Wednesday, October 4, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 10-13)

upanishad


  


10

తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః

ప్రతిప్రసవపేయాః = ప్రత్యాహారముచే నాశనము 
			చేయబడినవి 
సూక్ష్మాః = సూక్ష్మములైనవి

  పైన చెప్పబడిన క్లేశములు మనోమయకక్ష్యయందు విత్త 
నములుగానుండును. వాటిని మనంతట మనము విసర్జింపచేసుకొ 
నలేము

  



అట్టి క్లేశములు నీ మార్గము నుండి తొలగిపోవాలంటే 
అట్టి విధానము వేరుగానుంటుంది. సాధారణ౦గా ఒక వ్యక్తిపై
ద్వేషము కలుగవచ్చు. అట్టి ద్వేషము తొలగించుకొనుటకు 
అనేక ప్రయత్నములు చేస్తాము. కాని అది సాధ్యముకాదు.
ఇంకొక మార్గము ఏమనగా మనల్ని ఇంకొక వ్యక్తి ద్వేషిస్తే,
మనకెట్లుండునో గమనించడం. దీని వలన మనకితరులపై
ద్వేషము నశిస్తుంది. అట్లు ఇంకొకరు అహంకారముతో  మనయందు
ప్రవర్తిస్తే , మనము అట్టి అహంకారము ఇంకొక వ్యక్తిపై  చూపిస్తే,
అతడెలా  బాధపడతాడో  ఊహించుకు౦టే  మనకు అహంకారము 
కలుగదు. దీని వలన మన అహంకారము తొలగిపోతుంది.
ఇటువంటి  ప్రక్రియతో పై శ్లోకములలో చెప్పబడిన క్షేశములన్నింటిని
తొలగించవచ్చును.

11

ధ్యానపాయాస్త ద్వృ త్తయః

ధ్యాన హేయాః = ధ్యానము చేత తొలగింపబడునవి 
తత్‌ + వృత్తయః = అట్టి  ప్రవృత్తులు

అట్టి ప్రవృత్తులు ధ్యానము చేత తొలగించుకొనవలెను
  

మనము కావలసినదానిగురించి ధ్యానము చేస్తే, అక్కరలేనిది 
దానంతట అదే తొలగిపోతుంది. ఈ క్లేశములను 
గురించి  అవి ఎలా కల్పింపబడుతున్నాయో, ఎలా మనల్ని 
బాధిస్తున్నాయో  మొదలైన  విషయాలనాలోచించడం వ్యర్థ౦. 
అయిష్టతను గురించి  ధ్యానము చేసేవానికి అయిష్టతే  
మిగులుతుంది. కాని యోగియైన వాడు ఆచరించవలసిన విధానము 
వేరుగా ఉంటుంది. అతడు అయిష్టతను ధ్యానము చేయుట 
అనగా ఇష్టాయిష్టముల రెండింటికి కారణమయిన పరమాత్మను 
ధ్యానము చేయుట, లేక తననుండియే అవి రెండును పుట్టు
చున్నవనీ, కనుక తానే అన్నిటికి మూలకారణమనీ ధ్యానము 
చెయ్యాలి. ఓంకారము, ఉచ్చ్వాస, నిశ్వాసములు ధ్యానము 
చెయ్యాలి. ఇటువంటి విధానముల వలన పైన చెప్పబడన క్లేశములు 
తొలగింపబడతాయి. 

13

సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః



సతిమూలే = మూలమున్నప్పుడు 
తద్వివాకః = దానివిపాకము 
జాతి = పుట్టుక 
ఆయుర్‌ భోగాః = అయుస్సు మరియు సుఖము 

మూలమట్లేయున్నచో దాని వలన పుట్టుక, ఆయుస్సు 
మరియు అనుభవము మున్నగునవి ఏర్పడును. 
  

పుట్టుక,  ఆయుర్దాయము మరియు జీవత సంఘటనలు
మొదలైనవి  ఒక కారణము ననుసరించి ఏర్పడుతున్నాయి. ఈ
కారణము చెట్టుకున్న వేరు వంటిది. చెట్టువేరు భూమిలో అంతర్గత౦గా
ఉంటుంది. గింజ నాటిన వెనుక వేరు పుట్టి, తరువాత
క్రమేణా మొక్క పై కెదుగుతుంది. ఇలా భూమి పైకి అకులు,
కొమ్మలుగా  విస్తరించిన వృక్షము పండ్లను యిస్తుంది. చెట్టు
విత్తనము మంచిదైతే  తియ్యటి పండ్లనిస్తుంది. లేకపోతే పుల్లగా
నుండవచ్చు. ఇవన్నీ గింజపై ఆధారపడి ఉంటాయి. 

అలాగే మనము పూర్వజన్మలో మరియు పూర్వజీవితములో చేసుకొన్న
అలవాట్లు రూపమున బాధింపబడతాము. మనము చేసిన పనుల
ననుసరించి మనలో సంస్కారములు బీజములై ఏర్పడుతాయి. కనుక
పుట్టుకనేది పూర్వ సంస్కారముల ఫలితము. అట్టి మూలము
ప్రస్తుత జన్మలో కర్మమునకు కారణముగా నుంటుంది. 

కనుక ఇది ఒక  గొలుసువంటిది. కారణములే విత్తనములు. పనులే
ఫలములు. ఇట్లు కారణములు, ఫలములు, గొలుసుకట్టులా  నేర్పడి 
మానవుని బంధిస్తాయి. అట్టి  గొలుసులను త్రెంచుట 
వీలగునా అంటే, వీలగును. లేకపోతే ఇక ధ్యానమార్గము,
యోగము, తపస్సు ఎందుకు? 

కొందరు కర్మబంథములు త్రె౦పుట
సాధ్యముకాదని అంటారు. కాని అది సరికాదు. అట్టివారు 
కర్మబంధముతో పెనుగులాడుట, ప్రయత్నించి ఓడిపోవుట మొదలైనవి 
జరుగుతాయి. కర్మబంధము తొలగాల౦టే, ఓంకారమును 
ధ్యానము చెయ్యాలి. సమస్తము పరమాత్మకు సమర్పణము
చేసి, ధ్యానము చెయ్యాలి. అతడు సృష్టియందున్ననూ, నిజమునకు 
సృష్టియే ఆయన నందున్నది. పైన చెప్పబడిన కర్మ 
బంధముకూడా ఆయనలోని భాగమే. నీవు చేసేపనులకు కారణము 
నీవేయని తలిస్తే  నీవే బాధ్యత వహి౦చాలి. 

అలాకాక పరమాత్మే సమస్తమునకు కారణముగా నున్నాడని 
తెలుసుకు౦టే కర్మబంధము కూడా వానిలో భాగమే కనుక 
బంధింపదు. అట్టివారికి పుట్టుక మరియు, జీవిత సంఘటనలు 
బంధింపవు. ఒక యజమానికి ఇంటి కార్యక్రమము బంధ
కారణము. అదే ఒక పసిబిడ్డయొక్క దినవారీ కార్యక్రమమును 
గమనిస్తే అట్టి కార్యక్రమము బిడ్డ తల్లియందు౦డును గానీ బిడ్డ 
యందుండదు. బిడ్డకు కార్యక్రమమనగా ఆడుకోవటమే. 
ఇదియే ఒక యోగికిని, సామాన్య సంసారజీవికి గల భేదము 

Wednesday, September 27, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 6-9)

upanishad


  


6

దృగ్దర్శనశక్త్యో రేకాత్మ తేవాస్మితా


దృగ్దర్శనశక్త్యోః   = చూపు మరియు దర్శనము
		అను రెండు శక్తులను
ఏకాత్మతా + ఇవా = తానొక్కడనే యనునది
అస్మితా = ఉనికి 

  
చూచువాడు తనచూపుతో నేకీభవించినచో దానిని అహం 
కారము అందురు

  


కన్ను చూస్తున్నాదనీ, చెవి వి౦టున్నాదనీ,
ముక్కు వాసన చూస్తున్నాదనీ, నాలుక రుచి చూస్తున్నాదనీ,
అలాగే   చర్మము స్పృశిస్తున్నాదనీ  అనిపిస్తుంది. 
అది తప్పు. కరంటు బల్బు వెలిగిస్తే  అక్కడ 
వెలుగు నిచ్చేది బల్బుయేనా? టెలిఫోను ఉపయోగించినపుడు
నీతో మాటలాడేది టెలిఫోనుయేనా? ఇక్కడ టెలిఫోను ద్వారా 
నీవు మాట్టాడుట సత్యముగాని, టెలిఫోను మాట్లాడదు కదా?
అట్లే బల్బు ద్వారా వెలుగునిచ్చేది  విద్యుత్తే  కదా! కనుక
కన్ను ద్వారా చూసేది  నీవుకాని కన్ను చూడదు. అలాగే మిగిలిన
అవయవములు కూడా. ఆకాశము నీలముగా కనబడితే,
అలా కనబడేది నీ కంటికి గాని ఆకాశము నీలముగానున్నాదని 
అర్థము కాదు. అసలు నీవనుకొ౦టున్న ఆకాశము అనేది లేదు. 
ఆ కనిపించు నీలవర్షము నీ  కంటికలా కనిపిస్తుందిగాని సత్యము
కాదు. కనుక పరికరముల కొలతలను, సత్యముగా తీసుకొ౦టే 
నీవు మోసపోతావు. పరికరము నీవు ఉపయోగించుటకు కాని 
అదియే నీవనుకొనుట కొరకు కాదు. అట్టి ఏకీకరణము (అట్టి
విషయములే) తానని భ్రాంతి చెందుట అహంకారమనబడును. 
అట్టి భ్రాంతి యోగియైనవాడు తొలగించుకొనును.

7

సుఖానుశయీరాగః


సుఖానుశయీ = సుఖము ననుసరించుట 
రాగః = రాగము

  కోరికయనగా సుఖము ననుసరించుట 
  

నీ వొక వ్యక్తియందు యిష్టపడుతున్నావ౦టే అది అతడొక
వ్యక్తియగుట వల్లకాక అతనియందు నీకిష్టము కలుగుటవలననే. 
ఇచ్చట యిష్టము వేరు. ప్రేమ వేరు. ఒక వ్యక్తి యందు
మనమిష్టపడుతున్నామ౦టే ఆ వ్యక్తి కూడా మనయందిష్టము
కలుగుట చేతనే. అతడు మనలను ద్వేషిస్తే, మనకతనిపై
నున్న అభిమానమంతా మాయమవుతుంది. కనుక యిష్టమనేది 
చంచలము. అది ఎప్పుడు, ఎవరియందు ఎంతకాలముంటుందో 
తెలియదు. మనమనస్సు సహజముగా సుఖముకోరుతుంది. 
సుఖమును కలిగించే వస్తువులపైన, పరిసరముల పైన వ్యక్తులపైన 
మన కిష్టముంటుంది. ఆ యిష్టము సుఖముననుసరించి ఏర్పడినదేకాని,
సహజమైన ప్రేమ కాదు. అట్టి ఇష్టమనేది  సుఖము
మారినప్పుడల్లా మారుతుంది. దాని వలన అసంతృప్తి, అసౌఖ్యము
కలుగుతాయి. (పేమ అనేది  వేరు. తల్లి, బిడ్డను బిడ్డ ఇష్టాయిష్టాలకు 
 సంబంధము లేక ప్రేమిస్తుంది. 

8

దుఃఖానుశయీ ద్వేషః

దుఃఖానుశయీ = దుఃఖముననుసరించుట .
ద్వేషః = ద్వేషము 

  మనస్సు అసౌఖ్యముననుసరించుటయే ద్వేషము
  

ఒక వ్యక్తిని ద్వేషించుట అంటే  అతడు మనకెట్లు
దుఃఖము కలిగింపగలడో గుర్తుపెట్టుకొనుట. అయిష్టత, యిష్టము 
వలనే మనస్సునకు బంధము కలిగించును. ఇష్టపడకుండుట
అనగా దానిని జ్ఞాపకముంచుకొనుటయే. మన మొక వస్తువును 
గాని, వ్యక్తిని గాని ద్వేషిస్తున్నామంటే,  వారిని ప్రత్యేకముగా
జ్ఞాపకముంచుకొ౦టున్నామన్నమాట. మానవుడు సుఖమును మరచి
పోనట్లే  ద్వేషమునుకూడా మరచిపోడు. రెండూ సమముగానే 
జ్ఞప్తికుంటాయి. కనుక ఇదికూడా ఒక క్లేశమే. యోగ మార్గము
నందున్నవాడు ఇట్టి  క్షేశములను తొలగించుకోవాలంటే,
ఇంతకన్నా మంచిది మరియొక విషయమునుపాసింపవలెను. 
అటువంటిదే  ప్రేమ. ఇది మంచి విషయములందు అభిలాషగా
మనలో ప్రారంభమగును.

9

స్వరసవాహీ విదుషో అపితధారూఢో అభినివేశః

స్వరసవాహీ = తన రుచిని తానే
	ధరించియున్నది
విదుషః + అపి = విద్యాంసునకు కూడా
తధా = అట్టు
అరూఢః = పొందియున్నట్టుది
అభినివేశః = ఆసక్తి

  అభినివేశముగా తనకు రుచియెన (ఇష్టమైన) దానిని ధరించి,
స్థాపించుటకు ప్రయత్నించుట. విద్వాంసులలో సహితము 
అది ఇట్లే యుండును 

  

అభినివేశమ౦టే తన అభిరుచులను ఇతరులకాపాదించుటకు 
ఉత్సుకత జూపుట. తనకెలాంటి  అభిరుచులున్నా తప్పులేదు కాని 
తోటివారికి కూడా అదే అభిరుచి ఉండాలని  కోరుతే సరి కాదు. 
విద్యావంతులు సహితము ఇట్టి విషయాలలో పొరపడతారు. 
నీవొక వ్యక్తిని యిష్టపడితే  అదే వ్యక్తి యందు ఇతరులకు 
యిష్టము కలగాలని  కోరకూడదు. అది నీకు నీ తోటివారికి బాధ 
కలిగింపవచ్చును. కనుక క్లేశమునకిది యొక ఉదాహరణ. ఎందు
కనగా ఒకరి స్నేహితుడు ఇంకొకరికి స్నేహితుడు కాకపోవచ్చును. 
అట్లే ఒకరికి నచ్చిన గ్రంథము ఇంకొకరికి నచ్చకపోవచ్చును. 
అభిప్రాయములుగాని, ఆదర్శములుగాని ఇతరులకు యిష్టముగాక 
పోవచ్చును. గొప్పగొప్ప పండితులు సహితము తమనమ్మకాలను 
ఇతరులపై  రుద్ద ప్రయత్నిస్తారు. కనుక గొప్పతనము గురించిన 
మన అభిప్రాయము ఇతరులకాపాదించుట సరికాదు. నీవు 
నీ అభిప్రాయమును ఇతరులకు వివరిస్తే తప్పులేదు కాని 
వారు వినితీరాలని పట్టుబట్టకూడదు. ఒక వర్తకుడు వ్యాపారములో 
పోటీ ఉంటే  మంచిదని విశ్వసించుననుకొనుము.
అట్టివానితో పోటీ మంచిదికాదని నచ్చచెప్పుటకు గాని బోధించుటకుగాని
ప్రయత్నింపకు. వాని పోటీని మంచి వస్తువులను 
తెచ్చి సరసమైన ధరలకు అమ్ముటలో వినియోగించినచో జనులు
సుఖపడతారు. విద్యావేత్తలు పండితులు, రాజకీయ వేత్తలు, అట్లే 
ఇతరులనేకులు, గురువులుకూడా తమ ఇష్టాయిష్టములు నిస్సహాయులైన 
ప్రజలపై నెట్టి వారిని మరింత గందరగోళపరచి, చికాకు 
పెడతారు, అందువల్ల యోగి దీనిని పరిహరింపవలెను.

Saturday, September 9, 2023

Saara Satakamu (1-100)

సార శతకము

ఉపోద్ఘాతము

పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుడట
అని పోతనామాత్యుడు భాగవత అనువాదము ప్రారంభించగా
నే పలికెద వినమ్రముగా భూగోళ భాషలలో ఆంధ్రము లెస్స
దానిని పరభాష చెరనుండి విముక్తి చేయుట తక్షణ కర్తవ్యము

1

హాస్యముతో వ్రాయలేని పామరుడిని
జంధ్యము లేని పాశ్చాత్య దేశ వాసిని
సంధ్యా వందనము చేయని మందమతిని
మాంద్యము ఆవహించిన ఆంగ్ల విదేశిని

2

కాయకష్టము ఎండనక వాననక పని చేయు రైతుది
పరకాయ ప్రవేశము అద్వైత శంకరుని మాయది
మొట్టికాయ వేదమెరుగని కవి కోవిదునికి తగినది
జెల్లకాయ నా వలె మిడి మిడి జ్ఞానులకు మిగిలినది

3

జగాల్ని పాలించు పరమాత్మ లలితాదేవి
గజగామిని, భక్తులు కోరిన వర ప్రసాదిని,
రాగాలు అల్లు వాగ్గేయుని స్పూర్తిదాయిని
పరాగాలు జల్లు మధుపంబు ఆ జనని!

4

శంకరుని అద్వైత వైభవము జూడ మనస్సు ఝల్లను
ముక్కంటి కనులు కుట్ట మిగిలినది మూడవదే
ఒంటికంటైన భోళా శంకరుడు అద్వైతి పాద సేవ జేయ
ఒంటరిదైనది హిమగిరి తనయ నిజ శంకరుని పోల్చలేక

5

ఆంధ్రుల జన్మ హక్కు ఉత్కృష్టమైన తెలుగు భాష
ప్రవాసాంధ్రులు మొక్కు ఆంధ్ర తిరుమలేశుని
భాగ్యనగరము చెందు వ్యాపారము చేయువార్లకు
భోగము అనుభవించెడిది ఆంధ్రముకాని తెలంగాణ

6

గీతామృతమును అనురక్తితో పానము జేసి
ఏకాంతమైన సేవలో ఆర్తితో భక్తి సల్పుచు
శ్రీకాంతుని ధ్యానించు, ఆంధ్ర అనువాదక
పితామహుడు, పోతనామాత్యుడు పూజ్యుడు

7

భుజకీర్తులు విస్మరించి స్మరించు భక్తుని ఆలకించుచు
వజ్రములు పొదిగిన హేమ కిరీటము ధరింప జాలక
ప్రజలు వైకు౦ఠమునందు అత్యంత అచ్చెరువొందగా
గజమును కాపాడ హరి వడి వడి వెంట నడచు సిరిని మరచె

8

కంఠము నందు హాలాహాలము నింపి
సంకటములు కడతేర్చు, అభయమునిచ్చి
కంటకములు లేని కైలాసమున ధ్యానించు
నీలకంఠా! సుంఠయైన నాకు నీవే శరణ్యము!

9

గ్రహముల వలన ప్రకోపించిన దేహినై
ఆగ్రహముతో కూడిన దేవతల శాపగ్రస్తుడనై
గ్రాహ్యములు ఇంద్రియములను భాది౦ప
విగ్రహారాధన చేయని నను బ్రోవుము బ్రహ్మన్!

10

ప్రశస్త సప్తగిరుల వైకుంఠ ప్రవాస వాసి
సుప్రభాత పఠనముతో నెలతలో సేవిత
శంఖ చక్ర గధా వజ్ర వైరూఢ్య భూషిత
కలియుగ రాజస తామస జన పోషక, వేంకటేశా!

11

పాతివ్రత్య మహిమాన్విత భూదేవి పుత్రికా!
రాతి గుండెల వలన అరణ్యముల కేగితివి
ఇక్ష్వాకు వంశాంకురములను ప్రసవించి
నిలిపితివి రాముని ఘన కీర్తి, జానకీ మాతా!

12

నమకచమకములను శ్రద్ధతో పఠి౦చిన
శ్రీపురుష సూక్తములను భక్తితో వల్లించిన
అవతార మూర్తులను ప్రేమతో పూజించిన
తప్పునే ప్రారబ్ధ కర్మము? ఇక దిక్కెవరు నాకు?

13

సీతమ్మ మాయమ్మని పొగిడిన త్యాగరాజ స్వామికి
బ్రహ్మమొక్కటే అని ఉగ్గడించిన అన్నమయకు
నే నెవరినని ఆత్మ విచారణ చేసిన రమణ మహర్షికి
తప్పలేదు కదా వృద్ధాప్యమునందు దిన చర్య ఖర్మ

14

కలడు కలడు దీనులయందు అందురు; అది కల్ల కాదేమో!
పాపులను కూడ బ్రోచునని అందురు పుణ్య భూయిష్టులు
పాపపుణ్యములు కాని కర్మల నాచరించు మరమనుషులు
అక్కటా, కృత్రిమ మేధ ఎంత అనర్థము కొని తెచ్చునో కదా !

15

బాహ్య ప్రపంచము సత్తని వాదించు విద్వాంసులు
మనస్సులోని ప్రపంచము మిథ్యనే వైరాగ్యులు
ఒకరికొకరు తీసిపోరు, కడవరకూ సంఘటించెదరు
ఇక మనస్సు మిథ్య అని తలంచెడివారల గతి ఏమి?

16

ధనార్జన ఏడుకొండల వాడికి తెలుసును మెండుగ
జీవనాథారము కొదువలేని వారలు వాని భక్తులు
కూలికై పనిచేయు వారలకు లేదు పూజకు సమయము
ఉపనిషత్తుల సారము తెలిసిన కొందరు దిన కూలీలే!

17

వేదముల నభ్యసించితినని మిడిసిపడరాదు
ప్రహ్లాదుడు, ధ్రువుడు ఏ వేదములను చదివెను?
నచికేతుడు ఏది చదివి చిరస్మరణీయుడయ్యెను?
భక్తి మూఢము అయిన కూడ దొరుకునే ముక్తి

18

యమధర్మరాజును పరమాత్మ నియమింపగా
యమకింకరులను నియమించు వారెవరు?
కర్మ సఫలమైన దొరకునా కింకరుని ఉద్యోగము?
కింకరులు కొనిపోదురు పాప జీవులను శిక్షింప

19

పునర్జన్మ ఎట్టిది అని విచారించుట కుందేటి కొమ్మును వెతకుటయే
భద్రాచల రామదాసు చాటెను తారక మంత్రము వలన పుట్టుక సున్నా
అనగా సంచిత ఆగామి కర్మలు రామునిపై నిత్య జపము దహించు
ఇక సృష్టి చేయ పనిలేదు ఆ బ్రహ్మన్ కు తారక మంత్రము జపించిన

20

ప్రారబ్దము పూర్వ జన్మల సుకృతమందురు వేదము తెలిసినవారు
వర్ణములు విరాట్ పురుషుని నుండి ఆవిర్భవించెనందురు కొందరు
మరియు కులములు వృత్తి వలన కలిగెనందురు మరి కొందరు
వర్ణము, కులము పద్మపత్రమివా౦భస అని చెప్పక చెప్పెను గీతాచార్యుడు

21

ధైర్యము విలోలంబయ్యెను, ఏలన దేవుని దండము వలన
సూర్యుడు చలించును ఆ పరమాత్ముని భయము వలన
పంచభూతములు పనిచేయు బ్రహ్మన్ యందలి వెఱపు వలన
ఇక ఎవరు కర్మల నాచరి౦తురు పరమాత్మ యందు ప్రేమతో?

22

బ్రహ్మన్ సాక్షాత్కరించు, దాని యందు ప్రేమ గలవారిక౦దురు
ఆత్మ స్వస్వరూపము తెలిసిన సాధకులికి అగుపించు నందురు
ఈ రెంటికీ గుణరూపములు లేనందున ఎట్లు గుర్తించుటో తెలుపరు
విద్యుచ్చ్చక్తి కనబడునే ఎంత ప్రేమతో శాస్త్రజ్ఞులు పరిశ్రమించినా?

23

జీవన్ముక్తి బొంది యుండగానే కర్తృత్వము భోక్తృత్వము లేక పొందెడిది
విదేహముక్తి; యమధర్మరాజు దండనము లేకనే పొందు పునర్జన్మ రాహిత్యము;
ముక్తిలేదు నిర్గుణ నిష్కామ బ్రహ్మన్ గూర్చి తెలిసికో దలచని పామరులకు
ఇక మిగిలిన చరాచర జీవులు బ్రహ్మన్ సృష్టి అనే క్రీడా భూమిలో పావులు

24

బ్రహ్మన్ "బొమ్మను చేసి ప్రాణము పోసె" న౦దురు
శాస్త్రజ్ఞులు చెప్పిన పరిణామము ఎటుల జరిగెను
దశావతారములు వైకుంఠ వాసుని పరిణామము కాదా
విచిత్రము చలన చిత్ర కోకిలల వికృత కూతలు

25

"విశ్వం విష్ణు వషట్కార" మనే మంత్రము పిదప సహస్రనామముల పని ఏల?
ఆ ఉపోద్ఘాతము కేవలము పరమాత్మ దృష్టి సారించుటకు ఉపాయము
ఆడుదురు భక్తులు దాగుడు మూతలు, ఉపాసించి దేవుని ప్రశంసింప
తల్లిని బోలు వెర్రి బ్రహ్మన్ కు తెలియదాయె బిడ్డలైన మానవుల చాతుర్యము

26

"వస్తా వట్టిదె పోతా వట్టిదె" అనెడి నైరాస్యము
దాన గ్రహీతులకు మంచి చేయునదే
దానమిచ్చువాడు అర్హుల కీయవలె
సంసారికి దొరకునా ముక్తి పైకము లేక?

27

బ్రహ్మన్ అద్వితీయుడు; సృష్టికి మూలము
మనమెమవరము దాని సృష్టిని దెప్పిపొడవ?
సృష్టి జరిగి నన్ను సృష్టికర్త మరచెననుట
తిన్నింటి వాసాలు లెక్క పెట్టుటయే

28

శంకరుడు చెప్పిన ఆభాస
అద్వైత పరాకాష్ట
తానొకటి తలచిన
దైవమి౦కొకటి తలచు

29

ఆర్యులు పూర్వమా? వేదములు పూర్వమా? అని ప్రశ్నించిన,
ఆర్యులు పురాణ పురుషులు; వేదములు అపౌరుషేయములు
ప్రతి సృష్టి ఆదియందు బ్రహ్మచే వేదములు ఆవిర్భవించు
ఆర్యులు సృష్టి క్రమమున వేదములను ప్రతిపాదించు

30

ఒక బ్రహ్మాండమునకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు పరిపాలకులు
అనేక బ్రహ్మాండముల కలయిక బ్రహ్మన్ యొక్క అంగుష్ట ప్రాయము
ఒక బ్రహ్మవిష్ణుమహేశ్వరులను పూజించుటే గగనమయితే
సకల బ్రహ్మాండములకు శక్తి లలితాదేవిని ప్రసన్నము చేయుటెట్లు?

31

యజ్ఞయాగాదులు వైదిక కర్మలు
ఉపనిషత్తులకు విరుద్ధము
యజ్ఞ హవిస్సుని ఇంద్రునికివ్వ
కన్నెర్రజేసిరి కొందరు వైదికులు

32

యజ్ఞము కర్మవలననే సాధ్యమని చెప్పెను గీతాచార్యుడు
యజ్ఞకుండముతో పనిలేక సాధన చేయునది కూడ యజ్ఞమే
కర్మలను మధ్యలో త్యజించుట యజ్ఞభంగము గావించుటే
విఘ్నములు తొలగించే ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడే దిక్కు!

33

సాధనతోనె సమకూరు ధరలోన అని నానుడి
సాధకుడు సద్గురువు నాశ్రయించి సేవించ వలె
గురువు కరుణించిన ముక్తి తథ్యమని నమ్మవలె
మరి తాము గురువులమనుకునే వారి సంగతేమిటి?

34

పితృ దేవతల ఋణము తీర్చుట అసాధ్యము
దేవతల ఋణము అర్చించి అభిషేకించి తీర్చవచ్చు
ఋషి ఋణము తీర్చుటెట్లు అని సంశయము కల్గిన
గగనము నందలి సప్త ఋషులను నిత్యము తలచవలె

35

నాడీ వ్యవస్థను దేహమున్నంతవరకు మన్నించవలె
సుషుమ్న నాడి ఆత్మజ్ఞానికి కనబడు ఆధ్యాత్మిక నాళము
రమణ మహర్షి చెప్పెను కుడి ఛాతీ ఆత్మ స్థానమని
షట్చక్రములు, సహస్రారము యోగి పుంగవునికి స్వాధీనములు

36

సాధక షట్ సంపత్తి త్యాగరాజు చెప్పిన కుల ధనము కన్న మిన్న
సమదమములు సాధకులకు శాంతిని ప్రసాదించు దానము
ఉపరతి, తితీక్షలు సహనమనే పారతో వెలికితీసిన లంకె బిందెలు
శ్రద్ధ సమాధానలు గురవుని ఏకాగ్రతతో సేవించి పొందిన వేతనము

37

శ్రీరాముడు చూలాలు సీతమ్మని విడిచి పొందిన పుణ్యము
వేద యజ్ఞవాల్క్యుడు గార్గిని సన్యసించి చేసికొన్నంత
విడాకులకు వేదమెన్నటికీ ప్రమాణము కాజాలదు
సంసారుల తికమక కేవలము కలియుగ భ్రమ

38

కపిలుని సాంఖ్యము గీతాచార్యుని పులకింపగ
కణ్వ మహర్షి అణుశాస్త్రమునకు పితామహుడు కాగా
పతంజలి యోగ సూత్రములు జగతిని మేలుకొల్పగ
హైందవ తటాకము పొంగి పొరలి జనుల దప్పిక తీర్చె

39

ఆర్యభట ఖగోళ శాస్త్రము సృష్టి ఆాద్య౦తములు దైవాధీనమనె
నేటి భౌతిక శాస్త్రజ్ఞులు పరమాత్మను విస్మరించి సృష్టిని వర్ణించె
ఎవరు సృష్టికి సాక్షి అని అడిగిన ఆత్మ జ్ఞానులకు తప్ప
వేరెవరికి సమాధానము తెలియదని వేదములు ఘోషించె

40

సృష్టి స్థితి లయము ఒక బ్రహ్మాండమునకు
అట్లనేక బ్రహ్మాండములను పాలించు లలిత
పొంగిపోవును సహస్రనామముల జపముతో
ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులను ఇచ్చేది ఆ మాతే!

41

ముఖ్య ప్రాణము ఒకటి గాదా అని అడిగిన
పంచప్రాణముల సముదాయమది
పానాపాన ప్రాణములు దేవునికి నైవేద్యము
వ్యానుదానసమాన ప్రాణములు జీవునికి స్వాహా

42

భృంగి-నటేశ-సమీరజాదులు త్యాగరాజునికి స్పూర్తి
ఘటజ-మాతంగ-నారదాదుల ఉపదేశము వాని కీర్తనలు
సంగీతము దివ్యౌషథము సర్వ లోకములలో
కర్ణాటక కృతులు ఆంధ్ర సాహిత్య ఆణి ముత్యములు

43

తెలుగు ప్రవచన కర్తలు ఆంధ్ర వాఙ్మయ చక్రవర్తులు
గంగా-కృష్ణా-గోదావరుల సంగమము వారి వాగ్ధాటి
సర్వవర్ణ సమన్వయము వారికి కరతలామలకము
శ్యామలాదేవి బీజాక్షర వర కాళిదాసుని భ్రాతలు

44

"నీ దయ రాదా" అని వాపోయె త్యాగరాజు
"కాదనె వారెవరని?" సూటిగ నడిగె రాముని
ఇలలో కిట్టని వారు గిట్టక మానరు
తేడా ఆయుష్యు ఒకరు ముందు, మరొకరు వెనుక

45

తాపత్రయముతో కలవరించనేల
ఆధ్యాత్మిక సాధన కత్తి మీద సాము
ఆధిభౌతికము పరుల వలన క్లేశము
ఆధిదైవికము ప్రారబ్ధ వశాత్తు శాస్తి

46


అరిషడ్వర్గాల ఉచ్చులో పడెను దుర్యోధనుడు ఎట్లన
కామ మోహములతో ద్రౌపదిని నిండు సభలో చెరచె
మద మత్సరములతో పాండవులను అడవికి పంపె
లోభ క్రోధములతో కురుక్షేత్ర యుద్ధము గావించె

47


సర్వులకు పునర్జన్మ రాహిత్యము శుభదాయకము
కానీ జీవులు ఇలను ఖాళీ చేసిన బ్రహమన్ కేమి పని?
ముక్తి మోక్షములు బ్రహ్మన్ వేగ ప్రసాదించడు
భూమి జీవులతో నిండె కలియుగ ప్రభావము వలన

48


రామదాసు సీతారామలక్ష్మణభరతశతృజ్ఞులకు పతకములిచ్చె
ఎవడబ్బ సొమ్మని కులకుచు తిరిగేరని? గదమాయించె
కానీ సొమ్ము ముందు ప్రజలనుండి తహశీల్దారుగా ఆర్జించినది
గుళ్ళ గోపురములు పన్నుల వసూలుతో నిర్మించిన మహనీయుడు

49

నేటి కాలమున నూతన దేవుని మందిరములు నిర్మించుట అవసరమా?
రామ జన్మ భూమిలో అతి కష్టముతో స్థాపించిరి ఇక్ష్వాకుల విగ్రహములు
రాజుల సొమ్ము రాళ్ళ పాలనే నానుడి కలి యుగములో నిజమైనది
సర్వమత సామరస్యము గుడులలో అన్ని దేవుళ్ళను పూజించినప్పుడే

50


శిర్డీ సాయిబాబా మహిమలు అనేకమట
నీటిని తైలము చేసి వెలిగించెను దీపమట
ఒకనికి శివశంకర రూపముతో దర్శనమిచ్చెనట
వివిధ మతముల రోగులను నయము చేసేనట

51

కలిలో బాబాలు మహిమలు జూప అవసరమేమి?
గారడి లేకున్న నమ్మరు బాబాలను గార్ధబ జనులు
గొర్రెలు కాపరిని అనుసరించు చందము, భక్త కోటిని
మాయ చేయక బ్రహ్మన్ శాసించగలడా సృష్టిని?

52


బ్రహ్మన్ అన్యాయము చేయడట
నన్ను అన్యునిగా గాంచడట
నా గతి గ్రహస్థితితో ముడిపడినది
బ్రహ్మన్ సూటిగా వ్యవహరించడు

53

నిరవధిక సుఖము ఆత్మ జ్ఞానులది
ఇతరులకు ప్రపంచ సుఖము కొన్నది
దుఃఖము ఎరువు తెచ్చుకొన్నది
గాంచలేరు ప్రజలు సుఖము క్షణికమని

54

బ్రహ్మన్ కర్మలను జేయడు, నిర్గుణుడు, సాక్షి
మరి పంచీకరణము ఎటుల జేసెననిన
సృష్టికి ముందు బ్రహ్మను సృష్టి కర్తను జేసెను
అధికారి పనిచేయక గుమస్తాపై పెత్తనము జేయు

55

ప్రజాపతి ఆత్మ దర్శనమిత్తునని లోకములలో చాటెను
స్వర్గాధిపతి ఇంద్రుడు పడెను ఆతని వ్యూహములో
వందల వత్సరములు స్వర్గము వదలి వేచి చూచె
ఈ లోపు దానవులు స్వర్గముపై దాడి చేయని పుణ్యాత్ములు

56


అనేక ఉపనిషత్తులు కాలగర్భములో కలసి పోయెనట
కానీ శంకరుడు వాటి సారమును భాష్యములో చెప్పెను
అవసరమా సర్వసంగపరిత్యాగికి వేదాంతము?
ఒక్క కనక ధార స్తోత్రము వంద మోక్షముల పెట్టు

57

సర్వ వర్ణములు విరాట్ పురుషుని నుండి ఆవిర్భవించెనట
మరి దళితుల వర్ణ మేమన, చెప్పెను గాంధీ హరిజనులని
నే పలికెద వారు సర్వ శక్తివంతులైన శివగణములని
కర్మను భక్తితో ముడిపెట్టి చేసిన, వేదములతో పనిలేదు

58

మీరాబాయ్ శ్రీకృషనుపై భక్తి సలిపి పొందెను మోక్షము
తుకారాం పాండురంగుని భజించి ముక్తుడయ్యెను
తులసీ దాసు రాముని కొలచి పరమపదించెను
త్యాగరాజు, అన్నమయ్యల వలె మనకి విష్ణువే శరణ్యము!

59

భక్తి మిన్నా? జ్ఞానము మిన్నా? అని సంశయమొ౦దిన
విగ్రహారాధన కన్న ఆత్మ జ్ఞానము మిన్నని తెలియును
రమణ మహర్షి సాక్షిగా నే నెవరిననే విచారణ మేలు కానీ
భక్తులు అరుణా చల భగవాన్ అని పిలువ మిన్నకుండెను

60

దీక్షితార్ తెలుగు కాక దేవ భాషలో రచించెను
తెలుగు అరవము నుండి విడిపడునని తెలిసిన జ్ఞాని
నేడు ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగు వేర్వేరు
ఇక మిగిలినది ఆంధ్రముకాని రాయలసీమ తెలుగు

61

దైవారాధన సిద్ధులు పొందుటకని నమ్ముదురు
కాళిదాసునికి శ్యామలా దేవి బీజాక్షరముల నిచ్చెనట
త్యాగరాజుకి నారదుడు సంగీత తాళపత్రమిచ్చెనట
ఏ గ్రంథమలు పఠించని రమణ మహర్షి స్వయంభు

62


వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని
బ్రహ్మన్న చెప్పినది వేదమట
కానీ వేదము అపౌరిషేయము
వాడుకలో వేదము చివరి మాట

63

గుళ్ళలో వైదిక పద్దతి
ఇళ్ళలో వాస్తు శాస్త్రము
కార్యాలయాలలో ఏమన
ఉండవలసినది క్రియా శక్తి

64


మీన మేషముల లెక్కపెట్టు జ్యోతిష్యము
ప్రజల బలహీనతను బట్టి నిజము
కాలజ్ఞానము విద్యాలయాలలో బోధించుట
వేదాంతము స్త్రీలు అభ్యసించుట వంటిది

65

పుట్టపర్తి సాయి బాబా చిరస్మరణీయుడు
వైద్యశాలలు, జలము ప్రసాదించిన దేవుడు
బాబా అనునది ఉత్తర భారత గురుపరంపర
కానీ రమణ మహర్షి వలె ఆతడు స్వయంభు

66

పాలిచ్చు గోవులను వధించుట దుర్మార్గము
గంగి గోవు పాలు గరిటడైనను చాలనెను వేమన
పనికిమాలిన పాలిచ్చు ఖరము చాకలి బరువు మోసె
ఇక ఆడ ఏనుగుల, గుఱ్ఱముల గతి ఏమి చెప్పెదము?

67

భరించువాడు భర్తనిరి
భార్య సీతమ్మ వంటిది
అగ్నిప్రవేశము చేయించి
ఒక భర్త వేడి భరించలేక పోయె

68


రాముడు పురుషోత్తముడు
హనుమంతుడు సర్వ శక్తిమంతుడు
కపిరాజు పరిణామ క్రమమున
పురుషుపుంగవునికి జన్మ నీయగలడు

69


అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో మమతల మూట
అని తెలిసిన శంకరుడు తల్లిని
లోక కళ్యాణమునకై త్యజించెను

70

నేడు హైందవము విశ్వమెల్ల ఆదరణ పొందినది
నిన్న బౌద్ధము ప్రపంచమంతా వ్యాపించినది
బౌద్ధులు శూన్యము సృష్టికి యోననిరి
హైందవులు శూన్యము షష్ఠీ భూతమనిన మేలు

71

ప్రవాసాంధ్రులు తండ్రిని మించిన తనయులు
ఒక ప్రక్క వేడి మరొక వైపు మంచు ననుభవించు
గీతాచార్యుడు చెప్పిన అరుదైన స్థితప్రజ్ఞులు
ఇక పర్యావరణము వేడెక్కితే అందరూ స్థితప్రజ్ఞులే

72


అప్పు చేసి పప్పు కూడు తినరాదు గోవిందుడు తప్ప
కుబేరుని అప్పు వరకట్నం చెల్లి౦చని ఆకాశ రాజుది
అలిమేలు మంగమ్మ అలుక దీర్చ కట్న మడగని
శేషశైల వాసి భక్తులతో ఆడును జగన్నాటకము

73

వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు
అసువులు బాసిరి చక్రాల క్రింద బడి
భక్తులకు దేవుడిచ్చే జీవన్ముక్తి
అని నమ్మి మూఢులు చితిలో బడిరి

74

ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? అనిన
రైలు ఎక్కిన బరువు భుజాన మోయ పనిలేదు
కావున బ్రహ్మన్ ను శరణాగతి వేడుము
అని ప్రవచించెను రమణ మహర్షి

75

జీవితము చలన చిత్రము వంటిది
తెర బ్రహ్మన్ వలె కేవలము సాక్షి
బంధాలు మనస్సనే భూతద్దము
కాంతి స్వయంప్రకాశమైన ఆత్మ

76

గీతాచార్యుడు చెప్పెను జీవి తలక్రిందలైన
చెట్టు వలె వూర్ధ్వ మూలము గలవాడని
ఏ మూలమూ లేని భూమాతకు
గురుత్వాకర్షణ ఇచ్చె జగన్నాటక సూత్రధారి

77

బహు పత్నీ వ్రతులైన దేవతలు, రాజులు
సృష్టికి విరుద్ధమా లేక ప్రజాపతికి చేరువా?
ధ్రువుడు తండ్రి మొదటి భార్య కొడుకు
రాముడు దశరథుని పెద్ద భార్య తనయుడు

78

వైకుంఠ వాసులు జయవిజయులు ముని శాపగ్రస్తులై
జన్మించిరి రాక్షస వంశముల ప్రజలను పీడించ
విష్ణు అవతారములు దాల్చె వారిని సంహరింప
కాన శాపవశాత్తూ జనించిరి కలియుగ రాక్షసులు

79

"ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?" అనే
చప్ప వేదాంతము బాధ్యతా రహితము
ఆత్మ జ్ఞానము దీనికి విరుగుడు; దివ్యౌషధము
మనమంతా ఆత్మ దృష్ట్యా సహవాసులము

80

రాక్షసులను సృష్టించనేల? అవతారము ఎత్తనేల?
అని విచారణ జేసిన అది బ్రహ్మన్ క్రీడ
అడవిలో రాజుల వేటకు కారణము
క్రూర జంతువులను నియంత్రించుటకే

81

ముని శాపము లేకున్న భాగవతము లేదు
దైవ నిర్ణయము చిత్ర విచిత్రము
సర్వము త్యజించక, దేహము నశింపక
ఎంత గొప్ప భక్తునికైనా ముక్తి కలదా?

82

స్వర్గముకై కృష్ణపక్షములో చంద్ర మార్గమున వెళ్ళవచ్చు
ముక్తికై శుక్ల పక్షములో సూర్యుని వైపు వెళ్ళవచ్చు
మరి యమలోకమునకు దారెటు? నచికేతునికే తెలియును
నరకము ఎచ్చటనైనా పొందవచ్చు నాస్తికులమై

83

ధైర్యము విలోలంబయ్యెను,
ధైర్యే సాహాసే లక్ష్మీ అనిరి
సాహసము లేని ధైర్యము
డాంబికమైన వృధా ప్రయాస

84

భక్త కన్నప్ప శివునికై కనులను పొడుచుకొనెను
నేటి గుమస్తాలు కళ్ళజోడుతో శ్రమించెదరు
విశ్వరూపము దివ్య చక్షువులతో చూడ తరము
కనులు లేకున్న దివ్య దృష్టి గలదని భక్తి సలుపు

85

కుడి ఎడమైతే పొరపాటు లేదనేవారు అమాయకులు
నేటి రహదారులలో వారు వాహనాలను నడపలేదు
వామ హస్తముతో భోళా శంకరుడు దయతో ఇచ్చును
దక్షిణ హస్తముతో విష్ణువు రెండు రెట్లు తీసికొనును

86

గంధము పూయారుగా అనే త్యాగరాజ కృతము
గంధపు చెట్లను నరికే ఆసురులకు పూర్వము
సింహాద్రి అప్పన్న అణు శక్తిని మరిపించే
ఉగ్ర రూపము గంధముతో కప్పబడినది

87


నరసింహుని అవతారము విచిత్రము
మత్స్య పురుషునిగా రాలేదేమి? అని అడిగిన
హిరణ్యకశిపుడు స్థంబాన్ని చూపెన౦దురు
మరి జక్కన్న శిల్పములో కప్ప దాగలేదా

88

అగుబడే సృష్టికి ఆవల నేమున్నదని అడిగిన
శూన్యము తప్ప వేరేమి గలదని ప్రశ్నింతరు
బౌద్ధులు చతురులు వాదము నందు ; వారికి తెలియదు
పూర్ణము నుండి పూర్ణము తీసిన మిగులు పూర్ణమని

89

ఎవరిది పై చేయి: భక్తునిదా? భగవంతునిదా?
బలి చక్రవర్తి పైచేయితో విష్ణువుకి దానమిచ్చెను
కర్ణుడు కుండలములు పైచేయితో నిచ్చెను
రాజ్యము త్యజించిన దాశరథికి దాన కంకణముతో ఏమి పని?

90

క్షత్రియ నీతి చాణక్యునికి ఉగ్గుపాలు
రాక్షస నీతి ఒక్క౦టైన శుక్రాచార్యునిది
దేవతల నీతి బృహస్పతికి పెట్టిన పేరు
కలియుగ నీతి వినాశ కాలే విపరీత బుద్ధి

91

అడుసు తొక్క నేల? కాలు కడగ నేల?
పురీషము విడిచే అంగము పిరుదులు
వాటిని గాంచి మోహితులగుదురు విటులు
వికలమైన మనస్సుకు మన్మధుడే కారణము

92

అయ్యప్ప శివ మోహినులకు పుడితే
మోహిని విష్ణు రూపమని తెలిస్తే
శివుడు పార్వతీ విధేయుడని భావిస్తే
అయ్యప్ప బ్రహ్మచారి కాక మరేమగును?

93

గోపికలతో రాసలీల సలిపిన వాసుదేవుడు
బహురూపధారియై వారిని కరుణించె
గోవర్దన గిరిధారియై వ్రేపల్లెను రక్షి౦చె
సమన వైరి సన్నుత నను బ్రోచుగాక

94

"దేశమంటే మట్టి కాదోయి" అనెను గురజాడ
నేటి ఇసుక తస్కరులు వినరు ఆయని మాట
కాని "దేశమ౦టే మనుష్యులోయి" వీనుల విందు
మన్ను తిన్న దేవకీ తనయుడు బ్రోవడేమి?

95

దేవుడు వరమిస్తే పూజారి కూడా ఇవ్వాలి
తపోధనము దేవుడికిస్తే వచ్చేది పూజారి జన్మ
అందుకే విదేశీ దేవాలయాల పరిశ్రమ రాణించెను
పాశ్చాత్య దేశాలలో చలికి నులికి భక్తి సలపకున్నగతి ఏమి?

96

న్యాయానికి కళ్ళతో పాటు ముక్కు కూడా లేదు
అందుకే కాబోలు లక్ష్మణుడు వనిత ముక్కు కోసెను
త్రేతా యుగ న్యాయము కలియుగములో చెల్లదు
కానీ ధర్మము అటుల కాక రక్షో రక్షతి

97

భ్రాత ఋణము బహు ప్రమాదకరమ౦దురు
భక్తితో రామదాసు రాముని భ్రాతని తలచెను
రాముడు శంకలో పడి ఇచ్చెను మోక్షము
దాని పర్యావసానము వానికి పుత్ర వియోగము

98

కృష్ణుడు శల్య సారథ్య మొనరి౦చి బొ౦కే నెరుగ
ఎటులన యశోదతో మన్ను తినలేదని బొంకి
తొల్లి ఆమెకు భువన భాండములు చూపెను,
పిమ్మట అర్జునునికి విశ్వరూప సందర్శన భాగ్యమిచ్చెను

99

వసు ప్రసాదిని సర్వ లక్ష్మిని,
అలక్ష్మిని దూరముగా నెట్టి,
భజించిన కలుగు సుఖము
ధనం మూలం ఇధమ్ జగత్

100

కొండపల్లి బొమ్మలో బొమ్మవలె
అన్నమ్-ప్రాణ-మనో-విజ్ఞాన-ఆనంద
మయ పంచ కోశ ములు ఆత్మను కప్పియు౦డగా
భక్తి కోశము విజ్ఞానకోశ ఆవల గాక మరెక్కడ?

పీఠిక

వ్రాసితిని శతకము రాముని కృపవలన
రామ కోటి వ్రాయలేను, పురాణములెల్ల
చదవలేను, వేదములు ఔపాశన పట్టలేను
కలియుగ ప్రారబ్ధము పాపీ చిరాయువు!


ఓం శాంతిః శాంతిః శాంతిః

Wednesday, September 6, 2023

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 1-3)

upanishad


  


ఈ గ్రంధ౦లో రెండవ ప్రకరణలో  యోగసాధన
గురించి వివరింపబడి౦ది. నిజానికి  యోగసాధన మిక్కిలి సులభము, 
మరియు సూటియైనది. ప్రజ్ఞలోని వివిధపొరలను లేక
కోశములను అంతర్యామి యందు లయము చేయటమే యోగము.
ఇక్కడ  అంత్యరామి అంటే తనకు ఆధారమయియున్న చోటులోని 
"నేను" అను ప్రజ్ఞ. కాని క్రొత్తగా యోగసాధన ప్రారంభించువానికి
జన్మాంతర సంస్కారములనేకములుంటాయి. అలాంటి స్టితిలో వానికి
యోగసాధన అంటే మొదట కొంత ప్రాధమిక శిక్షణ గురించి,
దానిలోని దశలను గురించి ప్రస్తుత ప్రకరణములో వివరింపబడుతున్నాయి. 
సాధకునిలో  కొన్ని కర్మవాసనలు మిగలి ఉంటాయి. 
ఏదో  యొకటి క్రొత్తది చెయ్యాలి అనే అభిలాషగా జీవిలో 
కర్మకు వాసనలుంటాయి. అవే వాని కర్తవ్యములుగా వానికి
అనిపిస్తాయి. అట్టి కర్మవాసనలు తొలగిపోవాలంటే, ప్రాధమిక
శిక్షణ కొంత ఆవశ్యకము కనుక ఇట్టి ప్రాధమిక శిక్షణ "క్రియా
యోగము" అను పేరున పిలువబడినది. తీవ్రనిష్ట లేక శ్రద్ధ దీనిలోని 
 ప్రధాన విషయము. అట్టి నిష్ట వలన పురాణములు, ఇతర గ్రంథ
ముల పఠనముతో ప్రారంభమై,  క్రమముగా జీవుడు ఆంతర్యామికి
సమర్పణమై వాని సేవగా జీవితము గడుపుతాడు.

2

సమాధి భావనార్థః క్లేశతనూకరణార్థశ్చ

సమాధి భావనార్థః  = సమాధిని  గూర్చి భావన లేక
థ్యానము చేయటా వలన పయోజనము,

క్లేశతనూ కరణార్థశ్చ = క్లేశములను తొలగించు 
			కొనుట గూడ 

  

			
యోగసాధన అనగా సమాధిస్థితిని గురించి ధ్యానము 
చేయుట మరియు క్లేశములను తొలగించుకొనుట గూడ 

  

యోగసమాధి పొందుటకుముందు అటువంటి  స్థితి యొక్కటి 
యున్నదని తెలియవలయును. సామాన్య మానవులకు అట్టి 
స్టితిని గురించి యితరులు చెప్పుట వలన తెలుస్తుంది. కాని అది 
చాలదు. ఈ ప్రపంచములో ఎన్నో విషయములున్నాయి. కాని 
వాటికి మనకునేమి సంబంధము? కాని ఇది అట్లు కాక మనయ౦దే 
ఉన్నాది. అ౦టే మనలో సమాథి లేక నిరంతర ఆనందమనే 
స్థితి యుండగా, అది మనచే ఉపేక్ష చేయబడుతున్నాది. చల్లని 
మంచి నీరు గల బావిని తన యింటియందుంచుకొని నీటి కొరకు 
ఎండలో తిరుగుచు, వెతుకుచున్న వాని వంటి స్థితి యిది. 
కాని అలాంటి స్థితి ఒకటి మన యందే యున్నదని చెప్పేవాడు 
కావలెను.  ఒకసారి తెలిసిన పిదప మనము దానిని  గురించి 
ప్రయత్నిస్తాము. మనలో అట్టి స్థితి యుండగా దానిపై 
మనస్సు, ఇంద్రియములు, ఆలోచనలు, వాక్కులు, శబ్దములు,
అర్థములు, సంయోగ, వియోగములు మొదలైనవి ఎన్నో  అడ్డుగా 
పేర్చికొని యున్నాము. కనుక అట్టియోగ స్థితి యందు మన 
ముండవలయునన్న, మనస్సు నిర్మలము కావలెను. మనస్సు 
నిర్మలమయితే మనలోని వెలుగు దర్శనమిస్తుంది. 
మనస్సు నిర్మలము కావలెనన్నచో మొదట దాని ఉపాధి అనగా 
శరీరము నిర్మలము కావలెను. మనస్సు, శరీరము అను ఈ 
రెండింటిని స్వచ్చముగా చేసుకొననిచో ప్రాధమిక యోగసాధనకు 
పురోగతి లేదు. క్రియాయోగ మ౦టే  అట్టి స్వచ్ఛత సాధించుట 
కొరకు ఏర్పడిన అభ్యాస సంస్కారములు. 

3

అవిద్యాస్మితారాగ ద్వేషాభిని వేశా: పంచక్లేశాః

అవిద్యా =అజ్జానము
అస్మితా = ఉన్నానని (భాంతి
రాగ = వ్యామోహము
ద్వేష = ద్వేషము
అభినివేశాః = ఒక్కదాని యందు ప్రత్యేకమయిన
	కోరిక కలిగి యుండుట
పంచక్లేశాః  = ఐదు క్లేశములు


  అజ్ఞానము, తాను వేరుగానున్నానను భ్రాంతి, రాగము,
ద్వేషము, ప్రత్యేక అభిలాష యను ఐదును పంచక్లేశములు.

  


కొన్ని మానసిక ప్రవృత్తులు యోగసాధనకు అడ్డువస్తాయి. 
వాటని క్షేశములని పిలుస్తారు. అవిద్య అంటే  అజ్ఞానము.
ఇది మనస్సులో ఒకముడి. ఇది మనస్సు చేతనే తయారైనది.
అవిద్యగానున్నది సహితము మనమనస్పే. జ్ఞానమను స్థితిని
మనస్సుచే మాయగా అజ్ఞాన మేర్పడినది. అజ్జానమునందు జ్జాన
ము౦ది. కానీ అది అజ్జానముగా అర్థము చేసికొనబడుతున్నాది.
జ్ఞానమును తెలుసుకోవాలంటే అజ్జానమను ముడిని విప్పుకోవాలి. 
ముడి వేయబడిన త్రాటిని విప్పితే  ముడి
సహితము త్రాడేయున్నదని తెలుస్తుంది. కనుక ముడిని 
ఉపేక్షించడానికి వీలులేదు. ఉపేక్షిస్తే అందున్న త్రాటిభాగ 
మును పోగొట్టుకుంటాం. తెంపుటకు వీలులేదు. త్రాడు 
తెగకొట్టుకొను వారాలగుతాం. ముడిని వివ్పుకోగల ఆసక్తి, ఓర్పు, శ్రద్ధ 
కావలెను. విప్పితే అందులో  త్రాడున్నదని తెలుస్తుంది. దాని
గురించి యుద్దము చేసినందువలన ప్రయోజనములేదు. ముడిని 
గూర్చి ఎంత  అర్హము చేసుకొన్నా ముడివిడివడదు.  గనుక 
జ్ఞానము పొందుటయనునది అర్థము చేసికొనుటతో పోల్చకూడదు. 
అర్థము చేసికొనుట ఉల్లిపాయ పొరలు తీయడంవంటిది. ఎన్ని
పొరలు తీసినా, తీయవలసిన పొరలెన్నో మిగిలి ఉంటాయి.
పొరలన్నిటినీ  తొలగిస్తే, ఇంక ఉల్లిపాయయనేది మిగలదు. 
కనుక ఉల్లిపాయ యనగా ఈ పొరలుగానున్న మొత్తము అని |
తెలియవలయును. అంతేగాని ఉల్లిపొరలు వేరు, ఉల్లిపాయవేరు
అని అనుకొనరాదు. ఇచ్చట అవిద్యగానున్నది మన మనస్సు 
అనియు ఇది తెలుసుకొనుటయే అవిద్యను తొలగించుటయనియు
గ్రహించవలెను. 

పరమాత్మ యొక్క అస్తిత్వము సమస్తమునందును నేనను
వెలుగుగా వ్యక్తమగుతున్నాది. అట్టి నేను పరిమితత్వము చెందినప్పుడు, 
లేక భౌతికదేహ మేర్పడినప్పుడు అహంకారముగా వ్యక్త 
మవుతుంది. ఇట్టివ్యక్తీ కరణము వలన, జీవుడు తనకన్నా వేరుగా 
ఇతరములను గుర్తిస్తాడు. అనగా సమస్తము తానే యన్న స్టితి
నుండి, తనను తాను వేరుచేసికొని తానువేరు తనచుట్టునున్న
జీవులను వేరుగా గుర్తిస్తాడు. ఇది కూడా యోగ జీవితమునకు 
ఆటంకమే. 

అహంకారము ఏర్పడగా అట్టి అహంకారము చుట్టును మనస్సను 
పొర ఏర్పడుతుంది. మనస్సు ఒక సుడివలె ఏర్పడి, తన
చుట్టుతాను వేగముగా తిరుగుట ప్రారంభిస్తుంది. దాని వలన
ప్రాణము, అపానము అను రెండు శక్తులేర్చడి ఆకర్షణ, వికర్షణ
అను  రెండు ప్రభావము లేర్పడుతాయి. దీని వలన కొన్ని విషయముల
కాకర్షింపబడుట, కొన్నిటికి వ్యతిరేకులగుట సంభవిస్తుంది.
అనగా ఇష్టాయిష్టములేర్పడి నచ్చుట, నచ్చకపోవుట అనేవి 
సంభవిస్తాయి. వీటివలన జీవునికి క్లేశములేర్పడును.

ఆసక్తి యనగా ఒక విషయము నందు ప్రత్యేక అభిలాష 
కలిగియుండడం. గొప్ప ఆదర్శములు, సంకల్పములు మనలను 
ఊర్ధ్వగతికి మరియు పరిపూర్ణత్వము వైపునకు నడిపిస్తాయి .
కాని అవి అనగా సంకల్పములు మొదలైనవి విగ్రహములవలె 
గట్టిపడి అవియే ప్రధానమై, యోగము అప్రధానమవుతుంది.
నినాదములు, ప్రచారములు మొదలైన అవరోధములు మనస్సుపై
ప్రభావము చూపుతాయి. సృష్టి యందలి సత్యములను దర్శించినపుడు 
అవి సత్యములని తెలియవలయునుగాని భౌతిక రూపము
లని భ్రమపడరాదు. అట్లు పొరపడినవారు, శివుడు, విష్ణువు,
రాముడు, కృష్ణుడు మొదలైనవారిని రూపములుగా (భాంతిపడి,
వారిని గూర్చి ప్రచారములు, చర్చలు, భ్రాంతులకు లోనై యోగ
సాధనను విస్మరిస్తారు. వీని వలన మతము లేర్పడి ప్రజలు
పోటీపడుట, తగాదాపడుట, అసూయ, ద్వేషము, మొదలగు అధో
లోకములలోనికి దిగజారుతారు. దీని వలన మన మనస్సునందలి
చీకటి మరింతపెరిగిపోతుంది. తన యందున్న వెలుగును విస్మరించినచో, 
యిట్టిస్టితికలుగుతుంది. సత్యములు ఎంతగొప్పవైనను అవి 
పరమాత్మయందలి భాగములేకాని వాటికి వేరుగా ఆస్తిత్వమున్నదని 
పొరపడరాదు. అనగా యోగసాధనకు అవి సాధనములేకాని 
లక్ష్యములుకావు. ఇలాంటి విషయములందు చిక్కుకున్న మనస్సునకు 
పురోగతి యుండదు. యోగసాధనలో యోగికిది ఒక ప్రధాన
అవరోధముగా కనిపిస్తుంది. తమలోని  అట్టిలోపములను సరి
దిద్దుకొనుటకు బదులు కొందరు యిట్టి సత్యములనే తృణీకరిస్తారు. 
ఇవి మరల ద్వేషమును కలిగిస్తాయి. నిజమైన సాధనకు
మార్గము వేరుగా ఉంటుంది. ఇట్టి రూపములుగా నున్న అంత
ర్యామిని ధ్యానిస్తే  ఈ రూపములు వాని యందు కరిగి
అతడే పరమ సత్యముగా కనిపించును. క్రియాయోగమువలన
ఇట్టి సాధన సాధ్యమవుతుంది.

క్రియాయోగమనగా భౌతిక దేహము కర్మాచరణచేస్తూ 
అది అంతర్యామికి సమర్పణగా ఆచరించడం. కర్మాచరణమనగా 
నిత్యజీవితమందు తానాచరించు పనులను మిక్కిలి శ్రద్ధగానాచరించడం. 
ఒక ఆఫీసులో వనిచేయుచున్నవాడు. తనతోటి ఉద్యోగు
లయందు, సందర్శకులయందు (visitors) పరమాత్మను చూచి,
వారికి సేవగా తన విధులనాచరింపవలెను. దీని వలన యోగసాధన
మిక్కిలి సులభమై సత్యత్వము చెందుటయే గాక, పూర్వజన్మ
సంస్కారములు ఒక్కొక్కటిగా నశించి జీవిని సూటిగా 
మోక్షద్వారమున నిల్పును. 

Patanjali Saadhana Paada Fifth Prakarana (Slokas 4-5)

upanishad


  


4

అవిద్వా క్షేత్రముత్తరేషాం ప్రసుప్త తనువిచ్చిన్నోదారాణామ్‌!

అవిద్య = జ్లానము పొందు మార్గము 
		తెలియకుండుట
క్షేత్రం=క్షేత్రము 
ఉత్తరేషాం = తరువాత వానికి 
ప్రసుప్త =నిద్ర
తను = క్షీణించుట 
విచ్ఛిన్న = ముక్కలగుట 
ఉదారాణామ్ = ప్రేరణ 

  

జ్ఞానము పొందుటను గూర్చి తెలియని స్థితి వలన నిద్ర,
క్షీణించుట, భిన్నమగుట, ప్రేరణ యను నాలుగు స్థితులకు ఇది
క్షేత్రము (కారణము) అగుచున్నది.


అహంకారమ౦టే ఏమిటో  తెలియకపోవుట వలన మనలో 
అహంకారము పనిచేస్తుంది. అది మనలో  మనమేయన్న భావముగా 
పనిచేస్తుంది. తానువేరు, అహంకారము వేరు అని తెలియనంతవరకు 
అహంకారము మనలో పనిచేస్తూ ఉంటుంది. అలాగే 
రాగద్వేషములు, ఆసక్తి మొదలైనవి. వీటిని పరిహరించాలంటే 
అవి మనయందు ఎలా పనిచేస్తున్నాయో  తెలియాలి. 
అది తెలియనంతవరకు వాటి ప్రభావము కొనసాగుతూఉంటుంది. 
ఒక సామాన్యుడు ఒక యంత్రాగారములో ప్రవేశించి అందులోని 
యంత్రములను గాని వస్తువులనుగాని కదిలిస్తే దానివలన
వానికి ప్రమాదము కలుగవచ్చును. వాటిని ఎలా  ఉపయోగించాలో 
వానికి తెలియకపోవుటయే దీనికి కారణము.  అలాంటి 
మానవుడు తనజీవితమును కూడ పరిష్కరింపరాని సమస్యగా
మార్చుకొ౦టున్నాడు.

రాగద్వేషములు, ఆసక్తి, అహంకారము మొదలైనవి వేరు
వేరు స్టితులలో పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మానవుడు
మిక్కిలి మంచివాడుగ పరిగణింపబడవచ్చును.  దీనికి కారణము
వాని లోని రాగద్వేషములు నిద్రించడమే. లేక తాత్కాలికముగా 
వ్యక్తమగుటకు అవకాశము లేకపోవుట వలన  క్షీణింపవచ్చును.
ఒక మిక్కిలి కోపిష్టి యైనవాడు ఒక పెద్ద ఆఫీసరు వద్ద అతి
సామాన్య సేవకుడిగా పని చేయుచున్నచో, వానికి యున్న కోపము
బయటకు  చూపుటకు అవకాశము లేదు కదా! అలాగే  వానికి
ఇంటిలో మిగిలిన పరిస్థతులుగూడ అలాగే ఉంటే వాని 
కోపము వానియందే క్షీణించి యుంటుంది. అట్టివాడు మిక్కిలి
వినయవంతుడిగా చలామణీ అవుతాడు. ఒక్కొక్కసారి ఇలాంటి లక్షణములు 
ముక్కలు ముక్కలుగా నుండవచ్చును. అంటే వేరు
వేరు అభిలాషలరూపమున, భావనారూపమున చెదిరిపోయి
యుండవచ్చును. అలాగే యిష్టము లేక రాగము అనునది దేశభక్తి,
కులాభిమానము, మతాభిమానము, గురుభక్తి, తన తోటి శిష్యులపై 
అభిమానము  అనేవిగా యుండవచ్చును. అట్లే ద్వేషము
శత్రువులను ద్వేషించుట, యితరకులములను ద్వేషించుట, యితర
గురువులయెడల మతసంప్రదాయములతోను సరిపడకుండుట 
అనునవిగ యుండవచ్చును. అలాంటి వారు తమ గురువు లేక మతము ఇతర
వాటికన్నా ఎక్కువని ఋజువు పరచడానికి  ప్రయత్నిస్తారు.
కొందరు తమ దైవముపై నమ్మకములేని వారు పాపులని,
వారు నరకములకు పోవుదురని బోధిస్తారు. ఇట్లు ద్వేషము
రకరకముల రూపములలో మానవుని యందే ఉంటుంది. ఆసక్తి
అనేది ఒక శాస్త్రమునకు, లేక కళకు లేక వేదాంతమునకు
చెందియుండుట అను రూపమున నుంటుంది. అలాగే ఒక ప్రత్యేక
విషయముయందు అ౦టే పఠనమునందాసక్తి కూడ అలాంటిదే. ఇట్టి
వాని యందు తాను కృషి చేయలేనప్పుడు దుఃఖము మొదలైనవి
కలుగును. అలాగే మరికొన్ని లక్షణములు ప్రేరణ కలిగించును. అవి
ఒక్కొక్కసారి మిక్కిలి తీవ్రరూపము దాల్చవచ్చును. అహంకారము 
పెరిగినచో తన శత్రువును చంపుట, లేక తన క్రింద వానిని 
పరాభవించుట, భార్యా పిల్లలను హింసించుట మొదలైన 
రూపమున యుండవచ్చును. అలాగే వ్యామోహము మిక్కిలి తీవ్ర 
మైనచో దొంగతనము చేయుట, వ్యభిచారములు, ఇంకొకడి 
భార్యతో  లేచిపోవుట, మొదలైనవి సంభవించును. ద్వేషము,
అయిష్టత ఎక్కువైనచో రాజైన వాడికి యుద్దము ప్రకటంచుట,
పట్టణములు నాశనము చేయుట, దేవాలయములు, విగ్రహములు
నాశనము చేయుట మొదలైనవి సంభవించును. దురభిమానము
పెచ్చుపెరిగినచో తన మతములోనికి చేరని వారిని చంపుట,
తగులపెట్టుట చేయును. అలాగే పవిత్రమయిన మత గ్రంధములు
మొదలైన వాటిని నాశనము చేయును. ఇవన్నీ మనోమయకోశములో 
వివిధ స్టితులలో ఏర్పడిన క్షేశములు. అజ్ఞానము వలన
ఇవి విజృంభించును.

5

అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా

అనిత్యా = అశాశ్వతమయిన
అశుచి = మలినము
దుఃఖ = విచారము
అనాత్మసు = ఆత్మయందు లేనట్టి
	(ఆత్మకానిదాని యందున్నట్టి)
నిత్య = శాశ్వత మైనట్టి 
శుచి= స్వచ్ఛత 
సుఖ=సుఖము 
ఆత్మఖ్యాతిః = ఆత్మనంగీకరించినట్టి 
అవిద్యా =  తెలుసుకొను విధానము తెలియునట్టి 


  అనిత్యము, అశుచి, దుఃఖము, అనాత్మ అను వాటి 
యందు క్రమముగా నిత్యము, శుచి, సుఖము, ఆత్మానుభూతిగా 
(భాంతిపడుట అవిద్య.

  

ప్రతివారు శాశ్వత మైనదేదో, అట్లే అశాశ్వతమైనది 
మరియు, మారునది, మారనిది మొదలైన ద్వంద్వముల భేదము
తెలుసుకోవాలి. ఒక ధనికుడు తన గ్రామమునకు కారులో పోవు
చున్నప్పుడు కారు ప్రయాణము మిక్కిలి సుఖకరమనిపించును. కాని
అతడు అసౌఖ్యము తన సంపదననుసరించి ఏర్పడినదని మరువ
రాదు. అంతేగాక కారుకన్నా ప్రయాణము ముఖ్యమని తెలియవలెను. 
అలా కానిచో కారు చెడిపోయినచో, ప్రయాణముండదు.
తనవారికెవరి కైననూ అస్వస్థతగాను౦టే, కారులేదని ప్రయాణ
మాపుకోలేడు కదా! అప్పుడు జీవితమున వానికి మొదటిసారిగా 
కారుకన్నా ప్రయాణము ముఖ్యమని తెలుస్తుంది. అంటే
ప్రయాణము కొరకు కారుగాని, కారు కొరకు ప్రయాణము కాదని 
తెలుస్తుంది. అట్లే పరీక్షపోయినదని ఆత్మహత్య చేసుకొనువాడు
మూర్ఖుడు. ఎందుచేతన౦టే పరీక్ష తనకొరకుగాని పరీక్షకొరకు
తాను కాదని తెలియదు. అట్లే ఒక యువకుడు చక్కగా పాడ
గలిగిన ఒక స్త్రీని వివాహము చేసికొ౦టే, అతడు వివాహము
చేసుకొన్నది ఒక స్త్రీని గాని పాటను కాదని మరచిపోరాదు.
పాట వలన ఆమె యందు అతనికాకర్షణ కలిగినా నిజమైన
ఆకర్షణ ఆమెయే. ఆమెనుండి పాటపుడుతున్నాదికాని, పాటనుంచి 
 ఆమె పుట్టుటలేదు. ఇది జ్ఞాపకముండనిచో, ఆమె కంఠ
స్వరము పాడైతే, అతడు దుఃఖింపవలసి యుండును. ఒక
విద్యావేత్త మిక్కిలి జబ్బుగానున్న తన భార్యను చూచుటకు,
ఆకాశయానము చేయుటకు నిరాకరించెను. అతడు విమానయానము 
కన్నా రైలు ప్రయాణము క్షేమకరమని విశ్వసిస్తున్నాడుకాబోలు!
రైలు ప్రమాదము వలన సంభవించు మరణమునకు, విమాన
ప్రమాదము వలన సంభవించు మరణమునకు భేదమేమిటి? బహశా
అకాశములో మరణము కన్నా భూమిపై మరణము క్షేమకరమని
అతడు నమ్మియుండవచ్చు! ఇలాంటి  అభిప్రాయములన్నీ, నిజమైన 
దానిని తెలుసుకొను విధానము తెలియకపోవుటచేతనే.

ఒక్కొక్కసారి తల్లితండ్రులు తమ పిల్లల సంతోషము
కొరకు, యితరులను  పరాభవిస్తారు. గుడ్డివాడయిన ధృతరాష్ట్రుడు 
తన పిల్లల వైభవము కొరకు, తన సోదరుని పిల్లల
రాజ్యము అపహరించుటకు ప్రయత్నించేడు. అలా చేయడంవలన
అతడు తన పిల్లలనే పోగొట్టుకొన్నాడు. ఇదే అజ్ఞానము.

మలినమును నిర్మలముగా చూసేవాడికి  జీవితములో  తీవ్ర 
సమన్య లేర్పడతాయి. ఇంకొకని భార్యను ప్రేమించుట మలినమనకు
పరాకాష్ట. అతడు ఆమె నిర్మలమయినది, అమాయక మైనది
అని, అట్టి స్వచ్చమయిన హృదయమును (పేమించుటవలన
తానుకూడా నిర్మలమయినవాడినే యని అనుకొనవచ్చును. దీని
వలన అతని జీవితములో తీవ్రమయిను పరిణామములేర్పడి, యిక
వెనుకకు వచ్చుటకు వీలులేని పరిస్థితి ఏర్పడవచ్చును. ఒక్కొక్కసారి 
దుఃఖమే సంతోషముగా భ్రాంతి కొలుపవచ్చును. తన
పిల్లవాడిని పై చదువులకు పంపుట దుఃఖకారణమని ఒకని కనిపించవచ్చును.
దీని వలన (పంపకపోవుటవలన) తానును, తన
కుమారుడును కొంతకాలము తరువాత దుఃఖపడవలసి యుండును.
అతడు దానిని (పంపకపోవుటను) సంతోషకరమైన విషయముగా
భావించును. 

కారు పాడైతే  దాని యజమానికి మనస్సు, శరీరము
రెండును బాధపడవచ్చును. బాధపడి వ్యాధిగ్రస్తముకావచ్చును.
కాని కారు కన్నా తాను, తన శరీరము, ఎక్కువ విలువైనవని 
తెలియక పోవుటచేత ఇట్లు జరుగును.

మరి కొందరు, ఆఫీసు వస్తువులను తమస్వంత ఉపయోగము 
కొరకు దొంగిలిస్తారు. అలాంటివారు ఆఫీసువలననే తమకు
జీవనోపాధి యున్నదని మరచిపోతారు. ఒక దేశములో 
ప్రజలు వర్గములుగా, పార్టీలుగా నేర్పడి ఒకరినొకరు ద్వేషించు
కొంటారు. అలాంటివారు తమ వర్గము కన్నా జాతి ముఖ్యమైనదని
అర్థము చేసుకొనకపోవడంవలన ఇలాంటివి జరుగుతాయి. కొందరు తాము
ముసలివారమని, రోగగ్రస్తులమని దుఃఖపడతారు. వారికి
తమ శరీరమే తామని భ్రాంతిపడుటవలన అట్లు జరుగుతుంది. ఇది
అంతా అజ్ఞానము వలననే. అంటే నిజమైన దానిని తెలుసుకొను 
విధానము తెలియక పోవుటచేతనే. ఇదియే అవిద్య. అవిద్య
వలన దుఃఖము కలుగును.

Tuesday, August 29, 2023

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 30)

upanishad

నాల్గవ ప్రకరణము

30

వ్యధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాన్తి దర్శనాలబ్ధ
భూమికత్వా నవస్థితత్వాని చిత్త విక్షేపాస్తే అన్తరాయాః.

వ్యాధి = వ్యాధి
స్త్యాన = నిరాకరణ
సంశయ = సందేహము
ప్రమాద = పొరవాటు
ఆలస్య = సోమరితనము
అవిరతి = లోలత్వము
భ్రాంతిదర్శన = లేనిది వున్నట్టు చూచుట
ఆలబ్ధభూమికత్వ  = పట్టుదొరక కుండుట 
అనవస్థితత్వాని = స్టిరత్వము లేకుండుట
చిత్త విక్షేపాః = చిత్తచాంచల్యము
తే = అవి
అంతరాయాః  = అంతరాయములు


 
అంతరాయములు దేహగతమైన మనస్సు యొక్క 
చాంచల్యములు, అవి వ్యాధి, నిరాకరణ, సందేహము, పొరపాటు,
సోమరితనము, విషయలోలత్వము, భ్రాంతి, పట్టులేకుండుట.
దీక్ష లేకుండుట మొదలైనవిగా తెలియబడును. 

  



యోగసాధనకు అంతరాయములు సహజములు. 
దేహగత మైన మనస్సు  అనేక శక్తులు లేక ప్రజ్ఞల యొక్క సామ్యము.
ఈ సామ్యమునకు ఒక్కొక్కసొరి మనస్సునందలి వ్యతిరేక శక్తులు,
అంతరాయము  కలిగించుచుండును. అవి:

1) వ్యాధి

వ్యాధి అంటే వ్యధ పుట్టించునది. వ్యధ అంటే  బాధ. 
బాధ మనస్సుకే గాని శరీరమునకుగాదు. కనుక వ్యాధి కారణ 
ములు మనస్సునుండి పుట్టి శరీరములో పనిచేయును. 
వ్యాధి కారణమును తొలగింపనిదే, వ్యాధి తాత్కాలిక నివృత్తి 
చె౦దవచ్చును గాని నిర్మూలనముగాదు. మరియు నిత్యజీవితము 
నకు చెందిన దినచర్యయందలి క్రమము చెడినచో శరీరమునందు
వ్యాధి పుట్టును. అనగా స్వయంకృషి, లేక వ్యాయామము, ఆాహా 
రము, విశ్రాంతి, నిద్ర మున్నగువానియందు క్రమము చెడిననో
వ్యాధి పుట్టును. వ్యాధిగ్రస్తమైన శరీరమునందు యోగసాధన
సులభము కాదు.

2)నిరాకరణ

మనస్సు అలవాట్లకు లోబడి ఉంటుంది. అందుచేత తనకు 
నచ్చనివి ద్వేషించుట జరుగుతుంది. అ౦టే  వాటియందు
ఉదాసీనత్వము, ద్వేషించుట అను లక్షణాలు  చూపుతుంది. నిత్య 
జీవితములో మన పరిసరములలో అనేక వస్తువులు, విషయములు, 
వ్యక్తులు తారసపడవచ్చును. వాటియందు మనస్సుకు 
ప్రత్యేక ప్రభావము లేదు. కాని కొందరిని, కొన్ని వస్తువులను లేక
విషయములను చూస్తే మనస్సకు ద్వేషము కలుగుతుంది. 
అంటే  తనకక్కరలేని  విషయములు వేరు, అయిష్టత లేక 
ద్వేషమును  చూపేవి  వేరు. అక్కరలేనివి ఉండవచ్చును గాని 
అట్టి కొన్నిటి మీద  తాను ద్వేషము వేరుగా చూపనక్కరలేదు.
ద్వేషించుట అను లక్షణము వలన చిత్త  విక్షేపము లేక 
చాంచల్యము కలిగి మనస్సులో ద్వంద్వములు సృష్టింప 
బడతాయి. అక్కరలేనివి, కావలసినవి అనేవి మాత్రము
జంతువులకు, మానవులకు సహజము. కాని ఇష్టము లేకుండుట
ద్వేషించుట అను లక్షణాలు మానవుడు వేరుగా చూపును.
ఉదాహరణకు జంతువులు ఆకలి వేస్తే గడ్డితి౦టాయి. ఆకలిలేకపోతే 
తినవు. అంతేకాని ఇక వేరుగా అయిష్టత మొదలైనవినవి లేవు.
మానవుడు ఆకలి వేస్తున్నా  కొందరి వద్దనుండి ఆహారము
స్వీకరించడం, కొందరి వద్ద స్వీకరింపకుండుట౦ చేయును. అ౦టే 
ఇక్కడ అక్కరలేకపోవుటగాక, యిష్టము లేకుండుట కారణము.
ఇదియే స్త్యానము అని చెప్పబడినది. ఎమర్సన్‌ అను
మహాశయుడు "ఈ ప్రపంచము నందు చెడుగా ప్రవర్తించుటయే
తప్ప చెడ్డవారనువారు వేరుగా లేరని" చెప్పెను. కనుక ఇష్టత,
అయిష్టత అను రెండునూ యోగసాధనకు ప్రతిబంధకములు. ఈ
ప్రపంచమునందేదైననూ మనకక్కరలేకపోవచ్చునుగాని, అయిష్టము
కారాదు.

3) సంశయము 

స౦శయమనగా అక్కరలేనివి ఆలోచించుట. మనకు కావసినవి
మరియూ చేయవలసనివి జ్జప్తి యు౦టే సందేహములకు,
సంశయములకు, తావుండదు. ఒక వన్తువు కావలెనా, వద్దా అనే 
సందేహము వచ్చినప్పుడు, దానిని ప్రక్కకు పెట్టి నిశ్చయముగా 
కావలసినవి సంపాదించుట లేక అట్టి పనులే చేయుట 
చెయ్యాలి. సందేహించినవాటిని గూర్చి సంశయము 
తీరిపోయిన వెనుక అవి నిస్స౦శయముగా 
కావలెనని తేలిన పిదప, స్వీకరింపవచ్చును. 
అంతేగాని వాటిని గూర్చి ఆలోచనలతో సమయము వృధా 
చేసికోరాదు. ఎంతసేపు ఆలోచించిననూ చేయుటయో, 
చేయకుండుటయో అను రెండింటిలో నొక్కటియే జరుగుతుంది. 
గానీ రెండూ జరుగవు కదా!

4)  పొరపాటు

ఆలోచనలోగాని, కర్తవ్యములోగాని పొరపాట్లు జరుగుటకు 
కారణము, అట్టిపనులు కావలసిన సమయముకన్నా ముందేచేయడం. 
నీవు రైలు దిగగానే  కలసికొనవలసిన వ్యక్తి కొరకు నీవే హడావుడిగా 
ప్లాట్‌ఫారము బయటకు, లోపలకు పరుగులెత్తితే 
ఆ వ్యక్తి కూడా నీకోసమే వెదకుతూఉంటాడు. కనుక ఇద్దరూ
తిరుగుచుండు వలన ఒకరికొకరు కలియకపోవచ్చును. అదే నీవు 
రైలుదిగగానే ప్లాట్‌ ఫారముపై ఒకచోటనే కొంచెము సేపు 
వేచియు౦టే నీకు కావలసిన వ్యక్తి నీ దగ్గరకే వస్తాడు. కాబట్టి 
తొందరపడకుండుట, చేయవలసిన పనులు చేయవలసిన సమయ
మునకు ముందుగానే యత్నించుట, మొదలైన వాటి వలన పొరపాట్లు
జరుగుతాయి.

5) సోమరితనము

అనగా పైదానికి వ్యతిరేక స్వభావము. చేయవలసిన
పనిని చేయవలసిన సమయమునకు చేయకుండుట. రై లురావలసిన
సమయముకన్నా ముందుగా రైలు స్టేషనుకు వెళితే  మనమెవరిని
కలసుకొనుటకు పోవుచున్నామో ఆ వ్యక్తిని మనము 
కలవలేకపోవచ్చును. కనుక సక్రమమైన సమయమునకు 
సక్రమముగా పనులు నిర్వర్తించుట ఆవశ్యకము.


6) విషయలోలత

విషయలోలత అంటే అలవాట్లను కొనసాగించుట. ఇవి 
పోవలెనన్నచో పాత అలవాట్లు మార్చుకొని, కొత్త అలవాట్లను
చేసుకోవాలి. ఇదే యోగమార్గము. అ౦టే ముందుగా పాత
అలవాట్లను మానిన తరువాత కొత్త అలవాట్లను చేసికోవాలంటే 
అది సాధ్యముకాదు. ముందు మంచివనులు చేయుడం 
అలవాటు చేసుకొ౦టే క్రమేణా పాత అలవాట్లు వాటంతట 
అవే ఆగిపోవును. నిరంతరము పేకాట ఆడి ధనము వృధా
చేనుకొనేవానికి ఏదైనా ఒక ఉత్సవ నిర్వహణము లేక దేవాలయ
నిర్మాణము వంటి వనులు అప్పచెవ్పవలెను. "నీ  వంటి వాడు
తప్ప ఇది నిర్వహింపగలిగిన సమర్దుడు లేడని" పొగడినచో వారు
పొంగిపోయి అంగీకరింతురు. అట్టవారి చేతికి ధనము వినియోగించుట
తప్ప, మిగిలిన పనులనొప్పజెప్పాలి. అవి నిర్వహించడంలో 
సమయము చాలక, పేకాట వంటివి మానివేయవలసివస్తుంది.
ఇలా రెండు, మూడుసార్లు జరిగిన తరువాత మిక్కిలి సుదీర్ఘమైన
పని అప్పచెప్తే  పేకాట పూర్తిగా మానివేయుదురు. ఇలాగ 
విషయలోలతను నిగ్రహించాలి.

7) భ్రాంతి లేక భ్రమ 

భ్రాంతి అనేది  మానసిక కక్ష్యలో జరుగే  పొరపాటు
వంటిది. మన మనన్సు, ఇంద్రియములు మొదలైనవి కూడా
శరీరమునకు పనిముట్టువంటి వేకాని, వాటియందు సహితము 
పరిపూర్ణతలేదు. తాడును చూసి  పామనుకొనినట్లే, పామును చూచి 
తాడనుకొనవచ్చును. కాని ఒక్కొక్కసారి ఇలాంటి భ్రాంతి వలన 
సృష్టి కొనసాగుతోంది.  భార్యను చూసినవుడు ఆమె తన భార్య 
యనునది భ్రాంతియైనప్పటికి అది యావశ్యకమే. అలా గాక 
ఆమె ఒక ఎముకల ప్రోగుగా, రక్త మాంసాదుల ముద్దగా జ్ఞాపకము౦టే ,
కాపురముచేయడానికి కెవడంగీకరిస్తుంది? భ్రాంతి కొన్ని చోట్ల 
ఆవశ్యకమే కాని, అది తగు మాత్రముగా నున్నపుడు దాని వలన 
సుఖము కలుగుతుంది.

8) పరిస్టితులపై  పట్టు  లేకుండుట

పరిస్థితుల పై పట్టులేకుండుట మరొక అవరోధము. 
ఇది సాధింపవలెన౦టే మొదట పరిస్టితులను, ఫలిత
ములను విస్మరించి నీవేమి చెయ్యాలో? ఎప్పుడు చెయ్యాలో?
అ పనులేవో? నీకై నీవు నిర్ణయించుకోవాలి. అప్పుడు పరిస్టితులు
నీపై ప్రభావము చూపుటమాని నీవు పరిస్టితులకు సంబంధము
లేకుండ నీ కర్తవ్యమును నిర్వహింపగలవు. ఇటువంటి  దృక్పధము
వలన నీకు తెలియకుండానే  పరిసరముల పై నీకు పట్టు చిక్కుతుంది.  
ఉదాహరణకు ఒకడు తన పిల్లవానిని చక్కటి ఉన్నత విద్యల
నభ్యసింపజేసెననుకొనుము. వానికి తన పిల్లవాడు కలక్టరు వంటి గొప్ప
ఉద్యోగస్తుడై తనని బాగుగా చూచుకొనును అని అనుకున్నచో అది తప్పు. 
అతడు పెద్దవాడై న తర్వాత తన్ను నిరాదరింప వచ్చును. లేదా
ఇతర దేశములకు పోయి అక్కడే ఉండిపోవచ్చును. అప్పుడు
తాను దుఃఖించవలసి యుండును. అనగా పరిస్టితుల పై తనకు
పట్టులేకుండుటయగును. అలాగాక వానిని చక్కగా చదివించుట
తన కర్తవ్యముగా మాత్రమే గుర్తించి చదివించినచో తరువాత 
పిల్లవాడు తనను గౌరవించినను, నిరాదరించినను దూరదేశ 
ములకు వలసపోయినను తనకొక్కటే. అట్టివానికి ఎల్లపుడు
పరిస్థితుల పై పట్టువిడిపోదు.

9) పనులయందు స్థిరత లేకుండుట

పనులయందు స్టిరత లేకుండుట అనేది  అనేక పనులను 
ఒకేసారి సంకల్పించినప్పుడు వచ్చు స్టితి. ఒక పథకము ఎంత 
గొప్పదైనా ఆచరింపకపోతే అది అబద్దమే. అ౦టే చేస్తే 
మాత్రమే సత్యమవుతుంది గాని లేనిచో అసత్యమే. తాను చేయబోవు 
వంటను ఎంత వర్ణించినా, చేయనంతవరకూ అది అసత్యమే 
కదా! కాబట్టి నువ్వు సంకల్పించిన పనులలో ఏది సుకరముగా 
ఉంటుందో దాన్ని ముందు ప్రారంభించు. శ్రద్ధగా నిర్వహిస్తే 
ఆ పని సత్యమవుతుంది. అంటే దాని ప్రయోజనము నెరవేరుతుంది. 
మిగిలిన పనులు ఆవశ్యకతను బట్టి చేయడమో చెయ్యకపోవడమో 
జరుగుతుంది.  మొదట ఒక పనిని శ్రద్ధగా నిర్వహిస్తే,
మిగిలిన పనులకు కూడ అనుకూలత ఏర్పడి సమయానుకూలంగా 
ఒకదాని వెంట మరొకటి పూర్తి అవుతాయి. 

Tuesday, August 22, 2023

Patanjali Yoga By Pidooru Jaganmohan Rao

upanishad

There are many books in many languages about Sage Patanjali's yoga sutras. So what is new? The main reason I have embarked on this is there is a little known book by Sri Pidooru Jaganmohan Rao titled "పతంజలి యోగ సూత్రములు" that was last published in the 90's and apparently went out of print. Compared to Swami Vivekananda's book, this one is easy to read and doesn't require prior knowledge of Sankhya. Still the book was written in "అచ్చ తెలుగు". So some translation effort is put in to rewrite in contemporary telugu.

పతంజలి యోగ సూత్రములు Part 1 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 2 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 3 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 4 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 5 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 6 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 7 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 8 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 9 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 10 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 11 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 12 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 13 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 14 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 15 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 16 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 17 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 18 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 19 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 20 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 21 (Telugu)
పతంజలి యోగ సూత్రములు Part 22 (Telugu)

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...