంది. అంటే దాని ప్రయోజనము నెరవేరుతుంది. 
మిగిలిన పనులు ఆవశ్యకతను బట్టి చేయడమో చెయ్యకపోవడమో 
జరుగుతుంది.  మొదట ఒక పనిని శ్రద్ధగా నిర్వహిస్తే,
మిగిలిన పనులకు కూడ అనుకూలత ఏర్పడి సమయానుకూలంగా 
ఒకదాని వెంట మరొకటి పూర్తి అవుతాయి. 

Tuesday, August 22, 2023

Patanjali Yoga By Pidooru Jaganmohan Rao

upanishad

There are many books in many languages about Sage Patanjali's yoga sutras. So what is new? The main reason I have embarked on this is there is a little known book by Sri Pidooru Jaganmohan Rao titled "పతంజలి యోగ సూత్రములు" that was last published in the 90's and apparently went out of print. Compared to Swami Vivekananda's book, this one is easy to read and doesn't require prior knowledge of Sankhya. Still the book was written in "అచ్చ తెలుగు". So some translation effort is put in to rewrite in contemporary telugu.

పతంజలి యోగ సూత్రములు Part 1 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 2 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 3 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 4 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 5 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 6 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 7 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 8 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 9 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 10 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 11 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 12 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 13 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 14 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 15 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 16 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 17 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 18 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 19 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 20 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 21 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 22 (Telugu)

Friday, August 11, 2023

Patanjali Samaadhi Paada Third Prakarana (Slokas 24-26)

upanishad

మూడవ ప్రకరణము: ఈశ్వరుడు

24

క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః

క్లేశ  = చిక్కు
కర్మవిపాక = కర్మసంస్కారము
అపరామృష్ట్రః = బాధింపబడడు
పురుషవిశేషః = విశేషుడైన పురుషుడు
ఈశ్వరః = ఈశ్వరుడు

ఈశ్వరుడు (మానవదేహ యం(త్రమునకు అధిపతి) 
క్షేశములచేత, కర్మలచేత,  వాని ఫలితములచేత బాధింపబడడు. 
 

యోగసాధకుడై నవాడు (ఇంతకు ముందు శ్లోకములలో
చెప్పబడిన  విధానమున సాధన చేయువాడు) ఈశ్వరుని 
శరణాగతి పొందవలెను. ఈశ్వరుడు అంటే ఏమిటో ఈ క్రింద
వివరింపబడుచున్నది.

పరమాత్మ అంటే  ఈ నృష్టి సమస్తమునూ తానుగా
వ్యాపించియున్నవాడు. ఈ పరమాత్మ అనే  నీటిపై తేలుతున్న
మంచు గడ్డవంటిది జీవాత్మ. అంటే సమస్తమునందు
వ్యాపించియున్న పరమాత్మ, జీవులలో నేను అను అంశముగా
తెలియబడుతున్నాడు. ఎలాగంటే మనము చోటు (space)
లో ఒక గది కడితే, గదిలో మరల చోటుంటుంది. నిజానికి 
గదిలోని చోటు, గది వల్ల కాక గది కట్టకముందే ఉంది. గది 
లోపల, గదిబయట అని చోటును మనము రెండుగా విభజించి
నప్పటికినీ, చోటు నిజ౦గా  విభజింపబడలేదు. మనము చోటులో
గదిని కట్టడంవలన చోటు వేరైనట్టు కన్పించినా, చోటు
మాత్రము ఒక్కటే. నీటి బుడగ లోపల, బయట, గాలి
యుండి మధ్యలో నీటిపొర యేర్పడుతుంది. బుడగలోని గాలిని 
మనము వేరుగా పిలిచినా, రెండిటిలోని గాలి యొక్కటే . 
కాని బుడగ లోని  గాలికి ఒత్తిడి (pressure) కలదు. బుడగ
బయటనున్న గాలికి అ౦త ఒత్తిడి లేదు. 

అలాగే  అంతర్యామి శరీరమందున్నప్పుడు 
ఆలోచనలు, ఆవేశములు, రాగద్వేషములు
మొదలైనవి చెందినట్టు కనిపిస్తుంది. శరీరము వెలుపలనున్న
అంతర్యామి వాటిచే కట్టుబడడు. శరీరములోపలనున్న జీవాత్మ
మాత్రము పై మార్చులకు లోనగుతుంది. కాని మరల అ౦దులోని 
అంతర్యామి మాత్రము ఎట్టిమార్పును లేక ఉంటాడు. అతడు 
శరీరముద్వారా నిర్వహింపబడు పనులకు సంకల్ప, వికల్పాదులు 
కలిగియుండడు. పనులు జరుగుతున్నా వాటితో  సంబంధము
లేక ఉంటాడు. 

కుండకు, దానిలోని మట్టికి యున్న సంబంధము 
వంటిది. కుండ తయారవడానికి  ముందు, కుండయిన్నపుడు,
మరియు కుండబద్దలైపోయిన వెనుక మట్టి అలాగే ఉంటుంది.
కుండ అనే  అకారము కుండకు సంబంధించినది కాని, మట్టికి 
సంబంధించినదికాదు. అలాగే  పగిలిపోవుట మొదలైనవి కుండకు 
సంబంధించినది కాని మట్టికి నంబంధించినది కాదు.

25

తత్ర నిరతిశయం సర్వజ్ఞబీజమ్

 తత్ర = అక్కడ
 నిరతిశయం = దాటరానిది
సర్వజ్ఞబీజమ్‌ = సర్వజ్ఞుడు అను బీజము.

ఆయనయందు సర్వజ్ఞుడు అను బీజమున్నది.
  


జిజ్ఞాస అనేది జీవలక్షణము. ప్రతివాడు ఎప్పటికప్పుడు
ఏదో తెలుసుకోవడానికి  ప్రయత్నిస్తాడు. సామాన్య
రాజకీయముల నుండి మోక్ష ధర్మము వరకు సమస్తము తెలిసి
కోడానికి యత్నించుచు౦టారు. ఒక కొత్త వస్తువుగాని, విచిత్ర
మైన లేక అందమైన వస్తువు కనిపిస్తే ఇది ఎవరిది? దీని
ఖరీదెంత? ఎక్కడ దొరకుతుంది? ఎవరు తయారు చేసేరు? ఎలా 
చేసేరు? మొదలైన  ప్రశ్నలు పుట్టి, వాటి సమాధానము పొందడానికి 
ప్రయత్నిస్తారు. ఇలా  ఒక సందేహము తీరిన తరువాత,
మరియొక సందేహము. ఇలా జీవి కొత్త విషయాలు తెలుసు 
కోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ తెలుసుకొనడానికి 
అంతుండదు. ఎంత తెలుసుకొన్నా, ఎప్పటికప్పుడు తెలుసు
కొనవలసినది మిగిలి ఉంటుంది.  ఇలాగ తెలుసుకొనుట అనేది 
జీవియందున్న ఒక లక్షణము. ఇది మరల మూడు అంశలుగా
తెలియబడుతుంది: తెలుసుకొనువాడు, తెలిసికొనుట, 
తెలిసికొనవలసిన విషయము. అ౦టే ఈ మూడూ జీవియందున్న
తెలిసికొనుట లేక జ్ఞానము అను లక్షణము నుండి పుట్టినవి.

ఈ లక్షణమునే బీజము అంటారు. కాబట్టి  నిజానికి  
తెలియాలంటే దీన్నే తెలుసుకోవాలి. ఇది తెలిస్తే సమస్తము
తెలిసినట్టే. అంటే మనలో దేనిని తెలియుటచేత తెలిసికొనుట
అను ప్రవృత్తి  కరిగిపోతుందో అదే నిజమైన తెలివి. 
ఈ తెలిసికొను లక్షణమే సృష్టికి  బీజము. మొట్ట మొదట
సృష్టి జరిగినప్పుడు బ్రహ్మకు ఇటువంటి ప్రశ్నలే పుట్టియుండ 
వచ్చు. నేనెవరిని? నేనెక్కడున్నాను? నేనెవరినుండి పుట్టేను? 
నేను ఏమి చెయ్యాలి? అను ప్రశ్నలు పుట్టేయి. వెంటనే తానొక చోట
ఉండడం, తనచుట్టూ తానుకాక ఇతరముండుట మొదలైనవి
జరిగెను. అదే సృష్టి. ఇంతకు ముందు జరిగిన "సృష్టి" అనే 
వృక్షము నశించి  దాని బీజమే మరల కొత్త బ్రహ్మగా మేలుకొని 
అంతకు ముందు జరిగిన సృష్టిలోని  సత్యములే కొత్త
బ్రహ్మకు స్పురణకు రాగా అతడు వాటిని ప్రశ్నలుగా జ్ఞాపకము
చేసుకొనెను. తాను బయటకు వెళ్ళవలసిన పని ఉండగా, అది
సవ్యముగా జ్ఞాపకముంచుకోలేని వాడు, తానెక్కడికి వెళ్ళాలని 
ప్రశ్శించుకోవడం వంటిది. జీవిలో సత్యములుండగా వాటని
ప్రశ్నలుగా జ్ఞాపకము తెచ్చుకోవడం ద్వారా తన కర్తవ్యమును తానే
నిర్ణయి౦చుకోగలడు. ఈ సత్యములన్నీ ఒకే సత్యము
నుండి పుట్టినవి. అదే  అన్ని సత్యములకు, లేక జ్ఞానములకు 
కారణమైన ఒకే సత్యము, లేక జ్ఞానము. అదే సర్వజ్ఞుడు అని 
చెప్పబడే పరమాత్మ యొక్క అంశ. ఇదే  పైన చెప్పబడిన
తెలిసికొనుట అనే లక్షణము.  తనలో ఈ లక్షణము ఎక్కడ 
నుండి పుడుతున్నదో తెలిసినవానికి సమస్తము తెలుస్తుంది. 
ఎందుకంటే సమస్తము దానినుండే పుడుతున్నాయని 
తెలుస్తుంది. ఇది తెలిసినవానికి ఇక తెలియవలసినది 
ఏదీ లేదు. కనుక అతడు  "నిరతిశయుడు" 

26

సవూర్వేషామపి గురుః కాలేనానవచ్చేదాత్

సః = అతడు
పూర్వేషాం అపి = పూర్వులయందు సహితము
గురుః  = ఉపదేశికుడు
కాలేన అనవచ్చేదాత్‌ = కాలము చేత
		ఖండింపబడనివాడు

కాలము చేత నశింపని వాడు. కావున అతడే ( ఆ సర్వజ్ఞుడే) 
 ప్రాచీనులకు సహితము గురువైయున్నాడు.

  


ఒక ఇనుప ముక్కను అయస్కాంతముగా మార్చాలంటే 
దానికి ముందు మరొక అయస్కాంతము కావలసి
ఉంటుంది. మరల ఆ అయస్కాంతము ఎలా వచ్చి౦ది?
ఇలా ప్రశ్నించుకుంటూపోగా, అయస్కాంతమునందు అయస్కాంత
మను లక్షణము ఒకటి ఉండాలని తెలుస్తుంది.
ఇదే  అయస్కాంతమునుండి. ఇనుప ముక్కలోనికి దిగివచ్చి౦ది.
బ్రహ్మ విద్యాసాంప్రదాయములో  మొదటి అయస్కాంతమును
తండ్రియనే ప్రజ్ఞగా గుర్తిస్తారు. రండవ అయస్కాంతమును
కుమారుడనే (పజ్ఞగా  గుర్తిస్తారు. మొదటి అయస్కాంతము
నుండి రెండవ అయస్కాంతము పుట్టడానికి వాహికగా
పనిచేసిన ఇనుపముక్కను తల్లి అనే ప్రజ్జగా గుర్తిస్తారు. 

దీని గూర్చి "తై త్తరయోపనిషత్తు" లోని  "శీక్షావల్లి" అనే  వేదసూక్త౦లో 
"మాతా పూర్వరూపమ్‌ పితోత్తరరూపమ్‌, ప్రజాసంధిః"
అని చెప్పబడినది. మరియు యోగవిద్యాసాంప్రదాయములో 
ఇదే  "గురువు నుండి శిష్యుడు పుట్టుచున్నాడని" చెప్పబడి౦ది. 
కాబట్టి ఇక్కడ "గురువు" అనేది గురువునుండి శిష్యుడికి
ప్రనరించి వానిన మరల గురువుగా చేయు ఒక లక్షణమే కాని 
ఒక వ్యక్తి కాదు. గురువు యొక్క వాక్కుగా నుచ్చరింపబడి
శిష్యునిలో ప్రవేశించు లక్షణమే నిజమైన గురువు. అ౦టే 
ఇక్కడ తెలుసుకొనుట అను లక్షణము వినుట అనే 
లక్షణముగా మేల్కొ౦టోంది. కనుకనే వినుట నభ్యసించినవాడు,
సమస్తమును తెలియగలడు. ఎదుటి వానిలో వాక్కు ఎక్కడ 
పుడుతోంది, దానిని తానెక్కడనుండి వి౦టున్నాడు అనే 
విషయాలను ధారణచేయాలి. కనుకనే యోగవిద్యని "శృతి
విద్య" అంటారు. గురువు శిష్యునికి చెవిలో రహస్యముగా
ఉపదేశము చేయడం, దానిని శిష్యుడు గ్రహించడం  "శృతివిద్య". గురువు
తన వాక్కుగా తనను తానే యుచ్చరించుచుండగా, శిష్యుడు
వినబడునది, వినుట, వినువాడు అను మూడు అంశాలుగా 
ధారణచేసి  ఈ మూడింటికి కారణము తానేయని తెలుసుకొ౦టాడు. 
ఇదే రహస్యము. ఈ రహస్యమును తెలియడమే 
శిష్యుడు గురువగుట. ఇదియే "ఆచార్యపూర్వఃరూపమ్‌ అంతే
వాన్యుత్తర రూపమ్‌. విద్యాసంధిః" అని శీక్షావల్లిలో  గానము
చేయబడినది. ఇక్కడ ఉచ్చరించువాడు ఉచ్చరించుటకు 
కారణము వానిలోని శ్వాస. శ్వాసలేనిదే వాక్కులేదు. శ్వాసకు
కారణము తానే. తానే శ్వాసగా పుడుతున్నాడు. అ౦టే తాను 
మొదట శ్వాసను ఉచ్ఛరించిన తర్వాత , వాక్కుగా దిగివస్తున్నాడు . 
అటువంటి ఉచ్చారణనే "ఓంకారము" అంటారు. కాబట్టి శ్వాసకు 
కారణమైన "ఓంకారమును" ధ్యానము చేయవలెను. 

Patanjali Samaadhi Paada Second Prakarana (Slokas 17-20)

upanishad


  


రెండవ ప్రకరణము: అప్రజ్ఞాతము

17

సూః వితర్క విచారానందస్మితా అనుగమాత్ సంప్రజ్ఞాతః

వితర్క 		= వస్తు విమర్శనము 
విచార 		= అనేక విషయములను 
			 గూర్చి ఆలోచించుట 
ఆనందా 		= ఆనందము 
అస్మితాః 		= తన అస్తిత్వము 
అనుగమాత్ 	= అనుసరించుట వలన 
సంప్రజ్ఞాతః 	= ప్రజ్ఞ చక్కగా వికసించిన స్థితి 

ప్రజ్ఞ చక్కగా వికసించుట అనే స్థితి, ప్రతీ 
వస్తువు గురించి విమర్శ చేసికొని, దాని 
నిజస్థితిని గమనించడం వలన,
అన్నిటిలోనీ ఆనందం గురించి తెలియుట 
వలన, తానను ప్రజ్ఞ అన్నిటిలోనూ వెలుగుటను 
గమనించడం వలన, సాధ్యమవుతుంది. 
  

ఈ ప్రపంచంలో సమస్తము మనస్సు చేత,
ఇంద్రియముల చేత గమనింపబడి గ్రహింప 
బడుతోంది. సరైన ప్రమాణము స్వీకరిస్తే,
అన్నీ చక్కని విమర్శకు లోబడి వుంటాయి. 
ఇక్కడ ప్రమాణమంటే ఒక వస్తువు యొక్క 
విలువ లేదా ఉపయోగము. ధాన్యము నుండి 
బియ్యం చేసి వండితే అది ఆకలి తీరిస్తుంది. 
ఇదే ధాన్యము యొక్క సరైన ప్రమాణము. 
అలాకాక దాచితే పురుగులు పట్టి పనికిరాకుండా 
పోతుంది. అంటే ధాన్యమును వెంటనే 
ఉపయోగించాలి, దాచడానికి పనికిరాదు అని 
తెలుస్తోంది. ఇదే సరైన ప్రమాణము.  అంటే 
వెంటనే ఉపయోగించడం వలన ధాన్యము 
మొదలైనవి సుఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి 
ఈ విలువ ధాన్యానికి ప్రమాణము. 

అలాకాక ధనం లాగ దాచడానికి ప్రయత్నిస్తే 
అది విపర్యయము. అంటే క్లిష్టతను కలిగిస్తుంది. 
కాబట్టి మనం ధాన్యాన్ని విపర్యయముగా గాక 
ప్రమాణమనే ప్రవృత్తితో స్వీకరిస్తే, దానివలన 
మనం సుఖపడతాం. లేకపోతే దుఃఖపడ 
వలసి వస్తుంది. ఇలాగ ఒక వస్తువు యొక్క 
ప్రమాణమును, అంటే సరైన ప్రవృత్తిని,
గమనించే పద్ధతిని వితర్కమంటారు. అటువంటి 
వితర్కము వలన సంతోషము, సుఖము కలుగు 
తాయి. ఇటువంటి విచారము వలన మనలో 
ఆనందం పుడుతుంది. అంటే ఆనందం కలిగే 
మార్గము దొరుకుతుంది. 

నేనబడే ప్రజ్ఞ వలన వితర్కము, విచారము,
మొదలైనవి వివేకమును కలిగించి సుఖానికి 
దారి చూపుతాయి. అటువంటి నిరంతర 
సంతోషము అనే స్థితినే యోగి యొక్క సమాధి 
స్థితి అని చెప్తారు. 

18

సూః విరామ ప్రత్యయాభ్యాసపూర్వసంస్కార శేషోఅన్యః

విరామ 		= విరామము, నిలుపుదల 
ప్రత్యయా 		= గ్రహణము 
అభ్యాసపూర్వః 	= అభ్యాసముచే ప్రారంభింపబడినది 
సంస్కారశేషః 	= సంస్కారములు వాదలబడినట్టిది 
అన్యః 		= మరియొకటి 

మరియొక స్థితి, ప్రత్యయము నశించి సంస్కారములు 
పూర్తిగా వదిలిపెట్టుటను అభ్యసించుట చేత 
సాధ్యపడును 
  

పైన చెప్పబడిన సమాధిస్థితిని పొందిన వెనుక మరొక 
సాధన ఉంది. దీనిలో  ఇంద్రియ స్పర్శలుండవు. అ౦టే 
ఒకడు దేనినీ గమనించడంగాని,  చూడడంగాని చేయడు. అలాంటి 
వాడు ఉదాసీనుడు, విగతస్పృహుడు అని  భగవద్గీతలో 
చెప్పబడినది. అతడు తనకుతానే తప్ప వానికి మరియొకటిలేదు.
అయితే అలాంటివాడు ఏమిచేయాలి? ఎలా ఉండాలి ?
శ్వాసించాలా? అతడు శ్వాసిస్తాడు కాని శ్వాసింపనివాడే 
అవుతున్నాడు. అ౦టే  శరీరము శ్వాసిస్తుంది,  అన్నము తింటుంది కానీ 
వాడు శ్వాసించడు. తనకుతాను అన్నము తినడు. వాడి  శరీరమే
ఇవి నిర్వహిస్తుండగా వాడు కల్పించుకోక చూస్తూ సాక్షి
వలె ఉంటాడు. అ౦టే ఆకలి వేస్తే, ఎదురుగా తినదగిన వస్తువు
ఉ౦టే  తి౦టాడు. లేకపోతే  ఊరక ఉంటాడు. అంతేగాని తిండినిగురించి 
దిగులు పెట్టుకోడు, ఆలోచించడు, విచారించడు. 
అంటే  తాను చేయవలసినవి తాను చేస్తూ ఉంటాడే కాని 
వాటిని గూర్చి బాధపడడం, ఆలోచించడం మొదలైనవి  ఉండవు.
అతడు మాట్టాడినా, విన్నా, చూచినా, అవి అన్నీ 
వాని ఇంద్రియ ప్రజ్ఞలు నిర్వహిస్తాయేగాని అతడు చేయడు. అలా అని 
ఇంద్రియప్రజ్ఞలను బలవంతముగా అణగద్రొక్కడు. అ౦టే  ఆకలి
ఉంటే  ఆహారమున్నపుడు ఉపవాసముల పేరిట శరీరాన్ని 
శుష్కింపచేయడు.  అలా అని  ఆకలిలేనప్పుడు మొహమాటానికి 
తినడు.  అలాగే వాని కుటుంబ బాధ్యతలుకాని, ఉద్యోగ 
బాధ్యతలు కాని వానిచే అప్రయత్నముగా నిర్వహింపబడతాయే గాని అతడు
దేనిని స్వతంత్రించి సంకల్పించడు. అవన్నీ వానిచే 
అప్రయత్నముగా నిర్వహింపబడతాయి. మన౦  భోజన౦  చేసేటప్పుడు 
ఆహారము నోటిలో పెట్టుకొని ప్రతి ముద్దా  నమలాలని 
సంకల్పించి నమిలి మ్రింగుతున్నామా? లేక మన౦ భోజన౦ 
చేస్తున్నప్పుడు, వేరొక విషయాన్ని చూడడంకాని,
లేక సంగీతము మొదలైనవి వినడంకాని చేస్తూ అన్నము నోటిలో
పెట్టుకున్నతడవే  నమలడం, మ్రింగడం వాటంతట అవే మనకు
తెలియకుండగనే జరిగిపోతాయా? పాటవినడం పూర్తి అయిన తరువాత 
మనము చూస్తే అప్పటికి భోజనము యధావిధిగా స్వీకరించడం పూర్తి 
అయిపోయి ఉంటుంది. అన్ని పదార్థాలూ 
సక్రమ౦గానే స్వీకరింపబడతాయి. ఇది అ౦తా  మనలో
మనకు తెలియకుండా ఎలా జరిగి౦దో గమనిస్తే యోగి 
అయిన వానికి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు అలాగే 
నిర్వహింపబడతాయి. పై శ్లోకములో  చెప్పబడిన రెండు స్టితు
లు: సంప్రజ్ఞాతము మరియు అసంప్రజ్ఞాతము. 
సంప్రజ్ఞాతము అ౦టే  అన్నిటియందు వున్న ఒకే వెలుగును
దర్శించి దాని యందుండడం; అసంప్రజ్ఞాతమ౦టే  భౌతిక 
ప్రపంచముతో సంబంధములేని ఒకే వెలుగుగా తానుండడం. 
మొదటిదానిలో వ్యక్తులు, విషయములు మొదలైనవి 
ప్రమాణమనే ప్రవృత్తిలో స్వీకరింపబడతాయి. రెండవదానిలో 
వాటి సంస్కారములు లేక అంశలు మాత్రము వుంటాయి. వానికి కర్తవ్యమే కాని 
సంకల్పము లేదు. అ౦టే ప్రతీకారము లేదు. వానికున్నది ఒక్కటే. 
అదే "తాను". అతడు తనయందు తానుండగా పనులు 
అప్రయత్న౦గా మనస్సు ఇంద్రియములు, శరీరము మొదలైన 
వాటిచే నిర్వహింపబడతాయి. 

19

భవ ప్రత్యయో విదేహ ప్రక్పతి లయానాం.


భవప్రత్యయోః 	= పుట్టుకకు ఆధార మైనట్దిది 
విదేహ 		= దేహములేనట్టివారికి
ప్రకృతిలయానాం  = ప్రకృతియందు లయ మైనట్టివారికి

  శరీరములేనట్టివారికిని మరియు ప్రకృతియందు లీనమై
  యున్నట్టి వారికిని (ఇది) పుట్టుకకు ఆధారమై యున్నది.

  


విదేహల౦టే  శరీరమందున్నా లేనట్టివారు. అంటే  వీరు
వృక్ష జంతు స్టితులలో, అణుదశలోకూడా ఉన్నారు.
వీరు పురుషరహిత స్టితిలో ఉంటారు. అ౦టే  వీరు శరీరము
వేరుగా నున్నా, లేకున్నా ప్రకృతిలో  ఉండి పని 
చేస్తారు.  కాబట్టి  వీరు దేవలోకమునకు చెందినవారు. వీరికి
(అ౦టే దేవతలకు) శరీరమక్కరలేదు. కాబట్టి విదేహలని 
పిలవబడతారు. వీరు మన శరీరములలో గ్రహణశక్తిగాను,  ఊహలు,
ఆలోచనలుగాను, జ్ఞాపకశక్తిగాను,  అభ్యాసముగాను పని చేస్తారు. 
యోగి తన భౌతిక వ్యాపారములను నిలిపివేయగానే ఈ
విదేహులనేవారు శరీరమును వదిలి ప్రకృతియందు లయమవుతారు. 
అక్కడినుండి వారు ప్రపంచ౦లో  మానవజాతియొక్క
మొత్తాన్ని  వ్యాపిస్తారు. అటుతర్వాత అన్ని భూతములలో ,
 జీవులలో వ్యాపిస్తారు. తర్వాత భూమిలో 
అన్ని అణువులలోనూ,  దాని నుండి, సౌరమండలము
ప్రవేశించి చివరకు అన్నిటికి కారణమైన పరమాత్మగా
వ్యాప్తి చెందుతారు.

ఇక్కడ దేవతలు వ్యాపించుట అంటే యోగి 
లోని ఉత్తమ సంస్కారములు వ్యాపించడం. మనలో నున్న 
ఉత్తమ సంస్కారములుగా దేవతలు పనిచేస్తారు. కాబట్టి 
యోగిలోని ఉత్తమ సంస్కారములను ఇలాగ  వ్యాపి౦ప చేసి
చివరకు అంతర్యామిలోకి విస్తరింపచేస్తారు.  అక్కడ నుండి 
మరల వారు సృష్టిలోకి దిగివస్తారు.  కాని అలా రావడం 
ఇతరులను సేవించడం కొరకేకాని తమ గురించి కాదు. 
మరల వేరొక జీవికి శిక్షణ ఇవ్వడానికే  తప్ప ఇంకొక కారణ౦ 
లేదు. అలాగ  శిక్షణ పొందిన వ్యక్తి యోగి అవుతాడు. వారికి 
శరీరము, బంధము కాదు. అలాంటివారు ఇతరులకై  జీవిస్తారు. 
అలాంటి యోగులందు దేవతలుకూడ తమ కర్తవ్యము పూర్తయినది 
కాబట్టి  వారిని శరీరములో బంధింపరు. అనగా శరీరమక్కరలేని స్థితి 
లోనికి వారిని పరిణమింపజేస్తారు.  కాబట్టి  అటువంటి
యోగికూడ వారిలో కలసి విదేహమను స్టితిలో ఉంటాడు. 

20

శ్రద్దా వీర్య న్మృతి సమాధి ప్రజ్ఞావూర్వక ఇతరేషా౦


శ్రద్ధా  = శ్రద్ధ 
వీర్య = బలము,
స్మృతి = జ్ఞాపకము
సమాధి = సమాధి
ప్రజ్ఞాపూర్వకః = ప్రజ్ఞతో మొదలైనది
ఇతరేషాం = ఇతరులకిరకు.

ఇతరులకు ఇది నిరంతర శ్రద్ధ, ప్రయత్నము,
పునఃశ్చరణ, సమాధి మరియు జాగరూకత 
మొదలైన  వాని వలన సాధ్యమగును.
  


విదేహులు మరియు సమాధిస్టితిలో నున్న యోగులకు
యోగజీవనము నిరంతరము అవ్యయము మరియు శాశ్వతము.
వారెప్పుడు యోగమునందే యుండి అట్టి యోగమునకు గురువులుగా 
మరియు మార్గదర్శకులుగా ఉంటారు. శ్రీకృష్ణుడు అటువంటి 
వారిలో, కుమారసర్గమును, సప్తర్షులను, మనువులను, మరియు
నారదుడు, దేవలుడు, వ్యాసుడు అను ఋషులను ప్రత్యేకముగా
పేర్కొన్నాడు. వారి అస్తిత మనే వెలుగులో జీవులందరూ రక్షణ
పొందుటేగాక, నిజమైన యోగ  జీవితమునకు కొనిపోబడతారు. 
 
ఇది ఇలా ఉండగా సమస్త జీవులను అలాంటి  మార్గములకై, 
తమంతటతాముగా జన్మల పరంపరలో ఎప్పుడో ఒకప్పుడు
మొదటి అడుగు వేయవలసి వస్తుంది. దాని కొరకై 
తన దేహశక్తులను, ప్రజ్ఞలను సమీకరించుకొనవలసి ఉంటుంది.
నిరంతరం మెలుకువ కలిగి జీవితములో ఏమరపాటు లేకుండ
ఉండాలి. అంటే  జీవిత ప్రణాళికలో  మెలకువ కలిగి
ఉండాలి. యోగజీవనము గురించి తెలుసుకొని, ఆచరించే 
మనస్తత్వము  కలిగి ఉండాలి. అతని ప్రయత్నము
చక్కగా పురోగమించుట తోడనే అతడు యోగి అవుతాడు.

అంటే  జీవి తన జీవిత సంఘటనలన్నింటిని ఒక ప్రత్యేక
దృష్టితో గమనించుకొనవలసియుండాలి. ప్రతి సంఘటనలో 
తాత్కాలిక కష్టసుఖములేగాక వాటిలోని పరమార్హమును
గమనించాలి. పరమార్హమనగా దేని వలన  ఆత్మసంతృప్తి,
సమర్పణ బుద్ధి, ఔదార్యము మొదలైన సద్గుణములు మనలో 
వికసించునో, అదియే. ప్రతి సంఘటన సన్నివేశము ప్రత్యక్షముగా
కాని, పరోక్షముగా కాని జీవియందు మార్పు కలిగిస్తూ ఉంటుంది. 
అటువంటి మార్పులను గమనించడమే మెలకువ. అలాంటి 
మెలకువ గలవాడే యోగి. 

Friday, August 4, 2023

Patanjali Samaadhi Paada First Prakarana (Slokas 1-11)

upanishad


  


మొదటి ప్రకరణము: ఐదు మూల ప్రవృత్తులు

1

అథ యోగానుశాసనమ్

By స్వామీ  వివేకానంద 

ఇక ఏకాగ్రత లక్షణాల గురించి చెప్పుకుందాం 
  


2

యోగశ్చిత్తవృత్తి నిరోధః


చిత్తవృత్తులను నిగ్రహించటమే యోగం 
(చిత్తం = అంతఃకరణం)
  

నాకు కన్నులున్నాయి. కాని, అవి తమంత తామే 
చూడలేవు. మెదడులో నేత్ర నాడీ కేంద్రము౦టుంది;
దాన్ని తీసివేయండి. కన్నులు మామూలుగానే 
ఉంటాయి. రెటీనా (నేత్రా౦తఃపటలం) కూడా 
చక్కగానే ఉంటుంది. దానిపై ప్రతిబింబాలు 
పడుతూనే ఉంటాయి. అయినా సరే, కన్నులు 
రూపాలను చూడలేవు. కాబట్టి కన్నులు 
అప్రధాన సాధనాలు; అవి చూసే ఇంద్రియాలు 
కావని తేలుతోంది కదా!

మెదడులోని ఒక నాడీ కేంద్రంలో ఈ చూసే 
ఇంద్రియము౦టుంది. కన్నులున్నంత 
మాత్రాన చూపు౦టుందని చెప్పలేం. ఒక 
వ్యక్తి కన్నులు తెరచుకొని నిద్రిస్తున్నాడు. 
చుట్టూత మంచి వెలుతురుంది. వెలుపలి 
వస్తువుల నుండి ప్రతిబింబాలు కూడా 
ఏర్పడుతున్నాయి. అయినా వస్తువు 
కనిపించదు. కారణమేమిటంటే వీటికి 
తోడుగా మరొకటి ఉండాలి. అదే మనస్సు. 
ఇంద్రియంతో మనస్సు సంయోగం 
చెందాలి. అప్పుడే వస్తువు కనిపిస్తుంది. 

కన్ను వెలుపలి ఉపకరణం. దీనికి 
మెదడులోని కేంద్రం మనోనియంత్రణం 
సహాయపడాలి. అప్పుడే కన్ను గ్రహించే 
రూపం కనిపిస్తుంది. దారివెంట వాహనాలు 
వెళుతున్నాయి. అయినా వాటి చప్పుడు 
మనకు విన్పించుట లేదు. ఎందుకని?

మన మనస్సు, "చెవి" అనే ఇంద్రియ 
పరికరంతో సంయోగం చెందటం లేదు. 
ఉపకరణం, ఇంద్రియం ఈ రెంటితో కలిసే 
మనస్సు అనే మూడు విషయాలు ఈ 
క్రియలో ఉన్నాయి. 

వీటి మూలంగా వచ్చే స్పర్శ (వార్త) 
మనస్సులోని బుద్ధికి చేరుతుంది. 
"నిశ్చయం" చేసే పని బుద్ధిది. బుద్ధి 
నిశ్చయం చేస్తుంది. అదే బుద్ధి 
ప్రతిక్రియ. 

ఈ ప్రతిక్రియను వెన్నంటి అహంభావం 
ఉంటుంది. ఈ క్రియ ప్రతిక్రియల 
సంయోగం పురుషునికి (ఆత్మకి) అందుతుంది;
పురుషుడు మన నిజాత్మ క్రియాప్రతిక్రియల 
సమ్మేళనంగా పురుషుడు విషయాన్ని 
గ్రహిస్తాడు. 

ఇంద్రియ౦, మనస్సు, బుద్ధి, అహంభావం 
వీటిని అంతఃకరణ చతుష్టయమంటారు. 
నిజానికి ఇవన్నీ చిత్తం చేసే వేరు వేరు 
వ్యాపారాలే. చిత్తంలోని సంకల్పాలే 
వృత్తులు. మరి సంకల్పమంటే ఏమిటి?

అదొక శక్తి. భూమ్యాకర్షణశక్తి లాంటిదే. 
ప్రకృతిలో ఆనంతశక్తిరాశి ఉంది. దాన్ను౦డి 
చిత్తం కొంత శక్తిని గ్రహిస్తుంది. ఆ 
శక్తినే సంకల్ప రూపంగా బయటికి పంపుతూ 
ఉంటుంది. 

ఆహారం వల్లే ఈ శక్తి మనకు లభిస్తుంది. 
ఆహారం ద్వారానే శరీరం కదలికలు చేసే 
శక్తిని పొందుతుంది. ఇతర సూక్ష్మ శక్తులు 
కూడా సంకల్ప రూపంలో ఆహారం ద్వారా 
వెలువడుతున్నాయి. కాబట్టి చిత్తం 
కూడా ఒక పదార్థమే. 

అది స్వయంగా చైతన్యవంతం కాదు. 
మరది చైతన్యవంతంగా ఉన్నట్లు 
కనిపిస్తుంది కదా! అంటారా? 

చిత్తం వెనుక చైతన్యవంతుడైన పురుషుడు 
ఉన్నాడు సుమా! అందుకే చిత్తం అలా 
కనిపిస్తుంది. నువ్వే అసలు చైతన్యం. 
చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే; దాని 
ద్వారా నువ్వు ప్రపంచాన్ని గ్రహిస్తావు. 

ఈ పుస్తకముంది కదా; బాహ్య ప్రపంచంలో 
ఇది పుస్తక రూపంలో లేదు. బాహ్యంలో 
మరది ఏమై వుందో అది మనకు తెలియదు;
తెలియబోదు. ఈ అజ్ఞాత వస్తువు వల్ల 
చిత్తానికి ఘర్షణ ఏర్పడుతుంది. రాతిని 
నీటిలో వేస్తే, నీటిపై తరంగాలు బయల 
దేరుతాయి. అలాగే వస్తువుతో చిత్తానికి 
సంఘర్షణ కలగగానే, చిత్తంలో పుస్తక రూప 
ప్రతిక్రియ కలుగుతుంది. నిజంగా 
ప్రపంచమంటే ఏమిటి?

బాహ్యవిషయాలతో చిత్తం చేసే ప్రతిక్రియా 
రూపమైన సంఘటనలే. పుస్తక రూపం, 
ఏనుగు రూపం, మనిషి రూపం అంటూ 
బాహ్య ప్రపంచంలో ఏ రూపాలూ లేవు. 
బాహ్య స్పర్శతో చిత్తంలో కలిగే 
ప్రతిక్రియలనే మనం గ్రహిస్తుంటాం. 
జాన్ స్టూవర్ట్ మిల్, "స్పర్శాది ఇంద్రియ 
అనుభూతుల శాశ్వత సంభావనీయతే 
భౌతిక ప్రకృతి" అని అంటాడు. 

బాహ్య ప్రపంచంలో శబ్దాది విషయాలు 
మాత్రమే ఉన్నాయి. ఒక ముత్తెపు చిప్పను 
తీసుకోండి; మంచి ముత్యం ఎలా 
తయారౌతుందో మీకు తెలుసు కదా!
పరాన్నభుక్కు అయిన క్రిమి ఒకటి 
ముత్తెపు చిప్పలో ప్రవేశిస్తుంది. చిప్పకు 
కంపనాలు కలిగిస్తుంది. దానితో చిప్ప 
పింగాణి వంటి పదార్థాన్ని ఆ క్రిమి 
చుట్టూ వెదజల్లుతుంది. అదే 
ముత్యమవుతుంది. 

ఈ దృశ్య ప్రపంచం కూడా మనం 
వెదజల్లే పింగాణి అనే చెప్పాలి. యథార్థ 
ప్రపంచం ఆ క్రిమిలాంటిది. ఈ యథార్థ 
ప్రపంచాన్ని సామాన్యులు ఎప్పుడూ 
గుర్తించలేరు. తెలుసుకునే ప్రయత్నం 
చేసినా, తాము కల్పించే భావనా 
ప్రపంచమే వారికి కనిపిస్తుంది. 

చిత్తవృత్తులంటే ఏమిటో ఇప్పుడు మనకు 
తెలిసింది కదా! మనస్సుకు పురుషుడు 
ఆధారం. అతని చేతిలో మనస్సు ఒక 
పరికరం. అతని చైతన్యమే మనస్సు 
ద్వారా వెలువడుతోంది. 

నీవు మనస్సుకు ఆధారం, కాబట్టి మనస్సు 
చైతన్యవంతమవుతోంది. పురుషుడు 
మనస్సును త్యాగం చేస్తే, వెంటనే అది 
నశించి పోతుంది. చిత్తం అంటే ఇదే. 
చిత్తం మనస్సనే పదార్థం. బాహ్య 
విషయాలతో చిత్తానికి సంయోగం 
కలగటంతో, వృత్తులనే తరంగాలు 
చిత్తంలో లేస్తాయి. ఈ వృత్తులే సుమా,
మన ప్రపంచం. 

అలలతోనున్న కొలను అడుగుభాగాన్ని 
మనం చూడలేం. అలలు అణిగిపోయి,
నిశ్చలమైనప్పుడే అడుగు భాగం క్షణ 
కాలం మనకు కనిపిస్తుంది. నీరు 
మలినంగా ఉన్నా, కదులుతున్నా నీటి 
అడుగుభాగం మనకు కనిపించదు. 

చిత్తమనే సరస్సు అడుగుభాగమే మన 
నిజ స్వరూపం ఆత్మ. చిత్తంలో 
చెలరేగే వృత్తులే తరంగాలు. చిత్తానికి 
మూడు స్థితులున్నాయి: సాత్త్వికం, 
రాజసం, తామసం అని. 

పశువుల్లోను, పశుప్రాయుల్లోను 
తామసికత (అజ్ఞానంధకారం) అధికంగా 
ఉంటుంది. ఈ స్థితిలోని చిత్తానికి 
ఇతరులకు హాని చేయటమే స్వభావమై 
ఉంటుంది. విషయభోగాలను, 
అధికారాన్ని కోరటం రాజసిక చిత్త 
ముఖ్య లక్షణం. ఇలాంటి చిత్త స్థితి,
"శక్తిమంతుడినై అందరిపై అధికారం 
చూపిస్తాను." అన్న ప్రేరణకు 
గురిచేస్తుంది. 

శాంతం, ప్రసన్నత సాత్త్వికస్థితి 
లక్షణం. ఈ స్థితిలో మనస్సులో ఎలాంటి 
తరంగాలుండవు; నిర్మలంగా ఉంటుంది 
కానీ అది జడత్వం కాదు. సాత్త్విక మనస్సు 
ధృతి ఉత్సాహాలతో కూడి ఉంటుంది. 
శాంతంగా ఉండటమంటే ఎక్కువ 
శక్తిని ప్రదర్శించటం. పని చేస్తుండటం 
(చపలంగా ఉండటం) చాలా సులభం. 

కళ్ళె౦ వదిలిపెడితే, గుఱ్ఱాలు ఇష్టం 
వచ్చినట్లు పరుగులు పెడతాయి. ఇది 
అందరికీ సాధ్యమే. కాని, గొప్ప వేగంతో 
పరిగెత్తే గుఱ్ఱాలను అదుపు చేయగలవాడే 
నిజంగా బలవంతుడు. అదుపు చేయటానికి 
మాత్రమే చాలా బలం కావలసి ఉంటుంది. 
వదిలి పెట్టడానికి బల మెందుకూ?

కాబట్టి శాంతచిత్తుడంటే, పనిపాటలు లేక 
మందుడై, అలసుడై, ఉండేవాడు కాదు. 
సత్త్వమంటే అలసత్వం, సోమరితనం అని 
అనుకోవద్దు. చిత్తవృత్తుల్ని నిరోధించేవాడే 
సుమా! ప్రశాంతచిత్తుడు! నికృష్టబలాన్ని 
ప్రకటిస్తే అది ప్రవృత్తి; ఉత్కృష్టబలాన్ని 
ప్రకటిస్తే అది ప్రశాంతత. 

తన సహజ శుద్ధావస్తను చేరటానికే 
మనసెప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. 
అయితే ఇంద్రియాలు మాత్రం మనస్సును 
బయటికి లాగుతూ ఉంటాయి. ఇలా మనస్సు 
వెలుపలికి వెళ్ళకుండా అరికట్టటమే 
మనో నిగ్రహం; మనస్సును నిగ్రహించి,
ప్రజ్ఞాన ఘన ఆత్మలో లయం 
చేయటానికి దాన్ని అంతర్ముఖం చేయటమే 
యోగానికి మొదటి మెట్టు. మనోనిగ్రహానికి 
ఇదే సరైన దారి. 

క్రిమికీటకాలు మొదలు పశుపక్ష్యాదులదాకా 
అన్ని జంతువుల్లోనూ మనోవ్యాపారం 
కనిపిస్తూ ఉంటుంది. మనిషిలో మాత్రమే 
మనస్సు బుద్ధి రూపాన్ని ధరిస్తుంది. 

చిత్తం బుద్ధి రూపం పొందాలి; అప్పుడే 
నివృత్తి మార్గం అవలంబించటం సాధ్యం 
అవుతుంది; అనేక సాధనలు చేసిన 
తరువాత ఆత్మ ముక్తి పొందటానికి వీలు 
అవుతుంది. ఆవు, కుక్క మొదలైన 
జంతువులకు మనస్సు౦ది; నిజమే, కానీ 
వాటి మనస్సు, బుద్ధి అనే రూపాన్ని 
పొందలేదు. కాబట్టి సత్వరం ముక్తి 
పొందటం వాటికి సాధ్యంకాదు. 

చిత్తానికి రకరకాల అవస్థలున్నాయి:

	1. క్షిప్తం  అంటే చెల్లా చెదురై పోవటం 
	2.మూఢ౦ అంటే చీకటిలో/అజ్ఞానంలో 
			ఉండటం 
	3. విక్షిప్తం అంటే ప్రోగు చేసుకోవటం 
	4. ఏకాగ్ర౦ అంటే ఒకే లక్ష్యం పట్ల 
		దృష్టి ఉంచడం (ఈ స్థితిలో 	
		ఇతర వృత్తులు కూడా 
		స్వల్పంగా ఉంటాయి )
	5.నిరుద్ధం అంటే తీక్షణమైన ఏకాగ్రత/
		సమాధి (ఈ స్థితిలో ఇతర 
		వృత్తులు ఉండవు)
		
సుఖదుఃఖాల్లో ఇలాంటి మనస్థితి 
వ్యక్తమౌతూ ఉంటుంది. ప్రమాదాన్ని 
కలిగించే సోమరితనం మూఢావస్థకు లక్షణం. 
దేవతలకు విక్షిప్తావస్థ; రాక్షసులకు 
క్షిప్తావస్థ సహజమని యోగసూత్ర వ్యాఖ్యాత 
చెబుతాడు. నివృత్తి విక్షిప్తావస్థకు లక్షణం. 
చిత్తం ఏకాగ్రత కావటానికి ప్రయత్నించే 
సమయంలో ఏకాగ్రస్థితి ఏర్పడుతుంది. 
ఏకాగ్రస్థితి నుండి సమాధిస్థితికి 
కొనిపోయే స్థితే నిరుద్దావస్థ. 

3

తదా ద్రష్టుః స్వరూపే అవస్తానమ్

By స్వామీ వివేకానంద


యోగావస్థలో ఉండే కాలంలో సాక్షి 
అయిన పురుషుడు, తన స్వరూపంలో 
నెలకొని ఉంటాడు. 
  

అలలన్నీ ఆగిపోయి, సరస్సు నిర్మలంగా 
ఉన్నప్పుడు అడుగు భాగాన్ని మనం 
స్పష్టంగా చూస్తాం. అలాగే మనస్సు 
ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనం మన 
స్వరూపాన్ని తెలుసుకోగలం. ఆ 
స్థితిలో మనస్సుతో తాదాత్మ్యం చెందకుండా 
ఆత్మ స్వరూపులమై ఉంటాం. 

4

వృత్తి సారూప్య మితరత్ర

By స్వామీ  వివేకానంద 

ఇతర సమయాల్లో (యోగంలో లేని 
సమయాల్లో) పురుషుడు వృత్తులతో 
సమాన స్వరూపాన్ని పొంది ఉంటాడు 
  

ఎలా అంటారా? ఉదాహరణకు ఒకరు 
నన్ను తిట్టారనుకోండి, ఆ తిట్టు వల్ల 
నా మనస్సులో ఒక వృత్తి కలుగుతుంది. 
ఆ వృత్తితో నేను ఏకమైపోతాను. దాని 
ఫలితం నాకు దుఃఖం

5

వృత్తయః పంచతయ్యః క్లిష్టాక్లిష్టః

 వృత్తయః 	= ప్రవ్రుత్తులు 
 పంచతయ్యః = ఐదు విధములు 
 క్లిష్టాః 		  = క్లిష్టమైనవి 
 అక్లిష్టాః 	 = సులభమైనవి 
 

  మనః ప్రవృత్తులు క్లిష్టములు, సులభములు 
  అను రెండు విధములు 
  

మనస్సు తన ప్రవృత్తి చేత అనేక 
విధములైన మార్పులకు లోనవుతుంది. 
మనస్సులో పరిస్థితులకు 
ప్రతీకారచర్యగా ఇలాంటి మార్పులు 
జరుగుతాయి. ఇది ప్రజ్ఞ 'తాను' (i am)
అను స్థితిను౦డి చలించడంవల్ల  
నేర్పడుతోంది. అంటే తన నుండి ఇతర 
మున్నదని అంగీకరించడవల్ల ఏర్పడుతుంది.  
ఇతరము అంటే బింబ ప్రతిబింబ న్యాయమును 
మరవడం. ఇదే అసత్తు (objectivity). 
నోటిలో రొట్టెముక్కను కరుచుకొనియున్న
కుక్క నీటిలోనికి తొంగిచూచి భ్రమపడి 
మొరుగుట౦ వలన  తన నోటిలోని రొట్టె ముక్కను 
పోగొట్టుకోవడం వంటిది ప్రస్తుతము జీవుడున్న 
స్థితి. అ౦తా  తానుగా నిండియున్న ప్రజ్ఞను 
మనం 'అంతర్యామి' యని వ్యవహరిస్తాము. 
అలాగే  ప్రవాహిస్తున్న నీరు వేరువేరు 
బిందువులుగా చిందునట్లు ఒక్కటిగానున్న 
అంతర్యామి ప్రజ్ఞ వేరువేరు జీవులుగా లేక 
ఆత్మలుగా చిందిపోతో౦ది. ఏనీటి 
బిందువు కానీటి బిందువు, తననుండి ఇతరమైన  
బిందువులను చూసి అవికూడా 'నీరే' అనే 
పరమాంశాన్ని విస్మరించి మరొక నీటి 
బిందువుగా, లేక ఇతర బిందువులుగా 
గుర్తించునట్టు, జీవ ప్రజ్ఞ ఇతర జీవులను 
తననుండి వేరుగా గమనిస్తుంది. ఇట్లు వేరు 
అను ప్రవృత్తినే మనం 'మనస్సు' అని అంటాము. 
నీటిలోని తన ప్రతిబింబము వేరొక జీవిగా 
భ్రమపడినట్లు జీవాత్మ సృష్టిలో  సకల 
భూతాలను (Beings) తననుండి వేరుగా 
చూస్తుంది. తాను, ఇతరము అను వ్యత్యాసము 
వలన ఈ సృష్టి ఏర్పడుతోంది. 
  
మొదట 'నేను' లేక 'తాను' అనే  వెలుగు 
కేంద్ర౦గా ఈ సృష్టే పరిధిగా సృష్టి 
నిర్మాణము జరిగింది. ఆ వెలుగు యొక్క 
కిరణములు జీవులు. ఆ కిరణాల విశ్లేషణము వలన  
నేర్పడిన రంగులే మనస్సు, ఇంద్రియములు 
మొదలైనవి. అలాంటి  విశ్లేషణము వలన వర్ణ 
భేదములేర్పడి, వాటి కలగాపులగాలే 
పరిస్థితులుగా ప్రతిబింబిస్తున్నాయి. దీనినే 
మనం సృష్టిగా అంటే ప్రపంచముగా 
పొరబడుతున్నాము. అంటే ఇది అబద్దమని 
కాదు కానీ సత్యము కూడా కాదు. పైన చెప్పిన 
నీటి బిందువులు ఒకదానికొకటి వేరను మాట 
అబద్ధము కాకున్నా,  అవి అన్నీకలిపి 
నీరనడం అంతకన్నా మిక్కిలి మరియూ 
శాశ్వతమైన సత్యము కదా! కాబట్టి తననుంచి 
ఇతరమున్నదని అంగీకరిస్తే,
మనస్సులో వికారము ఏర్పడుతుంది. నిజానికి  
అలాంటి  వికారమే మనస్సు. ఆ వికారముల ప్రభావమే 
ఆలోచనలు మరియు సంస్కారములు. వీటినే 
జీవలక్షణములని అంటారు. ఇలాంటి  జీవ లక్షణములు 
పరిస్థితులు వాటిలోని వ్యక్తుల మధ్య 
తారతమ్యలనేర్పరచుకొని దాని వలన 
అనుకూలము, ప్రతికూలము అనే ద్వంద్వ 
వైఖరిని మనస్సులో సృష్టించుకొ౦టున్నాయి. 
దీని ప్రభావము వలన  మిత్రులు, శత్రువులు, బంధువులు,
వస్తువులు వాటి విలువలు మొదలైన  అనేక 
వికారములు ఏర్పడుతున్నాయి. 
  
నిజానికి జాగ్రత్తగా గమనిస్తే,
ఇక్కడ గందరగోళాలకి  తావేలేదు. తనలోని  
భిన్న ప్రవృత్తులే, లేక లక్షణములే 
ఒకదానికొకటి విరుద్ధముగా ఉండడం వలన 
జీవిత౦లో  అటువంటి సంఘర్షణలుగా
వ్యక్తమౌతాయి. అంటే ప్రేమ, ద్వేషము అనే భిన్న 
లక్షణములు గల మనస్సుకి  తనకనుకూలముగా 
నున్న వాళ్ళని ప్రేమించడం, లేనివారిని 
ద్వేషించడం ఏర్పడుతుంది. తానే ఇతర జీవుల 
రూప౦లో  నున్నానని తెలిసిన వానికి 
సంఘర్షణ యుండదు. ఆ ఇతర జీవులు తన 
భార్య అయినా,  మిత్రులైనా, శత్రువులైనా 
తన మనస్సులోని వికారములు, లేక 
ప్రవృత్తులే తనకు అద్దము పట్టబడుతున్నాయని  
తెలుసుకొని వారితో సమన్వయము చెందుతాడు. 
దీనినే  యోగమంటారు. యోగమ౦టే  సమన్వయ 
పూర్వకమమైన కలయిక. అలా కాకపోతే  తన 
భార్య తన మాట వినాలని, వినకపోతే 
కోప్పడడం మొదలైన  వికారములు ఏర్పడి
దాని వలన మనస్సు క్లిష్టత చెందుతుంది. ఇదే 
పై సూత్ర౦ ప్రతిపాదించేది. 

6

ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః

ప్రమాణ  		= ప్రమాణము లేక కొలత 
విపర్యయ			= వ్యతిరేకమైన (తప్పుడు కొలత)
వికల్ప 			 = శూన్యము (కొలత లేనిది)
నిద్రా 			  = నిద్ర 
స్మృతయః 	   = స్మృతి 

  పైన చెప్పబడిన ప్రవృత్తులు ప్రమాణము,
  విపర్యయము, వికల్పము, నిద్ర మరియు స్మృతి 
  

ఈ చెప్పబడిన ఐదు మౌలిక ప్రవృత్తుల ననుసరించి 
జీవికి ప్రవర్తన ఏడ్పడుతోంది. వ్యక్తులలో అనేక 
వేల, లక్షల ప్రవర్తనలుండవచ్చు. కానీ మౌలిక 
ప్రవృత్తులు (Basic Aspects of Behavior) 
మాత్రము ఐదు. అవి:

1. ప్రమాణము అంటే నిజమైన కొలత లేక 
గ్రహణముకు చిహ్నము. నీవొక గ్రంథాన్ని 
చదువేటప్పుడు ఆ గ్రంథ కర్తను గురించి నీకొక 
అవగాహన ఏర్పడుతుంది. అదే నిజ౦గా 
గ్రంథము చదువుట. అలా  అవగాహన ఏర్పడాలంటే 
కర్తకు నీకు మధ్య ఒక సంజ్ఞానముచ్చయముండాలి. 
అటువంటి సంజ్ఞలే గ్రంథకర్త ఉపయోగించే వాక్యములు. 
ఈ వాక్యములు పదములచే ఏర్పడతాయి. పదము 
కొన్ని అక్షరములు లేక శబ్దముల సంపుటము. 
ఇలాంటి  శబ్దములకు సంజ్ఞలే అక్షర లిపి. కాబట్టి 
ఇక్కడ  గ్రంథకర్త యొక్క సందేశమునకు ఈ 
లిపిలోని  అక్షరములు వాహికలు అవుతున్నాయి. 
గ్రంథకర్త మరియు పాఠకుడు అను ఇరువురిచే 
ఈ సంజ్ఞలు ఒకే అర్థమున ప్రయోగింపబడి అర్థము 
చేసికొ౦టే  వాటిని "ప్రమాణము" అంటారు. 
కాబట్టి ప్రమాణము విస్మరి౦పకపోతే   సందేశము 
చక్కగా అవగతమగుతుంది. అంటే ఇక్కడ 
రచయిత మరియు, పాఠకుల ప్రవృత్తి ఒక్కటే 
యని క్లిష్టత లేదని అర్థము. 

అట్లే ఏదైనా శాస్త్రములో గానీ, సైన్స్ లో గానీ 
నీవు ప్రమాణములను ఇలాగే ఉపయోగింప 
బడ వలసి ఉంటుంది. ఇతర వ్యక్తులు మరియు 
వస్తువుల యందు మరియు వారి ప్రవృత్తి 
యందు, దీనిని ఇదే విధముగా గమనింపవలసి 
ఉంటుంది. వ్యక్తులను, పరిసరములను 
ప్రమాణముగా స్వీకరించేవానికి జీవిత౦లో  
క్లిష్టత యుండదు. అంటే ఏ వ్యక్తికావ్యక్తియే 
ప్రమాణముగా స్వీకరింపాలి గానీ 
ఇతరులతో పోల్చకూడదు. ఇతరులను గురించి 
మన అభిప్రాయము లెప్పుడూ ఒకరితో 
నొకరికి పోల్చి చూడడం మీద  ఆధారపడి 
ఉంటాయి. ఎవరైనా, తనని 
గౌరవించకపోతే  అంతకు ముందు తనను 
గౌరవించినవారితో పోల్చుకుని వారి లాగ 
ఇతడు గౌరవింపబడలేదని తాను బాధపడతాడు. 
ఎక్కడ  ఎవరికి వారే ప్రమాణము. అంటే 
ఒక్కొక్క జీవి ప్రవృత్తి ఒక్కొక్క విధముగా 
ఉంటుంది. ఒకరిలాగ  ఇంకొకరుండుట 
సాధ్యము కాదు. దీనిని అంగీకరించడం వలన  
ఎవరికి వారే ప్రమాణమనగా సత్యమని 
కూడా అర్థము. ఎరుపు, నలుపు, పసుపు, మొదలైన 
రంగులు వేనికవే ప్రమాణములు. 
ఎరుపు రంగుకు ఎరుపు రంగే ప్రమాణము 
కానీ దానిని నలుపు రంగుతో పోల్చడం సరికాదు. 
అలాగే  రాత్రి పగలు అనేవి ఒకదానికొకటి 
వ్యతిరేకముగా కనిపించినా  ప్రమాణములే 
గాని సామ్యములుగావు. గ్రహించినవానికి ఒక 
రంగుమీద అభిమానము గాని ఇంకొక 
రంగుమీద ద్వేషముగానీ ఉండదు. ఇదే  
ప్రమాణము. దీనిని వ్యక్తులలో, 
పరిసరములలో, వస్తువులలో 
గమనించువానికి క్లిష్టత యుండదు. అంటే 
అతడు ఉదాసీనుడుగా, తటస్థుడుగా ఉంటాడు.
అతనికి ప్రమాణము మీద, సత్యము మీద 
అభిలాష ఉంటుంది కానీ వ్యక్తుల మీద 
ఉండదు. అందువలన అతడెటువంటి పరిస్థితులలో 
జీవించుచున్నా వాని వలన 
బంధముండదు. అంటే వాని మనస్సుపై వాటికి 
వేరుగా ప్రభావము౦డదు. 

2. విపర్యయము 

విపర్యయమ౦టే వ్యతిరేకముగా పోల్చుట. 
అంటే మన మిట్టి పోలీకలను, కొలతలను 
తప్పు పద్ధతిలో నుపయోగిస్తే 
జీవితము తప్పొప్పుల పట్టికవలె అవుతుంది. 
పైన చెప్పిన గ్రంథములో  రచయిత 
పదములను తప్పుడర్థముతో ఉపయోగించినా 
లేక పాఠకుడు తప్పడర్థముతో చదివినా  
అది విపర్యయము. అలాగే  స్నేహితులనుగానీ,
బంధువులనుగానీ, వారి దృక్పధములో 
నుండిగాక నీ దృక్పధము నుండి చూస్తే 
వారు విపర్యయముగా అర్థమవుతారు. అంటే 
చెడ్డవారిగా, యిష్టము లేనివారలుగా 
కన్పిస్తారు. 

అలాగే  నీవు సంపాదించిన ధనమువలన 
మంచి విషయములను లేక వస్తువులను 
పొందగల్గితే  అది ప్రమాణము. 

నీవు సమాజమునకు చేసిన సేవకు 
ప్రతిఫలముగా సమాజము నీ కిచ్చే 
జీతము ద్రవ్యము. ఇక్కడ ద్రవ్యము నీ 
సేవకు పర్యాయము మాత్రమే. అలా గాక 
ధనమువలన మాత్రమే సుఖము పొంద 
వచ్చునను అభిప్రాయము కలిగితే  
అది విపర్యయ మవుతుంది. 

దానివలన యాచించుట, అప్పుతెచ్చుట, లేక 
దొంగలించుట మొదలగు దుర్లక్షణములు 
పుడతాయి. అదే విపర్యయము. 

అలా గాక నీవితరులకు చేసిన సేవకు 
ప్రతిఫలముగా ధనము ద్వారా కొన్ని 
సౌకర్యములు, సౌఖ్యములు కల్పింప
బడుతున్నాయని  గమనిస్తే  అది 
ప్రమాణమవుతుంది. 

అలాగే  ధనమున్న౦తమాత్రాన అదే 
సంపద అనుకోవడం పొరబాటు. అపుడు 
సుఖము౦డదు. అపుడు ధనమును 
గురించి ఆందోళన, ఆత్రుత మొదలైన 
వాటివలన ఆరోగ్యమనే మూల ధనము 
దెబ్బ తి౦టుంది. 

కాబట్టి ఇక్కడ ధనము సుఖములు, లేక 
సౌకర్యములు పొందడానికి  నిమిత్తము 
కావచ్చునుగానీ ధనము సూటిగా వాటిని 
కల్పింపలేదు. ఆకలి తీర్చుకొనడానికి  
కావలసిన ఆహారమును సంపాదించుకోడానికి 
ధనము కారణము కావచ్చును గానీ, ధనమే 
ఆకలిని తొలగింపలేదుకదా!

అంటే తినుటకు పనికిరాదుకదా! కానీ 
అలాగని  వైరాగ్యమను పేర ధనమును 
ద్వేషించుట సరికాదు. ధనము సూటిగా 
సుఖమును కలిగింప లేకపోయినా, 
ధనము ద్వారా సుఖము పొందబడుచున్నదికదా!

అలాగే  తన భార్యను తానన్న ప్రజ్ఞకు 
ప్రతిరూపముగా తెలుసుకొన్న వానికి 
అదియే ప్రమాణమవుతుంది. ఆమెను 
ఒక సేవకురాలిగా చూసేవాడికి  అది ఒక 
విపర్యయ మవుతుంది. అంటే క్లిష్టతను 
కలిగిస్తుంది. 

అలాగే ఆమెను తన కామమునకుపయోగపడు 
మాంసపు ముద్దగా చూచేవాడికి  అది ఒక 
విపర్యయము. దీనివలన వాని ప్రవృత్తిలో 
క్లిష్టత సంభవిస్తుంది.  

3. వికల్పము 

వికల్ప మనగా సంకల్పములు లేని 
శూన్యస్థితి. ధనము వినియోగమువలన 
మాత్రమే ఉపయోగపడేది. అలాంటి 
ధనమును వినియోగింపకుండా ఒకచోట 
కూర్చి దానిని చూచుకుంటూ  
సంతోషిస్తూ ఉంటే అది నిజమైన 
సంతోషము కాదు. 

అలాగే  భార్యకు విడాకులిచ్చిన 10 
సంవత్సరముల తరువాత ఆమెను 
చూపించి ఈమె నా భార్య అ౦టే 
అది అర్థములేనిది. కనుక వికల్పము. 

అలాగే మనస్సు ఆందోళన పూరితమై 
ఉద్వేగముతో "శాంతి శాంతి" అని 
అరుస్తే  అది కూడా వికల్పమే. 

ఇంకా సుఖము కోసము రాత్రింబగళ్ళు 
శ్రమించి పనిచేసే వానికి 
సుఖమెక్కడిది? వానికి ధనము యొక్క 
లావాదేవీలతో దినమంతా చాలదు;
ఇక ధనము ననుభవించటం ఎప్పుడు?
సుఖమెక్కడ?

ఒక యువకుడు ప్రక్కపై కూర్చుని 
ఒక నగ్న స్త్రీని ఊహించుకుంటూ 
సెక్సు సాహిత్యమును చదువుతే 
అది కేవలము ఊహయే కనుక 
వికల్పము. దానివలన అతని మనస్సు 
క్రమేణా వ్యాధిగ్రస్త మవుతుంది. 

కాని నిజానికి వికల్పము వలన 
కొన్ని మంచి విషయములు కూడా 
సాధించ వచ్చు. ధ్యానము,
భగవత్ సాన్నిధ్యము, క్రమశిక్షణతో 
గూడిన జీవితము మొదలగునవి,
ఊహపై నాధారపడేవేకదా! అవి 
వికల్పములైనా క్రమేణా 
ప్రమాణములవుతాయి. 

4. నిద్ర 

నిద్ర కూడా మౌలిక ప్రవృత్తులలో 
ఒక్కటి. నిద్ర అంటే ప్రవృత్తి 
లేకుండా ఉండడం. కాని ఇది శాశ్వతమైన 
ప్రవృత్తి లేని నిరామయ స్థితి కాదు. 
ఇది కూడా తాత్కాలికమే. 

మానవ శరీర యంత్రమునకు నిద్ర 
మిక్కిలి అవసరం. దాని వలన 
శరీరము స్వస్థత చెంది ఆరోగ్యవంతమై,
శక్తియుతమై, తేజోవంతమవుతుంది. 

కనుక మానవ ప్రవృత్తులలో నిద్ర 
కూడా నొకటి. దీనిని ప్రమాణము అను 
ప్రవృత్తిని అర్థము చేసికొన్నట్లుగా 
చేసికొ౦టే చక్కగా సద్వినియోగమవుతుంది. 

5. స్మృతి 

స్మృతి అంటే జ్ఞాపకము తెచ్చుకొనుట. 
మనస్సు ఇంద్రియముల పూర్వ 
అనుభవములననుసరించి మరల అదే 
విషయమును లేక వస్తువును మనస్సునందు 
సృష్టించుకొ౦టుంది. భౌతిక విషయములు 
ఇంద్రియముల ద్వారా మనస్సును 
ప్రభావితము చేస్తాయి. ఆ వస్తువు 
తొలగిపోయిన తరువాత కూడా మనస్సుపై 
బడిన ప్రభావము సంస్కారరూపమై 
బీజముగా మనస్సునందు నిలిచిపోతుంది. 

ఈ బీజము మరలా భౌతిక ప్రపంచమున 
మొలకెత్తి వృక్షముగా విస్తరింపగలదు. 
చిత్రకారుడు, శిల్పి మొదలైనవారు తమ 
మనస్సులలోని రూపాములనే భౌతిక 
ప్రపంచములో నిజమూర్తులుగా 
మలచుచున్నారు కదా!

బ్రహ్మ కూడా ఒకసారి సృష్టి జరిగి,
ప్రళయము వచ్చి, పిదప నూతన సృష్టిని 
ప్రారంభింప గలగడానికి  కారణము 
ఈ స్మృతియే. 

దీనిని ప్రమాణముగా తీసుకొ౦టే 
మనలో ఉన్న "నేను" మరల స్మృతికి 
తేగలదు. అంటే తనను తాను 
తెలుసుకొన గలుగు స్థతికి చేర్చగలదు. 

మనం మన ప్రస్తుత బాహ్య ప్రవర్తనతో 
కూడిన స్థితి నుండి నిజమైన, నిత్యమైన,
స్థితిలోనికి దీని వలననే చేరగలుగు
చున్నాము. 

గమనించినచో మన లోని  అభ్యాసము 
లేక అలవాటు అను స్థితికి మూల 
కారణము ఈ మన స్మృతియే. దీనిని 
యోగాభ్యాసముగా మార్చుకొ౦టే అదే 
మనల్ని సత్యస్థితి లోనికి చేర్చ గలదు. 

కాఫీ, టీ, సిగరెట్టు మొదలైనవి 
స్వీకరించడం  అలవాటైన మానవుడు 
వాటిని మరలా స్వీకరింపకుండా నుండలేడు. 
దీనినే సరియైన మార్గములో నుపయోగిస్తే,
అంటే ఉదయముననే లేచుట, ధ్యానము 
చేసికొనుట, గ్రంథములను పఠించుట 
మొదలైన  మంచి అలవాట్లను శ్రద్ధగా 
అలవరచుకొ౦టే దాని వలన మనస్సు 
క్రమేణా వికాశవంతమై మోక్షమునకున్ముఖము 
అవుతుంది. 

కాబట్టి  ఈ పై వాటిని గమనిస్తే 
ఈ ఐదింటిలో నాలుగు ప్రవృత్తులు మనకు 
యోగాభ్యాసమునకు అవశ్యకములేయని 
తెలుస్తోంది.

విపర్యయ మొక్కటే అక్కరలేని ప్రవృత్తి. 
దీనికి కూడా  ఒక ఉపయోగము కలదు. అది 
ఏమనగా దుఃఖమ౦టే ఏమిటో తెలిసికోవడం 
వలన మానవుడు సుఖమును పొందగలుగు 
చున్నాడు. విపర్యయము వలన జీవితము 
క్లిష్టమై దుఃఖమును కలిగించును. అప్పుడు 
మానవునకు సుఖమనగానేమో, దానిని 
సాధించుకొనుట ఏట్లో తెలుస్తుంది. 

7

సూః ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని

ప్రత్యక్ష 		= ఎదురుగా నున్నది 
అనుమాన 	   = అనుమానము 
ఆగమాః 		= ఉచ్చరింపబడినట్టిది 
ప్రమాణాని 	  = ప్రమాణము లేక సరికొలతలు 

  ప్రత్యక్షము, అనుమానము, మరియు ఆగమము 
  అనునవి మూడును ప్రమాణములు 
  

ఇంతకు ముందు చెప్పబడిన వానిలో ప్రమాణము 
ఐదు మౌలిక ప్రవృత్తులతో అత్యంత ప్రధాన 
మైనదని తెలుసుకొన్నాము. ఇపుడు దానిని 
గురించి మరి కొంత తెలిసికొ౦టాము. ఈ 
ప్రమాణము 3 విధములుగా ఉంది. అవి:

    1. ప్రత్యక్షము 
    2. అనుమానము 
    3. ఇతిహాసము లేక పురాణము లేక ఆప్త వాక్యం 
    
ఈ మూడిటిని  మన పెద్దలు మనకు 
తెలిసిన దాని కన్నా విశేషమైన, విలక్షణమైన 
రీతిలో నుపయోగించేరు. 

1. ప్రత్యక్షమ౦టే కంటికి ముందున్నది అని 
అర్థము. మన ఐదు జ్ఞానే౦ద్రియముల ద్వారా 
ఏది గ్రహింపబడుచున్నదో అదియే ప్రమాణము. 

కంటిద్వారా రాత్రింబగళ్ళను, సృష్టిని, తోటి 
జీవులను దర్శించుచున్నాము. అట్లే ఒకరి 
వాక్కులు వినిపించినచో మనం వానిని 
చూడలేక పోయినా  అక్కడ ఒక వ్యక్తి 
ఉన్నాడని గ్రహిస్తాము. 

అలాగే వాసనవలన వస్తువులను, పువ్వులను 
గ్రహిస్తున్నాము. రుచి వలన ఆహార 
పదార్థములను గురించి తెలుసుకుంటున్నాము. 
ముట్టుకొనుట (స్పర్శ) వలన వేడి,
చల్లదనము గ్రహిస్తున్నాము. 

ఇలాగ పంచేంద్రియముల వలన 
వస్తువులను గురించి, వ్యక్తుల గురించి 
తెలియ బడుతుంది. 

ఇలాగ ఇంద్రియముల ద్వారా గ్రహింపబడునవి
ప్రత్యక్షములనబడును. కాని ప్రత్యక్షము 
లనగా కళ్ల కెదురుగా నున్నవి మాత్రమే. 
ఇవే ప్రమాణముగా స్వీకరింపబడతాయి. 
మిగిలినవి అనుమానము చేత 
నిర్దారణ అవుతాయి. కనుక అవి 
ప్రమాణముగా పరిగణింపబడవు. 

2. అనుమానము 

అనుమానమ౦టే  మనస్సుకు గాని,
ఇంద్రియములకుగాని గోచరించు విషయముల 
కతీతముగా ఒక వస్తువును గురించి 
పరోక్షముగా ధారణ చేయడం. గదికవతల 
నున్న గులాబీపూవు పరిమళము మనకు 
కిటికీ ద్వారా తెలియునప్పుడు గులాబీపూవును 
కంటితో చూడకుండానే మనమక్కడ 
గులాబీ యున్నదని నిర్ధారిస్తాము. 

ఇక్కడ  గులాబీపూవు యొక్క ఉనికి 
దానిని కంటితో చూడకు౦డ కేవలము 
వాసనతో నిర్ధారిస్తాము. ఇలాగే 
అంతర్యామి యొక్క సాన్నిధ్యము కూడా 
అనుమానము చేత నిర్ధారింపబడుతుంది. 

ప్రకృతిలోని విశేషములను గమనిస్తే 
వీటిని నడుపు మహాశక్తి యొకటి 
అంతర్లీనముగా నున్నదని మనం 
అంగీకరించి తీరాలి. 

3. ఆగమః 

ఆగమమనగా వాక్కు లేక వేదము. అంటే 
ఉచ్చరింప బడినది అని అర్థము. 
నిజానికి  వేదమ౦టే  ఒక గ్రంథము 
కాదు. వేదము ప్రకృతికి కారణమైన 
మహాశక్తి. సృష్టియ౦దలి ద్రవ్యము,
శక్తి, మరియు ప్రజ్ఞ అనువాని కలయిక చేత 
సమస్తము నేర్పడుచున్నది. 

మట్టి రేణువు నుండి, సూర్యునివరకు 
సమస్తము ఒక చిత్రమైన మరియు,
అన్ని౦టికీ అతీతమైన ధర్మమును 
అనుసరించి పనిచేస్తోంది. దీనినే 
పరమధర్మ మంటారు. 

ఈ పరమధర్మము సూర్యుని ద్వారా సౌర 
మండలముగా అంటే సౌర ధర్మముగా 
విస్తరిస్తోంది. 

దానిననుసరించి భూమికి, చంద్రునికి,
ఇతర గ్రహములకు ధర్మము లేర్పడు 
తున్నాయి  

The law of planetary consciousness
which differentiates into various
layers of nature and creation.

పంచదార తియ్యగా ఉండడం, ఉప్పు 
ఉప్పగా ఉండడం, నీరు ప్రవహించడం,
అగ్ని దహించడం మొదలైనవి పైన 
చెప్పబడిన పరమధర్మము నుండి 
ఏర్పడిన ఉపధర్మములు, లేక చిల్లర 
ధర్మములు. 

అంటే ఈ చిన్న ధర్మములన్నీ 
వేనికవిగా వర్తించక పైన చెప్పబడిన 
శాశ్వత ధర్మము యొక్క అంగములుగా 
వర్తిస్తాయి. 

ఎండాకాలము, వానాకాలము, చలికాలము 
మొదలగునవి సంవత్సర చక్ర౦లో 
ఆకులుగా నేర్పడి, ఒకదాని తర్వాత 
ఒకటి ఒక క్రమమైన పద్దతిలో వర్తించు 
చున్నాయి  కాని అస్తవ్యస్తముగా వర్తించుట 
లేదు. 

అంటే జీవితము, సంపద, సుఖము, 
వానివలన శాంతి, అనేవి శాశ్వత 
ధర్మము యొక్క ప్రధానాంశములని 
గమనిస్తే మనకు బోధపడును. 
ప్రకృతిలోని ధర్మములన్నీ  ఈ 
అంశములకు సమన్వయముగా 
వర్తిస్తున్నాయి. 

దీనినే సృష్టి సంకల్పము అని కూడా 
పిలుస్తారు. నిజమైన మానవుడు ఈ 
సృష్టి సంకల్పము ననుసరించి 
జీవించును గాని తాత్కాలికమైన 
సంపదలను, సౌఖ్యములను లెక్క 
చేయడు. జీవులందరి సౌఖ్యము,
సంపదలతో సంబంధము లేని శాంతి 
అనునది సాధించుటయే వాని 
లక్ష్యము. 

సృష్టి సంకల్పము ననుసరించి సృష్టి 
ధర్మములు ఏర్పడినవి. వాని 
ననుసరించి సృష్టి ఏర్పడినది. కనుక 
పరమాత్మ నుండి వ్యక్తమైన ఈ సృష్టి 
సంకల్పమే "వాక్కు" లేక వేదము 
అను పేర పిలువబడినది. 

అన్ని ప్రమాణములూ, అనుమానములూ
ఈ వాక్కు ననుసరించి యేర్పడినవి. 
కనుక ఇదియే నిజమైన ప్రమాణము. 

ఈ ప్రమాణము ననుసరించియే 
మిగిలినవి గమనించి ధారణ చేయ 
వలసి యుండును. దీని ననుసరించి 
వ్రాయబడిన గ్రంథమే నిజమైన గ్రంథము. 

అదియే వేదము.

8

సూః విపర్యయో మిథ్యాజ్ఞాన మత ద్రూప ప్రతిష్ఠమ్

విపర్యయ 		= విపర్యయము 
విథ్యాజ్ఞానము 	   = జ్ఞానము లేని స్థితి 
అతద్రూప 		= నమ్మకములేనిది 
ప్రతిష్ఠమ్ 			= స్థాపన చేయబడినది 

  విపర్యయము, లేని విషయమును వున్నట్లుగా 
  స్థాపన చేసి మిథ్యాజ్ఞానము  (భ్రాంతి)
  కలిగించును 
  

విపర్యయము 5 మౌలిక ప్రవృత్తులలో నొక్కటి. 
దీని వలన లేనిది ఉన్నట్లుగా కనిపించును. 

ఒకడు భార్యను సత్యముగా తలచినచో 
అది పొరపాటు. అంటే భార్య అను తనచే 
ఆపాదింపబడిన ధర్మము ఆమెకు సత్యము 
కాదు. ఆమె మొదట స్త్రీ. భార్య యను 
ధర్మము వీనిని ననుసరించి మాత్రమే 
తాత్కాలముగా పనిచేయును. అట్లు 
కానిచో మామిడి చెట్టు ఎవరికైననూ 
మామిడి చెట్టే అయినట్లు ఆమె కూడా 
తనకేగాక ఎవరికైననూ భార్య యగుటలేదు. 
వీనికొక్కనికి మాత్రమే భార్య. 
మిగిలినవారికి స్త్రీ. అంటే ఆమె మొదట 
స్త్రీగానే పుట్టినది. తర్వాత అతని కోరికపై 
భార్యగా నుండుటకు అంగీకరించినది 
కనుక భార్య అయింది. ఇది విస్మరించిన 
వాడు ఆమె భార్యయని సత్యముగా 
నమ్మితే  తాను బాధపడవలసి యుండును. 
అంటే ఆమెకు కూడా  అభిలాషలు, 
ఆపేక్షలు, ఊహలు, ఆలోచనలు 
తనకున్నట్లే నున్నాయని, తాను తన 
భార్యకు భర్తగా మాత్రమే కాక 
ఇతరులకు తండ్రిగా, సోదరుడుగా, 
స్నేహితుడుగా, శ్రేయోభిలాషిగా ఎలా 
మెలగుచున్నాడో అలాగే ఆమెకు కూడా 
అలాంటివి  కలవని తెలియ వలెను. లేకపోతే 
అంతా గందరగోళమై 
భార్యవలన సౌఖ్యము బదులు సంఘర్షణ,
మనస్తాపము మిగులును. 

ఇట్లు స్త్రీని, స్త్రీగా కాక భార్యగా 
ప్రతిపాదించుకొనడం విపర్యయము 
అనబడును. అలాగే  మన స్నేహితుల 
యందు, తోటివారి యందు, 
అధికారుల యందు దీనిని 
గుర్తు౦చుకోకపోతే  చిక్కులు ఎదురవుతాయి. 

9

సూః శబ్ద జ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః

శబ్ద జ్ఞానానుపాతీ 	= శబ్దము యొక్క అర్థమును 
					అనుసరించునది 
వస్తు శూన్యము 	  = వస్తువులేనిది 
వికల్పః 		  = వికల్పము 

  వికల్పము అంటే శబ్దము యొక్క అర్థము 
  ననుసరించునది మరియు అస్తిత్వము లేనిది 
  

సాధారణ౦గా పదాలు భౌతిక వస్తువుల 
నుద్దేశించి ఉంటాయి. అ౦టే  వస్తువుల 
ననుసరించే  పదాలు ఏర్పడతాయి. 

పర్వతము అనే  పదాన్ని తీసుకొ౦టే,
ఈ పదము పర్వతము పుట్టిన చాలాకాలము 
తర్వాత పర్వతమును గుర్తుంచుకోవడానికి  
మానవులచే నుపయోగింపబడేది. 

పర్వతము అనే  పదము విన్నంతనే,
మనలో అ౦టే మనస్సులో ఒక ఎత్తయిన 
మరియు మిక్కిలి పెద్దదయిన రాతిగుట్ట 
స్ఫురిస్తుంది. 

కాని కొన్ని పదాలు అలాకాక మరొక 
విధ౦గా ఉపయోగ పడతాయి. సంతోషము 
అనే పదము అటువంటిది. అ౦టే  సంతోషము 
అనేది  భౌతికము కాదు. ఒకడు 
సంతోష౦గా ఉన్నానని  మనకు 
చెప్తే  వాడు సంతోష౦గా ఉండడాన్ని 
మనం ఊహించి చెప్తామే  గాని వాని 
మనస్సులో నిజ౦గా ఏము౦దో తెలియదు. 

అలాగే  ఆశలు, కోరికలు, ఆశయములు, లక్ష్యములు,
ఉద్దేశ్యములు, ఆదర్శములు మొదలైనవి. ఇవి 
కేవలము పదాలే కాని, వాటికి అస్తిత్వము 
లేదు. ఇవి కేవలము ఉన్నట్లు కనిపించి 
మానవుని భ్రమపెడతాయి. 

కాబట్టి యోగసాధకుడు ఇలాంటి  వికల్పాలను 
వదిలిపెట్టాలి. అ౦టే  వీటిలో ఎక్కువ  
భాగము మన మనస్సు నుండి  పుట్టినవే 
కాని సత్యములు కావు. 

ప్రతివాడూ తనచుట్టూ ఉన్న వారిని గురించి 
మరియు పరిసరముల గురించి  కొన్ని 
అభిప్రాయములు, ఉద్దేశ్యములు కలిగి 
ఉంటాడు. అవి వానికి సంబంధించినవే 
కాని సత్యములు కావు. 

ఒక అధికారి తన క్రింద పనిచేస్తున్న 
వారిని గురించి, తన సౌకర్య౦ కోసం  
ఆఫీసు వారిచ్చిన కారు, ఇల్లు మొదలైన  వాటిని 
గురించి  అవి అన్నీ తనకోసమే 
యేర్పరుపబడినవి అని తలుస్తాడు. వారందరు 
తనను సేవించడానికి యున్నారని తలస్తాడు.. 
ఇవి వాని అభిప్రాయాలే కాని సత్యములు 
కావు. 

అధికారి తన ధర్మము పాటిస్తున్నట్లే 
మిగిలిన వారు తమ ధర్మాలను 
పాటిస్తున్నారు. అధికారికి ఉద్యోగ 
విరమణ వలనగాని, మరి ఏ యితర కారణముల 
వలనగాని పైన చెప్పబడేవి దూరమైతే  
ఆ అధికారికి సత్యము అప్పుడు బోధపడుతుంది. 

ఇదే  వికల్పము.  వికల్పములను 
తొలగించు కొనే  వానికి మాత్రమే వాటిలో 
ఒకే సత్యము బోధపడుతుంది. 
దానినే పరమాత్మ అంటారు. 

10

సూః అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా

అభావ 			= లేనట్టిది 
ప్రత్యయా 		  = సంబంధించినది 
ఆలంబన 		  = ఆధారమైనట్టిది 
వృత్తిః 		   = ప్రవృత్తి 
నిద్రా 			  = నిద్ర 

  అభావము లేక అసత్యముపై నాధారపడి 
  ప్రవృత్తి కలిగినది నిద్ర 
  

మన మనస్సు మరియు ఇంద్రియాల
ద్వారా తెలియబడే దానిని ఆస్తిత్వమని 
అంటారు. కాని అస్తిత్వము లేనిది అంటే 
అసత్తు (non existence) అంటే ఏమిటో 
మనకు తెలియదు. 

ఎందుచేతన౦టే  అక్కడ మనం లేము కనుక. 
కాబట్టి  అసత్తు అంటే మిథ్య అని, 
భ్రాంతి అని మనకు అనిపిస్తుంది.  నిజానికి 
అసత్తు ఉ౦దా? అలాంటిది ఉండడం 
సాధ్యమా? అనే ఎన్నో ప్రశ్నలు మనలో 
తలెత్తుతాయి. దీనికి సమాధానము ఉ౦దా 
అ౦టే, ఉ౦దని చెప్పాలి. 

అసత్తు సాధ్యమే అని మన కర్థము 
కాకపోయినా అలాంటిది ఉ౦దని ఒప్పుకోక 
తప్పదు. అయినా దానికి ఋజువే౦టి?

మనం ప్రతిదిన౦  ఉండుట, లేకుండుట 
అనే  రెండు స్థితుల మధ్య  ప్రయాణము 
చేస్తున్నాము. ఈ లేకుండుట అనే స్థితి 
మనకు నిద్ర అనే పేరుతో అనుభవానికి 
వస్తోంది. 

మెలకువగానున్నప్పుడు మనం ఉన్నట్లే,
నిద్రిస్తున్నప్పుడు మనం లేము. 
అ౦టే మన౦ నిద్రిస్తున్నప్పుడు మనకు 
తెలియదు కదా!

నిద్ర పూర్తయిన తరువాత మన౦ 
నిద్రిస్తున్నట్లు తెలుస్తుంది గానీ,
నిద్రపోయేటప్పుడు మన౦ నిద్రిస్తున్నామని 
తెలియదు గదా!

అలా తెలుస్తూ ఉంటే అది నిద్ర ఎలా అవుతుంది?
కాబట్టి  మనం ఉన్నట్లు మనకు 
తెలియనప్పుడు సహితము మనం ఉన్నామని 
మనకు ఋజువవుతోంది. 

ఇందుకు సాక్ష్యము మన౦ నిద్రిస్తున్నప్పుడు
ఊపిరితిత్తులు, గుండె మొదలైనవి  పని
చేస్తూ ఉంటాయి. కాని మనస్సు, ఇంద్రియములు 
మాత్రము తాత్కాలికముగా పనిచేయవు. 

కాబట్టి  మనం ఉన్నట్లు మనకు తెలియక పోయినా  
మనం ఉన్నామని మనకు తెలుసు. కనుక 
అసత్తు అనబడేది  సాధ్యమేనని తెలుస్తోంది. 

ఇక్కడ నిద్ర అంటే  మెలుకువ వచ్చిన 
తరువాత  మనమింతకు ముందు నిద్రించేమనే 
సత్యము వలన  తెలుస్తోంది. 

ఇదే  పైన సూత్రీకరింపబడి౦ది. దీని వలన 
ఇంకొకటి తెలుస్తుంది. మనం మనకు 
తెలియకుండానే నిద్రలో ఎలా ఉన్నామో అలాగే 
మనం పుడుతూ, మరణిస్తూ ఉన్నా,  
నిద్రలో ఉన్నట్లే మనం ఉండగలమని 
తెలుస్తోంది.

అట్లే సృష్టి ఉన్నా, నశించినా  
ఉండగలము. ఇలా ఉండడాన్నే  అంతర్యామిలో 
ఉండడం లేక పరమాత్మగా ఉండడం. 

అప్పుడు శరీర౦లో ఉన్నప్పటికీ,
మనస్సు, ఇంద్రియములు పరమాత్మ యొక్క 
ఆస్తిత్వములుగా తెలుసుకొన్న వానికి 
వుండకపోవుటయన్నది లేదు. దీనినే 
యోగము (fusion) అంటారు. 

11

అనుభూత విషయాసంప్రమీషః స్మృతిః

అనుభూత 			= అనుభూతమైనట్టిది 
విషయా 			 = విషయములు 
అసంప్రమీషః 		  = చెదిరిపోనట్టిది 
స్మృతిః 		   = స్మృతి 

  స్మృతి యనగా ఇంతకు ముందు అనుభూతమైనట్టి 
  విషయమును చెదిరిపోకుండనుంచు ప్రవృత్తి 
  

మనస్సు, భౌతిక వస్తువుల అస్తిత్వము తన 
ఇంద్రియముల ద్వారా గ్రహిస్తుంది. ఇచ్చట 
మనస్సు చూసేది  వస్తువు యొక్క 
ప్రతిబింబమేకాని, వస్తువుని తనలోనికి 
స్వీకరింపలేదు కదా!

అంటే మనం రుచి చూస్తున్నా,
వాసన చూసినా  లేక విన్నా ఇవి 
అన్నీ  ఆయా విషయములయొక్క 
అనుభవము మనలో మేల్కొని, తర్వాత 
వాటి తాలూకు సంస్కారములుగా 
నిలిచియుండడం. 

మరలా ఆ వస్తువు పేరు వినగానే ఈ 
మొత్తము అనుభవము మనలోనికి తిరిగి 
సాక్షాత్కరిస్తుంది. దీనినే జ్ఞాపకము అంటారు. 

ఇలా జ్ఞాపకము అన్నది  మన అనుభవాలనే 
సంస్కారములకు కోశము లేదా నిధిగా 
పనిచేస్తుంది. ఇటువంటి  సంస్కార పేర్పు 
వలన మానవునికి యోగ సాధన జరుగుతోంది. 

అంటే అటువంటి అనుభవములు, స్మృతులును
సద్వినియోగమొనర్చుకొనేవాడు పరిపూర్ణుడై,
ముక్తుడై అంతర్యామియందు లయమవుతాడు. 

జ్ఞాపకములను సద్వినియోగమొనర్చుట 
యనగా తాను చూచిన, విన్న, మంచి 
విషయములను మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడం. 

తిరుపతివంటి ఒక పుణ్యక్షేత్రము దర్శించి 
వచ్చినవాడు అచ్చట గడిపిన దివ్య 
క్షణాలను, పరమాత్మ దర్శనమును 
మరల మరల జ్ఞప్తికి తెచ్చుకొ౦టే   
వాని మనస్సు వాని ప్రయత్నము లేకుండానే  
దివ్యత్వము పొందుతుంది. 

అలాగే  ఒక మహానుభావుని, లేక పుణ్యపురుషుని 
దర్శించిన లేక వానితో సహచరించిన సంఘటనలు,
క్షణములు స్మృతికి వస్తే  అది 
మరల మరియొక సందర్శనమై మనను 
ప్రభావితము చేసి మనస్సు ఆనందమయము 
చేస్తాయి. 

ఇలాగే  సద్గ్రంథ పఠనము కూడ. వివేకవంతుడైన 
మానవుడు ఈ స్మృతిని  సద్వినియోగము 
చేసుకొని నిత్యత్వము పొందుతాడు. 

అలా ఉ యోగించుకొనలేని ఇతరులు ఈ 
స్మృతి వలననే బంధాలను సృష్టించు 
కొ౦టున్నారు. 

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...